http://harephala.wordpress.com/feed/

Syndicate content PHANI BABU  -musings
Updated: 20 min 29 sec ago

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అద్గదీ ఇలా ఉండాలి!

Tue, 06/15/2010 - 02:21

Amalapuram High School

పేద్ద పెద్ద మార్కులు తెచ్చుకోవాలంటే నారాయణలు,చైతన్యలు,ఆదిత్యలే అఖ్ఖర్లేదని నిరూపించింది, నేను చదివిన అమలాపురం లోని మా పాఠశాల.నన్ను ఆకోవలోకి చేర్చకండే !!!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- పుట్టిన రోజు

Mon, 06/14/2010 - 13:07

    మా బంగారు తల్లి నవ్య నాలుగవ పుట్టినరోజు 15-06-2010 న. ఈ నెల 17 నుండి లోయర్ కేజీ లోకి వెళ్తుంది.రోజులెంత త్వరగా గడిచిపోతాయో! ఇంకా నిన్న మొన్నటిదాకా చిన్న పాపలాగే ఉంది.అప్పుడే ఓ తమ్ముడికి అక్క అయింది.అందరూ వాడినే ముద్దు చేస్తూంటారని కోపం,అలకా వచ్చేస్తూంటాయి.రైల్వే వాళ్ళ ప్రకటనలలాగ తెలుగు,హిందీ,ఇంగ్లీషుల్లో ఏమిటేమిటో
చెప్పేస్తూంటుంది!మాట మాత్రం చాలా స్వఛ్ఛంగా ఉంటుంది. వాళ్ళ నాన్న, అమ్మలకంటె తెలుగు బాగా మాట్లాడుతూంటుంది.

    నేను టి.వీ. పెట్టుకునేదే తక్కువ.పెట్టగానే మాత్రం ఎక్కడినుండో వచ్చేస్తుంది, ‘ తాతయ్యా, హమేభీ దేఖ్నేదోనా,కార్టూన్’ అంటూ.నేను పెట్టుకున్నప్పుడే ఎందుకు వచ్చేస్తావూ అంటే
‘నాకు చాలా మజా వస్తుంది, మిమ్మల్ని అడగడం’ అంటుంది. ఇంకేం చేస్తాను? సరెండర్ అవడం తప్ప. ఇంక ముందుముందు తనూ, తన తమ్ముడూ ఏం ఆడుకుంటారో నాతో !!

God Bless her !!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–నాకు నచ్చిన ఒక వ్యాసం.

Sun, 06/13/2010 - 14:11

dear daddy..

ఆదివారం ఆంధ్రభూమి లో ‘డాడీ’ ల గురించి శ్రీ వి.ఎస్.ఎన్. మూర్తిగారు వ్రాసిన ఒక వ్యాసం. మీరూ చదవండి.


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–’ఆట’–మానవ హక్కుల కమిషన్

Sat, 06/12/2010 - 09:13

   మొత్తానికి మన వాళ్ళకి కూడా సమాజం పట్ల బాధ్యత అనేది ఒకటి ఉన్నట్లు, మానవ హక్కుల సంఘం ఛైర్మన్ శ్రీ సుభాషణ రెడ్డి నిరూపించారు. ఇన్నాళ్ళకి ఓ మంచి న్యూసు విన్నాము.అసలు, ఆ పిల్లల్ని కాదు, వాళ్ళని అలాటి కార్యక్రమాలకి పంపే తల్లితండ్రుల్ని కూడా శిక్షిస్తే ఇంకా బాగుంటుంది. కాని ఇంకొ విషయం కూడా గమనించాలి- ఈ కార్యక్రమం కాకపోతే ఇలాటి ఇంకో ‘ ఘర్షణో’, ‘సింగినాదమో’ కార్యక్రమానికి పంపుతారు.

    దేశం మొత్తం మీద ఏ చానెలూ ఇలాటి కార్యక్రమం నిర్వహించకుండా ఉండేలా చూడాలి, అప్పుడే ఈ జడ్జిమెంటుకు విలువ ఉంటుంది. ఒకవైపున ‘బాల కార్మికుల హక్కులూ’ అంటున్నా, చిన్న పిల్లలని పనుల్లోకి పంపడం చూస్తున్నాము.
బాణాసంచా తయారుచేసే పరిశ్రమల్లో ఎక్కువగా పిల్లల్నె చుస్తూంటాము.

   మహారాష్ట్ర లో ‘ బార్ గర్ల్స్’ బ్యాను చేశారు, ఏమయ్యింది? వాళ్ళందరూ, మిగిలిన రాష్ట్రాల్లోకి వెళ్ళారు. అలాగే వీళ్ళుకూడా మిగిలిన కార్యక్రమాల్లోకి వెళ్తారు.ఆ కార్యక్రమ నిర్వాహకుల్ని ఈ జడ్జిమెంటు మీద, రియాక్షన్ అడిగితే, ‘మాకు జడ్జిమెంటు కాపీ రాగానే చూస్తామన్నారే’ కానీ,ఓ పశ్చాత్తాపం లాటిది కనిపించలెదు.

   ఇలా నిషేధాలూ వగైరా కాకుండా, కేంద్ర ప్రభుత్వమే ఓ చట్టం చేస్తే ఇంకా బాగుంటుంది. మనదేశంలో చట్టాలలాటివి చాలా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. ఈ వార్త ఈ వారం పదిరోజులూ హెడ్ లైన్లలో ఉంటుంది, రేపు పేపర్లలో హోరెత్తించేస్తారు, ఆ తరువాత ‘శ్మశాన వైరాగ్యం’ లాగ మళ్ళీ మొదలౌతుంది. ఎక్కడో అనిపిస్తోంది- ఇదంతా ‘సెన్సేషలైజేషన్’ లోకి వస్తుందేమో అని.తల్లితండ్రులకి ఉండాలి కానీ, ఈ చట్టాలూ చట్టుబండలూ ఏం చేస్తాయి?
చూద్దాం మొత్తానికి , ఓ ప్రారంభం అయితే అయింది.


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఒప్పుకోవలసిన నిజాలు-2

Thu, 06/10/2010 - 13:39

   నేను నిన్న వ్రాసిన పోస్టు వలన కొంతమంది అపార్ధం చెసికున్నట్లు కనిపించింది.అవన్నీ మా ఇంట్లో జరుగుతున్న నా అనుభవాలు కాదండి బాబూ. హైదరాబాదునుండి వస్తున్నప్పుడు, నేను ఓ పెద్దాయనతో చెసిన సంభాషణలొని విషయాలు అని గమనించాలి దయచేసి. ఆయన తన వయస్సునుబట్టి ప్రపంచంలో చాలామంది ఇళ్ళల్లో, అదీ భార్యాభర్తలు కాక అత్తమామలైనా,తల్లితండ్రులైనా వారితో కలసి ఉండేటప్పుడు జరిగే విషయాలు.

    ఇదివరకటిరోజుల్లో ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు, ఇంటి పెద్ద మాటే చెల్లేది.కారణాలు ఎన్నో కావచ్చు.మొదటిది, ఆ రోజుల్లో పెద్దవారంటే ఉండే గౌరవం కావచ్చు. ఆస్ఠి అంతా ఆ పెద్దాయనపెరునే ఉండిఉండొచ్చు.ఊరికే దెబ్బలాటలు పెట్టుకుంటే, ఆస్థి ఇవ్వరేమో అనే భయం అవొచ్చు.అప్పుడైనా ‘అండర్ కరెంట్స్’ ఉండేవి.ఓ కొడుకు బాగా సంపాదించేవాడయుండొచ్చు,ఇంకోడు సామాన్య ఉద్యోగి అయిఉండొచ్చు. ఓ కోడలు పేద్ద కట్నంతో వచ్చుండొచ్చు,ఇంకో కోడలు సామాన్య కుటుంబంలోంచి వచ్చుండొచ్చు.

   కాలక్రమేణా రోజులు మారేకొద్దీ, ఎవరి కాపురాలు వాళ్ళు పెట్టుకున్న తరువాత అందరూ సుఖపడ్డారు. విడిగా ఉండడంలో ఉన్న సదుపాయాలు ఇటు తండ్రులకీ తెలిసింది, అటు కొడుకులకీ తెలిసింది.ఎవరి స్పేస్ వారికున్నప్పుడే అందరికీ హాయి. గ్రౌండ్ రియాలిటీస్ అర్ధం చేసికున్నంత కాలం, ఎవరు ఎక్కడున్నా ఒక్కటే. ఊరికే సొసైటీ కోసం ‘ఉమ్మడికుటుంబం’ లో ఉండి బి.పీ లు పెంచుకోవడంకన్నా విడివిడిగా ఉంటే, వారానికో,పదిహెను రోజులకో కలిసినప్పుడు, ఆత్మీయంగా ఉంటారు.మనవలూ,మనవరాళ్ళూ తాతయ్యా అంటూ పలకరిస్తారు.

   అలాగని పిల్లలు అంటే కొడుకులూ,కూతుళ్ళూ రాక్షసులనీ, పెద్దవాళ్ళంటే గౌరవం లెనివారనీ కాదు. వారి కష్టాలు వారికీ ఉన్నాయి.ఉదాహరణకి ఇంట్లో చదువుకునే పిల్లలున్నాసరే, వారి వారి కార్యక్రమాలకి అడ్డుండకూడదు.టైమయ్యేసరికి
టి.వీ ముందర సెటిల్ అయిపోతారు.అందులో కథ ఎంతదాకా వచ్చిందో తెలిసికోకపోతే నిద్ర పట్టదు. పోనీ మర్నాడు పిల్లలు స్కూలుకి వెళ్ళిన తరువాత తీరికగా చూడొచ్చు కదా.కొడుకు ఇల్లూ, తమకి అధికారం ఉందీ అనే అనుకుంటారు. పిల్లలు చదువు మానేసి మామ్మ, తాతయ్యలతో టి.వి. చూస్తూకూర్చుంటానంటే ఎలా కుదురుతుందీ? అసలు గొడవలన్నీ ఈ టి.వీ ల వల్లే వస్తున్నాయి.పిల్లలకి కార్టూన్లూ, పెద్దవాళ్ళకి సీరియల్సూ, పెద్దాయనకి న్యూసూ కావాలి. మరి ఒకే ఇంటిలో ఇన్ని రకరకాల చాయిస్ లు అయితే, అక్కడ కొట్టుకోకుండా ఉంటారని ఎలా అనుకుంటాము?మరి కోడలుకి చిర్రెత్తిందంటే చిర్రెత్తదూ? ఈ పెద్దాళ్ళు మహా ఉంటే ఇంకో పదిహేనేళ్ళుంటారు, పిల్లల భవిష్యత్తు తల్లేకదా చూసుకునేది.

   ఇంట్లో పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి, ఈ పెద్దాళ్ళు తమకి తెలిసున్న కషాయాలూ, రసాలూ వాడితే చాలని ఊదరకొట్టేస్తూంటారు. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అంటే ఎలాగ? వీళ్ళని నమ్ముకుని, డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళకపోతే అంతే సంగతులు! ఈ మాత్రం తెలియదనుకోవడానికి వీల్లేదు, వాళ్ళ పెద్దరికం చూపించుకోడానికి ఉచిత సలహాలిచ్చేస్తూంటారు. పోనీ అలాగని వాళ్ళకేమైనా వచ్చిందంటే, డాక్టరుదగ్గరకు తీసికెళ్ళేదాకా ఇల్లు పీకి పందిరేసేస్తారు, అప్పుడు రసాలూ,కషాయాలూ మర్చిపోతారు, ‘తమదాకా వస్తే’ రూల్స్ మారిపోతాయి. పైగా ఎన్ని టెస్టులు చేయిస్తే అంత బాగా చూసుకున్నట్లు!లేదూ, ‘ మావాడికి పాపం వైద్యం చేయించాలనే ఉంటుంది, కానీ మా కోడలు సాగనివ్వదు’అంటూ అడిగినవాళ్ళకీ, అడగనివాళ్ళకీ చెప్పుకొస్తారు. కూతురు కూడా అదే ఊళ్ళో ఉంటే ఇంకా కాలక్షేపం!

    ఈ రోజుల్లో నగరాల్లో అయినా పట్టణాల్లో అయినా, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తే, పిల్లలకి మంచి చదువులు చెప్పించొచ్చు,అన్ని సదుపాయాలూ సమకూర్చుకోవచ్చు. కోడలు ఉద్యోగానికి వెళ్తానంటే, ముందర అబ్జెక్షన్ పెట్టేది అత్తగారే!
‘నాకు ఓపిక లేదమ్మోయ్, నీ పిల్లల్ని చూడ్డానికి’ అని ఖరాఖండీగా చెప్పిన వారిని చూశాము.వీళ్ళు అవసరానికి పిల్లలకి ఉపయోగించకపోతే, వాళ్ళేదో వీళ్ళని చూడ్డంలేదూ అని ఏడవడం దేనికో? పోనీ అని పిల్లల్ని ఏ క్రెచ్ లోనో పెట్టి,ఉద్యోగానికి వెళ్ళడానికే డిసైడ్ అయిందా, ఇంక చూసుకోండి, ఈ అత్తగారనే ప్రాణి,తనకి వీలైనన్ని రకాల ‘థర్డ్ డిగ్రీ మెథడ్సూ’ ఉపయోగిస్తుంది.సాయంత్రం కోడలొచ్చేసరికి, ఓ గిన్నెతో అన్నం వండి, ఏ వేపుడో చేస్తే ఈవిడ సొమ్మేంపోదు,
అయినా సరే, తనకేం పట్టనట్లే కూర్చుంటుంది.అలాటి అత్తగార్లని ఛాన్సొస్తే ఏ కోడలు వదుల్తుందీ?ఇంట్లో ఉన్న మామగారు ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ తనకే తెలిసున్నట్లూ,అసలు తన సలహా లేనిదే, గ్రహాలు గతి తప్పుతాయన్నట్లూ ప్రవర్తిస్తారు.అడిగినా అడక్కపోయినా ఉచిత సలహాలు ఇచ్చేస్తూంటారు.ప్రస్తుత ప్రపంచం,తన రోజుల్లాలెదని ఓమారు జ్ఞాపకం చేసికుంటే ఎవరికీ ఏ సమస్యా ఉండదు. ఏదో ‘ ఆయనే ఉంటే…..’అన్నట్లు ఆమాత్రం ‘సంఝోతా’ ఉంటే ఈ గొడవలన్నీ ఎందుకు వస్తాయి?

    కలిసే ఉండవలసిన పరిస్థితే వస్తే,ఎవరైనా అడిగితేనే కానీ సలహా ఇవ్వకూడదు. జరిగేవి జరక్క మానవు, ఊరికే కంఠ శోష తప్ప ఒరిగేదేదీ లేదు.ఎవరి పిల్లల్ని ఎలా పెంచుకోవాలో వాళ్ళకే వదిలేస్తే ఎంతో హాయి.మన పిల్లల్ని మనక్కావలిసిన పధ్ధతిలోనే పెంచుకున్నప్పుడు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళేం చేసికుంటే వీళ్ళకెందుకంట?

   అందుకనే నేను నిన్న వ్రాసిన బ్లాగ్గులో మొదట్లోనే చెప్పాను- ఎవరి దృష్టికోణాన్ని బట్టి వారు ఆలోచిస్తారు.ఇలాటివాటికి పుస్తకాలు చదివితేనూ, బ్లాగ్గులు చదివితేనూ, కౌన్సెలింగులకి వెళ్తేనూ సొల్యూషన్సు రావు. వీధిన పడకూడదనుకుంటారా
హాయిగా విడివిడిగా ఉండాలి.అంతేకానీ, ఎదో పాయింటు ప్రూవ్ చేద్దామని కలిసే ఉండడానికి ప్రయత్నిస్తే ఎప్పుడో ఒకప్పుడు చిన చిన్న అపార్ధాలు తప్పవు. అలాగని ఒకే ఊళ్ళో, పిల్లలోచోటా, తల్లితండ్రులోచోటా ఉంటున్నారంటే వాళ్ళకేదో గొడవొచ్చిందనికాదు. దీన్ని ‘ ప్రివెంటివ్ మైంటెనెన్స్’ అంటారు.


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఒప్పుకోవలసిన నిజాలు

Wed, 06/09/2010 - 13:08

    ట్రైనులో కలిసిన పెద్దాయనతో చెప్పిన కబుర్లలో,ఎన్నెన్నో విషయాలు ఓ కొత్తకోణంలో అర్ధం చేసికోకలిగాము. ఉదాహరణకి కొడుకూ,కోడళ్ళతో జీవించడం గురించి. ఆయన చెప్పిన వాటిలో అతిశయోక్తి ఏమీ ఉన్నట్లు అనిపించలేదు.ఎంతో అనుభవంతో చెప్పిన నిజాలు అవి. కొంతమందికి నచ్చకపోవచ్చు.కొంతమంది అనుకుంటారు’ ఎంత కరెక్టుగా చెప్పారో’అని. మనం ఆలోచించే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది.కానీ అవన్నీ పచ్చినిజాలు.ఇప్పటి వాళ్ళనే అనఖ్ఖర్లేదు.మనమూ అలాగే చేశాము.ఇంకోళ్ళెవరో పాయింటౌట్ చేసేటప్పటికి ‘ భుజాలు తడుముకుంటాము’.

    పెళ్ళి అయినప్పటినుండీ ప్రతీ కుర్రాడికీ, ఓ మైకం కమ్మేస్తుంది.ప్రతీదానికీ కళ్ళు మూసేసుకుంటాడు.పెళ్ళి అయిన తరువాత, ‘మంచిమనసులు’ సినిమాలోని పాట ‘ కనులు లేవని కలతపడవలదూ, నా కనులు నీకనులు చేసికొని చూడూ’ శిలలపై శిల్పాలు చెక్కినారూ పాటలో ఓ చరణం ఇది.అక్కడ జానకి కి కళ్ళులేవని, నాగేశ్వర్రావు ఈ పాట పాడాడు, ఇక్కడ పెళ్ళి అయిన తరువాత ప్రతీ భార్యా పాడే పాట ఇది.!

    ఏ విషయం తిసికోండి, భార్య సలహా లేనిదే ఏ పనీ అవదు.ఓ ఇల్లు కట్టుకుందామనుకుంటే, అదేమి చిత్రమో అత్తారి ఊరులోనే స్థలాలు కనిపిస్తాయి.నూటికి 50 మందిదాకా అత్తవారి ఊరులోనే ఇల్లు కట్టడమో, కొనడమో చేస్తారు. తల్లితండ్రులున్న ఊరిలో కొందామంటే, వాళ్ళు ఏమైనా ఆక్రమించేస్తారో అని భయం అనండి,లేకపోతే, ఏ కారణం చేతైనా వాళ్ళీ ఇంట్లోకి వస్తే
అద్దె అడగడం బాగోదనండి, ఇంకేదీ కాకపోతే ఇల్లు కట్టేటప్పుడు మామగారితో సంబంధబాంధవ్యాలు ఇంకా మెరుగౌతాయనో, ఏవేవో కారణాలవల్ల అత్తారి ఊరిలో సెటిల్ అయిపోతాడు.

   ఇంట్లో మనవడో,మనవరాలో ఉందనుకోండి,ఇంక అన్నీ గొడవలే ప్రతీదానికీ,అలాగని ఏదో ప్రాణాంతకమనికాదు. పిల్లలు తినే తిండి దగ్గర– కోడలేమో ఆ పుస్తకాలూ, ఈ పుస్తకాలూ, నెట్లూ
చదివి ఏదో ప్రొటీన్లూ,కార్బోహైడ్రేట్లూ అంటూ ఆకులూ, అలమలూ, బ్రెడ్డూ,బటరూ, కార్న్ ఫ్లేక్సూ, పాలూ,పాపాలూ అంటూ పిల్లల ప్రాణాలు తీసేస్తుంది. అవన్నీ డెఫినెట్ గా ఆరోగ్యకరమైనవే కాదనం, వాళ్ళు అవన్నీ తింటూంటే ఈ పెద్దాళ్ళు కూరలూ,పచ్చళ్ళూ,ఊరగాయలూ వేసికుని తింటే ఎలా? మార్కెట్ కి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని కూరగాయలు అసలు తీసికునే రారు, కూరలే లేకపోతే గొడవే లేదు.ఎప్పుడైనా సరదా పడి ఆ పిల్లలకి ఏదైనా పెట్టామా,ఇంక చూసుకోండి ‘ మావయ్యగారూ, పిల్లలకి లేనిపోని అలవాట్లు చేయకండి, అసలే వాడు వీక్కూ, దానికి సాయం మీతో ఊరగాయా అవీ తింటే వాడికి కండెప్పుడు పడుతుందీ’అంటుంది. ఈయననుకుంటాడూ, ఒక్కరోజు ఊరగాయ తింటే వచ్చిన నష్టం ఏమిటంట? ఏరా అబ్బాయీ, ఇదేనా పధ్ధతీ పెద్దాళ్ళతో మాట్లాడడం అని మీ ఆవిడకోసారి చెప్పు అంటాడీపెద్దాయన.

    స్కూలికి వెళ్ళే పిల్లలుంటే ప్రతీ రోజూ వాళ్ళ దినసరి కార్యక్రమాలు చూసి ఈ పెద్దాళ్ళకి గుండె చెరువైపోతూంటుంది.స్కూలూ, ట్యూషన్లూ, మ్యూజిక్ క్లాసులూ, డ్రాయింగు క్లాసులూ,ఇంకో క్లాసులూ. రోజు రోజంతా ఇవన్నీ అవసరమా అని ఈ పెద్దాయన అన్నాడనుకోండి, ఆ కోడలంటుందీ ‘ ఈ రోజుల్లో ఆల్ రౌండ్ డెవెలప్మెంటుకి ఇవన్నీ కావాలీ, మీ రోజుల్లోలా కాదుగా’అని.
ఇదివరకటి రోజుల్లోలాగ ఏదో మామగారంటే భయం,భక్తీ ఉండాలనడం లెదు, మరీ చిన్న పిల్లలెదురుగుండా క్లాసు తీసికోవలసిన అవసరం లేదుకదా అనుకుంటాడీ పెద్దాయన. ఇంత గొడవౌతున్నా
ఈయనగారి కొడుకు ( భార్య కనులే తన కనులుగా చేసికొని లోకాన్ని చూస్తున్న హీరో), ఏమీ పట్టనట్టుగా హాయిగా తన రూంలోకి వెళ్ళి ఏదో పేద్ద పనున్నట్లు, ల్యాప్టాప్ ఓపెన్ చేసేసికుని
కూర్చుంటాడు.
ప్రాణానికి హాయి. వాళ్ళమానాన్ని వాళ్ళే కొట్టుకుంటారు,ఓపికున్నంతసేపూ అనుకుంటాడు, తనేమైనా ఆర్చేవాడా తీర్చేవాడా?

    ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని ఏమీ అనకూడదు. వాళ్ళేం చేసినా నోరుమూసుకిని కూర్చోవాల్సిందే. హాల్లో బాల్ తో ఆడితే, ఏ టి.వీ మీద పడుతుందో అని ఈ పెద్దాయనకి భయం, పోనీ వద్దురా అని చెప్తే ఆ పిల్లాడెలాగూ వినడు, పైగా కోడలికి కోపం వస్తుంది.వాయిస్ పెంచితే తప్పు,ఏక్ దం లో డెసిబుల్ లోనే చెప్పాలి, అంత ఓపికెక్కడిదీ ఈయనకి.వీళ్ళిద్దరి బి.పీ పెరిగిపోతుంది.ఈ పిల్లలు మెళుకువగా ఉన్నంతసేపూ, టి.వీ లో పిల్లలకి నచ్చిందితప్ప ఇంకే కార్యక్రమమూ చూడకూడదు. ఇంట్లో ఎన్ని టి.వీ లున్నాసరే ,కారణం ఈ పిల్లలు కూడా తాతయ్యలూ, నానమ్మలూ చూసే టి.వీ దగ్గరకే వచ్చి ఒళ్ళో కూర్చుంటారు! రోజంతా టి.వీ చూస్తూనే ఉంటారుకదా, పోనీ పిల్లలు ఇంటికి వచ్చేక, వాళ్ళకి కావలిసిందేదో చూడనివ్వక ఊరికే గొడవా అని విసుక్కుంటారు.

    ఇవి కాకుండా ఈ మధ్యన ప్రతీవాళ్ళూ తమ పిల్లలకి, ఐపాడ్లూ అవీ విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నారు. ఆ పిల్లా/పిల్లాడి వయస్సు ఎంతైనా సరే. దీనితో ఏమౌతోందంటే, ఇవన్నీ రాకముందు పిల్లలు, ఏ పుస్తకమో, బుక్కో చదువుకునే వారు, ఇప్పుడు ఈ ఐపాడ్లు వచ్చినతరువాత, ఆ అలవాట్లు అన్నీ పోయాయి.ఐపాడ్డే లోకమైపోయింది.పొనీ ఇంకో రెండుమూడేళ్ళు పోయిన తరువాత ఇవ్వవలిసిందేమో అని ఈ పెద్దాయన అనగానే, ‘ మావయ్యగారూ, మీకేం తెలియదు, దీని ఫ్రెండ్సందరిదగ్గరా లేటెస్ట్ గాడ్జెట్స్ ఉన్నాయీ, దీనిదగ్గర లేకపోతే చిన్నబుచ్చుకుంటుంది’
ఇంకొన్ని ఇంకోరోజు…..


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- Hyderabad Trip-2

Tue, 06/08/2010 - 13:43

    పెళ్ళిలో మా చుట్టాలు చాలా మందిని కలుసుకోగలిగేము. అన్నిటికంటె ముఖ్యం శ్రి అవధాన్లు గారితో పరిచయం. సిఖ్ విలేజ్ లో పెళ్ళి హడావిడి అయిన తరువాత,ఎస్.ఆర్.నగర్ లో మా మరదలునీ,అత్తగారినీ కలుసుకుని కాచిగూడా వచ్చేశాము.ఈ తిరుగుళ్ళన్నీ ఆటోల్లోనే వెళ్ళాము.భాగ్యనగరం రోడ్లమీద వెళ్తూంటే ప్రాణాలు అరచేతిలోనే ఉన్నాయి. ఎక్కడినుండి ఎవడు వచ్చి కొట్టేస్తాడో అని భయమే. ఆదివారం నాడే ఇలా ఉంటే ఇంక మిగిలిన రోజుల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

    రాత్రి 10.45 కి బయలుదేరే పూణే ఎక్స్ ప్రెస్ లోనే రిజర్వేషను దొరికింది. నాకు మామూలేగా -ఇద్దరికీ పై బెర్తులే దొరికాయి.పాపం ఒక అబ్బాయి మా బెర్తు లోకి మారడానికి ఒప్పుకోవడంతో, ఇద్దరమూ సైడు బెర్తుల్లో సెటిల్ అయిపోయాము! మరీ 11.00 గంటలు దాటిపోవడంతో, ప్రక్కవాళ్ళు బ్రతికి పోయారు, నా కొత్త పరిచయాల అభియాన్ నుంచి! పోన్లే ప్రొద్దుట చూసుకోవచ్చూ అనుకున్నాను.

   మర్నాడు ప్రొద్దుటే 8.30 దాకా కాఫీ,చాయ్ లాటిది దొరక్క చాలా బాధపడిపోయాను.ఈ ట్రైనుకి ప్యాంట్రీ కారు లేదు,ఎక్కడా (మరాఠ్వాడ) ఏమీ దొరకదు.మొత్తానికి ఒకడొచ్చాడు చాయ్ తీసికుని, ఓ మిల్లి కప్పు లో చాయ్ 5 రూపాయలన్నాడు,ఓ గుక్కకి కూడా సరిపోలేదు,గొంతుకకూడా తడవలేదు! ఇంకో కప్పు తీసికోవాలిసివచ్చింది. కప్పు మరీ 10 రూపాయలంటే ఎవరూ తీసికోరేమో అని, ఎలాగూ రెండు కప్పులు తీసికుంటారులే అని ఈ పధ్ధతి మొదలెట్టినట్లున్నాడు!

    ఇంతలో ఓ పెద్దాయన వచ్చి, అరే మీది అమలాపురం ట కదూ అని పలకరించారు. అవునండీ అని చెప్పి ఆయనతో ఖబుర్లు మొదలెట్టాను.ఆయన వయస్సు 80 కి పైనే. అలాటివారితో మాట్లాడుతూంటే ఎన్నెన్ని విషయాలు తెలుస్తాయో అప్పుడు తెలిసింది. ఆయనదీ గోదావరి జిల్లాయే. కాకపోయినా ఖబుర్లు చెప్పేవాడిననుకోండి, అయినా ఇదో బోనస్సూ, ఎందుకంటే చాలా కామన్ విషయాలుంటాయి. పాతవన్నీ అందులోనూ నేను పుట్టడానికి 15 సంవత్సరాల ముందు విషయాలు తెలిసికోవడం ఇంకా బాగుంటుంది. పుస్తకాల్లో చదివినవే అయినా, లైవ్ లో చాలా ఆసక్తిగా ఉంటాయి.

    ఆయన కొంతకాలం రాజమండ్రి లో చదివారుట- శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారి దగ్గర. వారు చదువుచెప్పే పధ్ధతీ అవీ వింటూంటే చాలా బాగుంది.ఈయన అంటె నాకు పరిచయం అయిన ఇరిగేషన్ విభాగంలో ఎస్.ఈ. గా పనిచేశారుట. పోలవరం ప్రాజెక్టు 40-50 సంవత్సరాలక్రిందటే ప్లాన్ చేశారుట. దాని ప్రాజెక్టు రిపోర్టూ అవీ, పూణే లోని సెంట్రల్ వాటర్ ఎండ్ పవర్ కమిషన్లో చూడొచ్చుట.

    ఆయనకి రెండు చెవులూ పాడైపోయాయి. ఒకచెవి అయితే పూర్తిగా వినిపించదు, రెండో చెవి సగమే వినిపిస్తుంది. కారణం చెప్పారు- ఎవరో వారి మనవడికి ఏదో ఖరీదైన గిఫ్టిచ్చారు.దానికి ఇయర్ ఫోన్లూ అవీ ఉన్నాయిట. స్టెతస్కోపు లాటిదనుకుంటా, చిన్న పిల్లాడికి ( ఏణ్ణర్ధం వాడు) ఇయర్ ఫోన్లు పెద్దవైపోయాయని, ఈయన వాటిని తన చెవిలో పెట్టుకుని వాడిని ఆడిస్తున్నారుట. ఆడుతూ ఆడుతూ దేన్నో నొక్కగానే, చెవిలో పెట్టుకున్న ఇయర్ ఫోన్లు (రెండు చెవుల్లోవీ) స్ప్రింగ్ యాక్షన్ తో, చెవిలోని డయాఫ్రం ని చిల్లు చేసేశాయిట.బొటబొటా, రక్తం కారిపోయి, దాన్ని ఆపడానికి ఆ రోజుల్లో 10,000 ఖర్చుపెట్టారుట! పోనీ హియరింగు ఎయిడ్ పెట్టుకుందామనుకుంటే, మంచి క్వాలిటీది( అంటే రొద లెనిది) లక్షల్లో ఉందిట.పోన్లే గాయం నయం అయిందికదా అనుకుని ఇలాగే లాగించేస్తున్నారుట. ఆయన చెప్పిందేమిటంటే, పిల్లలకి ఎవేవో ఆధునిక గిఫ్టులు ఇచ్చినా( వారివారి ఆర్ధిక స్టేటస్ చాటుకోడానికి!), మనం వాటిని జాగ్రత్తగా చూసి, అవి ఏచెవిలోనూ, ముక్కులోనూ పెట్టుకోనివైతేనే పిల్లలకి ఇమ్మని. లేకపోతే ఈయనకైనట్లు, ఓ ‘సారీ’ తో పిల్లలు సరిపెట్టేసికుంటారు, ఎవరిని అని ఏం లాభం? చివరకు అనుభవించేది తాతలూ, అమ్మమ్మలూ/నానమ్మ లే ! ఇది నిజంగా నేర్చుకోవలిసిన విషయమే కదా!

    ఇంకో విషయం చెప్పారు- ‘కొ’ ‘ కో ‘ లగురించి. ‘కొ’ అంటే కొడుకు, ‘కో’ అంటే కోడలు. ఎప్పుడైనా బయటికెళ్ళాలంటే, కొడుకంటాడుట- ఆ దారిలోనే వెళ్తున్నాను,కావలిస్తే నాతో రండి, దారిలో దింపేస్తానూ- అని. కోడలంటుందిట– బయటికెళ్ళాలంటే వెళ్ళండి, కానీ కారు వెంటనే తిరిగి పంపేయండి, నేను షాపింగుకెళ్ళాలీ, మీరు వచ్చేటప్పుడు ఆటోలో రండి–అని. దానర్ధం ( ఆయన చెప్పినదే) ఇద్దరూ కూడా కారును వాడుకోవద్దనరు, కానీ ఒన్ టైం ఓన్లీ, తల్లితండ్రుల్ని ఒబ్లైజు చేసినట్లూ ఉంటుంది, అలాగని మరీ నెత్తికెక్కించుకున్నట్లూ కాదు,కర్రా విరక్కూడదు,పామూ చావాలి లాగ ! ఎంత విలువైన జీవిత సత్యమో కదా!

    అలాగే కూతురి విషయంలో కూడా– అల్లుడెప్పుడూ భార్యని సంతోషపెట్టడానికి అత్తగారినీ, మామగారినీ నెత్తిమీద పెట్టుకుంటాడుట! కూతురు ఎలాగున్నా సరే అల్లుడు మాత్రం బెల్లంముక్కే!
అవసరం వస్తే తన తల్లితండ్రుల్ని కూడా ప్రక్కకు పెట్టేసి!

    ఎంత జీవితానుభవంతో చెప్పిన మాటలూ ఇవి. మాస్టారుకి కొడుకులూ,ఒక కూతురూ ఉన్నారు.ఇద్దరు కొడుకులు బయటా,ఒకరు వీరితోనూ.కూతురు ఈ ఊళ్ళోనూ!ఎక్కడో చదివినవి కావు, ప్రత్యక్షంగా చూసినవి. మరిన్ని విశేషాలు వచ్చే పోస్టులో.…


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-One day Trip to Hyderabad

Mon, 06/07/2010 - 13:09

    మా మేనకోడలి కొడుకు వివాహానికి నిన్న హైదరాబాదు వెళ్ళాము.ఏదో చుట్టాలందరినీ ఒకసారి కలుసుకోవచ్చుకదా అని, పైగా మా మేనకోడలు అయిదు నెలలముందే చెప్పింది కదా అని ప్రయాణం అయ్యేము. దీని మీద మా ఇంటావిడ ఓ blog
కూడా వ్రాసేసింది. ఏ ట్రైనులోనూ ఖాళీలు లేకపోవడంతో, వారంలో మూడు సార్లు వెళ్ళే పూణే-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరాము. సైడు బెర్తులే దొరికాయి.ట్రైను లోకి ఎక్కిన తరువాత, చూశాను ఎవరైనా ఖబుర్లు చెప్పుకోడానికి దొరుకుతారేమో అని.ఎప్పుడూ గొడవే నాకూ, మా ఇంటావిడకీ, ఊరికే కనిపించిన ప్రతీవారినీ పరిచయం చేసుకుంటారు ఎందుకనీ? నేను చెప్తానూ, దానివల్ల నాకేమీ నష్టం లేదూ, నీకిష్టమైతే వారితో కబుర్లు చెప్పూ లేకపోతే <b. నీదారిన నువ్వుండూ, కావలిసిస్తే నన్ను disown చేసేయి, నా అలవాటు మాత్రం మానుకోనూ అని! మొత్తానికి ఓ అబ్బాయీ( మా అబ్బాయి వయస్సువాడే), అతని భార్యా, ఓ బేబీ మా ప్రక్కనే ఉండే బెర్తుల్లో కూర్చున్నారు.నా పధ్ధ్దతిలో పరిచయం చేసికున్నాను. వాళ్ళకీ ఏదో కాలక్షేపం కావాలిగా, కబుర్లు మొదలెట్టారు.అతను పూణే లోనే పనిచేస్తున్నాడు,నేను చెయ్యి కడుక్కోడానికి వెళ్ళి వచ్చేలోపల, మా ఇంటావిడ,ఆ అమ్మాయితో కబుర్లు మొదలెట్టింది. నేను తిరిగి సీటులోకి వచ్చేటప్పటికి చెప్పిందీ, ‘ఈ అబ్బాయి నాన్నగారు, భక్తి టి.వీ లో వస్తూంటారుట ‘ అని. దేంట్లోనూ అని అడిగితే చెప్పారు-
వేద గణితం అని ఓ కార్యక్రమం ఆయనే చెప్తున్నారుట.

    నేను భక్తి టి.వీ. లో అన్ని కార్యక్రమాలూ చూస్తానుకానీ, లెఖ్ఖలంటే భయం కారణంగా ఈ కార్యక్రమం అసలు చూడను.అలాగని ఆయనగురించి తెలుసుకోకుండా ఉంటే ఎలాగా? అందులోనూ సెలిబ్రెటీ కూడానూ, ఎవరితోనైనా చెప్పుకోవచ్చు, ఆయన కొడుకు నాకు ఫ్రెండూ అని, ఆ కార్యక్రమం చూసేవాళ్ళదగ్గర నా స్టేటస్ పెరిగిపోతుంది! ప్రయాణంలో ఉన్నంతసేపూ ఆయన గురించే మాట్లాడుకున్నాము.బేగంపేటలో వీల్లని రిసీవు చేసికోడానికి వస్తారని చెప్పాడు, ఆయన స్పర్శ తగిలితేనైనా నాలో ఉన్న ‘ లెఖ్ఖల భయం’ తగ్గుతుందేమో అన్న ఆశతో, తెల్లారుఝూమున 4.00 గంటలకి ఆయనొచ్చినప్పుడు, ఒకసారి ఆయనకి షేక్ హాండిచ్చాను. అయినా ఇంకా లెఖ్ఖలంటే భయం అలాగే ఉంది! రోజులు గడిచేకొద్దీ తగ్గుతుందేమో చూద్దాం!

    ఇంక రైల్లో కబుర్లు- వీళ్ళు కూర్చున్న చోట రెండు బెర్తులు ఉస్మానాబాద్ కోటా ట.రైల్వేవాళ్ళు ఎవరైనా వస్తే, అవి ఖాళీగా ఉన్నంతవరకూ వాళ్ళు వాటిలో పడుక్కోవచ్చుట.ఒకతను ఓ బ్యాగ్గు లాటిది చేతిలో పట్టుకుని, వచ్చి పడుక్కున్నాడు, ఓ గంట పోయిన తరువాత ఇంకో ఆయన వచ్చాడు. ఇదేమిటీ ఎవడో ఒకడు వచ్చి కూర్చోడం, వాడిదారిన వాడు వెళ్ళిపోవడం, ఓ సామానుండదు చేతిలో, అలా వెళ్తూవెళ్తూ మనసామానేదైనా చంకలో పెట్టుకుని పోతే అడిగేదెవరూ? ఇదికాదు పధ్ధతీ అని, ఆ తరువాత వచ్చినతన్ని అడిగాను-అసలు ఈ బెర్తులు ఎవరివీ, ఒకడితరువాత ఇంకోడు వచ్చి కూర్చుంటున్నాడూ, సంగతేమిటీ అంటే వివరాలు చెప్పాడు.

    అతను దిగిపోయిన తరువాత, ఆ బెర్తుల్లోకి ఇద్దరు పెద్దవాళ్ళూ, ఇద్దరు పిల్లలూ వచ్చారు.బోల్డన్ని సామాన్లూ, ఆ పిల్లలైతే చిచ్చర పిడుగులు ( ఒకడు 10 ఏళ్ళవాడు, ఇంకోడు ఏడేళ్ళవాడూ), అసలే మగ పిల్లలు, తాతా, నానమ్మలతో ప్రయాణం ( అమ్మా నాన్నల కంట్రోలుండదు!), వామ్మోయ్, అదరకొట్టేశారు. మొత్తానికి ఓ రెండు గంటలు పోయాక అందరూ నిద్రపోయారు. తెల్లారకట్ల టాయిలెట్టుకు వెళ్దామని, చెప్పులు వెదుక్కోవడం మొదలెట్టాను. అసలే డిమ్ లైటు,సామాన్లూ, ఏ పెట్టికిందకు వెళ్ళిందో చెప్పులు కనిపించవూ, దానికి సాయం, ఆ పిల్లల తాత ( అంటే మరీ పెద్దతను కాదనుకోండి), ఏమిటి వెదుకుతున్నావూ అని అడిగి, నాతోపాటు ఆయనా మొదలెట్టాడు. అవేవో పేద్ద ఖరీదైన చెప్పులు అని కాదు( ఎవడైనా ఎత్తుకుపోతే హాయిగా కొత్త జత కొనుక్కుంటాను!), మరీ కాళ్లకి చెప్పుల్లేకుండా టాయిలెట్లోకి ఎలా వెళ్తానూ అని.మీరు మీ బెర్తులోకి వెళ్ళండీ, నేను వెదుక్కుంటాను, అనగానే, ఆయన కాళ్ళకున్న చెప్పులు వదిలి బెర్థులోకి ఎక్కాడు. తీరా చూద్దునుకదా ఆ పెద్దమనిషి నాచెప్పులే వేసుకున్నాడు. చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతుక్కున్నట్లు, ఆయన కాళ్ళకి వేసేసికుంటె
నా చెప్పులెక్కడ కనిపిస్తాయీ? ఏదో కాలక్షేపం!
ఆ మర్నాడు మేము వెళ్ళిన పెళ్ళికే, ప్రొద్దుట పరిచయం అయిన శ్రీ అవధాన్లు గారు vedaganitam fame అక్కడికీ వచ్చారు. మిగిలిన కబుర్లు ఇంకో పోస్టులో…..


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–గడియారాలు

Fri, 06/04/2010 - 13:25

    చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇదివరకటి రోజుల్లో ఇంట్లో హాల్ లో ఓ గడియారం వేళ్ళాడుతూ ఉండేది. దానికి ప్రతీ వారం, ఓ స్టూల్ వేసికుని, కీ ఇచ్చేవారు.వారంలో ఎప్పుడు కీ ఇవ్వాలో అక్కడ గుర్తుగా వ్రాసి ఉంచేవారు. ఆ గడియారం కూడా చాలా సిన్సియర్ గా గంటలు కొడుతూ, మన జీవితంలో ఒక భాగం క్రింద ఉండేది. సంవత్సరాలకొద్దీ పనిచేసేవి. అదేమిటో
కోఇన్సిడెంటల్ గా ఆ ఇంటి పెద్ద చనిపోయినప్పుడు ఆ గడియారం కూడా ఆగిపోయేది! ఇప్పటి వాళ్ళంటారు’ దానికి ‘కీ’ ఇవ్వకపోవడం వల్లా ఆగిపోయుంటుందీ, అంతేకానీ ఎవరో పోయారని కాదూ’అని.ఇప్పటి ‘వాతావరణం’ చూస్తే బహుశా అది కరెక్టేమో. కానీ ఊరు ఊరంతా చెప్పుకునేవారు.పెద్దాయన పోయినప్పుడు వాళ్ళింట్లో గడియారం కూడా ఆగిపోయిందిట అని.ఎవరి సెంటిమెంట్లు వాళ్ళవి!ఆ గడియారాలు కూడా ఎప్పుడూ రిపేరుకి వెళ్ళేవి కావు. ఇంటి పెద్ద మాదిరిగానే.

    ఇంటి పెద్ద గుండె చప్పుడుతో లింకు చేసేవారు.హాల్లో మెజెస్టిక్ గా ఆ గడియారం ఎంత శోభ తెచ్చేదో! ఎవరి తాహతూ,ఎవరి స్థోమతను బట్టి అంత పేద్ద గడియారాలుండేవి.ఇంటికంతకూ ఒక్కటే గడియారం.ఉద్యోగానికి వెళ్ళే ఇంటి పెద్దకి ఓ వాచీ ఉండేది.గడియారాలే కాదు, ఇంట్లో కరివేపాకు చెట్టు ఎండిపోయేది, ఇంట్లో కుక్కా,పిల్లీ ఉంటే అవి తిండి తినడం మానేసేవి.ఆవులు,గేదెలూ పాలివ్వడం మానేసేవి. వీటన్నిటినీ ‘ఇర్రేషనల్ థింకింగ్’ అనొచ్చు ఇప్పటి వాళ్ళు! అయినా సరే అలా జరిగేవి.ఆ పెద్దాయనో, పెద్దావిడో ప్రతీ రోజూ నీళ్ళు పోసేవారు కాబట్టి, కరివేపాకు చెట్టు నిగనిగలాడుతూ ఉండేవి.13 రోజుల హడావిడిలో ఎవరూ నీళ్ళు పోయలేదు కాబట్టి ఎండి పోయుండవచ్చు!అలాగే కుక్కలకీ,పిల్లులకీ ఎప్పుడూ తిండి పెట్టే మనిషి లేకపోబట్టి తిండం మానేసేవేమో.అయినా ఆరోజుల్లో ఇంతంత డీప్ గా ఆలోచించే బుర్ర ఎక్కడుండేదీ?

    తెల్లారకట్ల చదువుకోడానికి లేపడానికి, కాల క్రమేణా అలారం టైంపీసులొచ్చాయి.వీటిల్లిబంగారం గానూ, కరెక్టుగా మ్రోగేసేవి! గడియారాలు బాగుచేసేవాళ్ళు, ఎప్పుడైనా, ఎక్కడైనా ఓ ఇంటి అరుగు మీదే దుకాణం పెట్టుకుని ఉండేవాళ్ళు.అరుగుకి ఒక వైపు వీళ్ళూ, ఇంకో వైపు ఓ టైలరూ. ఇలాటివన్నీ ఆ రోజుల్లో ల్యాండ్ మార్క్స్! పెళ్ళిళ్ళల్లో అల్లుడుగారికి వాచీ, సైకిలూ తప్పకుండా ఇచ్చేవారు. ‘హెన్రీ సాండొజ్’, ‘బైఫొరా’ ‘ ఫేవర్ లూబా’ వాచీలు ఆ రోజుల్లో ప్రసిధ్ధి.డబ్బున్నవాళ్ళైతే ‘ ఒమేగా’ పెట్టుకునేవారు.ఒమేగా పెట్టుకున్నాడంటే అతనో జమీందారన్న మాట!

    కాలేజీకి వచ్చినా చేతికి వాచీ ఉండేది కాదు.‘పెర్ఫార్మెన్స్ ఓరియెన్టెడ్’ గా డిగ్రీ పాస్ అవుతే వాచీ కొనిచ్చేవారు. నేనైతే డిగ్రీ ఎలాగోలాగ పూర్తిచేసి ఉద్యోగంలో చేరిపోయి, నా మొదటి జీతం
202 రూపాయలలోనూ, 100 రూపాయలు ఖర్చు పెట్టి ఓ స్మగుల్డ్ వస్తువులు అమ్మే దుకాణంలో ‘ టిటోనీ’ వాచీ కొనుక్కున్నానోచ్! అప్పుడు కూడా మానాన్నగారికి చెప్పడానికి గుండె ధైర్యం లేకపోయింది! అది వేరే సంగతి!

    ఆ రోజుల్లో వాచీలు రేడియండయల్ తో ఉండేవి.చీకట్లోకూడా కనిపించేవి. వాచీమీద చెయ్యి కప్పేసి, ఆ చీకట్లో అంకెలు చూడడం ఓ సరదా!అపుడప్పుడే వచ్చేయి కాబట్టి బలేగా ఉండేది.
రోజులు గడిచేకొద్దీ, గంటలు కొట్టే గోడ గడియారాలు పాపం ‘ఔట్ ఆఫ్ ఫేషన్’ అయిపోయాయి. ఆ తరువాత అంతా డిజిటల్ యుగం. 20 రూపాయలనుండి ఫుట్ పాత్ ల మీద దొరికేవి. కే.జీ క్లాసులో చేరినప్పటినుండీ ఇప్పుడు వాచీలే! అవన్నీ బ్యాటరీలమీద నడిచేవే. బ్యాటరీ డిస్ చార్జ్ అయితే ఆగిపోతాయి.అంతేకానీ, ఇంటి పెద్ద ఉన్నాడా పోయాడా అని కాదు!

   ఎప్పుడైనా ఇంట్లో, గృహప్రవేశమో, పెళ్ళో అయితే, ఆ వచ్చినవాళ్ళందరికీ ఒకటే ఐడియా వచ్చేస్తుంది. ఓ గడియారం తీసికెళ్ళిస్తే పోలేదా అని. దాంతో ఒకడికి తెలియకుండా ఒకడు ఓ టైం పీసు ( వివిధ డిజైన్లలోవి), మన మొహాన్న కొట్టిపోతారు!టైంపీసుల్లో ఉన్న సౌలభ్యం ఏమిటంటే, తక్కువ ఖర్చుతో వస్తుంది, పేద్ద గిఫ్ట్ ప్యాకింగు చేయించొచ్చు. చూసేవాళ్ళందరూ అనుకుంటారు- అబ్బో ఆయనెంత పెద్ద గిఫ్ట్ తెచ్చారో-అని! పుణ్యం పురుషార్ధం!

    ఈ ఫంక్షన్ అయేటప్పటికి తేలుతుంది. వచ్చిన గిఫ్టుల్లో ఓ పాతిక రకాల టైంపీసులు అని. అవేమైనా అమ్ముకుంటామా ఏమిటీ. అలాగని ఇంకోళ్ళ ఫంక్షన్ లో ఇవ్వడమూ బాగోదూ.పోన్లే పడుంటాయి అనుకుని, ఇంట్లో కనిపించిన చోటల్లా ఓ టైంపీసు పెడతాము. గడియారాల దుకాణం లోలాగ ఒక్కటీ సరైన టైము చూపించదు. ఎవరి దారి వారిది. ఏ రూమ్ములో చూసినా, ఆఖరికి బాత్ రూంలోనూ, టాయిలెట్లలోనూ టైంపీసులే. అసలడుగుతానూ అక్కడెందుకండీ? అదో పైత్యం! వాటిల్లో బ్యాటరీలు వేయిస్తే పాపం పనిచేస్తాయి.అంత టైమెక్కడ ఈ రోజుల్లో!

    ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే మా ఇంట్లో చూస్తే ఓ పాతిక గడియారాలు తేలాయి. ఒక్కటీ పనిచేయదు ( బ్యాటరీలు లేక). పోనీ నాకెప్పుడో తీరికయ్యి బ్యాటరీలు వేయిస్తే, వాటిని మళ్ళీ నేనే ఎప్పుడో చూసేదాకా, అవి అలాగే ఉంటాయి!ఎవరూ పట్టించుకోరు! ఇంట్లో ఇన్నిన్ని గడియారాలున్నా సరే చివరికి టైము చూసుకునేది, మన సెల్ ఫోన్ లోనే!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అద్భుతం !!!

Fri, 06/04/2010 - 00:46

epaper-sakshi-com

హాయిగా ఒకే కొమ్మనుండి మామిడికాయలు కోసేసికుంటే ఎంత బాగుంటుందో !!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Muggers on prowl- Beware!!

Thu, 06/03/2010 - 05:33

Muggers

    పైన ఇచ్చిన వార్త బెంగుళూరు మిర్రర్ లో వచ్చింది. సరీగ్గా ఇలాగే నిన్న ప్రొద్దుట మా అబ్బాయికి జరిగింది. తను కారులో ఒక్కడూ వస్తూండగా, ఇద్దరు వ్యక్తులు ,బైక్ మీద ఫాలో అయి ఒక చోట ఆపారు. ఏమిటీ సంగతి అని అడిగేసరికి
వాళ్ళు, ‘ నీ కారుమూలంగా ఫలానా చోట ఎక్సిడెంటు చేశావూ, వాళ్ళు నీ కారు నెంబరు నోట్ చేసికుని, నీకోసం వస్తున్నారూ, మేము నిన్ను తీసికునివస్తామని చెప్పి ముందర వచ్చామూ, మాతో రావాలీ’ అని చెప్పారు.మా అబ్బాయికి తెలుసు తన వలన ఏ యాక్సిడెంటూ జరగలేదని. దానితో ధైర్యం చేసి, ‘నేను మీతో రానూ, కావలిసిస్తే నాకారు నెంబరు నోట్ చేసుకోండీ’ అని చెప్పేసి వచ్చేశాడు. ఈ విషయమంతా తన ఫ్రెండుకి బెంగళూరు వ్రాస్తే అతను పై లింకు పంపాడు.
బెంగళూరు లో ,పూణే లోనూ ఇలాటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎప్పుడో హైదరాబాద్ లొనో ఇంకెక్కడో కూడా జరగొచ్చు.అందువలన కార్లు వంటరిగా డ్రైవ్ చేసికునే అమ్మాయిలకీ, అబ్బాయిలకీ ముందు జాగ్రత్త కోసం ఈ వార్త అందరి దృష్టికీ తెస్తున్నాను. మన జాగ్రత్తలో మనం ఉండాలికదా !


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పెళ్ళిచూపులు-2

Wed, 06/02/2010 - 15:10

    సమాచార మాధ్యమాలద్వారా ఈ మధ్యన పెళ్ళి సంబంధాలు వెదుక్కోవడం చాలా సదుపాయంగా ఉంది. కొన్ని వార్తాపత్రికలు ఆదివారాలు మూడు నాలుగు పేజీలి వీటికే కేటాయిస్తున్నారు.ఇవే కాకుండా కుల ప్రాతిపదికన చాలా చోట్ల వివాహవేదికలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలోనే, మాకు తెలిసిన ఒకావిడ నిర్వహిస్తున్న వివాహవేదిక గురించి అడిగాను నాకు అవసరమయి కాదు, ఊరికే వివరాలు తెలిసికుందామని, ఏదో వయస్సులో పెద్దవాడిని కదా అని అప్పుడప్పుడు కొందరు నన్నూ అడుగుతూంటారు- మీ ఎరుకలో ఏమైనా సంబంధాలు ఉంటే చెప్పండీ అని-అలాటప్పుడు ఈ వివాహ వేదిక గురించి చెప్పొచ్చు కదా అని. అయినా ఎవరూ అడగలేదనుకోండి- నా పాప్యులారిటీ అలా ఉంది!
ఈ వివాహ వెదిక వారు వాళ్ళదగ్గర రిజిస్టర్ చేసికున్న వధూ వరులని ఓ వేదిక మీద చేరుస్తారుట, వాళ్ళ పెళ్ళంటూ నిశ్చయం అయితే వాళ్ళిచ్చే తృణమో పణమో తీసికుంటారుట.ఇందులో మీరు చేసేదేముందీ అంటే, డాటా బేస్ తయారుచేయడం వరకే వీరి బాధ్యత ట.ఇంక దేనిగురించీ బాధ్యత తీసికోరుట-ఆ తరువాత ఏదైనా గొడవలొస్తే వీళ్ళమీద పడతారేమో అని భయం.కనీసం వాళ్ళిచ్చిన వివరాలైనా వెరిఫై చేస్తే బాగుంటుంది.

    వార్తాపత్రికల్లో వచ్చే ‘మాట్రిమోనియల్స్’ లొ కొన్ని తమాషాలు కూడా జరుగుతూంటాయి. అసలు ఎడ్రస్ ఇవ్వకుండా ఏదో బాక్స్ నెంబరు ఇస్తారు.చివరకు తెలేదేమిటంటే ఈ వధూవరులిద్దరూ ఒకేవీధిలోనో ఒకే ఎపార్ట్ మెంటు సొసైటీలోనో ఉంటున్నట్లు!! ప్రస్తుతం నగరాల్లోనూ, పట్టణాల్లోనూ ఉన్న పరిచయాలకీ, కమ్యూనికేషన్లకీ ఇదో ఉదాహరణ !! ఇవే కాకుండా, ఆఫీసుల్లోనూ ఇంకో చోటా ఒకళ్ళనొకళ్ళు నచ్చేసికుని,వ్యవహారాలు నడిపేవాళ్ళు. ఇది పెళ్ళికి దారితీస్తే బాగానే ఉంటుంది, లేనప్పుడే గొడవలు. ఈ మధ్యన పేపర్లలోనూ, టి.వీ.ల్లోనూ చూస్తున్నాము పోలీసుల సహాయంతో పెళ్ళిళ్ళు చేసికుంటున్న జంటలని.అప్పుడెప్పుడో మన మెగాస్టార్ గారి కూతురు ఆ కుర్రాడినెవరినో పారిపోయి పెళ్ళి చేసుకుంటానంటే జరిగిన హడావిడీ, టి.వీ ల్లో ప్రత్యక్షప్రసారాలూ, సినిమా డయలాగ్గులూ – ఓ వారంరోజులపాటు బోరు కొట్టేశారు! అన్నీ అయిన తరువాత అందరూ కలిశారు, కొసమెరుపేమిటంటే ఆ కుర్రాడిని సెన్సార్ బోర్డ్ లో మెంబరు కూడా చేశారు! అతనికున్న క్వాలిఫికేషన్ ఏమిటో ఇప్పటికీ అర్ధం అవదు! మన తెలుగు సినిమాలు ( ఏ ఒక్కటో అరో తప్ప) అంత దరిద్రంగా ఎందుకుంటున్నాయో ఇప్పుడు తెలిసింది!ఈ కథలో నీతి ఏమిటంటే– ఏ ప్రఖ్యాత వ్యక్తి కూతురునో ప్రేమించేయి, అందులో ఇన్వాల్వ్డ్ వాళ్ళు ప్రఖ్యాత వ్యక్తులు కాబట్టి టి.వీ. పబ్లిసిటీ ఎలాగూ ఉంటుంది, ఆ తరువాత సెన్సార్ బోర్డ్ మెంబరుకూడా అయిపోవచ్చు.హాయి కదూ!పెళ్ళి సంబంధాలకోసం ఇదో ఆప్షన్ అని మనకి జ్ఞానోదయం అయింది!

   కొంతమంది ఎంతమందిని చూసినా ఇంకా జాతకాలమీదే నమ్మకం ఉంచుతున్నారు. జాతకాలు కలిస్తేనే కానీ ముందుకు వెళ్ళరు.ఎవరి నమ్మకం వారిది. అలాగని ఈ జాతకాలూ వగైరా కలిసినా పెటాకులైన పెళ్ళిళ్ళు ఎన్నో చూశాము.దేనికైనా ‘డెస్టినీ’ అనేది ఒకటుండాలి. దీనికి నాస్థికత్వంతోనూ, ఆస్థికత్వంతోనూ సంబంధం లేదు. ‘ ఇఫ్ ఇట్ హాజ్ టు హాపెన్,ఇట్ వుడ్ హాపెన్’ అంతే. దీనికి కారణం లేదు. అసలు ఈ పెళ్ళి సంబంధాలు చూసుకునే వాళ్ళు,ముందరే వాళ్ళకి కావలిసిన విషయాలు అన్నీ చూసుకుని, అన్నీ సరిపోయాయీ అన్న తరువాతే పెళ్ళి చూపులకి వెళ్ళొచ్చు కదా, అబ్బే ఇంట్లో వాళ్ళు చూడాలి, బయటి వాళ్ళు చూడాలి,వీళ్ళందరూ స్క్రీనింగు చేసిన తరువాత మన కాబోయే వరుడు చూస్తాడు. పోనీ ఈయనేమైనా ఒప్పుకుంటాడా, ఇంకో రెండు మూడు సంబంధాలు చూసిన తరువాతే ఏసంగతీ తేలుద్దామంటాడు.ఇన్ని హడావిళ్ళలోనూ అందరూ ఒక సంగతి మర్చిపోతున్నారు- ఇంతమంది చూసిన తరువాత కూడా ఆ పిల్లకి గ్యారెంటీ ఏమీ ఉండదు,తన పెళ్ళి అవుతుందో లేదో. ఆ పెళ్ళికొడుక్కేంపోయిందీ,తల్లితండ్రులు చూపించినన్ని సంబంధాలు చూస్తాడు.

    అన్ని విషయాలూ ముందరే మాట్లాడుకుని అందరూ ఒకేసారి కట్టకట్టుకుని వెళ్ళి ఏసంగతీ చెప్పేయొచ్చుకదా.ఈ కాబోయే వరుళ్ళకి, తాము ఎన్ని సంబంధాలు చూస్తే అంత గొప్పనుకుంటారు. వాళ్ళ స్నేహితులతోటి చెప్పుకోవచ్చుగా!ఇంతకంటె ఇంకో ‘వాలిడ్ రీజన్’ కనిపించడంలేదు. కావలిసినంతమందిని చూడొచ్చు, వద్దనం, కానీ అందరినీ ‘వెయిటింగ్ లిస్ట్’ లో పెట్టి, అవతలి వాళ్ళని క్షోభ పెట్టకూడదు. అసలు ఈ వ్యవహారాలన్నీ భరించలేక ఏ అమ్మాయో ధైర్యం చేసి’అసలు నువ్వే నాకు నచ్చలేదూ’ అందనుకోండి, వీళ్ళ సంగతి ఏమౌతుంది? ఇంకా మనదేశంలో ఆడపిల్లలు మరీ తెగించి అలా అనడంలేదు. అలా అన్నరోజున మరి ఈ పెళ్ళికొడుకుల పరిస్థితి ఏమౌతుంది? అందుకనే ఏ విషయమైనా తెగేదాకా లాక్కూడదు! లాగితే అంతే సంగతులు!

    చెప్పొచ్చేదేమిటంటే ఈ పెళ్ళి చూపుల తతంగం, ఎవరినీ నొప్పించేటట్లుగా ఉండకూడదు. నచ్చితే నచ్చిందనండి.లేకపోతే అక్కడికక్కడే చెప్పేయండి.’ ప్రపంచంలో ఈ పిల్లొకత్తేనా’ అని ప్రతీ పెళ్ళికొడుకూ అనుకున్నట్లే, ‘ వీడొక్కడేనా’ అని పెళ్ళికూతుర్లు కూడా అనుకోవచ్చు. ఎంతైనా కీడెంచి మేలెంచడం మంచిదికదా!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- telugukingdom.net

Tue, 06/01/2010 - 15:06

   గౌరవనీయులైన Bhamidipati Phanibabu గారికి నమస్కరిస్తూ ,

ఈ రోజుకు మనం మన telugukingdom.net ని అందరిలోకి తీసుకు వెళ్లి నెల రోజులు అయినది మరియు మన మొత్తం బలం వెయ్యి దాటినది . అనుకున్న దానికి కన్నా చాలా మంచి సహకారం అందినది మన తెలుగు వారి వద్దనుండి .

ఈ నెల రోజులలో మన వెబ్ సైట్ ఉపయోగపడిన వారి సంఖ్య – 18 . ఆ ఉపయోగపడిన వారిలో అమెరికాలో రూమ్ లేక దయనీయ పరిస్థితులలో కారు పార్కింగ్ ఏరియాలో పడుకున్న తెలుగు వారినుండి 78 సంవత్సరాల తాత గారి చిన్న నాటి స్నేహితుని కొడుకుని కలుసుకున్న దాకా ఉన్నారు . కేవలం వెయ్యి మందితో ఒక్క నెలలో ఇది సాధ్యం అయింది . దీనికి సహకారం అందించిన మీకు కృతజ్ఞతలు తెలియ చేసుకుంటూ చిన్న విన్నపము ,

“మీరు దయచేసి మీ యొక్క అమూల్యమైన ఒక్క నిమిషాన్ని వెచ్చించి మీకు తెలిసిన మన తెలుగు వారికి మన సైట్ గురించి తెలపగలరు . ఇది వారికి , లేక ఇంకా ఎవరికైన ఉపయోగ పడగలదు . మీ ఈ ఒక్క నిమిషం , ఒక్క మాట లేదా ఒక్క ఈ-ఉత్తరం ఒక జీవితానికి వెలుగునివ్వగలదేమో (లేక జీవితాన్నే ఇవ్వగలదేమో )”

నా విన్నపాన్ని మన్నిస్తారని భావిస్తూ

మీ విధేయుడు
కిరణ్

    ఈ మధ్యన నాకు ఒక మెయిల్ వచ్చింది. తెలుగు కింగ్డం అనే సైటు గురించి. ఆ సైటు చాలా ఆసక్తికరంగా ఉంది. వీలుంటే అందులో సభ్యులు గా చేరండి. ఏమో ఎవరు చెప్పొచ్చేరు- కిరణ్ గారన్నట్లుగా, మీ లాంగ్ లాస్ట్ స్నేహితుడు దొరకొచ్చేమో! నాకు ఈ మధ్యన ‘ఫేస్ బుక్’ ధర్మమా అని మా చుట్టాలు చాలామందితో కాంటాక్ట్ ఏర్పడింది. మీఅందరితోనూ పంచుకుందామని ఆ మెయిలు పైన ఇచ్చాను.


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పెళ్ళిచూపులు-1

Tue, 06/01/2010 - 14:27

    యుగయుగాలనుండీ జరుగుతూందనుకోండి ఈ పెళ్ళి సంబంధాల తతంగం, ఆ రోజుల్లో ఇంట్లో కూతురు పెళ్ళి చేయాలంటే ఆ తండ్రి ‘చెప్పులరిగేలా’ తిరిగేవాడనేవారు. మొత్తానికి ఏ పెళ్ళిళ్ళపేరయ్య ధర్మమో, పెళ్ళిళ్ళు చేసేవారు.ఒక్కొక్కప్పుడు, ‘మీ అమ్మాయిని అక్కడెక్కడో పెళ్ళిలోచూశామూ, మా వాడు ఆ పిల్లని తప్ప ఇంకోళ్ళని చేసికోనంటున్నాడూ’ అంటూ, మధ్యవర్తి ద్వారా కబురు పెట్టడమూ, ఆ తరువాత జాతకాలూ,వగైరా చూసేసికుని, లాంఛనాలూ వగైరా సెటిల్ చేసేసికుని పెళ్ళిళ్ళు చేసేవారు.అప్పుడు వీలైనంతవరకూ, దగ్గరలో ఉన్న సంబంధాలే చేసికునేవారు.పిల్ల మరీ దూరం వెళ్ళఖ్ఖర్లేకుండా, దగ్గరలోనే ఉండేటట్లు చూసుకునేవారు. మొదట ఆ పిల్లకో పిల్లాడికో మేనరికం వగైరాలకు ప్రయారిటీ ఉండేది.అలాటి మేనరికం ఏదైనా ఉంటే బయటి వాళ్ళెవరూ అక్కడ అడుగెట్టడానికి కూడా ధైర్యం చేసేవారు కాదు! ఇంకోటేమిటంటే ఆ రోజుల్లో ఉండే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మూలంగా, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు, పురిటి లోనే, వీళ్ళకి
సంబంధాలు ఫిక్స్ చేసేసేవారు. ‘ ఒరేయ్ నీకు పెళ్ళాం పుట్టిందిరా’ అంటూ!దానితో ఆ పిల్లకీ, పిల్లాడికీ అలాగే చేసుకోవాలి కామోసు అని వాళ్ళూ చేసేసికునేవారు.పాత సినిమాల్లో చూడ్డం లేదూ?

   బాగా డబ్బున్నవాళ్ళైతే ఇప్పటికీ కుటుంబంలోనే వరసైన వాళ్ళకెవరికో కట్టబెట్టేస్తూంటారు, ఆస్థి బయటకు వెళ్ళఖ్ఖర్లేకుండా!కాలక్రమేణా మనుషులు కూడా తెలివి తేటలు ఎక్కువై, మేనరికాలు చేసికుంటే, పుట్టే పిల్లలకి ఏవేవో సమస్యలొస్తాయీ
అనే సాకు మీద వీలైనంతవరకూ బయటి సంబంధాలకే వెళ్తున్నారు. మెడికల్ ఒపీనియన్ కరెక్టవచ్చు, కానీ పూర్వకాలంలో చేసికున్న దగ్గర సంబంధాల పిల్లలు హాయిగా కాపురాలూ చేసికున్నారు, వాళ్ళ పిల్లలూ లక్షణంగానే ఉన్నారు.వాతిలో ఉండే సుఖాలూ ఉన్నాయి.మేనత్తే అవడం వల్ల అప్పుడప్పుడు తప్ప, అత్తా కోడళ్ళ సంబంధ బాంధవ్యాలూ బాగానే ఉండేవి.ఏదైనా గొడవ వచ్చినా చుట్టాలందరూ కలిసి ఎలాగోలాగ వాటిని సెటిల్ చేసేవారు.వాటిల్లోనూ సమస్యలుండేవి. సమస్య ఉండకుండా ఉన్నది ఎప్పుడు?

   రోజులు గడిచేకొద్దీ మనుష్యులు తెలివి మీరేరు. కట్నం అదీ బాగా రాదని ముందే తెలిసుండడం వల్ల ఏదో కారణం చెప్పి బయటి సంబంధాలకే వెళ్తున్నారు. దానికి సాయం ఈ ‘జెనెటిక్ టెక్నాలజీ’ ఒకటీ.అమ్మాయికి 18-20 ఏళ్ళొచ్చేసరికి, ఇంట్లోవాళ్ళ ఒత్తిడి అనండి, ఇంకోదేదో అనండి, పాపం ఆ తండ్రి సంబంధాలు వెతకడం మొదలెడతాడు.ఈ లోపులో అమ్మాయి కాలేజీ చదువుకి వస్తుంది. అక్కడితో ఆగదుకదా వ్యవహారం, పోస్ట్ గ్రాడ్యుఏషన్ అంటుంది.ఎలాగూ చదివేనుకదా అని ఉద్యోగంలో చేరుతుంది.అయినా ఈ రోజుల్లో ఇదివరకటిలా కాదుకదా, చదువు అనేది ప్రతీ వారికీ ఉండవలసిందే. ఎటొచ్చి ఏమౌతుందో ఈ రోజుల్లో, ఎవరి కాళ్ళమీద వాళ్ళు నిలబడాలికదా!

    నూటికి 70 మందిదాకా ఈ రోజుల్లో ఇంజనీరింగుకే వెళ్తున్నారు. డిగ్రీ చేతికి వచ్చేక ఐ.టి రంగం ధర్మమా అని ఉద్యోగాలూ బాగానే వస్తున్నాయి.వచ్చిన తరువాత అక్కడితో ఆగదుగా, ఒంటరిగా ఉన్నప్పుడే బయటి దేశాలకోసారి వెళ్ళొస్తే బాగుంటుందీ అనుకుని, ఆన్ సైట్ ప్రాజెక్ట్ లో పనిచేయడానికి బయటి దేశాలకి వెళ్తున్నారు.ఒకసారి వెళ్ళినతరువాత తిరిగి రావడం వీళ్ళచేతుల్లో లేదుకదా, మూడో నాలుగో సంవత్సరాలు బయటే ఉండిపోతున్నారు.పోనీ ఉన్నారుకదా అని, అక్కడే ఎవరినో నచ్చినవారిని పెళ్ళి చేసేసికుంటారా, అబ్బే మళ్ళీ సెంటిమెంటూ అవీ అడ్డొస్తాయి, ఆడ పిల్లలకి. మరీ మొగ పిల్లలంత తెగించేయరు పాపం! ఏదో అమ్మా నాన్నా అంటూ ఉంటారు!

    ఇంక మగ పిల్లల సంగతి కి వస్తే ఈ ఫీల్డే వేరు!నూటికి 40 మంది దాకా ఐ.టి.లోనే ఉన్నారు.ఇంకా అమ్మా నాన్నా మాటవినేవాళ్ళైతే, వీళ్ళ గోల భరించలేక ‘సరే సంబంధాలు చూడండి, నేను ఫలానా టైముకి ఓ పదిహేను రోజులు శలవమీద వస్తున్నానూ, అప్పుడు చూస్తానూ’ అంటాడు. ఇంక చూడండి వీళ్ళు సంబంధాలు చూడడం మొదలెడతారు, అదేదో టెండరు ప్రాసెస్ లాగ, ముందుగా తెలిసినవాళ్ళందరికీ చెప్తారు. పెళ్ళికావలిసిన పిల్లలకేం లోటు మన ఆంధ్ర దేశంలో.

    పిల్లాడు అమెరికా నుండి రాగానే ప్రారంభం అవుతుంది ఈ పెళ్ళిచూపుల తతంగం-ఉన్న పది పదిహెనురోజులూ ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళడం, ఓ కర్సరీ గ్లాన్స్ వేయడం,నిజం చెప్పాలంటే, ఈ పిల్లాడు అమెరికా నుండి వచ్చేముందరే వ్యవహారాలు
‘ఫిక్స్’ అయిపోతాయి, మన మ్యూజికల్ రియాలిటీ షో లలో లాగ! మీరు ఏ కార్యక్రమం చూడండి, ముందుగానే జడ్జీల హావభావాలను బట్టి ముందే చెప్పేయొచ్చు చివరికి విన్నర్ ఎవరౌతారో అలాగ! మిగిలినదంతా మిమ్మల్నీ, మమ్మల్నీ వెర్రివెధవలు చేయడానికి మాత్రమే. ( ఈ సందర్భంలో కొంతకాలం క్రిందట ఒకానొక పాప్యులర్ కార్యక్రమంలో ఓ ఫేమస్ జడ్జి, ఒక అమ్మాయిని ముందరి రోజునుండీ సపోర్ట్ చేశారు. తనచేతిలోనే ఉంది కాబట్టి,ఓ రౌండులో, ఇంకో అమ్మాయి బాగా పాడినా సరే, ఆ పిల్లని కాదనితనకి కావలిసిన పిల్లని ప్రమోట్ చేశారు. కానీ ఫైనల్ లో బయటనుండి వచ్చిన జడ్జి అసలు ప్రావీణ్యత గుర్తించి, ఇంకో అమ్మాయిని విన్నర్ చేశారు. ఈ విషయం నేను, ఆ పెద్ద మనిషికి మెయిల్ ద్వారా జ్ఞాపకం చేస్తే ఆయనన్నారూ’ అవునూ నాకు ఫలానా అమ్మాయె నచ్చింది. ఆమెని ప్రమోట్ చేస్తే తప్పేమిటీ ‘అని జవాబిచ్చారు! ఈ మాత్రం దానికి ఇంతంత పెద్ద షోలూ అవీ అవసరమా?). ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే, వచ్చిన పది టెండర్లలోనూ ఈ తల్లితండ్రులు ఎవళ్ళో ఒకళ్ళని అప్పటికే సెలెక్ట్ చేసేసి ఉంటారు, అలాంటప్పుడు ఈ హంగామా అంత అవసరమా అనిపిస్తుంది. పోనీ అలాగని వెళ్ళి చూసొచ్చిన మిగిలిన తొమ్మిదిమందికీ రిజల్టు చెప్తారా అంటే అదీ లేదూ, మరి నెగోసిఏషన్సు ( కట్న కానుకలు) పూర్తి అవాలిగా!పాపం అప్పటిదాకా ఆ మిగిలిన తొమ్మిది మందీ వెయిట్ చేయాల్సిందే. చివరకి ఎప్పుడో అడగా అడగా చెప్తారు ఏదో కుంటి సాకు చెప్పి, ‘మావాడు ఓ రెండుమూడేళ్ళు ఆగమంటున్నాడండీ’ అంటూ. మరి ఈ మాత్రం దానికి ఈ హడావిడంతా ఎందుకంట? పెళ్ళికొడుకు వాళ్ళమనే ఒక ఫీలింగు.వాళ్ళకేది తోస్తే అది చేయొచ్చు. అడిగేవాడెవడు? పాపం ఇక్కడేమో ఈ పిల్ల ఇలా పెళ్ళిచూపుల కార్యక్రమంలో బలైపోతూంటుంది.


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–నాకు నచ్చిన ఓ వ్యాఖ్య

Mon, 05/31/2010 - 13:05

intitera _ ________ ______ _ Andhra Bhoomi

ఈ టి.వీ లో సోమవారాలు ప్రసారమౌతున్న ‘పాడుతా తీయగా’ కార్యక్రమం మీద ఆంధ్రభూమి లో ఒక పాఠకుని నుండి వచ్చిన అభిప్రాయం. నూటికి నూరు పాళ్ళూ నాకైతే నచ్చింది.


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కాలక్షేపం

Fri, 05/28/2010 - 15:44

    నిన్నా మొన్నా శ్రీ కాళహస్తీశ్వర స్వామి రాజగొపురం సంఘటన గురించి, మన టి.వి.చానెల్స్ లొ హోరెత్తించేశారు.20 సంవత్సరాలనుండీ, రాజగోపురం బీటలు తీస్తున్నా, ఎవరూ పట్టించుకోలెదు. కాని నారావారు, అదంతా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమె అని నొక్కి వక్కాణించేశారు! ఈ 20 సంవత్సరాలలొనూ వారుకూడా మన రాష్ట్రాన్ని పరిపాలించారని మర్చిపొయారు పాపం! ఎన్నిపనులో ఆయనకి. ఇంక మన టి.వీ వాళ్ళయితే కనిపించిన ప్రతీ వాడి అభిప్రాయం అడిగి మనకి జ్ఞానోదయం చేశారు.దేవాదయశాఖ వాళ్ళు, పురావస్తు శాఖవారిది తప్పు అన్నారు, వీళ్ళేమో అబ్బే కాదు, ప్రభుత్వానిదే అన్నారు! ఈ లోపులో ఇంకోడొచ్చి, అప్పుడే ఎస్టిమేట్లు అవీ తయారుచేసేసి, గోపురం తిరిగి నిర్మించడానికి టెండర్లు పిలుస్తామూ, అందులో ఎంతెంతమందికి ఎంత వాటాలో వగైరా సిధ్ధం చేశారు. ఇందులో చూపించే ‘ఎంథూజియాసం’, గత 20 సంవత్సరాల్లో ఏ ఒక్కడైనా చూపిస్తే ఈ స్థితికి వచ్చేది కాదు.

   ఛాన్స్ దొరికినప్పుడల్లా, మందీ మార్బలం తో ప్రత్యేక దర్శనాలకి వచ్చే ఈ రాజకీయనాయకులకీ, దేవాదయ శాఖవారికీ, రాజ గొపురం బీటలు కనిపించలేదంటే ఎలా నమ్ముతాము? క్యూల్లో నుంచోకుండా ప్రత్యేక దర్శనాలకి అలవాటు పడ్డ ఈ దౌర్భాగ్యులకి, వాళ్ళకి జరిగే రాజలాంఛనాలమీద కాకుండా, మిగిలినవాటి మీద దృష్టి ఉంటుందని ఆశించడం మన అత్యాశే. ఒక టి.వీ, చానెల్ ( టి.వి-9 అనుకుంటా), శ్రీకృష్ణదేవరాయలి ఆత్మ ఎంత సంక్షోభం చెందిందో చాలా నాటకీయంగా వివరించారు. అది ఎలా ఉందంటే అవకాశం దొరికితే– ‘ ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు స్వర్గాన్నుండి మనతో లైన్లో ఉన్నారు’ అనేంత!మన టి.వీ.. వాళ్ళు దేనికైనా తగుదురు!

    తమిళనాడు లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా,వారు ఆరాష్ట్రంలోని దేవాలయాల గురించి తీసికునే శ్రధ్ధ చూస్తే కడుపు నిండిపోతుంది.ఏ దేవాలయం చూసినా, అక్కడి రాజగోపురాలకి రెగ్యులర్ గా రంగులు వేయడం,రిపెర్లొస్తే బాగుచేయడం ఒక డ్యూటీ గా చేస్తారు.మరి మనవాళ్ళకేం రోగం? ఎక్కడ డబ్బులు దొరుకుతాయా, ఎలా తిందామా అనే కానీ ఇంకో ధ్యాస ఉండదు.తిరుమలలో ఆదికేశవులు, కోర్టులు ఎంత అరచి గీ పెట్టినా సరే, ఆనంద నిలయం లోపల, స్వర్ణమయం చేయాల్సిందే అంటాడు. పాపం ఆ శ్రీ వెంకటేశ్వరుడికి నోరు లేదు, అయినా స్వర్ణమయం చేయకపోతే ఆయనెమైనా అంటాడా ఏమిటీ?

    ఇంక ఈవేళంతా, అవేవో యాత్రలూ, ఫైరింగులూ, ఆత్మహత్యా ప్రయత్నాలూ అడక్కండి, మన సహనం ఎంతవరకూ పరీక్షించగలరో దానికి ఉదాహరణ ఈ వేళ్టి ప్రసారాలు.వాడెవడో ఎం.ఎల్.సీ ట వాడి గన్ మన్ ఠపా ఠపా మని కాల్చేశాడు.మరి పోలీసులేం చేస్తున్నారుట? ఇంక హైదరాబాద్ సంగతికొస్తే ఆ కుర్రాళెవరో సావకాశంగా రాళ్ళు రువ్వుతూ, దుకాణాల అద్దాలు పగలకొట్టేస్తున్నారు. మన టి.వీ. వాళ్ళేమో, నాలుగైదు పార్టీల వాళ్ళని ఎవరినో స్టూడియో కి పిలవడం, వాళ్ళచేత అవాకులూ చవాకులూ మాట్లాడించడం. ఇంక ఈ ఏంకర్లు, ఆ మాట్లాడేవాడు ఏదైనా చెప్పడం మర్చిపోయాడేమో అని .ఒకే ప్రశ్నని అడిగిందే అడగడం.

    ఆ అత్మహత్యా ప్రయత్నం- ఓ జోక్ ఆఫ్ ద డికేడ్! అసలు చేతిలో ఉన్నవి నిద్రమాత్రలా, హోమొపతీ మాత్రలా? రెండంటే రెండే నిద్ర మాత్రలతోనూ ఆత్మహత్యా ప్రయత్నం చేయొచ్చని మనకి జ్ఞానొదయం అయింది. ఈ యాత్రలూ, ఫైరింగులూ, ట్రైన్లు అంటించడాలూ, దుకాణాల అద్దాలు పగలకొట్టడాలూ చుస్తూంటే నాకో బ్రిలియంట్ ఐడియా వస్తోంది. ఇవి మన రాజకీయ నాయకులు బ్రతికున్నంత కాలమూ ఎలాగూ తప్పవు, మన టి.వి వాళ్ళు వాటిని ప్రత్యక్షప్రసారం చేయడం ఎలాగూ మానరు, హాయిగా ఏ కంపెనీ బ్రాండు వాళ్ళో వీటినికూడా స్పాన్సర్ చెసేస్తే ఆ కంపెనీకి లాభాలెనా వస్తాయి. టి.వీ. వాళ్ళూ బాగుపడతారు.

    ఉదాహరణకి కార్యక్రమం ఇలా ఉండాలి– ఈ వేళ్టి బంధ్ స్పాన్సర్స్ ఫలానా కంపెనీ ఠింగ్ ఠింగ్..- తరువాతి కార్యక్రమం తార్నాకా లో దుకాణాల లూటీ స్పాన్సర్డ్ బై ఫలానా కంపెనీ.. ఆత్మహత్యా ప్రయత్నం కొద్ది క్షణాల్లో స్పాన్సర్డ్ బై…’
కావలిస్తే మన కార్పొరేట్ స్కూల్స్ లో కూడా వీటి గురించి ఓ పాఠం నేర్పొచ్చు. ‘ బంధ్ నిర్వహించడం లో రాష్ట్రం లో నెంబర్ 1, ఫలానా విద్యాసంస్థ అని. ఇదంతా ఏదో హాస్యానికి వ్రాస్తున్నది కాదు. కడుపులో బాధని చెప్పుకోలేక, ఏడవలేక నవ్వడం. అంత పేద్ద రాష్ట్రంలో మన రాజకీయాలు ఎంత బ్రష్టు పడిపోతున్నాయో అని ఆలోచించేవారే కరువయ్యారా? అసలు వీటినుండి బయటపడి రాష్ట్రం ఎప్పటికైనా బాగుపడుతుందా అనిపిస్తూంది….


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Scholarships for IITs

Thu, 05/27/2010 - 08:38

Do the Math – The Best of Asia 2010 – TIME

   మొన్న ఐ.ఐ.టి ల ఎడ్మిషన్ పరీక్షల్లొ ఆల్ ఇండియా లెవెల్ లో తమ తమ కోచింగ్ సెంటర్ల కొచ్చిన ర్యాంకుల గురించి, టి.వీ. లలో యాడ్ లతో హోరెత్తించేశారు.ఇంకో చోట ఎక్కడో కోచింగ్ క్లాసెస్ లో ప్రవేశానికి కూడా అర్హత పరీక్షల గురించి చెప్పారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళైనా, ఇన్ని పేపర్ల వాళ్ళూ, టి.వీ వాళ్ళూ ఇక్కడే మన భారతదేశంలోనే, అదీ బీహారు లో ఒక వ్యక్తి చేస్తున్న ఓ ఘనకార్యం గురించి వ్రాయాలనిపించలెదు.

    ఇక్కడ శ్రీ ఆనంద కుమార్అనే ఒక వ్యక్తి, పాట్నా లో ఉన్న 30 మంది విద్యార్ధుల్ని ఐ.ఐ.టి కి కోచింగ్ ఇవ్వడమే కాదు, తన స్వంత ఖర్చుమీద వాళ్ళకి ఫుల్ స్కాలర్ షిప్ కూడా ఇచ్చి చదివిస్తున్నాడు. ఈ విషయం మనం విదేశీ పత్రికల్లో చదివితే గానీ తెలియలేదు. ‘మేరా భారత్ మహాన్”


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ప్రభుత్వ కార్యాలయాలు–2

Wed, 05/26/2010 - 15:03

   మాకు ఫాక్ల్టరీలలో ఎవరైనా సర్వీసు లో ఉండగా దివంగతులైనప్పుడు ‘ డైడ్ ఇన్ హార్నెస్’ రూలు క్రింద,చనిపోయినవారి కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరికి ( భార్య కానీ, కొడుకు కానీ) ఉద్యోగం ఇస్తూంటారు. మరీ ఖాళీలు లేనప్పుడు, కొడుకుకి ఆర్డర్లీ క్రింద ఇస్తూంటారు. ఈ ఆర్డర్లీల సంగతి బహు విచిత్రంగా ఉండేది. తండ్రి పోయినప్పుడు అతని భార్యకు వచ్చే టెర్మినల్ బెనిఫిట్స్ తో ముందుగా ఓ బైక్కు తీసేసుకుంటాడు. పోయిన అతని పెన్షన్ ఎలాగూ వస్తుంది.
దానికి సాయం ఈ కుర్రాడికి ఉద్యోగం. ఇంక వీడిని పట్టేవాడుండడు.ఏ సెక్షన్ లో వేసేరో, అక్కడ ఇన్ ఛార్జేమో, ఏ బస్సులోనో, నడిచో ఆఫీసుకి వస్తూంటాడు, ఇతనేమో ఝూమ్మని బైకు మీద వస్తూంటాడు, పైగా దారిలో కనిపిస్తే లిఫ్ట్ కూడా ఆఫర్ చేస్తూంటాడు! ఇంక ఈ కుర్రాడు ఆఫీసులో పనేం చేస్తాడు? మొట్టమొదట వీడు చేసే పనేమిటంటే ఏదో ఒక యూనియన్ లో చేరిపోవడం.ఆఫీసులో మొదటి రెండు మూడు నెలలూ ముంగిలా ఉంటాడు.ఆ తరువాత నీళ్ళు వంట పడతాయి! రూల్సూ, రెగ్యులేషన్సూ మాట్లాడతాడు. ఏమినా అంటే యూనియన్ వాళ్ళని తీసికొచ్చేస్తాడు.మనం ఏమీ అనకూడదు.పైగా పైనుంచి ఆర్డర్స్– ‘డిప్లొమాటిక్ ‘ గా ‘హ్యాండిల్’ చేయడం నేర్చుకోవాలీ అంటూ. దాని అర్ధం ‘నోరు మూసుకుని కూర్చో” అని! ఎవరైనా బయటి వాళ్ళు ఆఫీసుకి వస్తే ఈ కుర్రాడి స్టైలు చూసి అతనే ఇన్ ఛార్జేమో అన్నంతగా ఉంటాడు. వాడికి నచ్చిన పనే చేస్తాడు.మనకు ఇష్టం అయితే చేయించుకోవడం లేకపోతే తూర్పుకి తిరిగి దండం పెట్టడం! మామూలుగా ప్రభుత్వ కార్యాలయాల్లో రెండోదే జరుగుతూంటుంది, ఇందులో సందేహం లేదు.

   వీళ్ళు కాకుండా కొంతమంది లేడీస్ ఉంటారు. నేనేదో ఎమ్.సి.పి అనుకోకండి, నాకు జరిగిన అనుభవాలు చెప్తున్నాను.ప్రతీ చోటా ఇలాగే ఉంటారనడం లేదు. మా సెక్షన్ లోకూడా చాలా మంది సిన్సియర్ లేడీస్ ని చూశాను.ఏదో పేరంటానికి వెళ్ళినట్లు ఖబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. ఇదేమిటీ అని అడిగితే కళ్ళంబట నీళ్ళేట్టేసికుని, పై ఆఫీసరు దగ్గర ఉల్టా మనమిద కంప్లైంట్ చేసేస్తారు. ఆయనేమో మన ‘శీలాన్ని’ శంకించేస్తాడు! ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయడం అంటే నిజంగా ‘ అశిధారావ్రతం’ లాటిది.

   ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న పెద్ద జాడ్యం యూనియన్లు. ఆఫీసరు దగ్గరనుంచి, క్రింద ఆర్డర్లీ దాకా ప్రతీవాడూ పేద్ద లీడర్ అనే అనుకుంటాడు. యూనియన్లు అనేవే లేకుంటే, వీళ్ళ మాట ఎవడు వింటారూ అంటారు. కానీ ప్రతీ దానికీ ఏదో పేద్ద రభస చేయఖ్ఖర్లెదుగా! పైగా ప్రతీదీ ‘హక్కు’ అంటారు. మరి పని దగ్గరకు వచ్చేసరికి ‘ విధి’ అనే మాట గుర్తుకు రాదా? ఇంకోటి- నిన్నో మొన్నో పెపర్లో చదివాను- మంగళూరు ఎయిర్పోర్ట్ లో ఏక్సిడెంట్ జరిగిన తరువాత, ఎయిరిండియా వాళ్ళు సమ్మేచేస్తున్నారు, అందులో యూనియన్ లీడర్స్ అసలు పనికే వెళ్ళరుట!కానీ అందరిలాగే జీతభత్యాలు అవీ మాత్రం ఠంఛనుగా తీసేసుకుంటారు. ఇలాటి ‘ జీవులు’ ప్రతీ ప్రభుత్వ రంగ సంస్థలోనూ ఉంటారు.వీళ్ళ కి పనేమీ ఉండదు, మన రాజకీయనాయకుల ‘మీనిఏచర్ రూపాలు’.సంస్థలో ఎక్కడైనా ఏదైనా గొడవ జరిగిందా, అక్కడ వీళ్ళు హాజర్. ఏ గొడవా లేకుండా ఉంటే వీళ్ళకి కడుపుబ్బరం వచ్చేస్తుంది. మన బి.జే.పీ వాళ్ళు చూడండి, ఏ పనీ లేనప్పుడు అయోధ్య లో రామ మందిరం వ్యవహారం మాట్లాడతారు. అలాగే ఈ యూనియన్ నాయకులు, జీతాల ఎగ్రిమెంట్లంటారు.ఇన్ని గొడవలతో ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయడానికి టైము ఎక్కడుంటుంది?

    బ్యాంకుల్లో ఒక్కోసారి ఆఫీసర్లు సమ్మె చేస్తూంటారు! ఏమీ తోచకపోతే చేసే పని ఇదోటి.ఇంకా మన రక్షణ బలాల్లోనూ, పోలీసుల విభాగంలోనూ ఈ సమ్మెల రోగం రాలెదు. నాకు ఒక సంగతి అర్ధం అవదు-’ కోర్ సెక్టార్’ లో చూస్తూంటాము
ఈ సమ్మెలూ అవీ. మరి పాపం ఐ.టీ లొ ఇలాటివేవీ ఉండవా అని.అయినా వాళ్ళననేం లాభం? అసలు ఒకే మనిషి ఒకే సంస్థలో చాలా కాలం పనిచేసిందెప్పుడూ? ఎక్కడ జీతాలెక్కువిస్తే అక్కడికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు జీవితంలో మంచి ‘థ్రిల్’ మిస్స్ అవుతున్నారు!

    ఊరికే ప్రభుత్వ కార్యాలయాల్లోనివాళ్ళనే ఆడిపోసుకుంటే బాగో లేదు. మిగిలిన రంగాల్లోని వాళ్ళ గురించి కూడా చెప్తే ‘బాలెన్స్’అవుతుంది. సరదాగా, మీడియా అంటే ప్రింట్ , టి.వీ. ల్లోని తెరవెనుక భాగవతాల్ని కూడా చెప్తూంటే, ‘ఓహో
మన భారత భూమి ఎంత ప్రగతి సాధించిందీ’ అని చంకలెగరేసుకోవచ్చు.


Categories: Middle

బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–ప్రభుత్వ కార్యాలయాలు

Tue, 05/25/2010 - 13:08

   ఈ వేళ సాయంత్రం ఎన్.టి.వి చూస్తూంటే అందులో ఒక కార్యక్రమం వచ్చింది.ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఎలా ఉంటారు( అసలంటూ ఉంటే!), ఎప్పుడు వస్తారు వగైరా వగైరా.. ఒక్కకళ్ళనీ చూస్తూంటే ఒళ్ళు మండిపోయింది.ఎక్కడైనా సరే కార్యాలయ ముఖ్య అధికారి క్రమశిక్షణ పాటిస్తే, క్రింది వాళ్ళు కూడా పాటిస్తారు. ‘ కంచే చేను మేస్తే’ అన్నట్లు, ఆ అధికార్లే గడ్డితింటూంటే, క్రిందివాళ్ళు వాళ్ళిష్టం వచ్చినట్లు ఉంటారంటే ఆశ్చర్యం ఏమిటి?

   మామూలుగా చూస్తూంటాము-మార్కెట్ లో ఎక్కడ చూసినా ఆ ప్రాంతానికి సంబంధించని ప్రభుత్వ వాహనాలని.ఏ మ్యున్సిపాలిటీ వారిదో,లేక ఏ ఆరోగ్య శాఖ వారిదో వాహనం చూస్తే అనుకోవచ్చు, మార్కెట్ లో ఏదైనా డ్యూటీ మీద వచ్చేరేమో అని. అలవాటు ఏమిటంటే, ప్రభుత్వ అధికారులు, వాహనాల్ని తమ స్వంత పనులకీ,వాళ్ళ కుటుంబసభ్యుల పనులకీ ఇచ్చేరనుకుంటారు.

    ఇక్కడ పూణే లో చూస్తూంటాను- కేంద్రీయ విద్యాలయాల బయట ఆర్మీ వాళ్ళ కారులు. ఆ అధికారి కూతురో, కొడుకో అక్కడ చదువుతూండవచ్చు, వాడిని ఇంటికీ స్కూలుకీ తీసికెళ్ళడానికి, మేమ్ సాబ్ ని మార్కెట్ కి,బ్యూటీ పార్లర్ లకి తీసికెళ్ళడానికీ, ఈ వాహనాలు వాడేస్తూంటారు. ఈ మధ్యన నేను ప్రొద్దుటే ‘కాళీ మందిర్’ కి వెళ్ళినప్పుడు ‘ఓ గవర్నమెంట్ వెహికల్’ ని చుస్తూంటాను. ఇదిక్కడేం చేస్తూందని అడుగుదామనిపిస్తూంటుంది,కానీ అడగడానికి ఏదో సంకోచం!
ఆ అధికార్లకుండాలి క్రమ శిక్షణ అనేది.

    ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే గుమాస్తాలనే చూపించారు, పై అధికారుల గురించి కూడా చూపిస్తే, ఈ టి.వి వాళ్ళ సిన్సియారిటీ ని అంగీకరించేవాళ్ళం.కార్యాలయాలనేమిటి, బ్యాంకుల్లో ( ప్రభుత్వ బ్యాంకులు) వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? బ్యాంకులు జాతీయకరించక పూర్వం, పరిస్థితి కొద్దిగా బాగానే ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా యూనియన్ ల ధర్మమా అని, ఎవరినీ ఏమీ అనకూడదు. లేటు గా ఎందుకొచ్చేవూ అని కానీ,వచ్చిన రెండు మూడు గంటలకే ఎక్కడికి పారిపోయావూ అని కాని. ఏ అధికారైనా అడిగాడా, వాడి పనైపోయిందే.అదేదో ‘ టూల్ డౌన్ స్ట్రైక్కో’ మరోటో చేసేస్తారు.వాడు క్షమాపణ చెప్పేదాకా వదలరు.

   కలకత్తా లో మా అర్డ్నెన్స్ ఫాక్టరీ బోర్డ్ వాళ్ళ హెడ్క్వార్టర్ ఉందిలెండి. అక్కడికి మొదటి సారి వెళ్ళినప్పుడు చెప్పారు, అక్కడ సీట్ లో మనిషిని చూడడం చాలా కష్టం అని. ఆ బిల్డింగు 13 అంతస్థులు ఉంటుంది. ఒక్కో విభాగం ఒక్కో అంతస్థులో. వాళ్ళేం చేస్తూంటారంటే- మీరు ఏ అంతస్థులోకి వెళ్ళినా సరే,ఆ విభాగంలో మొత్తం 50 సీట్లకీ, నలుగురో అయిదుగురో కనిపిస్తారు. ఒక విచిత్రం ఏమంటే, మిగిలిన 45 సీట్లలోనూ, కుర్చీకి ఓ కోటో,సీతాకాలం అయితే ఓ స్వెట్టరో వెళ్ళాడుతూంటాయి. ‘ సొనే పే సుహాగా’ ఏమిటంటే, టేబిల్ మీద ఓ కళ్ళజోడు కూడా ఉంటుంది. అక్కడున్న ఒక్క ‘ప్రాణి’ నీ అడిగామనుకోండి, ఈ సీట్ ఆయన ఎక్కడికి వెళ్ళాడూ అని.
‘ అభీ తక్ యెహీ పే థా, షాయద్ అగలే ఫ్లోర్ మే గయా హోగా’ అంటాడు.అసలు సంగతేమంటే, ఆ సీట్ కి సంబంధించిన ఆసామీ, ఆఫీసుకే రాలేదు. మరి ఆ కోటూ/స్వెట్టరు, కళ్ళజోడూ ఏమిటయ్యా అంటే, అవి మనం దేముడికి పూజ చేస్తాం చూడండి ‘ అలంకారార్ధం గంధం సమర్పయామి’ అన్నట్లుగా, అది అలంకారార్ధమే. అసలువి వాడి వంటి మీదా, కంటి మీదా ఉన్నాయి! వాళ్ళకి ఓ ఎరేంజ్ మెంట్ ఉంటుంది– వారంలో మూడు రోజులు కొంతమందీ, రెండు రోజులు మిగిలినవాళ్ళూ ఆఫీసుకు రావఖ్ఖర్లేదన్నమాట. అంటే మనం వెళ్ళినప్పుడు చూసిన ‘ అక్కు పక్ష్క్షి’ ది ఆఫీసుడ్యూటీ అన్న మాట. మరీ రోజంతా డుమ్మా కొట్టేయరనుకోండి, ఏదో ‘హాఫ్ డే’ ఊళ్ళో పనులన్నీ చూసుకుని, మెల్లిగా అఫీసు మూసేసే టైముకి వస్తాడు.స్వంత పనులూ చూసుకోవచ్చు, జీతమూ వస్తుందీ! హాయి! పైగా దీనికి సాయం వారానికి అయిదు రోజులే ఆఫీసు. శుక్రవారం వెళ్తే ‘వీకెండ్’ అని పనిచేయరు, సోమ వారం వెళ్తే ‘ హాంగ్ ఓవర్’ తో పనిచేయరు. మరి ఫైళ్ళు కదలాలంటే ఎలా కదులుతాయీ?
రాజీవ్ గాంధీ టెల్ కాం లో అదేదో విప్లవం తెచ్చుండవచ్చు, కానీ ఆయన చేసిన పేద్ద దరిద్రపు పని ఏమిటంటే ఈ ‘ ఫైవ్ డే వీక్’.అందరినీ ఇలా చెరిగేస్తున్నారూ, మరి మీరేం చేశారూ 42 ఏళ్ళూ అనకండి.నేను పనిచేసినది ఫాక్టరీ లలో.

   అక్కడ మాకు ఓవర్ టైము అనేది ఒకటుండేది.వారానికి ( ఆరు రోజులు) 54-60 గంటలు ఉండాలి. దానికి ఓ.టీ ఎలవెన్స్ ఇచ్చేవారు.ఏ కారణం చేతైనా, శలవు పెడితే డబ్బులు తక్కువ వచ్చేవి.అందువలన చచ్చినట్లు సంవత్సరానికీ మూడు వందల రోజులూ డ్యూటీ కి వెళ్ళేవాళ్ళం. ఏ శలవైనా వచ్చిందంటే ఆ వారానికి 60 గంటలు పూర్తిచేయడానికి ఆదివారాలు పనిచేసేవాళ్ళం. అలాగని మా వాళ్ళేం బుధ్ధిమంతులనడంలేదు.ప్రొద్దుటే 7.30 కి వచ్చి కార్డ్ పంచ్ చేసి, మెల్లిగా కబుర్లు చెప్పుకుని,8.00 -8.30 కి కుర్చీలో సెటిల్ అవడం, 9.30 కి చాయ్ పేరు చెప్పి ఇంకో అరగంటా, 12.30 కి లంచ్, దానికోసం 11.30 నుండీ బిచాణా కట్టేయడం.తిండీ తిప్పలూ పూర్తిచేసికొని, ఓ కునుకు తీసి మెల్లిగా 2.30 కి సీట్ లోకి రావడం, మళ్ళీ 3.30 కి చాయ్ పానీ ! ఇన్నీ అయ్యేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది….
ఇంకా ఉంది…


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అప్పులు

Mon, 05/24/2010 - 13:07

    ఈ క్రెడిట్ కార్డులూ అవీ రాకముందు, పచారీ కొట్లలో నెలవారీ సరుకులు కొన్నప్పుడు పద్దు రాసేవాళ్ళం.ఓ పుస్తకంలొ కొట్టువాడు వ్రాసుకునేవాడు, దాని డూప్లికేటు కాపీ మన దగ్గర ఒకటుండేది. నెల పూర్తి అవగానే మన సావకాశాన్ని బట్టీ, చేతిలోకొచ్చిన జితాన్ని బట్టీ ఆ ‘అప్పు’ తీర్చేవాళ్ళం. ఎప్పుడైనా పెద్దవాళ్ళకి కొట్టుకి వెళ్ళడానికి తీరికలేకపోయినా, పిల్లల్ని ఆ ‘పుస్తకం’ ఇచ్చి పంపితే, సరుకులు ఇచ్చేవాడు. ఆ రోజుల్లో వచ్చే జీతాల్ని బట్టి ఈ ‘ఖాతా’తప్పనిసరై ఉండేది. జీ.పీ.ఎఫ్ కీ, సొసైటీకీ, పోనూ చేతికి ఎంతోకొంత వచ్చేది. ఆ చేతిలొకి వచ్చిన దానిలోనే సర్దుకుని కాలక్షేపం చెసేవాళ్ళూ. స్వంత ఇంటి ‘కల’ కలగానే మిగిలిపోయేది.ఎప్పటికో, పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళూ ఓ కొలిక్కి వచ్చిన తరువాత, ఇంటావిడ పోరు పెట్టగా పెట్టగా మొత్తానికి ఓ కొంప ఏర్పరుచుకునేవాళ్ళు.

    ఈ లోపల రోగాలు వచ్చినా , రొచ్చులు వచ్చినా మళ్ళీ ఎవడిదగ్గరకో వెళ్ళి చెయ్యి చాచవలసివచ్చేది. ఆ ఇంటాయన అదృష్టం బాగుంటే రిటైర్ అయ్యేనాటికి, పిల్లల పెళ్ళిళ్ళూ,చదువులూ పూర్తిచేసి, స్వంత కొంపలో సెటిల్ అయ్యేవాళ్ళు.ఇంత హైరాణ పడినా ఏ పెద్దమనిషీ తను ఏదో త్యాగాలు చేసేనని ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలెదు.పెళ్ళి చేసికుని, ఓ సంసారం ఏర్పరుచుకున్నాడు కనుక వాళ్ళని పోషించడం ఓ బాధ్యత గా తీసికుని నిర్వర్తించే వాడు. సంసారం గురించి పట్టించుకోకుండా, తన త్రాగుడుకీ మిగిలిన వ్యసనాలకీ దాసులైన వాళ్ళూ ఉండేవారనుకోండి, కాని వారి శాతం బహు తక్కువ.

    ఇంకొ సంగతేమంటే ఆ రోజుల్లో ‘కన్జ్యూమరిజం’ అంత ఎక్కువ కాదు, ఉన్నదాంట్లోనే సంతృప్తి గా బ్రతికేసేవాళ్ళు. పిల్లలకి అప్పో సొప్పో చేసి చదువులు చెప్పించేస్తే వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడితే చాలనుకునేవారు.ఎంత చెప్పినా ఆ జీవితంలోనే ఎంతో సంతోషమనిపించేది. అదీ ఓ సంతోషమేనా అని ఈ తరం పిల్లలు అంటారనుకోండి, అది వేరే విషయం.ఎవరి అభిప్రాయం వాళ్ళది.మేం పెట్టిన ఖర్చులు, మా తల్లితండ్రులకి వేస్ట్ గా కనిపించి ఉండవచ్చు.అలాగే ఇప్పటి తరంవాళ్ళు చేసే ఖర్చులు పాత తరంవాళ్ళకి వేస్టనిపించొచ్చు.

    ఈ రొజుల్లో ఈ క్రెడిట్ కార్డుల ధర్మమా అని, ప్రతీ వాడూ ఈ అప్పుల బారిలో కూరుకుపోతున్నాడు.ఆఖరికి ఇదివరకు ‘పద్దు పుస్తకం’లో వ్రాయించుకున్న పచారీ కొట్టువాడుకూడా, క్రెడిట్ కార్డులు స్వీకరిస్తున్నాడు! ఇదివరకు వాడికి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు బ్యాంకు వాడు వేసే ‘ వడ్డీ’ తో కలిపి బ్యాంకు వాడికి ఇస్తున్నాము. అంతే తేడా! ఏదో ఆమధ్య ‘ఆర్ధిక మాంద్యం’ ధర్మమా అని కొంతలోకొంత ఇటువంటివి కంట్రోల్ అయ్యాయి . మళ్ళీ మామూలే.

   ఈ గోలంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈ వేళ టి.వీ. చూస్తూంటే ఓ బ్యాంకు వాడి యూనియన్ బ్యాంకో ఇంకోటో యాడ్ చూశాను. వీడు ( అంటే అప్పు తీసికున్న ‘బక్రా’) ఫ్లాట్ కోసం ఏదో ఫలానా ఎమౌంటు అప్పు తీసికున్నాడుట,
వచ్చే 25 సంవత్సరాలూ ఆ అప్పు తీర్చుకోవచ్చుట, అప్పుడు ఈయనగారి ‘బేటా’ అనుకుంటాడుట ‘ మేరా బాప్ కిత్నా హోషియార్ థా నా!
అని.ఇదివరకటి రోజుల్లో ప్రతీ తండ్రీ అనుకునేవారు–’ ఆస్థులు ఇచ్చినా లేకపోయినా, అప్పులు మాత్రం వారసత్వంలో ఇవ్వకూడదూ’ అని.దానికి ఉల్టా ఈ రోజుల్లో ! మనం ఎంత అప్పుచేస్తే అంత గౌరవం. మన బ్యాంకుల వాళ్ళు ఎన్.పీ.ఏ అనో ఇంకేదో ఓ పేద్ద గ్లామరస్ పేరు పెట్టి చెప్తూంటారు, ‘ నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్’అని.

    మీరూ నేనూ ( మధ్య తరగతి లా ఎబైడింగ్ సిటిజెన్స్) అప్పు చేస్తే, గూబ పగలకొట్టి వసూలు చేస్తారు, మనం అప్పుచేసికొన్న ఫ్లాట్ వేలం వేసో, అప్పుచేసి కొన్న కారుని టౌ చేసి తీసికునిపోయో. వీళ్ళ ‘ఎన్.పీ.ఏ’ లలో సింహభాగం
సంఘంలో పెద్ద మనుష్యులుగా చెలామణీ అయ్యే రాజకీయ నాయకులూ, గూండాలూ మాత్రమే. వాళ్ళని ఏం చెయ్యలేరు.

   ఈ క్రెడిట్ కార్డుల ధర్మమా అని వందరూపాయలు ఖర్చుపెట్టే చోట వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాము. 45 రోజులదాకా ఇవ్వఖర్లేదుగా! అప్పుడైనా ఓపిక ఉంటే ఇస్తాము, లేకపోతే ‘మినిమం ఎమౌంటు’ తో సరిపెట్టేసికుంటాము.
ఫోను ఎత్తితే చాలు, ఏ బ్యాంకు వాడో, మీకు క్రెడిట్ కార్డ్ ఇస్తామంటూ.నేను ఏం చేస్తూంటానంటే, కాలక్షేపానికి వాడు చెప్పే సోదంతా విని, చివరలో చెప్తూంటాను, ‘ నాకు జీతంభత్యం లేదోచ్, పెన్షన్ మీద బ్రతుకుతున్నానూ’అని.అంతే,తుపాకీ గుండుకు కూడా దొరక్కుండా ఫోన్ పెట్టేస్తాడు!అలాగే ఈ మధ్యన ‘హెల్త్ ఇన్స్యూరెన్స్’ వాళ్ళ గోల ఎక్కువైపోయింది. వాళ్ళ ఫోన్ రాగానే,వాడు చెప్పే బక్వాస్ అంతా విని ఆఖరున చెప్తాను- నాకు 65 ఏళ్ళు నిండాయీ అని!

    ఇదివరకటి రోజుల్లో కొన్ని దుకాణాల దగ్గర బోర్డులుండేవి–’అరువు లేదు’ అని. ఇప్పుడు అలా కాదు ‘ వుయ్ యాక్సెప్ట్ ఆల్ క్రెడిట్ కార్డ్స్’ అని. అదీ అప్పటికీ, ఇప్పటికీ తేడా !! ఇదివరకు కొట్ల వాళ్ళు కూడా మనల్ని అప్పులు చేయకుండా సహాయపడేవాళ్ళు. ఇప్పుడో మనం ఎంత ‘అప్పుల’ ఊబిలో కూరుకుంటే అంత ఆనందం అందరికీ. సర్వే జనా సుఖినోభవంతూ !!!


Categories: Middle