http://maruvam.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
అక్షరచిత్రం, పదనృత్యం, అంతశ్చైతన్యం
Updated: 33 min 29 sec ago

నా బ్లాగుని చదివే అందరికీ - వీడ్కోలిక

Wed, 07/14/2010 - 22:57
కారణాలు ఏవైనా ఇక నేను రాయలేను అన్న ఆశక్తత నన్ను కమ్మేసింది. ఈ వనాన ఋతువులో, కాలాలో గడిచిపోయాయి. శీతవేళ వచ్చేసిందిక. శిశిరమెంత కాలం కొలువౌతుందో తెలియదు. "రాయగలను" అని మభ్యపెట్టుకోలేను. "రాయను" అని ఆన పెట్టుకోలేను. మరి మిగిలింది ఏమిటన్నది కాలానికి వదిలేస్తున్నాను. నా స్ఫూర్తి, మూర్తి మట్టుకు నన్ను వీడిపోయాయి. అది సత్యం.

నా రాతలకి చదువరుల స్పందనలు, ప్రతిస్పందనలు, ఇతర బ్లాగులు అన్నీ నా ఎదుగుదలకి దోహదం చేసాయి. సాహిత్యం పట్ల దాహాన్ని పెంచాయి. రచనా/పఠనా వ్యాసాంగాల విలువని విశ్వసనీయంగా తెలిపాయి. సాధన వీడను. అది మాత్రం నిస్సందేహం.

ఈ విషయకంగా నేను బ్లాగ్ప్రపంచానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే తెలిసో తెలియకో ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమార్పణలు కూడా! ఆత్మీయులందరినీ కోల్పోతున్నాను. ప్రియాతిప్రియమైన నా మరువాన్నీ విడనాడుతున్నాను. ముందే తెలుస్తున్న వేదన. అయినా వెళ్లాలి.

ప్రకృతి - సమస్త చైతన్యానికి మూలం. చలం 'పురూరవ' లో అన్నట్లు “అద్భుతమూ, అతీతమూ అయిన విషయాలను చూస్తూ కూడా సాధారణత్వం కింద సమర్థించుకునే అల్పస్థితి ఈ లోక దురదృష్టం. అట్లానే కాకపోతే సూర్యోదయమనే పరమద్భుతాన్ని ప్రతినిత్యమూ చూస్తూ నిర్జీవంగా బ్రతుకుతూ ఉండగలరా?” - నేను ఉండలేను. అలాగే నిట్టనిలువునా నరికేసినా, చివురేసి పూవు పూచి పలుకరించే ఈ చెట్టు ఎంతో స్ఫూర్తినిస్తున్నట్లుగా, ఓదార్పునిస్తున్నట్లుగా తోస్తుంది. జీవంలేని జీవితమక్కర్లేని నిర్జీవమైన ఒంటరిగా ముగిసిపోవాలని మాత్రం లేదు నాకు. నిజానికి ప్రకృతిని గమనిస్తూ జీవమున్న జీవితాన్ని గడపటమే మునుపటి నా ప్రపంచం. తిరిగి అటుగానే ఈ పయనం.


సెలవిక మిత్రుల్లారా.
ఇక కనుమరుగైపోతున్నావా! * ఆ పై చిత్రం ఏమిటీ ఎందుకు కలిపాను అన్నది క్రిందన వ్యాఖ్యలో వ్రాసాను.


మీ "మరువం" ఉష.
Categories: Right

విమోచన

Tue, 07/13/2010 - 00:08
From collections at GALLERIA SOTTIL - Dolphin Resort, Disney World [ఈ చిత్రం నేను అక్కడ విహారయాత్రలో నా కామెరాతొ తీసినది]
కల చందమామగా
విచ్చుకుంది...
కలల మధ్య
కుప్పకూలిన
వంతెనలా వాస్తవం

కలలేని నిదుర కలవరపడింది
కలలేపిన కన్ను కలతపడింది
కలచెదిరిన చీకటిలో భళ్ళున తెల్లారింది
కలలెరుగని లోకం ఎదుట నిలిచింది

ఎన్ని కలల్లో వెదికినా దొరకని రూపు
కంటిపాపలో కన్ను గీటింది
లెక్కకందని ఊహలు రెక్కలొచ్చిఎగిరాయి
కలలబందీకి కడకి విడుదల దొరికింది

* * * * * * * * * * * * * *
ఒక విధంగా కలలోంచి వాస్తవంలోకి వచ్చిన భావన అయిన కలకాలం కవితకి ఇది మరొక వైపు కావచ్చు.
Categories: Right

క్షణ క్షణ భంగురముల్ జతగాండ్ర చిత్తంబుల్

Sun, 07/11/2010 - 01:26

తప్పదు, వినాల్సిరాక తప్పదు. వినినంతనే వేగిర పడక "సమయానికి తగు మాటలాడెనే" అన్న నియమానుసారం, ఒకటికి రెండు కలపాలి అన్న సూక్తిననుసరించీ, మనమూ జోడించక తప్పదు. ఇది తధ్యం!!!!

ఏమి వినెదమూ అంటే..తరుచుగా ఈ మూడు..[మూడ్ స్వింగ్స్ వాళ్ళకే ఎక్కువ] మురిపాలు, కసుర్లూ, విసుర్లూ.. కాక మరేమిటి?

  1. చంద్రముఖి
  2. సూర్యముఖి
  3. జ్వాలాముఖి

వినీవిననట్లు కాక, "అకటా.." అనీ కాక మనం కలపాల్సిన ఆరు [మూడు ముక్కలు - ఆరు చెక్కలు అవ్వాలి గుర్తుందిగా?]

  1. చంద్రహాస్/చంద్రవర్ణా
  2. సూర్యప్రకాష్/విక్రమాదిత్యా
  3. జ్వలితమోహన్/జమదగ్ని

కాకపోతే కాస్త చిన్నప్పటి లెక్కలు/ఎక్కాలు/శాస్త్రాలు కాస్త బుర్రలోనే దులిపి పునరావలోకనం కానివ్వండి.

+,+ = +
-, - = +
-,+ = -
+,- = -

అన్న ప్రాధమిక సూత్రం మాత్రం మరవకండి లలనామణులారా! సరసం విరసం కాకూడదు, కర్ర విరగకూడదు. అది మరవకండి. సరసోక్తులు తెలిసినవారికి కరతలామలకమేగా! తమరికి వివరము తెలుపను ఇక ఏమి ఆవశ్యకత...ఏదో మా తృప్తికి ఇలా ఓ మారు పైకి అనటం తప్పా..
Categories: Right

ఎంతెంత దూరం

Thu, 07/08/2010 - 08:07

ఏటి గట్టున పచ్చిక చివురికీ,
గూడు కట్టనున్న గువ్వకీ
ఏ మాత్రమేం ఆ దూరం?
ఎడదలో తడారనంతవరకు
ఆశల పందిరులు వేవేలు.
గిజిగాడి గూటి నేత ఆపతరమా?

ఇంద్ర ధనుస్సుల సమూహానికీ,
నడుమ దారి తప్పిన క్షణానికీ,
ఎంతేమిటి ఎడబాటు?
మనసులో మనిషున్నంతవరకు
కలల రంగవల్లులు కోటానుకోట్లు.
జవరాలి గాజుల సవ్వడి మోహనరాగమే!

* * * * * * * * * * * * * * * * *

గిజిగాడు ఇదిగో ఇక్కడ, మా బాబాయ్ [వంటి] నూతక్కివారు పట్టేసారుగా..

ఈమాట వారికి కృతజ్ఞతలతో, అనేక రకాల అనుభూతులను వినిపించగల మోహనరాగం గూర్చి ఇక్కడ.

కలలుకనే కళ్ళెవరవని అడిగితే మీకు నాగురించి ఏమీ తెలియనట్లే..

చిన్నప్పటి ఆటలలో ఓ చిన్ని ఆట - ఇద్దరు ఆడతారు. ముందువాళ్ళు ఇసుక నింపి, పుల్ల గుచ్చి, వెనకనున్న వాళ్ళు కళ్ళుమూసి నడిపిస్తూ సాగేది. "ఎంతెంత దూరం?" అంటూ ముందు వెళ్తున్న చిన్నారి అంటుంటే వెనుక వస్తున్న గడసరి "చాలా చాలా దూరం" అని అలా ఇలా తికమకగా తిప్పి ఓ చోట ఆ ఇసుక పారబోయించి రావటం..ఈసారి కళ్ళు విప్పుకున్న ఆ చిన్నారి, ఆ స్థలం వెదికి పట్టుకోవటం..

ఒక అనుబంధాన చిక్కిన మనసులు ఆశలతో ఎన్ని దూరాలు వెళ్ళివస్తాయో, ఎన్ని తావులు వెదికి దాచిన కలలు పట్టుకుంటాయో అని - ఈ చిన్ని కైత
Categories: Right

అభ్యర్థన: బ్లాగర్ వ్యాఖ్యల ఇబ్బంది!

Tue, 07/06/2010 - 10:35
నా బ్లాగు మిత్రులు/చదువరులకు,

నిన్న రాత్రి నుంచి నా పోస్ట్ ఈ దేశం నాకేమిచ్చింది? నేను ఈ దేశానికేమిచ్చాను?కి వచ్చిన రెండు వ్యాఖ్యలు నేను అప్రూవ్ చేసాక కనిపిమ్చకుండా పోయాయి. అలాగే, నేను ఇతరులకి రాసినవి కూడా కొన్ని నాకు ఇపుడు కనపడలేదు. కాస్త వివరం అడిగితే, ఇది గూగుల్ వారి ఇబ్బంది అని తెలిసింది. వారి టూల్ లో సాంకేతిక లోపమిది.

కనుక, నా బ్లాగులో తమ వ్యాఖ్య కనపడని మిత్రులకు ఒ అభ్యర్థన - మీకు అంగీకారమైతే మళ్ళీ రాయండి [ప్రతి మాట విలువైనదే కనుకా, ఏదీ కోల్పోవటం నా అభిమతం కాదు కనుకా], ఇక నుంచి వచ్చే వ్యాఖ్యలు, ఇష్యూ ఫిక్స్, http://www.google.com/support/forum/p/blogger/thread?tid=3dcb02c83302034f&hl=en అయినాకనే అప్రూవ్ చేస్తాను.

నా వలన కాకపోయినా, ఈ ఇబ్బంది కారణంగా "నా వ్యాఖ్య ఏది? ఈమె రిజెక్ట్ చేసిమ్దా?' అని మీరు తర్జన భర్జన పడకుండా ఈ సమాచారం.

మిత్రురాలు,
"మరువం" ఉష.
Categories: Right

ఈ దేశం నాకేమిచ్చింది? నేను ఈ దేశానికేమిచ్చాను?

Sun, 07/04/2010 - 02:36



ప్రవాసదేశం లేదూ నా కర్మభూమి, నేను మెట్టిన స్థానం ఎన్ని రకాలుగా పిలిచినా ఈ అమెరికానే, నా మనుగడకి మార్గాన్నిచ్చిన ఈ గడ్డనే. ఈ దేశం నాకేమిచ్చింది? అన్న ఆలోచన నిత్యం ద్వైదీ భావాల్లో ముంచి తేలుస్తుంది. సుఖమా? సౌఖ్యమా? భయమా? దిగులా? ఇక్కడి వార్తలో, సమకాలీన సమస్యలో ఎత్తి రాయటం కాదు నా అభిమతం, ఇదీ ఓ స్వగతమేనేమో!

అసలీ వేగవంతమైన జీవితాల్లో ఓ పరి ఆగి ఈ ప్రశ్న వేసుకుని సమాధానాల ఆప్షన్స్ బేరీజు వేసుకునే అవకాశముందా? నాకు తప్పా ఇంకెవరికైనా వారికి విసుగుదల కలగకుండా వేయగలనా? అలా అసహనం చూపేవారినీ, జీవితం పట్ల నిర్లక్ష్య వైఖరితోనో, బాధ్యతారహితంగానో నడిచేవారినో కాలర్ పట్టి నిలదీయగలనా..డైగ్రెస్ అయ్యాను...మళ్ళీ అసలు మాట లోకి వెళ్తూ..

ఈ దేశం నాకేమిచ్చింది? అయినా అలాగే ఎందుకు వేసుకోవాలి ప్రశ్న. నేను ఈ దేశానికి ఏమిచ్చాను? అని ఎందుకు కాకూడదు. సరే మొదటిది ఎత్తుకుందాం.

దైనందిన జీవితంలో సౌఖ్యాన్ని, స్వేఛ్ఛావాయువుల ఊపిరిని ఇచ్చింది. ఉద్యోగాల్లోని తీరు ఆధారంగా భావి పట్ల అభద్రత చవి చూపింది. I am not loyal to you, you are not loyal to me అన్న నిష్టూరాన్ని మోయమని మీద పడవేసింది. You didn't ask; I did not tell you అనే సత్యాన్ని కొన్నిసార్లు ప్రియభాషణంగా మరి కొన్నిసార్లు మాట కోసం తపించిపోయేలా చేసింది. అక్షర ప్రాతిపదికగా అమిరే అనుబంధాలని రుచి చూపి, మనసారా మనసు తలుపు తెరిచాక, అవి అందించి వెళ్ళిన వేదన కానుకలని లెక్కించుకొమ్మంది.

ప్రకృతి పరమైన ఋతువుల అందాన్ని హృద్యంగా మీదకి రువ్వుతుంది. వైవిధ్యభరిత వాతావరణాలు, ఆటలు పాటలు క్రీడలు అవకాశాలు ఆవలీలగా అందించి స్వర్గధామాలకు తీసుకుపోతుంది. ఆహార పద్దతులు, రుచుల సమ్మిళీతాల తారంగాలు కట్టిస్తుంది.

జీవిత కాలాల వృద్దాప్యపు దశని, అవసానదశలో బాధాకరక్షణాలనీ వార్తల్లో, వీధుల్లో చూపి బెదరగొట్టింది. మనుషుల్లో అంటురోగంలా పాకుతున్న యాంత్రికత్వాన్ని చూపి వణికేలా చేసింది. ధనవ్యామోహంలో బాంధవ్యాలు వీగిపోగలవని ఋజువు చేసింది. మనిషి మౌలికంగా ఒంటరని ఎక్కువగా గుర్తు చేసింది. స్వేఛ్ఛలోని పరిమితిని ఎత్తిచూపింది.

ఇన్ని మంచిచెడుల మధ్య ఇంకేదో ఇస్తూనే ఉంది, ఇంకా దాచిపెట్టినట్లు ఊరిస్తోంది. వద్దని కావాలనిపించే, కాదని కాకతప్పదనిపించే ఏదో..అవకాశాలా, ఆశాద్వారాలా. పొలిమేర దాటలేవని కవ్విస్తుంది. పిల్లల భావికి తెలియని భరోసా ఇస్తోంది. స్త్రీగా సామాజిక స్థాయిలో అసమానతని దరిచేరనీయక విశ్వాసంగా అడుగేసేలా చేసింది.

వదిలి వెళ్లగలనా? ఉండి ఇష్టపడగలనా? నా మూలాల విలువలు నా తర్వాతి తరానికి ఇవ్వగలనా? రోజురోజుకి వాళ్ళలో చొచ్చుకుపోతున్న ఈ సంస్కృతి ఏదో శాతానికి కుదించి, మాటల్లో, మాధ్యమాల్లో కనపడే నా సాంప్రదాయాన్ని వారిలో సాగుచేయగలనా? దేన్ని పరిరక్షించగలను? ఎన్ని పదిలపరచగలను? కాలానికి ఎక్కుపెట్టి వదిలిన ఈ బాణాలు వాటి గురి, లక్ష్యం అవే చూసుకుంటాయిలే అని నమ్మిక తో రేపులోకి ఎప్పటిలానే అడుగేస్తూ..

* * * * * * * * * * * * * * * * * * * * * * *

ఇక రెండో ప్రశ్న - ఈ దేశానికి నేను ఏమి ఇచ్చాను?

నా వృత్తిపర బాధ్యతగా నా మెదడుని, మేధని ఇస్తున్నాను. నిజాయితీగా నా సాంకేతిక నైపుణ్యాన్ని ధారబోస్తున్నాను.

విరాళాలు అడిగిన ఏ సంస్థకైనా తగు ఋజువు చూపితే నేను సహాయపడనిది లేదు.. స్కూల్స్, సంస్థలు [ప్రకృతి వైపరీత్యాలు, క్షతగాత్రులు, జీవనోపాధి, యుద్దసైనికుల నిధి ఇలా దాదాపుగా పదింటికి], ఇక్కడి నుంచి విదేశాల్లో సేవలు ఇచ్చే సంస్థలకీను [అవొక ఐదు లెక్క].

మన కుటుంబ విలువలు, సాంప్రదాయాలు జిజ్ఞాసతో అడిగే విదేశీయులకి అందిస్తాను. వీళ్ళలో మన పట్ల సదవగాహన రావాలని ప్రయత్నిస్తాను. దేశం నాది కాకపోయినా నాదన్న భావనతోనే ఇక్కడ ప్రశాంత వాతావరణానికి నా వంతు కృషి చేస్తాను. ఒక మనిషిగా నేను చేస్తున్నా ఇవి చాలా వరకు సమిష్టి కృషిలో భాగాలు. ఏదో ఒక ప్రయోజనానికి హేతువులూను. ఇది చాలదా? ఈ దేశానికి నేను ఇవ్వగలది ఇంకేముంది.


Every year as a donor I receive a compliment pack with my address stickers and a card from the Disabled American Veterans Association. Just sharing the poem, Forget-me-not, from this year's Memorial Day card observed "In honor of the soldiers who have given their lives for our country".

Forget-me-not
When you're lost in thought
As you make it through your day

Forget-me-not
I am one who fought
And was scarred along the way

Forget-me-not
For the freedom bought
With the lives one can't repay

Forget-me-not
When ever your child is taught
To remember yesterday

Forget-me-not
When the day is hot
And you bend your knees to pray

Forget-me-not
Yes, I heard the shot
But I did not run away

Forget-me-not
I'm a patriot
And I need your help today

***************************************
A part of reader in me longs for works like this, Ancient India's Contribution to Our World's Material (Temporal) Culture - http://hindutva.org/sudheer_birodkar/india_contribution/

After the 911 incident, when people are sending in messages..I quoted the below from this book.. I am not in to religion as a means to hate others. Later I found out that , This book is apparently used as a reference for History in High School.

"Here goes a Sloka (couplet) from the Atharva Veda (one of the 4 Vedas - treatises on knowledge from ancient India)
which embodies the true spirit of humanness expressed, not today, but four thousand years ago.


We are the birds of the same nest,
We may wear different skins,
We may speak different languages,
We may believe in different religions,
We may belong to different cultures,

Yet we share the same home - OUR EARTH.

Born on the same planet
Covered by the same skies
Gazing at the same stars
Breathing the same air
We must learn to happily progress together
Or miserably perish together,
For man can live individually,
But can survive only collectively"




దశాబ్ద సుమారు ఈ ప్రవాసంలో కొన్ని ఘట్టాలు/మైలురాళ్ళు:


2000



అమెరికా రావటానికి నిర్ణయం.. సిడ్నీలో సుమారు వంద కుటుంబాలతో పరిచయం. "ఎందుకు అమెరికాకి వెళుతున్నారు?" అన్న సన్నిహితుల ప్రశ్నకి, ముందుగా నవ్వు సమాధానం "వేచి చూడండి" అన్న మాకే స్పష్టత లేని, దానికి లేని బలాన్ని అద్దుతూ అప్పటికి తప్పుకున్నా ఇప్పటికీ అదే స్థితి. అసలు కన్నభూమి వదిలాక ఏ కర్మభూమి మేలు? మునుపటివారికి రెక్కాడాలి, మనకి మెదడు అరగాలి - అదీ సూత్రం.

2001


వచ్చి ఏడాదన్నా కాలేదు. ఇంకా నికరమైన పరిచయాలు లేవు. సెప్టెంబర్ పదకుండు ఘటన తర్వాత మూడో రోజుకి పిల్లాడి స్కూల్ నుంచి ఫోన్, కళ్ళు తిరిగి పడిపోయాడని. ఉరుకులు పరుగులు గా వెళితే, నీలో బిన్ లాడెన్ పోలికలున్నాయని వెనక నుంచి తల మీద ఇద్దరు పిల్లలు గట్టిగా మోదితే బిడ్డ అలా.. ప్చ్.. భయం గుప్పిట బతికినట్లు. తిరిగి వాడు వాలంటీర్ గా దెబ్బతిన్న కుటుంబాల సహాయార్థం విరాళాలు పోగేసి, లోకల్ హీరోస్ గుర్తింపు పొందినపుడు సంతృప్తి. పిన్న వయసులో కష్టసుఖాలు అవగాహనకి వస్తున్నాయిలే అని.

2002


ఆరోగ్యం, వ్యాయామం పట్ల నామకహా శ్రద్దలోకి జీవితం దిగబడిపోతున్నప్పుడు రెండు హిప్ బోన్స్ రీప్లేస్ అయినా శ్రద్దగా వర్కవుట్, నృత్య సాధన చేసే స్నేహితురాలు దొరకటం. ఆ ప్రభావాన తిరిగి కళాశాల నాటి వైభవం జీవితంలో తొంగి చూడటం. అలా అలా మారథాన్ పరుగులు, శాస్త్రీయ నృత్య ప్రదర్శన జీవితంలో సంభవించటం.

2003


"ఇల్లు కట్టి చూడు" అనుభవం లోకి వచ్చేసింది. భూమి పూజ అయిన ఆర్నెల్ల లోపే స్వంత ఇల్లు. ఆ ఏడాదే ఇండియా ప్రయాణం. మోసం చేసి టికట్స్ డబ్బు వాడేసిన ట్రావెల్ ఏజంట్ చేతిలో నావి ఆరు వేలు పోతే అసలు మొత్తం రెండువందల యాభై వేలు మోసగించాడు. మన దేశస్తుడు. ప్రవాసజీవితాల సాధక బాధలు ఎరిగినవాడు. మరి, అన్ని తెలిసీ ఎందుకీ మోసాలు? ధనం, మూలం, మిదం, జగత్ కాబోలు.

2004



పిల్లదానికి అమెరికా సేవాతత్పరత పరిచయం చేయగల గర్ల్ స్కౌట్స్ అనుభవం. ఐదేళ్ల వయసులోనూ వారికి తగ్గ పనులు వారూ చేసారీ చిన్నారులు.


2005


ఇక్కడ ఉన్నా మనసెప్పుడూ అక్కడే. "ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా సొంతవారు ఐనవారు అంతరాల ఉందురోయ్ . ..." మొదటిసారి మా మేనమావయ్య నా స్వంత ఇంటికి రావటం. ఆ దంపతుల యాభయ్యవ వివాహదినోత్సవ వేడుక నేను చేయటం.. ఈనాటికీ మావయ్య ఆ మాటలు వస్తే ఆనందంగా గుర్తు చేసుకుంటారు.

2006




ఏ స్వలాభాపేక్షకీ తలనీలాలు ఇవ్వని నాకు, ఒక సదుద్దేశ్యంతో ఆ స్థాయి పుణ్యాన్ని, దాదాపు త్యాగసమానం [నాతో ముప్పై యేళ్ల పైగా ఉన్న కురులు ఇచ్చేయటం అంతేగా!] Locks of Love కి జుట్టు ఇచ్చేసా. నా కారణంగా కాకపోయినా ఆ సమయాన ఒక స్ఫూర్తి కలిగి మరొక ముగ్గురు కూడా ఇవ్వటం ఇంకాస్త సంతృప్తినిచ్చిన పరిణామం.

2007








అసలు హైస్కూల్ దాటేవారికి గ్రాడ్యుయేషన్ చేయాలా? అది వారిలో ఉత్సుకత/బాధ్యత పెంచుతుందా? అసలు కళాశాల విద్య సముపార్జనకి ఉద్యుక్తులని చేస్తుందా. ఇప్పటికీ ఈ విషయమై భిన్నస్వరాలు ఉన్నాయి. నేను ప్రత్యక్ష్యంగా గ్రాడ్యుయేషన్ సెరెమనీ చూసాను. ఆ సమయాన మా ఊరిలోని కాప్ అండ్ గౌన్ ఫాక్టరీకి వెళ్లటం తో, ఆ సీజన్ లో ఆ కార్మికులు, ఉద్యోగుల మీద ఎంత పని వత్తిడి ఉంటుందో తెలిసింది. పైన రెండూ అక్కడ తీసిన ఫొటోలు.

2008



నాకు స్వదేశీయానం - పిల్లలకి అదొక విదేశీయానం మాదిరిగా. గత నెల టపాలో ప్రస్తావించినదే. నన్ను అమితంగా ప్రభావితం చేసిన ఉపాధ్యాయిని చాలా యేళ్ళకి కలిసిందీ యేడే. అమెరికా నా కలల ప్రపంచం, అక్కడ నా ప్రియ శిష్యురాలివి నీవున్నావు అంటే నాకు అమితానందం అన్న ఆ మాటలు ఈ నాటికీ పునశ్చరణ కి వస్తూనే ఉన్నాయి.

2009

విరాళాలు ద్వారాగాను, తెలిసిన మార్గాల్లోనూ సహాయపడుతూ నా ప్రియ మిత్రురాలికి అండగా మేమే మొదలు పెట్టిన సంస్థ - జన్యా.


2010



ఈ దేశం లో పిల్లలకి అన్నీ ఎక్స్పోజర్ ముందుగానే అవుతాయి..మా పాప హెయిడీ కి తనంత తన ప్రయత్నం తో మూడు వందల డాలర్స్ పోగేసి తనంత తనే రీసెర్చ్ చేసి ఉన్నంతలో రెడ్ క్రాస్ మాత్రమే మెరుగైన సేవలు, దానమిచ్చిన మొత్తానికి తగు న్యాయం చేస్తుందని వారికి ఇవ్వటం జరిగింది.

అలాగే లెమనేడ్ సేల్స్, బేక్ సేల్స్ చేసో, లేదా సరదా ప్రాజెక్ట్స్ చేసో, తన పుట్టినరోజు కానుకల సొమ్మో అలా విరాళాలుగా ఇస్తుంటే, ఇక్కడ పెరగటం వలనేనా పదకుండేళ్ళ పిల్ల అంత గా దృక్పథం ఏర్పరచుకున్నదీ అనిపిస్తుంది. కనుక, ఈ దేశం నేను ఒకరికొకరం ఇచ్చి పుచ్చుకుంటూనే ఉన్నాము, ఇకపైనా ఉంటాము.

దేశానికి నా అభినందనలు. నా మిత్రురాలు భావన మాటల్లో మరికొన్ని ఇక్కడ.

ఈ రోజు జరిగిన ఫైర్ వర్క్స్ లో రద్దీ కారణంగా, కాస్త దూరం నుంచి తీసిన ఫొటోల్లో కాస్త మెరుగ్గా వచ్చినవివి.

చిన్ముద్రల టపాసు... :)






ఈ కాంతులు ప్రతి ఒక్కరి జీవితాల్లో వయో, జాతి, కుల, మత అంశాలకి అతీతంగా సుఖ శాంతుల ప్రతీకలు. అలాగే మా/స్నేహితుల పిల్లలు దీపావళి అంత సందడిగా, సంబరంగా ఇంటి దగ్గర పేల్చిన ఆనంద టపాసులివి.



"సర్వే జనా సుఖినోభవంతు"
Categories: Right

జంటగానం

Fri, 07/02/2010 - 08:12

రేయి వెన్నెలంతా కొమ్మల్లోకి నింపుకుని
తెలవారి పుప్పొడి పదాలు రాల్చిన మొక్క.
పగటి కాంతులు గుప్పిట పట్టుకుని
సంధ్య వేళ మొగ్గల పాటలు విప్పిన తీగ
రేయింబవళ్ళ సాక్షిగా నెయ్యం చేస్తాయి.

కలల విత్తులు నాటుతున్న మనిషికి
కొమ్మంటు జోడీలు వెదికే మనసు,
ఊహలకి ఆలంబన తరిచే మనసుకి
అరచేత స్వర్గాల మురిసే మనిషి,
ఆశానిరాశల సాక్షిగా బతుకు సాగిస్తారు..
Categories: Right

కళ్యాణం కమనీయం - కనులారా కనరండి!

Wed, 06/30/2010 - 11:11
రామా కనవేమిరా రామా కనవేమిరా శ్రి రఘురామ కనవేమిరా రామా కనవేమిరా రమణీ లలామ నవ లావణ్య సీమ ధరాపుత్రి సుమ గాత్రి ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా ...

కళ్యాణం చూతము రారండి..
[కళ్యాణ స్థలి: ఉత్తర అమెరికాలోని మిడ్ వెస్ట్ ప్రాంతం]

ఈ మధ్యన మన ఫొటోల కళ ముదిరి మనకి ఫొటోయిత్రి [ఈ మాట పేటెంట్ చేస్తున్నాను నా మిత్రురాలి పేరిట] అన్న బిరుదు, నిలయ చిత్రకళాయిత్రి [మళ్ళీ పేటెంట్] అనబడు పదవి దక్కాక నేను తీసిన ఫొటోలివి. ముందుగా, దాదాపుగా తొమ్మిదేళ్ళుగా చదువుతున్న రామాయణ పఠనం పూర్తయినాక జరిపించిన శ్రీరామ కళ్యాణం తాలూకువి [నిజంగా అలా అంత దగ్గరగా అన్నీ చూసి, దాదాపుగా నూట డెబ్భై ఫొటోలు తీయటం నా భాగ్యం]

రామాయణ పఠనం

చూచువారలకు చూడముచ్చటగా ....

పెళ్ళి సంబరం ఆరంభం
స్వామికి యజ్ఞోపవీతం
తదితర పూజాకార్యక్రమం

జీలకఱ్ఱ బెల్లం

మంగళసూత్రాలు
వరుడు

వధువు

తెర తీయగ రారా..
సూత్రపూజ


దీపదర్శనం
కళ్యాణం కమనీయం
అండా దండా ఇక నీవేనయ్యా రామయ్యా!
జానకిరాముడు

తలంబ్రాలు
పుష్పాలంకరణ
నృత్యసేవ
కానుకలు

మంగళహారతి
నైవేద్యం

ప్రసాదం

కళ్యాణం పరి సమాప్తి!
విందు

************************************************************

ఈ క్రిందనున్నవి ఒక కార్యాలయ వాస్తు పూజవి. ఇదీ చాలా విపులంగా జరిగినదే. కనుక చూసి తరించండి.



Categories: Right

వేసట ఎరుగని విరహిత

Tue, 06/29/2010 - 08:40
కనులు విశాలమైన ద్వీపాలు దాచుకున్నాయేమో
రానున్నవారిని అక్కడే పట్టి బంధించాలని,
రాకలు ఎరుగని క్షణం, వీడ్కోలుతో పందెం వేస్తుందప్పుడే.
చూపులు స్వర్గచిత్రాన్ని అలుపెరుగక దిద్దుతున్నాయదేమో..
తెలిసిన పూలన్నీ తెలియని అత్తరు వత్తుగ అద్దినట్లు,
గతపు పుట తెరిచి తిరిగి చదివినట్లుగా...

పుప్పొళ్ల జాజర, జాజిపూల జాతర,
సవ్వళ్ల ఉవ్విళ్ళు, సరిగంచు మురిపాలు,
తెలవారితే కలల సందళ్ళు,
సందెవాలితే కనుల కలవరాలు.
కలిసున్నా దాహమే, ఎదురుచూపులోనా మోహమే..
విరహాన వేగేటి జీవితం, వేసట తెలియని పయనం.

********************************
"కనులు విశాలమైన ద్వీపాలు దాచుకున్నాయేమో
రానున్నవారిని అక్కడే పట్టి బంధించాలని,
రాకలు ఎరుగని క్షణం, వీడ్కోలుతో పందెం వేస్తుందప్పుడే."

ఇవే ఈ కవిత రాయటానికి ఉద్యుక్తురాలిని చేసిన పంక్తులు, నిజానుభూతులు.

ఒక విధంగా పేలవమైన కవిత అనదగిన ఈ రచన ఇక్కడ పెట్టటంలో ఉద్దేశ్యం ఇది. మొదటి మూడు పంక్తులు ఒక విధమైన మానసిక స్థితిలో దాదాపు ఆర్నెల్ల క్రితం, ఫెబ్రువరి పదకుండున రాసినవి. ఏ కవికైనా వెలికి వచ్చేసిన భావనలు, ఒక పాఠకు/డు/రాలు/గా చదివితే అమూర్తంగానో, అపరిచితంగానో తోస్తే, అది వేర్వేరు ప్రయోజనాలని చూపినట్లు. ఇవాళ నేను ఆ కవితని పూర్తి చేయాలని చాలా విఫల, పేలవమైన ప్రయత్నం చేసినట్లే. ఆ ముందు మూడు పంక్తుల లోతుల్ని పలుచన చేసినట్లే... ఎందుకంటే ఇప్పుడా ఎమోషనల్ ప్లేన్ లోకి వెళ్లలేని వైఫల్యం.. సానబెట్టి రాయాల్సిన కవిత అయినా నా పరిమితి దాటి నేను న్యాయం చేకూర్చలేకపోయినదిది. కవిత ప్రక్రియ పట్ల అవగాహన కోసం నాకు నేను రాసుకున్న, చదివినవారిలో కొందరికైనా కాస్త ఉపయోగపడుతుందని ఈ అంగ వైకల్యం ఉన్న రచన ఇక్కడ పెట్టాను.
Categories: Right

కవి హృదయం: భిన్న స్వర గానం?

Sun, 06/27/2010 - 19:00
ఓ సారి హృదయం లోకి తొంగిచూస్తే నా వైపు విసరబడ్డ పదాలివి. ప్రత్యేకానుభూతి జనిత ధాతువులివి. ఇక్కడితో ఆగలే/వ/ని ముందే తెలిసిన అనేక వచనాలివి. ఇంకా ఎలా మాల అల్లాలో, ఏ స్వరం కట్టాలో, ఎవరికా గానం వినిపించాలో తెలియదు. కనుక ఇది ఓ అసంపూర్తి కవిత. కానీ, ఇలా ఎదరపెడితే మరో ఎద గేయం వినపడదా అని.. కనుక ఈ తరుణాన ఈ పదబంధన మీ మదిలో కదిపిన భావం తక్షణం ఇక్కడ పెడ్దురూ..ఇది ఒంటరిగా మిగిలిపోయినా భిన్న స్వర గానాలు సంపాదించకపోయినా తప్పక ఓ "భిన్న స్వర గానమే" కదూ?



ఓ శీతువు ఉదయాన ఎగిరే పక్షి నిలబడి, కదిలే సరస్సు స్తంభించి, ఓ చిత్రమైన జగతిని నా కనులెదుట నిలిపితే నేను పదిలిపరుచునున్న ఈ చిత్రం వలేనే, ఈ పదాలూను.. ఎలా ఆకృతి తెచ్చుకున్నాయో, ఇలా విడివడి నామీద కాదు కాదు మన మీద పడ్డాయి. ఆ పక్షి బింబం మాదిరిగా మరొక్క కవి హృదయం ఇదే రూపు కనదా? హృదయానికి ఋతువేవిటి అది అనునిత్యం పదికాలాల్లో సంచరించగల నేర్పరి. బహు గడుసరి.

*** *** *** *** *** *** *** *** *** ***

నిర్ణయాత్మక క్షణం
నిమ్మదించిన మానసం
నిట్టూర్పు వీడిన నిస్వరం
నివురు తొలిగిన రూపం
నిర్మాల్యం తీసిన గర్భాలయం

విభ్రమ గొలిపిన వాస్తవం
విశదమయిన పాఠం
వినిపించిన మౌనం
విరబూసిన కుసుమం
విశ్వాత్మలో లీనమైన అనురాగం
Categories: Right

బంధాలకి బంధనం

Sat, 06/26/2010 - 02:50
నిశిరేయి చుక్కపాటుకి
కనుదోయిలో నిలుపుకున్న
చిత్రం చెరిగిపడింది

రెక్కతొడిగిన మానసం
తానెరుగని చిరునామాకి
లేఖ మోసుకెళ్ళింది

అందని దూరాన మూర్తికి
అక్షరాభిషేకమిస్తూ
ప్రియదర్శిని పరవశించింది

వేగుచుక్క వాకిట జార్చిన
పొగమంచు తెరవెనుక
తెలిసినరూపు పలకరింపుగా నవ్వింది

ఎంతెంత దూరం, ఎందుకింత దాహం,
ఎద లయకి వుంటుందా విరామం
ఎలా వేయాలీ బంధాలకి బంధనం
Categories: Right

ఛీ నే, చాయిస్ ఈస్ యువర్స్ బట్..

Fri, 06/25/2010 - 11:30
వచనమనుకునో, వ్యాసమనుకునో వచ్చిన వారికి క్షమార్పణలు.. అలాగే చిన్న సాంకేతికలోపంతో ముందు పోస్ట్ డిలీట్ అవటంతో మళ్ళీ పెట్టాను.

Time holds the control of life, yet if one is strong, could sustain its tests, just said in a different way

*** *** *** *** *** *** *** ***
మనిషినేనా అని నొచ్చుకుంటే
కాలం మనసుని ఎరగా వేసి
గాయపు చేపల బుట్ట చేతికిస్తుంది

మనిషినోచ్ అని మిడిసిపడితే
కాలం సుడిలోకి విసిరి
ఎదురీతల పందాల్లో ఓడిస్తుంది

మనిషిని అని విశ్వసిస్తే
కాలం సూదిమొన గుచ్చి
వెన్నున్న వానపాముని చేస్తుంది

మనిషినే కాననుకుంటే
కాలం కసిగా తొక్కినా
ఎరుపునెత్తుటి బొద్దింకలా బతికేస్తాను

ఛీ నే, చాయిస్ ఈస్ యువర్స్ బట్..

కాలమా! బలమైన శత్రువుచేతిలో భంగపడ్ద
పరాజితుడు మహాబలుడు అవుతాడు.
నీవు నేర్పిన ఈ పాఠమే రేపటి నా విజయానికి నాంది.

*****************************
yikes, it sucks..ney not really the choice is absolutely yours..

ఈ రెండు చిత్రాలు నా లోగిలి ముంగిట సాయంత్రపు వేళలవి, సమయాలు ఒకటే కాలం తీరు వేరు. రోజులు వేరూను.

కావాలనుకుంటే నిన్నటి అందమైన జ్ఞాపకాన్ని,


రేపటి పీఢకలగా మార్చగల ధీశాలి కాలానికి ఎక్కుపెట్టి వదిలిన ఎన్నో ప్రశ్నల మాదిరి గానే


ఇది కాలానికి అంకితమిస్తున్న ఓ పరాజితహాసం!
Categories: Right

ఛీ నే, చాయిస్ ఈస్ యువర్స్ బట్..

Fri, 06/25/2010 - 11:07
వచనమనుకునో, వ్యాసమనుకునో వచ్చిన వారికి క్షమార్పణలు..
*** *** *** *** *** *** *** ***
మనిషినేనా అని నొచ్చుకుంటే
కాలం మనసుని ఎరగా వేసి
గాయపు చేపల బుట్ట చేతికిస్తుంది

మనిషినోచ్ అని మిడిసిపడితే
కాలం సుడిలోకి విసిరి
ఎదురీతల పందాల్లో ఓడిస్తుంది

మనిషిని అని విశ్వసిస్తే
కాలం సూదిమొన గుచ్చి
వెన్నున్న వానపాముని చేస్తుంది

మనిషినే కాననుకుంటే
కాలం కసిగా తొక్కినా
ఎరుపునెత్తుటి బొద్దింకలా బతికేస్తాను

ఛీ నే, చాయిస్ ఈస్ యువర్స్ బట్..

*** *** *** *** *** *** ***





భావోద్వేగం ఓ అంటురోగం నాకు ఇమ్యూనిటీ బాగా తక్కువ. జాగ్రత్త పడాలనుకునేవారు నాకు దూరంగా మెసలండి! :)

అలాగే, నా ఆలోచనకి ఏ మాత్రం డిసీప్లీన్..అసలవి ఎగురుతాయో, ఒకదానికి ఒకటి సంబంధం లేనివో యేమో ఎవరికి తీరిక తరిచిచూడను, వచ్చిపోయే ఆలోచనల్లో సతమతమవటమే కానీ. ;) నా ముంగిలిలో తీసిన ఈ రెండు చిత్రాల ద్వంద్వ రీతిలో వచ్చిన భావన ఇది. అలాగే ఆ ఎడం ప్రక్కనున్న చిన్న చెట్టు కూలిపోతే నా వైఫల్యాలు గుర్తొచ్చి ఎగిసిన కసి ఇది. జీవితం అంతేగా ఓసారి వెలుగుల వెన్న ముద్ద, మరునిమిషం చీకటిలో తేలుకాటు.

ముదిమిలో ఈ కవిత ఎందుకు రాసుకున్నాను అని లాక్కుని పీక్కునే కన్నా రాసినపుడే ఈ ప్రేరణా రాసేస్తే పోలా అని.
Categories: Right

ఉమ్మడి చరిత్రకారులు

Wed, 06/23/2010 - 23:41
మునిమాపులో ఈ గాలివాన ఊపిన మానస ఘోష

ఈ చిత్రం నా పెరటిలో తీసినది


*** యువతరానికి కొందరు ఆలుమగలు సెట్ చేస్తున్న బాడ్ ఎక్జాంపుల్ ఈ కవితకి ప్రేరణ



లెక్కతప్పిన చుక్కల రంగవల్లిలా
అసంబద్ద కలయిక కాబోలు,
తప్పక పురుడుపోసుకున్న అనుభూతి,
నిత్యం అర్థాకలితో నలిగే అనాథశిశువు,
పరవశాల పాలబువ్వ తెలియని పసికందు.

అసంపూర్తి కల అర్థరాత్రి గాలివానలా,
నిదురలేపి మరీ కలవరపెడుతుంది.
నిరీక్షణలన్నీ తెలవారి రాలిపడిన పారిజాతాలు,
నిట్టూర్పులన్నీ దిగుడుబావి పాకుడుమెట్లు.
ఇరువురూ ముక్తసరి మురిపాల ఆత్మవంచకులు

పణాలు, ఋణాలు, అరణాలు
అనుబంధాలకీ తప్పని బేరసారాలు.
అనుమతులు, బహుమతులు, దిగుమతులు
అనుభూతి తలవొగ్గిన లాంఛనాలు,
మనసారా విజేత, పరాజిత ఒకరి సగపాలు మరొకరు
Categories: Right

కంటికి తోడు కావాలి

Tue, 06/22/2010 - 08:26
నేల చీకాకు పడేంత వాన,
వద్దంటే వెల్లువయ్యే కన్నీటివరదలా.
గడ్డి జిగట అడ్డం పడి,
ఎగురలేని తూనీగ గోల.
నానిన నేలలో ఏ జ్ఞాపకాల విత్తూ మొలవదేం?

కవాటాల మోతకే తల్లడిల్లే గుండె,
తలపుల ఉరుములకి తబ్బిబౌతుంది.
చీకటిలో వెర్రి మిణుగురు ఒళ్ళు కాల్చుకుని,
అపరిచితులకి దోవ చూపెడుతుంది.
కొత్తదారికి ఇంకా కన్ను, కాలు అలవడలేదేమోనని..

వెలుగు నవ్వు మోస్తున్న రంగురంగుల పువ్వు,
తూగి కొమ్మదాపున దాగుడుమూతలాడుతుంది.
గట్టు దాటలేని కొలను తలబద్దలయేలా ఊగి,
ఊగిసలాటల ఉయ్యాల తాళ్ళు తెంఫుకుంటోంది.
దృశ్యం కరిగేలోపు జ్ఞాపకాల సంకెల బిగించికట్టిపడేస్తుంది కన్ను.

*** *** *** *** *** *** *** *** *** *** ***
సరదాగా ఒక్కో కన్ను మార్చుకుందామన్న ఊహని రేపెత్తిన నేస్తానికి, నా కన్ను మూటగట్టిన ఈ పదాలు చూసి పారిపోతావో, నీ కంటి కలతో ఈ వేదన కడిగిపడేస్తావో మరి! ఏదేమైనా ఇక ఇది నీ సొంతం.
కవిత అంటే మరిచిపోయానా అని మీమాంసకి గురి చేసిన స్వీటీ గారికి, రాత్రంతా ఉరుముల మెరుపులతో వెక్కిరించిన వానకీ కృతజ్ఞతలు.


వ్యాఖ్యలు చదివే/రాయని అలవాటున్నవారికీ ఈ చక్కని కవిత పంచాలన్న "నా" నిస్స్వార్థ ఉదారతతో పంచుతున్న.. స్వాతి శ్రీపాద గారి స్పందన ఇది.

నాలో నేను

అదృశ్యంగా గాయాలు అశృవరదలై
తలదాచుకునే తావుకోసం
చూపుల గాలాల్తో శూన్యాన్ని తడుముతున్నవేళ
అప్పుడెప్పుడో అక్కడెక్కడో మెరక గుండెలో
పొడిపొడిగా అక్షరాలు వెదుక్కున్న ఆహ్వానం

పెదవులు ఇసుమంతైనా కంపించలేదు
చూపులు నడిపిన రాయబారాలు
ఆవంకనుండా ఈ వంకనుండా
అర్ధంకాని అయోమయం అమావాస్యలో
ఏమూలనైనా నెలవంక తొంగిచూడదా?

నాలోలోపల నాలుగువేల ప్రపంచాలను
ఆవిష్కరించుకున్న నాకు
ఎందుకీ వ్యర్ధపు వెదుకులాట
ద రూల్ ఈజ్ సింఫుల్
ఇచ్చుకున్నవారికి ఇచ్చుకున్నంత
తెచ్చుకున్నవారికి తెచ్చుకున్నంత

నాది ఇచ్చే హస్తమే కాని పుచ్చుకునే
లౌలిత్యంలేదు
ప్రేమైనా మరింకేదైనా
ఇట్నించి అటే కాని అట్నించిటుకాదు
గుప్పిళ్లకొద్దీ విసురుతున్నాను
అందుకునే తీరికలేదిక
Categories: Right

భారత్ లో దక్షిణచిత్ర, ఉత్తర ఘోష - ఉత్తర అమెరికాలో ఆమిష్ మిత్ర

Sat, 06/19/2010 - 23:47
"My grandfather always says that's what books are for...to travel without moving an inch." The Namesake Jhumpa Lahiri

చిన్నప్పటి నుంచీ తెలియన జిజ్ఞాస, వేదన, శోధన నన్ను నడిపిస్తున్న స్ఫూర్తి. యాత్రల్లో అసలు స్థానానికన్నా స్థానికంగా మౌక్తిగంగా లభ్యమయ్యే సమాచారం, అక్కడి మనుషులు, ఆహారాలు, మరెన్నో తెలియని విషయాలు తెల్సుకుంటూ ప్రకృతికి మరింత ప్రేమికనౌతూ..

*** *** *** *** *** *** *** *** *** *** ***

నిజమే... పుస్తకాల్లోని అక్షరాలతో, రచయిత మానసంతో సమంగానే, లేదా మనదైన ఊహతోనో పయనం సాగించగలిగితే దృశ్యాన్ని జ్ఞాపకాన్ని పదిలంగా నిక్షిప్తం చేసేయొచ్చు కానీ యాత్రల్లో మరేదో అనుభూతి ఉంది, ఆకర్షణ ఉంది. అలుపు ఉంది. ఆదమరుపు ఉంది. కనుకా అవీ తప్పవు...

వేసవి సెలవలు. తెలిసినవారు కొందరు ఇండియాకి వెళ్తున్నారు. మా ప్రయాణం డిశంబర్ వరకూ లేదు, అసలు ఉందో లేదో నికరంగా తెలియదు. కానీ నాకు ప్లానింగ్ అలవాటు. ముందుగా కనీసం చూడాల్సిన ప్రదేశాలు, కలవాల్సిన వ్యక్తులు, తేదీలు మాత్రం ఉజ్జాయింపుగానైనా రాసుకుంటాను. ఈ ప్రవాస జీవితంలో గత పదహారేళ్ళలో ఐదుసార్లు వచ్చాను. ప్రతిసారీ ఏదో ఒక స్థలం సందర్శిస్తూనే ఉన్నాము. ఈసారి వచ్చినపుడు తప్పనిసరిగా ఓ ప్రత్యేక వ్యక్తిని [అమ్మా ఆశ చెప్పను, మీ ఊహకే వదిలేస్తున్నాను..] కలవాలి. :) ఆపై ఏ ప్రదేశం చూడాలా అని ఆలోచిస్తూ రెండేళ్ళనాటి ఫొటోలు తీసాను. అప్పుడనిపించింది. ఈ వివరాలు ఇచ్చి మరొకరి నుంచి మరికొన్ని వివరాలు సంపాదిస్తే పోలా అని. 2008 జాలై 15 నుంచి ఆగష్ట్ 14 వరకు సాగిన మా విసిట్ లో ఓ మూడు రోజులు ఇంటిపట్టున తర్వాత మూడురోజులు ఊర్లు పట్టి తిరగటం అదీ పరిస్థితి.


చెన్నైలో మొదటి మూడురోజులు, తిరుగు ప్రయాణంలో చివరి రెండు రోజులు మమ్మల్ని పదిలంగా తిప్పిన డ్రైవర్ శివ - ఇతనిగూర్చి, మరికొందరిని గూర్చి మరోటపాలో. నిమిషాల్లో నచ్చేసిన అరుదైన వ్యక్తుల్లో ఒకరు.

మా మొదటి విడత విహారం - చెన్నై కి ఓ పాతిక కిలోమీటర్ల దూరాన ఉన్న దక్షిణచిత్ర. పిల్లలకి నాలుగు దక్షిణ భారత రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, వృక్షాలు, రీతి రివాజులు అన్నీ ఒకచోట చూపెట్టగల ప్రదేశం. మనం అక్కడ గడిపే ఏ ఒక్క నిమిషం వృధా పోదు. అందుకు నాది హామీ. చరక సంహితం నేను క్షుణ్ణంగా చదవలేదు కానీ "యస్మిన్ దేషే తు జాతా తస్మిన్ తజ్జోషధం హితం" అనగా ఆసేతుహిమాచల పర్యంతం భారతదేశంలో ప్రజలు తమ తమ పరిసర ప్రాంతాల్లో పెరిగే మొక్కలని వైద్యానికి ఉపయోగించటం నేర్చుకున్నారని, ఓషధులు, మూలికలు రూపాన ప్రకృతి ఎన్ని సాంప్రదాయ వైద్యాలకి వినియోగపడే మొక్కలు, వృక్షాలు మనకి వరంగా ప్రసాదించిందో తెలుసుకున్నాను.

పూర్వకాలపు గృహాల్లో పెరటి చెట్లు, ముందు వాకిలిలో కనపడే మొక్కలు, మరువం, తులసి ఇలా అన్నిటికీ ఎందుకు పెంచాలి అన్న సరైన వివరణ ఉంది. ఆ అవగాహన తో మరింత శ్రద్దగా పెంచగలుగుతాము. ఎన్నో కిలోమీటర్ల విస్తీర్ణం లో ఉన్న ఈ దక్షిణచిత్ర లో ఆ అన్ని చెట్లూ పిల్లలకి పరిచయం చెయ్యొచ్చు. అలాగే మునుపటి గృహాల కట్టుబడి [ఉదా: చెట్టినాడ్ వారి గృహాలు, తాటాకు పాకలు, పెంకుటిళ్ళు], వివిధ సాంప్రదాయ రీతులు ప్రతిబింబించే దేవాలయాలు, చేతిపని వృత్తులు [కుమ్మరి, కమ్మరి, చేనేత.. మరెన్నో, పిల్లలనీ చేయనిస్తారు], ఇక పిల్లలకి మరీ కూతూహలం పుట్టించేట్లుగా ఉండేవివి - ముగ్గులు వేయించటం, గోరింటాకు పెట్టటం, తాటాకు బొమ్మలు, బుట్టలు అల్లటం గట్రా. ఇవేకాక ప్రతి ఇంటా సామాన్యంగా కనపడే గృహాలంకరణలు [ఇత్తడి కంచు రాగి మట్టి పాత్రలు], వ్యక్తులు [పురుషులు, స్త్రీలు, పిల్లల ప్రతిమలు] ఆ వివరాలు ఇస్తూ పట్టికలు.


ఇలాంటి చూడచక్కని విగ్రహాలు వివరాలు ఎన్నో

మాతో పాటు విహారయాత్రకొచ్చిన బడిపిల్లలందిరికీ అవకాశం ఇచ్చి వివిధ పాత్రలు చేయనిచ్చారు

మనమొక మ్యూజియం లో తిరుగుతున్నట్లు కాక ఓ వూర్లో వీధుల వెంబడి నడుస్తున్నట్లుగా చాలా తాజా అనుభూతి. ఒక్కటే నిరాశ. మరీ పేరాశ పడి, విమానం దిగీ దిగగానే అరపూట కూడా విశ్రాంతి తీసుకోకుండా పైగా ఆ వేడికి ఒళ్ళు అలవాటు పడకుండా వెళ్ళటంతో నేను కళ్ళు తిరిగి పడ్డాను. నాతో పాటే బాటరీ అయిపోయిన నా కామెరా కూడా మూలపడింది. కనుక నేను రెండొంతులు మాత్రం తిరిగాను, కామెరా మొదటి గంట వరకే అక్కరకొచ్చింది. మళ్ళీ వద్దాము అని మనసుకి సర్ది చెప్పుకున్నాను. అందరూ ఓసారైనా చూడాల్సిన స్థలం.

ఇదిగో ఈ శివా తెగ గొణుగుడు. అంతా [ఆ దగ్గరలోని ఏదో ఆలయం పేరు చెప్పాడు, మర్చిపోయాను] కోవెల చూస్తారు మీరేమో ఇలా అని. కానీ నాకు గణపతి తల్లితండ్రుల చుట్టూ ప్రదక్షిణతో ముల్లోకాల్లో తిరిగిన పుణ్యం మూటగట్టుకున్నట్లు ఈ ఒక్క ప్రదేశంలోనే దేవాలయాలు, కోనేటి స్నానాలు, అట్లతద్ది ఊయలలు, ముంగిట ముగ్గుల మురిపాలు, నా బాల్యం, పరువపు ప్రాయపు తలపులు ఇలా ఎన్నో అనుభూతులు నెమరువేసుకున్నాను. అక్కడివారు, ఇక్కడి నుండి వెళ్ళేవారూ అంతా చూడాల్సిన స్థలమిది. మా స్నేహ/నా ఆరోప్రాణమని చెప్పానే అదే చక్కగా ఓ మూర మల్లెలు ముడిచి, కుడిచేతికి గోరింటాకు పెట్టుకుని, తను లెఫ్టీ కనుక ఆ చేత్తోనే ముగ్గులు వేసి తెగ తెగ ఫీలైపోతూ ఆనందంగా గడిపింది.

తాటాలు గిలక చేస్తూ..


ఆ కళాకారిణి వంటి మీద వివిధ ఆభరణాలనీ గూర్చీ తెలుసుకుంది మా స్నేహ

చార్మినార్ వద్ద లభ్యమయ్యే గాజులవంటి అద్దాల అమరిక ఉన్న వస్తువులు - మేము దాదాపుగా ఆ అంగడి మొత్తం కొనేసాం, ఇక్కడికి రవణా చేసేసాం!
మరి కొన్ని చిత్రాలు:


పడుగూ పేకల నడుమ అపురూపమైన నేత - చూడటానికి రెండు కళ్ళూ చాలవు

ఆలయప్రాంగణం

గృహాల లోపల అలంకరణ నమూనా


కోవెల ఎదుట ప్రతిమలు

నేను అలా అలా తాబేలులా కాస్త ఆగి ఆగి చెట్ల నీడల్లో పాకి మొత్తానికి జెట్లాగ్ ని అదిమి తగురీతిన అస్వాదించేసాను.

ఇక్కడ బస చేయండి, అలా వెళ్ళండి, ఇది తినండి, అది మానండి, కొనండి, కొట్టండి [మందు కాదు] అని మాత్రం నేను చెప్పను. ఎవరి ఇష్టాలు వారివి, పిండి కొద్దీ రొట్టె. మా వరకు పిల్లలకి ఏ అసౌకర్యం, అనారోగ్యం, ఆహారలోపం కలగకుండా చూసుకోవటం మొదటి ప్రిఫరెన్స్. అందుకే అంటురోగాలున్నాయని ఊదర కొడితే రెసిడెన్సీ లో దిగుతాం [ఎవరు తీసుకున్న గోతిలో వారు పడ్డట్లే] అబ్బా కాస్త సరైన పొంగలి, దోశ లాగిద్దాం అనుకుంటే శరవాణ భవన్ కి దగ్గరగా చూసుకుని అరుణా ఇంటర్నేషనల్లో సర్దుకుపోతాం [తాను మెచ్చింది గంగ మాదిరిగా]. అంచేత ఆ వివరాలు ఇవ్వలేను.

*** *** *** *** *** *** *** ***

ఇక రెండో విడత ఢిల్లీ, ఆగ్రా:

ముందుగా ఓ ఊసు చెప్పుకుని ఊరు మాట చెప్పుకుందాం. ఢిల్లీలోని స్నేహితురాలికని మా గోదావరి జిల్లా బెల్లం జిలేబి చక్కగా స్టీలు డబ్బాల్లో సర్ది షంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకూ తెచ్చాము బహు జాగ్రత్తగా. కాస్త అర్భకుడైన యువ/నా పంచప్రాణాలైన నా కొడుకు చేతికిచ్చి జాగ్రత్త నాన్న అన్నానో లేదో, "నువ్వొస్తానంటే నేనొద్దంటానా?" లో సంతోషినీ లా కార్ డ్రైవర్ చేతి నుంచి అందుకుని ట్రాలీలోకి పెట్టబోతూ వదిలేసాడు. అదికాస్తా "ఢామ్మని" శబ్దం చేస్తూ దొర్లూకుంటూ పోయిందా.. హాహాకారాలు చేస్తూ జనాలు పరుగులు. ఓ నిమిషానికి గానీ నాకు అర్థం కాలేదు. అదేదో ఉగ్రవాద చర్యంత ప్రభావాన్ని చూపిందని. ఇంతచేసిన ఆ డబ్బా మాత్రం లక్కసీలేసిన మాదిరిగా కూస్త కూడా తెరుచుకోలేదు. మా ఊరి జిలేబీ రాజధాని వరకు ఎగిరెళ్ళింది ఎంచక్కా..

బహుశా అక్కడ అందరూ చూసేవే ఇవి. లోటస్ మహల్, అక్షరధాం, కుతుబ్మినార్, రాజ్ ఘాట్, ఇండియా గేట్, తాజ్ మహల్, ఫతేపూర్ సిక్రీ వగైరా వగైరా. టూరిస్ట్ యాత్రా బస్ వద్దని మేము రెంట్ చేసుకున్న వాహనం లో తిరిగాము. కనుక హడావుడి లేకుండా కావాల్సిన చోట కావాల్సినంత సమయం గడిపాము. సో అంతా చాకిరేవులు పెట్టి ఉతికి ఆరేసిన ఈ ఢిల్లీ ప్రాంతాల యాత్రల గూర్చి నేను పెద్దగా చెప్పేదేమీ లేదుగానీ ఎదురైన ఇబ్బందులు ఏకరువు పెడ్దామని ఉబలాటంగా ఉంది.

ఆస్ట్రేలియాలో కాస్త ఫిజీ ఇండియన్స్ మూలాన హిందీ నోట్లో నలిగేది అప్పుడప్పుడూను. అమెరికా వచ్చాక వీధికో తెలుగువారు, సందుకో చంద్రముఖీను. ఇక మనకి వచ్చిన ఆ మూడు ముక్కల హిందీ మూటగట్టి అటక మీద పడేసా. ఇంతవరకు బానే ఉంది. ఆగ్రా ట్రిప్ కి ఎవరూ తోడులేరు. నేను, పిల్లలు, తెలుగే సరిగ్గా రాని మా బన్నక్క [విందంటే నన్ను ఉప్పు పాతర వేసేస్తుంది], డ్రైవర్ ఉదయాన్నే పోలోమని రోడ్డున పడ్డాం. ఢిల్లీ నుంచి దాదాపు నాలుగు గంటలు పైన ప్రయాణం.

నాకు వసపిట్టకి పెద్దగా తేడా లేదు. నిజాయితీగా ఒప్పుకోవాలంటే నేనో పెద్ద L L B ని అంటే లొడలొడబుచ్చిని. ఓ పది నిమిషాలు పిల్లలతో కిస కిసలాడాక [కిలా కిలా నవ్వుతూ గుస గుస లాడటం అంటే కిస కిస అన్నమాట, వేటూరిగారి గసగసలా నవ్వులా (అవి సగ సగాల నవ్వులని ఎందరికి తెలుసండి?) ] నా కన్ను మౌనంగా రోడ్డునే చూస్తున్న డ్రైవర్ మీద పడింది. ఓ రాయేద్దామని "భాయ్ సాబ్, ఆప్ కైసా హై?" అన్నానా. తనేదో చెప్పాడు, ఇక నా జంకు వదిలిపోయి, ఎప్పుడెప్పుడివో వెదికేసి నా ఉత్తమ, రాష్ట్ర, భాషాప్రవీణ వగైరా హిందీ పాఠాలన్నీ నెమరేసి తెగ కబుర్లు చెప్పేసా [గ్రామర్ తనకీ రాదనుకుంటా, మొదటి రెండు పదాలతో నా ప్రశ్న అర్థమైపోయేది, నాకూ రాదు ;)].

ఆగ్రా చేరేసరికి నిద్రగా ఉంది. నేను పడుకుంటాను మీరు చూసి వచ్చేయండి బెహెన్ జీ అన్నాడు. ఇక చూడాలి నా పాట్లు. అంత నేషనల్ ఐకాన్ ఆ కట్టడం. అంతా తొక్కిడి, పద్దతి లేదు, ఎలా మన దగ్గర డబ్బు గుంజాలనే యావ ప్రతి వాడికీను. సరే వీరనారిలా/ఝాన్సీ లక్ష్మీభాయిలా సంతు ని వెంటేసుకుని లోపల చూసి, కాసేపు ఊహల్లో ఊరేగి, యువ జాలిగా "అమ్మా! నీకు వీలైతే ఓ తాజ్ మహల్ కట్టిస్తానే, నన్ను ఇంటికి జేర్చు" అని ఎర్రగా కందిన బుగ్గలతో [విపరీతమైన వేడి ఆ రోజున] , వాడిన కలువరేకులా దీనంగా అడిగాక కదిలి, సామాను జప్తు చేసిన చోట భద్రంగా మా వస్తువులు దొరకబుచ్చుకుని [వెళ్ళినవాళ్ళకి తెలుస్తుంది ఈ యుద్దం ఎలా ఉంటుందో, పైగా ఆ ఉద్యోగి చెయ్యి చాపి "ఆప్ కి మన్ పసంద్" అని బాహాటంగా లంచం అడిగాడు. నాకు "మన్ వికార్ బినా కుచి భీ నై" అని చెప్పి] బయట పడి, ఒకడి రొద పడలేక వాడు చూపిన దిక్కున ఓ దిక్కుమాలిన బట్టల షాప్ లోకి వెళ్ళాను.

ఈ లోగా చిన్నది ఒకటి అని ముందు వార్నింగ్, కంగారుగా అడిగితే ఇక్కడ ఉండవు కమోడ్ గట్రా అన్నాడు, ఇంతలో ఇది రెండుకి అని చిందులు. ఏదో ఒకటి అని వాడు చూపిన దిక్కున వెళ్తే [ఈ పాట్లు ఇంతకు మునుపు సుజాత గారి బ్లాగులో చెప్పి ఉన్నాను] నీళ్ళు లేక, ఎన్నో ఏళ్ళ తరబడి కడగక ఉన్న ఆ లావెటరీ, ఇక నేను ఇంతకన్నా చెప్పలేను, నాకైతే ఏడుపొచ్చేసింది. పిల్లదానికి సరేసరి. ఫుడ్ త్రో చేసేసింది. అంత నా వేదనలోను మీకు నవ్వొచ్చే సీన్ ఇది. బయటకి పరిగెత్తుకొచ్చి ఆ జనాల్ని ఏదో అడగాలనుకుంటే "భాయియోం, బెహనోమ్.." అన్న అక్రోశమే కానీ ఒక్క ముక్కా హిందీ గుర్తుకి రాదే? చిల్లుపడ్డ ప్లాస్టిక్ బాగ్ లో, ఎయిర్ కూలర్ నుంచి కారుతున్న నీరు పట్టి అవి పూర్తిగా కారిపోయేలోగా P T ఉషలా పరిగెట్టి, పిల్లదాన్ని శుభ్రం చేసి, ఇక ఒక్క క్షణం కూడా ఆగకూడదని, విసిగిచ్చి పారేసిన ఆ బట్టల కొట్టువాడికో దణ్ణం, వాడు అంటగట్టిన చీరలకి ఓ పదివేలు సమర్పించుకుని [ఇంటి చేరాక వదినా వాళ్ళ పనమ్మాయి అవి చూసి నాకేసి చాలా విచిత్రంగా చూసింది, వాళ్ళిద్దరి గుసగుసకీ ఒళ్ళుమండింది] ఆగ్రా వదిలి ఫతేపూర్ సిక్రీకి వెళ్ళాం.

అక్కడా అడుగడుగునా మోసమే. భాష తెలియదనా, స్త్రీని ఒక్కదాన్ననా, మా వాలకం చూసా - ఏదైనా కానీ పిల్లలు ఎంజాయ్ చేయలేదన్న అసంతృప్తి మిగిలిపోయింది. ఆ గైడ్స్ చెప్పే కట్టుకథలు నేను సరిదిద్దుతూ, ఈసారి కాస్త తెలివిగా మెసులుకుని వెనక్కి వచ్చాము. కానీ మూల్యం చెల్లించాను. పిల్లకి అప్పుడు పట్టుకున్న డయేరియా తాలూకు బాధలు ఒకదాని తర్వాత ఒకటి పదిరోజులుపీఢించాయి. పోనీండి అవన్నీ వదిలేద్దాం. ప్రయాణాలు, దార్లో గ్రామాలు, డాబా ఫుడ్స్ మాత్రం పిల్లలు కాస్త సరదాగానే గడిపారు. టూరిజం శాఖ వారు ఢిల్లీ దాటి ఆగ్రాలో, ఫతేపూర్ సిక్రీలో అసలు ప్రాంతాల్లో కాస్త సౌకర్యాలు ఏర్పరిస్తే బాగుణ్ణు. రానూ పోనూ మధ్యలో హైదరాబాద్ లో ఆగాం కానీ ఏమీ చూడలేదు. మావాళ్ళ ఇల్లు వదిలి కదిలితే ఒట్టు. నిద్ర అలసట అన్నీ అక్కడే తీర్చుకుని రైలెక్కి వూరికి ఛలో. ఇక ఆ టీసీలు, కూలీలు వీళ్ళూ నల్లులు, జలగలు. నిజమైన చె.నా లు. ఇదన్నమాట మా ఉత్తర [భారతయాత్రా] ఘోష.

ఒక లాభసాటి బేరం ఏమిటంటే అంతవరకు నేను PT ఉష నే గానీ, Pitooriila Tank [పితూరీల టాంక్ (నా చిన్నప్పటి నిక్ నేం)] ఉషని. ఢిల్లీ ప్రయాణంలోనే నిజమైన P T ఉషలా పరిణామం చెందాను. ఆస్ఫూర్తితోనే ఈ రెండేళ్ళ మారథాన్ పరిగెట్టాను. ఢిల్లీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తీసినవాటిల్లో కాసిని ఈ టపా చివరన తగిలించాను.

ముచ్చటగా మూడో ప్రయాణం : మా గోదావరి ప్రాంతాల్లోకి - కోనసీమ, రాజమండ్రి, అమలాపురం .. పిల్లలు ఆనందంగా అయినవారి నడుమ గడిపి, సినిమాలు చూసి, ఆటలవీ ఆడి పాడి ఆనందంగా గడిపారు. అంతా రోసీ అంటే ఊరుకుంటామా అంటారా? కుటుంబ వ్యవహారాలు, విసుగుదలలు లేవని కాదు అవి అప్రస్తుతం.

*** *** *** *** *** *** *** *** *** *** *** *** ***

ఇక ఉత్తర అమెరికా లో పదేళ్ళ సుమారు నివాసం కనుక అందరి మాదిరే మాకూ యాత్రానుభవాలు, విహారానుభూతులున్నాయి. పెద్ద పెద్ద స్థలాలు, ఆకర్షణలు అందరికీ తెలిసినవే. ఈ ఇంటర్నెట్ వలన పరదేశి సినిమాలో పాట "తణుకో అరకో కటకో లడకో చివరికి న్యూయార్కో ...మెదకో మాస్కో" ఎక్కడున్నా మాదిరి అంతా దృగ్గోచరమే. కానీ ఒక ఊరి సంగతి చెప్పాలని. మాకు దగ్గరగా ఉన్న ఆర్థర్ కి చాలా సార్లు వెళ్ళాను. ఇది ఆమిష్ వారు వసించే ప్రాంతం.

ఈ ఆమిష్ వారు హాలండ్ నుంచి వలస వచ్చినవారు. అచ్చంగా ఓ వందేళ్ల నాటి నుంచీ అదే జీవన విధానం. వారి సాంప్రదాయాలు పద్దతులు కాక మర్చిన వారు ఊరిలో ఉండరు. మన పల్లెటూరి రైతువారీ ఇళ్ల లోని పడికట్టు కనపడుతుంది. కోళ్ళు, గుర్రాలు, ఆవులు, పోనీ బళ్ళు, గుర్రపు బగ్గీలు, ఈమ్యూలు, ఇలా పెంపుడు జంతువులు. కూరగాయల పెంపకం, వ్యవసాయం. ఎక్కువగా వడ్రంగి వారు తారసపడతారు. ఇంకా రకరకాల కుటీర పరిశ్రమలు - బేకరీలు, జామ్స్ అవీను, తివాచీ నేతలు, కాండిల్స్, ఫాబ్రిక్ పెయింటింగ్, గట్రా.

ఇప్పటికీ వాళ్ళ ఇళ్ళలో పాదరక్షలు వాడరు, కరంట్ ఉండదు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోరు, స్త్రీలకి కాస్త దాపు, ఫొటోలు అనుమతించరు. నిజంగా అదో లోకం. మాకు పరిచయస్తులైన ఒక కుటుంబం వలన వాళ్ళ ఇళ్ళలోకి చొరవగా వెళ్ళి గదులన్నీ కలదిరిగేంత చనువు. మీకు దగ్గరలో ఉన్న ఆమిష్ పట్టణానికి వెళ్లటం మాత్రం మరవకండి. చాలా స్నేహశీలులు. వారిని కలవటం ఓ మరపురాని అనుభూతి. ఇదీ ఆమిష్ మిత్ర లాభం.

ఆమిష్ వారి పనితనపు గుర్తులు:

ఛుక్ ఛుక్ రైలెక్కి నా స్నేహమ్మ వూరెల్లే! ;)
ఇది ఫొటోలకి స్టాండ్! మనచేతిలో ఇలా ;)


బూర
అలాగే గ్రాండ్ ఆర్బర్. The Grand Arbor invites you to renew your connection with the healing power of the earth. Escape into the heart of 62 secluded acres of wooded forest. This 3 bedroom, 2.5 bath family vacation log cabin home is the perfect place to enjoy the simple pleasures in life. ఇక్కడ టీవీలు, సెల్స్, ఇంటర్నెట్ పనిచేయవు. అక్కడ కొండల ప్రాంతాలు అవీ చాలా బాగుంటాయి. నాకు ఎనభై ఏళ్ళ నాటి గుర్రపునాడా ఓ కొండని అధిరోహించిన సమయాన దొరికింది. ఏ బాటసారిదో. నాకు ప్రాప్తం.


దాదాపుగా ప్రతి ఒక్కరం బాల్యపు రోజుల్లోకి వెళ్ళి ఆడి పాడిన ఆ మేము పోయినేడు గడిపిన ఆనంద ఘడియలు మళ్ళీ నెమరేయాలని ఏడు కుటుంబాలవారం అంతా కలిసి మళ్ళీ వెళ్తున్నాము. ఎప్పటిలానే నా కంటికి కనపడేవి ఇవే. ఇక్కడ చూడండి.

*** *** *** *** *** *** *** ***

ఆస్ట్రేలియా నుంచి చదువుతున్నవారు, జిండాబైన్, మౌంట్ కొజియాస్కో వెళ్ళటం మానకండి. సిక్కిం, హిమాలయాలు చూసినంత ఆనందం. మనసు మరింత స్వఛ్ఛంగా, తాజా గా తయారవుతుంది. నా వద్ద డిజిటల్ పిక్స్ లేవు అక్కడివి కానీ అదో మైమరపుకి గురి చేసే ప్రకృతి అక్కడ కనపడుతుంది. అవి నచ్చాయి అని చెప్తే మరికొన్ని చెప్తాను.

*** *** *** *** *** *** *** ***
ఇంతదాకా చదివిన మిత్రులు.. ఈసారి నేను హైదరాబాద్ సమీపాన కాస్త ప్రకృతిని అస్వాదిస్తూ చూడగల స్థలాలు సూచించగలరా? అలాగే అమెరికాలో ఎక్కువ సందర్శకుల తాకిడి లేని ప్రశాంత ప్రదేశాలు చెప్పగలరా. ఆన్లైన్ లో వెదికే సమయం లేదు/స్వానుభవాలు ఇంకాస్త ఉపకరిస్తాయనీను.

ఇక ఈ టపా ప్రకటన చూసి మళ్ళీ వచ్చినవారికి ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లలకి వేసవి సెలవులిక్కడ. అందుకే అమ్మానాన్నలకీ ఆటవిడుపు. నాకు ఆ టపా గిడుపు [తల్పం-గిల్పం తీరుగా!].

*** *** *** *** *** *** *** *** ***

కొన్ని చిత్రాలు ఢిల్లీ పరిసరాల్లోవి: అన్నీ నేను తీసినవే!

ఇండియా గేట్

కుతుబ్మినార్
కుతుబ్మినార్ పరిసరాలు
అలా-ఇ-మీనార్
ఈ సమాచారం ఇచ్చిన పొద్దు చదువరి గారికి కృతజ్ఞతలు
చెప్పండి చూద్దాం?

లోటస్ టెంపుల్ - ఇటుగా వస్తున్న ఆ నలుగురు తెలుగు వారు
హరేకృష్ణ గారికి "ఉత్తమ బ్లాగు చదువరి" బిరుదు ఇచ్చేసా! :)
అవునూ "ఉత్తమ ప్రేక్షక" నంది అవార్డ్ లేదేమి?


ఫతేపూర్ సిక్రీ
ఫతేపూర్ సిక్రీలోనే చక్కని ఆర్కిటెక్చర్ ఉన్న మరొక సముదాయం
Jama Masjid, Fatehpur Sikri, Agra

మరొక కోణం
ఫతేపూర్ సిక్రీలోని కళావైభవం

దివాన్ ఈ ఖాస్ అర్చిటెక్చర్

దివాన్ ఈ ఖాస్ తాజా తాజా కలలు కళ్ళకి కలిపే తాజ్

నిజానికి తాజ్ రాజపుత్రులు మొదలుపెట్టిన నిర్మాణమట అందుకే దాని ముందరి కొలనట - నిజమేనా?

*** *** టపా ప్రకటన మిస్సయినవారి సౌలభ్యం కొరకు ;)
ఇది ఎన్నప్పా అని కూతూహలంగా ఉందా? కాస్త వేచి ఉండండి. అందాక .. ఏమి చేయము అంటే ఊహాగానాలు చేయండి! ;) ఆనక తీరిగ్గా చదివి పోల్చిచూడొచ్చు.. మరీ ఆత్రంగా ఉంటే గూగుల్ చేసి, యాహూ నాకు తెలిసిపోయిందోచ్ అని ఆనందపడండి...

పల్లెటూర్లలో సినిమా బండి వాడి కొత్త సినిమా ప్రకటన తాలూకు మాటల్లా లేవివి? :) మరి సిద్దంగా ఉన్నారా.. కాపీలు గట్రా తాగి రండి, సిటికెలో ఈ కథ మీ చెవిన పడేస్తా.. [సరదాగా ఇలా ఊరించాలనిపించీ..]
Categories: Right

మమ్ముట్టి - మమెలీ

Fri, 06/18/2010 - 01:22

ఇవాళనేమిటీ ఎప్పుడూ ఉపమానం, ఉపమేయం రెండూ తనలోనే చూసాను..ఎవరిలో అనేనా. కోక్ కాన్ ఊపి ఊపి, ఓపెన్ చేస్తే బుస్సున పొంగే నురగ మీద ఓ చిటికెడు ఉప్పు పోస్తే మరింత చివ్వున ఎగుస్తుందే అలాగ, వేదననీ ఆనందాన్నీ ఒకేలా దాచుకుని ఊపుని బట్టి ఒక్కో రకం పొంగుని నామీదకి విసిరే నా మనసులో. కనుక నా మనసుకి మనసే సాటి. యస్.. అనన్వయాలంకారం. నా అస్తిత్వం చిరునామా అయిన స్వయానా నా మనసులోనే. పాపం ఎంత కాదనుకున్నా ఏకాకి నాకు ఏకాంతం లో మిగిలిన తోడు.. ఇవాళ కాస్త గలాటా చేస్తుంది.. సరే పోనీ వదిలిచూద్దాం కాసేపు...

"మీరు ఏముట్లు" అడిగినావిడ చూడబోతే పెద్దవారు, వెనక ప్రాధేయపడుతున్న మనిషి చూపు కాస్త వెనక్కి లాగగపోతే [మనసు చెప్పే కబుర్లు వింటూ మళ్ళీ ఈ మనసులో మాట ఏమిటో] "ఆ.. లాగకపొతే ఏం చేస్తావు?" పాట పాడతా 'గాలికీ కులమేది ఏదీ నేలకి కులమేది.' ఇలాకాదు గానీ మొక్కలు, పూలు, నీళ్ళు మారలేదు కానీ మారినవి - యాంత్రికజీవితాలు, పనిముట్లలో కలిసిపోయిన జనాలు, అందులో నేనూను. కానీ కులానికి మనిషిని.. కనుక నేను స్త్రీలింగం కలిపితే "మమ్ముట్టి" ని. యస్.. కడోస్ మనసా! కులం, తత్వం, లింగం కలిపి ఒకటే మాట మనిషి+పనిముట్టు+స్త్రీ == మమ్ముట్టి చెప్తే విని అడిగినావిడ తట్టుకోగలరా?

మరి గోత్రం. అదెవరికి అవసరం.. చివరిసారి ఎక్కడ చెప్పాను..ఏదో గుళ్ళో ఎవరో పూజారి అడిగితే. పూజారి అంటే గుర్తుకి వచ్చింది. ద్రాక్షారామం గుడి పూజారి ఎంత దైన్యంగా ఉన్నారు. ఎలాగోలా ఆర్థికసాయం చేద్దామనుకున్నానే. సమయాభావం అని వంక. ప్చ్.. నిజంగా అదేనా కారణం. మూలకి నెట్టేసిన ఆలోచన ఆచరణకి నోచుకోక ఆగిపోయింది.

షాపింగ్ మాల్లో ఓ మూల కూర్చుని మాసిన దుస్తులు, గడ్డం అసలుకి మాపులేనిదేదీ లేని ఆ వృద్దుని కళ్ళలో నిర్లిప్తత ఎలా వచ్చిందో? అసలే భవబంధాలూ లేనివాడిలా పది డాలర్స్ ఇచ్చినా అదేచూపు, చీటోస్ పాక్ ఇచ్చినా మారని చూపు. అతని రూపు చూస్తే ఎప్పుడో ఓ రోజు హఠాత్తుగా ఫలానా పుస్తకం రాసిన కవి/రచయిత నేనే అంటాడేమో.. ఛా..ఛా..అలాగ పోయిందేం ఆలోచన. ఏం కాకూడదా?

ఒకప్పుడు వెనక నుంచి డాష్ ఇచ్చి సిడ్నీలో ఆ కార్ వాడు నాది ఈష్ట్ టీమోర్, నీది ఇండియా, మనం మనం భాయీ భాయీ...పోలిసుల్ని పిలవకు అంటాడా.. నిన్న వాడేమో ఆ ఆఫ్రికన్ అమెరికన్ కుర్రాడు ముందు బైక్ మీద వెళ్తూ ఏమీ కాకుండానే అసహ్యంగా చూస్తాడా. అవసరార్థం అభిమానాలు, అకారణద్వేషాలు. "అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం."

పిల్లది పెద్దదైపోతుంది. నిన్నామొన్నా బెంచ్ టాప్ మీద కూర్చుని ముంజేతిమీద పుట్టుమచ్చ ని ఆవగింజ అనుకుని "మా లుక్, టిక్ టిక్ నా చేతి మీదకి రోల్ అయింది." అన్న చిన్నారేనా ఇది? సరిగ్గా నమిలి తినకపొతే వంటిలోకి పాకుతాయి అన్నమాట నమ్మింది మొత్తానికి. చిన్నప్పుడు నేనూ ఇంతేగా.. పొరబాట్న మింగేసిన బత్తాయిగింజ బొడ్డులోంచి మొలకెత్తితే నన్ను భూమిలో పాతేస్తారని, నా మీద చెట్టు పెరిగిపోతుందని అన్నయ్య చెప్తే నమ్మి, అనంత పద్మనాభుని రూపంలో నన్ను నేను ఊహించుకుని భయపడలేదా? తరతరాల మన మూఢనమ్మకాలకి ప్రతినిధులం.

అవటార్ చూస్తున్నా అంతే. నానమ్మ చెప్పేది, నిద్ర పోయే ముందు మంచినీళ్ళు తాగకపోతే జీవుడు అర్థరాత్రి లేచి అలా ఎగిరెళ్ళి చెప్పులు కుట్టేవాడి తోళ్ళు నానేసిన గిన్నెలో నీరు తాగి వస్తుందని. అప్పుడు కలలన్నీ అవే. "ఎగిరే ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే ప్రతి అడుగు స్వేచ్చ కోరగా. మనసే అడిగిన ప్రశ్నకే బదులొచ్చెను.." పాడుకుంటూ గాల్లో ఎక్కడెక్కడికో ఎగిరేదాన్ని కాదా? తను చెప్పిన మాట మాదిరిగా కాక చక్రవాక పక్షిలా మబ్బుల్లో నీరు తాగి వచ్చేదాన్ని.. ఏమయ్యాయి నా కలలు?

తను అన్న సర్వనామం ఒక్కరికే అంకితమిచ్చేసాక, "అంతగా లీనమైపోకు, తగ్గించు." అన్న తన మాట వింటూ "మరి తను మునగొచ్చే, తనకి నచ్చిన పనుల్లో తలమునకలుగా మునిగితేలొచ్చు. ఎరిక మరిచి లీనమవచ్చు. నేను మాత్రం మామూలు మనిషిలా కాదు యంత్రంలా బతకాలి. నాకు నచ్చినపని (ప్చ్ .. అదీ తనమీద ధ్యాస / ప్రేమ అని తెలియదా?) మాత్రం వదిలేయాలి. హిపోక్రాట్." యాక్, ఇలా పైకి అనలేని నేనో సూడో ప్రేమికని.

తిట్టాలి ఇంకా తిట్టుకోవాలి చాలదిది. ఎవర్ని అడగాలి కాసిని తిట్లు అప్పియ్యమని. మొన్నామధ్య ఇండియాకి వెళ్ళొచ్చిన రెండేళ్ళ నా బుల్లి నేస్తం ఎలా పట్టిందో, పట్టి పట్టి అన్నమాట[ట].. అనేస్తున్నా.. [నాన్నగారు మన్నించండి] అచ్చ తెలుగులో "చెత్త నాయాల" :) ఆధునిక పోకడలో పొడిగిస్తే "ఇడియట్" ఎవరూ నేనే. ఆత్మదూషణ తగదే మనసా.. మరి ఎవర్ని తిడదాం.. ఆ వాడే ఆ బజ్జీలబండి వాడు వెళ్ళకెళ్ళక ఇండియా వెళ్ళి, దొరక్క దొరక్క నడిచి అదీ బజ్జీల బండి దొరికే వీధిలో వెళ్ళగలిగితే "అమ్మా నీకు అమ్మేవికావివి." అంటాడా? వ్యాపారనీతి తెలియని వెర్రి పీనుగ, నిజాయితీలో నన్ను సవాల్ చేసిన అసమర్థుడు. వాడిదీ నాదీ ఒకటే జీవిత యాత్ర ఇక. నాది పడమటి సంధ్యా రాగం.. వాడిది తూర్పు తిరిగి దణ్ణం పెట్టే బేరం. వెరసి అసమర్థుని జీవితయాత్ర.

మొన్న ఆదివారం నా పిల్లాడు అంటించిన Sunday bloody Sunday పాడుకుంటుంటే ఎండన పడి వచ్చిన ఆ పిల్లాడు చాక్లెట్స్ అమ్ముకుంటూ, సంఘసేవ పేరిట అచ్చంగా వీధులు వాడలు పట్టి తిరిగిన, చిన్నప్పటి నాలా లేడు? చల్లటి నిమ్మ మజ్జిగ శొంఠి పొడి వేసి ఇవ్వాలనిపించింది. ఇవ్వలేకపోయానే. ఏం.. మరి ఆఫీసులో వాళ్ళంతా అంత తేలిగ్గా డ్రింక్స్ ఆఫర్ చేస్తారే.. నేనే సందేహంగా "నాన్ ఆల్కహాలిక్ కదూ?" అని వందసార్లు అడిగి తాగుతాను గాని. "కన్యాశుల్కం" బుచ్చెమ్మ నుంచి నా వరకు, అంతా అచ్చమ్మలమేనా, తింగర ప్రశ్నలు వేయటానికి?

మాట వినని మనుషులని వదిలి చెప్పినట్టు పద బంధనల్లో ఇమిడే ఈ అక్షరాలు ఎంత ఆనందాన్ని వెలికి తెస్తున్నాయి? అవి రాస్తున్నది వేదన అయినా బయటకి పరావర్తించేది సంతోషమే, నిజంగా నిజ్జంగా..నా కళ్ళు నిజాన్ని దాయలేవు. మనసుకి కొత్త కళ్ళు అక్కరలేదు. ఇవే కళ్ళు ఇన్నాళ్ళూ ఇవే నాకున్నవి. ఇకపైనా ఇవే.

గాయపు కోత గెలుపుకి చిహ్నం. బ్రతుకున బాధల నలుపు మిగిలిన సుఖం, సంతోషం, శాంతి, తృప్తి వంటి ఇంద్రధనుస్సు రంగులకి తరగని వన్నెనిస్తుంది. పళ్ళెం అంచుకి తొగరు వంటివే ఈ భారపు గడియలు. ఆ చుట్టంచు నడుమనున్నదే ఈ అందమైన బంగరు పళ్ళెం, ఆరు రుచులనూ మనకు అందించే జీవితం. చాల్లే మెట్టవేదాంతం. వేదం సినిమా లో వాడు చెప్పలేదా "పెరుగువడలో పెరుగు ఉంటుంది కానీ పులిహోరలో పులి ఉండదు." అని. అలాగే బతుకులో ఎప్పుడూ ఏదో ఉంటుంది, మరేదో ఉండదు. ఉన్నవీ లేనివీ వెదుక్కోపోతే బతుకే లేదు. నాకు నేను దొరకనినాడు వాళ్ళూ వీళ్ళూ ఉండి లేనివాళ్ళే.

సరే మనసా, ఈ స్వగతాన్ని ఏమంటారు? మమెలీ ఇదేమిటీ, మమెలీ అంటే? మమ్ముట్టి మెమొరీ లీక్. ఏం నువ్వూ రోజూ ఏదో ఒక మెమరీలీక్ డీబగ్ చేయవా? అదేమిటి, అది కంప్యూటర్, పైగా ముందే తెలిసిన మాట "This Computer does what you tell it and not what you want it to do" అని. మనసు అంతేనోయ్ పిచ్చి పుల్లాయ్. నీ మాట వినే ఆ పిచ్చిదాన్ని పట్టుకుని "మనసు మాట వినదు" అంటావా.

అమ్మో, "గుర్రం ఎగరా వచ్చు, పక్షి పాకావచ్చు" అన్నారందుకే. ఇక పద, రౌతు చేతికి నిన్ను ఇవ్వకపోతే మనసా నన్ను ఎక్కడకి తీసుకుపొతావో ఇక. "ఏం మాయ చేసావే మనసా?" తెగ కంత్రీవి.

అదిసరే గాని, ఈ భాష, భాష్యం ఎవరికి అర్థమౌతాయి? అమ్మమ్మ గారు చెప్పారుగా మనిషిని పోలిన మనుషులు ఏడుమంది ఉంటారట. నాలాగే మరో ఆరుగురు ఉండాలిగా మరి. వాళ్ళు చాల్లే... అంతా కలిస్తే సప్తవర్ణ మమెలీ లు. మెలాంకలీలు. కథాకళీలు. ఎవరూ లేకపోయినా ఓకె. మనిషి మౌలికంగా ఒంటరి. వాడి గోడు వాడికి తెలియాలి. మనిషి తర్వాతి జాతి కనుక నా బోటి మమ్ముట్టికే తెలియాలీ మమెలీ ఘోష. సరే ఇక నీకూ నాకూ సుమారు ఒ నెల వరకు రాం రాం!
Categories: Right

సాపత్యం - budding poets

Wed, 06/16/2010 - 10:23
ఇవి నా ఆరోప్రాణం/ నా పాప లోని కవి కదలికలు. నా ఆనంద నర్తనం బహుశా ప్రతి తల్లికీ అనుభవమేనేమో! పిల్లది దాదాపు ఆరేళ్ళ వయసు నుంచీ రాస్తుంది [అంటే గత ఐదేళ్ళుగా..] తాజా రచన నుంచి పాతవి వరకు కొన్ని ఏరి వరసలో పెడ్తున్నాను.
  • లైఫ్ [తెల్సినవారి తండ్రి మరణవార్త విని రాసినది]
This is just like the life of a rose; it begins to bloom, such bright colors that we believe will last for days, but what we don’t observe is that very slowly and quietly the color start fading. Sadly the petals are falling; in only time the last of the petals fall.


పోయినేడు వసంత శోభని తను చిత్రీకరిమ్చుకున్న వైనం
లేక్ ఒడ్డున సాండ్ లో గడ్డి పూవు, సీతాకోకచిలుక, పక్కన మేపుల్ చెట్టు మీద పిట్ట, ముందున్న నీటిలో చేప

  • ఫిష్ - పాపం జలపుష్పాభిషేకం కొరకు రాసింది. తెలుగు మాత్రమే తీసుకున్నానని ఆపేసాను ఈ రచనని.

beneath the waters the fish lay
with all colors that shine all day
day is beauty and night is glory
fish are lively and fish in merry
all day long they jump and hop
no one can make them stop..

2009 ఎర్త్ డే కోసం తను గీసిన చిత్రం

  • Ocean

upon the ocean breeze we lay
among all the creatures of underneath
in hope to find what you search for
the one in which means the most
the heavens in which we most believe
is said to be at the horizon of the sea
  • మూన్
Moon shines so bright in the night,
Yet far too high in the sky.
I try to reach for it in the sky,
But miss and get a star instead
While it shines so bright,
I wonder will I ever touch it?

  • అమ్మ - ఇది నా మీద తన ఆరేళ్ళ వయసులో రాసిన మొదటి కవిత

Who tucks me in at night?
Who lets me use her perfume?
Who do I keep in my heart?
Who has deep eye?
Who else is a girl in my family?
Who is like a queen?
Who has black hair like me?
Who is smart in my family?
Who else do you think?
My mother

కనుక మేమిద్దరం కాబోయే కవులమన్న కలగంటున్నవారమే. ఇక నా నర్తనం తాలూకు గురుతిది..నా చేతి వేళ్ళకే పాదాల్లోని శక్తి వచ్చినంతగా ఉంది...ఇదంతా రాసినవి అవే కనుక వాటినే పెడుతున్నాను.

Categories: Right

పూపొదరిల్లు - పుస్తకలోకం

Sat, 06/05/2010 - 23:08
నా బెండ మొలకలు
తోట మొత్తం ఇక్కడ నొక్కి వీక్షించండి

"...భూమిలో ఉన్న చిన్నారి గింజ
మెడ బయటకు పెట్టి
మొదట వచ్చిన రెండాకుల్ని
చేతులుగా జోడించింది
కృతజ్ఞతతో " - గుంటూరు శేషేంద్ర శర్మ

తోట పనిలో ఉండే తాదాత్మ్యత అనుభవంలోకి వచ్చిన వారికి నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. నా వరకు జీవితంలో ఒక భాగం తోటపని. "నా పాతిక సంవత్సరాల శోధనలో దొరకని ప్రశాంతత తోటపనిలోనే లభ్యమైంది." అన్న ఒక సన్యాసిని మాటలు చదివాక నా నమ్మకం మరింత దృఢపడింది. నిజానికి ఇది ఆరాధనా లేక అభిరుచా అన్నది నేను చెప్పలేను. ఈ క్రింద చిత్రం ఇవాళ తెల్లారుఝామున తీసినది. ఆ ఉదయారుణ కాంతుల్లో మౌనమూర్తి నా తోటని చూస్తే తెలియని అనుభూతి.


ఏ నిశిరాత్రీ నిలవదు, ఇలా ఉదయారుణ ఆశగా పరావర్తించకా మానదు..
మా ఊర్లో మిణుగురులు ఈ ఋతువులో చాలా వస్తాయి..ఎన్నంటే చుక్కలన్నీ ప్రాణం పోసుకుని, దివికి దిగివచ్చి విహారానికి వచ్చాయేమోంతగా.. అలాగే ఇక్కడి కీచురాళ్ళు కూడా చాలా ఎక్కువ ద్వని చేస్తాయి..ఒక్కోసారి నిశిరాత్రుల్లో ఆటల పాటల తేలే ఆ జీవుల్ని చూస్తే నాకూ అలా మారిపోగలిగితేనో/పరకాయకాయ ప్రవేశం చేస్తేనో అనిపిస్తుంది.

నా బదులు తాము ఆ పని చేస్తున్నట్లు మొగ్గలన్నీ పూలై తలలాడిస్తాయి. మౌన గీతాలు పాడి మనసునలరిస్తాయి. నాకూ పేరు తెలియనన్ని ఈ మాదిరి గడ్డిపూలు నా చిన్నప్పటి నుంచీ నన్ను అబ్బుర పరుస్తూనే ఉన్నాయి.


గడ్డిపూల జాతర ఆపతరమా?
ఇక ఈ శోభాయామాన ప్రకృతిలోకి ఇక మీరెవరి పయనం వారే కానీయండి...

అన్నట్లు ఈ ఏడు నా తోటపని గూర్చి ఓ రెండు మాటలు. ప్రతి సంవత్సరం కొన్నైనా కొత్త రకాలు పెడతాను.

కూరగాయలు, దుంపల వరకు కొత్తవి tomatillo , ఈ కొత్త మొక్కేమిటో అని ఆసక్తి కలిగితే ఇదిగో ఇక్కడ చూడండి. ఐదారు రకాల చిలకడదుంప

ఇక కొత్త పూల రకాలు మీరు వచ్చి చూసి పేరు పేరునా పలుకరించి తీరాల్సిందే.

ఇంత చక్కని పూపొదరింట, కూరగాయల తోటలో అంతే చక్కని అనుభూతి ఇచ్చేదే పుస్తక పఠనం. కాదంటారా? కాకపోతే నాకు ఈ రెండు పనుల వలన ఎరిక మరిచిపోయేంత భాగ్యం కలుగలేదు, కనీసం ఆ దిశగా నేను నా మనసుని మలచలేదు కానీ ఈ పనుల్లో లీనమౌతూనే నేపధ్య సంగీతం మాదిరి నానమ్మ నాతో కలిసి చేసిన తోటపని జ్ఞాపకాలో, నాన్నగారు చదివించిన పుస్తకాల తాలూకు ఘడియలనో కలుపుతాను.


అలాగే నా తోట ప్రక్కనున్న చెరువులోని ఈ జలపుష్పాలకి రొట్టెలు తినిపిస్తూ.. ;)


మీనమా, నీ సొగసు చూడ తరమా?

ఈ ఏటి తాజా మొక్కలివిగో ఇక్కడ నొక్కి చూడండి. మీ మనసుకి నచ్చిన చిత్రమో, కాప్షనో తప్పక ఉండి తీరుతుంది. వచ్చే నాలుగు నెలల్లోనూ మరిన్ని ఫల పుష్ప చిత్రాలు ఇక్కడ చోటుచేసుకోనున్నాయి. ఇక గత ఐదేళ్ళవీ ఇక్కడ పదిలంగా ఉన్నాయి.

ఇంతవరకు ఏకకాలంలో ఒక రచనే చదివేదాన్ని.. ఈ మధ్యన అలా కాదని కొన్ని పుస్తకాల పఠనం ఒకసారే మొదలుపెట్టాను. అలవాటు కానిదైనా, ఆకళింపుకి వచ్చే వరకు నిదానంగా చదువుతున్నా ఈ పద్దతీ బావుంది. తోటలో కొత్త మొక్కల్లా, చదువులో ఈ కొత్తదనం అన్నమాట. ఏమి చదువుతున్నాను అంటారా?

ప్రతి వనమాలీ చదివే తీరాల్సిన పుస్తకం: The Education of a Gardner - Russel Page

వృక్షో రక్షతి రక్షితః - సీతారాముల్లా లేరు?
ఇక మిగిలిన పుస్తకాల మాట:

భ్రమణకాంక్ష - ఎం.ఆదినారాయణ
బాల [1945-1959] విహంగ వీక్షణ సంపుటి
ఖాళీసీసాలు - స్మైల్

Your Creative Power by Alex Osborn

The Road Less Traveled [Two parts] by M. Scott Peck

Things a Computer Scientist Rarely Talks About by Donald E. Knuth

ఈ చివరి పుస్తకం మీద సమీక్షలో రాయబడిన ఈ క్రింది వాక్యం అలా మనసు మీద పడిపోయింది.

God definitely wants people to be actively searching for better understanding of life's mysteries


అలాగే "Creativity, Spirituality, and Computer Science," ఈ మూడూ నా ఆసక్తులకి ఆనవాళ్ళు కనుకా ఈ పుస్తకం నా చేతిలోకి రావటం జరిగింది.

అలా ఏదో ఒక కారణం గా నా లోగిలి లోకి వచ్చిన ఇవన్నీ అచ్చుప్రతుల్లోనివి. ఇవికాక కొన్ని ఆన్ లైన్ రచనలు అలా అలా కలదిరిగి చదివేవీ ఉన్నాయి. కానీ, ఇది చదవండి అని కానీ, చదివినదాని మీద కానీ వ్యాఖ్యానించేంత శక్తి, సామర్థ్యాలు నాలో లేవు. ఇది చదివినవారు కొందరి దృష్టి అటు మళ్ళించటం తప్ప.

గువ్వపిట్ట - ఎదగటానికి గూడు చాలా?

ఏదో తెలిసీ తెలియని రాతలు ఇక్కడ పెడుతున్నా ప్రోత్సాహానికి మాత్రం కొరవలేదు. మరోసారి బ్లాగ్మిత్రులందరికీ కృతజ్ఞతలు. కానీ "ఇప్పటికీ నాకు రాయడం కన్నా మహానుభావుల రచనలు చదువుకోవడంలోనే ఆనందం ఎక్కువ. ఎందుకంటే మనం మన సొంత ఆలోచన అనుకున్నది ఎవరో ఎక్కడో ఎప్పుడో రాసే వుంటారు - శ్రీ రమణ" ఈ మాటలు చదివి సాలోచనలో పడనివారుండరేమో, నాలోను అదే. నా తోట కూడా ఈసారి మరీ ముద్దుగా మురిపిస్తుంది, వదలాలని లేదు. అందుకని మరి ... :)


కాలం నింపుతున్న కావడి బిందెలు
మనసు దుబ్బుల్లోకి తొణికితే,
కన్నీటి గంగావతరణం అన్నట్లే..

గతం నింపుతున్న లంకె బిందెలు
మనుగడలో పాతుకుపోతుంటే,
రేపు కొరకు అన్వేషణ సాగినట్లే..

అక్షరాల హస్తాల్లో గోరువెచ్చని స్పర్శ,
పదాల పాదాల్లో ఆనంద నర్తన,
వెదికే మనసుకి లేనిది ఏది..

ఈ ఏటి గార్డెన్ : http://picasaweb.google.com/ushaa.raani/2010#
మునుపటివి: http://picasaweb.google.com/ushaa.raani/MyGarden#
Categories: Right

కవులకే ప్రవేశం..

Fri, 06/04/2010 - 00:50
ఈ శీర్షిక చూసి కినుక వహించకండి మరి. కాబోయే కవులం అన్న ఆశగలవారం మేము. కాకలు తీరిన కవులు ఏదైనా చెప్తే వినాలనుకునేవారం. ఇక కవిత్వానికి గల అంశాలు ఎన్నున్నా భావ కవితలకి, అనుభూతి కవితలకి ఉన్నవి కొన్నే. అందులో అనురాగం, కలయిక, ఎడబాటు, విరహం, అలకలు తప్పనివి [నా వరకు]. అటుగా సాగినదే ఈ చిరు ప్రయత్నం.

అలాగే ప్రతి స్పందనకి మూలం ఒకటుంటుంది. బాంబే జయశ్రీ పాడిన ఈ ప్రణయ సంధ్య - మలయాళం పాట లోని మెలొడీ నన్ను వెంటాడుతూనే ఉంది. సుమారు మూడేళ్ళ క్రితం వచ్చిన ఈ పాటని గూర్చి ఆవిడ మాటల్లో "“The best song I have sung in recent times,” says Jayashri. “The song ‘Pranaya Sandhyayoru Vin Sooryan’ is a poignant melody. It haunted me for days..."

నాకు చదివి నచ్చిన కవితకి చిత్రం గీసుకోవటం అలవాటు. అందుకు వ్యతిరేకంగా నేను కొన్నేళ్ళ క్రితం గీసిన చిత్రం ఒకటి "విశ్వామిత్ర" లో వాడాను. అప్పట్లో ఆ చిత్రం మీద మంచి కవితలు వచ్చాయి. ఈ వసంత ఋతువులో ఓసారి అలా వ్యాఖ్యల్లో మిగిలిపోయిన వాటిని మీ ముందుకు తెద్దామని..మరి కొందరు ఆస్వాదించే వీలు కలిపిద్దామని..అలాగే మరెవరైనా ఇస్తే ఇక్కడ కలుపుదామనీను. నెనర్లు.

చిత్రం:

కొబ్బరిచెట్టుకి ఆనుకుని వున్న ఓ యువకుడు, నిండు పౌర్ణమి రేయిలో ఆ కొబ్బరాకుల వెనగ్గా వున్న చందమామ, ప్రక్కనున్న సన్నజాజి పందిరి ని ఆనుకుని స్వాప్నికావస్థలో వున్నట్లున్న యువతి. ఇరువురికీ నడుమ జాడలుగా పరుచుకునున్న వెన్నెల. వారిరువురి నడుమా పరుచుకునున్న ఆ కాంతి, ఒకరి నుండి ఒకరికి ప్రవహిస్తున్న అనురాగవాహినా అన్నట్లుగా వుంది.

*******************************
నా కవిత:

వెన్నెల్లో ముంచితీసిన సన్నగాలి కలాలు
కొబరాకు పత్రాలమీద నీకు లేఖలు లిఖిస్తే
చందురూడు నిన్ను కాంచి నివ్వెరపోయాడో
నీ మది దోచిన నను చూసి సంబరపడ్డాడో
సన్నజాజి వూగిసల చిరుస్వరాలు
నీ చెవి జూకాలకి సాటి అంటుంటే
నీకంటి కలల వర్ణాలు నా కలలసౌధానికి
మంచి గంధపు దూపాలు చదివిస్తుంటే
చెలియా నిను చేరిన ఈ ఇహం మరిచి
నా అహం విడిచి మళ్ళీ నీకు అర్పితమవనా?
సఖీ, నీదని నాదని ఏదీ లేదని తెలిసినదేదో,
మనది కానిదేదీ వలపు కాదనీ తెలిపినది

*************************
శ్రీలలిత

అమృతం వెన్నెల జల్లులా కురిసిన ఆ రాత్రి
వ్యక్తిత్వమే వెన్నుగా నిలబడిన ఆ మనోహరుని ఎదుట
సన్నజాజిలోని సన్నదనం, లాలిత్యం, మురిపెం, మోహం
ఆతనిని అల్లుకోవాలనే ఆశని ఒకటికి రెండింతలు చేస్తుంటే
స్త్రీ సహజసిధ్ధమైన సిగ్గు ముందుకెళ్ళడానికి మొగమాటపడితే
గ్రహించిన ఆ యువకుడు అందుకోవాలి కదా
ఆమె హృదయం లాంటి హస్తాన్ని...

ఎంత ఖేదం.. చెప్పరమ్మా మీరైనా వెన్నెల జల్లులు
ఊరుకున్నారేంటమ్మా కొబ్బరాకులు
అసలే సన్నజాజి గొంతు సన్నది
అయినా వినవలసింది హృదయాన్ని కదా...
ఇంకా ఎందుకీ వెనక ముందాటలు...

ఎంత దుర్మార్గమీ లోకం
అందరూ కన్నయ్య పక్షమేనా
ఏమిచ్చాడమ్మా మీకు
దొరికీ దొరకక ఊరించడం తప్ప...

సమయమేదీ సన్నజాజికి
తెల్లవారితె వాడిపోదా
ప్రభుని పాదాల వాలక
ధూళిలోనే కలుస్తుందా...

గొప్ప నోములే నోచిందిగా
తీవ్ర తపస్సే చేసిందిగా
ఇన్ని యేళ్ళు వేచి
ఇపుడు ఇంకా ఎదురుచూపేనా...

*************************
ప్రదీప్:

నారిని చూస్తూ నారికేళవృక్షానికి ఆనుకున్న నవయువకుడు
వెన్నెల వెలుగుల నీడలో సన్నగాలులు వీస్తూ ఆ వృక్షం
ఆ సన్నగాలికి కలయా నిజమా అని తెలియని మధురానుభూతిలో
ఎదుటపరుండిన సమ్మోహన సుందరాంగి
మన్మధుని విల్లుకైనా లొంగని అనిర్వచనీయ ప్రణయధ్యానంలో మునిగిన జంట
ఆ దృశ్యాన్ని చూచి భూమే పరవశమున మందగమనాన కదిలిందేమో
పున్నమి వెన్నెలకేనా ఈ భాగ్యమని
కన్నుకుట్టి దూసుకువచ్చే సూరీడుని ఆపే భూగమనం

ఎంతమందిని చూడలేదో ఇలాటి జంటలను ఆ పున్నమిరేడు
నారి - నారికేళం - పురుషుడు
నారి - సంద్రపుఅలలు - పురుషుడు
నారి - పర్వతశిఖరం - పురుషుడు
నారి - నదీతీరం - పురుషుడు
ప్రాంతమేదైనా, ఆ ఇరువురి నడుమ ప్రేమ పదిలమే ఆ వెన్నెల పందిరిలో

******************************************
భా.రా.రె:
నిండు పున్నమి రేపిన తాపము
యువతి మనమున రేగిన మోహము
మోహ విచలిత విరహ జవ్వని
తనువున రేగెను ఆరని మంటలు

ఆరని మంటల రేగిన జ్వలితము
వెన్నెల దారుల తోరణ మాలిక
రెప రెపలాడెడి కన్నియ మనసు
వింతగ వీచే మన్మధ గాలులు

మరువపు గాలుల చిందిన నీళ్లు (కొబ్బరి)
చిరు జల్లుల తడిసిన "విశ్వా"సము.

మన్మధిని వలలో లేడికూన చిక్కిందా
సన్నజాజి మరుల మన్మధుడు మధనపడ్డాడా?

************************************

Categories: Right