http://harephala.wordpress.com/feed/

Syndicate content PHANI BABU  -musings
Updated: 7 min 17 sec ago

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–వెన్నుపోటు a.k.a. विस्वास घात्

Mon, 08/02/2010 - 12:56

    ఏదో కొంచెం లైటుగా ఉండే కథలూ, వ్యాసాలూ చదవడం కానీ, నాకు సాహిత్యం గురించీ, ఇతిహాసాల గురించీ పొట్టకోస్తే అక్షరం ముక్క లేదు. టి.వీ. ల్లో సీరియల్స్ కూడా అంతెక్కువగా చూడను. హిందీలో ‘ఝాన్సీ కీ రాణి’ మాత్రం తప్పకుండా చూస్తాను. దానిలోకూడా రాణీ మీదా, గంగాధర్రావుమీదా చేసే కుట్రలు చూసినప్పుడల్లా,వాళ్ళని ఏం చేసినా పాపం లేదనిపిస్తూంటుంది!ఇదండీ నా background!

    మా ఇంటావిడ నాకు totally opposite, ప్రతీరోజూ నెట్ లో ఉండే పుస్తకాలు తీసి చదువుతూంటుంది,ప్రతీ వారం వచ్చే పుస్తకాలు చదువుతుంది, ఇంతవరకూ harmless activity లోకే వస్తుంది. ఏదో పుస్తకాల్లో వచ్చే పజిల్సూ, ఇదివరకు నెట్ లో వచ్చే ‘పొద్దు గడి’ దాకా ఫరవాలేదు.ఎప్పుడో వారానికో, నెలకో వస్తూంటాయి, మనకేమీ నష్టం లేదు. అన్నిరోజులూ మనవి కావుగా! కోడెళ్ళ మురళి మోహన్ గారి తురపుముక్క దాకా అంతా బాగానేఉందీ
అనుకున్నాను. కంది శంకరయ్యగారు ఆయన ‘సమస్యా పూరణం’ తో ఊరుకోవచ్చా, నా ప్రాణానికి ‘గళ్ళనుడికట్టు’ ఒకటి మొదలెట్టారు. అదికూడా రోజుకోటి ! ఇదివరకు ప్రొద్దుట 7.00-7.30 లమధ్య ఇచ్చేవారు. ఆయనకేమి ఇబ్బందులున్నాయో ఈ మధ్యన ప్రొద్దుటే ఆరున్నరకల్లా ‘హారం’ లో వచ్చేస్తున్నారు! ఆయనదారిన ఆయన ‘గళ్ళనుడికట్టు’ ఇస్తూంటే, మీకేం నష్టం అంటారా. మరక్కడే ఉంది గొడవంతా! చాలా వాటిని మా ఇంటావిడ పాపం మొదట్లోనే
పూర్తిచేసేస్తుంది, ఎక్కడో ఫలానా ‘నిలువు’ లోనో, ఇంకో ‘అడ్డం’ లోనో బండాగిపోతుంది.ఇంక చూసుకోండి, నా ప్రాణం తీస్తుంది. అక్కడ ఏం పదం వేస్తే సరిపోతుందీ అంటుంది, నేనేదోనోటికొచ్చింది పేలితే, అది ఆ పై పదం తో కలవడంలేదండీ అంటుంది.మొదటి అక్షరం మ, మూడో అక్షరం ర అయిదో అక్షరం శ. వీటికి సరిపోయేటట్లుగా చెప్పండీ అంటుంది. అదేమిటో ‘ ఆయనే ఉంటే మంగలెందుకూ’ అన్నట్లుగా, ఆమాత్రం వస్తే ఇంకేం!నాకు మొత్తం అన్ని అక్షరాలూ చెప్పినా అర్ధం తెలియదు మొర్రో మన్నా ఊరుకోదు.

    ఇంక ఇదికాదు పధ్ధతీ అని,స్నానం చేస్తూనో, పేపరుకెళ్ళాలనో వంకలు పెట్టేసి తప్పించుకుంటున్నాను. బ్రేక్ ఫాస్ట్ (ఆ విషయంలో మాత్రం అన్యాయం చెయ్యడం లేదులెండి!!) లాగించేసి, బయటకు పారిపోతున్నాను, ఈ పజిల్స్ నుంచి తప్పించుకోడానికి! ఏ పన్నెండున్నరకో తిరిగిరావడం,అప్పటికి ఈవిడ గళ్ళనుడికట్లు పంపించేసేఉంటుందని! తను నాతో పడే తిప్పలు మొన్ననెప్పుడో ఓ టపా లో పెట్టిందిలెండి.

    అక్కడికేదో నేను తనని అన్యాయం చేస్తున్నట్లు వ్రాసేసింది.అయినా నా రోజులు బావుండనప్పుడు ఇంకోళ్ళనేం లాభం లెండి? చేసికున్నవాళ్ళకి చేసికున్నంతా అని ఊరికే అన్నారా? ఏదో నానా తిప్పలూ పడి ఓ డిగ్రీ సంపాదించుకుని, ఉద్యోగంలోకానీ,పిల్లలచేతిలోకానీ, ఎక్కడా వీధిన పడకుండా,45 ఏళ్ళు లాగించేసి, చివరకి ఈవిడ చేతిల్లో పడ్డాను!నాకేమీ తెలియదు అన్నా వినదు. పైగా ‘ పెద్ద గొప్పలకేం పోవఖ్ఖర్లేదు,అదడిగిందీ, నేనెందుకు చెప్పాలీ అనేకానీ, నేనేమైనా మణులడిగానా మాణిక్యాలడిగానా’ అంటూ ఓ నస!

   ఇదంతా ప్రతీరోజూ జరిగే గొడవేలెండి.నిన్న మార్కెట్ లో బచ్చలికూర తెచ్చాను, దానితో పాటు కంద కూడా.ఈవేళకూడా బయటకు వెళ్ళాను( ఆవిడ పజిల్స్ గొడవనుండి తప్పించికుందామని), ఫోను చేసింది-కందా బచ్చలీ కూర చేశానని.
నాకున్న weakness తనకి తెలుసు.టింగురంగా అని ఇంటికొచ్చేసి చూద్దునుకదా, డైనింగు టేబిల్ మీద పైన ఫొటోలో చూపిన కందా బచ్చలి కూరా, మావిడికాయ ఒరుగులతో చేసిన పప్పూ, గుమ్మిడికాయముక్కలతో పులుసూ( సాంబారు కాదు),చాలా tempting గా పెట్టున్నాయి.పప్పు పూర్తిచేసి, కందా బచ్చలీ కూర శుభ్రంగా కలుపుకుని, ముద్ద నోట్లో పెట్టుకుందామనేలొపల, ” ఏవండీ, మహాభారతం లో పదో పర్వాన్నేమంటారూ’అంటుంది.ఇంక ముద్దేం దిగుతుందీ.పోనీ అలాగని భోజనం అదీ పూర్తిగా తినకుండా లేవలేనూ.అప్పటికీ కందా బచ్చలి కూరలో మెరుస్తున్నాయి చూశారా పోపులో పెట్టిన శనగ బద్దలు- అవితినే యోగం ఎలాగూ లేదు పళ్ళు లేకపోవడంతో!- ఇది అన్యాయం, నీ పజిలు పూర్తిచేసేసేఉంటావని ఇంటికొచ్చాను,నమ్మించి ఇలా ద్రోహం చేయకూడదు,నీకేం ద్రోహం చేశానని, నన్నిలా ఏడిపిస్తున్నావూ, అని మొత్తుకున్నా లాభంలేకపోయింది!నాయుడిగారిని బాబ్లీ గేట్లు చూపిస్తామని, సరిహద్దుదాటించి జైల్లో పెట్టినట్టుగా, నాకు కందా బచ్చలి కూర చూపించి, ఇలా బాధలు పెడుతోంది!Domestic violence చట్టం కింద ఏమైనా కోర్టుకెళ్తే లాభం ఉంటుందంటారా?


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– పళ్ళూ, కూరలూ

Fri, 07/30/2010 - 13:23

   ఈ మధ్యన రిలయన్సులూ, స్పెన్సర్లూ, మోర్లూ వచ్చిన తరువాత, చాలా మంది కూరలకోసం వాటిల్లోకే వెళ్తున్నారు. అన్నీ నీట్ గా పెట్టి, వాడేం చెప్తే ఆ ధరకే కొనుక్కోవడం. దానితో బయట అమ్మేవాళ్ళదగ్గర కూరలు తీసికోవడం బాగా తగ్గింది. మా చిన్నతనంలో, శనివారాల్లో ఒకచోటా, ఆదివారాల్లో ఇంకో చోటా సంతలుండేవి. చుట్టుపక్కల పొలాల్లోంచీ, తోటల్లోంచీ కూరలూ, పళ్ళూ వగైరాలు తెచ్చి అమ్మేవారు.ఆ సంతకెళ్ళడం ఓ అద్భుతమైన జ్ఞాపకం. అక్కడ కూరలూ పళ్ళే కాకుండా మిగిలిన సరుకులు కూడా దొరికేవి.ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది,తూకాలూ అవీ అంత సరీగ్గాఉండేవి కావేమో అని.

   ఇప్పటికీ చూస్తూంటాము, రోడ్డు పక్కన బండిలో అమ్మేవాళ్ళు, చవగ్గా ఎందుకిస్తారూ? కాటాలో ఏదో గోల్ మాల్ ఉందన్నమాట.వీధిలోకి అమ్మడానికి వచ్చే కరివేపాకు, ఓ గిద్దెడు బియ్యం ఇస్తే ఇచ్చేవాడు. ఇప్పటి ధరలనుబట్టి, బియ్యం ఇచ్చుకోడం కంటే, హాయిగా డబ్బులిచ్చే కొనుక్కోడం హాయి. మేము రాజమండ్రీ లో ఉన్నప్పుడు ( క్రిందటేడాది), ప్రతీరోజూ ఒకతను సైకిలుకి బుట్ట తగిలించుకుని కూరలు తెచ్చేవాడు. ఏదో దూరం వెళ్ళఖ్ఖర్లేకుండా, ఇంటి దగ్గరే దొరుకుతున్నాయికదా అని, అతనిదగ్గరే కొనడం మొదలెట్టాను.బేరం ఆడేవాళ్ళకి తక్కువచేసిచ్చేవాడు. ఓ నాలుగురోజులు చూసి, మానేశాను.రాజమండ్రీ మెయిన్ రోడ్డులో ఒక బండివాడుండేవాడు. అతనిదగ్గర కొద్దిగా ధర ఎక్కువైనా, కూరలు ఫ్రెష్ గా ఉంటాయి కదా అని, అక్కడే తీసికునేవాడిని. మా కజిన్ తో ఒకసారి వెళ్ళినప్పుడు, తీసికోరా అంటే, ‘ వద్దూ, వీడిదగ్గర ఖరీదెక్కువా ‘అని తీసికునేవాడు కాదు.I think one has to pay the price for the quality. అయినా ఉన్నది లింగూ లిటుకూ అంటూ ఇద్దరమే కదా. పోతే పోనీయ్ అని ఖరీదెక్కువైనా అక్కడే తీసికునేవాడిని.

    కొంతమందంటారు ఫలానా పెద్ద మార్కెట్ లో చాలా చవకండీ, అన్నీ హోల్ సేల్ ధరలకే ఇస్తారూ అని.ఏదో పనిమీద ఆవైపుకి వెళ్తే కొనుక్కోవాలికానీ, చవగ్గా ఇస్తారు కదా అని అంతదూరం వెళ్ళడంలో అర్ధం లేదు.రానూ పోనూ అయే ఖర్చు కూడా చేరిస్తే, దగ్గరలో ఉన్న బండి వాళ్ళ దగ్గర కొనుక్కోవడమే హాయి! వచ్చిన గొడవల్లా, తూకాలదగ్గరే. ఆతూకంరాళ్ళు ఏ గుప్తులకాలానివో ఉంటాయి. ఒక్కొక్కప్పుడు, ఏవో నట్లూ, బోల్టులూ వేసి, తూస్తూంటారు. మాల్స్ లోకి వెళ్తే
ఈ తూకం మాత్రం డిపెండబుల్ గా ఉంటుంది.

   మా ఫ్రెండోడుండేవాడు, మార్కెట్ మూసే సమయానికి వెళ్ళేవాడు, కొట్టు మూసేస్తూ, రోజులో అమ్మగా మిగిలిన కూరలన్నీ, హోల్ సేల్ గా తోచిన ధరకిచ్చేస్తారని!ఆ కొట్లవాళకేమైనా కూలింగ్ ఛాంబర్సూ అవీ ఉంటాయా ఏమైనా? ఇంక ఆకు కూరల విషయానికొస్తే,ఆ కట్టల్లో ఏవేవో కలిపేసి కట్టి అమ్ముతారు. కొంపకొచ్చి చూస్తే, అందులో సగం అవతల పడేసేవే! ఈ మాల్స్ లో కొనడం అదీ మంచి stylish గానే ఉంటుంది.కానీ అక్కడ బిల్లింగు చేసేటప్పటికి ప్రాణం మీదకొస్తుంది. అదే బయట అమ్మే కొట్లవాళ్ళదగ్గర అయితే यूं गया यूं आया ! చారులోకి ఏ కొత్తిమిరో కావాలంటే, ఈ చిన్న దుకాణాలే హాయి! పైగా ఈ మాల్స్ లోకి వెళ్ళామంటే, తీసికోవాల్సిన కూరలతో పాటు, ఇంకా అవసరం ఉన్నవీ, లేనివీ తీసికోవాలనిపిస్తుంది.అదేదో పిల్లలకిష్టం, ఇంకోటేదో ఇంటావిడకిష్టం అనుకుంటూ! పైగా అక్కడుండేవన్నీ తళతళా మెరుస్తూంటాయి లైట్లలో!కూరలకోసం వెళ్ళడమూ, ఓ యాపిల్ బావుందని, ఇంకో పైనాపిల్ బాగుందనీ,లేకపోతే ఇంకో ఫలానాది బావుందనీ అవసరం ఉన్నా లేకపోయినా కొనేయడం.పోనీ తెచ్చాము కదా అని ఇంట్లో వాళ్ళేమైనా తింటారా అంటే,వాటిని ఓ బుట్టలో పెట్టి పూజచేయడమే.చివరకి ఆ పళ్ళకి ముసమలొచ్చేసి, మిగలముగ్గిపోతాయి. పైగా కొంతమందికి పదునులూ, అంతలా ముగ్గితే టేస్టుండదూ అని! కూరలనండి, పళ్ళనండి, మార్కెట్ నుంచి తెచ్చినవి పూర్తిగా ఏ ఇంట్లోనూ సొమ్ము చేయరు. ఏదో అది కొనేద్దామూ, ఇదికొనేద్దామూ అని యావే కానీ ఇంకెమీ కాదు.

   అన్నిటిలోకీ తక్కువ shelf life ఉన్నది అరటి పండు.బావున్నాయికదా అని ఓ అరడజను తెచ్చామనుకోండి, రెండో రోజుకల్లా రంగు మారిపోయి నల్లగా తయారవుతాయి. ఎవరైనా వచ్చినా చేతిలో కూడా పెట్టలేము.అన్నిటిలోకీ, దేవాలయాల దగ్గర అమ్మే అరటిపళ్ళు చూస్తే నవ్వొస్తుంది- ఓ రుచీ పచీ ఉండవు, అందుకే కాబోలు దేముడరిటిపళ్ళంటారు! అలాగే గుళ్ళల్లో ఇచ్చే పళ్ళన్నీ ప్రత్యేకం దేముడికోసమే పండించారా అనేట్లుంటాయి.కొంతమంది శ్రావణమాసం వాయినాల్లో ఇస్తూంటారు- ఓ పండూ, శనగలూ, ఓ వక్కపొడి పొట్లం.అన్నిటిలోకీ funny character ఆ వక్కపొడి పొట్లం, దానికి ఓ ఉల్లిపొరకాయితం తోపాటు ఓ వక్క పలుకోటుంటుంది. ఎందుకూ ఉపయోగించదు. నిన్న వ్రాసిన పెట్టుబడి బట్టల కోవలోకే వస్తాయి ఈ వాయినాల్లో ఇచ్చే, దేముడుగుళ్ళల్లో ఇచ్చే పళ్ళూ, ఈ వక్కపొడి పొట్లాలూనూ. ఉన్నాయా అంటే ఉన్నాయి, లేదంటే లేదూ!!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పెట్టుబడి బట్టలు

Thu, 07/29/2010 - 13:17

   ప్రపంచం లో ఉన్న ప్రతీ occasion కీ బట్టలు పెట్టడం అనేది, మన ఆంధ్రదేశంలోనే ఎక్కువనుకుంటాను.ఎవరింటికి వెళ్ళినా, ఆడవారికి, వారి పరిచయాన్ని బట్టి ఓ చీరో జాకెట్టు ముక్కో పెట్టేస్తూంటారు.బాగా తెలిసినవాళ్ళైతే, కొంచెం మంచి క్వాలిటీ ది,చుట్టాలైతే ఓ చీర బోనస్సు! అవి అటూ ఇటూ తిరిగి, చివరకు మొదటిచ్చిన వాళ్ళ దగ్గరకే వస్తూంటుంది. అది వేరే విషయమనుకోండి! అసలు ఈ బట్టలుపెట్టడం అనే ఆచారం ఎక్కడినుంచొచ్చిందండి బాబూ? ఎవరైనా పీటలమీద కూర్చుంటే, వాళ్ళకి (దంపతులకి) బట్టలు పెట్టాలిట.ఈ సెంటిమెంటులేమిటో, ఈ గొడవలెంటో నాకు మాత్రం ఎప్పుడూ అర్ధం అవవు.ఒక్క విషయం మాత్రం అర్ధం అవుతూంటుంది- ఇంట్లో ఏ శుభకార్యం అయినా, మా ఇంటావిడవైపు చూస్తాను, ఎవరెవరికి బట్టలు కొనాలో!

    పైగా ఎవరైనా పుట్టింటికి వెళ్తే, ఆవిడ అక్కడినుంచి తిరిగివచ్చిన తరువాత, అందరికీ తనకి ఎవరెవరు ఏమేమి బట్టలు పెట్టారో, అందరినీ పిలిచి మరీ చూపిస్తారు.అదంతా తన పుట్టింటి వారి status చూపించుకోడం అన్న మాట! ఏ పరిస్థితుల్లో అయినా, అక్కడినుంచి, బట్టలు రాకపోయినా, కొంచెం చవకబారు బట్టలొచ్చినా, తిరిగి వచ్చేటప్పుడే, కొట్లోకి వెళ్ళి ఖరీదైన బట్ట కొనుక్కోవడమూ, పుట్టింటివారిచ్చేరని చెప్పుకోవడమూనూ.అలా బట్టలు పెట్టిన వాళ్ళెవరైనా, మనింటికి వస్తే, వాళ్ళిచ్చినదానికంటె ఓ మెట్టు పైది పెట్టడం. లేకపోతే మన పరువు పోదూ?

    ఇంట్లో బీరువా నిండా, ఓ మోపెడు బ్లౌజు పీసులు దాస్తూంటారు.ఇంటికి మొదటిసారి వస్తే బ్లౌజు పీసివ్వాలిట.పైగా ఆ వచ్చినవాళ్ళుకూడా take it for granted గా, ఆ బ్లౌజుపీసేదో ఇస్తేనేకానీ కదలరు! పైగా ఇస్తున్నప్పుడు ‘ఇప్పుడెందుకండీ ఇవన్నీనూ’ అంటూ ఓ మొహమ్మాటం డయలాగ్గోటీ. వీళ్ళు <b.ఇవ్వకా మానరు, ఆ వచ్చినవాళ్ళు పుచ్చుకోకా మానరు, ఊరికే public consumption కోసం ఈ డయలాగ్గులు! ఇవన్నీ అస్తమానూ ఎందుకూ అంటే, మనం వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిన చీర తీసికోలేదేమిటీ, తిరిగి పెట్టకపోతే బావుంటుందా అంటూ ఇంటివాడి నోరు నొక్కేస్తూంటారు!అసలు in the first place తీసికోమ్మనదెవడంట? అప్పుడు తీసికోకపోతే ఇప్పుడు ఇచ్చే అవసరం ఉండేది కాదుగా!

    ఈ బట్టలవ్యవహారాలు ఈ మధ్యన, ఆడవారివరకే పరిమితం అయ్యాయి.మొగాళ్ళకి, ఓ జేబురుమ్మాలో, ఓ తువ్వాలో పెట్టేస్తున్నారు.మారోజుల్లో, ఏ సన్మానం లాటిది జరిగినా శాలువాలు కప్పేవారు. ఈ మధ్యన ప్రతీ వారికీ, ఓ కండువా భుజంమీదెయ్యడం ( ఏ పార్టీవాళ్ళైతే ఆరంగుది).ఒకప్పుడు ఆ కండువాకి చాలా పెద్ద honour ఉండేది. కండువా వేసికున్నవారిని ఓ ప్రత్యేక గౌరవంతో చూసేవారు. కండువా లేకుండా, వీధిలోకి కూడా వెళ్ళేవారు కాదు. ఇప్పుడో ప్రతీ కోన్కిస్కాగాడికీ ఓ కండువాయే! వాడు history sheeter అవొచ్చు, లేక అప్పుడో, ఆముందురోజో పార్టీ ఫిరాయించిన రాజకియ నాయకుడవచ్చు!

    ఒక్కొక్కప్పుడు మగాళ్ళకి పంచలచాపు పెడుతూంటారు. వాటినేం చేసికుంటాం, లుంగీగా కట్టుకోడమో, లేక ఇంకోదానికో మడిబట్టలా కట్టుకోడం.ఇంక ఇలా అవతలివారిచేత పెట్టించబడ్డ బట్టలు ( మగాళ్ళ పాంటు పీసులూ, షర్టు పీసులూ) ఇంట్లో పెట్టినిండా ఉంటాయి. అలా పెట్టినింపుకోడం తప్పించి, మనమేమైనా కుట్టించుకుంటామా, పెడతామా? మళ్ళీ మనింటికి ఎవరైనా చుట్టాలొస్తే, వాటికి ముక్తీ మోక్షం వస్తాయి. మళ్ళీ ఇందులో ఓ జాగ్రత్త తీసికోవాలి, మరీ వాళ్ళిచ్చిందే తిరిగి వాళ్ళకి పెట్టేయడం కూడా బాగోదు!
మనవైపు చూశాను- ప్రతీ బట్టల దుకాణంలోనూ, పెట్టుబడి బట్టలని విడిగా ఉంటాయి. వాళ్ళకీ తెలుసు,ఈ బట్టల ఇకనామిక్స్!వాటి క్వాలిటీ కూడా అంతంతమాత్రమే! చివరకి అవన్నీ ఏ గిన్నెలమ్మేవాళ్ళదగ్గరకో చేరతాయ!

   ఇలా వ్రాసేనని, మా ఇంటికి పూణె లో రావడం మాత్రం మానేయకండి. మరీ మొగాళ్ళకి ఏమీ పెట్టనుకానీ, ఆడవారికి మాత్రం మా ఇంటావిడ అతిథి సత్కారం గత 38 ఏళ్ళనుంచీ చేస్తూనేఉంది, అందరికీ మరీ చీరలనను కానీ,వయస్సుని బట్టి
ఓ డ్రెస్సో, ఓ చీరో ( పెట్టుబడి క్వాలిటీ మాత్రం కాదు!)పెడుతూనేఉంటుంది. మరీ అంత పరిచయం లేనివారికైతే టూ బై టూ బ్లౌజు పీస్సోచ్
!!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– టైం పాస్ !!

Wed, 07/28/2010 - 13:08

   మొత్తానికి నాలుగురోజులపాటు, మాతో hide and seek ఆడేసికుని, కరెంటు వచ్చిందండీ. ఆఖరికి నిన్న కూడా,వాళ్ళు చేసిన రిపేరు, ఆరుగంటలు మాత్రమే ఉండి, మళ్ళీ డిమ్ము అవడం ప్రారంభించింది.ప్రొద్దుటే 8.30 కల్లా హాజరీ వేయించుకుని, ఎలాగైతేనేం, రాత్రి తొమ్మిదికి లైట్లొచ్చేశాయి. కథ సుఖాంతం ( ప్రస్తుతం వరకూ!!). ఈ వేళ ప్రొద్దుట ఓ మిస్టరీ షాపింగు assignment సందర్భంలో ఓ ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళాను.వాళ్ళని, నన్ను Swiss/Paris Tour Package గురించి అడగమన్నారు. అవేమైనా చూశానా పెట్టేనా, ఉత్తిత్తినే !!వివరాలు అన్నీ అడిగి, నా contact details ఇమ్మన్నప్పుడు, అదో బెంగా, రెండో రోజునుంచీ ప్రారంభిస్తారు, ఫైనలైజు చేసేరా అంటూ,అందుకోసమని చెప్పాను- ఈ టూర్ నాకోసంకాదూ, మా ఊళ్ళో మా తమ్ముడున్నాడూ, అతనికోసమూ అని,ఆతావేతా అడిగినా, ఇంకా తను ఫైనలైజు చేయలేదూ అని చెప్పడం కోసం!

   బస్సుకోసం వెయిట్ చేస్తూంటే, తెలిసిన ఒకావిడ ‘హల్లో అంకుల్ ఎలా ఉన్నారూ’ అని పలకరించారు. ఆవిడని ఎక్కడ చూశానో మర్చిపోయాను.ఎక్కడో చూసినట్టే ఉందీ, గుర్తుకురాలేదు.ఆవిడని చూడగానే ఇంకొకామె గుర్తొచ్చారు, ఆగుర్తొచ్చినావిడకి ఆమధ్య చేతి వేలు విరిగింది.ఆవిడే అయిఉంటారూ అనుకుని, <b.వేలెలాఉందీ, మీ అబ్బాయి ప్లే స్కూలుకి వెళ్తున్నాడా అని పరామర్శచేశాను. ఆవిడకేమో అంతా అయోమయంగా ఉంది, ఓసారి వేలు చూసుకుని, అర్రే బాగానేఉందే అని ఆశ్చర్యపడిపోయారు! ఆవిడ ఏదో విషయంగురించి సమాచారం అడిగి, వివరాలు తెలిసిన తరువాత, నాకు ఓసారి ఫోను చేయండీ అన్నారు. నేను నోరుమూసుక్కూర్చోవచ్చా, మీ శ్రీవారి నెంబరు నాదగ్గర ఉందీ అన్నాను.అదేమిటీ మిమ్మల్ని మావారెప్పుడు కలిశారూ అని ఇంకా ఆశ్చర్యపడిపోయారు. ఎక్కడో ఏదో పేద్ద తేడా వచ్చేసింది.నేను ఒకరిని చూసి ఇంకోరనుకున్నాను. అయినా అరగంటసేపు మాట్లాడాను!ఆవిడిచ్చారుకదా, అని ఫోను నెంబరు తీసికుని, పేరడిగినప్పుడు తెలిసింది, నేననుకున్నావిడ కాదూ అని!

    ఈవిడకి ఉన్నది అమ్మాయి,పైగా ఆపిల్ల ప్లేస్కూలుకి కాదు వెళ్ళేది,కేంద్రీయవిద్యాలయంలో ఏడో క్లాసుకి,ఆవిడ శ్రీవారిని నేనెప్పుడూ చూడలేదు, కారణం ఆయన ముంబైలో పనిచేస్తున్నారు!మాట్లాడగా మాట్లాడగా చివరికి ట్యూబ్ లైటు వెలిగింది,ఆవిడనెక్కడ కలిశానో! ఇంక వళ్ళు దగ్గిరెట్టుకుని, మళ్ళీ confuse అవకుండా మాట్లాడాను! ఏమిటో వయస్సొచ్చేస్తూందనిపిస్తోంది, నెత్తిమీదికి 65 ఏళ్ళొస్తే, ఇంకా వయస్సొచ్చేస్తోందనేడవడం ఎందుకూ? అయినా సరే కొత్తవారిని పరిచయం చేసికోడం మానను! అలాగని కాళ్ళూ చేతులూ కట్టుకుని ఇంట్లోనూ కూర్చోనూ! బయటకెళ్తే,ఎవరోఒకళ్ళని పలకరించకా మానను! మావాళ్ళ ప్రాణం మీదికొస్తోంది, నాతో వేగలేక!

    నేను చేసే మిస్టరీ షాపింగు ఏజెన్సీ డైరెక్టరు, పాపం రోజువిడిచి రోజు ఫోను చేసి అడుగుతూంటారు, ఫలానా చోట assignment ఉంది, చేస్తారా అంటూ. ఏదో దగ్గరలోదైతే సరే అంటాను, కాకపోతే వదిలేస్తాను.నాకు సంతోషం ఎక్కడా అంటే, ఈ కొత్త ఏజెన్సీ వారుకూడా,పాత ఏజెన్సీ వారిలాగే, ఫోను చేసి మరీ అడుగుతూంటారు! మామూలుగా, మనం ఎప్లై చేస్తేనే ఇస్తూంటారు.అలాకాకుండా, వాళ్ళే ఫోను చేసి ఎసైన్ చేయడం, ఒక్కోసారి అనిపిస్తూంటుంది,వీటితో మన ఇగో కూడా ఎలా satisfy అవుతోందో! ఎవరికైనా అంతేకదా, బయటవారి దగ్గరనుండి recognition వచ్చినప్పుడే కొండెక్కేసినట్లుగా ఉంటుంది. These are small things in life. But, they make all the difference in life!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- జ్ఞాపకాలు

Tue, 07/27/2010 - 13:20

   మనం విద్యుఛ్ఛక్తికి ఎంత బానిసలయ్యామో ఈ రెండు రోజుల్లోనూ బాగా తెలిసింది.శనివారం పగలూ,రాత్రీ మా అమ్మాయిదగ్గర గడిపి, ఆదివారం మా ఫ్లాట్ కి తిరిగి వచ్చాము.తనతో గడపడం లేదని, అమ్మాయి కోప్పడుతుందేమో అని,రోజంతా అక్కడే గడపాలని నిశ్చయించుకుని ఉండిపోయాము.నాకు చూపించాలని ఎప్పటినుండో అనుకుంటున్న ఓ రెండు మరాఠీ సినిమాలు, झेंडा, हरिस्चन्द्राची फाक्टरी చూపించింది.మొదటిది ఎంత సీరియస్సో, రెండోది అంత హాస్యం,అద్భుతం ! ఇన్నాళ్ళూ, ఆ సినిమా గురించి విన్నా, ఏమిటో 100 సంవత్సరాలక్రిందటి పాటలూ, సెట్లూ బ్లాక్ ఎండ్ వైట్ లో ఉంటాయేమో అనుకుని, ఆ సినిమా చూడ్డానికి అంత ఆసక్తి చూపలేదు. మా అమ్మాయి అంటూనే ఉంది- The movie is simply awesome, I know you would love it. అలాగే తనన్నట్లే ఆ మూవీ చాలా చాలా బాగుంది…

   ఇంటికి తిరిగి వచ్చిన తరువాత సాయంకాలం దాకా బాగానే ఉంది. 3 Idiots సినిమా వస్తుంటే, కరెంటు పోయింది. పక్క బిల్డింగుల్లో అందరికీ వచ్చింది, మాకు మాత్రం డిమ్ముగా వస్తోంది.కంప్యూటరు లేదు, టి.వీ.లేదు, ఫ్రిజ్ ఆపేయవలసివచ్చింది. రాత్రంతా దోమల బాధ. అడక్కండి. ప్రొద్దుటే స్నానం చేయడానికి, గిన్నెతో వేణ్ణీళ్ళు పెట్టుకుని, లిఫ్ట్ పనిచేయకపోవడంతో, మాట్లాడకుండా, నాలుగు అంతస్థులూ మెట్లమీదుగా దిగి, వాచ్ మన్ ని అడిగాను-ఎలెట్రీవాళ్ళని ఎలా పిలవడమూ అని.వాడికేం తెలుసూ,అంతేకాదు, ఓ ఫోన్ నెంబరుకూడా లేదు.పోనీ అని సొసైటీ లో చాలామందికి, రాత్రంతా లైటులేదుకదా, పోనీ వాళ్ళదగ్గరైనా ఉండకపోతుందా అని అడిగితే, వాళ్ళకీ ఏమీ తెలియదుట!అక్కడ గత నాలుగేళ్ళనుండీ ఉంటున్నారూ, ఆమాత్రం తెలియదూ అంటే ఆశ్చర్యం వేసింది.ఎవడోఒకడు కంప్లైంటు చేస్తాడులే, వాడికొస్తే,మనకీ వస్తుందీ అనే భరోసా! పోనీ, నలుగురికీ ఉపయోగించేటట్లుగా ఉంటే ఏం పోయిందీ?

   ఇది మన సిటీల్లోనూ, ఇప్పుడిప్పుడే పట్టణాల్లోనూ వస్తూన్న ఓ కొత్త జాడ్యం!మనకి దేనిగురించైనా తెలిస్తే, ఇంకోళ్ళకి చెప్పకుండా ఉండడం.ఏదో రోజు, నీళ్ళురావని, ఏ పేపర్లోనైనా వేసేడనుకుందాము, దాన్ని చదివినవాడు, అందరికీ చెప్పొచ్చుగా, అబ్బే అలా చెప్పేస్తే అందరూ సుఖపడిపోరూ, తనొక్కడే బాగుపడాలి. పైగా సొసైటీ లో మిగిలినవాళ్ళందరూ, అదేమిటీ, చెప్పాపెట్టకుండా, కార్పొరేషను వాళ్ళు ఇలా నీళ్ళు బందుచేశారూ, అనుకుంటూంటే, మన హిరో పేద్ద గొప్పగా
నిన్న పేపర్లో ఇచ్చారు, నేను చదివానూ, అందుకనే రాత్రే నీళ్ళుపట్టిపెట్టేసికున్నానూ అంటాడు. ఆ మాత్రం అందరితో చెప్పడానికేంరోగం?

   మనకి తెలిసినది, ఏ విషయమైనా సరే ఇంకో నలుగురితో పంచుకోడంలో ఉన్న ఆనందం, మనమే అనుభవించాలనుకోడం చాలా తప్పు.ప్రతీవారూ పేపరు చదవకపోవచ్చు, న్యూసు చూడకపోవచ్చు, అలాటివారికి ఉపయోగిస్తుందికదా.ఒక్కొక్కప్పుడు, ఊళ్ళో ఏదైనా మంచి కార్యక్రమం జరగబోవచ్చు, దానిగురించి తెలిసినవారందరికీ చెప్తే, దానిమీద ఇష్టం ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చుగా, అంతేకానీ, మనకే తెలుసునుకదా అని మనదారినమనం చూసొచ్చేసి, గొప్పగా అందరితోనూ, ‘మేము ఫలానా కార్యక్రమం చూసొచ్చామోచ్’ అంటే, చాలా బాధొస్తుంది. నామట్టుకి నాకైతే, తెలిసిన విషయాన్ని నలుగురితోనూ పంచుకుంటాను. ఇష్టమైన వాళ్ళు వింటారు, లేనివాళ్ళు మానేస్తారు. మనకేమీ నష్టంలేదు.లేనిపోనివన్నీ,తెలిసినవీ,తెలియనివీ exaggerate చేయకూడదు.ఒకసారి విన్నా, దాన్లోని నిజా నిజాలు తెలిసిన తరువాత మన మొహం చూడడెవడూ!

    దీనివలన మనం ఇంకో నలుగురు స్నేహితుల్ని సంపాదించుకుంటాము. కాదూ నన్నుముట్టుకోకు నామాలికాకీ లా ఉందామనుకుంటారా మీఇష్టం.మనం పోయినతరువాత, మన గురించి చెప్పుకునేది వీటిగురించే! నా ఎలెట్రీ గొడవలోంచి, దేంట్లోకో వెళ్ళిపోయాను!మొత్తానికి ఎలెట్రీ ఆఫీసు పట్టుకుని,complaint ఇచ్చిన తరువాత, బాగుపడింది.మళ్ళీ ఇవాళ సాయంత్రం అదే తంతు. అదేమిటో శాపం పెట్టినట్టుగా ఠంఛనుగా, సాయంత్రం ఆరుగంటలకల్లా మళ్ళీ మొదలూ, ఈ సారి మెట్లుదిగి వెళ్ళే ఓపిక లేక, ఫోను చేస్తే, పాపం వాళ్ళు, ఎనిమిదింటికల్లా బాగుచేశారు! దాని ఫలితమే ఈ టపా.

    కరెంటుపోయిందంటే, కాళ్ళూ చేతులూ పడిపోతాయి.మన దినచర్యలు దానితో ఎంత పెనవేసుకుపోయాయీ అనేది చూస్తూంటే,కరెంటు లేనిరోజుల్లో మనం ఎలా ఉండేవాళ్ళమా అనిపిస్తూంటుంది.సాయంత్రం అయేసరికి, కొంచెం పెద్ద చిమ్నీ ఉండే, కోడిగుడ్డు ల్యాంపు తీసికుని, ఆ చిమ్నీలో ముగ్గువేసి, క్లీను చేసికుని, వెలిగించడం.ఇంట్లో అందరి భోజనాలూ, అమ్మ వంటిల్లు కడగడం అదీ అయిన తరువాత, సావిట్లో, దానిముందర, కూర్చుని, పుస్తకాల్లోది బట్టీ పడుతూ,మధ్య మధ్యలో జోగుతూ, నాన్న ” ఏరా చదువుతున్నావా” అనగానే ఉలిక్కిపడడం, అలా ఉలిక్కిపడి, దీపం మీదికి వంగడం, దాంతో మనమొహం మీదపడే వెంట్రుకలు కొద్దిగా కాలడం, ఆ వాసన తగిలి, నాన్నో, అమ్మో ‘ చాల్లే చదివింది ఇంక పడుక్కో’అనడం, అబ్బ ఎన్నెన్ని జ్ఞాపకాలో !!
ఇవి కాకుండా, హరికెన్ లాంతర్లని ఉండేవి.పెట్రోమాక్స్ లైట్లకి, అదేదో మాంటిల్ అనేదాన్ని వెలిగించగానే, అది ఓ తమాషా చప్పుడు చేసికుంటూ, బ్రహ్మాండంగా వెలిగేది.సాయంత్రాలవగానే, ఓ నిచ్చేనేసికుని వీధిదీపాలు వెలిగించడానికొచ్చేవారు
పంచాయితీ వాళ్ళు!ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్ని జ్ఞాపకాలో !!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- झेंडा

Tue, 07/27/2010 - 05:30

    నిన్న మా అమ్మాయి’జెండా’ అనే మరాఠి సినిమా చూపించింది. ఆ సినిమాలో ముఖ్యంగా,మహరాష్ట్రలోని శివసేన, అద్యక్షుడు బాల్ ఠాక్రే, అతని కొడుకు ,మేనల్లుడుల మధ్య అభిప్రాయ బేధాలూ, రాజ్ ఠాక్రే శివసేనలొంచి బయటకు వచ్చేసి, ఇంకో పార్టీ ప్రారంభించడం గురించి.

   ఈ సినీమా, ఒక్క ఈ రాష్ట్రం వారికేకాదు, దేశంలోని రాజకీయాలు ఎలా ఉన్నాయీ, నాయకులు వారి స్వార్ధానికి, వర్కర్లని ఎలా ఉపయోగించుకుంటారూ,చివరకు, వీరికీ,వర్కర్లకీ మధ్య ఉండే దళారులు ఎలా బాగుపడతారూ, అనే విషయం
చాలా బాగా చిత్రీకరించారు.ఇక్కడనే కాదు, దేశంలో ఏ రాజకీయనాయకుడైనా సరే, ఎంత నీచానికైనా ఎలా దిగజారుతాడో, ఏవేవో ఆశయాలు పెట్టుకుని,యువత ఈ దరిద్రులవెంట పడి, తమ జీవితాల్ని ఎలా పాడిచేసుకుంటారో అద్భుతంగా చిత్రించారు.

    బహుశా ఇలాటి చిత్రం తెలుగులో తీసుంటే, మన వాళ్ళు అంత sportive గా తీసికోపోవచ్చు.నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే- శివసేన వాళ్ళు, అసలు ఈ చిత్రాన్ని ఎలా అనుమతించారో అని!! వీలుంటే ఓ DVD తీసికుని చూడండి. దానిలో ఇంగ్లీషు సబ్ టైటిల్స్ ఉన్నాయి. హాయిగా అర్ధం అవుతుంది. ఈ సినిమాలో, చివరివరకూ వచ్చే పాట!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–” బామ్మ” గారికి డ్రెస్సు !!!

Sat, 07/24/2010 - 00:58

    ఏదో శనివారం, టపాలేమీ వ్రాయకుండా, మా ఇంటావిడ చేసే coconut rice సాంబారులో కలుపుకుని తినేసి, హాయిగా ఉందామనుకుంటే నా టపాలో raa1 గారు ఓ వ్యాఖ్య- “> మా ఇంటావిడకో డ్రెస్ తెచ్చాను
అచ్చ తెలుగు తణుకు బామ్మ గారు, డ్రెస్ లు వేసుకుంటున్నారా” అని పెట్టారు. ఆ వ్యాఖ్యకు అక్కడే జవాబివ్వొచ్చు.కానీ నా సమాధానం ఇంకో టపా అంత అవుతోంది,
దాని రిజల్టే ఈ టపా.

    వయసొచ్చినతరువాత కూడా, ఆడవారు డ్రెస్సు(పంజాబీ) వేసికోవడంలో ఉన్న ఆక్షేపణ ఏమిటో నాకు అర్ధం అవదు. మగవాళ్ళు, తాతయ్యలై, డెభ్భై ఏళ్ళొచ్చినా, జుట్టుకి రంగేసికొని, అమెరికా నుంచి, కొడుకో కూతురో పంపించిన
క్యాప్రీలూ, నిక్కర్లూ వాటిపైన పువ్వుల టీషర్టులూ వేసికొని దసరాబుల్లోళ్ళలాగ తిరగ్గాలేనిది, ఆడవారు డ్రెస్సులు వేసికొంటే తప్పేమిటీ? మగాళ్ళు వేసికోవడం comfort & convenience కోసం అంటే ఇదీ అంతే.ప్రయాణాల్లో చూస్తూంటాము
నిద్రపోతున్నప్పుడు ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా, అక్కడో అక్కడ దుప్పటీ తప్పుకుని, చీర పైకి వెళ్ళిపోతూంటుంది, అక్కడున్నవాళ్ళల్లో ఒక్కడైనా చొంగ కార్చుకుంటూ,అక్కడే దృష్టిపెడతాడు,ఇంకా పైకి ఎప్పుడు వెళ్తుందా అని!ఇంక పైబెర్తు లోకి
ఎక్కేటప్పుడు అడగఖ్ఖర్లేదు.

    హాయిగా డ్రెస్స్ వేసికుని రైల్లో ప్రయాణం చేస్తే, ఈ గొడవలూ ఉండవు. మెళ్ళో ఏ గొలుసైనా ఉన్నా, లోపలికి వేసేసికుంటారు.ఉత్తర భారతదేశంలో, చాలా మంది ఆడవారు,వారిలో తల్లులుండవచ్చు, అమ్మమ్మలూ,బామ్మలూ, ముత్తమ్మమ్మలూ కూడా ఉండొచ్చు.వారందరూ డ్రెస్సుల్లోనే ఉంటారు, అదేమీ వింతగా కనిపించదే? వచ్చిన గొడవల్లా, మన దక్షిణ భారత దేశంలోనే,ఎప్పుడూ ఆడవారిని, చీరల్లో చూసి చూసి అలవాటుపడిపోయి, ఒక్కసారి డ్రెస్సుల్లో చూసేసరికి
‘అమ్మో అంత వయసొచ్చీ, ఎలా డ్రెస్సులు వేస్తోందో’ అని ముక్కుమీదవేలేసికుంటారు.

   మా ఇంటావిడకి డ్రెస్సులు కొంటేనే నాకు హాయి. ఎందుకంటే, ఏదో ముచ్చటపడి చీరకొంటే, దానికి పీకో,ఫాలూ,మాచ్ అయే లోపలి పరికిణీ, వీటన్నిటికీ మాచ్ అయే బ్లౌజు పీసూ అన్నిటికీ కలిపి తడిపిమోపెడౌతుంది.పైగా వీటన్నిటికీ పెట్టే ఖర్చుతో ఓ రెండు మూడు డ్రెస్సులు కొనుక్కోవచ్చు!! ఏదైనా మనం చూసే దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది. దానికి వయస్సుతో సంబంధం లేదు. ఈ సందర్భంలోనే, మా ఇంటావిడ ఓ టపా కూడా వ్రాసింది.


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణికబుర్లు–భ్రమలు-2

Fri, 07/23/2010 - 13:05

    ‘భ్రమ’లు మొదటి భాగంలొ చెప్పినట్టు,ఇంకోరు చేసే పనిని మనం చేయలేమా అనే క్యాటగిరీలో, ఇంట్లో ఎప్పుడైనా, కిచెన్ లోకి వెళ్ళి, ఏ బనానా షేక్కో చేద్దామనే అతి ఉత్సాహంతో, మిక్సీ తీసికుని, దాని మూత సరీగ్గా పెట్టకుండా, పాలూ,అరటిపండు ముక్కలూ వేసి, ఓసారి తిప్పేటప్పటికి, చూడండి, నాసామి రంగా, మన మొహం, బట్టలే కాకుండా కిచెన్ లో అన్ని చోట్లకీ చిందిపోతుంది. ఇంటావిడ లేచేలోపలే, ఏదో క్లీను చేసేశామనే, భ్రమలో, ఓ తడిగుడ్డ తో
తుడుస్తాము.గిన్నెలూ, బట్టలూ క్లీను చేసేసికుని, ఏమీ తెలియనట్లు మొహంపెడతాము. ఆవిడేమో, ఏ చాయో పెడదామని, గిన్నే తీసేటప్పటికి, అంతకుముందు మనం చేసిన నిర్వాకం బయట పడుతుంది! ఎందుకొచ్చిన గొడవండి బాబూ
మనకి చేతకాని పనుల్లో వేలుపెడితే ఇలాగే వీధిన పడతాము!

   నాకు ఎప్పుడైనా, గీజరువేసి, వేడినీళ్ళు బకెట్ లోకి తీస్తాననే అంటుంది, పాపం మా ఇంటావిడ. అబ్బే నీకెందుకు శ్రమా, నేనే తీసికుంటానూ అని అంటూనే ఉంటాను.అదేం ఖర్మమో, వేడి నీళ్ళు ఏ ట్యాప్పు తిప్పితే వస్తాయో ఇప్పటికీ
తెలియదు! ఇంకోటి, ఎప్పుడైనా బయటకు వెళ్ళేముందర ఏమైనా తిని, చెయ్యి కడుక్కోడానికి, కిచెన్ లోఉన్న సింకు ఉపయోగించమని చెప్తూనే ఉంటుంది. అబ్బే,మనం ఎందుకు వింటామూ?పేద్ద తెలిసున్నట్టుగా, బాత్ రూం లోకి వెళ్లి ఓ ట్యాప్పు తిప్పగానే, పైనున్న షవర్ లోంచి, నెత్తిమీద నీళ్ళు పడతాయి!దాన్ని ఏ పొజిషన్ లో పెడితే నీళ్ళు వస్తాయో ఇప్పటికీ తెలియదు! ఏదో బిందెలోంచీ, బకెట్టులోంచీ చెంబుతో నీళ్ళొంపుకున్న వాడినీ!

    వర్షాల్లో ఉపయోగించే రబ్బరు బూట్లు,తొందరగా చిరిగిపోతూండేవి.మామూలుగా అయితే, చిరిగిపోయిన బూట్లని అవతల పారేయడమే. కానీ, కొన్ని సంవత్సరాల క్రితం, వాటిని కూడా రిపేరు చేయడం మొదలెట్టారు.రోడ్డు పక్కన ఒకడు
చేతిలో ఓ స్క్రూ డ్రైవరూ, పక్కనే ఓ కుంపటీ, దాన్నిండా కణకణలాడే నిప్పులూ, ఆనిప్పుల్లో కాల్చి, దాన్ని సుతారంగా, మన చిరిగిపోయిన బూటుమీద రాసేవాడు. బస్, సెకనులో, ఆ చిల్లుకాస్తా మూసుకుపోయేది, ఆ షూ కి ఇంకో సీజను దాకా ఢోకా లేదని చెప్పి, ఓ అర్ధరుపాయో,రూపాయో తీసికునేవాడు. ఆమాత్రం మనం చేయలేమా అని ఇంట్లో మనం ప్రయోగాలు చేస్తే, ఉన్న చిల్లుమాట దేముడెరుగు, ఇంకాస్త చిరుగుతుంది!

   అలాగే ప్లాస్టిక్/పోలిథీన్ బ్యాగ్గుల్ని, కొట్లలో కొవ్వొత్తి మంటమీద, నాజూగ్గా సీలు చేస్తూంటారు. మనకి ఛస్తే ఇంట్లో వీలవదు! అలాగే ఏ పైజమాకో బొందు పెడదామని, ఓ సూదిపిన్నీసుకి, నూలుతాడు గుచ్చి, బొందెక్కించడం మొదలెట్టండి,ఆ పిన్నూ,బొందూ ఛస్తే చివరిదాకా తీయలేము. మధ్య మధ్యలో,నానా తిప్పలూ పెడుతుంది!
ఏమిటో జీవితం అయిపోతూంది, ఒక్క పనీ రాదూ అని ఓ విరక్తి పుట్టుకొచ్చేస్తూంటుంది!అలాగని మానుతామా, ప్రతీదీ నాకేతెలుసూ అని వేలెట్టడం, చివాట్లు తినడం!!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

Thu, 07/22/2010 - 13:55

   రెండురోజులనుండి, మా కంప్యూటరుకి సుస్తీ చేసింది.మా అబ్బాయి ఏదో చేసి దాన్ని దారిలో పెడతాడనుకుంటే, తనకి టైము లేక, ఓ రెండు మూడు రోజులాగమన్నాడు. అమ్మోయ్ అన్ని రోజులే. ఈ నెట్ అనేది ఓ నషాగా తయారయ్యింది.దానికి సాయం, నా చుట్టాలందరూ ఎలాఉన్నారో అని తహతహా! ఇదికాదు పనీ అనుకుని, ఓ షాపువాడిని పిలిచి బాగుచేయించాను. చూశారా మొన్న ‘ఫుకట్ సర్వీసు’ లో వ్రాసినట్లు, నేను కూడా మా అబ్బాయిచేత పని కానిచ్చేసుకుందామనుకున్నాను! ఆ ఇంజనీరు రెండో రోజు వచ్చి, ఓ రెండు గంటలు ఏవేవో సి.డీ లు పెట్టి మొత్తానికి,నా కంప్యూటరుకి ప్రాణం పోశాడు. వచ్చినగొడవల్లా, మధ్య మధ్యలో ఏవేవో అడుగుతాడు, నాకేమీ తెలియదు.చివరకు చెప్పేశాను-’చూడు నాయనా, నన్ను ఇరుకులో పెట్టకు,ఏదో గుట్టుగా బ్లాగులు వ్రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం. అదుందా, ఇదుందా అంటూ ఊరికే ప్రశ్నలు వేసి చంపకు. కావలిసిస్తే ఓ కాఫీ తాగు’ అని చెప్పినతరువాత, మొత్తానికి రెండు గంటలు కూర్చుని,ఓ నాలుగొందలు తీసికుని వెళ్ళాడు.

    నిన్నంతా, Titan Eye వాళ్ళ కొట్టుకి మిస్టరీ షాపింగుతో కాలక్షేపం అయింది.మా పిల్లలెప్పుడో క్రిందటేడాది, Shoppersstop వారి గిఫ్ట్ వోచరిస్తే, దాన్ని ఎక్కడో పెట్టిమర్చిపోయాను.చూస్తే ఏడాది అయిపోయిందీ, ఇస్తాడా అని అడిగితే, ఈ నెల 22 దాకా రివాలిడేట్ చేసిచ్చాడు. దాన్ని తీసికెళ్ళి, మా ఇంటావిడకో డ్రెస్ తెచ్చాను.ఇలాటివన్నీ గుర్తుండవు ఆవిడకి,అప్పుడెప్పుడో ఐస్ క్రీం తెచ్చి ఇల్లంతా, వళ్ళంతా పోసేననేవే గుర్తెట్టుకుంటుంది, పైగా అవన్నీ అందరితోనూ చెప్పుకోవడం ఓటీ! ఇక్కడ చదవండి. మంచివాళ్ళకి రోజులుకావండి బాబూ. ప్రతీరోజూ ఎంతచేస్తే ఏం లాభం? ఎప్పుడో చేసిన దరిద్రపు పనే గుర్తుంటుంది!

    పోనీ చాలా రోజులయిందికదా, టి.వీ సావకాశంగా చూసి అని టి.వి. పెడితే, కనిపించిన ప్రతీ వాడూ ‘తెలుగువారి ఆత్మగౌరవం’ గురించే ఘోష! అదేమిటో రాత్రికిరాత్రి ఏదో కొంపములిగిపోయినట్టుగా,చెప్పేశారు.ఆఖరికి ఆయనెవరో రిటైర్డ్ డి.జీ.పీ ట, పోలీసులు అంత దాష్టికం చేయకుండా ఉండవలసిందీ అంటూ. అక్కడికేదో మన పోలీసులు తక్కువ తిన్నట్లు!
ఛాన్సు దొరికితే చాలు, చావకొట్టేస్తారు.వాళ్ళకున్న frustration అంతా చూపించుకుంటారు. ఎప్పుడైనా పోలీసులుండే ఇళ్ళు చూశారా? ఓ రూమ్మూ, వంటిల్లూ ఉన్న చిన్న క్వార్టరు లో
పిల్లా పాపలతొ కాపరం చేసికుంటారు.నేను ప్రతీరోజూ ఆంజనేయస్వామి గుడికెళ్ళేటప్పుడు, వాళ్ళ క్వార్టర్స్ మీదుగానే వెళ్తూంటాను.ఆ వాతావరణం,పరిసరాలూ చూస్తే కడుపు తరుక్కుపోతుంది.
ఈ ప్రభుత్వాలు ఏమిటేమిటో ఖబుర్లు చెప్తారు,police reforms గురించి.ఉండడానికి సరైన కొంప ఇమ్మనండి ముందర, ఆ తరువాత మిగిలిన విషయాలు చూడొచ్చు.మరి ఎక్కడ పడితే అక్కడ లంచాలు తీసికుంటున్నారని ఏడవడం ఎందుకూ?

    ‘తెలుగువారి ఆత్మగౌరవం’ రామలింగరాజు, ఏనాడైతే అందరినెత్తిమీదా శఠగోపం పెట్టాడో, ఆనాడే పోయింది.ఇప్పుడేం కొత్తగా పోయిందేమీలేదు.వచ్చిన గొడవంతా ఏమిటంటే, మిగిలిన రాష్ట్రాల్లో తెలుగువాళ్ళు సుఖపడిపోతున్నారూ, మనకి లేని సుఖం వాళ్ళకి మాత్రం ఎందుకూ అని! ఇప్పుడు అందరూ కట్టకట్టుకుని ఏడవ్వచ్చు. మన రాజకీయనాయకులకి ఛాన్సు దొరికితే, విదేశాల్లో ఉన్న తెలుగువాళ్ళ కాపరాల్లోనూ చిచ్చు పెట్టగలరు.

   ప్రస్తుత రాజకీయనాయకులు, ఏ స్వాతంత్ర పోరాటంలోనూ జైళ్ళకెళ్ళకుండా, గాంధీగారి పేరుచెప్పుకుని బండి లాగించేస్తున్నారు. చివరకి ఆ జైళ్ళ రుచేమిటో, లాఠీల దెబ్బేమిటో అప్పుడప్పుడు తెలిసికుంటేనే అసలు మజా!ఊరికే, ఏదైనా మర్డరు చేసేసి,ఎవడికొంపో కూల్చేసి,anticipatory bail తీసేసికోవడం కాదు.ఈ గొడవల్లో ‘ఓదార్పు యాత్ర’ ఏమయిందో తెలియడంలేదు.


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఫుకట్ సర్వీసులు

Mon, 07/19/2010 - 15:08

    ‘భ్రమ’ ల గురించి వ్రాద్దామనుకున్నాను. అవెక్కడికి వెళ్తాయిలెండి, మనతోపాటే ఉంటాయి. వాటిగురించి ఇంకో రోజు వ్రాయొచ్చులే అని, ఇంకో విషయం గుర్తుకొచ్చింది. దానిగురించీ టపా.మనం కానీ, మన పక్కింటివాళ్ళో,అదేబిల్డింగులో ఉండే ఇంకోరో, లేక అదే సొసైటీలో ఉండే మరోరో,ఫుకట్ గా ఏదైనా వస్తోందన్నా, లేక పనైపోతుందన్నా, ఛాన్సొదలరు!అది ఎవరినో విమర్శిస్తున్నానని కాదు, నేనైనా ఇదే పని చేస్తాను,మానవ సహజం అది.

 7nbsp;  మా చిన్నప్పుడు టార్చి లైట్లనుండేవి. అంటే ఇప్పుడు లేవనికాదు,ఇప్పుడు అవేవో చాలా sleek గా ఉండేవి వస్తున్నాయి.సెల్లులో లైటు,తాళం కప్పలో లైటు, లేకపోతే ఇంకో లేసరు లైటో చాలా వచ్చాయి. కానీ, మా రోజుల్లో Eveready వాళ్ళవి, స్టీలుతో ( అలా అనేవారు!) చేసిన టార్చ్ లైట్లొచ్చేవి, బుల్లిదీ, కొద్దిగా పెద్దదీ,మూడు బ్యాటరీలు వేసికునే పేద్దదీ. ఇందులో బుల్లిది మామూలుగా డాక్టర్లదగ్గర ఉండేది.మనకేమైనా వచ్చి డాక్టరుగారిదగ్గరకు వెళ్తే, ఆయన ముందుగా మన నోరు తెరిచి నాలుక బయటకు పెట్టమంటారు, మళ్ళీ అలా కాదూ, ఇంకా సౌండొచ్చేలా నాలిక బా…..గా చాపమంటారు, అప్పుడు ఆ బుల్లిలైటు దాంట్లోకి(అంటే తెరిచున్ననోట్లొకి) వేసి, ఓసారి నిట్టూర్పు విడిచి, బాగా inflame అయిపోయిందీ అంటూ ఏదో మందు రాసిచ్చేసేవారు. అలాగే పళ్ళడాక్టరుగారుకూడా పళ్ళ గ్రహస్థితులు తెలిసికోడానికి ఉపయోగించేవారు. వాటిలో టార్చ్ లైటు సైజులాగే మీడియం సైజు బ్యాటరీలు వేసేవారు.

    ఇంక కొద్దిగా పెద్దసైజువి, వాటిని ఇంచుమించు ప్రతీ ఇంట్లోనూ వాడేవారు. అదిలేకపోవడం ఓ నామోషీగా ఉండేది.చీకట్లో బయటకి వెళ్ళాలన్నా, లైట్లుపోతే ఫ్యూజు వేయాలన్నా, ఏ పురుగో పుట్రో ఇంట్లోకి వస్తే, దాన్ని పట్టుకోవాలన్నా దీని ఉపయోగం అమోఘం.ఆ రోజుల్లో సైకిళ్ళకి లైటుండకపోతే, పోలీసులు పట్టుకునేవారు. అందరికీ సైకిళ్ళకి డైనమో పెట్టుకునే స్థోమతుండేది కాదు కదా, అలాటి వారు, సైకిలు మీదెళ్తుంటే, ఏ పోలీసైనా ఎదురుపడితే, ఈ టార్చ్ వేసి పనికానిచ్చుకునేవాడు!

7nbsp;  ఇంక మరీ పెద్ద టార్చ్ లైటు-దీంట్లో మూడో నాలుగో బ్యాటరీలు వేసేవారు. దాని ఫోకస్ కూడా చాలా దూరం వచ్చేది.వాటిని జనరల్ గా, రాత్రిళ్ళు కాపలా కాసే, నైట్ వాచ్ మన్లదగ్గరుండేవి. ఆరోజుల్లో నైటువాచ్ మన్లెక్కడుండేవారూ అనడగకండి,బ్యాంకుల్లోనూ వాటిలోనూ ఉండేవారు.పొలాల్లోకి వెళ్ళడానిక్కూడా వీటి ఉపయోగం ఉండేది.ఇదేమిటీ ఈయన, ఆయన రాసిన టపాలు చదువుతున్నాము కదా అని, టార్చ్ లైట్ల ‘ప్రవర’ చెప్తున్నాడూ అనుకుంటున్నారు కదూ!
ఇంక అసలు కథలొకి వచ్చేద్దాం.

    ప్రతీ ఇంట్లోనూ ఓ టార్చ్ ఉంటుందన్నాను కదా, ఆ టార్చ్ లైటుని ప్రతీరోజూ ఉపయోగించంకదా, ఎప్పుడో ఏడాదికో, ఆర్నెల్లకో వాడుతాం.పనైపోగానే దాన్ని ఏగూట్లోనో పెట్టేసి వదిలేస్తాం.ఏ వస్తువైనా, ఆఖరికి, మనుష్యులైనా సరే, వాటికీ
periodical maintenance అనేది ఒకటుండాలి. లేకపోతే పడకెక్కుతాయి. అలా పడకెక్కిన టార్చ్ లైటు,మన కళ్ళల్లో పడుతుంది.పడకెక్కిందనెందుకు తెలిసిందంటే, ఆ ముందురాత్రి, పక్కవాళ్ళింట్లో అవసరమై, టార్చ్ లైటు గురించి అడగ్గానే, పేద్ద పోజు పెట్టి, వాళ్ళపిల్లాడికి మన గూట్లో ఉన్న లైటిస్తాము.వాడు నిమిషంలో తిరిగొచ్చేసి, అంకుల్, ఈ బాట్రీ లైటు ( టార్చ్ లైటుకి ముద్దుపేరు) వెలగడంలేదూ, అని మన మొహాన్న కొట్టి పారిపోతాడు.అదేమిటీ, ఆమధ్యనే
బ్యాట్రీలు కూడా మార్పించాను, అని ఓసారి ఇంట్లో వాళ్ళందరిమీదా ఎగురుతాడు,ఎవరడిగితే వాళ్ళకి ఎరువిచ్చేస్తూంటారూ, ఏ వెధవ, దీంట్లో బ్యాట్రీలు మార్చేశాడో అంటూ.నిజం చెప్పాలంటే, దాంట్లో బ్యాటరీలు మార్చి, ఆరునెలలైనా అయిఉంటుంది.సరే, రేపు దీని సంగతి చూద్దాం అనుకుని, అప్పటికి వదిలెస్తాడు.

    మర్నాడు ప్రొద్దుటే గెడ్డం వగైరా గీసికుని, ఓ కాఫీ తాగేసి, ఈ టార్చ్ లైటు వ్యవహారం ఏదో తేలుద్దామని, ఓ పాత గుడ్డా, ఓ మూతలో కిరసనాయిలూ వేసికుని సెటిల్ అవుతాడు. ముందుగా ఆ టార్చ్ లైటు వెనక్కాలుండే మూత, అప్పటికే బిగుసుకుపోయుంటుంది, తీసి నీరు కారిపోతున్న బ్యాటరీలు( ఆ లిక్విడ్ ఇల్లూ వళ్ళూ చేసికుంటూ)అవతల పారేస్తాడు.పైగా ఆ ముందురోజు రాత్రేమన్నాడూ-ఈ మధ్యనే కొత్త బ్యాటరీలు వేయించానని (ఉత్తిదే)- అంత కొత్తబ్యాటరీలైతే నీళ్ళెందుకు కారుతాయమ్మా? మొత్తానికి, ఆ బ్యాటరీలు తీసి,కిరసనాయిల్లో ముంచిన గుడ్డతో ఓ సారి, లోపలంతా శుభ్రంగా తుడుస్తాడు.ఆ బల్బుండేచోటోటి, దాని బుడిపికింద నీలంగా ఓ కోటింగోటొస్తుంది.దాన్ని కూడా తుడిచి, కొత్త బ్యాటరీలు వేయగానే, కొత్త పెళ్ళికొడుకులాగ వెలుగుతుంది.

    ఇంట్లో వాళ్ళందరూ, అబ్బ మా నాన్న ఎంతబాగా రిపెరు చేశాడో అని పిల్లలూ, మా ఆయనెంత ఇంజనీరులా,బాట్రీని మళ్ళీ వెలిగించారో అని ఇంటావిడా ఆనందపడిపోయి, కాలనీలోఉన్న ప్రతీ వాళ్ళకీ చెప్పేయడం, ఈయన ఏ బజారుకో వెళ్తూంటే, అందరి కళ్ళూ తనమిదే ఉన్నాయని మురిసిపోడం.ఇంతాచేసి ఆయన చేసిందేమిటయ్యా అంటే ఓ బాట్రీ లైటుకి మళ్ళీ వెలుగివ్వడం. ఇంతటితో ఆగదీ వ్యవహారం, బాట్రిలు బాగుచేసేవాడొకడు దొరికాడుగా, కాలనీలో ఉన్న ప్రతీవాడూ,వాళ్ళింట్లో పనిచేయని బాట్రిలు, పనిగట్టుకుని మరీ వెదికి, వీళ్ళింట్లో వాటికి తన పేరున్న కాగితం అంటించి, వాళ్ళబ్బాయిచేత పంపించి, ‘అంకుల్ మా టార్చ్ వెలగడం లేదు,డాడీ మిమ్మల్నోసారి చూడమన్నారు’ అంటూ కాలనీ లో ఉన్న, ఓ పది టార్చ్ లైట్లు మనకొంపలోకి చేరతాయి.దీంతో ఆగదు,ఎప్పుడో బజార్లో స్నేహితుడితో వెళ్తున్నప్పుడు, పనిమాలా ఆపి, ‘మాస్టారూ మా బాట్రీ రిపేరయిందా, అయితే మావాడిని పంపిస్తాను సాయంత్రం’ అంటూ ఓ పలకరింపూ. తనతో ఉన్న స్నేహితుడు, ఆశ్చర్యపడి ‘ ఇదేమిట్రా, ఈ మధ్యన సైడు బిజినెస్సు మొదలెట్టావా ఏమిటీ, నాతో చెప్పనేలేదూ’అంటూ పరామర్శా.

    ఏ కొట్లోకో వెళ్ళి టార్చ్ లైట్లు రిపేర్ చేసికోవచ్చు. మళ్ళీ దీనికి డబ్బులు తగలేయడం దేనికనీ, అప్పనంగా అవుతోందని పక్క వాళ్ళమీద బతికేద్దామనే ఆబ ఉందే, చాలా మందిలో చూస్తూంటాము.అలాగే మిక్సీలూ, రేడియోలూ ఇంకా ఏమైనా సరే మీకు రిపెరీ చేసికోడం వచ్చిందా, సైలెంటుగా మీపనేదో మీరు చూసుకోండి. అంతేకానీ గొప్పకోసం ఊళ్ళో అందరికీ టముకెసికున్నారా అంతే సంగతులు!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

Mon, 07/19/2010 - 05:23

    రెండు మూడు రోజులనుండి, పేపర్లలోనూ, టి.వీ ల్లోనూ హోరెత్తించేస్తున్నారు- బాబ్లీ డ్యాం కి మన నాయుడుగారూ, ఇంకో డెభ్భై మంది ఎం.ఎల్.ఏ లూ, మీడియావాళ్ళనీ కలుపుకుని అక్కడకు వెళ్ళారనీ, అక్కడ వీళ్ళని మహరాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారనిన్నూ, దగ్గరలో జైలూ అదీలేక, ఐ.టి.ఐ క్యాంపస్సులో బంధించారనిన్నూ, వారికి బ్రేక్ ఫాస్టులూ, మధ్యాన్న భోజనాలూ సరీగ్గా పెట్టడం లేదనిన్నూ.

   అసలు నాకోటనిపిస్తోంది, రోశయ్యగారే అశోక్ చవాన్ కి ఫోను చేసి,‘మావాళ్ళందరినీ జైల్లో పడేయ్, ఇక్కడ రోజూ అసెంబ్లీలో నా ప్రాణం తీస్తున్నారూ, ఓ వారంరోజులైనా ప్రశాంతంగా ఉండొచ్చూ’అని చెప్పారేమో ! ఒకవిషయం చెప్పండి, వీళ్ళేమైనా పిక్నిక్కు కి వెళ్ళారా లేక హనీమూన్ కి వెళ్ళారా, సకల మర్యాదలూ చేయడానికి! గొడవంతా ఎక్కడొచ్చిందంటే, తెలంగాణా విషయంలో, నాయుడు గారు, అటు ఆంధ్రావాళ్ళకీ, ఇటు తెలంగాణా వారికీ సద్ది చెప్పలేక,ఎవరు పట్టించుకుంటారులే అని ఏవేవో స్టేట్ మెంటులు చేసేశారు. రాబోయే ఉప ఎన్నికల సందర్భంలో, తెలంగాణా వారికి ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చి, ఇక్కడకొస్తే కాళ్ళిరక్కొడతామన్నారు. ఇంక issue లేకపోయింది,ఎన్నికలకి.
దాంతో ఉభయతారకంగా ఉంటుందని ఈ బాబ్లీ వ్యవహారంలో popular అవుదామని ఇలా మందీ మార్బలంతో వెళ్ళారు.To be on safe side, మనల్ని టి.వీ ల్లో బోరుకొట్టడానికి, ఓ ముగ్గురు నలుగురు నిలయవిద్వాంసుల్ని, ఇక్కడే వదిలేసి!

   మన టి.వీ. వాళ్ళకి ఏదో ఒక కాలక్షేపం కావాలిగా.ఈ లోపులో, టి.ఆర్.ఎస్ రావుగారు, ఇదేమిటీ బాబ్లీ గోడ పెంచేస్తే మనకి కదా నీళ్ళు రానిది,ఈ నాయుడేమిటీ,తనెళ్ళిపోయాడూ, అనుకుని ‘ఇదంతా ఎన్నికల స్టంటూ’ అని ఓ స్టేట్మెంటిచ్చేశారు!నారాయణ గారికీ, రాఘవుల గారికీ ఊళ్ళో ఎక్కడ గొడవైనా, ఓ స్టేట్మెంటిచ్చేస్తే పోదా అనుకుని left,right,centre బాదేస్తున్నారు.ఈ మధ్యలో మన హోం శాఖామంత్రిణి గారు,’ఎవరింటికో వెళ్ళి, అక్కడ గొడవచేస్తే
వాళ్ళు అరెస్ట్ చేయరా అంటూ ‘ నా పుట్టలో వేలెడితే కుట్టనా’అని చీమన్నట్లు,
ఓ స్టేట్మెంటిచ్చారు. పాపం నాయకులందరూ అక్కడేక్కడికో వెళ్ళి కష్టపడిపోతున్నారూ అనుకుని, మన మిగిలిన ఛోటా, మోటా నాయకులంతా ఓ ‘బంద్’ ఏర్పాటుచేసి, బస్సులన్నీ ఆపేసి గొడవ చేస్తున్నారు.Let the common man go to hell అనేట్లుగా!ఒక్కరోజు ఈ బందులూ, హర్తాళ్ళూ చేయడం వలన, ఆ బాబ్లీ గోడ తగ్గుతుందా, అదేమీ ఒక్కరోజులో చేసిందికాదే, అందరు రాజకీయనాయకులకీ తెలుసు ఆవిషయం.ఎవడికి కావలసినట్టుగా వాడు, దాన్ని exploit చేసుకుంటున్నారు.

    ఇంకో విషయం- గోదావరీ, కృష్ణా కూడా మహరాష్ట్రలోనే పుట్టాయికదా, ఏదో అక్కడ ఖాళీ లేక ఆంధ్రదేశంలోకి పొంగిపొర్లి, సముద్రంలో కలుస్తున్నాయి.మరాఠీ వాళ్ళు వాళ్ళింట్లో ఏదో చేసుకుంటున్నారు,అది పక్కవాడికి బాగోలెదూ అని, ఏదో అన్ని పార్టీలూ కూర్చుని మాట్లాడుకుని, వ్యవహారం సెటిల్ చేసికోవడం పోయి ఈ బందులూ అవీ చేసి, మామూలు జనాల్ని ఇరుకులో ఎందుకు పెడతారో తెలియదు.ఇన్నాళ్ళూ మనవాళ్ళకీ, మరాఠీలకీ ఏ గొడవలూ లేకుండా, హాయిగా ఉంటున్నారు. ఇప్పుడు నాయుడు గారి ధర్మమా అని, ఏం గొడవలొస్తాయో?

    ఈ రాజకీయనాయకులందరూ దొందుకు దొందే,వీళ్ళూవాళ్ళూ బాగానే ఉంటారు, మధ్యలో నలిగిపోయేది మనలాటివాళ్ళే.రోశయ్యగారేమో ఢిల్లీ లో ఆయనగొడవేదో ఆయన పడుతున్నారు. చిరంజీవి గారు తిరుపతి వెంకన్న గురించి, పాదయాత్రచేస్తే పుణ్యం పురుషార్ధం అనుకున్నారు. ఇంక మన టి.వీ.వాళ్ళు అదేదో రెండు దేశాలమధ్య యుధ్ధం అవుతున్నట్లుగా,ఫలానా సరిహద్దు ప్రాంతం అంటూ ఊదరకొట్టేస్తున్నారు…మనదృష్టం ఎలాఉందో, ఈ బస్సుల్నీ,రైళ్ళనీ నమ్ముకుని, రిజర్వేషన్లు చేయించుకోడానికి లేదు, ఏ క్షణాన్న ఏ రాజకీయపార్టీకి ఏలాటి ఆలోచన్లొస్తాయో ఆ దేముడిక్కూడా తెలియదు.


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–” భ్రమ” లు

Sat, 07/17/2010 - 12:55

    ప్రపంచంలో మనకంటె తెలివైన వాళ్ళు లేరూ, ఎవరు చేసే పనైనా, మనమూ చేసేయగలమూ అనే overconfidence ఉందే దాన్నే, మామూలు భాషలో ‘భ్రమ’ అంటారు. మామూలుగా తొంభై శాతం మొగాళ్ళలో ఇది తప్పకుండా ఉంటుంది.ఓస్ ఇంతేనా అని దేంట్లోనో వేలెట్టడం,బోర్లా పడడమూనూ! నిజం చెప్పాలంటే అవేమీ పేద్ద ఘనకార్యాలేమీ కాదు.
కానీ మనం బోర్లాపడ్డతరువాత తెలుస్తుంది, అది ఎంత specialised జాబ్బో !

    ఇదివరకటి రోజుల్లో, మన ప్యాంటులకి జిప్పులూవగైరాలుండేవి కావు. బొత్తాలే గతి. అవికూడా అదేం ఖర్మమో, చాకలాడు ఇస్త్రీ చేసి చేసి, వాటిని ఊడగొట్టేసేవాడు. పైగా వాటిక్కుడా ఓ
shelf life లాటిదోటి ఉంటుందిగా. అదికాస్తా అయిపోగానే టపక్కున ఎక్కడో పడిపోతుంది. ఇప్పటిలాగ ఏమైనా, బీరువానిండా బట్టలుండేవా ఏమిటీ, ఏదో పండగకీ, పుట్టినరోజుకీ,ఎవరైనా పీటలమీద ఆతావేతా బట్టలు పెడితే, అవి మనం కుట్టించుకుంటే,అన్నీ కలిపి ఓ అరడజను జతలు తేలేవి. అందులో ఆఫీసుకేసికొని వెళ్ళేవి, మూడు పోగా మిగిలిన మూడూ ఏవైనా ఫంక్షన్లకి( ఎవరైనా పిలిస్తే) వేసికోవడం.ఇదండి కథ.అందులో మనం ఆఫీసుకెళ్ళే ప్యాంటు బొత్తాం ఊడిపోయిందన్నాము కదూ, రోజు మధ్యలో, వేళ్ళాడుతున్న flap కి ఓ సూదిపిన్నీసు పెట్టుకుని, పనికానిచ్చేద్దామనుకున్నా, అందులో కూడా కొన్ని అసౌకర్యాలున్నాయి.మరీ పిన్నీసు పెట్టుకుని ఆఫీసుల్లో తిరిగితే బావోదుకదా, అందుకోసమని, అప్పటిదాకా inshirt చేసికున్న షర్టుని బయటకు లాగేసి, ప్యాంటుమీదకి వదిలేస్తాము.

    ఈ గొడవలన్నీ భరించలేక, ఇంటికెళ్ళగానే ఇంటావిడతో, ‘ఏమోయ్ ప్యాంటు బొత్తాం ఊడిపోయిందీ, కొంచెం కుట్టిపెడుదూ’ అంటాం.ఆవిడకిదేపనా ఏమిటీ, చూద్దాంలెండంటుంది.ఇలా ఆవిడని ఇంకోసారి అడగడానికి,ఇగో అడ్డం వచ్చి, ‘ఆమాత్రం నేను కుట్టుకోలేనా, ప్రతీ దానికీ పేద్ద పోజు పెడుతుందీ..వగైరా వగైరా..’ లోపలే అనేసికుని, మళ్ళీ బయటకి విసుక్కుంటే మర్నాడు లంచ్ డబ్బా ఇవ్వకపోతే..అమ్మో! ముందుగా సూదీ దారం ఉన్న ప్లాస్టిక్ డబ్బా తీస్తాడు.అందులో బొత్తాలు కుట్టుకోడానికి ఏ సూది వాడాలో తెలియదు. కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఓటి సెలెక్ట్ చేస్తాడు.ఏదో తను పెద్దాణ్ణి కదా అని, బొంత సూది తీస్తారా ఎవరైనా? ఆ తీసిందికూడా ఎందుకంటే, చిన్న సూదిలో దారం ఎక్కించలేడు,అందుకన్నమాట అసలు సంగతి! చివరకు, ఏ కూతురో,కొడుకో వచ్చి చెప్తారు, డాడీ ఆ సూది కాదూ,ఇదీ అని, ఇంకోటి చేతిలో పెడతారు.

    ఇంక భాగవతం మొదలూ,ఆ సూదిలోకి దారం ఛస్తే దూరదు,ఏదో దాన్ని చివరలు నలిపితే, సన్నబడుతుందీ అని ఎప్పుడో గుప్తులకాలంలో చూసిన జ్ఞాపకం ఉంది.ఓ సారి దాన్ని నలపడం
ఓసారి నోట్లో పెట్టుకుని తడపడం, మొత్తానికి ఏవేవో తిప్పలు పడి, సూదిలోకి దారం ఎక్కించాడు. ప్యాంటు రంగుతో దగ్గర దగ్గరగా మ్యాచ్ అయ్యే ఓ బొత్తాం( ఎందుకంటే ఒరిజినల్ బొత్తాం ఎక్కడో జారిపోయింది) సెలెక్ట్ చేసి, బొత్తాం కుట్టడం అభియాన్ మొదలెడతాడు.ఆ బొత్తాన్ని, ప్యాంటు పైభాగంలో, (అది ఎక్కడకి రావాలో తెలిసికోడానికి, పాత జారిపోయిన బొత్తాం దారం అవశేషాలుంటాయి, అదే కొండగుర్తు,/b>). పెట్టి, ఆ సూదిని కిందనుంచి గుచ్చి బొత్తాంకున్న చిల్లులోకి (ఒక్కోప్పుడు రెండే చిల్లులుంటాయి, అదృష్టం బాగోపోతే నాలుగు) గుచ్చడానికి ప్రయత్నిస్తే
టప్పున మన చూపుడువేల్లోకి దిగిపోతుంది.వెధవ గొడవ వెధవ గొడవని తిట్టుకుంటూ, ఆవేలునోట్లో పెట్టుకుని చప్పరిస్తాడు.ఇంతట్లో కొంప మునిగిపోయినట్లు, కొడుకో,కూతురో వచ్చి, డాడీ రేపు స్కూల్లోకి కాంపాస్ బాక్స్ లేదూ, అదితీసుకురాపోతే క్లాసులో బయటనుంచోపెట్టేస్తారూ అని వస్తారు.అదేమిటో ప్రపంచంలో కష్టాలన్నీ ఒకేసారి రావాలా. ఇక్కడ వేల్లో సూదుగుచ్చుకుని నేను ఛస్తూంటే, వీడికి కంపాస్ బాక్స్ కావాల్ట.సాయంత్రంనుండీ ఇంట్లోనే ఉందిగా, మీఅమ్మతో చెప్పేడ్వకూడదూ,ఆవిడకి ఊళ్ళోవాళ్ళతో ఖబుర్లు చెప్పుకోడానికే టైముండడంలేదు,ఇంక ఇవన్నీ ఎక్కడచూస్తుందీ, అంటూ ఢాం ఢూం అని బి.పి. పెంచేసుకుంటాడు.పాపం స్వతహాగా నెమ్మదస్తుడే, ఇదిగో కట్టకట్టుకుని మీద పడ్డ కష్టాలు ఓర్చుకోలేక, ఇలా వీధిన పడ్డాడు!

    ఇదంతా ఎందుకొచ్చిందీ,మనం చేసికోలేని పన్లో వేలెట్టడం వల్ల.ఇంటావిడ కొంచెం తీరికచెసికుని కుట్టిపెడతానందికదా, అబ్బే అలా ఆగితే, మన ఇంపార్టెన్సెక్కడ? చివరకి ఆవిడే కుట్టిపెడుతుంది, మర్నాడు హాయిగా ప్యాంటుకి మాచ్ అయ్యే బొత్తాంతో ఆఫీసుకీ వెళ్తాడు, కథ సుఖాంతం.

    ఎప్పుడో పెళ్ళైన కొత్తలో షర్టు బొత్తాలూడిపోతే, పెళ్ళాన్ని పిలిచి, కొంచెంకుట్టిపెట్టవోయ్ అనగానే, ఆవిడ మనం నుంచునుండగానే టకటకా మని కుట్టేసి, దారం పంటితో తెంపడానికి, మనమీదకు వాల్తే, మనమెదో కక్కూర్తి పడ్డ మధురదృశ్యాలు గుర్తుకొచ్చి,చొక్కా బొత్తాం కావాలని తెంపేసుకుని, ఇంటావిడని బొత్తాం కుట్టమంటే(ఇప్పుడు ఇద్దరు పిల్లలకి తండ్రైనతరువాత),
‘సర్లెండి సంబడం. మనకిదోటి తక్కువా’ అంటూంటే, అయ్యో జీవితం ఇంతేనా అనిపిస్తూంటుంది!

మిగిలిన ఇంకెన్నో ‘భ్రమ’ లగురించి ఇంకో టపాలో….


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పొరిగింటి పుల్లకూర

Fri, 07/16/2010 - 13:19

   ఊళ్ళోవాళ్ళందరూ మనకంటె బాగా ఉన్నారనే concept మొట్టమొదట మన బుల్లితనంలో ప్రారంభం అవుతుంది. ఆ సుబ్బారావుగారి బాబు అప్పుడే పాకేస్తున్నాడుట, వాడికి అప్పుడే పళ్ళుకూడా వచ్చేశాయిట,మొదలైనవి…
ఇంక హైస్కూల్లోకి వచ్చేసరికి అడగఖ్ఖర్లేదు! ఎప్పుడూ ఎవడో కోన్కిస్కా పక్కవాళ్ళ అబ్బాయికో,అమ్మాయికో మనకంటె మార్కులు ఎప్పుడూ ఎక్కువే వస్తాయి,అదేం ఖర్మమో!అదే వాతావరణం లో పెరిగేము కాబట్టి,ప్రతీదీ అవతలివాడికంటె
తక్కువేమో అనే ఓ దరిద్రపు ఫీలింగొచ్చేస్తుంది!

    ఏ విషయం తీసికోండి,ఎప్పుడైనా సొసైటీ లో ఇంకోళ్ళ పిల్లల్ని చూసినప్పుడు,మన పిల్లలకంటె, వాళ్ళే బొద్దుగా ఉన్నారేమో అనిపిస్తుంది.వాడే ఇంగ్లీషు రైమ్ములూ అవీ పాడుతున్నాడేమో, వాడు వెళ్ళే స్కూలే మనవాడు వెళ్ళేదానికన్నా బెటరేమో,ఇలా ప్రతీదీ వాడితో కంపేర్ చేసి,మనకున్న ఆనందం కాస్తా గంగపాలు చేసికోవడం చూస్తూంటాము.అలాగని ఆ అవతలివాళ్ళేమీ సుఖపడిపోవడం లేదు. వాడు, వాళ్ళ బాసు పిల్లలు వెళ్ళే స్కూలికి పంపలేకపోయామే అని ఏడుపు!
ఉన్నదాంట్లో సంతృప్తి అనేది,మనం ఆలోచించేపధ్ధతిలో ఉంటుంది.

    రైల్వే స్టేషనుకెళ్ళండి,మామూలుగా త్రీ టైర్ లో ఉండేవాళ్ళు, ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళుపడుతూ ఉంటారు.ట్రైనుకి చివర్లోఉండే ఏసీ లో ఉండేవాళ్ళు, ఓ పెద్ద పోజు పెట్టేసుకుని, ప్లాట్ఫారం మీద బయటే నుంచుంటారు, ఎందుకంటే, వాడు ఏ బుక్ స్టాల్ కైనా ,ఏ క్యాంటీను కైనా వెళ్ళాలంటే, చచ్చేటంత దూరం వెళ్ళాలి,అంతదూరం వెళ్ళే ధైర్యం వీడికుండదు,ఈ లోపులో రైలెళ్ళిపోతే అమ్మో ! వాడితిప్పలు వాడివీ. ఏసీ టు టైరులో ఎప్పుడైనా గమనించారో లేదో, ఉన్న నలుగురూ
ఒకళ్ళతో ఇంకోళ్ళు ఛస్తే మాట్లాడుకోరు.ఇది అనుభవం మీద చెప్తున్నది.ఎవడికివాడే బలే హిరో అనుకుంటాడు, చేతిలో ఓ ఇంగ్లీషు నవల తప్పకుండా ఉంటుంది.పైగా బయటకి వెళ్ళి ఏ ఇడ్లీయో, ఇంకోటో కొనుక్కోడానికి నామోషీ, టు టైరులో ప్రయాణం చేస్తున్నాడాయే! పైగా అలా వెళ్ళేవాళ్ళలో ప్రతీవాడూ చెప్పే స్టాండర్డ్ డయలాగ్గు– ‘ఎప్పుడూ ఫ్లైట్ లొనే వెళ్తానూ, ఏమిటో ఈసారే ఆఖరినిమిషంలో ఇలా వెళ్ళవలసివచ్చిందీ’ అనేది.వాడే గంగలో దిగితే మనకెందుకూ? ఓ సంగతి చెప్పడు-వాళ్ళ బాసు అదేదో పెద్ద క్లాసులో వెళ్తాడూ, వీడేమో ఎకానమీ లో వెళ్తాడూ,ఎయిర్ పోర్ట్ లో దిగిన తరువాత కూడా,వాళ్ళ బాసుకి మెర్సిడీజూ, వీడికి ఇండికాయో, లేక ఎంబాసడరో ఇస్తారని.వినేవాడుంటే ఎన్నైనా చెప్పేయడం.

   ఎవరైనా ఏ కాలేజీలోనో పనిచేస్తున్నారనుకోండి, ప్రతీవాడూ ‘ అబ్బ మీకేమిటండి,హాయిగా భోజనం చేసి కాలేజీకెళ్ళడం,రోజులో ఏ మూడో నాలుగో క్లాసులు తీసికోవడం, మిగిలిన టైమంతా ఖాళీ‘. ఈ కాలేజీవాడనుకుంటాడూ, అబ్బ ఈ బ్యాంకుల్లో పనిచేసేవాళ్ళ పనెంతహాయో, రోజూ ఎంతంత డబ్బు వీళ్ళ చేతులమీదుగా వెళ్తూంటుందో అని.రోజంతా క్యాష్ లో కూర్చుని సాయంత్రానికి డబ్బు లెఖ్ఖా జమా అప్పచెప్పేటప్పటికి ఈ పెద్దమనిషి ఎంత టెన్షన్ పడతాడో! ఏ డిపార్ట్ మెంటు తీసికోండి, మనకంటె అవతలివాడి పనే బాగుందనుకోవడం. వాడు ఇంకోళ్ళని చూసి అలాగనుకోవడం.

   అంతదాకా ఎందుకూ, మన పిల్లకాయల్ని చూడండి, ఏడాది తిరిగేసరికి చేస్తున్న జాబ్ బోరుకొట్టేస్తోందిట. ఇంకో కంపెనీలో అదేదో బావుంటుందీ,ఆ జాబ్ profile బావుంటుందీ అని మారిపోతూండడం. అయినా ఈ వేషాలన్నీ పెళ్ళై పిల్లలు పుట్టేదాకానే లెండి. ఆ తరువాత ఉన్న ఉద్యోగం లక్షణంగా చేసికుంటాడు!

    అంతదాకా ఎందుకూ, అదేమిటో ఎవరింటికైనా భోజనానికి వెళ్తే ఆ ఇంటావిడ చేసిందే బాగుందేమో అనిపిస్తూంటుంది! రోజూ పెళ్ళాం చేసినది పీకలదాకా మింగుతున్నా సరే. ‘అన్నయ్యగారూ, మరీ మారడగలేదు. వదినగారి చేతివంటంత బావుండలెదేమో’ అనగానే, ఛాన్సొచ్చిందికదా అని, అబ్బే అలాటిదేమీ లేదమ్మా, నీచేతివంట అమృతం ఎట్సట్రా వల్లించేస్తాడు.భార్య ఎదురుగా ఉండగానే. అసలు ఆ ఇంటావిడడిగిందెందుకూ, ఇంట్లో ఉన్న మొగుడికి తెలియచేయడానికి’ఓరి బడుధ్ధాయీ, నా చేతి వంట ఊళ్ళోవాళ్ళందరికీ బాగానే ఉంటుందీ, నీకే తిన్నదరక్క రోజూ వంక పెడుతూంటావూ’ అని చెప్పడానికి.ఈ పెద్దమనిషీ వాళ్ళూ అవతలివారింటికి వెళ్ళినప్పుడు సీన్ రిపీట్ !

   పక్కవాళ్ళింట్లో ఏ ప్లాస్మా టి.వీ యో తెచ్చారనుకోండి,ఇంట్లో పగలనకా, రాత్రనకా ఆ టి.వీ గురించే गुण गान् !వాళ్ళింట్లో ఫ్లోరింగు బావుందీ, అబ్బ వాళ్ళాయన జుట్టుకి రంగేసికుంటే ఎంత బావుంటాడో, మీరూ ఉన్నారు.వాళ్ళకి,ఎంచక్కా
శాంట్రో ఉంది. మనమూ ఉన్నాము,ఆటోలూ, బస్సులూనూ.దేనికైనా పెట్టిపుట్టాలి అంటూ.ఆ అవతలివాడు, ఇంకోళ్ళని గురించి అలాగే అనుకుంటూంటాడు. అలా కాకపోతే మానవ జన్మే కాదు! అసలు జీవితంలో contentment అనేది ఒకటుంటుందా అనిపిస్తుంది.
అందుకనే ‘పొరుగింటి పుల్లకూర రుచి’ a.k.a. ‘Neighbour’s wife is always beautiful’ అనే సామెతలు వచ్చాయి!

ఇంకా చాలానే ఉన్నాయి. మీకు గుర్తొస్తే పంచుకోండి !


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-రాజమండ్రి

Fri, 07/16/2010 - 00:08

epaper-sakshi-com

నేను రిటైరయిన తరువాత, రాజమండ్రీ,గోదావరి గట్టునుండాలని ఎందుకు తహతహలాడిపోయానో, పైన ఇచ్చిన వ్యాసం (సాక్షి లో వచ్చింది) చదివితే అర్ధం అవుతుంది.


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- సినిమా హాళ్ళలో ఈతిబాధలు

Thu, 07/15/2010 - 13:28

    చిన్నప్పుడు సినిమాలకి వెళ్ళడం అమ్మా,నాన్నలతోటే.కొద్దిగా స్కూల్లో పెద్దక్లాసులకి వచ్చినప్పుడు,ఒక్కడినీ వెళ్ళడానికి డబ్బులిచ్చేవారు.అదీ ఎంత, ఓ కుర్చీ క్లాసుకి సరిపోయేటంత, ముప్పావలా!సినిమా హాలుకీ,ఆట అయిపోయిన తరువాత ఇంటికి వెళ్ళడం అన్నీ నడకే.పోనీ పాపం ఏదో రిక్షాలో వెళ్తాడూ అని ఓ పావాలాయో, అర్ధో ఇస్తే,సినిమా హాల్లో ఇంటర్వెల్ లో ఏదో ఒకటి తినడమో, తాగడమో చెయొచ్చు అనే కల కలలాగే మిగిలిపోయింది.అలాగని ఇప్పటిలాగ
పాకెట్ మనీలూ అవీ ఉండేవికావు.పీకలదాకా తిండి పెట్టి,కట్టుకోడానికి బట్టా ఇచ్చిన తరువాత, ఇంకా ఈ పాకెట్ మనీలూ</b. అవీ ఎవళ్ళిస్తారు? ఊళ్ళో ఉన్నవి మొత్తం నాలుగో అయిదో హాళ్ళు.వారానికి ఒకదానికెళ్ళినా, మొత్తం నాలుగు సినిమాలూ,వెరసి మూడు రూపాయలూ!

   స్కూలుకెళ్తే మిగిలిన ఫ్రెండ్స్,అదేదో సినిమా చూశానూ అదీ రెండోసారో,మూడోసారో అన్నప్పుడల్లా వళ్ళు మండీపోయేది.ఛస్తే అమ్మా నాన్నా ఉన్న ఊళ్ళో చదవకూడదూ అనిపించేది.అంతదృష్టం ఎక్కడా? కాలేజీకూడా ఇంటికి దగ్గరే!మన జీవితం ఇలాగే వెళ్ళిపోవాలని రాసిపెట్టాడు ఆ భగవంతుడు.మహా అయితే సినిమా హాల్ దగ్గరకు వెళ్ళి, మనకు నచ్చిన పాటోసారి వినొచ్చేవాడిని.ఎస్.ఎస్.ఎల్.సి, మా అన్నయ్యగారి దగ్గర చదవడంవల్ల, కొద్దిగా డబ్బులొచ్చేవి.ఆ ‘తీరని కలలు’ కొన్నిటిని సాకారం చేసికున్నాను!అంటే ఇంటర్వెల్ లో బయటకు వెళ్ళి కలర్ సోడా తాగడం, పాటల పుస్తకాలు కొనుక్కోవడం లాటివన్నమాట!కాలేజీకెళ్ళిన తరువాత ఇంకొంచెం ఫ్రీడం వచ్చేసింది. మామూలుగా చూసే సినిమాలే కాకుండా, క్లాసులెగ్గొట్టి హిందీ మ్యాట్నీలు చూడడం ( అదీ బాగా నచ్చినవైతే రెండో మూడో సార్లు చూడడందాకా). ఇన్ని వ్యాపకాల్తోటి, చదువు వంటబట్టమంటే ఎలా పడుతుందీ?

    మనవైపు ఆరోజుల్లో సీట్లకి నెంబర్లూ అవీ ఉండేవికావు.ఆట మొదటిరోజైతే వరెండాలో కూడా కుర్చీలేసి చూడనిచ్చేవారు.బాల్కనీ సీట్లకైతే నెంబర్లుండేవి. ఎలాగో ఢక్కామొక్కీలు తిని, టికెట్టు సంపాదించి, హాల్లోకెళ్ళేటప్పటికి, న్యూస్ రెవ్యూ అయిపోయి, సినిమా టైటిల్స్ మొదలెట్టేసేవాడు. ఆ చీకట్లో ఏమీ కనిపించి చావదు. గేటుకీపరు ఓ టార్చీలైటు తీసికుని ఓ వరసలోకి తీసికెళ్ళి, లైటుచూపించేవాడు, అక్కడ ఓ పదిమందిని దాటుకుంటూ, వాళ్ళు పడే విసుపు భరిస్తూ,ఎవరెవరివో కాళ్ళు తొక్కేస్తూ మొత్తానికి ఆ సీటులో సెటిల్ అయినంతసేపు పట్టదు, ఇంతట్లో ఆ టార్చీలైటువాడు, మన మీద లైటేసి, బయటకు పిల్చి, మన టిక్కెట్టు చూపించమంటాడు. మీదిక్కడ కాదూ అని ఇంకోచోట చూపిస్తాడు
మళ్ళీ అక్కడా ఇదేసీను రిపీట్!అదేం పాపమో, మనకి ముందు సీట్లో కూర్చున్నవాడెప్పుడూ పొడుగ్గానే ఉండేవాడు.నిజంగాపొడుగ్గా ఉండేవాడా, లేకపోతే కావాలని మెడ సాగతీసేవాడా,ఏది ఏమైనా మనకి మాత్రం, హీరో తలా, హీరోయిన్ చెయ్యీ కనిపించేవి.ఇంత డబ్బూ పెట్టి ఇదేం తద్దినంరా అనిపించేది!

    ఉద్యోగంలో చేరిన మొదటి ఏడాదిలోనూ(1963), డొమీనియన్ ప్రతిపత్తిలోంచి, పూర్ణ స్వాతంత్రం రాగానే, కసితీరా వారానికి అయిదారు సినిమాల చొప్పున 300 సినిమాలూ చూశాను!ఆమధ్యన ఎక్కడో, అప్పుడు చూసిన సినిమాల లిస్టు కూడా కనిపించింది. ఇంత ఘన చరిత్ర పెట్టుకుని, పిల్లల్ని సినిమాలకెళ్ళొద్దూ అంటే వింటారా!నా అదృష్టం ఏమిటంటే, ఈ లిస్టు ఈమధ్యనే వెలుగులోకి వచ్చింది!పెళ్ళైన మొదటేడాదీ ఏమో కానీ,ఆ తరువాత సినిమాకెళ్ళడం, పిల్లల్ని ఎత్తుకోడానికే.ఇంట్లో ఎవరైనా పెద్దాళ్ళుంటే ఏమో గానీ, పెళ్ళాన్ని ఓ సినిమాకి తీసికెళ్దామని ఓ యావా,మూడేళ్ళ వయస్సుదాకా టిక్కెట్టుండదు కాబట్టి,ఆ పిల్లనో,పిల్లాడినో చంకనేసికుని వెళ్ళడం.ఆ పిల్లో,పిల్లాడో ఇనెవిటబుల్ గా ఏదో శాపం పెట్టినట్టుగా,సినిమా మొదలైన అరగంటకల్లా ఏడుపు మొదలెడతాడు/తుంది.పొలో మని,వాళ్ళనీ, వీళ్ళనీ దాటుకుంటూ,ఈ పిల్ల ఇంకా రాగం పెడితే, అక్కడున్న వాళ్ళందరి కళ్ళూ మన జంటమీదే( తండ్రీ,పిల్ల). ఆ హడావిడిలో మనం ఏ వరసలో మన పెళ్ళాంతో కూర్చున్నామో అంత పెద్దగా గుర్తుంచుకోము. ఏదో ఏడుస్తున్న పిల్లని బయటకు తీసికెళ్ళాలని తొందరే కానీ,ఇలాటి సిల్లీ థింగ్స్ ఎవడు చూస్తాడూ?

    బయటకు తీసికెళ్ళగానే అదేదో స్విచ్చ్ ఆఫ్ చేసినట్లుగా, ఏడుపాపేసి, ఠింగురంగా అని ఆడుతుంది.పోనీ ఊరుకుందికదా అని హాల్లోకి ఓసారి వెళ్ళిచూద్దామా సినిమా ఎంతదాకా వచ్చిందో అని లోపలకి వెళ్తాము. మన సీటెక్కడో చచ్చినా గుర్తుండదు,ఆ చీకట్లో ఏ రో లోకి వెళ్ళాలో తెలియదు.పైగా అక్కడున్న ఆడాళ్ళందరూ, మన వాళ్ళలాగే కనబడతారు, అలాగని ఎవరిపక్కైనా కూలబడితే పళ్ళూడకొడతారు!ఈ బాధలన్నీ భరించలేక,అక్కడే పైకీ కిందకీ తిరుగుతాం.అక్కడెక్కడో కూర్చున్న భార్య ఇవన్నీ చూస్తూంటుంది, ఓ సారి ఇష్ ఇష్ అని అంటే తనసొమ్మేంపోయిందిట! అబ్బే, ఇక్కడకు వచ్చిన తరువాత, పిల్లేడిస్తే తన్ని తీసికెళ్ళమంటాడేమో అని భయం,అయ్యబాబోయ్, ఇంత మంచి సినిమా మిస్ అయితే ఎలాగా అనుకుని. తొమ్మిది నెలలు మోయలేదేమిటీ,ఆ మాత్రం ఓ గంటెత్తుకుంటే ఏం అరిగిపోరు అనుకుని, పోన్లెద్దూ అనుకుంటుంది!

   అటూ ఇటూ (వయస్సులో) కాని పిల్లలతో సినిమా కెళ్ళారా,ఇంటర్వెల్లో,అక్కడుండే గడ్డంతా కొనాలి.అవి తిండానికే పుట్టారా అనిపిస్తుంది.చిన్న పిల్లలున్నారుకదా అని బిస్కట్ ప్యాకెట్లూ,వాటర్ బాటిల్సూ అన్నీ పట్టుకుని, ఏదో ఊరు ప్రయాణంలా బయలుదేరుతామా, ఆపిల్లలు అవన్నీ తింటారా తాగుతారా మన పిచ్చిగానీ, అదో మోతబరువూ</b.!

   ఇలాటి ఈతి బాధలన్నీ దాటుకుని,మొత్తానికి సినిమా అంటే, అదీ హాల్లోకి వెళ్ళిచూడడం అంటే వైరాగ్యం పుడుతుంది. ఈ మధ్యన మా స్టేటస్ అమ్మా నాన్నల్లోంచి, తాతయ్యా,అమ్మమ్మా/నానమ్మాల్లోకి మారిన తరువాత, ఎప్పుడైనా వాళ్ళతో సినిమా హాలుకి వెళ్ళినప్పుడు, ఈ పాత జ్ఞాపకాలన్నీ, సినిమా రీళ్ళలాగ గిర్రున తిరుగుతూంటాయి!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–చెప్పులూ, బూట్లూ–2

Wed, 07/14/2010 - 13:18

    నిన్న బూట్లగురించి చెప్పుకున్న తరువాత, వాటి కజిన్స్ చెప్పులగురించి కూడా చెప్పుకోవాలిగా! మగాళ్ళకి మారోజుల్లో అవేవో ‘ఆకు చెప్పులు’ అని వచ్చేవి.మరి ఇంకేమైనా ‘కాయ,పండు,పువ్వు’ చెప్పులుకూడా ఉన్నాయేమో నాకైతే తెలియదు.ఒకటి మాత్రం నిజం. ఎటువంటి చెప్పేసుకున్నా సరే అది నిశ్చయంగా ‘ కరుస్తుంది’. ఈ కరవడం అనే పదం ఎక్కడినుండి వచ్చిందో కూడా తెలియదు. రెండు బొటనవేళ్ళ దగ్గరా,మడమ పైనా అయితే తప్పకుండా కరుస్తుంది.కొత్త చెప్పేసుకుని ఓ సారి బజారుదాకా వెళ్ళొద్దామని బయలుదేరిన, ఓ కిలోమీటరు దూరంలో, తన పని తాను చేసికుని పోతుంది.ఎలాగో, కాలు కొంచెం కొంచెం బయటకి పెట్టుకుంటూ, ఎలాగోలాగ కొంపకి చేరుకుంటాము.ఆ చెప్పులు తీసి అవతలపడేసి, అమ్మయ్యా అని ఓ నిట్టూర్పు విడిచి, ఆ కరిచినచోట రిపేరీ పని మొదలెడతాము.రిపేరీ అంటే మరేం లేదు,ఓ బ్యాండ్ ఎయిడ్ తీసికుని, ఆ కరిచిన చోట్లలో, సున్నం బొట్ల లాగ, పాచీలు వేసికోవడం.ఈ శస్త్రాస్త్రాలతో మళ్ళీ బయటకి వెళ్ళి, అలవాటయ్యేదాకా వాడితే, పాపం ఆ చెప్పూ కరవడం మానేస్తుంది.

   వచ్చిన గొడవల్లా ఈ చెప్పులతో ఏమిటంటే, చెప్పా పెట్టకుండా తెగూరుకుంటాయి.ఎక్కడా దగ్గరలో చెప్పులు కుట్టేవాడెక్కడా కనిపించడు.వాళ్ళనీ వీళ్ళనీ అడిగి, మొత్తానికి పట్టుకుంటాము.ఆ బొటనవేలు పెట్టుకునే రింగు తెగుతుంది, మొదట్లో.ఆ చెప్పుచూడగానే, ఆ చెప్పులుకుట్టే డాక్టరు వేసే మొదటి ప్రశ్న– బాటాదాండీ. అంటే అతనికీ తెలుసు, ఈ కంపెనీ చెప్పుల జీవితకాలం అంతేననీ, వాటికి ఆయుషు పోయడానికి, మనం ఈ చెప్పులుకుట్టేవాళ్ళకి, మహరాజ పోషకులౌతామనీ.
ఎంత డిస్కౌంటులో కొన్నా, డబ్బెట్టే కొన్నాం కదా. పోనీ ఆ కొట్టువాడిని వెళ్ళి అడుగుతే, మేము అప్పుడే చెప్పామండీ, సెకండ్ సేల్స్ చెప్పులకి గ్యారెంటీ ఉండదూ అని.వాడు చెప్పలేదూ అని తెలుసు మనకి, అయినా చేసేదేంలేదు.ఇంక ఈ చెప్పులుకుట్టే ఆసామీ,మనం చెప్పిన రింగుకే రిపేరీ చేస్తాడు. అతనికీ తెలుసు, మిగిలిన పార్టులు కూడా వీక్కూ అని.ఎలాగూ ఓ రెండురోజులుపోయిన తరువాత, ఇంకోచోట తెగుతుందీ, మన దగ్గరకి రాకేం చేస్తాడూ అని భరోసా.డాక్టర్లు చూడండి,మనకున్న రోగాలన్నీ ఒకేసారి చెప్పరు, దఫా దఫాల్లో చెప్పి, మనల్ని దివాళా చేయిస్తారు!

    ఇంక వర్షంలో వెడితే, ఈ చెప్పులతో వచ్చిన గొడవ ఇంతా అంతా కాదు.ఒక్కో అడుగూ వేస్తూంటే,చిందిన వర్షం నీరూ, బురదా,మన వెనక్కాల భాగం నుండి, తలమీదుగా ప్రయాణం చేసి, ముందర భాగంలో కూడా ఓ డిజైన్ తయారుచేస్తుంది.ఇంటికొచ్చిన తరువాత చివాట్లూ. ఓరబ్బరు బూటు కొనుక్కుంటే మీకేం పోయిందీ, ఈ దరిద్రపు చెప్పులేసికుని వర్షంలో వెళ్ళడం, బట్టలన్నీ తగలెసికుని నా ప్రాణం తీయడం అంటూ.

    కొద్దిరోజులకి, హవాయి చెప్పులనోటొచ్చాయి.అవీ అంతే కరవడంలో. పైగా వీటికి బొటనవేలు పెట్టుకునే రింగుండదు.కాలి బొటనవేలూ, రెండో వేలూ మధ్యలో కరిచి చంపుతాయి.ఏ రోడ్డుమీదెళ్ళేటప్పుడో పుటుక్కున తెగుతాయి. ఆ తెగిన చెప్పుకి
ఓ సూదిపిన్నీసు గుచ్చి కొంపకు చేరడం ( ఈ విషయం నా సూదిపిన్నీసుల టపాలో శ్రీసరస్వతుల శ్రీనివాస ఉమా శంకర్ గారు గుర్తుచేశారు, థాంక్యూ!). పోనీ అలాగని ఊరుకుంటామా, ఓ చెప్పులదుకాణానికి వెళ్ళి ఓ Strap తెచ్చుకోడానికి. అక్కడ ఈ Strap లు జతల్లెఖ్ఖనే ఇస్తారు.లేకపోతే మన తెలివితేటలకి, ఓ కాలికి పెద్దదీ, ఇంకోకాలికి చిన్నదీ వేసికుంటామనేమో.తెచ్చామండీ, దాన్ని హవాయి చెప్పులో దోపడం మళ్ళీ ఓ ప్రళయం. ఛస్తే దాంట్లో దూరదు, ఓ కంఠాణీ యో మరోటో తీసికుని, ఆ Strap కి చిల్లు చేసి, లక్షణంగా ఉన్న చెప్పుకి చిల్లుచేసి మొత్తానికి ఎక్కిస్తాము. అక్కడికి ఓ చిల్లయింది. ఇంకా రెండున్నాయి. నానా హైరాణా పడి ఓ చెప్పుకి పూర్తిచేస్తే చాలదుగా, ఆరోగ్యంగా ఉన్న రెండో చెప్పుకి కూడా మార్చాలిగా.ఈ కార్యక్రమం అంతా దేనికీ, మళ్ళీ కరిపించుకోడానికి, ఎందుకంటే ఈ Strap లు కొత్తవిగా, వాటి సరదా కూడా తీరొద్దూ? ఈ గొడవలన్నీ అఖ్ఖర్లేకుండా,ఆ హవాయి చెప్పుతెగినప్పుడే, ఏ రోడ్డు పక్కన చెప్పులుకుట్టే ఆసామీ దగ్గరకు వెళ్ళుంటే,అతనే ఆ తెగిన చెప్పుకే ఓ Strap వేసి పనికానిచ్చేవాడుకదా. అబ్బే మనమే తెలివైనవాళ్ళమనుకుని చేసే వెధవ పనులు ఇవి (Penny wise pound foolish) !
ఇలా బయటకెళ్ళినప్పుడల్లా ఇరుకులో పెట్టేస్తున్నాయని, వీటి Area of usage మార్చేసి, ఇంట్లోకి తెచ్చేశాము.ముందుగా, టాయ్లెట్లకీ,బాత్ రూంలకీ, ఇప్పుడిప్పుడే వంటింట్లోకీ.ఎంతదాకా వచ్చిందంటే, ఇంట్లో ఉండే పెద్దవారు కూడా వీటికి
‘మడి చెప్పుల హోదా ‘ ఇచ్చేశారు! ఏదో మరీ చూసేవాళ్ళకి బాగోదని, దీపం పెట్టే టైములోమటుక్కి, వాటిని తీస్తున్నారు!!

    ఇంక స్త్రీల చెప్పుల విషయానికొస్తే అవేవో,హీల్డ్, హై హీల్డూ.ఆ హైహీల్డ్ చెప్పులతో కిందపడకుండా ఎలా మానేజ్ చేస్తారో ఎప్పుడూ వింతే నాకు.అంటాం కానీ,మనలాటి బడుధ్ధాయిలని సంవత్సరాలనుంచీ మేనేజ్ చేయడం లేదూ?అలాగే ఇదీను.
నిన్న బూట్లగురించి చెప్పినప్పుడు,బ్రౌన్ రంగులో ఉండే కాన్వాసు బూట్లగురించి మర్చిపోయాను.అవి వాడినంత కాలం బాగానే ఉంటాయి, కొద్దికాలానికి, ఓ చిరుగు పడి, దాంట్లోంచి బుల్లి వేలు తొంగి చూడ్డం మొదలెడుతుంది.

    ఇంక చెప్పుల దుకాణం లోకి వెళ్ళినప్పుడు,కొట్టువాడికీ, మన తో వచ్చిన ఇంటావిడకీ జరిగే డయలాగ్గు బలేగా ఉంటుంది. ఓ పది పదిహేను రకాల డిజైన్లు చూసేక ఒకటి ఫైనలైజు చేస్తారు.‘ఓసారి అటూ ఇటూ నడిచి చూడు, లేకపోతే, నా ప్రాణం తీస్తావు తరువాత’అంటూ భర్తా, కొద్దిగా టైట్టయినట్లనిపిస్తోందీ అంటూ భార్యా, ఫరవాలేదు మేడం, వాడగా వాడగా లూజవుతుందని కొట్టువాడూ, యుగయుగాలనుండీ చెప్తూనే ఉన్నారు. అయినా సరే అది లూజవదూ,అలాగని అవతల పారేయలేమూ.ఏమిటో వెళ్ళిపోతూంటుంది జీవితం !!!!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–చెప్పులూ, బూట్లూ

Tue, 07/13/2010 - 13:14

    మా చిన్నప్పుడు,స్కూల్లో కొద్దిగా పైక్లాసులకొచ్చేదాకా, చెప్పులూ వగైరాలుండేవి కావు. బూట్లసంగతి దేముడెరుగు.నాకైతే ఉద్యోగం ఇంటర్వ్యూ కెళ్ళినప్పుడు, మొదటి బూట్లజత కొన్నారు. అదీ లెదరుది, నడుస్తూంటే చప్పుడయ్యేది. సినిమాల్లో విలన్లూ, డాక్తర్లూ వచ్చినప్పుడు వేసికునేదిలా అన్నమాట!జీవితంలో అదేదో పైమెట్టుకి వెళ్ళేమనే భావన వచ్చేది! పైగా ఆరోజుల్లో, లెదరు బూట్లు కొనుక్కుంటే, దానికి ఏ రోడ్డుపక్కనుండేవాడిచేతో నాడాలోటీ ! మామూలుగా, గుర్రాలకీ, ఎడ్లకీ వేస్తారు ఈ నాడాలు, మరి మనం ఎందుకు వేయించుకునేవాళ్ళమో నాకు తెలిసేదికాదు. ఇప్పటికీనూ! బహుశా మనం నడిచేటప్పుడు చప్పుడువస్తుంద్నేమో. ఈ బూట్లలో క్రేపు సోల్ అనేదొకటుండేది. వాటిని మామూలుగా, మన స్కూళ్ళ పరీక్షల్లో వచ్చే వాచర్లేసికునేవారు. చప్పుడు చెయ్యకుండా, మెల్లిగా వచ్చేసి కాపీలు చేసేవాళ్ళని ఠక్కున పట్టేసేవారు!
ఈ నాడాలేసికున్న బూట్లతో నడిస్తే,చప్పుడూ అదీ బాగానే ఉండేదికానీ, ఏ గచ్చుమీదైనా నడిచినప్పుడు ఝూం అని జారి, క్రింద పడి నడుం విరిగేది! వీట్లకి తాళ్ళూ, అవేనండి లేసులు.ఈ బూట్లతో ఎవరింటికైనా వెళ్తే, మరీ వాటితో లోపలకి వెళ్ళంకదా, గుమ్మం బయటే వదిలేసి,కొంతమంది సాక్సలాగే ఉంచేసికుని ఇంట్లోకి వెళ్తారు. కానీ దీంట్లో కూడా ఓ అసౌకర్యం ఉంది.కాళ్ళూ చేతులూ కడుక్కురమ్మని ఏ బాత్ రూంకో వెళ్ళమన్నప్పుడు, సింకులో చేతులు కడుక్కోడం వరకూ బాగానే ఉంటుంది, కాని ఆ బాత్ రూంలో కింద ఉన్న నీళ్ళతో సాక్సు తడిసిపోతాయి.మింగా లేమూ, కక్కాలేమూ, అలాగని ఆసాక్స్ తీసేసి మరీ జేబులోకూడా పెట్టుకోలేము.ఎవరికీ కనబడకుండా జేబులో కుక్కేసి, ఏదో పని కానిచ్చేస్తాము.ఇంక బయటకి వెళ్ళి అక్కడ పెట్టుకున్న బూట్లు( లేసులున్నవి) వేసికునేటప్పుడు చూడాలి అవస్థ! ఒంటికాలిమీద నుంచుని, ఆలేసులెవో కట్టుకునేటప్పడికి ప్రాణం మీదకొస్తుంది.పాపం ఆ ఇంట్లోవాళ్ళంటారు,’ఫర్వాలేదండీ, లోపలకొచ్చి కుర్చీలో కూర్చుని వేసుకోండీ’అంటారే కానీ, మొత్తం ఫామిలీఅంతా గుమ్మంలోనే నిలబడి ఛస్తే కదల్రు! పైగా బయట భరతనాట్యం( బూట్లు వేసికోడానికి)చేస్తున్న ఆసామీ, జేబులోంచి, తడిసిన సాక్సోటి తీసికుని వేసికోవాలి. ఈ గోలంతా భరించలేక,జీవితంలో మళ్ళీ తాళ్ళున్న బూట్లేసికోకూడదని ఓ శపథం చేస్తాడు.

    ఈ బూట్లు కొనుక్కోడంతో అవదు.వాటికి వారానికో, పదిరోజులకో పాలిషోటి చేయించుకోవాలి. ఆ రోడ్డుపక్కన కూర్చునేవాడిదగ్గరకు వెళ్ళగానే, అతనో అక్కడేఉండి, అశేష ప్రజానీకంచేత వాడబడ్డ
ఓ హవాయి చెప్పుల
జతోటిచ్చి, మన్ని ఆ పక్కనే కూర్చోమంటాడు.అక్కడ కూర్చునుండగా ఏ తెలిసినవాడేనా పలకరిస్తాడేమో అని భయపడుతూ,ఎటో చూస్తున్నట్లుగా ఓ పోజు పెట్టేసి, కూతవేటు దూరంలో సెటిల్ అవుతాడు.ఇంక సదరు రోడ్డుపక్కనేఉండే అతను, ఏవేవో డబ్బాలు తీస్తాడు. ఏవేవో కలిపి, మన బూట్లకి పులిమేసి, ఆ బూట్లని ఓ పక్కకి పెట్టేస్తాడు.ఈ లోపులో ఇంకో బేరం,ఏ తెగిన చెప్పుకో కుట్టేయమనో, లేకపోతే ఏ చిరిగిపోయిన బ్యాగ్గుకో కుట్టేయమనో వచ్చే వివిధరకాల గిరాయికీల్నీ చూసుకుంటాడు.మన బూట్ల పాలిష్ తో అతనికి రోజెళ్తుందా ఏమిటీ? ఒకవిషయం మాత్రం గమనించాలి, మనబూట్లు మాత్రం తళతళామెరుస్తాయి, కొత్త పెళ్ళికూతురు/కొడుకు లాగ!
ఇంక దేవాలయాలకెళ్ళినప్పుడు,అక్కడ బయట ఓ బోర్డుంటుంది ‘ఉచిత పాదరక్షలుంచే స్థలమూ’అని. అతనికి మన బూట్లు, పెళ్ళికూతురిని అప్పగింతలు పెట్టినట్లుగా అప్పగించి,విషణ్ణవదనంతో లోపలికి వెళ్తాము.వెళ్ళేటప్పుడు, ఓ చిన్న అట్టముక్కమీదో నెంబరేసిన,ఓ టొకెనిస్తాడు.అది చూపించకపోతే, దేశప్రధానమంత్రైనా సరే మన బూట్లివ్వడు!లోపలికి దైవ దర్శనం చేస్తున్నంతసేపూ, మన దృష్టంతా ఆ బూట్లమీదా, తత్సంబంధిత టోకెన్ మీదే.ఇంక దేముడిగుళ్ళోకెళ్ళడం ఎందుకో? ఉచితం అన్నాడు కదా అని మన బూట్లు తీసికుని వచ్చేస్తే కుదరదు. వాడిచేతిలో ఓ రూపాయో రెండో పెడితేకానీ, మన బూట్లివ్వడు.ఆ మాత్రందానికి ఉచితం అని రాయడం ఎందుకో!

    అన్నిటిలోకీ డేంజరస్ ఏరియా రైలు ప్రయాణాల్లో. ఏ పైబెర్తో దొరుకుతుంది, మరీ మనబూట్లు,నెత్తికింద పెట్టుకోడానికి సిగ్గూ, మొహమ్మాటమూనూ.క్రింది బెర్తు కింద మిగిలిన అయిదుగురి బూట్లూ, చెప్పులా కంపెనీలో వదిలేస్తాం.ఓ రాత్రివేళ ఏ టాయిలెట్టుకో వెళ్ళాలని,నానా తిప్పలూ పడి,క్రిందకు దిగి, మన బూట్లకోసం వెదికితే ఛస్తే కనబడవు.అదీ ఇదీ తడిమి, అక్కడ పడుక్కున్నవాళ్ళకి, మన చేతులేమైనా తగిలాయా, మన శీలాన్ని శంకిస్తారు అదో అప్రదిష్టా!లైటేసి వెతుక్కుందామంటే ఏ పసిపిల్లో లేస్తే, మన్ని తిడతారు.చివరకి ఏ సూట్కేసు వెనక్కాలో కనిపిస్తుందోటి, రెండోది ఇంకోవైపు ఎక్కడో దొరుకుతుంది.ఇంతకంటె ఏమీ వేసికోకుండావెళ్తే హాయనిపిస్తుంది, ఎవడు చూడొచ్చాడూ?

   ఈ గుళ్ళల్లోకి వెళ్ళేవాళీమధ్యన ఓ కొత్త ఫార్ములా కనుక్కున్నారు. చెప్పులతో వెళ్ళకూడదుట, కానీ సాక్సేసికుని ప్రదక్షిణాలు చేయొచ్చట!ప్రతీ దానికీ ఓ షార్ట్ కట్టూ!ఒక్కో ఇంట్లో, మనవీ,ఇంటావిడవీ, పిల్లలవీ అన్నీ కలిపి ఓ బాటా షాప్పులా తయారవుతున్నాయి.ఇదివరకటిలా కాదుగా, రన్నింగ్ షూ, జాగ్గింగు షూ, అఫీసుషూ,పార్టీ షూ, వీటికి సాయం పిల్లలకి, మామూలు స్కూలుకెళ్ళే షూ, పీ.టీ.షూ.వెరసి ఓ పాతిక ముఫై జతలదాకా తేల్తాయి!

    మా రోజుల్లో కాన్వాసు తెల్లవి బూట్లకి, పాలిషులూ వగైరా ఉండేవికావు.వారానికోసారి శుభ్రంగా ఉతికేసి, ఎండలో ఆరబెట్టేసి, ఏ సున్నం బట్టీలోదో ఎండగా మిగిలిన సున్నంలో నీళ్ళు కలుపుకుని, దాన్ని పట్టించేసి, మళ్ళీ ఎండ కార్యక్రమం మొదలెట్టడమే!ఇల్లూ, వళ్ళూ సున్నమే!ఇంటికి సున్నాలేసేవాడిలా! ఇప్పుడైతే అదేదో ‘కీవీ’యో ఇంకో సింగినాదమో తెల్ల పాలిష్ డబ్బాలొచ్చాయి.ఆ డబ్బామీదో పుల్లా, దానికి చివరగా ఓ స్పాంజిముక్కా, దాన్ని ముంచుకుని బూట్లకి పట్టించేయడం.ఆ స్పాంజిముక్క ఒక్కోప్పుడు, మనల్ని వీధులో పెట్టేస్తూంటుంది. ఆ ముక్క కాస్తా, ఆ డబ్బాలోకి ఊడిపోతుంది. మళ్ళీ మన సున్నాల కార్యక్రమం షురూ!దాంట్లో ఉన్న దాన్ని అరచేతిలో పోసుకుని, ఇంకో వేలితో ఆ బూట్లమీద రాయడం!

   ఇవన్నీ కాకుండా, రైన్ షూసోటీ.అవి రబ్బరుతో చేసినవి, ఓ సీజను దాటితే చిరుగుపట్టేసేవి.ఆ తరువాత గంబూట్లూ.ఆ రోజుల్లో మోకాళ్ళదాకా ఉండేవి. అది ఓ పర్టిక్యులర్ పోజులో తొడిగితేకానీ పట్టేవికావు.వర్షంలో ఏ మోకాల్లోతులోనో వెళ్ళేటప్పుడు, దాంట్లోకి ఏ పురుగో పుట్రో చేరిందా అంతే సంగతులు!
ఇవండీ నాకు గుర్తొచ్చిన కబుర్లు.ఇంక చెప్పుల సంగతులు ఇంకో టపాలో !!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– పలుకే బంగారమాయెరా!!

Mon, 07/12/2010 - 14:38

    ఇన్నాళ్ళకి టి.వీ. లో ఓ మంచి కార్యక్రమం, చూసే/వినే అవకాశం వచ్చింది.శ్రీ ఎం.వి. అప్పారావు గారి ధర్మమా అని,ముందుగానే తెలిసింది.ఆయన టపాలో వ్రాసేముందరే, నాకు ఫోను చేసి చెప్పేశారోచ్ !పెందరాళే భోజనం చేసేసి, టి.వీ. ముందర తిష్టేసేశాను. మా ఇంటావిడతో చెప్పేశాను, ఈవేళ టి.వీ. నాదీ అని!పాపం తనకీ ఇష్టమే అనుకోండి,అందుకోసమని తన సీరియల్స్ త్యాగం చేసేసి, తనూ సెటిలయిపోయింది. ఈ ఉపోద్హాతమంతా దేనికో తెలిసిందా, ‘ఈ టి.వీ లో ఈవేళ ప్రసారమైన ‘పాడుతా తీయగా’ కార్యక్రమం గురించి. అందులో పాడే పాటలు ఎన్నేన్నో కార్యక్రమాల్లో విన్నాము. నాకు వాటిమీదేం పేద్ద ఆసక్తిలేదు. అలాగని బాగా పాడరనికాదు, విన్నవే మళ్ళీ మళ్ళీ వినాలంటే అంత ఆసక్తిలేదు.నాకున్న ఆకర్షణల్లా ఈ రోజు కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వచ్చిన నా దేముళ్ళు-శ్రీ బాపూ, శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గార్లు ( నరనారాయణులు)!

   శ్రీ బాలూ గారి పరిచయ వాక్యాలే అమోఘం.వారి గురించి శ్రీ బాలూ చెప్పినవి అక్షరలక్షలు!అంతా చెప్పి,వీళ్ళిద్దరూ ఒక్కమాటా మాట్లాడరనే కండిషన్ మీదే వచ్చారు అనడంతోటే, అయ్యో అనిపించింది. శ్రీ బాపు గారి గీతలు చూశాము, శ్రీ రమణగారి రాతలు చదివాము, కొంచెం మాట్లాడితే వాళ్ళ సొమ్మేం పోయిందమ్మా అనుకున్నాను! అంతా బడాయీ( శ్రీ బాపుగారి భాషలో!).అయినా నాకు ఎక్కడో అనిపించింది, బాలూ గారు వీళ్ళని అలా వదిలిపెట్టరూ అని! ఎక్కడో అక్కడ మొహమ్మాటం పెట్టేసి, ఆ మైక్కురొంతా చేతిలో పెట్టేస్తే, ఏం చేస్తారేటీ? అఛ్ఛంగా అలాగే అయ్యింది!

   ఏదో మొదటి గాయకి పాట పాడిన తరువాత,’పోన్లెండి, మీరు ఎలాగా మాట్లాడరూ, పాటెలాగుందోనైనా చెప్పండి’ అనగానే, పెద్ద స్టైలుగా ఓసారి తలూపేశారు.ఇంక ఆతరువాత పాడిన పాటల గురించి, ఏవేవో ప్రశ్నలేసేసరికి,ఊరుకోలేక, శ్రీ బాపు గారు ,కొద్దికొద్దిగా మాట్లాడారు.ఆ పాటల విడియో క్లిప్పులు పెట్టి, మొత్తం కార్యక్రమానికే ఓ విలక్షణమైన శోభ తెచ్చేశారు.శ్రీ బాపూగారైతే కొంచమైనా తన కండిషను ( మాట్లాడనని) సడలించారు. శ్రీ రమణ గారు మరీ పిసినారండి బాబూ
( మాటలలో). మాట్లాడితే ముత్యాలు రాల్తాయన్నట్లుగా మరీ బెట్టుసరి చేసేశారు!
ఎలాగోలాగ, శ్రీ బాలూ గారి ధర్మమా అని శ్రీ రమణ గారిచేత మొత్తానికేమైతేనే, నోరు విప్పించారండి బాబూ! ఏమిటో ఆయన రాతలకీ, మాటలకీ పోలికే లేదు
అలాగనినాకనిపించింది.మరీ సీరియస్సూ. మరి అలాటాయన అంత హాస్యంగా ఎలా వ్రాస్తారో? ఆయన్ని ఇలా చూస్తే, ‘ ఈయనా, శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారా ‘ అనిపించిందంటే ఒట్టు!సరసత్తోడు!!!

    ఈ కార్యక్రమానికి స్క్రిప్ట్ వ్రాసిన వారికి,అందులోనూ పరిచయవాక్యాలు, ( వ్రాసిన వారికీ అని ఎందుకన్నానంటే, శ్రీ బాలు, ఓ కాగితంలో ఉన్నది చదివారు) హార్దిక అభినందనలు.9.30. కి మొదలెట్టిన కార్యక్రమం, 11.10 దాకా జరిగినా, ఏమీ చిరాకనిపించలేదు.ఒక్క యాడ్లు తప్పించి. ఒక్కో యాడ్డూ మరీ అన్నిసార్లు చూపించాలా? ఏమో వాళ్ళే టి.వీ. లకి అన్నదాతలు కాబట్టి చూపించాలేమోలెండి.ఏదో పంటికిందరాయిలా,ఆ యాడ్లు వదిలేస్తే, కార్యక్రమం సూపర్!

    ఈ కార్యక్రమం రెండో భాగంలోనైనా శ్రీ బాపూ, శ్రీ రమణగార్లు,మరీ అంత స్ట్రిక్ట్ గా ఉండకుండా,ఇంఖొంఛెం నోరువిప్పి,మనకి విందు చేస్తారని ఆశిద్దాం.బెల్లం మిఠాయి తిన్నంత సంతోషమయింది, నాకైతే!


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-సూది పిన్నీసులు

Fri, 07/09/2010 - 13:00

    ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన వస్తువుల్లో సూదిపిన్నీసు ఒకటి.అంత బుచ్చిది అంతముఖ్యమా అనుకోవద్దు. దాని importance అది అవసరం వచ్చి, దొరకనప్పుడు తెలుస్తుంది. చిన్నప్పుడు బయట తిరిగేటప్పుడు,కాల్లో ఓ ముల్లు గుచ్చుకుందనుకోండి, ఇంటికి కుంటుకుంటూ రాగానే, మనమొహం చూడగానే తెలుస్తుంది, కాల్లో ఏ తుమ్మముల్లో దిగిందని. అమ్మ, ఆకాలిని, తనతొడమీద పెట్టేసికుని, కొంచెం ఉమ్మి వ్రాసి, సూదిపిన్నీసుతో ఓసారి అటూ ఇటూ కెలికి,
ఠక్కున తిసేస్తుంది. అప్పటిదాకా విపరితమైన సలుపు పెట్టిందల్లా, హూష్ కాకీ అయిపోయేది. ఆరోజుల్లో ఏమైనా చెప్పులుండేవా కాళ్ళకి. ఇప్పుడో వంటింట్లోనే చెప్పులేసి తిరిగేస్తారు.అందువలన, ముళ్ళూ, సూదిపిన్నీసులూ ఇప్పటివారికి అంత తెలియకపోవచ్చు!

    పైగా ఈ సూదిపిన్నీసులుకి multipurpose utility ఉంది.పైజమా నుంచి,పరికిణీ దాకా బొందెక్కించాలంటే ఇదే కావాలి.వాటిల్లో సైజులోటుంటాయి. శారీ కి పెట్టుకోడానికీ, పైట జారిపోకుండా పెట్టుకోడానికీ ఇప్పటికీ చాలామంది ఇవే వాడతారు, మార్కెట్ లో శారీ పిన్నులేవో వచ్చినా సరే!ఈ టూత్ పిక్కులూ అవీ రానప్పుడు, పళ్ళల్లో చిక్కుకున్న శనగపప్పుబద్దలు ఎలా తీసీవాళ్ళూ? వీటితోనే! ఖాళీ గా కూర్చుంటే ఏ చెవిలోనో దురద పెడితే,ఏం చేస్తారమ్మా? చెవిలో అలాటివి పెట్టుకోడం తప్పే, కాదనం, కానీ పూర్వపురోజుల్లో ఆ మెడికల్ సలహాలెవడు పాటించేడూ?

    ఈ సూదిపిన్నీసులు బయటెక్కడైనా వదిలామో ఎవరో ఒకరు హడప్ చేసేస్తారు. అందుకోసమని మగవాళ్లు ఏ జంధ్యానికో, మొలతాడుకో పెట్టుకునేవారు. ఆడవారైతే ఏ మెళ్ళో ఉన్న ఏ గొలుసుకో, చంద్రహారానికో తగిలించేవారు.గుర్తుండే ఉంటుంది, ప్రయాణాల్లో ఏ బ్యాగ్గుకో ఓ క్లిక్ తాళం వేయడం, ఆ తాళాలు ,పెద్దగుత్తిలో పట్టవు. అందువల్ల, ఆ బుల్లి బుల్లి తాళం చెవుల్ని, ఓ సూదిపిన్నీసుకి తగిలించేసి,ఆ పిన్ను రొంతా ఇంటి ముఖియా గారు, పైన చెప్పిన దేనికోదానికి తగిలించుకునేవాడు. ప్రయాణాల్లో, ఆ బ్యాగ్గు తెరవవలసిన అవసరం వచ్చిందా, ఇంక చూసుకోండి, ఆబ్యాగ్గైనా ఒళ్ళో పెట్టుకోవాలి, లేదా ఆయనైనా కింద కూర్చుని తాళం తీయాలి! ఇంకో గతిలెదు.

   ఇప్పటికీ పెళ్ళిళ్ళల్లో వియ్యాలారికి ఏది పెట్టినా పెట్టకపోయినా, సూదిపిన్నీసుల ప్యాకేట్లు మాత్రం మర్చిపోకూడదు. పెళ్ళివారు తలలో పువ్వులు పెట్టుకోడం దగ్గరనుండీ ఈ సూదిపిన్నీసవసరం ఎంతో ఉంది.ఇప్పుడు మార్కెట్ లో వస్తున్న, సూదిపిన్నీసులు అంత షార్ప్ గా ఉండడం లేదు. ఇంకోటండోయ్ మర్చిపోయాను,రిపబ్లిక్కు దినోత్సవం, స్వాతంత్రదినోత్సవం లాటివి వచ్చినప్పుడు,చిన్న పిల్లలు చొక్కా జేబులకి, జాతీయ జండా తగిలించుకుంటూంటారు. అప్పుడు ఆ పిన్నీసు లేకపోతే ఎక్కడ తగిలిస్తారూ?ఇప్పుడంటే, అవేవో ఐ.డీ లూ అవీ మెళ్ళో ఓ తాడుకట్టి వేసికుంటున్నారు కానీ, పాతరోజుల్లో బ్యాడ్జీలకి పిన్నీసులే పెట్టేవారు. అలాగే మనం వేసికునే పాంటు బొత్తాం ( ఆరోజుల్లో జిప్పులుండేవికాదుగా) ఊడిపోతే,
సూదిపిన్నీసే మన మానం కాపాడేది! మీకెవరికైనా ఇంకా దాని ఉపయోగాలు తెలిస్తే చెప్పండి.

   ఇదే Family కి చెందినవి, సూదీ, దబ్బనం, కంఠాణీ, గుండుసూదీ.బట్టలు కుట్టుకోడానికి సూదీ దారం,కొబ్బరికాయలు కట్టుకోడానికీ,బస్తాలు కుట్టుకోడానికి దబ్బనం,పురుకోస, పుస్తకాలు కుట్టుకోడానికి కంఠాణీ, ట్వైను దారం.ఇంక కాగితాలు ఒబ్బిడిగా పెట్టుకోడానికి గుండుసూదులూ.నా ఫ్రెండో సర్దారుండేవాడు, అతను మా అఫీసుకెప్పుడొచ్చినా, పిన్ కుషన్ లో ఉన్న గుండుసూదులు, అటూ ఇటూ చూసి, తీసేసికుని, తన టర్బన్ లో పెట్టేసికునేవాడు!అప్పుడర్ధంఅయేదికాదు
ఆ తరువాత పిన్ అవసరం వచ్చి చూస్తే ఒక్క పిన్నూ దొరికేదికాదు! అమ్మ సర్దారూ అనుకున్నాను!

   ఇప్పుడంటే స్టాప్లర్లూ అవీ వచ్చాయికానీ, ఇదివరకు ఈ గుండుసూదులే lifeline !ఇదివరకే కాదు, ఇప్పటికీ బ్యాంకుల్లో చెక్కులు స్టేపుల్ చేయనివ్వరు, పక్కనే ఆ గుండుసూదులుకూడా పెడుతూంటారు.
అందుచేత ఈ పిన్నీసులకి Hall of Fame లో చాలా ముఖ్యమైన స్థానం ఉంది.


Categories: Middle

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-కొంపా గోడూ -5

Thu, 07/08/2010 - 13:38

    ఊరికి దూరంగా ఇల్లులాటిది కట్టుకుంటే, దానికి సెక్యూరిటీ ఉండదు.ఎంతరావాలనుకున్నా, చుట్టాలు కానీ, స్నేహితులు కానీ రావడానికి ఆలోచిస్తారు.రావాలని మనసే ఉండాలి కానీ, ఎంత దూరమైనా వస్తారు వచ్చేవాళ్ళనొచ్చు.It is more a matter of opinion. మాకు ఓ స్నేహితుడున్నారు పూణె లో, ఆయనో డాక్టరు, ఆయన ఊరికి దూరంగా ఓ బంగళా కట్టుకున్నారు, ఒకసారి ఆయనకి, గుండె నొప్పి వచ్చి, హాస్పిటల్ లో చేర్చేలోపలే పోయారు.అలాగని ఇదో కారణం చెప్పి,ఊరికి దూరంగా ఇళ్ళు కట్టుకోకూడదూ అంటే ఎలాగా అనొచ్చు. నా ఉద్దేశ్యమేమిటంటే, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సదుపాయం దొరకదని. దీనికి ఇంకోళ్ళ వాదనేమిటంటే, ఆసుపత్రులు దగ్గరలో ఉన్నవాళ్ళెవరూ చనిపోలేదా అని. అది మన తలరాతమీదాధఅరపడిఉంటుంది. ఇక్కడ by choice మనం ఓ ఇల్లు కట్టుకుంటున్నాము. అదీ తేడా!

    ఓపికున్నంతకాలం, ఇల్లు అనేదాన్ని శుభ్రంగా ఉంచుకోగలుగుతాము.వయస్సు పెరిగే కొద్దీ అది కష్టమైపోతుంది.కిందటి టపాలో చెప్పిన పెద్దవాళ్ళు, నగరంలో ఊరికి దూరంగా బాధలు పడలేక, స్వంత ఊరికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడైనా కొడుకూ, కోడలూ రమ్మన్నా కానీ, ‘ ఏదో మా జీవితాలు ఇలాగే వెళ్ళిపోనీయ్ నాయనా, ఇక్కడే పుట్టాము, ఇక్కడే మట్టిలో కలిసిపోనీ’ అంటారు.ఎవరైనా ఊళ్ళొవాళ్ళు, ‘అబ్బ మీ పనే హాయండీ, కొడుకూ,కూతురూ ఒకే ఊళ్ళోనే ఉంటునారూ’ అన్నప్పుడల్లా, ఓ వెర్రి నవ్వోటి నవ్వేస్తారు!కొడుకు ఊరికో మూలా, కూతురు ఇంకో మూలా. మళ్ళీ ఎడ్రెస్ లు మాత్రం ఫలానా ఫలానా హైదరాబాద్-500004 ఒకళ్ళూ, హైదరాబాదు-500072 ఇంకోళ్ళూ. అది ముంబై అయినా ఒకటే, పూణె అయినా ఒకటే !

   ఇన్ని తిప్పలూ పడి సెపరేట్ ఇల్లెందుకూ అనుకొని, కొంతమంది, ఊరికి దూరంగా ఎపార్ట్ మెంట్లు కొనుక్కుంటారు. ఊరికి మధ్యలో కావాలంటే మనక్కావలిసిన రేట్లలో దొరకవు మరీ.అక్కడా ఊరు పెరుగుతుంది. పెరక్కెక్కడ పోతుంది?కానీ,ఆ పెరిగేవరకూ మనం పడే బాధల సంగతీ? ఎప్పుడో పెరుగుతుందీ అనుకుంటూ కూర్చోడం కన్నా, హాయిగా ఊరికి మధ్యలోనే ఓ అపార్ట్మెంట్ అద్దెకి తీసికోడంలో ఉన్న హాయి ఇంకెక్కడా లేదని నా ఉద్దేశ్యం.అపార్ట్ మెంట్లలో, ఓనర్లందరూ విలన్లనుకోకూడదు. మా మామగారు, తణుకు లో శుభ్రంగా ఇల్లు కట్టుకుని, పాపం విశాఖపట్టణం లో, కొడుకు అద్దెకుంటున్న ఇంటిలో పోయారు.మామూలుగా ఉండే ఓనర్లలా కాక, ఆ ఇంటాయన, బాడీ ని వాళ్ళు అద్దెకుంటున్న పోర్షన్ లోనే ఉండనిచ్చారు. నే చెప్పేదేమిటంటే మన అదృష్టాన్నిబట్టుంటాయి ఇలాటివన్నీనూ.
అద్దెకు ఉంటే ఇంకో హాయేమిటంటే, ఎప్పుడు నచ్చకపోతే అప్పుడు ఇంకో ఇంటికి మారిపోవచ్చు, ఇప్పటి వాళ్ళు ఉద్యోగాలు మార్చడం లేదూ?అలాగే.స్వంతిల్లున్నవాడు, నచ్చినా నచ్చకపోయినా, చచ్చినట్లు తన కొంపనే పట్టుకు వేళ్ళాడాలి!

   నేను,తణుకు లో ఓ ఇల్లుకట్టుకుని, ఎందుకు అమ్మవలసివచ్చిందంటే, పిల్లలకి దూరంగా ఉండలేమూ,పోనీ అలాగని, మన తరువాత అబ్బాయేమైనా అక్కడికెళ్ళి సెటిల్ అవుతాడా అంటే అదీ లేదు.పూణే లో పుట్టి పెరిగి, అక్కడకెళ్ళేం చేస్తాడూ? పైగా ఎవరికో దానం ఇచ్చినా ఇచ్చేస్తాడు. అదేదో మేము బ్రతికుండగానే అమ్మేసుకుంటే పోలేదూ అనుకుని, నానా తిప్పలూ పడి అమ్మేశాము.అమ్మగా వచ్చిన డబ్బుకి ఇంకొంత అప్పుచేసి, ఓ రెండు బెడ్రూమ్ములది, ఇక్కడ తీసికున్నాను. అది చిన్నదౌతోందని, దాన్నమేసి ఓ మూడు బెడ్ రూమ్ములది, ఏక్ దం ఊరికి మధ్యలో కొన్నాము.కిందకు దిగితే, కొట్లూ,బ్యాంకులూ, రైల్వే స్టేషనూ ఒకటేమిటి అన్నీ దగ్గరే. ఎవరొచ్చినా ఒకటే మాట, అబ్బ ఇంత మంచిలొకాలిటీ లో ఎలా దొరికిందండి బాబూ అని. అది మేం చేసికున్న అదృష్టం!

    హాయిగా తిని కూర్చోక,గోదారీ గట్టుందీ,గట్టుమీదా చెట్టుందీ ... అంటూ, ఓ ట్రక్కుడు సామాన్లేసికుని, రాజమండ్రీ లో ఓ ఎపార్ట్మెంటు అద్దెకు తీసికుని, హాయిగా ఓ ఏణ్ణర్ధం అక్కడ ఠింగురంగా అనుకుంటూ ఉన్నాము.మా కోడలు,సెకండ్ డెలివరీ కోసం, తిరిగి పూణే వచ్చాము. డిజైనర్ ఫ్లాట్ లో, మా ట్రక్కుడు సామాన్లెక్కడ పడతాయీ, అందుకోసమని, మా అబ్బాయిని, సెంటిమెంట్లేమీ పెట్టుకోకు నాయనా అని చెప్పి, హాయిగా అమ్మాయి ఇంటికీ, మా ఇంటికీ మధ్యలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసికుని ఉంటున్నాము. పిల్లలకి దగ్గరలోనే. మా ఇద్దరిలో ఎవరికి ఏ రోగం రొచ్చూ వచ్చినా, పిల్లలు దగ్గరలోనే ఉన్నారు.స్వంత ఇంటి కలా తీరింది,మా స్పేసు మాకుంది.పిల్లలకి వాళ్ళ స్పేసు వాళ్ళకిచ్చాము. ఎప్పుడు వాళ్ళకి అవసరం వచ్చినా మేము రెడీ.మాకేమొచ్చినా వాళ్ళు తట్టుకోలేరు, మొన్న కాలు బెణికేటప్పడికి,మా ఇంటికి వెళ్ళి సేవలు చేయించుకోలేదూ? ప్రాణానికి హాయిగా ఉంది. ప్రతీ వారం పిల్లలొస్తారు, స్వంత ఇంట్లో ఉండకుండా, ఇదేమిటీ అనొద్దు.స్వంత ఇల్లొకడుండడం దేనికో మొదట్లోనే చెప్పాను !ఓ సారి ఈ సీరీస్ లో మొదటి భాగం మొదటి పేరా చూడండి.

    అందువల్ల, స్వంత ఇల్లూ ఉంది, అద్దె ఇల్లూ ఉంది.Best of both worlds. అవ్వా ఉంది బువ్వా ఉంది. స్వంత ఇల్లు లేదే అని ఊరికే బాధ పడిపోకండి. హాయిగా ఊరికి మధ్యలో అపార్ట్ మెంటోటి,అద్దెకి తీసికుని హాయిగా ఉండొచ్చు.ఎప్పుడు నచ్చకపోతే ఎప్పుడు మార్చేయొచ్చు.No sentiments. No allegiance !! ఏదైనా మన mindset బట్టి ఉంటుంది.మరీ బోరు కొట్టేశానా?


Categories: Middle