http://harephala.wordpress.com/feed/

Syndicate content PHANI BABU  -musings
Updated: 16 min 31 sec ago

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–కొంపా గోడూ-4

Wed, 07/07/2010 - 13:04

    పట్టణాల్లో ఖాళీ స్థలాలు,కొంతమంది కొనుక్కుని,అందులో ఓ డాబా కట్టుకోవడం చూశాముగా, ఇప్పుడు నగరాలకొద్దాము.ఉదాహరణకి నేను 45 ఏళ్ళనుండి పూణే లోనే ఉంటున్నాను.వచ్చిన కొత్తలో చాలా ఖాళీ స్థలాలుండేవి.ఉంటేమాత్రం, కొనుక్కోడానికి,ఆర్ధిక స్థోమతకూడా ఉండాలిగా.ఇన్నాళ్ళున్నావూ, ఓ గుంఠా(మరాఠీ మాట) స్థలమైనా కొనుక్కోలేకపోయావా, అని చాలా మంది అడిగారు.మనకొచ్చే జీతంలో,స్థలాలే కొంటామా, పెళ్ళాం పిల్లల్ని పోషిస్తామా?ఇంకో విషయం-ఒక్క జీతం మీదే వెళ్ళాలి,అదికూడా వేలూ లక్షలూ కాదు.ఉన్న ఇద్దరు పిల్లలకీ, కడుపు మాడ్చకుండా,చదువు చెప్పించగలిగేమూ అంటే, అదంతా భార్య చలవే.ఎక్కడో అక్కడ, సంతృప్తీ అనేది ఉండాలి.ఇప్పుడు, మా స్నేహితులు చాలామంది, స్వంత బంగళాల్లో ఉంటున్నారంటే
రెండు కారణాలు,మొదటిది వాళ్ళవి double income లు. రెండోది income from other sources ( పోస్టల్ ఏజెంటో, ఎల్.ఐ.సి ఏజంటో,స్టాక్ బ్రోకరో, ట్యూషన్లో).అలాటి నైపుణ్యాలేవీ నాకు లేవు.లేవని ఏడ్చేకన్నా, ఉన్నదానితో సంతృప్తిపడడం నాకు హాయనిపించింది. పైన చెప్పిన కారణాలకి తోడు ఇంకోటుంది, పుట్టింటినుంచి ఆస్థైనా కలిసిరావాలి.ఈ మాత్రం చదువుచెప్పించి, నా తిండి నేను తినేటట్లు చేయగలిగేరు, ఇంకా,b> ఏవో అవి ఇవ్వలెదూ, అవీవ్వలేదూ అని ఏడవడం దేనికీ? ఎంత ఏడిస్తే అంత miserable అవుతుంది జీవితం!

   ఏదో చెప్తూ,దేంట్లోకో వెళ్ళిపోయాను.లేని పోని వేదాంతంతో కడుపులు నిండుతాయా అనకండి, నాకు నిండింది! I dont have any complaints. మొన్నామధ్యన, మా అబ్బాయి ఫ్రెండూ వాళ్ళింటికి భోజనానికి వెళ్ళాము. ఊరికి చాలా దూరంలో ఉంది.ఇంట్లోకి వెళ్ళిన తరువాత, ‘అబ్బ ఇలాటి ఇల్లుంటే బాగుండునూ’ అని, ఓ wave లాటిదోటి వచ్చింది, (నాక్కాదు!)
ఆ ఇంటి యజమాని చెప్పేవన్నీ వినాలి. ఎప్పుడో 20 సంవత్సరాలక్రితం గజం throwaway price లో( ఇప్పటి రేట్లతో పోలిస్తే),స్థలం కొన్నారుట,అక్కడ ఏవో తిప్పలు పడి ఓ ఇల్లు కట్టారుట.మాకు తణుకులో ఉన్న ఇల్లులాగానే ఉంది.అమలాపురంలో ఉన్న ఇంటితో కంపేరు చేస్తే, దాంట్లో సగం కంటె తక్కువ.ఇప్పుడు నేనేమీ వాళ్ళని,కించపరుస్తున్నాననుకోకండి,’ఎంత చెట్టుకంతగాలి’.ప్రస్తుత రేట్లతో పోలిస్తే,ఓ కోటిరూపాయలపైనే ఉంటుంది.అలాగని ఆయనేమైనా అమ్మేడా ఏమిటీ ఏదో తంత్తుప్తి కోసం, అనుకోడం, వచ్చిన వాళ్ళు కళ్ళల్లో నిప్పులుపోసుకోడం తప్పించి ఇంకోటేమీ లేదు. ఎవరి సరదా వాళ్ళదీ.

   ఊరికి పదిహేను మైళ్ళదూరంలో ఉంది కాబట్టి, చుట్టం అనేవాడెవడూ రాడు,ఎందుకంటే అంతకుముందరోసారి వచ్చి, ఊళ్ళోకి వెళ్ళడానికి నానా పాట్లూ పడ్డాడు.అది పూణె అయినా సరే, హైదరాబాదైనా సరే.విడిగా బంగళాలూ అవీ కట్టించుకోవాలంటే, ఈ రోజుల్లో చేతిలో డబ్బులుండాలి బాబూ.ఓ మాట చెప్పండి, ఇప్పటి పరిస్థితుల్లో, ఎవరైనా ( మిడిల్ క్లాసు వాడు, సాఫ్ట్ వేరు వాడు కాదు), ఏ అమీర్ పేటలోనో ఓ విడిగా ఉండే ఇల్లు కట్టించుకోగలడా? విడిగా ఇల్లు కావాలంటే ఊరికి దూరంగానే వెళ్ళాలి, అది హైదరాబాదైనా, ఇంకో కొంకాపల్లైనా సరే. కట్టారండీ, స్వంత ఊళ్ళో ఉన్న తల్లితండ్రుల్ని తమతో ఉండడానికి తెస్తారు. మీదారిన మీరు ఆఫీసుకి ఒకళ్ళు సెక్రటేరియట్ కీ, ఇంకోళ్ళు ఓ బ్యాంకుకీ పోతారు.వచ్చిన కొత్తలో బాగానే ఉంటుంది, రోజులు గడిచేకొద్దీ,తెలుస్తుంది అందులో ఉండే కష్టాలు.ఊరికి దూరంగా ఉండడంతో ఏ పంచాయితీలోనో ఉంటుంది. కార్పొరేషన్ నీళ్ళు రావు, అధమపక్షం వచ్చినా వాటికి ఏవేవో లిమిటేషన్లుంటాయి.ఓ బస్సు రాదూ, ఓ ఆటో దొరకదూ, ఆఖరికి ఇంటర్నెట్ బ్రాడ్ బాండు కూడా ఉండదు. నాలాటి వాడిని అలాటి చోట కోట్లిచ్చినా ఉండలేడు.ప్రతీ వాడికీ బ్రాడ్బాండుండాలా అనకండి, ఏదో ఒక కాలక్షేపం ఉండాలికదా.ఆఖరికి న్యూస్ పేపరుకూడా ఓ టైముకి రాదు.పొద్దుటే ఆఫీసులకెళ్లిన కొడుకూ, కోడలూ, స్కూళ్ళకీ, కాలేజీలకీ వెళ్ళిన పిల్లలూ, కొంపకెప్పుడు చేరతారో తెలియదు.
ఆఖరికి గాస్ అయిపోయినా, ఇంకో సిలిండరెప్పుడిస్తాడో భగవంతుడిక్కూడా తెలియదు.సో కాల్డ్ మధ్యతరగతి వాళ్ళం, BPL లోకి రాము కాబట్టి, కిరసనాయిలు కూడా దొరకదు.పనిమనిషి సంగతడక్కండి.అవసరం వస్తే డాక్టరు దగ్గరకి వెళ్ళాలంటే,నరక యాతన పడాలి.సాయంత్రానికి కొడుకూ కోడలూ వస్తారు,అప్పటిదాకా బతికుండాలికదా!

    పైగా ఊరికింత దూరంలో ఎందుకు తీసికున్నారూ అంటే, అక్కడెక్కడో ఉన్న రాబోయే,IT hub చూపిస్తారు.పోనీ వచ్చిందే అనుకోండీ,వీళ్ళకేం లాభంట, ఓ నారాయణమూర్తో, ఓ ప్రేమ్ జీ కో లాభం కాని. ఊరు పెరుగుతుంది, పెరక్కుండా ఉంటుందా, కానీ ఎప్పటికి? ఎప్పటికో, మన అదృష్టాన్నిబట్టి,అయిదేళ్ళో, పదేళ్ళో, రాత్రికి రాత్రేమీ పెరిగిపోదుకదా!

   పైగా ఊళ్ళోనే కూతురు కూడా ఉంటోందనుకోండి, అమ్మా నాన్నా అక్కడే ఉంటున్నారుకదా అని, నెలకో,ఏ రెండునెలలకో వస్తూంటారు. వాళ్ళు నగరానికి నడిబొడ్డులో ఉంటారనుకుందాము, ఏ IT లోనో పనిచేసే అల్లుడో అయితే, ఓ ఎపార్ట్మెంటు అద్దెకో,దేనికో తీసుకుని ఉంటూంటాడు.పెళ్ళాం మాట కాదనలేక ఓ శనాదివారాల్లో, ప్రత్యేకంగా ప్రోగ్రాం పెట్టుకుని, పిల్లలింకా లేకపోతే, బైక్కుమీదా, పిల్లలుంటే కారుమీదా
ముందుగా చెప్పుకుని వస్తారు.వీళ్ళు చెప్పకపోవడం వల్ల,ఈ IT hub కి దగ్గరలో ఉన్నవాళ్ళెక్కడికో పోతారనికాదు, ఆ వచ్చిన వాళ్ళకి extra గా పాలూ, పాపాలూ తెచ్చుంచాలికదా.దగ్గరలో ఓ హొటల్ కూడా ఉండదు, ఏదో పాక హొటల్ తప్పించి. అల్లాటివాటిల్లోకి వెళ్ళడానికి IT అల్లుడుగారికి నచ్చదూ. ఏదో కిందా మీదా పడి, ,b>హా అమ్మా, ఆహా నాన్నా అంటూ కూతురి పలకరింపులూ, హాయ్ అంటూ అల్లుడుగారి పలకరింపూ అవుతాయి.
అంతదూరంనుంచి వచ్చి మరీ గంటా రెండు గంటల్లో వెళ్ళిపోలేరుకదా, సాయంత్రందాకా ఉంటారు. ఈ లోపులో వాళ్ళతో ఎ చిన్నపిల్లలైనా వచ్చేరంటే ఇంక చూసుకోండి, మమ్మీ వెళ్ళిపోదాం, బోరుకొడుతోందీ అంటూ పేచీ. ఈ లోపులో అల్లుడుగారు సెల్ ఫోన్లో ఎవరెవరితోనో మాట్లాడేస్తూంటాడు. ‘हां यार मॅरा इनलास का वहां हूं। क्याकरँ कभी कभी सुन्ना पड्ताना!’అంటూ.
వాళ్ళని తిడుతున్నాడో లేక పొగుడుతున్నాడో తెలియదు, పెద్దాళ్ళకి, అందులో ఇన్లాస్ అనేమాటోటీ అర్ధం అవుతుంది, ఎంత చెప్పినా,ఆంధ్రదేశ నడిబొడ్డునుండొచ్చినవాళ్ళూ !!

మిగిలినవి ఇంకో పోస్ట్ లో !


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-కొంపా గోడూ-3

Tue, 07/06/2010 - 13:01

    ఈ గృహప్రవేశం కార్యక్రమాలు పూర్తయిన తరువాత, అల్లుడుగారు శలవు పూర్తయిందనే వంకతో తన ఉద్యోగానికి, పెళ్ళాం పిల్లలతో వెళ్ళిపోతాడు. ఎవరైనా అడిగితే ఇల్లు పూర్తయిందని చెప్పాలో, లేక ఇంకా అవలేదని చెప్పాలో తెలియదు.కళ్ళుమూసినా, తెరిచినా ఆ అసంపూర్తి కొంప,రాత్రిళ్ళు భౌభౌ మనే కుక్కల అరుపులే వినబడుతూంటాయి.ఉల్లిక్కి పడి లేవడం.ఈలోపులో,
ప్రభుత్వం తనపని తాను చేసికుంటూ పోతుంది-వీడికి ఇచ్చిన అప్పు వాయిదాలు జీతంలోంచి కోసేయడం!

   మొత్తానికి ఓ ఏణ్ణర్ధం తరువాత ఓ శుభముహూర్తాన్న మామగారిదగ్గరనుండి,ఓ ఉత్తరం వస్తుంది,ఆరోజుల్లో ఫోన్లూ వగైరా లేవుగా.తలుపులూ,కిటికీలూ,గచ్చూ, కాంపౌండ్ వాలూ, ఒకటేమిటి
అన్నిహంగులతోటీ ఇల్లు (డాబా) కళకళలాడేస్తోందని. మరి ఓసారి చూసుకోవద్దూ, ఇన్ని సంవత్సరాలకి తనూ ఓ ‘ఇంటివాడు’ అయ్యాడుగా!కుటుంబ సమేతంగా మళ్ళీ వెళ్తాడు.అందరూ సంతోషిస్తారు.మర్నాడు,మళ్ళీ సైకిలు రిక్షాలో తనూ,పెళ్ళాం పిల్లలూ, ఇంకో రిక్షాలో అత్తగారూ,మరదళ్ళూ,ఆ వెనకాలే మావగారు యాజ్ యూజుఅల్ లూనా మీదా వెళ్తారు.మామగారూ,అత్తగారూ దూరంనుంచే చూపిస్తారు- అదిగో అల్లదిగో శ్రీహరివాసమూ-అంటూ. కొత్తగా సున్నాలు వేసి, పెయింట్లేసి, ఇంకా ప్లాస్టరింగు చేయకుండా ఉన్నటువంటి కాంపౌండ్ వాలూ, మెరిసిపోతూంటాయి!’ అహో ఆంధ్రభోజా…’ అంటూ ఓ పాటపాడేసికుంటాడు అల్లుడుగారు (ఎవరికీ వినబడకుండా).అమ్మయ్య మొత్తానికి ఓ ఇంటికి యజమాని అయ్యానూ అనుకుంటూ, భార్యవైపు ఓ లుక్కేస్తాడు.‘సంబడమే, మా నాన్నే లేకపోతే అయ్యేదా‘ అని ఆవిడ ఓ రిటార్ట్ ఇస్తుంది.

    డాబామీదకి భార్యా,పిల్లలతో ఓసారి వెళ్ళి చూస్తే, కనుచూపుమేరలో, అక్కడోటీ, ఇక్కడోటీ ఇలాటి డాబాలు కనిపిస్తాయి.ఒక్కసారి కాంపౌండులో పెట్టిన ‘బోరు కుళాయి’ తనోసారీ,పిల్లలోసారీ,భార్యోసారీ కొట్టుకుని ఆ మంచినీళ్ళు త్రాగుతారు.అబ్బ అమృతంలా ఉన్నాయీ అనుకుంటూ. వీళ్ళొచ్చారుకదా అని, వీళ్ళందరిచేతా స్థలాలు కొనిపించినాయన,తిప్పలు పడ్డాడుకదా అని ఆయన్నే సెగరెట్రీ చేస్తారు, వచ్చి హలో హలో లూ వగైరా అయినతరువాత,మీరు వచ్చి ఇక్కడుండేది ఎక్కళ్ళెండి, అద్దెకిచ్చేస్తే హాయీ అంటాడు. పోన్లే ఇదీ బాగానే ఉందీ, మనకయ్యే కటింగులో కొంతకాపోతే కొంతైనా కలిసొస్తుందీ అనుకుంటాడు అల్లుడుగారు.

    తిరిగి మళ్ళీ ఓ ఏణ్ణర్ధం తరువాత కొంపెలా ఉందో చూసుకోడానికి వస్తాడు.అప్పటికి మావగారుకూడా, రిటైరయిన తరువాత వచ్చిన డబ్బుతో, ఎక్కడా అప్పుచేయకుండా,తనుకొన్న స్థలంలోనే కొంచెం మోడరన్ గా ఓ ఇల్లు కట్టి,తను దాంట్లో ఉండి, అల్లుడుగారిల్లద్దెకిచ్చేస్తారు.ఇదివరకెప్పుడొచ్చినా మావగారు, ఊళ్ళో ఉండేవారు కనుక, దగ్గరలో అన్నీ ఉండేవి.ఇప్పుడు ఆయనకూడా, ఈ కాలనీలోకే రావడంతో, బస్సు దిగి, మళ్ళీ సైకిలు రిక్షాలో, అత్తారింటికి వస్తాడు. గృహప్రవేశం టైములో చెప్పినట్లుగా సిమెంటు రోడ్డులూ, వీధి దీపాలూ ఏమీ కనిపించవు.ఏమైనా కావలిసొస్తే మెయిన్ రోడ్ దాకా చీకట్లో నడిచిపోవడమే. ఇదివరకైతే సినిమా హాళ్ళు దగ్గరలోనే ఉండేవి. ఇప్పుడు సినిమాకి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, తిరిగి కొంపకి చేరడానికి ఒక్క రిక్షావాడూ ఛస్తే రాడు.ఇంక సినిమాయేంటి? ఎవరికైనా ఫోన్ చెయ్యాలంటే, ఓ మైలు దూరంలోఉన్న ఎస్.టి.డి. బూత్ దాకా వెళ్ళాలి.ఇలాటి కష్టాలు కోకొల్లలు.
వీటన్నిటికంటే దారుణం, ఈ అల్లుడుగారు అంత శ్రమా పడి కట్టించిన కొంప యజమాని తనే అని ఒక్కడంటే ఒక్కడూ గుర్తించడు.ఎవరు చెప్పినా, ఆ మాస్టారి పెద్దమ్మాయి ఇల్లూ అనే అంటారు! పోన్లెద్దూ ఇక్కడికి వచ్చి ఉండేదా పెట్టేదా అనుకుని పెద్ద పట్టించుకోడు.కాలక్రమేణా,రాబొయే పదేళ్ళలోనూ, ప్రతీ ఏణ్ణర్ధానికి ఓసారి వచ్చి చూసుకుని( ఈ ఏణ్ణర్ధం benchmark ఏమిటా అనుకోకండి, ఓసారి అంతదూరం నుండి, పెళ్ళాంపిల్లలతో వచ్చి, సైకిలురిక్షాలెక్కి, రెండు రైళ్ళు మారి, చేతికి వస్తుందనుకున్న ఇంటద్దె, ఇంటికి పండగలకి సున్నాలు వేయించడానికీ,చిన్నా చితకా రిపేర్లకీ పోగా,జీతంలో అప్పుతాలూకు కటింగులు పోగా,మళ్ళీ తేరుకోడానికి పడుతుందన్నమాట ఈ ఏణ్ణర్ధం!), అక్కడ తన కాంపౌండులో వేసిన జామి చెట్టు కాయలు పచ్చిగా ఉన్నాసరే కొరుక్కు తిని, మళ్ళీ బోరింగు పంపులో నీళ్ళు కొట్టుకుని త్రాగి,అద్దెకున్నవాళ్ళేమైనా అదిలేదూ, ఇదిలేదూ అంటారేమో అని భయపడుతూ,అక్కడ పెళ్ళాన్ని ముందుకు తోస్తూ, పిల్లలు డాబామీదకెళ్ళి ఆడుతూంటే ఆనందభాష్పాలు రాలుస్తూ, ఓహో ఇల్లు కట్టడంలో ఇంత ఆనందం ఉందా అని ఆశ్ఛర్యపడిపోతూంటాడు.

    చేతికి వచ్చే ఇంటద్దె ఎలాగూ కనిపించడం లేదు,రిటైరయినతరువాత అక్కడ సెటిల్ అయేదీలేదూ,ఎందుకంటే అప్పటికి జ్ఞానోదయం అవుతుంది, తన జీతంలో కటింగు పూర్తయే టైముకి
ఇల్లు అమ్మకానికి పెట్టేస్తాడు. ఇవండీ పట్టణాల్లో ఊరికి దూరంగా ఏదో చవకలో వస్తోందికదా అని ఇల్లు కట్టుకుంటే వచ్చే కష్టాలు.
ఇంక నగరాల్లో స్వంత ఇంటి కష్టాలు ఇంకో పోస్టులో…..


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-కొంపా గోడూ–2

Mon, 07/05/2010 - 13:51

    ఊరికిదూరంగా ఉండే ఖాళీ స్థలాల్లో, ఏదో అందరూ కలిసి కొనుక్కుంటున్నారు కదా,కొద్దిగా చీప్ గా దొరుకుతోందికదా అని,మన మామగారో,ఇంకోరో, కూతురూ,అల్లుడూ రిటైర్ అయినతరువాత దగ్గరలోనే ఉంటారూ అనే సదుద్దేశ్యంతో,ఆయన ఓ రెండు స్థలాలకి apply చేస్తారు.చేసినవాడూరుకోకుండా, కూతురికి ఓ ఇండెంటు పెడతారు.తరవాత ఏమౌతుందో చెప్పఖ్ఖర్లేదుగా,ఆ అల్లుడుగారు దీనికి బలైపోతాడు!ఓ స్వంతకొంప ఏర్పాటుచేసికోవడం,మంచిదేఅనుకోండి,ఇంట్లో మామగారి కూతురు అనబడే తన భార్య ప్రతీరోజూ,పగలనకా,రాత్రనకా పెట్టే ప్రెషర్ కి succumb అయిపోతాడు! సరేనంటాడు, ఇంకేంచేస్తాడూ?

    ఇలా స్థలం కొనుక్కున్నానూ అనే విషయం,తన పుట్టింట్లో చెప్పడు ముందర.మామగారూరుకోరుకదా,ఎప్పుడో ఖబుర్లలో ఈ విషయం కాస్తా చేరతీస్తారు.మా అల్లుడు ఎంత ప్రయోజకుడయ్యాడో అనుకుంటూ.ఆయన సంబరం ఆయనదీ! కానీ ఇదంతా అల్లుడు గారి ప్రాణం మీదకొస్తుంది.ఏ శలవుల్లోనో ఇంటికి( అల్లుడుగారి) వెళ్ళినప్పుడు,ప్రారంభం అవుతుంది.ఆమాత్రం స్థలం తీసుకోవాలని ఉన్నప్పుడు, నాతో కూడా ఓ మాటనొచ్చుగా,ఇక్కడే ప్రయత్నం చేద్దుమూ అంటూ.పెళ్ళాం చేతిలో
కీలుబొమ్మైపోతున్నాడే అని భయం తప్ప,అక్కడ స్థలం తీసికున్నాడనికాదు
వాళ్ళ బాధ! అలాగని అక్కడోటీ,అత్తారి ఊర్లో ఓటీ తీసికునే ఓపిక అల్లుడుగారికి ఉండదు.ఏదో ఈ బాలారిష్టాలన్నీ దాటుకుని,స్థలానికి registration కార్యక్రమాలు పూర్తి చేస్తాడు. ఇంక మామగారు, కూతుర్నీ, అల్లుడినీ ఓ సైకిలు రిక్షాలో పడేసి, తను ఓ లూనా మీదో,ఇంకోదానిమీదో ఫాలో అయి, ఓ అరగంటా, నలభైఅయిదునిమిషాలు, ఆ సైకిలురిక్షాలో కుదుపులు భరించిన తరువాత ఓ పేద్ద ఇలాకాకి తీసికెళ్తారు.అక్కడ ఉన్నవన్నీ మనకి ఒకలాగే కనిపిస్తాయి. ఏదో ఓ తాటి చెట్టు ఉన్న ప్లాట్ చూపించి,నాలుగు వైపులా సిమెంటు రాళ్ళతో,డిమార్క్ చేసిన ఖాళీ స్థలం ఓటి చూపించి,ఇదేనమ్మా మీ ప్లాట్ అని కూతురికి చూపిస్తారు.
ఇంక ఆ కూతురు ఎంత సంబరపడిపోతుందో,అబ్బ మనంకూడా ఇక్కడో డాబా వేసేసికోచ్చు అనుకుంటూ,ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలో ఊహించేసికుని కలలు కనేస్తూంటుంది.
ఇక్కడ అల్లుడిగారికేమో అంతా అగమ్యగోచరంగా ఉంటుంది-ఇదేమిటీ మావగారు, ఓ తాటిచెట్టుచూపించి ఇదంతా మనస్థలం అంటాడూ అని.ఆ మామగారు ఊరుకోడు, ఆస్థలం మనకిప్పించడానికి ఎన్ని తిప్పలు పడ్డారో, రోడ్డుకి కార్నర్ లో ఉండేలా ఎలా చూశారో, అడ్డరోడ్లెన్నో, పార్కెక్కడొస్తుందీ,గుడెక్కడొస్తుందీ లాటివన్నీ అరటిపండొలిచిచ్చినట్లుగా చెప్తారు. ఎప్పటికిల్లు కట్టనూ, దానికి అప్పెలా వస్తుందీ,ఆ కట్టిన కొంపలోకి ఎప్పుడొచ్చుంటాడూ, తను రిటైరవడానికి ఇంకా 30 సంవత్సరాలుంటుంది. ఇన్ని గొడవలున్నాసరే ఏదో స్వంత గూడు ఏర్పాటు చేసికునే ప్రకరణంలో, ఓ స్థలం దాకా వచ్చాడు!

    ఇల్లు ఎలాగోలాగ మామగారి ఆధ్వర్యంలో కట్టించేస్తారు.ఇంక అక్కడినుంచీ గృహప్రవేశం హడావిడీ. ఏదో ముహూర్తం బాగా బలంగా ఉంటుందని, ఏ శ్రావణ మాసంలోనో ఫిక్స్ చేస్తారు. అప్పటికి ఇల్లుకట్టడం అదీ పూర్తవదు.గోడలుంటాయి, రూమ్ముల షేప్పులుంటాయి,గచ్చూ వగైరాలేమీఉండవు, కిటికీలకీ,గుమ్మాలకీ ఖాళీలుంటాయి వాటికి తలుపులుండవు. ముహూర్తం టైముకి ఓ టెంపరరీ గా ద్వారబంధం ఓటి తెచ్చి పని కానిచ్చేస్తారు. ముహూర్తం అయినతరువాత, మూడు నిద్రలు చేయాలిట ఆ కొంప అనబడే ఏరియాలో.లేకపోతే ఇంటికి శుభం కాదుట.రాత్రంతా అక్కడ ఉండడానికి,ఇంకోళ్ళెవరూ ఉండరు.అలవాటు పడ్డాయి కాబట్టి దగ్గరలో ఉండే కుక్కలు తప్ప.మిగిలినవాళ్ళందరూ హాయిగా ఊళ్ళోనే ఉంటారు,వాళకేంపట్టిందీ ఈ అడివిలో ఉండడానికి!
రాత్రంతా నిద్దరెక్కడపడుతుందీ,ఎవడొచ్చి పీకనొక్కుతాడో అనే భయం.ఓ రాత్రివేళ చీకట్లో ఏ నేచర్ కాల్ కో వెళ్దామంటే, కుక్కలన్నీ కొంపలంటుకుపోయేట్లు మొరగడం.ఎలాగూ ఇల్లు పూర్తికాలేదు కదా అని,అక్కడే ఎక్కడో పనికానిచ్చేద్దామా అనుకుంటే, మధ్యలో పెళ్ళాం లేచి తిడుతుందేమో అని భయం ఓ మూలా!నరకమండి బాబూ,ఇళ్ళు కట్టడం పూర్తవకుండా సెంటిమెంటు కోసం గృహప్రవేశం చేయడం!ఇంకా తెల్లారకుండానే లేచిపోయి,వెళ్దామంటే,గృహప్రవేశ ముహూర్తానికి అద్దెకు తెచ్చిన జంబుఖానాలూ,టెంటులూ, గ్లాసులూ , సత్యన్నారాయణ పూజకి పెట్టిన దేముడూ, వాళ్లందరికీ కాపలా ఉండాలి.టెంటద్దెకిచ్చినవాడు వచ్చి వాడితో పాటు క్యాటరింగు చేసినవాడు వచ్చి వాడి సరుకులూ తీసికెళ్ళేదాకా యజమాని బాధ్యతే
( ఇక్కడ మనం అని అర్ధం చేసికోవాలి). గృహప్రవేశం అయినప్పటినుండీ మనం కదా యజమానీ.ఆ క్యాటరింగువాడికీ, మనకీ ఎప్పుడూ ఛస్తే లెఖ్ఖ సరిపోదు.ఎక్కడో ఓ చంచా, ఓ గ్లాసూ తక్కువయిందంటాడు. మావగారు ఊళ్ళోంచి ఓ ఫ్లాస్కులో కాఫీ ( కూతురూ,అల్లుడికోసం) తీసికొచ్చేదాకా అక్కణ్ణుంచి కదలాడానికి కుదరదు!

   ఈ తతంగమంతా పూర్తిచేసికుని ఊళ్ళోకి బయలుదేరాలంటే ఓ రిక్షా కావాలంటే మళ్ళీ మెయిన్ రోడ్డుదాకా నడవాలి.ఇన్నితిప్పలూ పడి సాధించేమయ్యా అంటే ఇంకా పూర్తిచేయని ఓ ఇల్లులాటి పదార్ధమూ,క్యాటరింగు వాడిచేతిలో చివాట్లూ( ఓ చంచా, గ్లాసూ తప్పిపోయిన సందర్భంలో).మళ్ళీ రెండో రాత్రి నిద్రచేయాల్సొస్తుందేమో అనే భయంతో, ఒళ్ళంతా పులపరంగా ఉందని,ప్రొద్దుటనుండీ ఓ దుప్పటీ కప్పేసుకుని ముసుగెట్టేస్తాడు అల్లుడుగారు. కావలిసిస్తే, ఇల్లు భార్యపేరునైనా రాసేద్దామని డిసైడైపోతాడు,’యజమాని’ స్టేటస్ ఇచ్చేసి, రాత్రి మళ్ళీ అక్కడ పొడుక్కోవడం తప్పించుకోవచ్చని !
ఇప్పటికి గృహప్రవేశం అయింది. ఆ తరువాతి కష్టాలు ఇంకో టపా లో !!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అయ్య బాబొయ్ పేపర్లోకెక్కేశాను !!

Sun, 07/04/2010 - 04:36

   నాకు తోచిందేదో వ్రాసేస్తున్నాను, ఓపికా,టైమూ ఉన్నవారు చదువుతున్నారు, ఏదో నేనూ మా ఇంటావిడా గుట్టుగా కాపరం చేసికుంటున్నాము.అన్ని రోజులూ మనవి కావుగా.మొన్నోరోజున ‘ఈనాడు’పాత్రికేయులు, ఫోను చేసి,అదేదో
ఇంటర్వ్యూ చేశారు. అలవాటుప్రకారం, నేనే మాట్లాడేను.ఆయనకి టైమిచ్చిందెక్కడా? అందరికీ ‘బ్లాగు బాబయ్య’ అయిపోయాను.మా చిన్నప్పుడు శ్రీ కళా వెంకటరావుగారి, బావమరిది గారిని, ‘ముక్కామల బాబయ్య’ అనేవారు. ఊరికే గుర్తొచ్చి చెప్పాను,అంతేకానీ వాళ్ళ లెవెల్ లో వాడిననికాదు!
ఎంతైనా ప్రింటు లో పేరొస్తే చాలా సంతోషంగా ఉంటుంది కదా, అందుకని పైన పెట్టేశాను! పైన ఇచ్చిన బొమ్మమీద ఓ రెండు సార్లు నొక్కితే చదవ్వొచ్చు!

Thank you– Sujaata,Ramu & Venu


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–కొంపా గోడూ

Fri, 07/02/2010 - 13:13

   ఇదివరకటి రొజుల్లో ప్రతీవారికీ ఓ స్వంత ఇల్లుంటే బాగుంటుందీ అని. కారణాలు చాలా ఉండేవి,వచ్చే జీతంలో ఊరికే అద్దెలిచ్చుకోనఖ్ఖర్లెదు, ఎప్పుడైనా ఇంటిపెద్ద పైలోకాలకి వెళ్ళిపోతే,ఆయన కుటుంబం వీధినపడకుండా ఉంటుందీ అనేది ఒకటి.ఇంకో స్వార్ధం కూడా ఉండేది,అవసరాలకి తాకట్టుపెట్టుకోవచ్చు! పోయిన పెద్దాయన్ని స్వంత ఇంటిలో ఏ సావిట్లోనో ఉండనీయొచ్చు.అయినా పోయినతరువాత ఎక్కడ పడుక్కోబెడితేనేమిటంట.ఎలాగూ ఆయనకి తెలియదు,అధవా తెలిసినా సంతోషిస్తారా ఏమన్నానా? ఏమిటో ఉత్తి సెంటిమెంట్లు పెట్టుకుని,బ్రతికున్నవాళ్ళని పోరేసి ఓ ఇల్లు కట్టించేయడం. స్వంత ఇల్లనేటప్పటికి ఎన్ని తాపత్రయాలో?ఓ కార్పెంటరు దొరకడు,ఓ ప్లంబరు దొరకడు,ఆఖరికి దొడ్లో ఉండే కొబ్బరిచెట్ల కాయలు కోసుకోడానికి కూడా, ఎవరినో ఒకరిని వెతుక్కోవాలి.పైగా ఆ రోజుల్లో ఇళ్ళెలా ఉండేవి? ఇంటికి ముందర ఖాళీ స్థలం, వెనక్కాల పెరడు,చుట్టూరా చెట్లూ.ఇంక పాడి కూడా ఉంటే దానికో పాక.పెద్దాయన ఉన్నంతవరకూ బాగానే ఉంటుంది,ఆ తరువాతే అన్ని కష్టాలూనూ.

    పోనీ ఇంటి పెద్దావిడేమైనా సుఖపడుతుందా అంటే అదీ లేదు.ఓ పనిమనిషి ఉన్నా సరే, మొత్తం ఇల్లంతా తుడిపించేసరికి ఆవిడ అలిసిపోయేది.అలాగని పోనీ పనిమనిషిమీదే వదిలేద్దామా అంటే,అంతే సంగతులు.అవన్నీ పూర్వపు రోజులు.ఆ తరువాత అవేవో కాలనీలకింద తయారయ్యాయి.ఓ వందమంది కలిసి ఓ రెండుమూడెకరాలు కొనుక్కుని, వాటిల్లో ప్లాట్లక్రింద విడతీసి, కొంప కట్టుకోవడం.వాటికి ఓ వరసా వావీ ఉండదు, ఎవడిష్టం వచ్చినట్లు, ఎవడికి వీలున్నప్పుడు వాడో కొంప కట్టేసికుంటాడు. చూసే ఉంటారు,ఇలా విడివిడిగా ప్లాట్లుండే చోట, అక్కడోటీ,ఇంకోచోటోటీ డాబా ఇళ్ళు కనిపిస్తూంటాయి. పోనీ ఎక్కడో అప్పోసొప్పో చేసి కట్టేశామండి, మన పక్కవాడు, ‘అతనికంటె ఘనుడు ఆచంట మల్లన్న’ అన్నట్లు, ఓ రెండస్థంతుల మేడ లేపుతాడు. పైగా , అప్పటికే మనం ఇల్లుకట్టుకుని సెటిల్ అయిఉంటాముకదా, మన ఇంట్లో సిమెంటు బస్తాలు పెట్టుకుంటానూ, ఓ రూం ఇవ్వండీ, కావలిసిస్తే అద్దె ఇస్తాను( అక్కడికేదో వాడు oblige చేస్తున్నట్లు) అంటాడు.వాడు ఇల్లు కట్టించినన్ని రోజులూ, మనింట్లోంచే కరెంటు లాక్కుంటాడు.దానికి లెఖ్ఖా పత్రం ఉండదు.వాడి గృహప్రవేశం టైములో మన అదృష్టం బాగుంటే పిలవ్వొచ్చు.ఎందుకంటే ఈ లోపులోనే, పిల్లిమీదో,గోడమీదో పెట్టి మనతో దెబ్బలాటకి అంకురార్పణం చేయొచ్చు. వాళ్ళు వాళ్ళింట్లొకి మారిన తరువాత, మనలాటి middleclass mortals తో బంధుత్వం అంత లాభం ఉండదు కాబట్టి!

   వాళ్ళు కొత్తింట్లోకి గృహప్రవేశం అయిన తరువాత ఉంటాయి పాట్లు, మనకీ వాళ్ళకీ ఓ గోడే అడ్డం.వాడి బాల్కనీలోంచి మన ఇల్లు ‘ నీచంగా’ కనిపిస్తూంటుంది.పైగా వాళ్ళింటికి ఊళ్ళోవాళ్ళెవరైనా వస్తే, ఇంకేం పనిలేనట్టు,బాల్కనీలోకొచ్చి,మనవైపే చూస్తూ మాట్లాడుకుంటారు అని ప్రతీ మధ్యతరగతి ప్రాణీ అనుకుంటూంటాడు.మనింట్లో వేసిన మామిడిచెట్టో, ఇంకో చెట్టో కొమ్మలు వాళ్ళింట్లోకి వాలతాయి.అదేం ఖర్మమో కాలనీల్లో ఏ చెట్టుచూసినా పక్కవాడింట్లోకే వాల్తాయి! రాలిన కాయలు మావీ, మాకిచ్చేయండి అనలేము కదా (మధ్యతరగతి మనస్థత్వం అడ్డొస్తుంది). మహా అయితే వాళ్ళింట్లో వేసికున్న decorative trees కొమ్మలు మనింట్లోకి వాల్తాయి.వాటివల్ల మనకొచ్చిన లాభం- రోజూ తుక్కేరుకోవడం!ఇంటి పెద్దాయన, ప్రతీ రోజూ ఓ లుంగీ కట్టుకుని చేసేదేమిటంటే ఇదే. ఎందుకంటే, ఇంటావిడ చేతులెత్తేస్తుంది ‘ నాకోపిక లేదమ్మోయ్,ఈ వెధవ పెంటంతా ఎత్తడానికి,కావలిసిస్తే మీ ఇల్లూ, మీరే ఎత్తుకోండి‘అనేసి,ఆవిడ ఏ శ్రావణమాస పేరంటానికో వెళ్ళిపోతుంది.ఇల్లు కట్టించిన పాపానికి పెద్దాయన, ఓ చీపురు పట్టుకుని, తుడిచి, తుక్కంతా ఓ గమేళాలో పోసి బయటకు తీసికెళ్తాడు. పైగా వెలుగుండగా తీసికెళ్తే ఏ పంచాయితీవాడో,మ్యునిసిపాలిటీ వాడో అనికూడా అనుకోవడానికి ఆస్కారం ఉంది.అందుకనే చీకట్లోనే(under the cover of darkness)ఇలాటివన్నీ చేసికోవడం.

   సాయంత్రం పిన్నిగారు పేరంటానికి వెళ్ళినప్పుడు ఇంట్లో పనిచేసేది ఎవరయ్యా అంటే, అంట్లుతోమే పనిమనిషీ, తుక్కెత్తే పెద్దమనిషీనూ.ఇద్దరిదీ almost ఒకే పరిస్థితి.పాపం ఎప్పుడుచూసినా ఇంటియజమాని,‘దీక్షా వస్త్రాల్లోనే’ ( లుంగీ,బనీనూ,ఓ తువ్వాలు అని అర్ధం చేసికోండి) ఉంటాడు. పిన్నిగారేమో ఎవరింటికో ఓ కంచిపట్టుచీర కట్టుకుని పేరంటాలకి వెళ్తూంటారు.పైగా ఇంటికి ఎవరైనా వస్తే, చేతిలో పని ఆపి,సామగ్రంతా ఓ మూల పెట్టుకుని రావడం. రాకపోయినా ఫర్వాలేదు, పిన్నిగారూరుకోరుకదా ‘ అన్నయ్యగారొచ్చారు,ఆ పని పక్కనిపెట్టి ,కాళ్ళూ,చేతులూ కడుక్కుని ఓసారి లోపలికి రండీ’అంటూ.కాళ్ళూ చేతులూ కడుక్కోకపోతే ఆ మట్టంతా ఇంట్లోకి తెస్తాడేమో అని బెంగ.ఆ వచ్చిన ‘ అన్నయ్య’గారు వెళ్ళేదాకా, ఈ యజమాని ముళ్ళమీదున్నట్లుగా ఉంటాడు.సగంలో వదిలేసిన పని పూర్తిచేసికోద్దూ.లేకపోతే రాత్రి గాలేసి,ఆ తుక్కంతా కాంపౌండ్ లో అటూ ఇటూ పడితే, మర్నాడు ప్రొద్దుటే పాచి పనికూడా చెయ్యాలి, అదీ తెల్లారకట్లే(under the cover of darkness again!).

మిగిలిన కష్టాలు ఇంకో బ్లాగ్గులో….


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

Thu, 07/01/2010 - 14:53

    ఈవేళ మా అమ్మాయి ఆఫీసుకెళ్తూ, నన్ను చూడ్డానికి వచ్చింది, కాలినొప్పితో రెస్ట్ తీసికుంటున్నానుకదా అని.నిన్న రాలేకపోయినందుకు కారణం ఏమిటయ్యా అంటే, మా మనవడి స్కూలునుండి ఓ ‘నోట్’ వచ్చిందిట, వచ్చి క్లాస్ టీచర్ ని కలుసుకోమని.వాడు చదివేది ఏమిటయ్యా అంటే Class 1. స్కూలునుంచి పిలుపొచ్చిందంటే, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నా సరే,ప్రళయం వచ్చినా సరే, వాళ్ళు చెప్పిన సమయానికి చచ్చినట్లు వెళ్ళాల్సిందే!అక్కడకి వెళ్ళిన తరువాత,మన turn ఎప్పుడొస్తుందీ అన్నది, మన అదృష్టం మీద ఆధారపడిఉంటుంది! నోరుమూసుకుని వాళ్ళు పిలిచేవరకూ wait చెయ్యడం తప్ప ఇంకో choice లేదు.మా అమ్మాయేమో ఖంగారుపడిపోతూ పాపం వెళ్ళింది, మొత్తానికి తన turn వచ్చిందండి.

    ఆ క్లాసు టీచరమ్మ చెప్పినదేమయ్యా అంటే, ‘మీవాడు ప్రతీ పీరియడ్ తరువాతా పాస్ కెళ్ళాలంటాడూ,పోనీ పంపినా త్వరగా రాడూ, అందుకోసమని ఈవేళ పనిష్మెంటిచ్చి, క్లాసు బయట నుంచోపెడితే, అక్కడ ఇంకో పిల్లాడితో ఆటలాడుతున్నాడూ, ఇంక నేనిచ్చిన పనిష్మెంటుకి విలువేముంటుందీ’అని ఆవిడ complaint! మా అమ్మాయికేంచెప్పాలో తెలియలేదు.ఎంత చెప్పినా మగపిల్లలు కొంచెం hyper active.మా ఆదిత్యని అడిగింది-’అలా ఎందుకు చేస్తావూ,ప్రతీ గంటకీ ఎందుకు బయటకు వెళ్తావూ ‘అని,వాడంటాడూ.. मै क्याकरू मम्मा,एखी टैम्कॉ होतानहीं, बार बार जानॅ मॅ मजा आता है ! ఇంక వాణ్ణేం చేస్తాం చెప్పండి? పోనీ చదువులో ఎలా ఉన్నాడూ అని అడిగితే
‘దాంట్లో ఏమీ సమస్య లేదూ, అన్నిటిలోనూ ఫస్టే, పైగా అన్నిటికీ అందరికంటే ముందే జవాబు వ్రాసేసి, పక్కనున్నవాడితో కబుర్లు మొదలెడతాడు’.
పోనీ ఇంటికి వచ్చి హోం వర్క్ చేయమంటే,వాళ్ళమ్మని దగ్గరుండమంటాడు, పాపం తనకి ఆఫీసు కాల్సూ వగైరాలతో రాత్రిళ్ళు 10.00 గంటలదాకా బిజీ.వాడిదారిన వాడు, హోం వర్క్ చేసేసి, ఆపుస్తకం వాళ్ళమ్మ మొహానకొట్టేసి,టి.వి.పెట్టుకోడానికి వెళ్ళిపోతాడు.చదవడం లేదూ అనడానికి లేదు.ఎంత చెప్పినా అమ్మాయిలకీ, అబ్బాయిలకీ సహస్రాంతం తేడా ఉంటుంది.అమ్మాయిలయితే,వాళ్ళూ, వాళ్ళ చదువులూ.అబ్బాయిలకి ఊళ్ళో ఉన్న సంగతులన్నీ కావాలి! working women పడే పాట్లు చూస్తూంటే చాలా జాలేస్తూంటుంది.పైగా ఇంకోటి,అబ్బాయిలందరూ అమ్మ కూచి లే! ఆ వెర్రితల్లి కూడా ‘అబ్బ మా అబ్బాయి, నేనంటే ఎంత ప్రేమో అనుకుంటూంటారు’.అదంతా పెళ్ళయేవరకేలెండి!

    క్రిందటి వారం www.outlookindia పత్రికలో ఒక కవర్ స్టోరీ వచ్చింది.అది చదువుతూంటే, ఈ రోజుల్లో సమస్య పిల్లలతోనా, టీచర్లతోనా, లేక తల్లితండ్రులతోనా అన్నదీ అర్ధం అవడంలెదు.ఇదివరకటి రోజుల్లో అంటే మేము చదువుకునే రోజుల్లో,వంటి మీద దెబ్బ పడకుండా స్కూలు చదువయిందీ అంటే ఆ అబ్బాయి exceptionally intelligent అన్నమాట.లేకపోతే, దెబ్బలు తినడం అనేది ఓ పెద్ద విషయంగా ఉండేది కాదు.ఇంకో సంగతికూడా చెప్పుకోవాలి, మరీ గొడ్దును బాదినట్లు బాదేవారు కాదు,అరచేతిలో బెత్తం తోనూ, వేలి ముణుకులమిద పెన్సిళ్ళతోనూ,మరీ సీరియస్సైతే గూబ మీదా కొట్టేవారు. అలా కొట్టేరుకదా అని పిల్లలూ ఇళ్ళకెళ్ళి తల్లితండ్రులతో చెప్పేవారుకాదుకూడానూ.అధవా ఎప్పుడైనా చెప్పినా, పైగా ఇంట్లో కూడా దెబ్బలు తగిలేవి!

    అలాగని ఆరోజుల్లో తల్లితండ్రులు,పిల్లల బాగోగులు పట్టించుకోలేదనలేము కదా.ఒకసారి స్కూలుకి పిల్లాడిని పంపేమూ అంటే, వాడిని ఓ దారిలో పెట్టడం బాధ్యతంతా స్కూల్లో టీచర్లదే.టీచరు అంటే, ఓ గౌరవం అదీ ఉండేది.అలాగని వాళ్ళకేమీ
వేలూ లక్షలూ జీతాలుండేవికావు.కొన్నిచోట్లైతే నెలల తరబడీ జీతాలే ఉండేవి కావు,అయినా వారంతా అదొక స్వంత బాధ్యత క్రింద తీసికుని చెప్పేవారు. ఇప్పటిలాగ గందరగోళంగా ఉండేది కాదు.ఇప్పుడెక్కడ చూసినా కార్పొరేట్ స్కూళ్ళూ,కాలేజీలూ. ప్రతీదానికీ ఎంట్రెన్సులూ,మళ్ళీ వాటికి కోచింగులూ!

    అసలు ప్రతీ సంగతీ రాజకీయం చేయడంతో ప్రారంభమయ్యాయి ఈ గొడవలన్నీ.1965 తరువాత నుండీ, కాలేజీల్లోనూ,స్కూళ్ళలోనూ, రాజకీయ పార్టీలు వేలు పెట్టడంతో దరిద్రం మొదలెట్టింది.దానికి సాయం, ప్రతీ రాజకీయ నాయకుడికీ తెలిసింది, స్టూడెంట్స్ ని పట్టుకుంటే చాలు,వాళ్ళ ధర్నాలకీ వాటికీ కావలిసినంత రిసోర్సెస్ అని.

    మనం ప్రతీరోజూ పేపర్లలో చదివే, టి.వీ.ల్లో చూసే టీచర్ల కిరాతకాలు చూస్తూంటే ఒక్కోప్పుడనిపిస్తూంటుంది, అంతంత ఫీజులు తీసికోడమే కాకుండా, పిల్లల్ని సాడిస్టిక్ గా ట్రీట్ చేస్తూంటే ఏ పేరెంటు మాత్రం చూస్తూ ఊరుకోగలడు?


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–గృహ నిర్భంధం-a.k.a House Arrest!

Wed, 06/30/2010 - 12:47

    ఎప్పుడైనా ఓ కాలికో,చేతికో నొప్పొచ్చి సమస్యొచ్చిందనుకోండి,అప్పుడనుకుంటాం, ఇలా కాలికి రాకుండా, ఇంకోదానికేదైనా వచ్చినా బాగుండును,ఎలాగోలా ఓర్చుకోవచ్చూ అని.అలాగే పిప్పి పన్ను నొప్పెట్టిందనుకోండి, మరణ బాధ పడాలి.ఇప్పుడూ పళ్ళే లేవుకనుక,ఆగొడవే లేదు!ఉన్నప్పటి ఫీలింగులెండి ఇది.అందువలన మన శరీరంలో ఎక్కడ సమస్యొచ్చినా, ప్రతీవాడూ ఆలోచించే పధ్ధతి ఇదే.అయినా అనుకుంటాంకానీ, దేనికదే, కాళ్ళూ చేతులూ సరీగ్గా ఉన్నంతకాలమే, మనం వేసే వేషాలు.

    సంగతేమంటే, నిన్న మా అమ్మగారి ఆబ్దీకం పెట్టడానికి, రాఘవేంద్ర మఠానికి వెళ్ళాము,అక్కడ మూడు గంటలు క్రింద కూర్చునేటప్పటికి,ఆ తరువాత భోజనం చేసేటప్పుడు ఇంకో గంటా మొత్తం నాలుగు గంటల క్రింద కూర్చోడం ధర్మమా అని, అక్కడ ఉన్నంతసేపూ బాగానే ఉన్న మోకాళ్ళు, సాయంత్రానికల్లా pendown strike చేసేశాయి.ఇంక చూసుకోండి, రాత్రంతా కాలు వంచలేనూ, కదపలేనూ.ఇంట్లో వైద్యం-ఎవో పైన్ కిల్లర్లూ, వేణ్ణీళ్ళ కాపడం ( మరీ గిన్నెలో గుడ్డ ముంచి కాదనుకోండి, అదేదో హాట్ వాటర్ బ్యాగ్గులో)అన్నీ ప్రయత్నించాను.( మొన్న ‘సంచీ’ ల బ్లాగ్గులో దీనిగురించి వ్రాయడం మర్చిపోయాను, అందుకే గుర్తు చేసింది). అబ్బే ఏం ఫలితం లేదు, సరే అని ప్రొద్దుటే ఏ డాక్టరుదగ్గరకైనా వెళ్దామని,ఓ సారి మా దేష్ పాండే గారికి ఫోను చేశాను( భుసావల్ లో ఉన్నారు), ఆయనకి నా జాతక చక్రం అంతా తెలుసు, పాతికేళ్ళనుండి చూస్తున్నారు.ఆయన అక్కడినుంచే నా పరిస్థితి అడిగి, ఓ పైన్ కిల్లర్ మాత్రా,అదేదో క్రీమ్మూ రాసేసుకుని, క్రేప్ బ్యాండేజ్ కట్టుకుని 48 గంటలు, ఎక్కడకీ కదలకుండా, వెధవ్వేషాలెయ్యకుండా, ఓ మంచం మీద పడుక్కుని రెస్ట్ తీసికోమన్నారు.అదేదో, నాతో చెప్పి వదిలెయ్యొచ్చుగా, అబ్బే, మా ఇంటావిడకీ, మా అబ్బాయికీ కూడా చెప్పారు. పాత సినిమాల్లో చూస్తూంటాము,అలాగన్న మాట!

    ఇంక మా వాళ్ళిద్దరికీ ఎంత సంబడమో! చకచకా బయటకు వెళ్ళి కావలిసిన సామగ్రంతా తెచ్చేసి, నన్నో మంచం మీద పడేశారు. నేను కూడా సందర్భానుసారంగా ,ఓ పైజమా, చార్ల చొక్కా వేసేసికుని సెటిలైపోయాను! One must keep up with the times కదా మరి!చూసేవాళ్ళకీ అనిపించాలి కదా! కాఫీ,టిఫినీ, తిండీ అన్నీ అక్కడికే!’ తాతయ్య నిద్రపోతున్నారూ’ అంటూ, మా నవ్యతో చెప్పడం, డాడీ ఎలా ఉందీ అంటూ మా అబ్బాయీ, మామయ్యగారూ ఎలా ఉందీ అంటూ మా కోడలూ, డాడీ ఎలా ఉందీ అంటూ మా అమ్మాయీ, ఏమైనా కొంచెం తగ్గిందా అంటూ మా ఇంటావిడా ప్రతీ గంటకీ పరామర్శోటీ !ఇదంతా బాగానే ఉందనుకోండీ, అయినా అదేదో సామెత చెప్పినట్లుగా ‘తిరిగే కాళ్ళూ, తిట్టే నోరూ’ కట్టిపడేస్తే ఎలాగండి బాబూ,
తిరక్కుండా ఉండలేనూ, అలాగని నోరుమూసుకుని కూర్చోలేనూ. పోనీ ఎవరైనా వింటారా అంటే, 38 ఏళ్ళనుండి విన్నవే విని వాళ్ళకీ బోరుకొట్టేసింది!ఇంక ఇది కాదని, ఇలా బ్లాగ్గులోనైనా నా గోల వినిపిస్తే బావుంటుందని ఇలా సెటిలైపోయాను!

    మా ఇంటావిడకి ఓ ‘తీరని కోరిక’ ఉంది.అలాగని ఆవిడ కోరికలన్నీ తీర్చేశానని కాదు, ఎలాగోలా నా చేత శ్రీ విశ్వనాథ సత్యన్నారాయణ గారి Magnum Opus ‘వేయి పడగలు’ చదివించాలని.మా ఇంట్లో ఆ పుస్తకం లేదు.ఈవిడ గోల భరించలేక నెట్ లో డౌన్ లోడ్ చేసి ఉంఛాను ఆ మధ్య.తన ప్రయత్నం తను చేసింది, చదివేనా వినిపించాలని, అదేమిటో ఆవిడ చదవడం మొదలెట్టిన ఓ గంటలో నిద్రొచ్చేసేది!వచ్చిన గొడవల్లా ఏమిటంటే, నాకు ఆ పుస్తకం లోని భాష అర్ధం అయేది కాదు.నాది చాలా low IQ ! నేనేం చెయ్యను దానికి? నాకర్ధం అవదు మొర్రో అన్నా వదలదు.ఇప్పుడు ఛాన్సు దొరికింది. ఈ మధ్యనే, మా వియ్యపురాలు గారు 1986 లో ప్రచురించిన,14 th Edition మాకిచ్చారు.ఇంక మా ఇంటావిడ’ కాగల కార్యం గంధర్వులే చేశారు’ అన్నట్లుగా, నా మంచం ప్రక్కనో కుర్చీ వేసికుని, ‘ఎలాగా ఈ రెండురోజులూ కదలకూడదుగా, వేయి పడగలు చదువుతాను వినండి’ అంది.వామ్మోయ్ ఈవిడ వదిలేటట్టు లేదురా బాబూ అనుకుని, పైగా వింటున్నానో లేదో చూడ్డానికి మధ్య మధ్యలో ప్రశ్నలోటీ.ఈ గొడవంతా ఎందుకనీ, నేనే ఏదో తిప్పలు పడతాలే, చదవకపోతే తిండి పెట్టడం మానేస్తే,అమ్మో, బయటకు కూడా వెళ్ళలేను!అని ఆ పుస్తకం చేతిలోకి తీసికున్నాను.

    అసలు ఈయన దేనిగురించి వ్రాసేరా అని తెలిసికోవాలని, పుస్తకం చివరిలో ఉన్న ‘ వేయి పడగలలోని అంతరార్ధం’తో మొదలెట్టాను. వహ్వా వహ్వా ఏం వివరణ అండీ, అసలు నాలాటి పామరులకు అర్ధం అవాలనే శ్రీ విశ్వనాథ వారు,1955 లో ఆ వ్యాసం వ్రాశారేమో అనిపించింది.ఈ ‘గృహనిర్భంధం’ టైములో వేయి పడగలు పూర్తి చేసేస్తాను. దేనికైనా రాసిపెట్టుండాలంటారు!
భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలా ‘గృహ నిర్భంధాలు’ వస్తే ఇదో డ్రెస్ రిహార్సల్ గా ఉపయోగిస్తాయి !!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–సంచీలు

Mon, 06/28/2010 - 12:10

    మా చిన్నప్పుడు స్కూలుకెళ్ళాలంటే పుస్తకాలు ఓ సంచీ లో పెట్టి తీసికెళ్ళేవాళ్ళం.కాలేజీకొచ్చేసరికి ఆ అలవాటు మానుకుని స్టైలుగా చేతిలో ఒకటో రెండో నోట్ బుక్స్ పెట్టుకుని వెళ్ళడం.పాపం అమ్మాయిలుమాత్రం, ఒబ్బిడిగా ఓ నాలుగైదు పుస్తకాలు తెచ్చుకుని వచ్చేవారు.సంత సంచీ అని ఒకటుండేది,దాంట్లో సంత ( కూరగాయల మార్కెట్) కి వెళ్ళేమంటే, దాన్నిండా కూరలు వచ్చేవి.ఇప్పుడలా కాదుగా, ఎంత ఖర్చుపెట్టినా ఓ జేబిరుమాల్లో కట్టుకుని తెచ్చేసుకోవచ్చు.లేకపోయినా కొట్టువాళ్ళిచ్చే పాలిథీన్ బ్యాగ్గులో,కొన్న కూరలన్నీ కట్టుకుని తెచ్చేసుకోవచ్చు! ఏమైనా అంటే ఇన్ఫ్లేషనో అదేదో అంటారు.ఏది ఏమైనా సంతకి సంచీపుచ్చుకువెళ్ళే concept మాత్రం అటకెక్కేసింది! పాపం మా తరం వాళ్ళు ఇంకా మార్కెట్టుకి వెళ్ళేటప్పుడు ఓ సంచీ తీసికుని వెళ్తూంటారు.మార్కెట్నుంచి ఇంటికివచ్చేటప్పటికి, ఎండాకాలంలో ఎండిపోయిన నూతుల్లో నీళ్ళలాగ, కూరలెక్కడున్నాయో వెదుకుతూండాలి,! పైగా మా ఇంటావిడలాటివారు,’ అదేమిటండీ మరీ పావు పావే తెస్తే ఎలా సరిపోతాయీ అందరికీ’ అంటుంది.కిలోల్లో కొనే రోజులు కావు ఇప్పుడూ అన్నా కానీ నమ్మదు.ఎప్పుడో ఓసారి తనని కూరలు తెమ్మని పంపిస్తే తెలుస్తుంది!పైగా ఏమైనా అంటే వరంగాంలో ఉన్నప్పుడు నేనే కదా కూరలు తెచ్చేదాన్నీ అంటూ సాగతీస్తుంది.అది 1983 వ సంవత్సరమమ్మా, నెలకి 1000 రూపాయొలొచ్చినా హాయిగా బ్రతికేవాళ్ళం,ఇప్పుడు వేలకి వేలు పెన్షనొచ్చినా,కూరలూ అవీ ‘అలంకారార్ధం గంధం సమర్పయామి’ అన్నట్లుగా ఉంది.దేముడిని ఉత్తి గంధం పెట్టేసి, అదే అలంకారం అనుకో అంటే ఆయనూరుకోవడంలేదూ,అలాగే, మనం కూడా వెరైటీకి తలో నాలుగు కూరలూ తీసికోవడం,అన్నీ కలిపి ఓ పావో,అర్ధకిలో తూపించి, ఇంటికి తెచ్చి ఏ అవియల్లో ఏదో చేసికొని తినడం.అలా కూరలసంచీలు extinct అయిపోయాయి!

    యాయివారం బ్రాహ్మలని ఉండేవారు,వాళ్ళు ఇంటింటికీ తిరిగి,ఆ ఇంటివాళ్ళిచ్చే బియ్యం అందులో పోసుకుని,కొంపకి చేరి కుటుంబసభ్యుల ఆకలి తీర్చేవారు.ఆరోజుల్లో బియ్యం లాటివి సమృధ్ధిగా
దొరికేవి కాబట్టి, ఎవరైనా యాచకులు వస్తె, వాళ్ళకి దానం చేస్తే పుణ్యం పురుషార్ధం అనుకునే వారు.ఆఖరికి ఏ కరివెపాకు కొనాలన్నా బియ్యం ఇస్తే ఇచ్చేవారు!ఏ దేముడు ఊరేగింపు పల్లకీయో వచ్చినప్పుడు కూడా, బియ్యం అవీ ఇచ్చేవారు. అలాగే స్వయంపాకం అని, బియ్యమూ,ఓ అరటికాయో ఇంకేదో కూర ఎవరోఒకరికి ఇచ్చేవారు! ఇప్పుడు అలాటివన్నీbeyond our means అయిపోయాయి!

    పళ్ళపొడి పొట్లాలు ఓ జోలాసంచీ లో వేసికుని అమ్మడానికి తెచ్చేవారు.అందుకే ఇప్పటికీ మనం ఎప్పుడైనా అలాటి సంచీ భుజానికి వేళ్ళాడతీసికుంటే, ‘పళ్ళపొడి అమ్మేవాళ్ళాగ ఆ సంచీ ఏమిటీ’అంటూంటారు.కానీ ఆ సంచీలు మాత్రం బలే convenient గా ఉంటాయి. నేనూ చాలాకాలం వాటినే వాడేవాడిని.జేబుల్లో పెట్టుకుంటే ఎవడైనా కొట్టేస్తాడని, అన్నీ అందులోనే పెట్టుకుని వెళ్ళేవాడిని.ఆ సందర్భంలోనే, తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు క్యూ కంపార్ట్ మెంట్ లో వెళ్తూండగా, అలా భుజానికి వేళ్ళాడతీసికున్న, నా జోలా బ్యాగ్గు నీట్ గా కోసేసి,అందులో ఉన్న డబ్బూ దస్కం,టిక్కెట్ట్లూ కొట్టేసి ‘తిరుక్షవరం’ చేసేసిన తరువాత మళ్ళీ ఆ జోలా బ్యాగ్గు జోలికి పోలేదు!

    ఆ తరువాత ఎప్పుడైనా ఇంటికి ( అమలాపురం)వెళ్తే తిరిగి వచ్చేటప్పుడు, ఇంట్లో కాసిన కొబ్బరికాయలు ఓ సిమెంటు బస్తాలో వేసి ఇచ్చేవారు.,b>తీసికెళ్ళకపోతే అదో సెంటిమెంటూ,ఈ మూటలన్నీ మోసుకుని,అమలాపురంనుండి పూనా దాకా వచ్చేటప్పటికి తడిపిమోపెడయ్యేది!అమలాపురం నుండి తణుకు (అత్తారిల్లు) దాకా బస్సులో రావడం, అక్కడ మళ్ళీ మామగారిచ్చిన ఇంకో బస్తా తీసికోవడం,ఇవన్నీ తీసికుని హైదరాబాద్ బస్సులో రావడం, అక్కడ బొంబే వెళ్ళే ట్రైనెక్కడం. ఆరోజుల్లో డైరెక్ట్ కొణార్క్ ఉండేదికాదు.క్రమక్రమంగా సిమెంటు బస్తాలు మానేసి, కొబ్బరికాయలన్నీ, ఓ పురికోసతాడుతో దబ్బనంతో గుచ్చి, వాటిని తెచ్చుకునేవాళ్ళం.

&nbsp  ఇప్పుడు ఎవర్ని చూసినా ఓ నైకీ బ్యాగ్గో, ఓ రిబాక్ బ్యాగ్గో వేళ్ళాడతీసికుని వెళ్ళడం.దానికి సాయం Laptop పెట్టుకోడానికో బ్యాగ్గూ! ఎన్ని చెప్పండి, ఆ రోజుల్లోని ‘కూరలసంచీ’ కి మాత్రం ఇవి ఏమాత్రం సరితూగలేవు!ఇంకో రకం ఉండేవండోయ్,ఇప్పటికీ అరవ్వాళ్ళు ( ఏం అనుకోకండి అలా అన్నానని,ఇప్పటికీ తమిళులు కొంతమంది,’తెనుంగా’అంటూ అదేదో హీనపక్షమన్నట్టుగా పిలుస్తూంటారు,అందుకనే నేను వాళ్ళని ఎప్పుడూ అరవ్వాళ్ళే అంటాను!) ఓ గుడ్డసంచీ యే పట్టుకుని తిరుగుతూంటారు. ఏక్ దం ట్రేడ్ మార్కు పసుప్పచ్చ సంచీ.దాన్ని చూడగానే ఇతను అరవ్వాడే అని తెలుసుకోవచ్చు! మరి మనం కూడా అలాటిదో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో! పోన్లెండి అలాటివేవీ వద్దు, ఏ రంగు బ్యాగ్గు పెట్టుకుంటే ఆ పార్టీ అంటారు, ఇదో గోల మళ్ళీ!

    ఇప్పుడు లేటెస్ట్-బ్యాక్ ప్యాక్కో అదేదోట! ఏ బస్సులో చూసినా వీపుమీద ఓ బస్తా తగిలించుకుని చూస్తూంటాము.బస్సుల్లో నిజం చెప్పాలంటే, ఓ పాతిక ముఫై మందిదాకా నుంచోవచ్చు. కానీ ఈ బ్యాక్ ప్యాక్కు ప్రాణుల ధర్మమా అని, అందులో సగం అంటే పది పదిహేను మందికంటే ఎక్కువ నుంచోలేకపోతున్నారు.కారణం,నుంచున్నవాడు బక్క పక్షి లా ఉన్నా, వాడు వీపుమీద తగిలించుకునే బ్యాగ్గు, ఇంకో మనిషి నుంచునేటంత స్థలం occupy చేస్తుంది. ఇక్కడ బస్సులో కండక్టర్ पुढॅ चला पुढॅ चला అంటూంటాడు,అంటే ముందుకు జరగండి అని. ఎక్కడకెళ్తాం నా నెత్తిమీదికి! చీమకుట్టినైనట్లేనా ఉండదు ఆ బ్యాక్ ప్యాక్కు వీరులకి.వాడి పనైపోయింది, ఇంకోళ్ళు ఏమైతేనేం! ఏ గంగలో దిగితేనే? కొంతమంది ప్రయాణాల్లో అలాటి బ్యాగ్గులు పెట్టుకుని వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది.కూలీలఖ్ఖర్లేకుండా,వీపుమీద పెట్టుకుని లాగించేయొచ్చు,కానీ మరీ బస్సుల్లో కూడా ఇలాగైతే ఎంత కష్టమండి బాబూ/


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణికబుర్లు– ఆదివారం స్పెషల్

Sun, 06/27/2010 - 02:13

   ఏమిటో ఇవేళ్టి ఆదివారం ‘అదోలా’ ఉంది! ప్రొద్దుటే నా దైవదర్శనాలై కొంపకి వచ్చేటప్పటికి, జ్యోతి గారి ఫోన్నూ! ‘ఇందాకా ఒకసారి చేశానూ,ఇంకా నిద్ర లేవలేదా’ అంటూ!అంత లగ్జరీ ఎక్కడండి బాబూ? విషయానికొస్తే ‘ఈనాడు’ పేపరొస్తుందా అన్నారు. నేను ప్రతీ రోజూ ‘సాక్షి’ తీసికుంటాను.ఆపెపరుమీదేం ప్రేమా అభిమానం అనికాదు,ఖరీదుతక్కువ,రద్దీ వాల్యూ ఎక్కువా అని అంతే!ఆదివారం మాత్రం రెండూ తీసికుంటాను,అవేవో సప్లిమెంట్లు పెడతారూ,కాలక్షేపం అని!
సంగతేమని అడిగితే ‘మీరు కంప్యూటర్ ఓపెన్ చేసి వెంటనే నా బ్లాగ్గు చూడండి’అన్నారు. సరేఅని ఓపెన్ చేస్తే అందులో మా ఇంటావిడ ఏం పనిలేక, మా( స్పెషల్లీ నామీద) ప్రయోగాలూ చేసే సందర్భంలో చేసే ఓ స్వీటు గురించి ఓ బ్లాగ్గు వ్రాసిందీ, అదేమో సుజాత గారు ఈవేళ్టి ఈనాడు వసుంధర లో ప్రస్తావించారుట. అయితే నాకేంటీ?

   నేను నమలక్కర్లేకుండా మింగేయొచ్చని ఇలాటి స్వీట్లు చేస్తూంటుంది,ఎంతైనా కట్టుకున్నవాడిని కదా!ఆ స్వీటుని ఊరిమీదకొదిలింది.ఎంతైనా పొరిగింటి పుల్లకూర లా, అందరికీ నచ్చేసింది ( మాకూ బాగానే ఉంటుందనుకోండి),ఆ బ్లాగ్గేమో
సుజాత గారికి నచ్చేసిందిట, ఆవిడేమో పేపర్లో వేయించేశారు.ఇంక మా ఇంటావిడేమో ఓ blog వ్రాసేసింది.

    గుర్తుందా మనం కొత్తగా వాచీ కొనుక్కున్నప్పుడు, అందరూ చూడాలని వాచీ పెట్టుకున్న చెయ్యే తిప్పుతూంటాం, అలాగ మాఇంటావిడ ఆ పేపరే చేతిలో పెట్టుకుని మాట్లాడుతోంది.ఒక విషయం ఒప్పుకోవాలిలెండి, మా అబ్బాయీ,కోడలూ మాత్రం ఇదంతా చూసి ‘అబ్బో మా అమ్మ ఇలాగా,మా అత్తగారు ఇలాగా’ అనుకుంటూ సంబరపడిపోతున్నారు!ఈవేళ ఈ సంతోషంలో,నాకు చపాతీలు కాకుండా దోశలు చేసిపెట్టింది.పోన్లే ఇదీ బాగుందని లాగించేశాను!
Thank you Sujaatha,Jyothi


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— Mistaken identity.

Fri, 06/25/2010 - 11:54

    నిన్న సాయంత్రం,మా ఇంటావిడ శుక్రవారం పూజకి పువ్వులు తెమ్మని నన్ను క్రిందికి పంపించింది.రాజమండ్రీ లోనే హాయిగా ఉండేది, తెల్లారేటప్పటికి మా వాచ్ మన్ ( నాతో ఫ్రెండ్లీగా ఉండేవాడూ, కరెంటు పోయినా జనరేటర్ వేసేవాడూ
రెండో వాచ్ మన్ కీ నాకూ పడేది కాదు,పండగ మామూళ్ళివ్వలేదని!) ఓ పెద్ద ప్యాకెట్టునిండా పువ్వులు తెచ్చేవాడు.నెలంతా పూర్తయిన తరువాత ఓ వందరూపాయలుచ్చుకునేవాడు.ఈవిడకి మందిరంలో ఉన్న దేముళ్ళందరికీ పెట్టగా, హాల్ లో
డెకొరేషన్ కి కూడా సరిపోయేవి. ఇక్కడ అలాగ కాదుగా, ఎప్పుడో శుక్రవారాలకే పువ్వులు లిమిట్ చేసేశాము.మిగిలినరోజుల్లో అక్షింతల్తోనే పూజ! పాపం ఆ దేముడికీ రేషనే !

    ఏమిటో దేనితోనో మొదలెట్టి దేంట్లోకో వెళ్ళిపోయాను.క్రిందకు వెళ్తుంటే, లిఫ్ట్ లో, మా పక్క పోర్షనావిడా, ఆవిడతో ఓ అమ్మాయీ ఉన్నారు.వాళ్ళదారిన వాళ్ళెళ్తున్నారుకదా అని ఊరుకోవచ్చా, అబ్బే అన్నీ నాకే కావాలి, అందరిదగ్గరా నా ‘సో కాల్డ్’ పెద్దరికం చూపెట్టుకోవాలీ,ఆ అమ్మాయితో ” ट्यूशन हॉगया क्या?” అని పలకరించాను. మా పక్కింటి అమ్మాయి ఆరో క్లాసో,ఏడో క్లాసో లెండి, ఎప్పుడు కలసినా ట్యూషన్ కి వెళ్తూనో,వస్తూనో కనిపిస్తూంటూంది.ఆ అమ్మాయే అయిఉంటుందని,అడిగాను. పాపం ఆ అమ్మాయేమో ఈ ‘आजॉबा’ అలా అడుగుతున్నాడేమిటీ అని కంగారు పడిపోయింది. ‘అజోబా’ అంటే మరాఠీలో ‘తాతయ్య’ .కాదూ, నాకు 12 క్లాసు పూర్తయిపోయింది, ఈ సంవత్సరం కర్ణాటకాలో ఇంజనీరింగులో చేరుతున్నానూ అంది. అలారం సిగ్నల్స్ మ్రోగేశాయి-ఎక్కడో పొరపాటు జరిగిపోయిందీ అని,అయినా ఓ వెర్రిమొహం పెట్టుకుని,’ఐ మీన్ అదే’ అంటూ ఆ అమ్మాయి చదువుకునే కాలేజీ, కామన్ ఎంట్రెన్స్ టెస్టూ వగైరాలమీద అడిగేశాను! ‘పప్పులో అడుగేశానని ‘అర్ధం అయిపోయింది.మా పక్కింటావిడకూడా ఆశ్చర్యపడిపోతూంది, ఇంత పెద్ద పిల్లని పట్టుకుని ట్యూషన్ కెళ్ళావా, యూనిట్ టెస్టుల్లో మార్కులెలా వస్తున్నాయీ అని అడుగుతున్నాడేమిటీ అని!ఇదంతా తరువాత ,ఈవిడా,వాళ్ళ అసలమ్మాయీ( ట్యూషన్లకెళ్ళే పిల్ల), ఈ ఇంజనీరింగులో చేరే అమ్మాయీ ఒకేచోట కనిపించేసరికి తెలిసింది! అర్రే ఇద్దరూ ఒకే పోలికతో ఉన్నారే అంటూ.నా దురదృష్టంకొద్దీ,వీళ్ళందరిని కలిపి మాట్లాడేటప్పుడు,మా ఇంటావిడ కూడా ప్రక్కనే ఉంది.ఇంక చూసుకోండి,ఛాన్సొస్తే క్లాసు తీసికుంటుంది- ‘ అసలు మీకెందుకండీ ఎవరు ట్యూషన్లకెళ్తే మీకెందుకూ, ఊళ్ళో వాళ్ళ సంగతులన్నీ మీకే కావాలీ…’ అంటూ.

    ఇంకోమాటు, ఈ మధ్యన భాగ్యనగరం లో పెళ్ళికి ( లక్ష్మి మొగుడిగా కాదు, ఫణి పెళ్ళాం ఎపిసోడ్ లో) వెళ్ళాం కదా, అక్కడ మ్యారేజ్ హాల్ కి వెళ్ళగానే, మా మేనల్లుడు ( మా కజిన్ సిస్టర్ కొడుకు)’హల్లో మామయ్యా’ అంటూ పలకరించాడు. అతను నాకు బాగా తెలుసు పూణే లో.ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు.అతన్ని పలకరించి, లోపలకు వెళ్ళాము.అక్కడ తెలిసిన చుట్టాలని కలుసుకుని, మెల్లిగా బ్రేక్ ఫాస్ట్ తీసికుందామని, ప్రొద్దుట 10.00 గంటలకి బ్రేక్ ఫాస్టేమిటీ? అక్కడ లైన్లో అచ్చంగా ఇంతకుముందు కలిసిన మా మేనల్లుడిలాగ ఒకతను కనిపించేసరికి ‘ హాయ్’ అన్నాను.అబ్బే ఏమీ రియాక్షన్ లేదు. ఇంతలో యేమయ్యిందిరా బాబూ,ఇందాకా వచ్చినప్పుడు బాగానే ఉన్నాడూ,నోరారా పలకరించాడూ,నేనేమైనా తప్పుగా మాట్లాడానా, ఇదేం ప్రొటెస్టు రా భగవంతుడా అనుకున్నాను.పోనీ నన్ను చూడలేదా అనుకోడానికీ వీల్లేదు, శుభ్రంగా నామొహంలోకే ‘బ్లాంక్ ‘గా చూస్తున్నాడు.పోన్లే అని వదిలేశాను.ఇంతట్లో ,మా కజిన్ వచ్చి, ఏరా లచ్చూ బ్రదర్ రామూని కలిశావా అన్నాడు. వార్నీ ఇదన్నమాట అసలు సంగతి-నేను గేట్లో కలిసినవాడు ఒకడు, ఇప్పుడు ‘హాయ్’ చెప్పినవాడు రెండో వాడు.పాపం అతనికేం తెలుస్తుంది,నేనెవరో! ఇంతలో అతని భార్య వచ్చి, ఈ సంగతంతా తెలిసికుని ఒకటే నవ్వు. ‘చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూంటారండి బాబయ్యగారూ’అంది.మా మేనల్లుడికి మామయ్యనవుతే ఈ అమ్మాయికి బాబయ్యని కదా, అదీ చుట్టరికం!

     ఏపీ మీడియా కబుర్ల రాము గారు ఓ మెయిల్ పంపి, నన్ను కలుసుకోవాలనుందీ అన్నారు. పోన్లే నన్ను కలుసుకోవాలని ఉన్న అమాయకులూ ఉన్నారు కదా అని, వెళ్ళగానే ఓ ఫోన్ ‘కొట్టేశాను’(ఆంధ్రదేశం లో నేర్చుకున్నాను ఈ పదజాలం!).అదీ రాత్రి పదింటికి.పోనీ ప్రొద్దుటెప్పుడో చెయ్యొచ్చుగా, అబ్బే ఉన్న ఒక్క ‘గిరాయికీ’ మిస్ అయిపోతే అమ్మో! మామూలు హల్లో హల్లొల పలకరింపులూ వగైరాలూ పూర్తయిన తరువాత, ‘ మీకు శ్రమిచ్చానూ’ అని నేనూ
‘అబ్బే అదేంలేదండీ ‘ అని ఆయనా మొహమ్మాటాల డయలాగ్గులు
చెప్పేసికుని, మర్నాడు ఎక్కడ కలుసుకోవాలో చెప్పెసుకున్నాము.ఆఖరి నిమిషంలో మర్నాడు నా ప్రోగ్రాం కొంచెం మారింది ( నేనేమైనా వి.ఐ.పీ నా ఏమిటీ,ఇచ్చిన ప్రోగ్రాం ప్రకారం నడుచుకోడానికి). ప్రొద్దుటే ఆయనకి ఫొన్ చేశాను’ అయ్యా ఫలానా కారణాలవల్ల నా కార్యక్రమంలో కొంచెం మార్పొచ్చిందీ,ముందనుకున్నట్లుగా నేను లక్డీకా ఫూల్ రావడంలేదు’అన్నాను.’అమ్మయ్య ఓ గొడవ వదిలిందిరా బాబూ, ఈ సారి వచ్చినప్పుడు కలవడానికి ప్రయత్నిస్తానూ’ అని గ్యారెంటీగా అంటారని ఆశించాను!అబ్బే అలాటిదేమీ లేదు, ‘ ఏం ఫరవా లేదూ, మీరెక్కడుంటున్నారో చెప్పండీ ఫలానా టైముకి వచ్చేస్తానూ’ అన్నారు. ఇదేమిటీ ఈయనకేమీ పనీ పాటా లేదా,ఎక్కడో ముక్కూ మొహం తెలియనివాడికోసం ఇంత దూరం వస్తానంటారూ అనుకున్నాను. దూరం ఎలా తెలిసిందీ అంటే, అప్పటికే నాలుగు ట్రిప్పులు కాచిగూడాకీ,ఖైరతాబాద్ కీ ఆటోలో అయ్యాయిగా!3.30-4.00 మధ్యలో వస్తానన్నారు.
ఇంక మా వియ్యాలారింట్లో అందరికీ, అడిగినవాడికీ,అడగనివాడికీ చెప్పేశాను. మధ్యాన్నం నాలుగింటికి నన్ను కలుసుకోడానికి ఒకాయనొస్తున్నారోచ్ అని.పైగా నాకు ఆయనతో పరిచయం నెట్ ద్వారానే అని తెలియగానే మరీ మరీ ఆశ్ఛర్యపడిపోయారు! మీరొక్కళ్ళే కాదూ నాకూ తెలిసినవాళ్ళున్నారనే ‘ఫీలింగు’తో చెప్పాను.పాపం నిజానికి వాళ్ళేం అనుకోలేదు అలాగని. ఊరికే అలా పోజు పెట్టేశాను.ఆయనకి మన ఇల్లు తెలుసునా,ఎలా వస్తారూ అనే యూజుఅల్ ప్రశ్నలకి సమాధానంగా, దగ్గరలోకి వచ్చి ఫోన్ చేస్తారూ నేను వెళ్ళి తీసుకొస్తానూ అన్నాను.మా వియ్యంకుడుగారు ‘పొనీ సందుచివరదాకా వెళ్ళి నన్ను తీసుకురమ్మంటారా’అన్నారు.నాకే దిక్కు లేదు, ఆయనెలా ఉంటారో ఫొటోల్లో చూడడం తప్ప,ఈయనకెందుకూ శ్రమ అని వద్దన్నాను.

     ఏదో బ్లాగ్గు ప్రొఫైల్లో ఫుటో పెట్టుకున్నారుకదా,గంభీరమైన విగ్రహం, ట్రేడ్ మార్క్ ఫ్రెంచి గెడ్డం, ఆమాత్రం గుర్తుపెట్టలేనా అని నేనే బయలుదేరాను.ఆ సందులో గాడీల్లో వచ్చే ప్రతీ మనిషినీ గెడ్డం ఉందో లేదో పరిశీలించడం,టిక్ ఆఫ్ చెయ్యడం!
ఇంతట్లో ‘హల్లో సర్ ఫణిబాబుగారూ’అంటూ ఓ ఆకాశవాణి వినిపించింది.ఎదురుగ్గా చూస్తే ఒకాయన బైక్కుమీద ఆగి నన్ను పిలుస్తున్నారు.‘మీగెడ్డం వగైరాలెమయ్యాయీ అని మొదటి పరిచయంలోనే అడగడం బాగుండదు కదా అని వదిలేశాను!
ఏదో గంభీరమైన మనిషీ, ఓ యాభైఏళ్ళుండవచ్చు అనుకుంటే, ఇంతాచేస్తే నాసర్విసు 42 ఏళ్ళకంటె తక్కువట! ఏమిటో ఇలా ఉంటాయి! నేనూ నా ఐడెంటిఫికేషన్లూ !!!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణికబుర్లు– వయస్సు గుర్తు చెయ్యడం!!

Thu, 06/24/2010 - 13:55

   రిటైరయినతరువాత, ఎప్పుడైనా ఏ శుభకార్యాలకో వెళ్ళామనుకోండి,ఒక్కోప్పుడు అదేదో డిప్రెషన్ లాటిదోటి వచ్చేస్తూంటుంది.పేద్ద కారణమేమీ ఉండదు ఊరికే అయినదానికీ,కానిదానికీ లేనిపోని పెద్దరికం అంటకట్టేస్తూంటారు! పురోహితుడు అక్షింతలు మనచేతిలోనే ముందు పెడతారు, భోజనానికి ఆకలి వేసినా వేయకపోయినా బలవంతంగా ఓ కుర్చీ,ఓ టేబులూ వేసేసి, మనల్ని తెచ్చుకోనీయకుండా, ఎవరో ఒకరు తెచ్చి మరీ ఇస్తారు! పైగా అందులో ట్రెడిషనల్ వంటకాలే పెడతారు.పోనీ మనల్ని వదిలెస్తే,అక్కడున్నవాటిల్లో,మనకు కావలిసినవేవో తీసుకుంటాముగా అని కూడా ఆలోచించరు!

    పైగా మనల్ని ఎక్కడకూ కదలనీయకుండా, ఏమీ పనిలేని కుర్రాడినొకణ్ణి మనకు కాపలా పెడతారు!’ తాతయ్యని ఒక్కణ్ణీ ఎక్కడకూవెళ్ళనీయకురా’అంటూ.ఇంక వాడు మనతో ఆడేసుకుంటాడు! ఎలాగోలా వీణ్ణి తప్పించికుని, తినే వస్తువులదగ్గరకి వెళ్ళడానికి ప్రయత్నించామా,అక్కడ ఎవడో పలకరిస్తాడు!అందులోనూ ఈ మధ్యన ‘బఫే’ ల్లో,నోరూరించే సరుకులన్నీ పెడుతున్నారాయె! మొహమ్మాటానికి సాత్వీకాహారమే తినాల్సొస్తుంది! అన్నిటిలోకీ, ఆ పెళ్ళికూతురునీ,పెళ్ళికొడుకునీ మన కాళ్ళకి దండం పెట్టించడం! అప్పటికే ఎంతోమందికి దండాలు పెట్టేసి ఉంటారేమో,మన కాళ్ళమిద పడ్డట్లే పడి విసుగొచ్చి,మన కాళ్ళులాగేస్తే
ఇంక అంతే సంగతులు! ఇంకో డిప్రెసింగ్ థింగేమిటంటే,మొగాళ్ళకి తువ్వాలుగుడ్డో,పంచెలచాపో పెట్టడం!అసలు ఈ బట్టలు పెట్టడంతోటే ఖర్చెక్కువవుతూంటుంది!

    మేము మా అగస్థ్య అన్నప్రాశన సందర్భంలో కదా భాగ్యనగరం వచ్చిందీ, అక్కడైతే ,నాకు వియ్యంకుడి హోదా ఓటీ!ప్రతీదానికీ మొహమ్మాటపెట్టేయడం!నాకేమీ ఫార్మాలిటీస్ వద్దుమొర్రో అన్నా వినరు.కానీ అక్కడున్నంతవరకూ కాలక్షేపం మాత్రం చాలా బాగా జరిగింది.నా వయస్సు వారు ఇంకొక్కరే ఉన్నారు.ఇది మరీ కష్టం,ఆయనకీ,నాకూ అందరికంటె ముందుగా భోజనం పెట్టేశారు ఆకలి అవడంలేదన్నా వినకుండా!ఆ ఫంక్షన్ కి ఒకాయన వచ్చారు,వెళ్ళేముందర చెప్పులేసికుని
గొప్పగా తన భార్యని పిలిచి ‘ఓ గ్లాసుతో మంచినీళ్ళు తేవోయ్’అన్నారు.అదేమిటండీ ఇప్పుడే కదా త్రాగారూ అన్నాను.దానికాయన ఇచ్చిన సమాధానం మాత్రం గ్రేట్-’ మా ఆవిడకూడా నేను చెప్పేమాట వింటుందని అందరికీ చూపించుకోడానికి
అప్పుడప్పుడు ఇలా చేస్తూండాలండి.ఇంట్లో బయలుదేరే ముందరే ఇలా చేస్తానూ అని పెర్మిషన్ తీసుకున్నానూ,దీనికి ప్రాయశ్చిత్తంగా,ఇంటికి వెళ్ళి, క్రిందనుంచి మూడు బకెట్లనీళ్ళు తేవాలని ఆర్డరూ! మాది మేనరికం లెండి’
అన్నారు!

    పోనీ ఒకసారి బయటకు వెళ్ళి తిరిగివద్దామని వెళ్ళాను.వామ్మోయ్ ఆ ట్రాఫిక్కేమిటండి బాబూ, రోడ్లూ అధ్వాన్నంగానే ఉన్నాయి,దానికి సాయం లైట్లు ఎక్కడా కనిపించవు. ఎందుకొచ్చిన గొడవరా బాబూ, ఏ స్కూటరు క్రిందైనా, బస్సు క్రిందైనా పడితే ‘టి.వీ’ లో ‘బ్రేకింగు న్యూస్’ లో నా పేరు వచ్చేస్తుందేమో అని భయ పడ్డాను.(నా పెన్షనర్ ఐ.డి.కార్డు ఎప్పుడూ జేబులోనే ఉంటుంది!).మొత్తానికి భాగ్యనగర ట్రిప్పు ఏ ఒడుదుడుకులూ లేకుండా పూర్తయింది.


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

Wed, 06/23/2010 - 15:48

    భాగ్యనగరం కబుర్లు ఇంకో రోజు వ్రాస్తానులెండి. నేను నిన్న వ్రాసిన బ్లాగ్గుకి మాఇంటావిడ తన version
వ్రాసుకుంది. అందుకే అంటారు- మొదటికొద్ది సంవత్సరాలూ మొగుడి మాట పెళ్ళాం వింటుందీ,ఆ తరువాత పెళ్ళాం మాట మొగుడు వింటాడూ, ఇంక ఆ తరువాత వీళ్ళ మాటలు ఊళ్ళో వాళ్ళందరికీ వినిపిస్తాయీ అని, ఊరికే అన్నారా మన పెద్దవాళ్ళూ! ఏమిటేమిటో వ్రాసేసింది ఆవిడ, అదివరకు ఎప్పుడో ఆవకాయమీద తన ‘ టేక్’ వ్రాసి, బ్లాగు లో తన సపోర్టర్స్ అందరినీ కూడగొట్టుకుందిగా, అదీ చూద్దాం ఈ సంబరం ఎన్నాళ్ళో !!

    ఈ మధ్యన మిస్టరీ షాపింగు ప్రకరణంలో ఈ వేళ ‘యాప్ టెక్’(Aptech) వాళ్ళ ‘ఆన్ లైన్ టెస్ట్’ కి ఇన్విజిలేటర్ గా వెళ్ళాను.ఊరికే వాళ్ళు టెస్ట్ ఇస్తున్నంతసేపూ, అక్కడ కూర్చుని, వాళ్ళు కాపీలూ గట్రా చెయ్యకుండా చూడడం,ఆ తరువాత
వాళ్ళకొచ్చిన మార్కులు నోట్ చేసి పంపడం.అంతే. దానికి ఏమీ కంప్యూటర్ నాలెడ్జ్ అఖ్ఖర్లెదు.అయినా నాకేమీ ఉన్నట్లు ప్రిటెండు కూడా చెయ్యను!పరీక్షలు వ్రాసేవారిని సూపర్వైజు చెయ్యడం అంటే బలే సరదా నాకు!ఎంతచెప్పినా నా పరిజ్ఞానం ఎవడూ టెస్ట్ చెయ్యడుగా,అదన్నమాట ఈ సంతోషానికి కారణం !
ముందుగా అక్కడికి వచ్చిన పిల్లల ఐ.డి చెక్ చేయడం,అదేదో పేద్ద ప్రొఫెషనల్ గా చూడ్డం, ఐ.డి తేనివాడికి ఓ లెక్చరివ్వడం, మరీ ఒకళ్ళతో ఒకళ్ళు కబుర్లు చెప్పుకుంటూంటే ఓసారి దగ్గడం! ఇవన్నీ నా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు, అసలు నేను ఈ చదువు ఎప్పటికైనా పూర్తి చేస్తానా, లేక జీవితమంతా ఇలా పరీక్షలు వ్రాస్తూనే ఉంటానా, ఎప్పటికైనా ఇన్విజిలేటరుగా కుర్చీలో కూర్చుంటానా అని కలలు కనేవాడిని.ఆ రోజుల్లో మన ఊహలు/కలలు కూడా అలాగే ఉండేవిలెండి
బస్సుల్లో టిక్కెట్లిచ్చే కండక్టరైతే బాగుండుననిపించేది. ఇంకోసారి సినిమా హాళ్ళలో గేటు దగ్గర టిక్కెట్లు చింపేవాడిగా,ఉంటే రోజూ సినిమా ఊరికే చూడొచ్చుగా అనిపించేది!ఏమిటో ఒక్కటీ అవలేకపోయాము! పోన్లెండి కనీసం,పరిక్షల వాచరుగానైనా పెట్టిపుట్టాను! ఆరోజుల్లోని వాచర్ నే ఇప్పుడు స్టయిలుగా ‘ఇన్విజిలేటర్’ అంటారని తెలిసింది!

 7nbsp;  ఆ రూం లో ఓ కుర్చీ వేసికుని,అప్పుడప్పుడు లేచి, ఓ సారి అటూ ఇటూ తిరగడం వరకూ బాగానే ఉంది.అక్కడకేదో, నేను కంప్యూటర్ విషయంలో,పేద్ద జ్ఞానం ఉన్నవాడినేమో అనే అపోహలో వాళ్ళకి జవాబులు తెలియని ప్రశ్నలకి,నన్నడగడం మొదలెట్టారు! పాపం వెర్రోళ్ళు,వాళ్ళకేం తెలుసూ,నాకు ఓ అంటే ఢాం రాదని! ఏదో ఇంట్లో కూర్చుని ఏదో గిలిక్కూండడమే కానీ, బయటకు వెళ్ళి సైబర్ కెఫే లో మెయిల్ చెక్ చెసికోవడం కూడా తెలియని అర్భకుడిని!

    ఇంట్లో పిల్లలందరిదగ్గరా ల్యాప్ టాప్ లు ఉన్నా సరే, దాన్ని వాడడం ఇప్పటిదాకా తెలియదు.ఎంత మెల్లిగా నొక్కినా, ఆ బాణాకారంది కర్సరో సింగినాదమో ఏదో అంటారు,ఎప్పుడూ లొంగదు! అస్తమానూ పారిపోవడమే! ఇదండీ నాకున్న పరిజ్ఞానం! ఏదో వీధిన పడకుండా లాగించేస్తున్నాను! అలాటి ప్రాణిని,సబ్జెక్టులో ప్రశ్నలేస్తే ఎలాగా? ‘ సైలెన్స్’ అంటూ వాళ్ళని కోప్పడేసి,ఏదోలా తప్పించేసుకున్నా! అవన్నీ నా చిన్నతనపు ‘కలలు’. ఆ రోజుల్లో వాచర్లూ అంతే, మనం
చచ్చేటట్లుగా శ్రమ పడి పరీక్షలు వ్రాస్తూంటే, మన వాచరూ, ప్రక్క రూంలోని వాచరూ సినిమా కబుర్లో ఇంకోటో చెప్పుకుంటూండేవారు. వాళ్ళదేంపోయిందీ, వాళ్ళేం చదవాలా బట్టీ పట్టాలా మనలాగ! పిల్లికి చెలగాటం, ఎలుక్కి ప్రాణ సంకటం!

   ఇవన్నీ ఎప్పటికైనా చెయ్యాలనేదే నా జీవిత ధ్యేయం! కానీ ఇందులో తెలియనివాటి గురించి చెప్పడం ‘ఇంక్లూడ్’ అవలేదే! అదొక్కటే బాగుండలేదు!
మొత్తానికి, వాళ్ళచేత టెస్ట్ వ్రాయించి,వచ్చాను. ఊరికే కాదనుకోండి, ఏదో డబ్బులిస్తారు.ఇంట్లో ఉంటే మా ఇంటావిడ బయటకు వెళ్ళి కూరలు తెండీ అంటుంది, బయట మార్కెట్ కి వెళ్తే ధరలు టాపు లేపేస్తున్నాయి.ఒకప్పుడు కిలోల్లో కొన్న ఈ చేతులే, పావుల్లో కొనవలసివస్తోంది ! ఇంటికంటే గుడి పదిలం అంటారు అందుకే!!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–’ లక్ష్మి మొగుడు’

Tue, 06/22/2010 - 13:16

    అమ్మయ్య ప్రాణానికి హాయిగా ఉంది-ఈయన గోల వినలేక పోతున్నామూ,ఈ మూడూ రోజులూ గొడవ వదిలిందీ అనుకుంటున్నారు కదూ.అబ్బే అలా వదులుతానా?ఇంట్లో వాళ్ళెవరికీ,నా గోల భరించే ఓపికా, టైమూ లేదు.నా కున్న బంధువర్గం అంతా నా బ్లాగ్గు స్నేహితులే! మరీ ఎదురుగుండా కూర్చోపెట్టి బోరుకొడితే కష్టం కానీ, ఇలా తోచిందేదో వ్రాసుకుంటూ పోతే, మీరు చదివారా లేదా, పోనీ చదివితే ఏమనుకున్నారూ అనే బాధ ఉండదు,నా కడుపుబ్బరం కూడా తగ్గుతుంది! ఏమంటారు?

    మొన్న శనివారం నాడు, మా అగస్థ్య అన్నప్రాశనకి,భాగ్యనగరం వెళ్ళాము( వాళ్ళ తాతయ్య,అమ్మమ్మ ల ఆధ్వర్యంలో జరిగిందిలెండి). ఎలాగూ వెళ్ళాం కదా అని శనివారం నాడు, మా ఇంటావిడ అమ్మ మేనమామగారి కూతురి మనవరాలి మనవడి మేనమామ పెళ్ళికి ( చూశారా ఎంత ‘దగ్గిర’ చుట్టరికమో!) లక్డీకా పూల్ దగ్గర ఉన్న మారుతీ గార్డెన్స్ కి వెళ్ళాము.ఆ రోజు మర్నాడు ప్రొద్దుటే అవబోయే పెళ్ళికి రిసెప్షన్ ట.ఈ రోజుల్లో ముందర రిసెప్షనూ, తరువాతే పెళ్ళిగా! అక్కడ ఒక్కరంటే ఒక్కరూ ( పెళ్ళికొడుకూ, అతని తల్లితండ్రులూ తప్ప) నాకు తెలియదు.
ఆ మాటకొస్తే, మా ఇంటావిడకీ ఎవరూ అంత గుర్తులేరనుకోండి. పేర్లు,చుట్టరికాలూ మాత్రం భేషుగ్గా గుర్తున్నాయి.అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉండే బోర్డుల్నీ, వాటిమీదుండే పేర్లనీ బట్టి, ఫరవాలేదూ, కరెక్టు పెళ్ళొకే వచ్చామూ అనుకున్నాము.

    కనిపించిన ప్రతీవారినీ అడిగి మొత్తానికి పెళ్ళికొడుకు తల్లి గారిని ట్రేస్ చేశాము.ఆవడేమో, మా ఇంటావిడని, వాళ్ళ ప్రతీ చుట్టం దగ్గరకీ తీసికెళ్ళడం, ‘ మన సీతక్క కూతురొచ్చిందే ( మా అత్తగారి పేరు సీతామహలక్ష్మి లెండి)’ అంటూ పరిచయం చేయడం! ‘ అయ్యో సీతకూతురివా అంటూ బోల్డంత ఆశ్ఛర్యపడిపోవడం! 40 ఏళ్ళక్రితం చూసిన మనిషి ఇంకా బాలా కుమారిలా ఉండదుగా!వాళ్ళూ అమ్మమ్మలూ/తాతయ్యలూ/మామ్మ (మా మనవలూ/మనవరాళ్ళు, మా ఇంటావిడని నానమ్మా అంటారోఛ్!) అయ్యారు, అయినా సరే అదో పలకరింపూ!ఇంక వాళ్ళూ, ఈవిడా ( అంటే మా ఇంటావిడ) ఒకటే ఖబుర్లు! ఒకటా రెండా, నలభైయేళ్ళ ఖబుర్లు చెప్పుకోవాలి.

    ఈ కార్యక్రమం ( అంటే ‘ఓహో సిత కూతురివా, వగైరా వగైరా..)జరుగుతున్నంతసేపూ, నన్ను ఎవళ్ళూ మాత్రం పట్టించుకోలేదు.ఇంత పెద్ద మగాడ్ని పట్టుకుని! పాపం ఒక పెద్దావిడ మాత్రం,ముంగిలా వెనక్కాలే నుంచున్న నన్ను చూసి, మా ఇంటావిడని అడిగారు’ ఏమే మీ ఆయనా ఏమిటీ’ అంటూ. మా ఇంటావిడ కూడా అదేదో పేద్ద ఒబ్లైజు చేస్తూన్నట్లు, ‘హా’ అంది.మొత్తానికి నాకూ ఓ గుర్తింపొచ్చేసింది. మరీ ఎవడో పెళ్ళింట్లో సరుకులెత్తుకుపోయేవాడిలా కాక, నాకూ ఓ ‘స్థానం’ ఇచ్చేశారు.అప్పటికే ఓ పాతిక మందిదాకా, గుర్తుపట్టడాలూ( ఆవిడని,నన్ను కాదు, నన్ను ‘ఆల్సో రాన్’ లో వేశారు)వగైరా అయ్యాయి.ఈ లోపులో పెళ్ళికొడుకు తల్లి వచ్చి మా ఇంటావిడని, ప్రత్యేకంగా పిలిచి, పెళ్ళికూతురుని చూపించడానికి తీసికెళ్ళారు.అక్కడ కూడా ‘ జాతి వివక్షణే’ నన్ను పిలవలేదు!పోన్లెండి!

    వచ్చిన గొడవల్లా ఏమిటంటే, కనిపించిన ప్రతీ చుట్టానికీ, ప్రక్కనే షాడో లా నుంచున్న, నన్ను ‘ లక్ష్మి మొగుడే’ అంటూ పరిచయం చేయడం. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళూ, నా పేరడగలేదు, నా వయస్సడగలేదు, ఏదైనా ఉద్యోగం చేసేవాడినా అని అడగలేదు, అసలు ఊపిరి పీలుస్తున్నానా లేదా అనికూడా అడగలెదు! సింప్లీ ‘లక్ష్మి మొగుడు’ దట్సాల్ !!

    వెతగ్గా వెతగ్గా మొత్తానికి నాకూ,వీళ్ళకీ ఉండే ఓ కామన్ ఫ్రెండొకాయన దొరికారు. అమ్మయ్యా అనుకుని,ఆయన్ని పలకరించాను. పాపం ఆయన సంగతీ నాలాగే ‘ఫలానా ఆవిడ మొగుడూ’ అని! ఆయనా వారి భార్య వెనక్కాలే షాడోలా ఫాలొ అవుతూండగా,మొత్తానికి నేను దొరికాను. అదృష్టంకొద్దీ ఆయనతో కబుర్లెసుకున్నాను.
ఇంక మా ఇంటావిడ చుట్టరికాల రివైవల్ కార్యక్రమంలో, ఎవరినో కలవడం,నన్ను పిలవడం, ‘ ఈవిడ తెలుసునా, మన పెళ్ళిలో స్టీలు క్యారీయరిచ్చిందీ,పిల్ల బారసాలకి స్టీలు ప్లేటిచ్చిందీ, గుర్తొచ్చారా’ అంటూ. నాకు నిన్న తిన్నదెదో ఇవాళ్టికి గుర్తుండదు, నలభై ఏళ్ళక్రితం ఎవరు స్టీలు పళ్ళెం ఇచ్చారో, ఎవరు ఉధ్ధరిణిచ్చారో ఎవడికి గుర్తూ? అయినా అదేదో గుర్తున్నట్లుగా, ఓ పోజు పెట్టడం!

    ఈ వ్యవహారంలో నన్ను ఇరకాటంలో పెట్టే లోపలే ఇక్కడినుండి వెళ్ళిపోవడం ఆరోగ్యానికి మంచిదీ అనుకుని,మా ఇంటావిడని, వాళ్ళ చుట్టాలతో రాత్రంతా కబుర్లు చెప్పుకోమని, అక్కడ వదిలేసి, ఓ ఆటో పట్టుకుని కాచిగూడా వెళ్ళిపోయాను. అసలు ఈ గొడవంతా ఎందుకొచ్చిందంటే, పదిహేను రోజుల క్రితం, నా మేనకోడలి కొడుకు పెళ్ళికి వెళ్ళాం కదా, అక్కడేమో అందరూ ఈవిడని ‘ఫణి పెళ్ళాం, ఫణి పెళ్ళాం’ అనేకానీ, ఈవిడకి అసలు గుర్తింపే ఇవ్వలేదుట! అందుకని నన్ను ఈ పెళ్ళికి కావాలని తీసికెళ్ళి,తణుకు వాళ్ళేమిటో చూపించింది! ఏమిటో అమాయకుడినీ, ఇవన్నీ తెలియకుండా ‘ట్రాప్ ‘ లో పడిపోయాను!

    మా చిన్నప్పుడు ఓ సామెత వినేవాళ్ళం, ఓ పెద్దాయన్ని పెళ్ళైనప్పటినుండీ ‘ పాతూరి బుల్లెంకమ్మ గారి మొగుడూ ‘ అనేవారుట.అంటే ఈ పెద్దాయనకి అస్థిత్వం లేనట్లుగా, అలా మేము వెళ్ళిన పెళ్ళిలో ‘ లక్ష్మి మొగుడు’ గా గుర్తింపు వచ్చింది. అన్ని రోజులూ మనవి కాదుగా! !


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-వైద్యో నారాయణ హరి-2

Fri, 06/18/2010 - 12:45

    మేము 1975 లో ఫాక్టరీ క్వార్టర్స్ కి వచ్చినప్పుడు దగ్గరలో ఒక ఆర్.ఎం.పి డాక్టరొకరుండేవారు.ఆయన ఆయుర్వేదం,హోమోపతీ,ఎల్లోపతీ మూడూ చేసేవారు.మా ఇంటావిడకి తలనొప్పి ఒకటి ఉండేది.ఎలోపతీ లో అన్నిరకాల టెస్టులూ చేయించినా ఉపయోగం లేకపోయింది. ఎవరో చెప్తే ఈ డాక్టరుగారి దగ్గరకు వెళ్ళాము.అక్కడ విపరీతమైన రష్ గా ఉంది.నెంబరు టోకెన్ ఇచ్చి,ఓ రెండు గంటలు పోయిన తరువాత రమ్మన్నారు.ఆయన ఎంత బిజీ అంటే,ఓ చేత్తో ఒకపేషెంటు నాడి చూసేవారు,రెండో చేతితో స్టెతస్కొప్ పెట్టి ఇంకో పేషెంటుని చూశేవారు. ఆ ప్రక్రియలో, మా ఇంటావిడని ఒకచేతికి అందిచ్చాను! సమస్యేమిటీ దానికి మేము ఏమేం చేశామో చెప్పేలోపలే, ‘ బారా నెంబర్ గోళీ’ అని ఓ అరుపు అరిచారు,కాంపౌండర్ ఓ చిన్న బాటిల్ లో ‘బయోటెక్’ మాత్రలు తెచ్చి ఇచ్చాడు.వాటిని మూడు రోజులు వరుసగా వేసికోమని,నాలుగో రోజుకి తగ్గకపోతే,తిరిగి రమ్మన్నారు. ఫీజు–ఒక రూపాయి,అరవై అయిదు పైసలు మాత్రమే! మీరు నమ్మినా నమ్మకపోయినా, మా ఇంటావిడ తలనొప్పి మాయంఅయిపోయింది మూడో రోజుకి! ఆ డాక్టరుగారు ఇప్పటికీ మాకు దగ్గరలోనే ఉన్నారు, ఓసారి వెళ్ళి నా మోకాలి నొప్పికేదైనా మందిస్తారేమో చూడాలి! ఆయన అసలు ఉద్యోగం-ఈ.ఎం.ఈ. వర్క్ షాప్ లో కార్పెంటర్ !!!

    మాకు సి.జి.ఎచ్.ఎస్ ఉంది, కానీ చిన్న చిన్న సమస్యలకి, ఆ డిస్పెన్సరీకి వెళ్ళి క్యూ లో నుంచునే ఓపిక లేక, దగ్గరలో ఉండే డాక్టర్లదగ్గరకే వెళ్తూంటాము. ఇంక కార్పొరేట్ ఆసుపత్రిలకి వస్తే,ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.ఒకసారి నా మోకాలి నొప్పికి, మా దేష్పాండే గారు అదేదో డాప్లర్ టెస్ట్ చేయించుకోమన్నారు. సరేకదా అని జహంగీర్ ఆసుపత్రికి వెళ్తే, ముందుగా రెండు వందలూ వసూలుచేసి, మూడు గంటలు కూర్చోపెట్టి, రెండు రోజుల తరువాత రమ్మన్నారు! రోడ్డుకి అవతలివైపు ఉన్న రూబీ హాల్ కి వెళ్తే, నూట పాతిక రూపాయలకి,ఆ టెస్ట్ చేసి పంపారు. ఇలా ఉంటాయి ఈ కార్పొరేట్ ఆసుపత్రులు, ఎవడికెంత తోస్తే దోచుకోవడమే! ఇదంతా నేను అప్పుడు పూణే లో ఉన్న న్యూస్ పేపర్లన్నిటికీ వ్రాస్తే, వాళ్ళు, ఆ ఆసుపత్రుల పేర్లు వేయకుండా, మిగిలినదంతా పబ్లిష్ చేశారు.ఇదేమిటీ అని అడిగితే, ‘మేము అన్ని ప్రూఫ్ లూ ఉంటేతప్ప, పెద్ద పెద్ద ఆసుపత్రుల పేర్లు వ్రాయమూ అన్నారు! ఇలా ఉంది మన ‘ఫొర్త్ ఎస్టేట్’! నా దగ్గర జహంగీర్ వాళ్ళిచ్చిన రసీదూ,రూబీ వాళ్ళిచ్చిన రసీదూ ఉన్నాయి మొర్రో అన్నా వినలేదు. ఒఖ్ఖళ్ళనే అనేదేమిలెండి, మన న్యూస్ పేపర్లూ అలాగే ఉన్నాయి!’యు స్క్రాచ్ మై బాక్, ఐ స్క్రాచ్ యువర్స్’ అనే పధ్ధతిలో!

    పళ్ళుతీయించుకున్నప్పుడు, మా కజిన్ మిలిటరీ హాస్పిటల్ లో సి.ఓ. కాబట్టి, అంతా మహరాజభోగంలా జరిగింది, నాలుగుసార్లూ! ఇంకా కొన్ని పళ్ళుంటే బాగుండునూ అనిపించేలా !!ఏంచేస్తాం అన్నీ పీకించేశాను! ఆ తరువాత డెంచర్స్ తయారుచేయడానికి కమాండ్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడూ, చాలా బాగా చేశారు.ఊరికె వచ్చాయి కాబట్టి ఉపయోగించడంలెదనుకోండి,అది వేరే సంగతి! అప్పుడే అనిపిస్తూంటుంది ‘ఫుకట్’ గా వచ్చినదానికి విలువ ఇయ్యము,అదే వందలూ,వేలూ ఖర్చుపెట్టుంటే, చచ్చినట్లు ఉపయోగించేవాడిని!దాన్నేఅంటారు ‘పెరట్లో చెట్టు వైద్యానికి ఉపయోగించదూ’అని!అలాగే ఇంట్లో డాక్టర్లున్నా సరే, వాళ్ళమాట ఎక్కడ వింటామూ? వాళ్ళు ఊళ్ళోవాళ్ళందరికీ దేముళ్ళు, మనం మాత్రం ‘కేర్’ చెయ్యం!

   మాకు దగ్గరలో ఉన్న ఓ డాక్టరు గారు విజిట్ కీ పాతిక తీసికుంటారు.నేను ఈ గోలంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈ నలభైఏళ్ళనుండీ, వెళ్ళే డాక్టరుగారు, వెళ్ళినప్పుడల్లా, పేషెంటుకి, వంద చొప్పున తీసికుంటున్నారు.ఈ డాక్టర్లు కూడా, వాళ్ళుండే యేరియాని బట్టి వసూలు చేస్తారనుకుంటాను.ఇంటద్దీ అన్నీ కలిపి మనకి రుద్దేస్తారు! ఈయన చిన్నపిల్లలకి డాక్టర్. సంవత్సరాలనుండీ తెలిసున్నవాడూ అనే సెంటిమెంటుతో వెళ్ళినప్పుడల్లా పేషంటుకి వంద చొప్పునా సమర్పించుకుంటున్నాము!
ఓ తలనొప్పి/జ్వరం కి సంబంధించిన మాత్రోటి ఉంటుంది, ఒక్కో కంపెనీది ఒక్కో రేటు. మామూలుగా పారాసిటమాల్/క్రోషిన్ 10 రూపాయలకి పదీ ఇస్తాడు,అదే డాక్టర్లు వ్రాసిన దానికి పదిహెను లాగిస్తాడు! దానర్ధం, ఆ కంపెనీ ఏజెంటెవడో వెళ్ళి, ఆ డాక్టరుగారికి సమర్పించిన బహుమతుల ఫలితం అన్నమాట! పోనీ ఏళ్ళ తరబడీ వస్తున్నారూ అనే జాలైనా ఉండదు, ‘ఎక్కడైనా బావ కానీ వంగతోటలో కాదు’ అన్నట్లుగా!
మరీ మంచంపట్టే రోగం ఏదీ రాకుండా వెళ్ళిపోతే బాగుండునూఅనిపిస్తూంటుంది, ఈ హాస్పిటళ్ళ వ్యవహారాలు చూస్తూంటే, ఏమో ఆ భగవంతుడు ఏం రాసిపెట్టాడో !!!
మళ్ళీ మిమ్మల్ని మంగళవారంనుండీ బోరు కొడతాను. ఈ మూడు రోజులూ భాగ్యనగరంలో!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి – కబుర్లు-వైద్యో నారాయణా హరీ!!

Thu, 06/17/2010 - 13:41

    ఈ రోజుల్లో డాక్టర్లదగ్గరకు వెళ్ళాలంటే భయం.ఏవేవో టెస్టులు చేసేసి బిల్లు చేతిలో పెట్టేటప్పడికి, లేని రోగాలు కూడా వచ్చేస్తూంటాయి. మా చిన్నప్పుడు ఊరికి ఓ నలుగురో,ఐదుగురో డాక్టర్లుండేవారు. అమలాపురంలో హరిహరస్వామి గారూ, మంథా సుబ్బారావుగారు, గోటేటి సరస్వతి గారు,వీరే కాకుండా ఇంకా కొంతమంది ఉండేవారు.వాళ్ళకి వెళ్ళినప్పుడల్లా డబ్బులీయఖ్ఖర్లేకుండా, ఏదో ఏడాదికి ఇంత అని ఇచ్చేవారు.అయినా ప్రతీదానికీ వెళ్ళేవారు కాదు.చిన్నచిన్న రోగాలు-జలుబూ,దగ్గూ,లాటివాట్లకి అల్లంరసం,శొంఠి కషాయం తీసుకోవడం,ఓ రెండురోజులు లంఖణం చేసేస్తే ఆ రోగం కాస్తా హాం ఫఠ్ !
<p.    ఏ కాలినొప్పో ,కాలు బెణకడంలాటిది వస్తే మా అమ్మమ్మగారు 'ఇరుకు మంత్రం' వేసేవారు. మన నమ్మకమో లేక నిజంగా వాటిల్లో మహాత్మ్యం ఉందో తెలియదుకానీ, రెండో రోజుకి తగ్గిపోయేది.పంటినొప్పి వస్తే ఓ లవంగం పెట్టుకుంటే తగ్గిపోయేది.నాకు చిన్నప్పుడు మోకాలు వాచిపోయేది,ఎన్నెన్నో వైద్యాలు చేయించారు.ఎవరేం చెప్తే అది.వాటిలో భాగంగా ఓసారి, మోకాలికి
తరవాణి అన్నం,చక్రకేళీ అరటిపండూ కలిపి కట్టమన్నారు. ఆ కాంబినేషను, నొప్పిమాట దేముడెరుగు, ఎవరూ చూడకుండా తినడానికి బాగుండేది!

    నా అదృష్టమేమంటే, సర్వీసులో ఉన్న 42 సంవత్సరాలూ, డాక్టర్ల విషయంలో ఎప్పుడూ సమస్య రాలేదు. పిల్లలకి వైద్యానికి ఒకాయన ఉండేవారు పూనాలో.చెప్పానుగా ఈ నలభై ఎనిమిది సంవత్సరాలూ, ఆయన దగ్గరకే వెళ్తున్నాము. గైనకాలజీ కి అయితే మా డాక్టరమ్మగారు.మెము వరంగాం లో ఉన్నప్పుడు పరిచయం అయిన డాక్టరు దేష్ పాండే గారితో పరిచయం ఇప్పటికీ సాగుతోంది.ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ముందుగా ఆయననే సంప్రదించి, ఆయన ఏ స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళమంటే వారిదగ్గరకే వెళ్ళడం.అవడం సాదా సీదా ఎం.బి.బి.ఎస్సే, కాని డయాగ్నసిస్ మాత్రం అద్భుతం. మామూలు వాటికి ఆయనే ఇచ్చేవారు.అదృష్టం కొద్దీ ఏ సీరియస్ సమస్యా లేకుండా లాగించేస్తున్నాము. పళ్ళు తీయించడంలో, మా కజిన్ చాలా సహాయం చేశారు.

    ఇంట్లో ఒక్క డాక్టరుంటే బాగుండుననిపిస్తోంది అప్పుడప్పుడు. కానీ వాళ్ళతో ఓ తంటాకూడా ఉంది. అది తినకూ,ఇదితినకూ,అంటూ ప్రతీ రోజూ ఉన్నదానికీ,లేనిదానికీ ప్రాణం తీస్తారు!అంతా మన మంచికోసమే అనుకోండి, అయినా అస్తమానూ క్లాసులు తీసుకుంటూంటే,కష్టం కదా!ఎన్ని జాగ్రత్తలు తీసికున్నా వచ్చే రోగాలెలాగూ వస్తాయి బయట ఉండే పొల్యూషన్ వల్లా, మనం తినే తిండి వల్లా, మరి ఈ మాత్రందానికి మన ప్రాణాలు తీయడం ఎందుకో!

    మేము రాజమండ్రీ లొ ఉన్నప్పుడు,మా అమ్మాయీ అల్లుడూ వచ్చారు. అల్లుడుగారికి ‘రివర్ బే’ లో తిన్న తిండి ధర్మమా అని స్టమక్ అప్సెట్ వచ్చింది. దగ్గరలో ఉన్న ఓ డాక్టరు దగ్గరకు వెళ్తే, అక్కడ చాలా మంది వెయిటింగు లొ ఉన్నారు.డాక్టరుగారిని, కొంచేం ప్రయారిటీ లో చూడమన్న పాపానికి, 300/- రూపాయలు ఛార్జ్ చేశారు. అవేవో నాలుగైదురకాలమందులు వ్రాసి ఇచ్చారు.దానికింకో మూడు వందలు, చిత్రమేమిటంటే ఓ డోసు వేసికోగానే అన్నీ బాగుపడ్డాయి.ఆ ఇచ్చేవికూడా ఓ యాంటీ బయాటిక్కూ,దాంతో వచ్చే యెసిడిటీ కి ఓ మందూ, ఓ రెండు మూడు రకాల విటమిన్లూ, అసలు ఇన్ని అవసరమా అనిపిస్తూంటుంది. అవున్లెండి డాక్టర్లూ బ్రతకాలి,ఆయన పెట్టుకున్న మందుల దుకాణమూ బ్రతకాలి.ఇంకో సంగతేమంటే సదరు డాక్టరుగారు వ్రాసిన మందులు ఇంకే కొట్లోనూ దొరకవు. పోనీ ఇంకో కొట్టుకి వెళ్ళి కొనుక్కుందామా అంటే, మనం కొన్న మందులు తీసికొచ్చి చూపించమంటాడు. ఈ గొడవలు పడలెక, చచ్చినట్లు ఆయన కొట్లోనే కొంటాం.

    ఇంకో సారి మా ఇంటావిడకి వైరల్ ఫీవర్ లాటిది వస్తే దగ్గరలో ఉన్న డాక్టరు ( ఇదివరకు అల్లుడి విషయంలో వెళ్ళినాయన కాదు, ఎందుకంటే ఆయన ఇంకో పేరు చెప్పి మళ్ళీ నాదగ్గర 300/- లాగించేస్తే! వామ్మోయ్ అసలే పెన్షనుమీద బ్రతుకుతున్నవాడిని!).ఎవరైనా ఉన్నారేమో అని చూడ్డానికి వెళ్ళాను. ఊరికె ఈవిడని తీసికెళ్ళి అక్కడ కూర్చోపెట్టడం ఎందుకూ అని.
దగ్గరలో ఎక్కడ చూసినా ఆర్థోపెడిక్సూ, కళ్ళవాళ్ళూ, దంతాలవాళ్ళే ఉన్నారు. మొత్తానికి ఓ డాక్టరు పేరుచూసి, ఈయన జనరల్ ఫిజీషియనే కదా అని వెళ్తే ఆయన రాత్రి 8.00 గంటలదాకా రారన్నారు అక్కడ ఉండే నర్సమ్మ.8.00 గంటలకల్లా తీసుకువచ్చేయండీ, డాక్టరుగారు రాగానే మిమ్మల్నేముందర పంపిస్తానూ అనే ఎష్యూరెన్స్ ఆధారంగా, మా ఇంటావిడని తీసికుని వెళ్ళాను.
ఎనిమిదయ్యింది,తొమ్మిదైనా ఆ మహానుభావుడు రాడే.ఆ నర్సమ్మేమో ముందరే వందరూపాయలూ పుచ్చెసికుంది ( బస్సుల్లో కండక్టర్లు ముందరే టిక్కెట్టు కోసేస్తారు. ఆ బస్సు ఎప్పుడు బయలుదేరినా మనం చచ్చినట్లు దాంట్లొనే కూర్చోవాలి అలాగన్నమాట!). పోనీ ఆ వందా పొతేపోయింది ( అప్పటికే ప్రయారిటీ పధ్ధతిలో 300/- ఇచ్చుకున్న వాల్యుబుల్ ఎక్స్ పీరియెన్సుందిగా!) ఇంకో డాక్టరుదగ్గరకు వెళ్దామా అంటే ఆ నర్సమ్మ వెళ్ళనీయదే! మొత్తానికి ఆడుతూ పాడుతూ వచ్చారండి డాక్టరుగారు, నాకు చిర్రెత్తిపోయింది అడిగేశాను ‘ మీకు ఓ టైమూ గట్రా ఉండవా’ అని. నాదేంపోయిందీ, మళ్ళీ ఆయన మొహం నేను చూడనూ,నామొహం ఆయన చూడడూ! ఏదో వయరల్ ఫీవర్ అని చెప్పి ఓ కాగితంనిండా ఏవేవో వ్రాసి ఇచ్చారు.మామూలేగా ఆయన కొట్లోకే వెళ్ళి తీసికున్నాను.అంతా కలిపి మొత్తం మూడు వందలూ పూర్తిచేశారు.అంతా బాగానే ఉందికానీ, ఆ కాగితం మీద ప్రతీ మందు ముందరా తెలుగులో
ఉ. మ. రా. అనివ్రాశారు. మళ్ళీ ఇదేదో యునానీ మందేమో అనుకుని, అవి ఇవ్వలెదే అని ఆ కొట్టువాడిని కోప్పడ్డాను.అవి మందులు కాదండి బాబూ,వాటి అర్ధం- ఉదయం, మధ్యాన్నం, రాత్రి- అని! ఏదో మేం చేసికున్న పూర్వజన్మ పుణ్యం అనుకోండి, ఇంకే డాక్టరుదగ్గరకూ వెళ్ళవలసిన అవసరం లేకుండా మళ్ళీ ఆ ఉ.మ.రా ల అవసరం లేకుండా వచ్చేశాము.


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– వర్షాలొచ్చేశాయి !!!

Wed, 06/16/2010 - 11:44

    వర్షాలు మొదలెట్టడం,స్కూళ్ళు తెరవడం అదేమిటో ఎప్పుడూ ఒకేసారి మొదలౌతాయి.ప్రొద్దుటే 4-5 సంవత్సరాల పిల్లల దగ్గరనుండీ, పాపం రెయిన్ కోట్లు చుట్టబెట్టుకుని ఆ వర్షంలో
వెళ్తూంటే చాలా జాలి వేస్తుంది.ఈ రోజుల్లో అంత చిన్న వయస్సునుండీ స్కూళ్ళకి పంపకపోతే, ఆ తరువాత కష్టం అయిపోతుంది.

    ఈ వర్షాలు కూడా ప్రొద్దుటే స్కూలు మొదలెట్టే టైముకీ, మధ్యాన్నం/సాయంత్రం స్కూలు విడిచే సమయానికే వస్తూంటాయి! ఆ పిల్లలు ఇంటికి క్షేమంగా చేరేదాకా తల్లితండ్రులకి టెన్షనే.
కానీ ఏమీ చేయలేని పరిస్థితి.ఇవన్నీ చూస్తూంటే మేము ఎంత అదృష్టవంతులమో అనిపిస్తూంటుంది.మా రోజుల్లో మరీ ఇంత చిన్న వయస్సులో స్కూళ్ళకి పంపలేదు.గట్టిగా వర్షం వస్తే స్కూలు బందు చేసేవారు. స్కూలు జరుగుతున్న టైములో వస్తే ‘కంటిన్యూ’ చేసేవారు.ఇంటర్వెల్ లేకుండా, ఇంకో రెండు గంటలు కూర్చోపెట్టి, పెందరాళే అంటే ఏ రెండింటికో ఇళ్ళకు పంపించేసేవారు. హాయిగా ఉండేది.

    మా పిల్లలైతే ఈ కాన్వెంటులూ గొడవా లేకుండానే, కేంద్రీయ విద్యాలయాల్లో( అది కూడా మా క్వార్టర్ కి ఎదురుగా ఉండేది) లాగించేశారు.కానీ వాళ్ళిద్దరూ, వాళ్ళ పిల్లల్ని స్కూలుకి పంపడానికి చేసే కసరత్తులు చూస్తూంటే, ఏం చేయాలో తెలియడంలేదు.ప్రొద్దుటే 7.30 కి స్కూలు బస్సొచ్చేస్తుంది. టైముకి పంపడానికి వీళ్ళు పడే తిప్పలు చూస్తూంటే,నేను నా విషయంలో కానీ,మా పిల్లల విషయంలో కానీ అసలు కష్టపడ్డట్టే లేదు!

    ఈ వర్షాల్లో యూనిఫారంలు ఎన్ని జతలున్నా సరిపోవు.వాటిని ఉతికి ఆరేయడం,నెక్స్ట్ టు ఇంపాసిబుల్. పెద్ద పిల్లలైతే కొంచెం బాధ్యతతో ఉంటారు. చిన్నవాళ్ళు లోయర్ కేజీ నుండి,తర్డ్ క్లాసు వరకూ ఉండే పిల్లలతో పడే కష్టాలు పగవాడిక్కూడా ఉండకూడదనిపిస్తుంది. రైన్ కోట్లు ఇచ్చినా సరే, వాటిని వేసికోకుండా వర్షంలో తడవడమే వాళ్ళ జన్మహక్కనుకుంటారు. పైగా వీలుంటే ఆ రైన్ కోటు ని స్కూల్లోనో, బస్సులోనో డెలిబరేట్ గా మర్చిపోవడం ఒకటీ.ఇది పోతే మమ్మీ డాడీ కొత్తది కొంటారులే అని ఓ భరోసా! పైగా ఈ వర్షాల్లో చిన్న పిల్లలకి తప్పకుండా ఈ జలుబో, దగ్గో రాకుండా ఉండదు. డాక్టర్లకి ఈ వర్షాకాలం ఓ వరం లాటిది.

    ఏడాది కి కావలిసినంత నీరూ, నదుల్లోకీ, డాముల్లోకీ ఎలా సమకూర్చుకుంటామో, అలాగ ఈ డాక్టర్లు కూడా ఏడాది పొడుగునా సంపాదించేదానికన్నా, ఈ వర్షాకాలంలోనే మేక్ అప్ చేసేస్తూంటారు.ఇంటికి ఎంతమంది పిల్లలుంటే డాక్టర్లకి అంత ఆనందం.ఒక పిల్లకి వచ్చిన సమస్య ఇంకోళ్ళకి రాదు, పోనీ ఆ పిల్లకో పిల్లాడికో వచ్చినప్పుడు ఇచ్చిన మెడిసిన్, ఈ రెండో వాడికి ఇద్దామనుకుంటే, ఆ డాక్టరు ఒప్పుకోడు.పైగా సెల్ఫ్ మెడికేషన్ వల్ల వచ్చే నష్టాలమీద ఓ క్లాసు తీసికుంటాడు. ఇంతా చేసి, ఆ వర్షంలో తీసికెళ్ళినా, ఇంకో కంపెనీది అదే యాంటీ బయాటిక్క్ వ్రాసి, 100 రూపాయలూ వసూలు చేస్తాడు!

    ఈ వర్షాకాలంలో బస్సుల్లో చూడాలి, గొడుగులు తడిసిపోయి, నీళ్ళు కారుతూ ఉంటాయి.వీళ్ళ ధర్మమా అని, పొడిగా ఉన్నవాళ్ళు తడైపోతారు.బస్సుల్లో కిటికీ గ్లాసులు ఛస్తే క్రిందికి దిగవు.దాంతో, సీట్లన్నీ తడిసిపోతూంటాయి. మన వైపు ‘పల్లెవెలుగు’ బస్సులు అయితే, ఇంక చెప్పఖ్ఖర్లేదు.లోపలకి వర్షంనీళ్ళు కారుతూనే ఉంటాయి.
ఆఫీసుల్లోనూ, దుకాణాల్లోనూ, గొడుగులు బయటే పెట్టి రమ్మంటారు. ఎవడెక్కడ ఎత్తుకుపోతాడనే భయమే. ఇంక రైతుబజార్లకీ, సంత లకీ వెళ్ళేటప్పుడైతే, ఏదో ఓ కొట్లో మర్చిపోయే ఆస్కారం ఎక్కువ.

   ఇంక ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళని సోఫాల్లో కూర్చోమనాలంటే, అవి ఎక్కడ పాడైపోతాయో అని భయం.అన్నిటిలోకి, ఇంటికి వచ్చే పనిమనుషులతో వస్తుంది.చాలా మంది
గొడుగుల్లేకుండానే వస్తారు. ఆ పనిమనిషి వర్షంలో వెళ్తే ఏ రోగమో వచ్చి మర్నాడు రాదేమో అనే భయం తో, ఇంట్లో ఉన్న గొడుగు, దానికిస్తాము.మన అదృష్టమ్ బాగుందా, మర్నాడు వర్షం వస్తుంది, ఆ గొడుగూ తిరిగి చూసే భాగ్యం ఉంటుంది.

    వర్షాల్లొ మాత్రం చిన్నప్పటి జ్ఞాపకాలు పుంఖానుపుంఖంగా వచ్చేస్తూంటాయి.ఇప్పటిలా అగ్గిపెట్టెల్లాటి ఎపార్ట్మెంట్లు కాదుగా, ఇంటికి ఎదురుగా పెద్ద స్థలం,వెనక్కాల పెరడుతోటీ కలకలలాడుతూండేవి. పేద్ద వర్షం వచ్చిందంటే చాలు,మోకాలు లోతు నీళ్ళతో నిండిపోయేవి. ఆ నీళ్ళల్లో కాగితపు పడవలు చేసికుని ఆడుకోడం ఎంత బాగుండేదో. వర్షాకాలంలో, జలగల గొడవ
ఒకటి. ఆవులకీ, గేదెలకీ పొదుగులకి పట్టేసేవి.ఒక్కోప్పుడు మనల్ని కూడా పట్టుకునేవనుకోండి. నూతుల్లో నీళ్ళు ఎంతో పైకి వచ్చేసేవి. ఈ రోజుల్లో నూతులేలేవు.ఇంక నీళ్ళెక్కడినుండి వస్తాయి?.

   అయినా ఆరోజుల్లో వర్షాలుకూడా టైముకే వచ్చేవి. ఇప్పుడో ‘అదేదో గ్లోబల్ వార్మింగ్’ ధర్మమా అని వర్షాలూ, అప్పుడప్పుడు డుమ్మా కొట్టేస్తూంటాయి. చాలా మందికి ఈ వర్షాకాలం చాలా రొమాంటిక్ గా ఉంటుంది.బయట హోరున వర్షం పడుతూంటే,వేడీ వేడిగా చాయ్ త్రాగుతూ….ఇవన్నీ ఆరోజుల్లో ఉండేవి. ఇప్పుడో వర్షం వచ్చినా ప్రళయం వచ్చినా ఆఫీసులనుండి, ట్రాఫిక్ జాం లలో చిక్కుకుని, ఏ అర్ధరాత్రికో కొంపకు చేరేసరికి బాస్సు దగ్గరనుండి ఫోనూ, అదేదొ ప్రాజెక్ట్ ఏమయిందీ అంటూ- దేనికైనా రాసిపెట్టుండాలండి బాబూ.….


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Wishful thinking !!

Wed, 06/16/2010 - 03:35

epaper-sakshi-com (1)

ఇప్పుడు మనం ఉంటున్న కాంక్రీటు జంగల్స్ లో

ఇలాటి దృశ్యాలు ,ఇలా పేపర్లలో ఫోటోల్లో చూసి ఆనందించడం తప్ప ఇంకేం చెయ్యగలం?


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అద్గదీ ఇలా ఉండాలి!

Tue, 06/15/2010 - 02:21

Amalapuram High School

పేద్ద పెద్ద మార్కులు తెచ్చుకోవాలంటే నారాయణలు,చైతన్యలు,ఆదిత్యలే అఖ్ఖర్లేదని నిరూపించింది, నేను చదివిన అమలాపురం లోని మా పాఠశాల.నన్ను ఆకోవలోకి చేర్చకండే !!!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- పుట్టిన రోజు

Mon, 06/14/2010 - 13:07

    మా బంగారు తల్లి నవ్య నాలుగవ పుట్టినరోజు 15-06-2010 న. ఈ నెల 17 నుండి లోయర్ కేజీ లోకి వెళ్తుంది.రోజులెంత త్వరగా గడిచిపోతాయో! ఇంకా నిన్న మొన్నటిదాకా చిన్న పాపలాగే ఉంది.అప్పుడే ఓ తమ్ముడికి అక్క అయింది.అందరూ వాడినే ముద్దు చేస్తూంటారని కోపం,అలకా వచ్చేస్తూంటాయి.రైల్వే వాళ్ళ ప్రకటనలలాగ తెలుగు,హిందీ,ఇంగ్లీషుల్లో ఏమిటేమిటో
చెప్పేస్తూంటుంది!మాట మాత్రం చాలా స్వఛ్ఛంగా ఉంటుంది. వాళ్ళ నాన్న, అమ్మలకంటె తెలుగు బాగా మాట్లాడుతూంటుంది.

    నేను టి.వీ. పెట్టుకునేదే తక్కువ.పెట్టగానే మాత్రం ఎక్కడినుండో వచ్చేస్తుంది, ‘ తాతయ్యా, హమేభీ దేఖ్నేదోనా,కార్టూన్’ అంటూ.నేను పెట్టుకున్నప్పుడే ఎందుకు వచ్చేస్తావూ అంటే
‘నాకు చాలా మజా వస్తుంది, మిమ్మల్ని అడగడం’ అంటుంది. ఇంకేం చేస్తాను? సరెండర్ అవడం తప్ప. ఇంక ముందుముందు తనూ, తన తమ్ముడూ ఏం ఆడుకుంటారో నాతో !!

God Bless her !!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–నాకు నచ్చిన ఒక వ్యాసం.

Sun, 06/13/2010 - 14:11

dear daddy..

ఆదివారం ఆంధ్రభూమి లో ‘డాడీ’ ల గురించి శ్రీ వి.ఎస్.ఎన్. మూర్తిగారు వ్రాసిన ఒక వ్యాసం. మీరూ చదవండి.


Categories: Middle