http://dharmasthalam.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
హిందువునని గర్వించు ! హిందువుగా జీవించు !!
Updated: 59 min 45 sec ago

రష్యన్ల భారతీయ మూలాలు

Sun, 09/05/2010 - 09:35
ఈనాడు రష్యన్లు సుమారు 14 కోట్లమంది ఉంటారు. వారు భాషాపరంగా భారతదేశానికి మిహతా అందఱు ఐరోపేయుల కంటే నేదిష్ఠులు (nearest) అనే సత్యం చాలా మందికి తెలియదు. ఎక్కువమంది జర్మన్ భాషే సంస్కృతానికి అన్నిటి కంటే దగ్గఱ అనుకుంటారు. అలాంటివారు ఇహ రష్యన్ తెలిస్తే ఏమంటారో ? రష్యన్ తెలిసిన భారతీయులకు సంస్కృతం రాకపోవడం, అసలు ఇతర ఐరోపేయ భాషలతో పోలిస్తే రష్యన్ భాష నేర్చుకునేవారి సంఖ్య భారతదేశంలో అల్పాత్యల్పం కావడం - బహుశా ఈ వాస్తవం ఇంతవఱకు బయటపడకపోవడానికి కారణాలనుకుంటా.

రష్యన్ భాష ఇండో-యూరోపియన్ భాషాకుటుంబానికి చెందినదనే సత్యం గత 140 సంవత్సరాలుగా భాషాశాస్త్రవేత్తలకు తెలుసు. ఇది బృహత్తరమైన Indo-European Family of Languages లో శ్లావిక్ అనే ఉపకుటుంబానికి చెందినదిగా వారు పరిగణిస్తూ వచ్చారు. కానీ ఇండో-యూరోపియన్ కుటుంబం అనే కాన్సెప్టు బ్రిటీషువారి కల్పన అనీ, సంస్కృతం ఒక్కటే ఆ కుటుంబంలోని 130 భాషల్నీ సమన్వయం చేసి, వాటన్నింటికీ మూలాల్ని చూపగల ఏకైక భాష కనుక ఆ భాషలన్నింటినీ Sanskrit Family అనే అనాలని మన భారతీయ పండితుల అభిప్రాయం. రష్యన్ కీ సంస్కృతానికీ ఉన్న పోలికల్ని ఒకసారి గమనించండి.

ఇంగ్లీషులో ఉన్నట్లు రష్యన్ లో is, are లూ ఆర్టికిల్సూ లేవు. కానీ సంస్కృతంలో మాదిరి ద్వివచనం ఉన్నది. కానీ ఆధునిక రష్యన్ లో దీన్నెవఱూ వాడరు.

ఉదా :- ఏతొ మొయి సుయిన్ - He is my son - వీడు నా కొడుకు
సంస్కృతం = ఏష మమ సూనుః

తుయ్ స్తొయీష్ - You are standing = నువ్వు నిలబడుతున్నావు.
సంస్కృతం = త్వం స్థాస్యసి

తత్ - అది (సంస్కృతంలో కూడా తత్ అంటే అది)

ఏతా - ఇది (సంస్కృతంలో ఏతత్ -ఇది)

యా = నేను
అన్ - అతడు (అనేన మొ|| అసౌ రూపాల నుంచి కావచ్చు)
వామ్ - మీకు (సంస్కృతంలో కూడా వామ్ అంటే మీకు)
నష్ - మా యొక్క (సంస్కృతంలో నస్- మా యొక్క)
త్వయీ - నీది (సంస్కృతంలో త్వయి అంటే నీయందు)
వుయ్ - మీరు (సంస్కృతంలో యూయమ్)
దోమ్ - ఇల్లు (సం. ధామ)
వొదా - నీరు (సం.ఉదన్)
యా జ్నాయే - I know (సం. అహమ్ జానే)
తుయ్ జ్నాయేష్ - నీకు తెలుసు
అన్ జ్నాయేత్ - అతనికి తెలుసు
ముయ్ జ్నాయేమ్ - మాకు తెలుసు
కూదా - ఎక్కడ (సం. కుతః)
జన్యా - తల్లి (సంస్కృతంలో కూడా జన్యా - తల్లి)
యాత్రోవ్ - తోడికోడలు ( సంస్కృతంలో యాతృ/ యాతా - తోడికోడలు)

కానీ కొన్ని అత్యంత ప్రాథమిక పదాలకు సంస్కృతంతో సంబంధం ఉన్నట్లు
అనిపించదు. ఉదాహరణకు -

జొవ్యూత్ - పేరు
యాయిత్సో - గుడ్డు
కోష్కా - పిల్లి

మిహతా ఐరోపేయుల మాదిరే రష్యన్లు కూడా గోడసున్నం తెలుపైనప్పటికీ వారి ముఖకవళికలు యూరోపియన్ల లాగా లేకపోవడాన్ని గమనించండి. వారు ఎక్కువగా ఉత్తర భారతీయుల్ని పోలి ఉంటారు. నా అభిప్రాయంలో - మహాభారత యుద్ధం తరువాత - అంటే నాలుగైదు వేల సంవత్సరాల క్రితం రష్యాకు వలసపోయిన భారతీయులే రష్యన్లు అయ్యుండొచ్చు. మనకది ఐతిహాసిక కాలమే గానీ ఇతర దేశాలకు మాత్రం చరిత్రపూర్వయుగం కిందనే జమ. కనుక ఇందులోని సత్యాసత్యాలకు సంబంధించి ఆ దేశాల్లో రికార్డులు లభించవు. లేకపోతే అన్ని సంస్కృతపదాలు రూపు చెడకుండా ఆ భాషలో ఇప్పటికీ వ్యవహారంలో ఉండడం సాధ్యం కాదు. రష్యాని మహాభారతంలో ఉత్తరకురుభూములని వ్యవహరించారు. సంస్కృతంలోని విసర్గ ఐరోపేయ భాషల్లో సకార పొల్లు (స్) గా మారుతుంది గనుక-

(ఉత్తర) కురుః - కురుస్ - రూస్ - రూస్సియా - రష్యా అయిందా ?

Categories: Middle

పచ్చబొట్టూ చెఱిగీ పోదూలే....

Tue, 08/24/2010 - 10:10
సుఖదుఃఖాలకూ, దూషణ-భూషణలకూ, శీతోష్ణాలకూ మఱియు అటువంటి పరస్పర విరుద్ధ అనుభవాలకు అతీతంగా ఉండడమే ద్వంద్వాతీత స్థితి అని వేదాంతశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ద్వంద్వం అంటే రెండిటి సమాహారం. రెండిటికీ అతీతమైన స్థితే ద్వంద్వాతీతస్థితి. మోక్షానికి ఆవశ్యకమైన సాధనాసంపత్తిలో ద్వంద్వాతీత స్థితి కూడా ఒకటని మనం బాల్యమాదిగా వింటున్నాం. ఈ ద్వంద్వాతీత భావన (concept) అత్యంత ప్రాచీనకాలంలో పాశ్చాత్య ఆధ్యాత్మిక లోకంలో కూడా ప్రాచుర్యంలో ఉండేది. గ్రీకులు దీన్ని stoicism అనే పేరుతో వ్యవహరించేవారు. Stoicism గలిగినవాడు Stoicist లేదా stoic అన్నమాట.

జీవితంలో ఢక్కామొక్కీలు తినే కొద్దీ సుఖదుఃఖాలకు అతీతులం కావచ్చు. అసంభవమేమీ కాదు. శీతోష్ణాల్ని కూడా అభ్యాసబలంతో అధిగమించవచ్చు. అసాధ్యమేమీ కాదు. కాయకష్టం చేసి బతికే చాలామంది పేదవాళ్ళు సుఖదుఃఖాలకూ
అతీతులే, శీతోష్ణాలకూ అతీతులే. కానీ వారంతా మోక్షానికి వెళతారని చెప్పలేం. ఎందుకంటే ఒక కష్టాన్ని ఇష్టం లేకపోయినా పళ్ళ బిగువున బలవంతాన ఓర్చుకోవడం వేఱు. అసలది కష్టమే కాదని, భగవత్ ప్రసాదమనీ భావించడం వేఱు. పేదవాళ్ళు చేస్తున్నది మొదటి తరహా పని. ఆధ్యాత్మిక సాధకులు చేసేది రెండో శ్రేణిలోకొస్తుంది. మఱి ఆ కష్టం ఇష్టం కాకుండా అడ్డుపడుతున్నది ఏది ? ప్రతి కష్టాన్నీ భగవత్ ప్రసాదంగా భావించగల మనఃస్థితి మనకెప్పుడు కలుగుతుంది ? అది కలగడానికి మన వంతుగా మనం చేయాల్సినది ఏమిటి ?

మనుషులు తమకు తాము బ్రాండింగ్ వేసుకోవడం మానేసినప్పుడు కష్టాలన్నీ ఇష్టంగా మారతాయి. "మనకు సంబంధం లేదు, మనది కాదు, మనం చేయనక్కఱలేదు, మనకా గతి పట్టలేదు" గట్రా గట్రా భావనలే మానసిక అవరోధాలు. కానీ మనం చిన్నప్పట్నుంచి ఒళ్ళంతా అనేక పచ్చబొట్లు పొడిపించుకుంటూ పెఱిగాం. గుర్వనుగ్రహం లేకుండా మనోమయమైన మన సూక్ష్మశరీరాన్ని మనం దర్శించలేం గానీ ఒక వేళ దైవికంగా దర్శించగలిగితేనా, దాని శరీరం మీద ఈ క్రింద పేర్కొన్న తరహా పచ్చబొట్లు వీపూ, భుజాలూ, పొట్ట అనే తేడా లేకుండా అంతటా వికారంగా పొడిచి కనిపిస్తాయేమో !

"నా పేరు సుబ్బారాయుడు, నా పేరు వెంకటలక్ష్మి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను కమ్మ, నేను రెడ్డి, నేను మధ్యతరగతి, నేను చదువుకున్నవాణ్ణి, నేను నగర నాగరికుణ్ణి, నేను గ్రామీణుణ్ణి, నేను మగవాణ్ణి, నేను ఆడదాన్ని, నేను యువకుణ్ణి, నేను ముసలివాణ్ణి, నాకు అదంటే ఇష్టం, నాకు ఇదంటే అసహ్యం. నేను అది, నేనిది...." ఇంకా ఏదేదో, వేఱేదో, మఱేదో !!

తల్లిదండ్రులే అలవాటు చేశారో, సమాజమే అలవాటు చేసిందో గానీ, మొత్తమ్మీద ఒళ్ళంతా వికారంగా, దట్టంగా అలుముకున్న ఈ పచ్చబొట్ల మూలాన మనకు అహంకారం ప్రకోపించడం, తన్మూలంగా మనోవాక్కాయకర్మలతో ఇతరుల్ని బాధపెట్టి వైవిధ్యభరితమైన పాపాలు చేయడం తప్ప ఉపయోగాంతరమేమీ లేదు. ఇతరులు మనల్ని
అవమానపఱిచారని మనం అప్పుడప్పుడు భావించి తీవ్రమైన మనోవేదనని అనుభూతిల్లడానికి సైతం ఈ పచ్చబొట్లే కారణం. మన గుఱించి మనం ఊహించుకునే మూర్తిమత్త్వం (self-image) మహోన్నతమైనది. ఏ దేవుడూ దానికి సాటిరాడు. ఏ మహాత్ముడూ దానితో సరిపోలడు. మన గొప్పతనాన్ని బట్టే మనం ఆయా దేవుళ్ళని పూజించడం, ఆయా మహాత్ముల్ని గౌరవించడం. ఇదీ మన కథ. అసలు మన గుఱించి మనం ఎందుకు ఒక విధంగా అనుకోవాలి ? మన గుఱించి మనం అనుకుంటున్నట్లుగా ఇతరులు అనుకోవడం లేదనీ తత్కారణం చేత వారు మనల్ని బాధపెట్టారని ఎందుకు తలపోయాలి ?
ఆ ప్రాతిపదికన వారిని ఎందుకు ద్వేషించాలి ? ద్వేషించడమే కాదు, ఆ బాధలో మనం అనేక తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఇదంతా మనకు మనం పొడుచుకున్న పచ్చబొట్ల ప్రభావం.

మనం ఏదీ కాదు. "మనం ఫలానా" అని సమాజం అనుకున్నంతమాత్రాన మనం అది కాదు. లేదా మనం "ఫలానా కాదు" అని సమాజం అనుకున్నంత మాత్రాన మనం అది కాకుండా పోము. నువ్వు నన్ను ఎలాగైనా చూడు, నేనది కాదు.అసలు నేను ఏదీ కాదు. నా గుఱించి నేను అనుకునేది కూడా నేను కాదు. మఱి నేనేమిటి ? అనడిగితే నేను నేనే. నన్ను అనవసరంగా ఒక పేరుకో, విశేషణానికో, గుర్తింపుకో కట్టిపడేయొద్దు. ఇదీ మనం రోజూ మననం చేసుకోవలసినది. అప్పుడు కష్టాలన్నీ ఇష్టాలుగా మారిపోతాయి.

"అహమాత్మా" అంటూ శ్రీ ఆదిశంకరాచార్యులు బోధించినది కూడా ’ఈ సెల్ఫ్- బ్రాండింగ్ బాధ నుంచి, పచ్చబొట్ల పద్మవ్యూహం నుంచి బయటపడ’మనే !

Categories: Middle

దేవుడు మెచ్చే సంబంధం

Tue, 08/17/2010 - 23:45

నాలుగింటికి అనుగుణంగా మనిషి తన శృంగార జీవితాన్ని తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. మొదటిది, తన స్వభావమూ, ఇష్టానిష్టాలు. రెండోది ప్రకృతి. మూడోది దేవుడు. నాలుగోది సమాజం. ఈ నాలుగూ పూర్తిగా సమకూడనప్పుడు కనీసం ఏవో రెండు విషయాలకైనా అనుగుణంగా మనిషి ప్రవర్తించాలి. కేవలం ఒక అంశంలోనే "సై" అనుకుంటే ఆ నిర్ణయం శుద్ధ తప్పుడు నిర్ణయమని వేఱే చెప్పనక్కఱలేదు.ముఖ్యంగా స్త్రీపురుష సంబంధాల విషయంలో ఈ విధమైన ఆత్మసరిచూడ్కి (self-check) చాలా అవసరం.
తన యిష్టానిష్టాలేవో తనకు తెలిసే ఉంటాయి. కనుక అందులో పెద్దగా మానసిక ఘర్షణ ఉండదు. రెండోది, ఆ ఇష్టానిష్టాలు ప్రకృతిసిద్ధమేనా ? అని ప్రశ్నించుకోవాలి. ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి పరస్పర ప్రేమతో తమ కుటుంబాన్ని విస్తరించుకుని ముందు ఏడాది పొడవునా, తరువాత జీవితాంతమూ కలిసే ఉండాలని వారి శరీర నిర్మాణం ద్వారా ప్రకృతి నిర్దేశిస్తోంది. ప్రపంచంలో మంచినీటి సముద్రాలే ఉండవచ్చు గాక. నీ శరీరానికి మాత్రం ఒక లోటా నీళ్ళు సరిపోతాయి. ఎంత దాహమున్నా సరే, నువ్వు ఆ సముద్రాలన్నింటినీ ఆపోఽశన పట్టజాలవు. అలాగే ప్రపంచంలో వెఱ్ఱి వ్యామోహాన్ని కలిగించేటంత సౌందర్యం గలవారు ఎంతమందైనా ఉండనీ, నీ జీవితానికి పనికొచ్చేది మాత్రం ఒక్కఱే.

దేవుడికి అనుగుణంగా దాంపత్యజీవితాన్ని గడపడం మరో ముఖ్యమైన విషయం. కాని "ఇలా ప్రేమించుకోండి, ఇలా పెళ్ళిచేసుకోండి, ఇలా పిల్లల్ని కనండి" అని ఆయన స్వయంగా దిగొచ్చి మనతో ఎప్పుడూ చెప్పడు. కాని పరస్పర నిబద్ధత (mutual commitment) లేని స్త్రీపురుష సంబంధాల్ని ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించడు. అవి పచ్చి వ్యభిచారధోరణి గల అపవిత్రసంబంధాలు గనుక వాటిల్లో పాల్గొనే జంటలు అసలు జంటలే కావు గనుక, వారికి భోగలాలసత్వం మినహా ఎటువంటి బాధ్యతా లేదు గనుక, స్త్రీపురుష జంటల ద్వారా దేవుని భార్య అయిన ప్రకృతిమాత సాధించదల్చుకున్న మూడు ప్రయోజనాల్లో కేవలం ఒక్కటే (అదీ అఱకొఱగా) వారు నెఱవేఱుస్తారు గనుక వారికి ఆయన నుంచి ఆశీర్వాదాలు ఉండవు సరికదా, శాపాలు తగిలినా ఆశ్చర్యపోనక్కఱలేదు.

రతిపుత్త్రఫలాః దారాః అని ఆర్యోక్తి. అంటే, భార్య ఉన్నందుకు ఫలం - ఆమెతో సమాగమమూ, ఆమె ద్వారా సంతానమూ అని ! ఈ సూక్తిలో పేర్కొననివి, స్థలాంతరంలో తారసపడేవీ అయిన ప్రయోజనాలు ఇంకా మూడున్నాయి. ఒకటి - ఒకఱికొకఱు సుఖదుఃఖాలలో సమభాగులై జీవితాంతం కలిసి ఉండడం (సుఖదుఃఖ సమభాగిత్వం). రెండోది సహధర్మచర్యము. అంటే భగవంతునికి ప్రీతికరమైన, లోకకల్యాణకారకమైన మతానుష్ఠాన క్రియల్ని భార్యాభర్తలిద్దఱూ కలిసి నిర్వర్తించడం. భర్త లేని స్త్రీ సౌభాగ్యవతి కాజాలనట్లే, భార్య లేని పురుషుడు ఏ అగ్నిహోత్ర కార్యాలకూ అర్హుడు కాడు. మూడోది నిగ్రహం. ఈ కాలంలో కొందఱు భావిస్తున్నట్లు వివాహం అనేది ఒక లౌకిక, సామాజిక, ఆధికారిక లాంఛనం కాదు. వివాహనికీ ప్రభుత్వానికీ సంబంధమే లేదు. ప్రభుత్వం వివాహాన్ని గుర్తించగలదు, అంతవఱకే. కానీ అసలు మనుషులెందుకు వివాహం చేసుకోవాలో అది చెప్పజాలదు. ఆ ప్రయోజనాన్ని మతదృష్టితో మాత్రమే అర్థం చేసుకోగలం. వివాహం అనేది జీవితభాగస్వామిని తెప్పగా చేసుకొని సంసారసముద్రాన్ని దాటి మనోనిగ్రహతీరాన్ని చేఱుకోవడం కోసం మతధర్మాలు ప్రతిపాదించిన వ్యవస్థ. ఈ అయిదు ప్రయోజనాల్లో ఒకటైన సంతానం కొన్నిసార్లు అన్ని జంటలకూ కలక్కపోవచ్చు. అటువంటప్పుడు వారు కనీసం మిగతా నాలుగు ప్రయోజనాలనైనా నెఱవేర్చాలి. వీటిల్లో జీవితాంతం కలిసే ఉండడం చాలా ముఖ్యమైన ప్రయోజనం. వాళ్ళు సంస్కారపరంగా మనుషులో, పశువులో తేల్చేది అదే. ఎందుకంటే పశువులు తమ సంబంధాల్ని ఇట్టే మర్చిపోతాయి. కాని మనుషులు మఱవలేరు. మనిషి స్మృతిజీవి అయినప్పుడే నీతిజీవి కూడా అయ్యాడు. అందుచేత అతడు తన మానవ మనస్తత్వానికి అనుగుణంగా శాశ్వతసంబంధాల్ని మాత్రమే ఏర్పఱచుకోవాలి.

వివాహమనే సంస్కారం ఇద్దఱు స్త్రీపురుషుల్ని ఆ విధమైన పవిత్రబంధంలో శాశ్వతంగా ముడివేస్తుంది. ఆ పరస్పర ప్రమాణం వారి ప్రేమసామ్రాజ్యానికి రాసుకున్న రాజ్యాంగం. ప్రతికొన్ని రోజులకీ చెఱిపేసి మళ్ళీ మళ్ళీ రాసుకునేవి రాజ్యాంగాలు కావు. చిత్తుకాయితాలు మాత్రమే ! అలా ఏర్పడేవి సామ్రాజ్యాలు కావు. గుడిసెలు మాత్రమే ! ఆ ప్రేమే నిజమైతే, ఆ ప్రమాణంలో నిజాయితీ ఉంటే శుభలేఖలూ, పురోహితుడూ బాజాభజంత్రీలూ, రిజిస్ట్రేషన్లూ ఏమీ అవసరం లేదు. అందుచేత వధూవరులు పరస్పరప్రేమచోదితులై, పెద్దల ప్రమేయం లేకుండా రహస్యంగా, అమంత్రకంగా చేసుకునే గాంధర్వవివాహాల్ని సైతం హిందూధర్మం ఆమోదించి ధర్మశాస్త్రాల్లో వాటికొక స్థానాన్ని కల్పించింది. ఎందుకంటే, అవి ఇతరులకు గుప్తమైనవి. కానీ దేవుడికి గోచరించనంత, ఆయనకు వినబడనంత గుప్తమైనవి కావు. అందుచేత అవి ఆయనకు అభ్యంతరకరాలు కావు. ఇందుకు మన పురాణాల్లోనే ఎన్నో దృష్టాంతాలున్నాయి.

ఏకాంతంలో ఏకమైన మత్తులో హృదయాంతరాళంలోంచి దూసుకొచ్చే "నువ్వే నా సర్వస్వం, నువ్వు నా భార్యవి, నువ్వు నావాడివి, మనల్నెవ్వరూ విడదియ్యలేరు" మొదలైన మాటలు అత్యంత శక్తిమంతమైన పెళ్ళిప్రమాణాలు - వాటిని మూడో మనిషెవఱూ వినకపోయినా. అలాంటి మాటలు నోటి వెంట వచ్చాయో, నూటికి నూఱుశాతం పెళ్ళి జఱిగిపోయినట్లే. దీనికి తిరుగులేదు. ఎందుకంటే దేవుడు మనల్ని తన సూత్రాల ఆధారంగా కాక మన మాటల ఆధారంగా మన చేతల ఆధారంగా మనల్ని జడ్జి చేస్తాడు. మన మాటలు మనకు గుర్తులేకపోయినా విశ్వాంతరాళంలోని ఒక మహామేధస్సులో శాశ్వతంగా నమోదవుతాయని మఱువరాదు. ఆ మాటలన్న తరువాత ఇతరులతో తిరుగుళ్ళు తిరిగే అధికారాన్ని మనుషులు కోల్పోతారు. ఆ మాటలకు అడ్డుచెప్పని స్త్రీ కూడా ఇతరులతో ప్రేమ/ పెళ్ళిసంబంధాన్ని పెట్టుకునే అవకాశాన్ని పోగొట్టుకుంటుంది. వాగ్దానం అప్పుతో సమానం. ఇస్తానన్నాక ఏదో ఒకరోజు ఇచ్చితీఱాలి. అది ఈ జన్మలో కావచ్చు, మఱుజన్మలో కావచ్చు. పదివేలేళ్ళ తరువాతా కావచ్చు. అలాగే "నువ్వే నా భార్యవి" అన్న పురుషుడూ, ఆ మాటకు "సరే" అని అంగీకరించిన స్త్రీ ఎప్పటికీ తప్పించుకోలేరు. వాళ్ళు భార్యాభర్తలై తీఱాల్సిందే. రహస్యంగా ఒకఱితో ఒకఱు అనుకున్న ఈ మాటలు వారి భవిష్యత్ తలరాతను నిర్మొహమాటంగా లిఖించివేస్తాయి. ఇదే కర్మఫలమంటే. ఇదే ఋణానుబంధమంటే. అంతకుముందు వారిద్దఱూ ఎవఱైనప్పటికీ, అసలు ఏమీ కాకపోయినప్పటికీ వివాహం చేసుకున్న మఱుక్షణంనుంచి వారు భార్యాభర్తలవుతారు. వారిద్దఱూ ఒకే వ్యక్తిలాగా ప్రవర్తించాలి, ఆలోచించాలి.

సమాజానికి అనుగుణంగా మెలగడంలో తెలివితేటలున్నాయి గాని అందులో పవిత్రతా, అపవిత్రతా, పాపం, పుణ్యం ఏమీ లేవు. సమాజమేమీ దేవుడు కాదు. ఆధ్యాత్మికంగా దాని స్థానం బహుపరిమితం. కనుక మనుషులు విశ్వగురుమూర్తులైన ఆదిఋషుల వాక్యాలను, తమ అంతరాత్మను, పరమాత్మను, ప్రకృతినీ పరిగణనలోకి తీసుకొని ప్రవర్తించడం ఆధ్యాత్మిక జీవితానికి తొలిమెట్టు.


Categories: Middle

రామునికీ రావణునికీ తేడా ఏంటి ?

Thu, 07/29/2010 - 07:08
రామాయణంలో ప్రధానపాత్రలు శ్రీరామచంద్రమూర్తి, సీతా అమ్మవారు. మిగతావారంతా అవాంతరపాత్రలే. కనుక వారి గుఱించి అవసరమైనంత మేఱకే కవి వర్ణించాడు. ఆ పాత్రల్ని హీరోలు అనడానికి ఆ సమాచారం చాలదు. పోనీ లభిస్తున్న సమాచారం ప్రకారం చూసినా వారు హీరోలు కారు. శ్రీరామచంద్రమూర్తితో పోల్చదగ్గవారు అంతకంటే కారు.

వాలినే తీసుకోండి. ఆ వానరుడి దగ్గఱ శరీరబలాధిక్యం తప్ప ఇంక ఏ గొప్పతనమూ లేదు. దశాబ్దాల తరబడి విశ్వాస పాత్రుడుగా సేవ చేసిన తమ్ముణ్ణి అకారణంగా అనుమానించి వెళ్ళగొట్టాడు. అతని భార్యని బలాత్కారంగా అనుభవించాడు. అతను అన్నివిధాలా పశుప్రాయుడు. తానా పశువుని వధిస్తే తనకే దోషమూ లేదని శ్రీరామచంద్రమూర్తి చెప్పినది అక్షరాలా నిజం. కానీ శ్రీరామచంద్రమూర్తి తమ్ముణ్ణి ఎలా చూసుకున్నారు ? ఏ పరస్త్రీ జోలికి వెళ్ళారు ?

మైక్రోస్కోపులో వెతికి చూస్తే లో మలంలో కూడా వైటమిన్లు, ప్రొటీన్‌లు కనిపిస్తాయి. అలాగని అందఱమూ మలాన్ని మన daily staple food గా>>మార్చుకొని తినలేం. అలాగే వాలి, కర్ణుడు లాంటి పక్కా విలన్లలో కూడా మినుకుమినుకు మంటూ ఒకటో రెండో సుగుణాలు కనిపిస్తాయి. అంతమాత్రాన వాళ్ళు సాత్త్వికగుణనిధులైన శ్రీరామచంద్రమూర్తి కన్నా, ధర్మరాజు కన్నా గొప్పవాళ్ళయిపోరు. ఇహ శ్రీరామచంద్రమూర్తిలో దోషాలు వెతకడమంటే సూర్యకాంతి చుఱుక్కుమంటోం దని, కనుక అది పనికిరాదనీ అనడం వంటిది. శూద్రక మహారాజు వ్రాసిన మృచ్ఛకటికంలో ఒక శ్లోకం ఉంది. దాని భావం ఏమంటే "తెల్లని వస్త్రం మీద ఒక చిన్న మఱక కూడా ప్రముఖంగా కనిపిస్తుంది. నల్లని వస్త్రం మీద ఎన్ని మఱకలున్నా ఏమీ తెలియదు" అని అలాగే సకలసద్గుణాభిరాములైనవారిలోనే ప్రపంచం లోపాల్ని వెతకగలదు గానీ దుష్టులేం చేసినా అది దుష్టత్వంగా అనిపించదు. ఎందుకంటే ఆ దుష్టత్వానికి అలవాటు పడిపోతాం కనుక.

దీన్ని ఒక్కముక్కలో తేల్చవచ్చు. శ్రీరామచంద్రమూర్తి యొక్క గొప్పతనం ఎటువంటిదయ్యా అంటే - ఆయన్ని ఆరాధిం చడం కోసం గుళ్ళూ గోపురాలూ కట్టడానికి లక్షలాది మందిలో అది ప్రేరణనీ, స్ఫూర్తినీ ఇస్తుంది. కాని వాలి, రావణుడులాంటి వాళ్ళ గొప్పతనం "ఓహో ప్రతి దుర్మార్గుడిలోను కొంత సదంశ కూడా ఉంటుందన్నమాట" అనేటంత వఱకు మాత్రమే తేగలదు. వారికి గుడి కట్టి పూజించాలనే కోరిక మాత్రం ఎవఱికీ కలగదు.

Categories: Middle

దాతలు సంతానమౌతారు, గ్రహీతలు తల్లిదండ్రులవుతారు

Sat, 07/10/2010 - 22:30
కీ.శే. మధిర సుబ్బన్నదీక్షితులు రచించిన కాశీమజిలీకథల్లో ఒక కథ ఉంది. కాశీలో ఒక మాదిగకి సంతానం లేకపోతే అందునిమిత్తం తాను చెప్పినట్లు చేయమని ఒక బ్రాహ్మణుడు అతనికి చెప్పాడట. ఆ ప్రకారంగా అక్కడ ఒక యోగి వేసవికాలపు మండుటెండలో స్నానఘట్టానికి వెళ్ళే దారిలో ఆ మాదిగ కొత్తచెప్పులు వదిలాడట. ఆ యోగి ఎండచుఱుక్కి కాళ్ళు కాలిపోతూంటే తట్టుకోలేక ఆ చెప్పులు తొడుక్కొని వెళ్ళాడట. ఆ ఋణం తీర్చుకోవడానికి అతను చనిపోయి ఆ మాదిగ ఇంట్లో అతని కొడుకుగా జన్మించాడట. పునర్జన్మలో కూడా అతనికి యోగవాసనలు పోలేదట. అందుకని, తనకు రాత్రివేళల్లో దొంగల గుఱించి టముకు వేసే బాధ్యతని కులాచారంగా అప్పగించినప్పుడు, "అరిషడ్వర్గాలే నిజమైన దొంగలు కనుక వాటి పట్ల అప్రమత్తంగా ఉండండొహో" అని టముకు వేశాడని దీక్షితులవారు వ్రాశారు.

జీవితసత్యాలకు షుగర్ కోటింగ్ వేసి జనసామాన్యం చేత మింగించడానికి ఉద్దేశించినవి కథలు. కానీ అసత్యాలకూ, అపార్థాలకూ కూడా షుగర్ కోటింగు వేయొచ్చునని ఈ పైన పేర్కొన్న కథ మూలాన అవగతమవుతుంది. హిందూధర్మప్రోక్తమైన కర్మసిద్ధాంతానికి జనంలో ఏ విధమైన అపార్థాలు బయల్దేఱాయో ఈ ఒక్క కథా విని తెలుసుకోవచ్చు. ఇలాంటిదే "ఈ ఉపకారం చేసిపెట్టవయ్యా, చచ్చి నీ కడుపున పుడతా" ననడం కూడా ! ఎవఱు ఎవఱికి ఋణపడడం వల్ల పితాపుత్ర సంబంధం ఏర్పడుతుంది ? పితాపుత్ర సంబంధం ఏర్పడినప్పుడు ఎవఱు ఎవఱి మీద ఖర్చుపెట్టాల్సి వస్తుంది ? ఈ రెండు చిన్న సరళమైన ప్రశ్నల్ని మనవాళ్ళు వేసుకోకపోవడం వల్ల ఈ అయోమయం ఏర్పడింది. అంతేకాక, మన సంప్రదాయంలో తల్లిదండ్రులు దైవసమానులు కనుక తల్లిదండ్రులకు పిల్లలే ఋణపడతారనే పొఱపాటు అభిప్రాయం ఉంది. ఇది కేవలం అభిప్రాయమే తప్ప వాస్తవం కాదు. ఈ అభిప్రాయం ప్రచారంలోకి రావడానికి బహుశా ఒక కారణం - తమని తమ పిల్లలు దైవసమానులుగా చూసి వారంతట వారు తమకు సేవ చేసేదాకా వేచిచూడకుండా తల్లిదండ్రులు ముందే తమకి తాము దైవత్వాన్ని ఆపాదించుకోవడం. తలిదండ్రులకు పిల్లలు సేవ చేయాలని చెప్పబడింది కనుక పిల్లలే తల్లిదండ్రులకు ఋణపడ్డారని జనసామాన్యం అపోహపడడం. కానీ తల్లిదండ్రులే పూర్వజన్మలో పిల్లలకు ఋణపడి ఉన్నారనేదే అసలువాస్తవం. అందువల్ల వారు తమ రక్తమాంసాలు ధారపోసి మఱీ ఆ పిల్లలకి జన్మనిచ్చి పెంచాల్సివస్తుంది. ఆ కారణం చేత ఈ పైన ఉదాహరించిన కథలో ఋణపడింది యోగి. ఆ చెప్పుల్ని అతనికి ఋణమిచ్చినది మాదిగ. కాబట్టి కర్మసిద్ధాంతం ప్రకారం ఋణదాత అయిన మాదిగే మఱుజన్మలో ఋణగ్రహీత అయిన యోగికి కొడుకై పుట్టి తన ఋణాన్ని వసూలు చేసుకోవాల్సి ఉంది. కానీ తద్విరుద్ధంగా వ్రాశారు.

అయితే ఈ పై కథ బోధించే తప్పుడు అభిప్రాయాలు ఇంకా చాలా ఉన్నాయనుకోండి. యోగులు కర్తృత్వ, భోక్తృత్వ భావనలతో ఏ పనీ చేయరు కనుక, ఎల్లవేళలా భగవంతునియందు సర్వశరణాగతి భావనతో ఉంటారు కనుక వారు ఎవఱినుంచి ఏ సేవ స్వీకరించినా వారికి ఋణపడే ప్రసక్తీ లేదు. ఆ ఋణసమాప్తి కోసం పునర్జన్మెత్తే ప్రసక్తి అంతకంటే లేదు. అదీగాక "శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే" అన్న గీతావచనం చొప్పున, ఒకవేళ యోగి పునర్జన్మ ఎత్తాల్సివచ్చినా తనలాంటి యోగుల యింట్లో గానీ లేదా పవిత్రహృదయులైన ధనికుల ఇంట్లో గానీ జన్మిస్తాడే తప్ప పై కథలో చెప్పినట్లు జఱగదు.

Categories: Middle

ఆధ్యాత్మిక అంటువ్యాధులు-1

Sat, 07/03/2010 - 04:00
భగవాన్ శ్రీ రమణమహర్షులవారికి కేన్సరు సోకగా వైద్యం చేయిస్తామన్న భక్తులతో ఆయన అన్న మాటలు : " ఈ దేహమే ఆత్మకు సోకిన వ్యాధి. మళ్లీ ఈ వ్యాధి మీద ఇది ఇంకో వ్యాధి. దీనికి వైద్యమెందుకు ?" అయితే వారి తృప్తి కోసం ఆయన వైద్యం చేయించుకున్నారనుకోండి.

అసలు ఈ దేహమనే వ్యాధి పొడసూపడానికి కారణం కోరికలు. కోరికలంటే మనస్సుతో చేసే కర్మమే. మనం ప్రస్తుతం చేసిన/ చేస్తూ ఉన్న కర్మల ఫలాలే మనకి ఒక భావి- దేహాన్ని సిద్ధం చేసిపెడతాయి. (ఒకటి కాకపోతే వందలాది దేహాల్ని) ఆత్మకి ఈ దేహమనే వ్యాధి సోకినప్పట్నుంచి దానికి ఏ మాత్రమూ కులాసా ఉండదు. నిరంతరం ఆకలి, కామం, అకారణ రాగం, అకారణ ద్వేషం, ఏదో తెలియని భయం, బ్రతుకుబెంగ. ఈ వ్యాధినే శాశ్వత సహజస్థితిగా బ్రమయించే ఉన్మాదం కూడా దాన్తో పాటు సిద్ధం.

సరే, మన వ్యాధికి మన యొక్క మనఃకర్మలే కారణమైతే ఫర్వాలేదు. కానీ ఇతరుల కర్మలు కూడా మనకంటుకుంటే ఏం చేయాలి ? మనం అనవసరంగా ఇతరుల కర్మలక్కూడా మన దేహంతోనే మూల్యం చెల్లించాల్సివస్తే ఏంటి గతి ?

ఈ ప్రశ్నవేస్తే చాలామంది నైష్ఠిక హిందువులు కూడా అర్థం చేసుకోలేక ఆశ్చర్యంతో నిర్ఘాంతపోతారు. ఈ ప్రశ్నేదో కొత్తగా ఉందే ? అనుకుంటారు. "ఎవడి కర్మకి వాడే అనుభవించాలని కదా, హిందూ వేదాంతశాస్త్రాలు ఘోషిస్తున్నాయి ? తద్విపర్యాసంగా ఈ గొడవేంటి, ఎవఱి కర్మఫలాలో మనకంటుకోవడమేంటి ?" అని విస్తుపోతారు. హిందూ కర్మసూత్రం అంత సులువైనదీ, సరళమైనదీ అయితే అది అందఱికీ అర్థమైపోయి ఈ పాటికి ప్రపంచమంతా హిందూమతంలోకి
కన్వర్టయ్యేవాళ్లే. కానీ దురదృష్టవశాత్తు అది అత్యంత సంక్లిష్టమైనది. అందుకే మన పూర్వీకులు "గహనా కర్మణో గతిః" (కర్మఫలం ఏ దారిలో వచ్చి మనల్ని పట్టుకుంటుందో అర్థం చేసుకోవడం కష్టం) అని వాక్రుచ్చారు.

ఇతరుల కర్మఫలాలు ఏ దారిలో వచ్చి మనకంటుకొని మనల్ని పీడించడం మొదలుపెడతాయో ఒకటి-రెండు దృష్టాంతాల ద్వారా గ్రహించవచ్చు. వీటిని ఎక్కణ్ణుంచి సేకరించారని మాత్రం నన్నడగొద్దు. ఒకాయనకి ఇద్దఱు భార్యలు. వారిలో
పెద్దామె ఆయనకి దగ్గఱి బంధువు. నిజానికి ఆమెని అతను పెళ్ళి చేసుకోలేదు. ఏదో కొద్ది సంవత్సరాలు ఆమెతో ఉన్నాడంతే ! ఆ తరువాత రెండో ఆమెని పెళ్ళి చేసుకున్నాడు. ముగ్గుఱూ ఒకే యింట్లో ఉండేవారు. ఆ పెద్దామెతో భర్తకి
సంబంధం ఉందని ఆ భార్యకి తెలియదు. వీళ్ళూ తెలియనివ్వకుండా చాలా జాగ్రత్తగా మసులుకున్నారు. అయితే పెళ్ళయ్యాక అతని వైఖరిలో మార్పొచ్చింది. అతను పూర్తిగా భార్యకే అంకితమయ్యాడు. ఆ పెద్దామెని తాకడమే మానేశాడు. పైకి అతని ప్రవర్తన సక్రమమైనదిగా, బహు నీతిమంతమైనదిగా కనిపిస్తుంది. కానీ ఆ పెద్దామె అలా అనుకోలేదు. ఆమెకి అతని మీద మనసు తీఱలేదు. ఆమెకి ఇంకా చాలా కోరికలున్నాయి. పైకి వ్యక్తీకరించలేకపోయినా ఆమె అతని కోసం యథాపూర్వంగా తపిస్తూనే ఉంది. అతను పట్టించుకోలేదు. అతని నిరాదరణకు ఆమె మనసులోనే
ఆక్రోశించింది, దుఃఖించింది. అతను ఎప్పటికీ మళ్ళీ దరిజేఱకపోవడంతో ఆమె స్వయంతృప్తికి అలవాటుపడింది. ఆ సమయంలో కూడా ఆమె మనసులో అతనే ఉండేవాడు. ఒక పనిమనిషి దగ్గఱ తన మనసులోని వేదనని తఱచుగా వెళ్ళగ్రక్కేది. అతనిలా తనను కౌగలించుకొమ్మని, తనని అతనిలా పిలవమని, తాకమని ఆ పనిమనిషిని ఒత్తిడి చేసేది. ఇలా ఎన్నో మానసిక బాధలతో సతమతమవుతూ కొన్ని సంవత్సరాలకి ఆ పెద్దామె ఆ అశాంతితోనే కన్నుమూసింది. తదుపరి మఱికొన్ని సంవత్సరాలకి ఆమె పెనిమిటి కూడా చనిపోయాడు. మళ్ళీ మఱొకచోట జన్మించినాక ఆఱు-ఏడేళ్ళ వయసులోనే అతనికి తీవ్రమైన స్త్రీవాంఛ ఉండేది. కొద్ది దశాబ్దాల పాటు అలా అహోరాత్రాలూ బాధపడ్డాక అతనికి పెళ్ళయింది. అతని భార్య చాలా ఉత్తమురాలు. భర్తంటే చాలా ప్రేమ. కానీ శృంగారానికి మాత్రం విముఖురాలు. ఎంతగా అంటే, ఆమెతో అతను సగటున ఏడాదికి ముణ్ణాలుగుసార్లు కూడా ఆనందించినది లేదు. ఫలితంగా అతను నిరంతర స్వయంతృప్తికి అలవాటుపడ్డాడు. హోమోసెక్సులాంటి ఆలోచనలు కూడా వచ్చేవి. కానీ అతను అలా కాలేదనుకోండి.

ఇక్కడ వర్ణించిన జన్మజన్మల ఉదంతాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే - ఈ జన్మలో చిన్నతనం నుండి అతను పడ్డ బాధలకి, పూర్వజన్మలో తెలిసో, తెలియకో తన పెద్దభార్యని పెట్టిన కామవాంఛాపరమైన మానసిక చిత్రహింసకీ సంబంధం ఉందని
అవగతమవుతుంది. ఆమె ఎలాగైతే అతనితో సంబంధం వల్ల తనలో రెచ్చగొట్టబడ్డ కామవాంఛ అతని ద్వారా తీఱక బాధపడిందో, సరిగ్గా అలాగే అతనూ ఇప్పుడు బాధపడాల్సి వచ్చింది. ఆమెలాగే స్వయంతృప్తి అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. ఆమె ఏ హోమోసెక్స్ (లెస్బియన్) భావనలకి లోనైందో అవే భావనల్ని ఇప్పుడు అతను కూడా అకారణంగా అనుభూతి చెందాల్సి వచ్చింది. ఆనాటి ఆమె బాధలన్నీ ఇప్పుడు అతనికి ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. కానీ పూర్వజన్మలో తాళిగట్టిన భార్యకి అంకితమైన పుణ్యఫలం చేతను, ఆమె మనసులోనే భర్తకిచ్చిన శుభాభినందనల ఫలితంగాను ఇప్పుడు
పతివ్రత అయిన స్త్రీ కళత్రంగా లభించింది. కానీ ఆమె ద్వారా అతనికి ఇప్పుడు కామోపశాంతి మాత్రం లేదు. పెద్దభార్య ఉసుఱు కూడా తగిలింది.

ఆ జన్మలో ఆ పెద్దభార్య పొందిన మానసిక బాధలకి పూర్తిగా అతనే కారణమా ? అని ప్రశ్నించుకుంటే, బహుశా కాకపోవచ్చు. ఎందుకంటే, అది ఆమె తలరాత. "రాతలో లేనిది చేతలో జఱగదు" అంటాడు యోగివేమన. ఆ తలరాత అలా ఎందుకు ఉంది ? అంటే బహుశా ఆమె కూడా అంతకు పూర్వజన్మలో తన భర్తకి సంసారసుఖం లేకుండా చేసి ఉండొచ్చు. ఆ కర్మఫలాన్ని ఆ రూపంలో మఱుజన్మలో అనుభవించి ఉండవచ్చు. అలాగే ఆమె యొక్క పూర్వజన్మ భర్తకి అలా చేయాలనే సంకల్పం ఆమెలో ఎందుక్కలిగింది ? అనడిగితే "అది అతని పూర్వకర్మఫలం" అనాల్సి వస్తుంది. ఇలా ఒక కర్మఫలం ఎంతమందికి జన్మలవారీగా అంటుకుందో గమనించండి. ఆ కర్మఫలం పెద్దామె యొక్క పూర్వజన్మభర్త నుంచి పెద్దామెకి, ఆమెనుంచి ఇతనికి, ఇప్పుడు ఇతన్నుంచి ఇతని భార్యకి అంటుకో బోతున్నది. ఈమె నుంచి రాబోయే జన్మలో వేఱెవఱికో ?

"ఈ విధమైన అంటువ్యాధిలాంటి కర్మఫల సంక్రమణం నుంచి జీవులకు విముక్తి ఎలా ? దీనికి ఎక్కడ ముగింపు పలకాలి ?" అని ప్రశ్నించినప్పుడు పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాష్టారు ఒక అమూల్యమైన మాట సెలవిచ్చారు. అది కర్మఫలమని గ్రహించి, మనసులో వ్యథ చెందకుండా, ఎవఱి మీదా తిరగబడకుండా దానితో రాజీపడి, ఎవఱినీ ద్వేషించకుండా, అందఱినీ క్షమించి, భగవంతునికి సర్వస్యశరణాగతి చేస్తే దాని ఫలం మనతోనే అంతరించిపోతుంది. భవిష్యత్తులో మన ద్వారా ఇంకెవఱికీ అంటుకోదు.

Categories: Middle

తనయందు దైవత్వాన్ని ఆరోపించుకోవడం - పర్యవసానాలు

Thu, 06/17/2010 - 03:25
మనిషిలో భగవంతుణ్ణి దర్శించడం హిందూసంస్కృతిలో మాత్రమే లభ్యమయ్యే వైశిష్ట్యం. హిందువులలో అనేక సామాజిక మానవ సంబంధాలు సైతం ఈ విధమైన దైవభావనని ఆలంబనగా చేసుకొని ప్రవర్తిల్లుతున్నటువంటివే. ఆయా పెద్దల్ని లేదా ఇష్టుల్ని దేవుడితో సమానం చేయకపోతే హిందువుల మనస్సు శాంతించదు. అదే విధంగా తమకు సహాయపడ్డవారందఱినీ "దేవుడిలా వచ్చా"రనడం కద్దు. అలాగే "ఒకఱు చాలా మంచివారు" అని సాక్ష్యం చెప్పడానికి "ఆయన దేవుడిలాంటోడు. ఏమన్నా అంటే కళ్ళు పోతాయ్" అనడం కద్దు. ఆ రకంగా కాలక్రమంలో మనకి చాలామంది భగవత్సమానులు ఏర్పడ్డారు. హిందువులలో తల్లి దేవత. తండ్రి దేవుడు. (కొంతమందికి అన్నయ్య కూడా దేవుడే) గురువు దేవుడు. భర్త దేవుడు. అతిథి దేవుడు. మఱికొంతమందికేమో రాజు/ నాయకుడు కూడా దేవుడే.

సరే, అంతా అనుకూలంగా సాగినంత కాలం, ఈ దైవత్వాపాదితులు తమకు ఆపాదించబడ్డ దైవత్వానికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నంత కాలం ఈ దైవభావన వల్ల నష్టమేమీ లేదు. అలా కాక ఏ కారణం చేతనైనా ఆ భగవత్సమానులు అడ్డం తిరిగితే వారి భగవత్తత్వం లోకకంటకంగా పరిణమిస్తుంది. "నా విష్ణుః పృథివీపతిః" (రాజు మానవరూపంలో ఉన్న విష్ణుమూర్తి) అని కీర్తించిన దశ నుంచి "రాజుల్ మత్తులు, వారి సేవ నరకప్రాయంబు" అని మహాకవులు ఆక్రోశించే దశ దాకా వ్యవహారం ముదిఱిందంటేనే అలనాటి మానవ సంబంధాలు చారిత్రిక పరిణామ క్రమంలో ఎలా విషమించాయో తేటతెల్లమవుతోంది. ఇది కేవలం పాలకులకూ, పాలితులకూ మధ్యనే కాదు, తల్లిదండ్రులకూ పిల్లలకూ మధ్య, గురువులకూ శిష్యులకూ మధ్య,భార్యలకూ భర్తలకూ మధ్య కూడా ఇలాగే విషమించడాన్ని మనం ఆధునిక కాలంలో గమనించవచ్చు. ఈ విషమించడంలో కేవలం తల్లిదండ్రుల పాత్రో, లేక పిల్లల పాత్రో లేదు. అలాగే కేవలం గురువుల పాత్రో, శిష్యుల పాత్రో లేదు. అదే విధంగా కేవలం భర్త పాత్రో భార్య పాత్రో లేదు. కొన్ని కేసులలో వీరిదీ,మఱికొన్ని కేసులలో వారిదీ ఉంది.

మాతృత్వం, పితృత్వం, భర్తృత్వం, గురుత్వం ఇలాంటివి అదృశ్య పీఠాలు. ఇవి ఆధ్యాత్మికంగా శక్తిమంతమైనవి. అందువల్ల ఈ స్థానాలను అధిష్ఠించినది ఎవఱైనప్పటికీ, ఎలాంటివారైనప్పటికీ వారిచ్చే ఆశీర్వాదాలకీ, శాపాలకీ మఱుజన్మలో తప్పకుండా ఏదో ఒక స్థాయిలో ఫలితం కనబడుతుంది. అయితే కలియుగం ముదుఱుతున్నకొద్దీ అల్పబుద్ధులవారు ఎక్కువగా ఈ పీఠాల్లో తిష్ఠ వేస్తూండడమే మన అసలు సమస్య. అహంకారం, క్రోధప్రదర్శన మొదలైనవి ఆయా పీఠాల్ని బట్టి సంక్రమిస్తాయి. "ఆ పీఠాలు తమవి" అని భావించుకోవడం వల్ల వాటి దుష్ప్రభావాలు తీవరిస్తాయి. ఈ సందర్భంగా నాకొక కథ గుర్తుకొస్తోంది.

ఒకానొక రాజుగారు చాలా కోపిష్ఠి. ప్రతీ చిన్న విషయానికీ కోపం తెచ్చుకొని భయంకరమైన శిక్షలు విధించేవాడు. ఒకసారి ఒక ఋషి ఆయన్ని చూడ్డానికొచ్చి "మహారాజా ! దానమైనా, దండమైనా పాత్రమెఱిగి ఆచరించాలి. చిన్నతప్పులకు పెద్ద శిక్షలూ, పెద్ద తప్పులకు చిన్న శిక్షలూ విధించడం పాపహేతువు. అందుకు ఫలితాన్ని రాజే స్వయంగా అనుభవించాల్సి ఉంటుంది" అని హితవు చెప్పి వెళ్ళిపోయాడు. ప్రతిదానికీ పెద్దపెద్ద శిక్షలు విధించడానికి కారణమవుతున్న తన ఆవేశాన్ని, కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో రాజుకు అర్థం కాక భార్యని పిలిచి సలహా అడిగాడు. "మహారాజా ! ఒక్క నెలరోజులు నాకు రాజ్యాధికారం ఇప్పించండి. ఎలా అదుపులో పెట్టుకోవాలో నేను చెబుతాను. అయితే నేనిప్పుడు పరిపాలకురాలుగా తీసుకునే నిర్ణయాలకు ఆ తరువాత నన్ను శిక్షించనని మాట ఇవ్వండి." అన్నదామె. రాజు "సరే"నని ఒప్పుకొని "ఒక నెలరోజులపాటు తన బదులు తన భార్యే రాజ్యపాలన చేస్తుందనీ, తనతో సహా అందఱూ ఆమె మాటనే శిరసావహించాల్సి ఉంటుం"దనీ దేశమంతా చాటింపు వేయించాడు. ఆమె సింహాసనం మీద కూర్చున్న మొదటిరోజే "ఏలినవారు" అని మర్యాదగా తనని సంబోధించనందుకు భర్తకు పది కొరడాదెబ్బలు విధించింది. ఇహ ఆ నెలంతా ఎలా ప్రవర్తించాలో అర్థం కాక రాజుకు ప్రత్యక్ష నరకమే కనిపించింది. నెలరోజుల తరువాత మళ్ళీ రాజ్యాధికారాన్ని చేపట్టినాక రాజు భార్యతో "నీ వల్ల కొరడాదెబ్బలు తింటే తిన్నాను గానీ ఈ నెలరోజుల్లో నా కోపం చాలామటుకు తగ్గిపోయింది. ఎప్పుడూ శిక్షలు విధించడమే తప్ప నేనెప్పుడూ శిక్షకి పాత్రుణ్ణి కాలేదు. బహుశా అందుకే ఇంతకుముందు నాకు కోపం తగ్గలేదేమో" అన్నాడు. రాణి నవ్వి "అసలు కారణం కొరడాదెబ్బలు కాదు మహారాజా ! కోపాన్ని సహించి అణిగిమణిగి పడుండేవారు ఉన్నంతకాలం కోపం తగ్గదు. సాధారణంగా అలా పడుండేవారి మీదనే మనకి కోపం వస్తుంది. అలా పడుండనివారి మీద చస్తే కోపం రాదు. మనకి ఎవఱిమీదైనా అధికారం ఉంది అని మనం అనుకుంటే మనకి వారి మీద ఎల్లప్పుడూ కోపం వస్తూనే ఉంటుంది." అని వివరించింది.

పిల్లల మీద తల్లిదండ్రులకీ, శిష్యుల మీద గురువులకీ అధికారం లేకపోలేదు. అంతకంటే వారిని తమకి భగవంతుడు అప్పగించిన sacred trust గా మన్నించడం ఎక్కువ సరైనది. పెంచమని, తీర్చిదిద్దమనీ దేవుడు మనకప్పగించినవారికి శాపాలిచ్చి వారి బతుకుల్ని పాడుచెయ్యాలనే దుష్టచింతన నుంచి పెద్దలు విముక్తులు కావాలి. అప్పుడే వారు నిజమైన పెద్దలనిపించుకుంటారు. మనం తల్లిదండ్రులమో, భర్తలమో, గురువులమో అయినంత మాత్రాన మనం దేవుడి స్థానాన్ని ఆయన అనుమతి లేకుండా దురాక్రమించాలనే దుష్టసంకల్పాన్ని విసర్జించాలి. మన పిల్లలూ, మన భార్యలూ, శిష్యులూ మనల్ని దైవసమానంగా మన్నిస్తే మన్నించనివ్వండి ! వారి పవిత్రభావనకి తగ్గ ఫలితాన్ని వారు పొందుతారు. కానీ మనం మాత్రం దేవుళ్ళం కాదనే స్పృహతోను, తద్భిన్నంగా సాధారణ మానవులమేననే తెలివిడితోను మన తోటి మానవులందఱినీ ఆత్మవత్తుగా దర్శిస్తూ నిరాడంబర, అదాంభిక జీవితాన్ని గడుపుదాం.

Categories: Middle