http://supportloksatta.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
Updated: 14 min 43 sec ago

ప్రత్యేకరాష్ట్రం జాతిద్రోహమట!

Sat, 08/07/2010 - 00:37
ఆంధ్రాప్రాంతపు రాష్ట్రమంత్రులు శ్రీకృష్ణ కమిటీకి తమ నివేదిక సమర్పిస్తూ ఒక వినూత్నమైన అభిప్రాయాన్ని వెలికి తీసుకొచ్చారు.  స్వయంపాలన, ఆత్మగౌరవం ప్రాతిపదికన రాష్ట్రాన్ని అడగడం అంటే జాతివ్యతిరేకమట! ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం సమస్యపై వీరి అవగాహనా రాహిత్యమైనా అయ్యుండాలి. లేదా అసలుసమస్యకు మసిబూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నించడమైనా కారణమయ్యుండాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రులుగావుండి ఇలాంటి వివక్షాపూరితమైన వ్యాఖ్యలు చేస్తూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రెండుముక్కలుగా విభజింపబడిందని, రాష్ట్రంలో సమైక్యతని ప్రతిబింబించగల ప్రభుత్వం లేనేలేదని చెప్పకనేచెప్తూ, వాస్తవపరిస్థితికి అప్రయత్నంగానే అద్దంపట్టారు.

వీరివాదన ప్రకారం చూస్తే, మరి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం పోరాటం చేసిన పొట్టిశ్రీరాములుగారిని కూడా జాతివ్యతిరేకిగానే అర్థం చేసుకోవాలా అనే ప్రశ్న తప్పకుండా వస్తుంది. అలాగే ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలమని చెప్పిన సోనియాగాంధీ, పార్లమెంటులో విధాన ప్రకటన చేసిన చిదంబరం, అందరూ జాతివ్యతిరేకులే అనుకోవాలా?

అసలు రాష్ట్రాలు కొత్తగా ఏర్పరచడానికి రాజ్యాంగంలోనే వెసులుబాటు కల్పించబడి ఉంది. అలాంటి వెసులుబాటు కల్పించిన రాజ్యాంగ నిర్మాతలుకూడా వీరిదృష్టిలో జాతివ్యతిరేకులేనని అనుకోవాల్సి వస్తుంది.

రాష్ట్రానికి మంత్రులుగావుండి విధంగా మాట్లాడుతూ ప్రక్కనున్న ప్రాంతంపట్ల తమ ద్వేషాన్ని వెలిగక్కడంవల్ల ఒకవిధంగా ప్రత్యేకవాదానికి మేలే చేశారు.తమ అసంబద్ధవాదనలు రాష్ట్ర సమైక్యతకు ఏమాత్రం దోహదపడక పోవడమే కాక, రెండు ప్రాంతాల మధ్య నెలకొన్న అగాధాన్ని శ్రీకృష్ణ కమిటీ అర్థం చేసుకోవడానికి మాత్రం తప్పక తోడ్పడతాయి. 
Categories: Right

మాన్ హోల్ కవర్లు

Wed, 08/04/2010 - 01:33
ఒక దేశ నాగరికతా వికాసం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఆ దేశంలోని రోడ్ల మీది మాన్ హోల్స్ చూస్తే సరిపోతుందేమో. ఇది నేను నవ్వులాటకు అనటం లేదు. నిజంగానే అంటున్నాను. మాన్ హోల్స్ అంటే చాలా అప్రధానమైన విషయం అని అనిపించవచ్చు. కాని రోడ్డు భద్రత విషయంలో ఇదొక ముఖ్యమైన విషయం.

రోడ్డుమీద యధాలాపంగా డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాం. సడన్ గా  ముందు వాహనం కదిలి పోతుంది. అక్కడ యమకూపం లాంటి మాన్ హోల్ దర్శనమిస్తుంది. దాన్ని తప్పించడానికి స్టీరింగు కుడికో, ఎడమకో తిప్పుతాం, లేదా సడన్ బ్రేకు వేస్తాం. ఏం చేసినా రద్దీగా ఉండే రోడ్డుపై ఆక్సిడెంటు జరగడం ఖాయం. తర్వాత తిట్లూ, కొట్లాటలూ, కేసులూ మామూలే.

ఒకవేళ ఆ యమకూపాల మీద నుంచి అలాగే పోదామా? టైర్లు పగలడమో, విడిభాగాలు విరిగిపోవడమో, ద్విచక్రవాహనమైతే క్రింద పడిపోవడమో ఖాయంగా జరుగుతుంది.

అసలు మాన్ హోల్లు ఎలా వుండాలి? ఉదాహరణకు క్రింది బొమ్మలు చూడండి.


ఇలాంటి మాన్ హోల్లు కట్టడం బ్రహ్మ విద్యా? రాకెట్ సైన్సా? కనీసం సివిల్ ఇంజనీరింగ్ పరిజ్ఞానం కూడా అవసరం లేదు. తాపీ మేస్త్రీ పనితనం చాలు. కానీ మన మాన్ హోల్సు ఎలా ఉంటాయో పరీక్షిద్దాం. ఇది నేనేదో మనని మనం అవమానించుకోవడంగా భావించడం లేదు.  నిజాలను గమనించడంగా మాత్రమే అనుకుంటున్నాను.


ఇవి కేవలం ఉదాహరణకు మాత్రమే. ఘనతవహించిన మన హైదరాబాదు మహానగరంలో రాజమార్గాలపై ఇలాంటివి వందలు, వేలు కనపడతాయి. వీటిగుండా ప్రయాణం ఎంత నరక ప్రాయంగా ఉంటుందో వేరే చెప్పా నవసరం లేదు.

వీటికి మన రాజకీయులని నిందించి ప్రయోజనం లేదు. తప్పంతా ఇంజనీర్లదే. తినే కమీషన్లు ఎలాగూ బొక్కుతున్నారు. మెటీరియల్ క్వాలిటీలో ఎలాగూ కాంప్రమైజ్ అవుతున్నారు. కనీసం నిర్మాణంలో నైనా కాస్త క్వాలిటీ కంట్రోల్ చేస్తే వీళ్ళ సొమ్మేం పోయింది?
Categories: Right

ఈశాన్ రెడ్డి ఆత్మహత్య

Sat, 07/31/2010 - 12:05
ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ఈశాన్ రెడ్డి ఆత్మహత్య ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచి ఉంటుంది. ఇప్పటిదాకా జరిగిన ఆత్మహత్యలు వేరు. అవి తెలంగాణా పోరాటం వైఫల్యం చెందుతుందన్న నిస్పృహ వలన జరిగాయని అర్థం చేసుకోవచ్చు. కాని ఇప్పడు ఉప ఎన్నికలలో అత్యంత అధిక మెజారిటీతో తెలంగాణా వాదులు గెలిచిన పరిస్థితిలో తెలంగాణా అంతటా సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఈ ఆత్మహత్య జరగడం అందరినీ ఆలోచింపజేస్తుంది.  

తన ఆత్మహత్యకు గల కారణాన్ని వ్రాసుకున్న ఈశాన్, తాను డీఎస్ ఓడిపోతే ప్రాణాలర్పిస్తానని మైసంమకు మొక్కుకున్నానని, అందుకనే మొక్కు తీర్చుకుంటున్నానని  వ్రాసుకున్నాడు. అంటే కాక కొందరు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన నాయకులు తెలంగాణాకు చేసిన ద్రోహం గురించి కూడా దానిలో వ్రాసుకున్నాడు. 

ప్రముఖ మానసిక నిపుణుడు సి. నరసింహారావు గారు ఈమధ్య ఒక టీవీ ఛానెల్ లో ఆత్మ హత్యల గురించి వివరిస్తూ ఇలా చెప్పారు. "మనిషి వివిధ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకోవడానికి ఆలోచిస్తుంటాడు. అయితే ఏదయినా బలీయమైన కారణం వచ్చినప్పుడు అది ఒక tripping point గా పని చేస్తుంది" అని. బహుశా అలాంటి కారణమే ఈ మొక్కుబడి అనిపిస్తోంది .  

ఈ ఆత్మహత్యకే కాకుండా ఇలాంటి ఆత్మహత్యలన్నిటికి కూడా ఈనాటి సామాజిక, రాజకీయ పరిస్థితులే కారణంగా తోస్తోంది.

ప్రభుత్వం, ప్రభుత్వయంత్రాంగం నీతి నిజాయితీల్ని, జవాబుదారీతనాన్ని గాలికి వదిలేసింది. మొన్న డీయస్ అధికారులు, పోలీసు బలగాలు కొమ్ము కాస్తుండగా విచ్చలవిడిగా ఎన్నికల సమరంలో అవినీతి చర్యలకు పాల్పడుతుంటే మీడియా చేష్టలుడిగి నిలుచుంది. పెట్టుబడి దారుల కనుసన్నలలో నడుస్తున్న మీడియా, సెన్సేషన్ బరామీటరుతో కొలవకుండా ఏ పనీ చేయదు. ఆటువంటప్పుడు నిజామాబాదులో ఒకతను (పేరు గుర్తులేదు) ప్రాణత్యాగం చేసి మీడియాకి కావాల్సిన సెన్సేషన్ ఇస్తూ, డీఎస్ ఆగడాలను కనీసం బయటి ప్రపంచానికి చెప్పగలిగాడు.

అలాగే ఈరోజు ఈశాన్ కూడా తెలంగాణా పేరు చెప్పి మొసలి కన్నీరు కార్చి, పిదప మోసం చేసిన తెలుగుదేశం, కాంగ్రెస్ నేతలను ప్రజలముందు నేరస్తులుగా నిలుపగలిగాడు.

అంత మాత్రాన ఆత్మహత్యలను గాని, మూఢనమ్మకాలను గాని నేను సమర్థించడం లేదు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఇది ఎలా ఒక ఉద్యమ రూపంగా మారిందో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను.

ఒకప్పుడు పేదవాడి కోపం పెదవికి చేటు అనే వారు. ఇప్పుడు అది ప్రాణానికి చేటుగా మారింది.

చంద్రబాబు లాంటి జాతీయస్థాయిలో పలుకుబడి కలిగిన నాయకుడు మీడియాలో సెన్సేషన్ కలిగించడానికి (అతని రాజకీయపు తెట్టుగడలను కాసేపు పక్కన బెడదాం) మరో యాభై మంది ఎమ్మెల్యేలతో కలిసి బాబ్లీకి వెళ్లి తన్నులు తినాల్సి వచ్చింది.

ఒక పేదవాడు ఒక రోజుపాటు మీడియాలో స్పేసు ఆక్రమించి తన వాదనను వినిపించడానికి తన ప్రాణాలను బలి పెడుతున్నాడని అనిపిస్తుంది.

జరుగుతున్న యదార్థం ఇది. అయితే దీనికి పరిష్కారం ఆలోచించాల్సిందే.
Categories: Right

ఉప ఎన్నికలు, ప్రజల్లో కనిపించిన స్పష్టమైన మార్పు

Fri, 07/30/2010 - 02:13
ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు తెలంగాణా వాదానికి స్పష్టంగా పట్టం కట్టాయని తెలుస్తోంది. అయితే దీంట్లో మనం గమనించ వలసిన మరో కోణం ఉంది. అది ప్రజల్లో వచ్చిన స్పష్టమైన మార్పు. ప్రజలు డబ్బు, ఇతర ప్రలోభాలను పూర్తిగా తిరస్కరించడం చాలా శుభ పరిణామం.

ఎన్టీ రామారావు కాలం వరకూ ప్రజలు దాదాపు నిస్వార్థంగానే వోటు వేసే వారు. కాక పోతే తమ వోటు విలువ తమకే తెలిసేది కాదు. అమాయకత్వంతో తమ మీద పెత్తనం చేసే వారు ఎవరి పేరు చెపితే వారికి వోటు వేసే వారు. కాని ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాత్రం స్పష్టమైన మార్పు కనిపించింది. అప్పత్రికి రాష్ట్రంలో ప్రబలంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు చెప్పిన దానికి విరుద్ధంగా ఎన్టీయార్ ని గెలిపించారు. ఎన్టీయార్ సినీ గ్లామర్ కూడా దీనికి కొంత తోడయ్యింది.

వోటును డబ్బుపెట్టి కొనుక్కునే సంస్కృతి ప్రధానంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాతే మొదలయ్యింది. అలాగే రాజకీయాలను, వ్యాపారాన్ని కలగాపులగం చేయడం కూడా అప్పటినుండే మొదలయ్యింది. అయితే దీన్ని పూర్తిస్థాయిలో వ్యవస్థీకృతం చేసిన ఘనత మాత్రం రాజశేఖర్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. ప్రజల్లో కూడా ఒకరకమైన నిరాశ, నిస్పృహ ఆవరించి, 'ఎవరికీ వేస్తే ఒరిగేది ఏముంది' అన్న ధోరణిలో ఎవరు ఎక్కువ డబ్బులు ఇవ్వగలిగితే వారికే వోటు వేయడం మొదలు పెట్టారు.

అయితే ఈ ఉప ఎన్నికలలో ప్రజల ధోరణిలో స్పష్టమైన మార్పు వచ్చింది. చాలాకాలం తర్వాత తమ వోటు విలువ ఏమిటో గుర్తించారేమో అనిపిస్తుంది.

గత కొన్ని రాలుగా అందిన వార్తల ప్రకారం ఈ ఎన్నికల్లో, ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గంలో విపరీతమైన ప్రలోభాలు కొనసాగినట్టు వార్తలు వచ్చాయి. ప్రతి వోటుకు వేల రూపాయలు వెలకట్టటమే కాకుండా మద్యం, మాంసం లాంటి ప్రలోభాలకు కూడా అధికార పార్టీ వారు గురిచేసారు. అయినా కూడా వోటర్లు తమ నిగ్రహాన్ని చూపెట్టారు. వోటర్లలో వచ్చిన ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మాత్రం మున్ముందు మన రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు వస్తుందని ఆశించవచ్చు.
Categories: Right

బయటపడ్డ బాబు నిజస్వరూపం

Sat, 07/24/2010 - 01:30
చంద్రబాబు నాయుడి బాబ్లీ పర్యటన కుటిల రాజకీయపుతెట్టుగడే కాని ఇసుమంత కూడా ఇందు లోనిజాయితీ కాని, రాష్ట్రానికి లబ్ది చేకూర్చే ఉద్దేశం కాని లేదని నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశం తేటతెల్లం చేసింది.

ఢిల్లీలో ఇరవై ఆరున బాబ్లీపై ప్రధానితో జరుగబోయే అఖిలపక్ష సమావేశానికి రాష్ట్రవాదనలు వినిపించేందుకు, తగినవ్యూహం రచించడానికి, అలాగే రాష్ట్రంలోని రాజకీయ పక్షాలాన్నీ ఒకేవాదనని గట్టిగా వినిపించేందుకు ఉద్దేశించి ముఖ్యమంత్రి రోశయ్య గారు నిన్న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హాజరు కావడానికి అన్ని రాజకీయ పార్టీల నుండి ఒక్కొక్కరు హాజరు కావాల్సిందిగా ముందే ఆహ్వానాలు పంపడం జరిగింది. ఈ సమావేశానికి అన్ని పార్టీల వారు హాజరయ్యారు, ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప.

నిన్నటిదాకా బాబ్లీని ఆపడానికి ప్రాణాలైనా అర్పిస్తామని ప్రగల్భాలు పలికిన తెలుగుదేశం పార్టీకి, ఇప్పుడు కనీసం పరిష్కారం దిశగా జరిగే అఖిలపక్ష సమావేశానికి కూడా హాజరు కావాల్సిన అవసరం కనిపించ లేదు. కారణాలు సుస్పష్టం. ఈ మీటింగుకి హాజరు కావడంవల్ల తెలుగుదేశం పార్టీకి గాని, చంద్రబాబు నాయుడికి గాని ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ ఉండదు, రాష్ట్రానికి ఏ మంచి జరిగినా అది ఒక టీంవర్కు క్రిందికి వస్తుంది.

రాష్ర ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే మిన్నగా భావించే చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి హాజరు కావడానికి విముఖత చూపించడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. పోతిరెడ్డిపాడు అక్రమంగా నిర్మించినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా సహకరించిన చంద్రబాబు, రాజోలిబండ గేట్లు పేల్చివేసినా మిన్నకుండి, ఏనాడూ వాటి పునర్నిర్మాణానికి కృషిచేయని చంద్రబాబు, అలమట్టి డ్యాము కట్టినప్పుడు గాఢనిద్ర పోయిన చంద్రబాబు, ఇప్పుడేదో జ్ఞానోదయం కలిగి, ప్రజాసమస్యలపై స్పందిచడం నేర్చుకుని మందీ మార్బలంతో వోల్వోయాత్రకు సమకట్టాడని భావిస్తే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు.

అఖిలపక్ష సమావేశానికి తెలుగుదేశం పార్టీ డుమ్మా కొట్టిన విధానం చూస్తే చిన్నపిల్లవాడికి కూడా నవ్వురాక మానదు. ఒక్కరే రమ్మని పిలిస్తే అన్ని పార్టీలలో నుండి ఒక్కొక్క ప్రతినిధి రాగా వీరిపార్టీ నుండి నలుగురు వచ్చారట. ఎందుకు నలుగురు రావడం? అసెంబ్లీలో మాదిరిగా గలభా చేయడానికా? లేదా వీరి పార్టీలో ఎవరికీ ఒక్కరే పాల్గొని తమవాదన వినిపించే సమర్థత లేదా? మొత్తానికి నలుగురినీ పాల్గొన నివ్వలేదని అలిగి మొత్తానికే డుమ్మా కొట్టారు.

రేపు ఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి కూడా ప్రతి పార్టీనుండి ఒక్కొక్కరే రావాలని ఆహ్వానించారు. కానీ ఇప్పుడు వీరు ఇస్తున్న ప్రకటనల ప్రకారం అక్కడికి కూడా ఐదుగురు వెళ్తారట. అక్కడ కూడా ఐదుగురిని రానీయక పోతే అసలు లోనికే వెళ్ళరట! ఇదీ వీరు వెలగబెట్టే ప్రజా సేవ! ఇతర పార్టీలనుండి ఎక్కువమంది ప్రతినిధులను ఆహ్వానిస్తే ప్రశ్నించ వచ్చు. అన్ని పార్టీలనుండి ఒక్కొక్కరే వస్తున్నప్పుడు, తాము మాత్రం ఐదుగురం వస్తామని, లేకపోతే అసలు రామనీ మడత పేచీలు పెట్టడంలోనే తెలియడం లేదూ, వీరి రహస్య ఎజెండా ఏమిటో?

వీరికి నిజంగా బాబ్లీ ప్రాజెక్టును ఆపడంలో అందుకు జరిగే ఎలాంటి ప్రభుత్వ పరమైన ప్రయత్నానికైనా సహకారాన్ని అందించాలి. ప్రధాన ప్రతిపక్షంగా మిగతా వారికన్నా వీరికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాని ప్రతి దానికీ వీరే ముందు మోకాలడ్డుతుంటే మహారాష్ట్రకుగాని, కేంద్రానికిగాని ఎలాంటి సంకేతాలు వెళ్ళుతాయో చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు తాను, ఈరాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న నాయకుడినని గుర్తుకు తెచ్చుకొని, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే బాగుంటుంది.
Categories: Right

పద్యాలతో కుస్తీ

Thu, 07/22/2010 - 16:01
td{vertical-align: top;}
పదో తరగతి చదివేటప్పుడు తెలుగు టీచర్ అనంతాచార్యుల వారు చందస్సు నేర్పించారు. ఆ సందర్భంగా  ఆటవెలది పద్యాన్ని బోధిస్తూ, ఒక పద్య పాదాన్ని ఇచ్చి పూరించమని చెప్పారు. అది...

'ఆట వెలదు లెల్ల నాటాడు నప్పుడు'

చందస్సు నేర్చుకున్న ఆనందంతో సమధికోత్సాహంతో ఇలా పూరించాను.

 ఆ. వె.ఆట వెలదు లెల్ల నాటాడు నప్పుడు
పాడునపుడు మనము పరవశించి 
మేను పులకరించి మేఘ మధ్యంబునం
దాటలాడుచున్న యట్లు దోచు
తర్వాత ఇంగ్లీషు మీడియం చదువు, సాంకేతిక విద్య కావడంవల్ల పద్యాల గురించి పూర్తిగా మరిచే పోయాను. మళ్ళీ ఇలా బ్లాగులోకం లోకి వచ్చిన తర్వాతనే పద్యాలు రాయడానికి ప్రయత్నం చేశాను. చింతా రామకృష్ణా రావుగారి ఆశీర్వచనం, ఆచార్య ఫణీంద్ర గారి వద్ద శిష్యరికం, కండి శంకరయ్య గారి ప్రోత్సాహం లేకుంటే జీవితంలో మళ్ళీ ఎప్పుడూ పద్యం రాసి ఉండే వాడిని కాదంటే అతిశయోక్తి కాదేమో. ఈ సందర్భంగా వివిధ బ్లాగులలో నేను వ్రాసిన కొన్ని పద్యాలు.

ఆ. వె.ఆశ లేని బ్రతుకు అడవిలో వెన్నెల
ఆశ యందె కలుగు ఆశయములు
ఆశ యుండు టెల్ల అత్యాశ కాబోదు
ఆశ లోనె కలదు దేశ భవిత చం.సరుకులు కొందమన్న మరి చాలవు జీతపు డబ్బు లేటికిన్
తిరుగుద మన్న రోడ్లపయి తిప్పలు తప్పవు పాటు హోల్సుతో
ఎరుగము నీటి పంపు ప్రతి యింటికి తప్పక వచ్చు రోజులన్
మరతుము వీటినన్నిటిని మానము వేతుము వోటువారికే మ.జలమోయంచును చేయు పూజలకు కాస్తంతన్ దయే లేని ఆ
కలియే నాట్యము చేసెనా యనగ, పొంగారెన్ నదీ మాతలే !
కలలోనైనను గాంచ నోపుదుమె ’ హా ’ కారాల ఆర్త ధ్వనుల్ ?
జలమే రాక్షసియై ప్రజావళి నయో ! సంహారమున్ సల్పెనే !తే. గీ. బియ్య మదిజూడ నింగితో నెయ్యమందు
కూరగాయలా అరపూట గూడరావు
ధరల గతిజూడ దడపుట్టు ధరణిలోన
పప్పు కొనబోవుటే పెద్ద తప్పు నేడు ! కం. అసమర్థు లాడు వాండ్రని
నసిగెడు వారెల్ల రింక నచ్చెరు వందే
దెస సోనియ ’ప్రతిభ’ను లో
క సభాధ్యక్షతను పొందె కాంతామణియే. ఉ.'సీమ'ను క్షామ మెక్కువని చెప్పుచు కొందరు; కాదు కాదు మా
సీమన క్షామ మెక్కువని చెప్పెద రింకొక ప్రాంత నాయకుల్;
క్షామము తాండవించుటకు కారణ మౌచును, సిగ్గు లేకయున్
క్షామము బ్రోచుచుండుటనె గౌరవ మొందుట; సత్యమిద్ధరన్.కం.బాధను విలవిల లాడె వి
రాధుడు గాయము లగుటను రాముని వలనన్
క్రోధము నంతట వీడి వి
రాధా! యిటు రమ్మటంచు రాముఁడు పిలిచెన్. ఉ. తీయని మాటలాడుచును ధీమతి వోలెను పోజు బెట్టుచున్
మాయలు చేయువాడొకడు, మై నలుపై నొకడొప్పు తక్కువై
గాయపు మచ్చలుండినను గుణ్యత గల్గిన వాడు గావుటన్
రోయకఁ బెండ్లియాడెను కురూపిని చక్కని చుక్క ప్రేమతో. ఆ. వె. పడకటింటగూడ ప్రాజెక్టు పనులాయె
తెల్లవారుదాక తీరదాయె
ఝాము పొద్దు కాగ జవరాలు నీవంటు
వేళ కాని వేళ బిలువ దగునె కం.చూపెన్ పడతుల సొంపులు
ఆపయి వయలెన్సు నింపి ఔరా యనగన్
చూపెను దుబాయి లండన్
సూపరు హిట్ చిత్రము కయి సుతుడే కోరన్ తే. గీ. మాటి మాటికి ఫోనులో మంతనాలు
తప్పు కొనవలెనన్న యేదారి లేక
కాన్ఫరెన్సు యుందని చెప్పి కల్ల లాడ
సెల్లుఫోను లసత్యముల్ జెప్ప నేర్చె ఆ. వె. జబ్బు చేసినంత డబ్బు సాయ మడుగ
ప్రాణ మిత్రుడొకడు పారి పోయె
వైరిగా తలచిన వాడు సాయ పడిన
ధనమె గొప్ప మంచితనము కంటె. ఆ. వె.ఫాక్షనిజము సల్పి పలు నేరముల జేసి
పదవి వచ్చినంత ఫ్రాడు జేసి
తాను జచ్చినంత తనయుడు అరుదెంచి
పేరు లేనివాఁడు పేర్మిఁ గనెను. తే. గీ.ధనము కలిగిన మనసుకు తృప్తి లేదు
కొంత యుండిన మరియింత కోర నగును
తనను మించిన కలుగును తామసంబు
కలిమి యెడబాసి నప్పుడే కలుగు సుఖము. 
మరిన్ని ఇంకో టపాలో...
Categories: Right

బాబ్లీ ఎత్తుగడ, పర్యవసానాలు

Thu, 07/22/2010 - 02:23
చంద్రబాబు నాయుడి బాబ్లీ యాత్ర పై రక రకాలు గా విశ్లేషణలు జరుగుతున్నాయి. దాదాపుగా అందరూ 'ఈ యాత్ర రాజకీయ దురుద్దేశాలతో కూడి ఉన్నది' అన్న విషయంలో ఏకాభిప్రాయం తో వున్నట్టుగా కనిపించింది. అయితే ఈ విషయం ఒప్పుకుంటూనే, చంద్రబాబు ఏ ఉద్దేశంతో ఈ యాత్ర చేసినా, మన రాష్ట్రానికి మాత్రం మంచే జరుగుతుంది కదా? మరి మంచి జరిగే విషయాన్ని అందరం సమర్ధించాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు మరింత ముందుకెళ్ళి చంద్రబాబుది స్వార్థమే అయినా 'ఉత్తమ స్వార్థం' అని, తద్వారా ఆయన చేసే పని ఉత్తమ మైనదని అభివర్ణించడానికి ప్రయత్నించారు.

అసలు స్వార్థం అంటే ఏమిటి? స్వప్రయోజనాల కోసం చేసే పని. అది వ్యక్తిగా కావచ్చు, సమూహ శక్తిగా కావచ్చు. ఈ రోజులలో ఎవరు ఏ పని చేసినా అది స్వార్థం కోసం కాక, పరోపకారం కోసం అని అనుకోలేం. ఏ పని చేయడానికైనా స్వార్థం అనేది ఒక తప్పనిసరి ఆవశ్యకతగా ఉంటుంది. ఒక వేళ పరోపకారమే అత్యుత్తమమని అనుకున్నప్పుడు, ఆ ఉపకారం మహారాష్ట్రకే చేయవచ్చుగా? అది జరగని పని అని మనకు తెలుసు. మనం చేసే పనులకు తప్పనిసరిగా స్వార్థం పరమావధిగా ఉండ వలసిన అవసరం ఉంది.

స్వార్థమే పరమావధి అయినప్పుడు చంద్రబాబు చేసింది కరక్టే కదా?

దీనికన్నా ముందు మనం ప్రశ్నించు కోవలసినది 'అసలు చంద్రబాబు నాయుడికి ఉండవలసిన స్వార్థం ఏమిటి?'

రాజ శేఖర్ రెడ్డి అధికారం లోకి వచ్చినప్పటి నుండి చంద్ర బాబు నాయుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏవిధంగానూ అతనికి ధీటుగా నిలువ లేక పోయాడు. ఒక్క ఓబులాపురం మైన్లు తప్ప ఈయన తీసుకుని పోరాడిన సమస్యలు ఏవీ లేవు. అలాగని రాజ శేఖర్ రెడ్డి అంటా మంచే చేశాడని కాదు, చంద్రబాబే ప్రజల లోకి వెళ్ళడంలో విఫల మయ్యాడు.

తను తీసుకున్న రక రకాల నిర్ణయాల ఫలితంగా ఇటు తెలంగాణా లోనూ, అటు ఆంధ్రాలోనూ ప్రజలకు దూరమయ్యాడు. రెండో సారి కూడా అధికారం లోకి రాలేక పోయాడు. ఇప్పటి పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. ఇప్పటికే చిరంజీవి ఓటు బ్యాంకులో చీలిక తెచ్చాడు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి యాత్రలకు కూడా విపరీతమైన ప్రజాదరణ లభిస్తుంది. ఈ పరిస్థితులలో 2014 లో కూడా అధికారం అంత సులువుగా వచ్చే టట్టు కనిపించడం లేదు.

కాబట్టి ప్రజలలో తనకు తగ్గుతున్న ప్రజాదరణను పునరుద్ధరించుకోవడం చంద్రబాబు తక్షణ కర్తవ్యం. ఇదే అతనికి ఉండాల్సిన స్వార్థం.

మరి పోయిన ప్రజాదరణని తిరిగి పొందాలంటే ఏమిచేయాలి? తాను ఎక్కడ కోల్పోయాడో అక్కడే తిరిగి వెతుక్కోవాలి. ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజా సమస్యలపై ప్రజా ఉద్యమాలు చేయాలి. తెలంగాణాపై గోడమీది పిల్లి వాటం వదిలేసి ఒక స్పష్ట మైన వైఖరి ప్రకటించాలి.

రాష్ట్రంలో అన్ని సమస్యలు గాలికొదిలేసిన చంద్రబాబు బాబ్లీ యాత్ర ద్వారా మాహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ల మధ్యన జాతి విద్వేషాలకు తేరా లేపాడు. 'తెలుగు జాతి, తెలుగు జాతిని అవమానించిన మరాఠీలు' లాంటి నినాదాల ద్వారా మరో బాల్ థాకరే మోడల్ ని ఆంధ్రప్రదేశ్ లో స్థాపించడానికి పూనుకున్నాడు.

నీచ మైన ఇలాంటి ఎత్తుగడల వలన ఫలితాలు అంతకన్నా నీచంగానే ఉంటాయని తెలుసుకోవడానికి ఎక్కువ కాలం పట్టదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ సాలూర ప్రాజెక్టు పై శివసేన తలపెట్టిన దాడి. ఇప్పటి వరకు అందిన వార్తల ప్రకారం సాలూర వైపు శివ సైనికులు దండెత్తి వస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి ప్రతిగా మన వారు కూడా సరిహద్దుల్లో కర్రలతో మొహరించారు. దీని పర్యవసానాలు ఏవయినా వీటికి పూర్తి బాధ్యత వహించాల్సింది బాధ్యతారహితంగా ప్రవర్తించిన చంద్రబాబు నాయుడే.
Categories: Right

బాబు హైటెక్ ధర్నా

Tue, 07/20/2010 - 00:39

 (ఈనాడు - 20.07.10)రాష్ట్రంలో తొంభై శాతం మంది రోజూ ప్రయాణం చేసేది ఈ బస్సులే సారూ!

(సాక్షి - 20.07.10) ఇంత హైటెక్ మనిషికి మామూలు బస్సులేం సరిపోతాయి లెండి!
Categories: Right

చంద్రబాబు బాబ్లీ రాజకీయం

Sun, 07/18/2010 - 14:53
చంద్ర బాబు నాయుడు డిసెంబరు తొమ్మిది తర్వాత ప్లేటు ఫిరాయించి తన అసలు స్వరూపం చూపించిన తర్వాత తెలంగాణలో తిరగడం కూడా గగనమై పోయింది. కనీసం ఎక్కడా ఒక మీటింగు కూడా నిర్వహించలేని పరిస్థితి. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ప్రజలకు దూరమై పోవడం తెలుగుదేశం వర్గాల్లో సహజంగానే కలవరపాటును కలిగించింది. ముఖ్యంగా ఉప ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో తమ పార్టీ నాయకుడే ప్రజలకు ముఖం చాటేయాల్సి రావడం దాదాపు ఎక్కడా ఊహించ లేని పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి తెలంగాణాలో చంద్రబాబు నాయుడు ముఖాన్ని చెల్లుబాటు చేయించడం తక్షణ కర్తవ్యంగా మారింది.

సహజంగానే రాజకీయ చతురత కలిగిన బాబుకు తెలంగాణాలో తిరిగి పేరు తెచ్చుకోవడానికి బాబ్లి ప్రాజెక్టు రూపంలో అవకాశం లభించింది. అనుకున్నదే తడవు అసెంబ్లీలో తన తడాఖా చూపించడం మొదలు పెట్టాడు. మొన్న జరిగిన మహానాడులో తెలంగాణా పదం కూడా ఉచ్ఛరించకుండా ఆంక్షలు విధించిన చంద్రబాబుకి అక్కడి ప్రజలపై ఇప్పుడు విపరీతమైన ప్రేమ పుట్టు కొచ్చింది.

ఈయన జోరుని చూసిన రోశయ్య కూడా హడావుడిగా ఢిల్లీకి వెళ్లి అఖిల పక్షం కొరకు ప్రధానితో అప్పాయింటుమెంటు తీసుకుని మరీ వచ్చాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన అవకాశాన్ని ఇలా అఖిలపక్షం పేరు చెప్పి రోశయ్య లాక్కు వెళితే బాబు ఊరుకుంటాడా? నేను బాబ్లీ వెళ్లి ఆ గేట్లను చూస్తే గాని ఢిల్లీ రాను అంటూ శపథం చేసేశాడు. 74 మందీ మార్బలంతో వోల్వో బస్సులను అధిరోహించి బాబ్లీ వైపు ప్రయాణం కట్టాడు. అక్కడికి వెళ్లి వీళ్ళంతా ప్రాజెక్టు చూసి పొడిచేసేది ఏమీ ఉండదు. బాబ్లీకి గేట్లు బిగించారనేది బహిరంగ రహస్యం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా కోర్టు ధిక్కారం కింద పిటీషను వేసింది. కోర్టు తీర్పు ఎలానూ రాబోతుంది.

ఈయన జోరు చూసిన మహారాష్ట్రం ప్రతిపక్షాల వారు 'బాబ్లీ బచావో' అంటూ ఆందోళన మొదలు పెట్టారు. కుడితిలో పడ్డ ఎలుకలాగా మారింది మహారాష్ట్ర పరిస్థితి. చంద్ర బాబుని రానివ్వా లేరు. అలాగని గట్టిగా ఆపనూ లేరు. ఎందుకంటే దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు చంద్ర బాబుకు ఉంది. అక్కడ జరుగుతున్న ఆందోళనని సాకుగా చూపి మొత్తమ్మీద వీరిని అరెస్టు చేశారు. తర్వాత నాలిక్కరుచుకుని 'బాబ్బాబు, కాస్త స్వంత పూచీకత్తు ఇచ్చి బెయిలు తీసుకుని పుణ్యం కట్టుకోండి' అంటూ బతిమిలాడారు. కాని బాబు ఎందుకొప్పు కుంటాడు? ఒప్పుకుంటే ఇప్పటిదాకా పడిన కష్టం వృధా అవదూ?

మొత్తానికి ఈ దెబ్బతో అంతో ఇంతో పొలిటికల్ మైలేజీ సాధించినట్టే కనబడుతున్నాడు. రేపటి బందుకు వచ్చే ప్రతిస్పందనని బట్టి సాఫల్యం యొక్క గాఢత బయట పడుతుంది. ఉద్దేశాలు ఎలాంటివైనా దీనివల్ల చంద్రబాబు ఆధ్రప్రదేశ్ రాజకీయాల్లో, మీడియాలో బాబ్లీపై కొంత కదలిక తీసుకు రాగలిగాడు. కాని దీనివల్ల తెలంగాణా ప్రజల అభిమానాన్ని తిరిగి పొందగలడా అంటే అనుమానమే. తనను తాను నిరూపించు కోవాలంటే ఇలాంటి చిల్లర జిమ్మిక్కులు కాకుండా నిఖార్సైన పనులు ఇంకా చేయాల్సి ఉంది. అందులో ఒకటి శ్రీకృష్ణ కమిటీకి నిజాయితీగా నివేదిక ఇవ్వడం.

బాబు సాఫల్యత సంగతి పక్కకు పెడితే, దీనివల్ల రాష్ట్రానికి ఏమైనా ఒరిగిందా అంటే అదీ అనుమానమే. ఇప్పుడు ఈయన ఆకడికి వెళ్లి అరెస్టు కావడం వలన నిజామాబాద్ వద్ద బోర్దరులో లాఠీ చార్జ్ జరిగింది. రేపు తెలుగుదేశం నాయకుల అరెస్టు ఇలాగే కొనసాగితే రెండు రాష్ట్రాల మధ్యన మరింత విద్వేషాలు పెరగ వచ్చు. అలా జరిగితే తమిళనాడు, కర్ణాటక మాదిరిగా వ్యక్తిగత దాడులు, పరస్పర ఆస్తుల నష్టం లాంటివి కూడా మొదలవుతాయి. అసలే మరాఠీ వారు ఇలాంటి వాటిలో ఆరితేరిన వారు. వీటిలో ఎక్కువగా బలయ్యేది భీవండి, ముంబాయిలకు వలస వెళ్లి బతుకు తున్న పేద కార్మికులే.

ఇంత జరిగినా చివరకు ఏమైనా ఒరుగుతుందా అంటే అదీ అనుమానమే. సుప్రీం కోర్టు దిక్కారానికే తెగబడ్డ మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వదులు కుంటుందా? ఒకవేళ ప్రధాని చెప్పినా ప్రాజెక్టు విషయంలోమహారాష్ట్ర వెనక్కి తగ్గితే అక్కడి ప్రతిపక్షాలు దీన్నొక ఇష్యూ చేయకుండా వదులుతాయా?

ఏదేమైనప్పటికీ ఈ సమస్య ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Categories: Right

మతం మంచిదా, చెడ్డదా?

Sat, 06/19/2010 - 02:51
మతం మంచిదా, చెడ్డదా అనే విషయం మీద రక రకాల చర్చలు జరుగుతున్నాయి. మంచి, చెడుల స్వభావం గూర్చి గతం లోనే ఒక వ్యాసం వ్రాసి ఉన్నాను. మంచి, లేదా చెడు అనేవి విశ్వంలో ముందే నిర్ణయించ బడి లేవు. అవి దేశ కాల పరిస్థితుల కనుగుణంగా మారుతుంటాయి. ఒక దృష్టి కోణం లోంచి మంచిగా కనపడిన విషయం మరో దృష్టి కోణం నుంచి చెడుగా కనపడేందుకు ఎంతైనా అవకాశం ఉంది.

ఇంతకీ మతమంటే ఏమిటి? మతమంటే ఒక మార్గం. ఒక జీవన విధానం. ఇప్పటి వరకు ఎన్నో మతాలు ఉద్భవించాయి, కొన్ని మతాలు స్థాపించ బడ్డాయి. చాలా మంది పుట్టుకతో మతాన్ని వారసత్వంగా పొందుతున్నారు. కొంతమంది ఇష్ట పడి మతాన్ని స్వీకరిస్తున్నారు.

దార్శనికులైన వ్యక్తులు తాము చూసిన ప్రపంచం లోని రకరకాల అవకరాల గురించి తీవ్రంగా ఆలోచించి కొన్ని నియమాలను ప్రతిపాదిస్తారు. ఈ నియమాలనే జనానికి ప్రభోధిస్తారు. ఎక్కువ మంది జనం ఈ నియమాలు నిజంగా తమ సమస్యలని పరిష్కరిస్తాయని భావించినప్పుడు వారంతా ఒక మతంగా మారటం మనం చరిత్ర ద్వారా తెలుసుకున్నాం. ఇలా ఏర్పడ్డ మతంలోని అనుయాయులు తరువాత తరంలో తమ మత సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేక దిశలో పయనించడం కూడా చూశాం. ఉదాహరణలు కోకొల్లలు. క్రీస్తు, 'తప్పు చేయని వాడు మొదటి రాయి విసరాల్సింది'గా తన అనుయాయులను కోరాడు. కాని తరువాత తరాల క్రిస్టియన్లు అన్య మతస్తులను రాళ్ళతో కొట్టి, సజీవ దహనాలకు పాల్పడి ఎలా హింసించారో మనం చూశాం.  

ఈవిధంగా మతం మహాపురుషుల సదాశాయాలతో ప్రారంభమైనప్పటికీ ఎలాంటి వికృత రూపలోకి మార్పు చెందగలదో చరిత్రను పరికిస్తే అర్థమౌతుంది. మతం సమూహశక్తిగా మారినప్పుడు, ఆ శక్తి అసాంఘిక శక్తుల నేత్రుత్వంలోకి వచ్చినప్పుడు దాని అసలు విధ్వంసక శక్తి బయట పడుతుంది. మతం అంటే మార్గంగా ముందే నిర్వచించు కున్నాం. నా దృష్టిలో ఆలోచనా రహిత సమూహశక్తిగా మారిన కమ్యూనిజం కూడా ఒక మతమే. సిద్ధాంతాలను తుంగలో తొక్కి అది పాల్పడిన దురాగతాలు కూడా మనం చరిత్రలో చూశాం.

ఇక పోతే ప్రతి మతం లోనూ కొన్ని నియమాలు ఉంటాయి. ఈ నియమాలు మతం పుట్టిన కాలంలో ఉన్న పరిస్థితుల వలన అప్పటి మేదావులైన ప్రవక్తలు హేతుబద్ధంగా ఆలోచించి నిర్ణయించినవిగా ఉంటాయి. ఆ కాలంలో ఆయా నిర్ణయాలు, నియమాలు మంచివి గా భావించి ఉండవచ్చు. అంత మాత్రాన అవి సార్వకాలీన సత్యాలుగా భావించ వలసిన అవసరం కనిపించదు. ఉదాహరణకి ఇస్లాం మతం లో నలుగురు భార్యలను పెళ్లి చెసుకోవడానికి అనుమతి ఉంది. బహుశా ఆ కాలంలో విపరీతమైన యుద్ధాల వలన పురుషులు మహిళల కన్నా తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు, సామాజిక సంబంధాలను కాపాడడానికి ఇలాంటి వెసులు బాటు కల్పించి ఉంటారు. ఆ కాలంలో మహిళలకు వెసులుబాటుగా ఉన్న ఈ అవకాశం, ఈనాడు వారి హక్కులకు భంగకరం కావడం చూస్తున్నాం. అలాగే పూర్వ కాలంలో మన దేశంలోని రాజులు, పరపతి గలవారు అధిక సంఖ్యలో భార్యలు కలిగి ఉండడం, ఆ కారణంగా కొందరికి వధువులు దొరక్క పోవడం వలన, దాన్ని కట్టడి చేయడానికి హిందూ మతంలో ఏక పత్నీవ్రతం విధించి ఉంటారు.   

అలాగే మనం అన్ని  మతాల లోనూ ఎన్నో రకాలైన ఆచారాలను చూస్తుంటాం. ఇవన్నీ సంబధిత కాలంలో ఎంతో అవసరమైనవీ, హేతుబద్ధంగా అలోచించి నిర్ణయించినవీ కావచ్చు. కానీ ప్రస్తుత కాలంలో ఆ ఆచారాలు కాని, సాంప్రదాయాలు కాని యదాతధంగా అనుసరించడం మంచిది కాక పోవచ్చు. ఎందుకంటే ముందే అనుకున్నాం మంచి లేదా సత్యం అనేది కాలాన్ని, పరిస్థితులను బట్టి మారుతుందని.

నా ఉద్దేశంలో పైన చెప్పిన అవకరాలన్నిటికీ కారణం ఒక్కటే. సత్యం లేదా మంచి అచంచల మైనదిగా (immutable) నమ్మడం. తమ ప్రవక్త, లేదా నాయకుడు చెప్పిందే సత్యమని నమ్మడం. తమ నమ్మకాలకు, విశ్వాసాలకు అతీతంగా కూడా సత్యం ఉండే అవకాశం ఉంటుందని ఒప్పుకో లేక పోవడం. తమ విశ్వాసాలకు విరుద్ధంగా ఆలోచించడం తమ పైన దాడిగా భావించడం. ఇలా నమ్మడం వలన తాము సత్యం అనుకున్న దాన్ని రక్షించ డానికి ఎంతకైనా తెగిస్తారు.

ఏ మతాధిపతి కూడా తమ 'ప్రవక్త, లేదా ఆది గురువు చెప్పింది పూర్తిగా సత్యం కాకపోవచ్చని, కేవలం సమకాలికంగానే సత్యం కావచ్చు' అనే విషయాన్ని ఒప్పుకోడు. అలా ఒప్పుకుంటే ప్రవక్తపై విశ్వాసం సన్నగిల్లి మతం మొత్తం కకావికలం అయిపోయే ప్రమాదం ఉంది.
 
సత్యం అచంచలమైనదిగా నమ్మడం వలన మన దృష్టిలో డానికి ఒక రకమైన పవిత్రత ఏర్పడు తుంది. అచంచల మైన దానికి విరుద్ధంగా తర్కించడం, దాన్ని ప్రశ్నించడం కూడా  దుస్సాహసంగా కనబడుతుంది. తమ విశ్వాసాలకు విరుద్ధంగా ఇతరులు  అభిప్రాయాలను వ్యక్తీకరించి నపుడు వారిపై శతృత్వ భావం కలుగు తుంది. 

ఎప్పుడైతే సత్యం జడపదార్థంగా కాక నిరంతరం మార్పు చెందే విషయంగా గుర్తిస్తామో, అప్పుడు దాని గురించి ఆలోచించగల, తర్కించ గల వెసులుబాటు కలగుతుంది. చర్చించడానికి సుహృద్భావ పూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాంటి వాతావరణం అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది.     
Categories: Right

మద్యం, నిలకడ మీద సత్యం

Tue, 06/08/2010 - 01:36
తెలంగాణా వారంతా తాగుబోతులని, అందుకనే వారు అభివృద్ధిలోకి రావడం లేదని సమైక్యవాదులు అభాండాలు వేయడం సర్వ సాధారణ మైపోయింది. నిన్న జరిగిన మద్యం వేలంపాటలు వాస్తవ పరిస్థితికి అద్దం పడుతున్నాయి.


పైది ఈరోజు సాక్షిలో వచ్చిన సమాచారం. అత్యధిక ఆదాయం కలిగిన పది దుకాణాల్లో మూడు దుకాణాలు మాత్రమే తెలంగాణాకి చెందినవి. అందులో రెండు జంట నగరాలకి చెందినవి.


ఇది ఈరోజు ఈనాడులో వచ్చిన సమాచారం. దీని ప్రకారం చూస్తే గుంటూరు ఐదొందలకు పైగా కోట్లతో మొదటి స్థానంలో, కృష్ణా నాలుగొందల కోట్లతో రెండో స్థానంలో, నెల్లూరు, విశాఖ, చిత్తూరు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
Categories: Right

అడవులు

Fri, 05/21/2010 - 02:00
ఈ మధ్య ఒక శుభ కార్యానికి హాజరు కావడానికి వరంగల్ జిల్లాలోని ఒక ఊరికి వెళ్లాను. ఇదివరలో చూసినప్పుడు ఆ వూరిలో నిండుగా చెట్లు ఉండేవి. ఈ సారి ఒక్కటి కూడా కనపడక పోయేసరికి ఊళ్ళో ఒకతన్ని విషయం అడిగాను.

'ఏం చెప్ప మంటారు సార్. పనికి ఆహార పథకం కింద ఉన్న చెట్లన్నీ నరికేస్తున్నారు.' అని సమాధానం.

పనికి ఆహార పథకం క్రింద ఉన్న పనుల్లో చెట్లు నరకడం ఒకటి. డబ్బులు పంచుకోవడం కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి కనపడిన చేట్టునల్లా నరికేస్తున్నారు. దీనివల్ల ఊరికి, పర్యావరణానికి ఎంత అపకారం జరుగుతుందో ఎవరికీ పట్టడం లేదు.

నలభయ్యేడు డిగ్రీల ఉష్ణోగ్రత. ఎండా భగ భగ మండి పోతుంది. నిలబడదామంటే చెట్టు కనిపించ లేదు.

'ఊళ్ళో చెట్లు సరే, మరి ఇళ్ళల్లో చెట్లు ఏమయ్యాయి?'

మళ్ళీ అతనే చెప్పాడు. 'ఈ మధ్య ఊరిలో వాస్తు పిచ్చి ఎక్కువయ్యింది. ఇంట్లో ఉండ కూడదని మామిడి చెట్టు, నిమ్మ చెట్టు, యూకలిప్టస్ చెట్టు, పొప్పడి చెట్టు... ఇలా రక రకాల చెట్లను నరికేస్తున్నారు.'

నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఎవరు ఏది చెపితే అది నమ్మే ఈ జనం ఎప్పుడు బాగు పడతారో అర్థం కాదు!

పల్లెటూళ్ళలో విద్యాగంధం లేని ప్రజలు ఇలా చేస్తుంటే మరి ప్రభుత్వం ఎలా చేస్తుందో ఈరోజు ఈనాడు పేపర్ చూస్తే తెలిసింది. తీర ప్రాంతంలో చెట్లు విచక్షణా రహితంగా నరికి వేయడానికి, తుఫాను విధ్వంస తీవ్రతకు సంబంధం ఉంది. ఈ విషయం ప్రపంచ పర్యావరణ సంస్థ మాజీ సలహాదారు శ్రీ జీవానంద రెడ్డి తెలిపారు. ఆయన ఇంకా ఈ క్రింది విషయాలు తెలిపారు.

శతాబ్దాల నుండి మడ అడవులు, గడ్డి దుబ్బులు, రబ్బరు చెట్లు, జీడి మామిడి తీర ప్రాంతానికి సహజ రక్షణగా ఉండేవి. మితి మీరిన పారిశ్రామికీకరణలో భాగంగా వీటిని నేల మట్టం చేస్తున్నారు.

ఇలా తూర్పు గోదావరిలో 32000 ల హెక్టార్లు, కృష్ణాలో 30000 ల హెక్టార్ల మడ అడవులు ఈ విధంగా కనుమరుగు అయ్యాయి. చేపల, రొయ్యల సాగుకోసం ఈ జిల్లాలలో విచక్షణా రహితంగా వీటిని నరికి చెరువులు తవ్వారు.

నిబంధనలకు విరుద్ధంగా తీర ప్రాంతాలలో పరిశ్రమలకు భూమిని కేటాయిస్తున్నారు. మచిలీపట్నం వద్ద ఒక ధర్మల్ విద్యుత్తు కేంద్రానికి భూమి కేటాయించిన కారణంగా వేల ఎకరాల్లోని మడ అడవులను కొట్టి వేశారు. ఇలాగే కాకినాడలో వేరొక సంస్థ.

చరిత్ర ఏం చెబుతుంది?
  • తీర ప్రాంతంలో అటవీశాఖ పెంచిన సరుగుడు వనాలు 1980 నుంచి 1987 వరకు వచ్చిన తుఫాన్ల తీవ్రతను చాలా వరకు అరికట్టాయని శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఇప్పుడు నిధుల కేటాయింపు జరపక పోవడం వల్ల అటవీ శాఖ ఇవి పెంచడం లేదు.
  • మడ అడవులు 1977 లో వచ్చిన ఉప్పెన నుండి గుంటూరు జిల్లాను కాపాడాయి. అప్పటికే దివిసీమ ప్రాంతంలో ఈ మడ అడవులను విచక్షణా రహితంగా నరికి వేయడం వళ్ళ పెనుప్రమాదం సంభవించింది.
  • కేరళలోని కొల్లం, అళపుళ జిల్లాలలో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల, ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు ఇక్కడ నష్టం అపరిమితంగా ఉంటుంది.
ఇప్పుడు వచ్చిన లైలా సృష్టించిన పెను బీభత్సానికి కారణాలేమిటి ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకనైనా ప్రభుత్వం, ప్రజలు మేల్కుని చెట్ల యొక్క విలువని గుర్తించి ప్రవర్తిస్తే మేలు.

ఆధారాలు:
  1. మన విధ్వంసం వల్లే పెను భీభత్సం 
  2. 'మడ'మ తిప్పేస్తున్నాం 
Categories: Right