http://sureshkadiri.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స
Updated: 1 min 47 sec ago

ఏ విషయమైనా సమగ్రంగా నేర్చుకోవడానికి వేదాలు చెప్పిన పద్దతి చూడండి. ఎంత బాగుందో!

Thu, 07/29/2010 - 08:30
సాధారణంగా వేదమంత్రం ఉద్దేశ్యాన్ని గ్రహించడానికి ఆరు పద్దతులు ఉన్నాయి. ఆ ఆరు పద్దతులనే మనం నిత్యజీవితంలో కూడా ఒక విషయాన్ని నేర్చుకోవడానికి, అధ్యయనం చేయడానికి ఉపయోగించుకోవచ్చు.

ఆ పద్దతులు ఏంటంటే ఉపక్రమం, ఉపసంహారం, అభ్యాసం, అపూర్వత, ఫలం, అర్థవాదం, ఉపపత్తి.


ఉపక్రమమంటే ప్రారంభం. ఉపసంహారమంటే చివర. మొదటి పద్ధతి ఈ రెంటినీ గమనించటం - దీనినే ఉపక్రమ - ఉపసంహార పద్ధతి అంటారు. ఈ రెండూ ఒకే విషయం గురించి చెప్తే మొత్తం విషయమదేనని గ్రహించవచ్చు.


అభ్యాసమంటే ఒక విషయాన్ని పదేపదే చెప్పటం లేక వల్లెవేయటం లేక మననం చేయటం.


ఏ వ్యాసంలోనైనా ఒకే విషయం గురించి పదే పదే చెప్తూంటే విషయం యొక్క సారాంశమదేననీ, మనస్సుకి బాగా హత్తుకోవటానికే తిరిగి తిరిగి దాని ప్రస్తావనే జరుగుతోందని గ్రహించవచ్చు.
అపూర్వత అంటే అంతకు పూర్వం చెప్పబడనిది అని అర్థం. అంటే విషయసారాంశమదే నన్న మాట.


''ఉపపత్తి'' అంటే విషయం గురించి చెప్పి ఆ విషయం యొక్క మూలమూ, ఉద్దేశమూ, ఔచిత్యమూ గురించి తెలుసుకోవడం. వీటి వల్ల ఆ విషయం స్పష్టమవుతుంది.


అర్థవాదం అంటే విషయాన్ని అనేక కోణాలలో విషయాన్ని చర్చించడం. వివిద రకాలుగా అర్థవంతమైన వాదాలు చేసుకోవడం.


'ఫలం'' అంటే ప్రతిఫలం. ''ఈ విధంగా చేస్తే ఈ ఫలితం లభిస్తుంది'' అనటం లాంటిదన్నమాట. అంటే మనం నేర్చుకోవలసినదాని వైపు లేక పొందవలసినదాని వైపు మనలను నడిపించటం. దీనిని ''ఫలం'' అంటారు.



Categories: Left

వేదాల ముందు,వెనుకలను నిర్ణయించడానికి నేటి పరిశోధకుల ప్రామాణికత్వం ఏంటి?

Wed, 07/28/2010 - 08:30
నేటికాలపు పరిశోధకుల దృష్టిలో ఋగ్వేదం పురాతనమైనది. తర్వాత యజుర్వేదం,సామవేదం, అధర్వణవేదం వచ్చాయి. అందరూ దీనినే నమ్ముతున్నారు.

ఈ పరిశోధకులు దేనిని ప్రామాణికంగా తీస్కొని ఇలా వర్గీకరించారో తెలియడం లేదు.

ఇలా ఎందుకంటున్నానంటే అసలు ఋగ్వేదంలోనే యజుర్వేదానికీ, సామవేదానికీ సంబంధించిన సమాచారం ఉంది.
అందుకే వేదాల ముందు,వెనుకల సందేహం వచ్చింది.

మనలో పురుషసూక్తము చాలామందికి తెలుసు. ఋగ్వేదం 10వ మండలంలోని పురుషసూక్తములోని 10 వ శ్లోకం చూడండి.

తస్మాద్యజ్ఞాత్-సర్వహుతః | ఋచః సామాని జజ్ఞిరే |
చందాగ్ంసి జజ్ఞిరే తస్మాత్ | యజుస్తస్మాద జాయత ||


అర్థం:

ఈ సర్వహుత యజ్ఞం నుండి ఋగ్వేద మంత్రాలు పుట్టాయి,సామవేద మంత్రాలు పుట్టాయి.ఛందస్సు పుట్టింది,యజుర్వేదం పుట్టింది.


మరి ఋగ్వేదం తర్వాత పూర్తైన తర్వాత యజుర్వేదం,సామవేదాలు వచ్చాయనాలా? లేక ఋగ్వేదం రచిస్తుండగానే యజుర్,సామవేదాలు సమాంతరంగా(parallel) గా రచించారనాలా? లేక అన్నీ ఒకేసారి ఉన్నాయనాలా లేక పుట్టాయనాలా? కాని ఎవరూ ఇలా అనలేదు. అందరూ అనేదేమంటే మొదట చెప్పినట్లుగా ఋగ్వేదం మొదట తర్వాత యజుర్వేదం, సామవేదం మొదలగునవి.


కాని పై శ్లోకం వలన ఋగ్వేదం మొదట తర్వాత యజుర్వేదం, సామవేదం అనే భావన ఎలా నిలబడగలదు?


ఇంకా ఇలాంటి ప్రస్తావనలు కల శ్లోకాలు ఏమైనా ఉన్నాయేమో నేనింకా చూడలేదు కాని పై శ్లోకం నాకు కనిపించింది.

Categories: Left

ఈ మతంలో కొంత మంచి ఉంది, ఆ మతంలో కూడా కొద్దిగా ఉందేమో

Tue, 07/27/2010 - 10:51
దేవుడొక్కడే అని అందరికీ తెలుసు. కానీ మళ్ళీ నా మతం,నీ మతం అని అంటాము. అనేక మతాలు ఉన్నాయనటం భ్రాంతి మాత్రమే. ఉన్నది ఒకే ధర్మం."ఏకమేవ అద్వితీయం" అనే సత్యమే అనాదిగా వస్తోంది.లోకం లో వేర్వేరు ప్రవృత్తులు గల మనుషులు జన్మిస్తుండేటంత వరకూ ఆ అద్వితీయ దైవమే పాత్రోచిత మార్పులను పొందుతుందని గ్రహిస్తే, మనం పరస్పర సహనాన్ని చూపించుకోగలం.


"నదులన్నీ వేర్వేరు తావుల్లో జన్మించి,ఋజు లేక వక్రమార్గాలలో పయనించి సముద్రంలో కలిసిపోయేటట్లు, వివిధ శాఖల వారు విభిన్న దృక్పథాల్లో చివరకు నిన్నే చేరుతున్నారు(శివ మహిమ్నా స్తోత్రం 7)" అనేది అత్యంత వాస్తవం. కొందరంటారు "అవునవును,ఈ మతంలో కొంత మంచి ఉంది.ఇవి అధమ మతాలు.వీటిలో కూడా కొంత మంచి ఉంది" అని. అలాగే ఇతర మతాలన్నీ చరిత్రకందని కాలానికి పూర్వం జరిగిన క్రమపరిణామాన్ని సూచించే శిథిలాలనీ తమ మతం ఒక్కటే పరిపూర్ణమైన పరిణామాన్ని పొందినదనీ అంటారు. ఇంకొందరు తమ మతం నవీనమైనదవటంతో అదే సర్వోత్తమం అనీ సర్వశ్రేష్ఠతను దానికి ఆపాదిస్తున్నారు. కాని వీటన్నిటికీ సముద్ధరణ శక్తి సమంగానే ఉన్నదని మనం గ్రహించాలి.మనకు కనిపించే తేడాలన్నీ కేవలం గౌణ(secondary) విషయాలనే ఆశ్రయించుకొని ఉన్నాయి.ఇలాంటి విషయాలు మూఢాచారం నుండి పుట్టినవి. పిలిచేవారందరికీ భగవంతుడే సమాధానం ఇస్తాడు. ఎవరికి గానీ జీవుల ఉద్ధరణ గురించి కానీ,వారి ముక్తిని గురించి కానీ తలకొట్టుకోవలసిన అవసరం లేదు. సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడే జీవుల ఉద్ధరణ గురించి ఆలోచిస్తాడు. ఒకే భగవంతుడు జీవుల మొరలను ఆలకిస్తున్నాడు.


ఒక వైపు తమకు దేవుడిపై విశ్వాసం ఉందంటూ , మళ్ళీ తమ మతం భుజస్కందాలపైనే మానవకోటిని ఉద్ధరించే భారం ఉందని అసంబద్ధంగా మాట్లాడే వారి తీరు ఎలాంటిదో నాకు తెలియడం లేదు. దీనిని ధర్మం అనగలమా? ధర్మం అంటే భగవత్ సాక్షాత్కారం.


మాటలు,కేవలం మాటలలోనే విశ్వాసం, గ్రుడ్డితనం తో తడుముకోవడం, పూర్వుల సిద్ధాంతాలను చిలుకల మాదిరి పలుకుతూ మతం పేరున రాజకీయాలను చేయడం తగదు. ఇప్పుడు కొందరు ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తునందని అనుకొంటున్న ఇస్లాం మతంలో కూడా " ప్రభూ! నువ్వు సర్వేశ్వరుడివి.నీవు అందరి హృదయాలలో ఉన్నావు.నువ్వే ప్రతివారికీ శరణు. నువ్వే జగద్గురువవు.నీ ప్రజలు నివశించే భూమిని రక్షింప నువ్వే మా అందరికంటే అధికముగా ప్రయత్నిస్తావు" అనే అమోఘవాక్యాలు వెలువడ్డాయి.


ఎవరి నమ్మకాలనూ చెరుపనవసరం లేదు. మంచిని ఇచ్చే శక్తిని ఉంటే ఇద్దాము. వారి విశ్వాసాలను కదల్పకుండానే వారిని బాగుపడనిద్దాము. దీనికేమీ అభ్యంతరం లేదు. కాని రెంటికీ చెడ్డ రేవడి పరిస్థితి ని ఎందుకు కల్పించాలి?
Categories: Left

ఈ తెలుగు పాటకు ఇంగ్లిష్ పాట ఎదో కనుక్కోండి చూద్దాం

Tue, 07/27/2010 - 00:18
క్రింది పాట ఒక తెలుగు సినిమాలోనిదే, కాకపోతే మొత్తం పాట అంతా ఇంగ్లీష్ లో ఉంటుంది. ఆ పాట ఏదో కనుక్కోండి.

నా మొహం అద్దంలో చూస్కొని

ఆశ్చర్యపోయా కనిపించింది చూసి

నేను కేవలం ప్రయాణించే సిపాయిని

నేనవగలను కాగలిగిందంతా

ఇప్పుడు అసలు పాట ఏంటో కనుగొని ఆ శృతిలోనే ఈ పాట కూడా పాడుకొని నవ్వుకోండి.
Categories: Left

ప్రాచీన భారత ఋషులు ఆఫర్లు పెట్టి సరుకులు అమ్మినారా?

Mon, 07/26/2010 - 08:39
టపా పేరు చూసి ఇదేదో బిజినెస్ కు సంబంధించినది అనుకోకండి.
ఇది నేను ఇంతకు ముందు రాసిన టపా "మన ప్రాచీన శాస్త్రజ్ఞుల(ఋషుల) కంటూ ఒక విధానం ఉంది. విదేశీయుల కళ్ళజోళ్ళతో దాన్నెందుకు చూడాలి?" కి కొనసాగింపు.

రామాయణం లో ఒక శ్లోకం ఉంది. విభీషణుడు రావణుడితో చెప్పే శ్లోకం

సులభాఃపురుషా రాజన్‌ సతతంప్రియవాదినః

అప్రియస్యతుపథ్యస్య వక్తా శ్రోతాచదుర్లభః

అర్థం:
రాజా! నిత్యం ప్రియమైన మాటలు చెప్పేవారు సులభంగా లభిస్తారు. కాని మన మనసుకు నచ్చకపోయినా మన మేలు కోసం చెప్పేవారూ, చెప్పినా వినేవారూ దొరకడం కష్టం.


కాని అందరికీ మంచిది అవుతుంది అన్న విషయం చెప్పితీరాలి. చెప్పినా వినేవారు దొరకడం కష్టం. ఇక్కడే మన ప్రాచీనఋషులు ఆలోచించారు. నేటి వ్యాపారస్థులు తమ సరుకులు అమ్ముడుపోవడం కోసం "ఒకటి కొంటే ఇంకోటి ఉచితం" లాంటి పథకమే ఆ ఆలోచన.

చెప్పాల్సిన విషయం లేదా సందేశం సరుకులాంటిది. ఆ విషయాన్ని లేక సందేశాన్ని కల్గి ఉన్న కథ ఆఫర్ లాంటిది. అంటే అసలు సరుకు చెప్పాల్సిన విషయం, కథ ఆఫర్ అన్నమాట. సరుకు అమ్ముడు పోవడం కోసం వ్యాపారి ఆఫర్ ఇస్తాడు. జనంలో చాలా మంది మళ్ళీ ఇలాంటి ఆఫర్ ఉండదేమోనని సరుకు కొంటారు. ఇది అందరికీ తెల్సిన విషయమే. కొందరైతే ఆఫర్ ఉంటేనే సరుకులు కొంటారు. ఎలాగైనా సరుకు అమ్ముడుపోవడం అనేది వ్యాపారికి ఎలా ముఖ్యమో, మంచి విషయం ప్రజలకు అందాలనేది ఋషి ఉద్దేశ్యము.

మనము సరుకు కొన్న తర్వాత అసలు సరుకు చూపించకుండా ఆఫర్లో వచ్చిన సరుకునే ఎక్కువగా పక్కింటివారికి లేక మరెవరికో ఎలా చూపిస్తామో కథలోని సందేశాన్ని కాకుండా కథనే ఎక్కువగా
పట్టించుకొంటాం. అది వేరే సంగతి.

సరే కథ చదివినంత మాత్రాన సందేశం అందుతుందా అంటే సందేహమే. ఇక్కడే మరో ఆలోచన వచ్చింది ఋషులకు.

మనిషి విన్నదాని కంటే చూస్తే ఎక్కువ గా ఆకర్షితుడవుతాడు.

కాబట్టి నాటకాలలో సందేశాలను జొప్పించి నాటకాలు వ్రాశి వాటిని ప్రదర్శిస్తే చూస్తున్నంతసేపు తనను తాను మరిచిపోతాడు. పాత్రలను మరిచిపోయి వాటిని నిజంగా భావించి అందులో లీనమవుతాడు.

బయటకు వచ్చినా ఆ ప్రభావం పోదు. నేటి సినిమాలు, సీరియళ్ళ లో ఈ విషయాన్ని బాగా గమనిస్తూనే ఉన్నాం కదా.

Categories: Left

ఈ ఇంగ్లీష్ పాటకు తెలుగు పాట కనుక్కోండి

Sun, 07/25/2010 - 07:56
గాడ్ హ్యాస్ గివెను స్ట్రీట్ వన్ను
నవ్ వై టౌను ,వై ఓన్ హౌసు
ఓ సిస్టరు

Categories: Left

ఈ పాటకు అసలు తెలుగు పాట ఏదో కనుగొనండి చూద్దాం

Sat, 07/24/2010 - 10:20

క్రింది పాట తెలుగు పాట. నేను పేరడీగా తెలుగు లోని పాటను ఆంగ్లం లోనికి అనువదించాను. అసలు పాట ఏదో కనుగొని ఆ పాట లాగే దీన్ని కూడా పాడుకోండి.



స్టైలు క్వీను యు ఆర్, స్టైలు మ్యాను ఐ యాం ( style queen you are, style man i am)

ఏజు మ్యాచు, కపులు మ్యాచు (age match, couple match)

డిసెండ్ ఫ్రం టెర్రస్ (desend from terrus)

Categories: Left

చేసే ఏ పని కైనా ప్రేమే ముఖ్యకారణంగా ఉండాలి - శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతులవారు

Fri, 07/23/2010 - 08:30
మీరు చేసేపని ఏదైనాసరే! దానికి ప్రేమ ఒక్కటే ముఖ్యకారణంగా ఉండాలి. కార్యం అంటూ ఎప్పుడుఆరంభం అవుతుందో - ఆ కార్యానికి కర్త, కర్తకు వేరైన ఇతరులు ఉండనే ఉంటారు. కార్యం ఏదైనాసరే! దాని ఉద్దేశము, ప్రయోజనము, కారణము ప్రేమతప్ప ఇంకోటి కారాదు. ఇచ్చట నేను గాంధీగారు అవలంబించిన అహింసావ్రతాన్ని గురించి చెప్పటంలేదు. ఒక్కొక్కప్పుడు మనం హింసా పూర్వకములైన కార్యాలు కూడ చేయవలసివస్తుంది. కొన్ని కొన్ని సందర్భాలలో నేరములకు తగిన శిక్షను కూడ విధించవలసి వస్తుంది. యుద్ధాలు చేయవలసిన అవసరం కూడ కలుగుతుంది. కాని ఏ కార్యం చేసినా సరే! కర్తయొక్క ముఖ్యోద్దేశము ప్రేమయే అయిఉండాలి. ఇచ్ఛాద్వేషాలకు క్రోధమాత్సర్యాలకు అందులో తావుండరాదు. మనం చేసే ప్రతి ఒక్క పనిలోనూ ఈ ప్రేమ అనేది అల్లుకోనిపోయి ఉంటే ప్రపంచంలో ఎట్టి గడ్డు సమస్యలనైనాసరే, మనం అవలీలగా సాధించగలం.

-శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతులవారు
Categories: Left

పండ్లు తినడానికి పండ్ల తోటలోనికి వెళ్లి పండ్లు తినకుండా ఆకులెన్ని, చెట్లెన్ని,కొమ్మలెన్ని అని లెక్కపెట్టడం ఎందుకు?

Thu, 07/22/2010 - 09:00
చాలా ఆకలి మీద పండ్ల తోటలోనికి వెళ్తాము. అక్కడికి వెళ్ళాక తీరా పండ్లు తినకుండా ఆకులెన్ని, చెట్లెన్ని,కొమ్మలెన్ని అని లెక్కపెడుతుంటే ఎవరికి నష్టం? కావాలంటే ఆకలి తీరాక ఆ పని చేసుకోవచ్చు.

కాని మన దురదృష్టం ఏంటంటే నేడు మనం చేస్తున్న పని లెక్కెట్టుకోవడమే, తిని ఆకలి తీర్చుకోవడం కాదు.సాధారణంగా వేదాలు కాని, మరేవైనా గ్రంధాలు కాని చదవాలని ఎందుకు అనుకొంటాము.

మనకు కావలసినది మనం చదివే పుస్తకాలలో నుండి మన జీవనమార్గాని కొక దీపం... నిజానికి ఆ పుస్తకం ఏనాటిది? ఎవరు వ్రాసారు? మొదలైన చర్చలు అసలువిషయాన్ని మన దృష్టినుండి ప్రక్కకు తొలగిస్తున్నాయి. ఇట్లాంటి ప్రశ్నలవల్ల మన దృష్టిలో ఆ పుస్తకాల విలువ తగ్గిపోవడమేకాక వాటిపై నిరాదరణ ఏర్పడి వానిపై మనము ఉంచవలసిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా ఉంచలేకపోతాము. అది పిల్లలు తినడం కోసం పెంచబడుతున్న పండ్ల తోటలను బాటనీ లాబొరేటరీలుగా మార్చినట్లు అవుతుంది. అలా ప్రయోగశాలలుగా మార్చామనుకోండి, వివిధ రసాయనాలు అవీ కలపవలసివస్తుంది. అప్పుడు అసలు దేనికోసం ఆ పండ్ల తోటను పెంచుతున్నామో ఆ అసలు పని ఇక వీలు కాదు. మనం ప్రస్తుతం శాస్త్రాలను,గ్రంధాలను చదివేపద్దతి కూడా ఇలానే ఉంది.

లేదు, ఆ పుస్తకం ఏనాటిది? ఎవరు వ్రాసారు? మొదలైనవి కనుగొనాలి అనేవారు ఉన్నారంటే అది వేరే సంగతి.వారు అందుకు చదువుతారు.అది వారు చదువుతున్న కారణం.

మన కారణం అది కానప్పుడు మన కారణం అందులోని విషయాలు ఏంటి? మనకు పనికొచ్చేవా,కాదా? ఆచరణలో పెట్టగలమా లేక పెట్టవచ్చా?అవి మనకు ఎలా ఉపయోగపడతాయి? అయినప్పుడు కూడా పైన చెప్పినవారి పనే చేస్తుంటే ఎవరికి నష్టం?

మనం ఒక పదానికి అర్థం కావాలని నిఘంటువు(Dictionary) చూస్తాం. కాని ఆ పదానికి అర్థం వెదికే క్రమంలో అనేక ఇతరపదాలు కనపడి వాటి అర్థం కూడా చూస్తూ ఒక్కొక్కసారి మనం అసలు ఏ పదానికి అర్థం చూడాలనుకొంటామో ఆ పదాన్ని మరచిపోతుంటాం. తర్వాత ఆ పదం గుర్తుకు రాక అదేంటో అని ఆలోచిస్తూ నరకయాతన పడుతుంటాం. ఇది అందరికి అనుభవమే అనుకొంటున్నాను. మిగతా పదాల అర్థాలు తెలిసాయి కదా అని అంటారేమో మంచిదే, కాని మన అసలు పని కాలేదు కదా.

ఒక అడవిలో రాత్రి పూట అడవి జంతువులు,పురుగులు,పాములు మొదలగునవి మన వద్దకు రాకుండా మనం కాపాడబడడం కోసం మనం కట్టెలు పేర్చి మంట పెట్టామనుకొందాం. ఇక్కడ
"రక్షణ" అనేది ప్రధాన కారణం,లక్ష్యం. ఆ మంట వెలుగులో మన వద్ద ఏమైనా దుంపలు అవీ ఉంటే వాటిని ఉడికించడం,తినడం అంతేకాక చలిగా ఉంటే మనకు వెచ్చదనం రావడం అనే ప్రయోజనాలు
అనుషంగికం.అంటే మన అసలు కారణం చెడకుండానే ఇతర ప్రయోజనాలు కలగడం.

అలానే మనం దేనికోసం పుస్తకాలు చదువుతున్నామో దాని కోసం చదివేటప్పుడు ఇతర విషయాలు మనకు తెలిస్తే తెలియనీ! మేలే, కాని అసలు విషయం మాత్రం మనం మరిచిపోకూడదు.

ఎవరెందుకు చదువుతున్నారో అందుకే మొదట చదవాలి. కావాలంటే చదివిన కారణం తీరాక ఆ పుస్తకాన్ని వ్రాసిన రచయిత ఎవరు? అతను ఏ కాలం వాడు లాంటివాటిపై దృష్టి పెట్టి కనుగొనడానికి ప్రయత్నించవచ్చు.
Categories: Left

యోగ్యుడైతే నీ విద్యను చెప్పు,ఎవరూ దొరకకపోతే నీలోనే ఉంచుకో - ఇదే వేదాల అభిప్రాయం

Wed, 07/21/2010 - 08:30
ఇది నా ౨౦౦(200)వ టపా.

మన వేద విద్య లేక విజ్ఞానం అన్నది గురుశిష్య పరంపరగా ప్రసరిస్తూ ఉంది. వ్రాతమూలకంగా వేదాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా వేదాలు స్వరప్రధానం అయినందువలన విని వల్లెవేస్తూ నేర్చుకోవడం అవసరం అయింది. అందుకే వేదాలను ఇలా విని నేర్చుకోవడం వలెనే "శ్రుతి" అని కూడా పిలుస్తున్నాం. మనము వేదాలలోని విజ్ఞానాన్ని చూస్తూనే ఉన్నాం.

అసలు ఈ విజ్ఞానం లేక విద్య ఎవరికి అందాలి అన్న విషయంలో వేదాలు ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. క్రింది శ్లోకాలు చూడండి.

సామవేదం లోని ఉపబ్రాహ్మణమైన "సంహితోపనిషద్ బ్రాహ్మణం" లోని శ్లోకాలు ఇవి.

"విద్య వై బ్రాహ్మణం ఆజగామ తవహం అస్మి త్వం మాం పాలయస్వ-అనర్హతె మానినెమాదా
గోపాయ మా శ్రేయసీతె అహమస్మి విద్యా సార్ధం మ్రియెత్ నా విద్యాం ఊషరెవపెత్"(3-9,10)

అర్థం:
ఒకసారి "విద్య" ఒక తపస్వి దగ్గరకు వచ్చి ఇలా ప్రార్థించింది." నేను నీ దానిని. నన్ను చక్కగా అభ్యసించి పాలించు. అయోగ్యుడు,దురభిమాని అయిన శిష్యుడికి నన్ను ఇవ్వకు.నన్ను
నీలోనే ధరించి కాపాడు. నీకు ఎన్నటికైనా మంచి(శ్రేయస్సు)నే చేస్తాను. ఎప్పటికీ ఊషరక్షేత్రం(ఉప్పుచవిటి నేల) లాంటి అయోగ్యుడి చేతిలో మాత్రం ఉంచకు."

ఈ శ్లోకపు భాష్యం:

"యోగ్యుడైన శిష్యుడు దొరక్కపోతే తన విద్యను తనలోనే ఉంచుకోవాలే కాని ఎన్నటికీ అలాంటి వారికి తను నేర్చుకొన్న విద్యను చెప్పరాదు. దానివల్ల వాడు లోకకళ్యాణం సాధించకపోగా
లోకవినాశనానికే కారణం అవుతాడు."

విజ్ఞానం లేక విద్య అనేది ఎవరికి,ఎలాంటివారికి అందాలి అనే విషయాన్ని వేదాలు ఇంత విస్పష్టంగా ప్రకటించాయి.
Categories: Left

గార్గి - స్త్రీ జాతిలో ఒక ఆణిముత్యం

Wed, 07/21/2010 - 01:32
గార్గి వేదకాలం నాటి మహాయోగిని.ఈమె బ్రహ్మజ్ఞానం పొందిన సాధ్వి.ఈమె సకల వేదాలు,శాస్త్రాలు అవగతం చేసుకొన్న జ్ఞానిగా పేరు పొందినది.ఆ కాలంలోని మహా జ్ఞానులలో ఈమె ఒకరు.

ఈమె వచక్నుడు అనే మహాముని యొక్క కుమార్తె.చిన్నప్పటి నుండే గార్గి యొక్క విద్యాభిలాష ప్రస్ఫుటంగా కనిపించేది.ఈమె బ్రహ్మచారిని.పరబ్రహ్మం యొక్క ఉనికిని అన్వేషిస్తూ ఈమె అనేక సూక్తాలను రచించింది.జనక మహారాజు యొక్క సభలోని నవరత్నాలలో ఈమె కూడా ఒకరు.ఈమె యొక్క పేరు జనకమహారాజు నిర్వహించిన బ్రహ్మజ్ఞానుల సభ ద్వారా వ్యాప్తి చెందినది.ఆ సభలో ఆ కాలంలో అందరికన్నా గొప్పవాడైన "యాజ్ఞవల్క్య ముని"ని ఆత్మ,పరమకారణమైన పరమాత్మ ల గురించి గార్గి వేసిన ప్రశ్నలు అతడిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి.

ఉపనిషత్తులలో గార్గి యొక్క ప్రస్తావన వస్తుంది. ముఖ్యంగా బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్నవల్క్యముని తో సంభాషణలలో ఈమె జ్ఞానపు వెలుగులు మనలను,అందరిని నిశ్చేష్టులను చేస్తాయి. ఉపనిషత్తులలో ఆమెను ఒక గొప్ప సహజ వేదాంతజ్ఞాని గా పేర్కొన్నారు.

మహాతల్లి గార్గి వేదకాలం నాటిదైనందున ఇంతకన్నా ఎక్కువ వివరాలు దొరకడం లేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు.
Categories: Left

పగలు,రాత్రి ఏర్పడే విధానాన్ని వేదకాలంలోనే స్పష్టంగా చెప్పిన మన పూర్వీకులు

Tue, 07/20/2010 - 08:30
నేను గతంలో భూమి గుండ్రం (వేదాలు) అని ఒక టపా వ్రాశాను. అందులో మన ప్రాచీనులు భూమి గుండ్రంగా ఉన్న విషయాన్ని ఎంత స్పష్టంగా చెప్పారో వ్రాసాను. ఈ టపాలో ఇంకా ఎంత చాలా స్పష్టం గా వివరించారో చూడండి. ఋగ్వేదం ఎంత పురాతనమైనదో మనకు తెలుసు.

ఋగ్వేదం లోని శాకల శాఖకు చెందిన బ్రాహ్మణం ఐతరేయబ్రాహ్మణం లో క్రింది శ్లోకాన్ని చూడండి.

"స వా ఏష న కదాచనాస్తమేతి నోదేతి, తం యచస్తమేతీతి మన్యంతేహ్న ఏవ తదంత్వమిత్వాథాత్మానం విపర్యస్యతే- రాత్రీమేవావస్తాత్ కురుతేహః పరస్తాత్ ... య ఏవం వేద" 14.6

అర్థం:

సూర్యుడు ఉదయించడం,అస్తమించడం అంటూ అనేది ఎప్పటికీ ఉండదు. సాయంకాలం అతడు విపర్యాసాన్ని పొంది మనకు కనబడడు. మళ్ళీ తెల్లారేసరికి కనబడతాడు.ఈ గోళంలో
కొంతభాగానికి కొంతసేపు మిగతాభాగానికి కొంతసేపు చీకటి,వెలుగులను ప్రసాదిస్తూ రాత్రి,పగలు అనే వ్యవహారాన్ని కలిగిస్తాడు.

ఇందులో విపర్యసం అనే పదం నాకు అర్థం కాలేదు.

అసలు రాత్రి,పగలు అనేవాటిని ఎంత స్పష్టంగా ఆ కాలంలోనే వివరించారో చూడండి.
అంతేకాక గోళం అంటూ భూమి గుండ్రంగా ఉందనే విషయాన్ని కూడా చెప్పకనే చెప్తున్నారు.

వేదాల్లోని ఈ విషయాన్ని చూసి 19వ శతాబ్దపు వేద పరిశోధకుడు మోనియర్ విలియంస్ (Monier Williams) భారతీయుల సునిశిత మేధాశక్తిని ప్రశంసించిన విధానం చూడండి.

"Indians had made some shrewd astronomical guesses more than 2000 years before the birth of Copernicus" (The Vedas p.39)

ఇంకో తెలుసుకోవల్సిన విషయం ఏంటంటే ఈ ఋగ్వేదపు ఐతరేయ బ్రాహ్మణంలోనే మొదటిసారిగా "ఆంధ్ర దేశం" అని ఉపయోగించబడింది.
ఇందుకు సంబంధించిన శ్లోకం

"తుంగా కృష్ణా తథా గోదా సహ్యాద్రి శిఖరావధి|
ఆ ఆంధ్రదేశ పర్యంతం బహ్వృచశ్చాశ్వలాయనీ" (33.6)
Categories: Left

స్త్రీ మాత్రమే కాదు, మగవాడు కూడా సంతానం పొందితేనే పరిపూర్ణమైన మగవాడు అవుతాడు

Tue, 07/20/2010 - 01:30

అదేదో చిత్రంలో కథానాయకుడు ఒక స్త్రీ పరిపూర్ణత గల స్త్రీ ఎప్పుడు అవుతుంది అని మార్కులు వేస్తూ సంతానవతి ఐన తర్వాతనే ఆమె పరిపూర్ణత పొందుతుందని చెప్తాడు.

మరి మగవాడు పరిపూర్ణ మగవాడు ఎప్పుడు అవుతాడు? ఈ విషయం చాలా మందికి తెలియదు.

ఈ విషయం గురించి వేదాలలో ఏమున్నదో గమనించండి.

శుక్ల యజుర్వేదం లోని "శథపథ బ్రాహ్మణం" లోని క్రింది శ్లోకాన్ని చూడండి.


అర్ధో హ వాయేష ఆత్మనో యజ్ఞాయా, తస్మాద్యావజ్జాయాం
న విందయతేనైవ తావత్ ప్రజాయతే అసర్వోహి తావద్భవతి
అథ యదైవ జాయాత్ విందతే అథ ప్రజాయతే, తర్హిసి
సర్వో భవతి! సర్వ ఏతాం గతిం గచ్ఛానీతి (5.2.1.10)


అర్థం :
భార్య భర్తలో సగభాగం. ఆమెను పొందేవరకు అతను సంతానాన్ని కనలేడు. అసంపూర్ణుడే అవుతాడు. భార్యను, ఆమె ద్వారా సంతానాన్ని పొందిన భర్త పరిపూర్ణత సాధిస్తాడు.


కాబట్టి పై వేదప్రమాణం ప్రకారం పురుషుడు కూడా సంతానం పొందితేనే పరిపూర్ణ పురుషుడు కాగలడని తెలుస్తోంది.


మనం ఇంకోటి గమనిస్తే కనుక ఒకటి అర్థం అవుతుంది. పై శ్లోకంలో భార్య ద్వారా సంతానం పొందేవాడే పరిపూర్ణత పొందుతాడని చెప్పబడింది. అంటే కట్టుకొన్న భార్య ద్వారానే పొందాలి, ఇతరత్రా కాదు అన్న విషయం స్పష్టమవుతోంది.

Categories: Left

జనానికి మంచి బదులు చెడు జరుగుతుందనే విమాన నిర్మాణం వ్రాయడం లేదు - భోజరాజు

Mon, 07/19/2010 - 09:00

భోజరాజు గురించి అతను ఒక గొప్ప మహారాజుగా మనందరికీ తెలుసు. ఇతని ఆస్థానంలోనే మహాకవి కాళిదాసు ఉండేవాడని చరిత్ర చెప్తోంది.


కానీ ఇతను "సమరాంగణసూత్రం" అనే గ్రంధం వ్రాశాడని చాలామందికి తెలీదు.


ఈ గ్రంధంలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వ్రాయబడ్డాయి. "యంత్రాలు ఎలా తయారు చేయాలి?","ఆకాశంలో ప్రయాణించడం ఎలా సాధ్యం?" అనే విషయాలు ప్రస్తావించబడ్డాయి.



అమరకోశం లో 'వ్యోమయానం విమానోస్త్రీ' అని ఉంది. అంటే "ఆకాశంలో ప్రయాణించే వాహనానికి విమానమని పేరు" అని అర్థం.


భోజరాజు తన 'సమరాంగణసూత్రం'లో విమాన నిర్మాణవిధానం గూర్చి వ్రాస్తూ భోజరాజు "విమాన నిర్మాణం గురించి స్థూలంగా తత్త్వము(theory) మాత్రమే వ్రాస్తున్నాను. దానిని నిర్మించే విధానం తెలిసే వదిలేస్తున్నాను,వ్రాయడం లేదు.చేయడం ఎలాగో చెప్పడం వల్ల సామాన్య జనానికి సుఖం బదులు కష్టమే ఏర్పడుతుంది అని ఇది వ్రాయడంలేదు' అని వ్రాశారు.



చిత్తశుద్ధి లేని వారి చేతిలో ఇలాంటివి పడితే పసిపిల్లల చేతిలో విషం ఉన్నట్లే కదా!


భోజరాజు గారు ఏమి ఆలోచించాడో ఏమో మనకైతే తెలియదు.


1980 లలో ఈ గ్రంధాన్ని చూసిన శాస్త్రవేత్తలు అందులో బెలూన్ల వంటి సాధనాల నిర్మాణం, అందులో ఎలా ప్రయాణించడం అనే విషయాలు వర్ణించారని అన్నారు.


ఇతర దేశాలలో నూతనశాస్త్రాలు అభివృద్ధి చెందుతూ ఉంటే మనదేశంలో ఉన్నశాస్త్రాలు కూడా నామరూపాలు లేకుండ నశిస్తున్నాయి. ఉన్న శాస్త్రాల ను ఉపయోగించుకొనే పద్దతి మనకు తెలియడంలేదు.


ప్రాచీన శాస్త్రాలను అర్థం చేసికొనడానికి పరిశోధనలు చెయ్యాలి. మనకు అర్థము కాకపోయినా మన తర్వాతి తరం కొరకైనా వానిని రక్షించాలి. ఇప్పుడు అర్థము కాకపోయినా మరియొక కాలంలోనైనా అవి ఉపయోగపడతాయి.


మిగిలిన దేశాలు మొదట అజ్ఞానదశలో ఉండి క్రమేణ జ్ఞానదశకు వచ్చాయి. మన దేశము ఆరంభ కాలములో ఉచ్చస్థితిలోఉండి క్రమేణ క్షీణస్థితికి వచ్చి మళ్లీ ఇప్పుడు ఉన్నత స్థితికి వెళ్తోంది.



ఇప్పటికే ఎన్నో శాస్త్రాలు మనకు దొరకడం లేదు. ఉన్న శాస్త్రములను మూర్ఖంగా పనికిమాలినవని పారవేస్తే మనకే నష్టం. వానిని అర్థం చేసికొనడానికి ప్రయత్నించాలి. నిరూపణ కానిదే దేనినీ ఖండించుటకు మనకు అధికారంలేదు. అర్థము చేసికొనుటకే మనకు అధికారం ఉంది.

Categories: Left

సముద్రంలో ప్రయాణాన్ని వేదాలలో నిషేధించలేదు

Mon, 07/19/2010 - 00:28

ఋగ్వేదం 4వ అధ్యాయం,9వ అనువాకం,48వ సూక్తం



उवासोषा उछाच्च नु देवी जीरा रथानाम

ये अस्या आचरणेषु दध्रिरे समुद्रे न शरवस्यवः



అర్థము:


ధనము కోరువారు సముద్రమున నావలు నడుపుతారు.ఆట్లే ఉదయాకాశమును ఉషోదేవినడుపుచున్నది.ఇంతకు పూర్వము కూడా నడిపినది.ఇప్పుడూ నడుపుచున్నది.



సముద్రమున నావలు నడపడం ధనం కొరకు అని అన్నప్పుడు,సముద్రయానం వ్యాపారం కొరకే అని కదా అర్థము.దీనినిబట్టి వేదకాలములోనే మన పూర్వీకులు సముద్ర ప్రయాణం (ఇతర దేశాలతో కూడా అయ్యుండవచ్చు) ద్వారావ్యాపారము చేస్తున్నట్టు అర్థం అగుచున్నది.



అంతేకాక సముద్రయానము నిషేదము అన్నది వేదకాలం తర్వాత ఎవరో మన గ్రంధాలలో చొప్పించారు అన్నది అర్థంఅవుతోంది.

Categories: Left

ఎపిక్ (Epic) - మన భారతదేశపు బ్రౌజర్

Sun, 07/18/2010 - 09:23


ఈ మధ్యనే నేను ఎపిక్ బ్రౌజర్ ను వాడుతున్నాను. చాలా బాగుంది.

దీన్ని mozilla fire fox ను ఆధారంగా తీస్కొని రూపొందించారు.
మామూలు firefox లోని అన్ని features ఇందులో ఉన్నాయి.

ముఖ్యం గా బ్రౌజర్ లో నే Anti virus సౌకర్యం ఉంది. దాన్ని download చేసుకొని activate చేసుకొంటే తర్వాత మనం ఏ download చెసుకొన్నా బ్రౌజరే స్కాన్ చేస్తుంది. ఈ anti virus ను మన కంప్యూటర్ ను కూడా స్కాన్ చేసి శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. బాగానే పనిచేస్తోంది.

దీని ప్రత్యేకతలు :
1.direct గా ఆంగ్లం తో పాటుగా ఏ భారతీయ భాష లో నైనా టైప్ చేసుకొనే సౌకర్యం ఉంది.
2.ఎడమ వైపు ఒక బార్ ఉంటుంది. అందులో చాలా అదనపు సౌకర్యాలు ఉంచారు.
3.బ్రౌజర్లోనే మనం word pad open చేసుకొని ఆంగ్లం తో పాటుగా ఏ భారతీయ భాష లో నైనా వ్రాసుకోవచ్చు.
4.ఇంకా twitter, orkut, gmail, facebook,yahoo, book marks, ఇంకా చాలా సైట్ల short cut లు ఎడమ వైపు బార్ లో ఉంచారు.
5.ఇంకా my computer ని కూడా బ్రౌజర్ లో నే (open) చేసుకోవచ్చు.
.6. fire fox లాగానే ఇందులో కూడా addons పెట్టుకోవచ్చు.
7. గేములు, backup కూడా ఎడమవైపు బార్ లో ఉన్నాయి.
8. ఇంకా ఎడమవైపు బార్ కు మనమే చాలా అదనం గా చేర్చుకోవచ్చు.
9.history కూడా ఈ బార్ లోనే ఉంటుంది.
10. ఇంకా అలారం కూడా పెట్టుకోవచ్చు. మనం నెట్ ఉపయోగిస్తూ సమయం మరిచిపోకుండా ఉండేందుకు అలారం ఉపయోగించుకోవచ్చు.
11. అలానే చేయవలసిన పనులు గుర్తు చేయడానికి To Do కూడా ఇందులో ఉంది.
12. ఏదైనా సైట్ లో మనకు నచ్చిన విషయం ఉంటే దాన్ని కాపీ చేసుకోవడానికి snippets అనే సౌకర్యం ఇచ్చారు.

ఇంకా చాలా ఉన్నాయి. ఇందుకోసం http://www.epicbrowser.com/ చూడండి.


ఈ బ్రౌజర్ ను క్రింది లంకె నుండి దింపుకోవచ్చు.
ఎపిక్(Epic)
(http://http.cdnlayer.com/href/epic-setup.exe)
Categories: Left

ప్రతి మనిషి ఏ విషయానికి భయపడతాడు?

Sat, 07/17/2010 - 12:12
ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి.

99% మనుషులు ( బహుశా 100% అను కూడా అనుకోవచ్చేమో) ఏ విషయానికి భయపడతారు?

Categories: Left

బ్రహ్మవిష్ణుశివులనూ పూజిస్తాం..... పోచమ్మ,మరిడమ్మ,పోలేరమ్మలనూ పూజిస్తాం. అదే మాకు తెలిసింది.

Fri, 07/16/2010 - 08:30
వేద కాలం నుండి ఏ ధర్మాలను భారతీయులు అనుసరిస్తున్నారో దానిని సనాతనధర్మం అని అంటారు. సనాతనం అంటే ఎప్పటినుండో ఉండి కూడా నిత్యనూతనం గానే ఉండేది. మనం ఈ సనాతన ధర్మాలనే పాటిస్తున్నాం.

ఈ ధర్మాన్ని పాటించే భారతదేశపు తత్వం "ఒక్కటి" కాదు. ప్రకృతి తత్వమే మన తత్వం. మనసు యొక్క తత్వమే మన అందరి తత్వం. మనసు నుండి అనేక ఆలోచనలు బయలుదేరినా, అవి వేర్వేరుగా ఉన్నా, ఒక ఆలోచనకు ఇంకో ఆలోచనకు సంబంధం లేకపోయినా అన్నీ ఒకే మనసుకు చెందుతాయి. చివరికి నిద్రలోనికి మనం జారిపోయినప్పుడు అన్ని ఆలోచనలు తన మూలస్థానమైన మనసును చేరతాయి. ఆ మనసుకు అభిన్నం అవుతాయి. అంటే మనసులోనికి కలిసిపోతాయి.

ఇలాంటి మనసు లేక ప్రకృతి యొక్క తత్వమే మన తత్వం. ఈ విధమైన భిన్నత్వంలో ఏకత్వమే మన జీవన విధానం.

వేదాలు,ఉపనిషత్తులు, రామాయణమహాభారత ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు విభిన్నమైన తత్వాలను,సిద్ధాంతాలను చెప్తాయి. ఐనా కలిసి సహజీవితం గడుపుతాయి. "ఏకం సత్,విప్రా బహుదా వదంతి" అని అన్నీ అంగీకరిస్తాయి. మనం ఇవన్నీ మావే అని గర్విస్తాం. సిగ్గుపడము. ఒకే కూరగాయతో అనేకరకాల వంటలను మనం తినేటట్లు ఒకే దేవుణ్ణి మనం వివిధరకాలుగా ఆరాధిస్తాం.

అందుకే అవైదికాలైన(వేదాలను ఒప్పుకోని) బౌద్ధ,జైన,చార్వాక మతాలతో కలిసే జీవించాం. ఇప్పుడూ క్రైస్తవ,ఇస్లాం మతాలతో కలిసేఉంటున్నాం. అవి కూడా భగవంతుని చేరే వివిధమార్గాలే అని తెలిసి జీవిస్తున్నాం. నేటి యుగంలో శ్రీ రామకృష్ణపరమహంస గారు ఇదే అనుభవపూర్వకంగా ఋజువు చేసారు.

అందుకే మనం బ్రహ్మ,విష్ణు,పరమేశ్వర,కాళిక,గణేషలతో పాటుగా పోలేరమ్మ, మరిడమ్మ, గంగమ్మ, పోచమ్మ, మైసమ్మలను కూడా ఆరాధిస్తాము.

భారతీయులుగా మనం బహుదేవతారాధకులం. ఇది మన విధానం. మన విధానమే మన నాగరికత,మన సంస్కృతి.

"ఎవరు ఏ దేవతను ఆరాధిస్తే నేను ఆయా దేవతల ద్వారానే వారి కోరికలు తీరుస్తున్నాను.ఆ దేవతలందు శ్రద్ద,విశ్వాసం కలిగేలా చేస్తున్నాను." - శ్రీ భగవద్గీత
Categories: Left

1 = 2 కాదు. కాని నిరూపించా క్రింది విధంగా. తప్పు ఉంది. చెప్పగలరా?

Fri, 07/16/2010 - 01:30
సమస్య:
a=1 అనుకొందాం

(a^2 అంటే a square)

ఇప్పుడు రెండు వైపులా a తో గుణిస్తే

a^2 = a

(a^2 - 1) = (a -1)

(a+1)*(a-1) = (a-1)

(a+1) = (a-1)/(a-1)

(a+1) = 1

(1+1) = 1

2 = 1

2 =1 కాదని మనకు తెల్సు. మరి పైన చూపిన దానిలో తప్పు ఎక్కడ ఉందో చెప్పగలరా?
Categories: Left

దేశభక్తి అంటే అవసరమైనప్పుడు మాత్రం చూపేదా? లేక మనలో జీర్ణించుకు పోయుండాలా?

Thu, 07/15/2010 - 09:00
ఇప్పుడు ఈ విషయం ఎందుకు అడుగుతున్నానంటే ఈ మధ్య చదివిన ఒక సంఘటన విషయం నన్ను ఎంతగానో స్పందింపజేసింది.

అదేమిటంటే ఒకసారి స్వామి రామతీర్థ జపాన్‌లో పర్యటిస్తూ అందులో భాగంగా రైలులో ఒక ఊరి నుండి మరో ఊరికి ప్రయాణిస్తున్నాడు.స్వామికి మధ్యలో ఆకలి అయ్యి పండ్ల కోసం ఒక స్టేషన్‌లో దిగి పండ్ల కోసం వెదికాడు.కాని ఎక్కడా దొరకలేదు. అలానే రైలు ఆగిన మరో మూడు స్టేషనులలో ప్రయత్నించాడు కానీ దొరకలేదు.

ఇదంతా గమనిస్తోన్న ఎదుటి సీట్‌లో కూర్చొని ఉన్న ఒక జపాన్ కార్మికుడు రైలు మరో స్టేషనులో ఆగుతుందనగా రైలు ఆగీఆగకనే దిగివేసి బయటకు పరుగెత్తుకు వెళ్ళి పండ్లు కొనుక్కొనివచ్చి రామతీర్థ గారికి ఇచ్చాడు.రామతీర్థ గారు "ఎందుకంత కష్టం తీసుకొన్నావు?" అంటూ డబ్బు అతని చేతికి ఇవ్వబోగా అతను తీసుకోవడానికి నిరాకరిస్తూ ఒక్క మాట మాత్రం అన్నాడు.
"స్వామీ! మీరు జపాన్ నుండి భారతదేశమునకు తిరిగవెళ్ళిన తర్వాత అక్కడ మీరు జపాన్ లో కనీసం తినడానికి కూడా పండ్లు దొరకలేదని అనకండి.అందుకే నేనిలా చేసాను.అదే మీరు నాకు ఇచ్చే పదివేలు" అన్నాడు.
ఒక చిన్న విషయం దగ్గర కూడా జపాన్ వారి దేశభక్తి ఎలా వెల్లడైందో గమనించారా?

ఇక మన విషయానికి వద్దాం.మనకు దేశానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడో కానీ లేక ఎక్కడో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడో కాని దేశభక్తి అన్నది గుర్తుకురాదు.

పై సంఘటనలో లాగా మనలో ఎంతమందికి నరనరానా దేశభక్తి జీర్ణించుకుపోయింది?
మనకు ఏదైనా పెద్ద సంఘటన జరిగితే దేశభక్తిని ప్రదర్శిస్తాము తప్ప మన నిత్యజీవితములో దానిని నిజముగా పాటిస్తున్నామా?

మనదేశము లోని కొన్ని కామకుక్కలు ఎంతగా దిగజారి పోయాయంటే మనదేశానికి వచ్చే విదేశీ పర్యాటక మహిళలను బలాత్కరిస్తున్నారు.డబ్బు కోసం ఆ పర్యాటకుల వద్ద యాచిస్తున్నారు.ఎంత చులకన? దీనివలన దేశానికి అంతర్జాతీయముగా ఎంత తలవంపులు వస్తున్నాయో మనకు తెలుసు.దేశభక్తి నిజముగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయంటారా?

ఈ టపా మనలోని డొల్లతనాన్ని విమర్శిస్తూ వ్రాసిందే కానీ నరనరానా దేశభక్తి నింపుకొన్న సైనికులను,పౌరులను ఉద్దేశించి వ్రాయలేదని గమనించగలరు.
Categories: Left