కూడలి
జల్లెడ
హారం
కురేషీ ఎందుకు అలా ప్రవర్తించాడో ఆలోచిద్దాం.ఆ దేశం ప్రస్తుతం ఉన్న పరిస్థితి చాలా నీచమైనది. ఇలాగే కొంత కాలం గడిస్తే అమెరికా సైన్యం ఎప్పుడైనా అక్కడ బస చేయటం ప్రారంభించగలదనే సూచనలు అమెరికా వారు నిర్ద్వంద్వంగా చెప్పి యున్నారు.భారత దేశం నుంచి ఒక టీము ఎందుకు అక్కడికి వెళ్లిందో అని ఆలోచిస్తే అసలు పాకిస్తాన్ తో ఏమి మాట్లాడితే ఏమొస్తుందని వెళ్లారన్నది పెద్ద ప్రశ్న!అది అలా ఉండగా హోం సెగట్రీ పిళ్లై గారు 26/11 వ్యవహారమంతా ఐ.ఎస్. ఐ పనేనని ముచ్చటించటం వారికి కొన్ని సిగ్నళ్లు పంపింది.ఆట అర్థం చేసుకోకుండా ఎప్పుడూ వాగే వాగుడు -కశ్మీర్, సియాచెన్ గ్లేషియర్ గురించి వాగుతూ ఉండగా కురేషీకి ఎక్కడో అనుమానం వచ్చింది. అసలు వీళ్లు సరదాగా ఒక ‘టాక్స్ ‘ కి వచ్చినట్లు చూపించటానికి వచ్చారే కానీ ఇక్కడ ఎవరి శృతులూ కలవవని తెలుసుకున్నాడు.కృష్ణ గారు మొబైల్ లో మాట్లాడుతున్నారని, మధ్యలో అనవసరంగా ఆవులించాడని (ఇది నేనంటున్నది)ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ చెబుతునాడు.సామన్యంగా విదేశీ మంత్రులు చర్చ చేసుకుంటున్నప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అసభ్యకరంగా ఉంటుంది.ఆ దేశం లో నడుస్తున్న ప్రభుత్వం,ఏడుస్తున్న విధానాలు,మూలుగుతున్న జనం నేపథ్యంలో ఈ కురేషీ నుంచి ఇంతకంటే ఆశించక్కరలేదు.
అసలు చర్చలకు ఎందుకు వెళ్లారని బి.జె.పి అడిగింది. అందరికీ అలాగే కనిపిస్తుంది.
ఉపయోగమేమీ ఉండదని అందరికీ తెలుసు…
పాకిస్తాన్ అనే దేశం చైనా దగుల్ బాజీ,అమెరికా ,అదివరకు రషియా మధ్య బేలెన్స్ ఆఫ్ పవర్ వ్యవహారం ఇలా భౌగోళికంగా సాగే చెత్త మధ్య ఒక చెత్త దేశంగా నిలబడి ఎన్ని యుగాలు గడచినా తనకంటూ ఒక ఆర్థికపరమైన అస్తిత్వాన్ని తెచ్చుకోలేని దేశం.ప్రజస్వామ్యం ఇక్కడ మన్నదు. మనకు పక్కలో బల్లెమైన ఈ ప్రాంతానికి స్వావలంబన లేనప్పుడు అంతర్రాష్ట్రీయంగా ఉన్న పరిస్థితులలో పాకిస్తాన్ ను కలిపి నీ బ్రతుకింతేనని గుర్తు చేయటం తప్ప చర్చర్చలూ, వ్యవహారాలలో మరో అర్థం ఎన్నడూ కనిపించదు.
అదుగోండి సార్, వెళ్లాం, మాట్లడాం, వాళ్లు ఎప్పుడూ ఇంతే!ఆ కోవలో చేసిన చర్య అయితే సరేనని మన ప్రభుత్వాన్ని స్రిపెట్టుకోవచ్చు.ఒక బృహత్ పథకంలో ఇది ఒక చిన్న భాగం అని అనుకోటానికి మన ప్రభుత్వం దగ్గర అంత సత్తా ఏమీ లేదు.
ప్రపంచ దేశాలు చర్చలలోంచి ఏదో బయటకి వస్తుందనీ, వచ్చినా మల కాగలవనీ ఏ రోజూ భావించే పరిస్థితి లేదు.
జరిగిందేదో జరిగిపోయింది. ఎస్.ఎం.కృష్ణా గారు ఇంటికొచ్చాక చెప్పిన మాట కూడా బాగుంది. ఈ కురేషీ మాటలను పెద్దగా పట్టించుకోను …(ఇంతకంటే సీరియస్ విషయాలు చాలా ఉన్నాయి అన్నారాయన). ఒక విధంగా చేతలలోనూ, మాటలతోనూ కావాలని కురేషీని అపహాస్యం చేసినట్లే!అతను అందుకు అలా మాట్లాడవలసి వచ్చింది.
అవన్నీ అలా ఉంచి ఈ చర్య తరువాత మన ప్రభుత్వం ఏ నీతిని అవలంబిస్తుంది అనేది వేచి చూడాలి.మన దౌర్భాగ్యం ఏమిటంటే ఏది జరిగినా అదుగో అందరూ చూడండి…అనే నీతి తప్ప పాకిస్తాన్ కు సక్ష్యాధారాలు ఇవ్వటమేమిటి? అది అడగటమేమిటి?
దాడి చేసి పి.ఒ.కేలోని స్థావరాలను ముట్టడించే పని అయినా (అమెరికాతో కలసి చిన్న ఆలోచన చేసి)తలపెట్టందే మామూలు మనిషికి మనలో ఏదైనా సత్తా ఉన్నదని అనిపించదు.పోనీ ఇది అంతర్జాతీయ విషయం అనుకుంటే ఎంత జరిగినా ఏమీ చేయలేమన్నది చైనా కూడా తన డైరీలో నోటు చేసుకుంటోంది.
స్వయంగానూ ఏదీ లేదు, ఇతర దేశాల మధ్య దీనిని బిగించే విషయంలోనూ పెద్దగా మనం సాధించిందీ లేదు.
ఈ చర్చలు అనే ఘటన పాకిస్తాన్ ను నువ్వింతేనని తేల్చి చెప్పటం అయితే మేమూ ఇంతేనని మనకి చెప్పటం అనిపించింది.
~~~***~~~
1989 ఎక్స్ సోన్ వాల్డేజ్ స్పిల్ (అలాస్కా) ప్రిన్స్ విలియం సౌండ్ ప్రదేశం లోనిది. దీని సశేషాలు ఇంకా అక్కడ తవ్వితే దొరుకుతున్నాయి!
contd.. from previous post
శ్లో:కచ్చిజ్జానపదో విద్వాన్ దక్షిణ: ప్రతిభానవాన్
యథోక్తవాదీ దూతస్తే కృతో భరతపండిత:
రాజదూతగా నీవు నియమించిన వాడు నీ దేశంలోనే నివసించు వాడై,పండితుడై,ప్రతిభాశాలియై,చెప్పినదానిని చెప్పినట్లుగానే చెప్పేవాడై,సద్వివేకియై ఉన్నాడా?
శ్లో: కచ్చిదష్టాదశాన్యేషు స్వపక్షే దశపంచచ
త్రిభిస్త్రిభిరవిఙ్ఞాతైర్వేత్సి తీర్థాని చారకై:
శత్రుపక్షంలోని పదునెనిమిది,నీ పక్షంలోని పదిహేను తీర్థముల (ప్రదేశముల)పర్యవేక్షణ ముగ్గురు చొప్పున నియమించిన గుప్తచరుల ద్వారా చేయిస్తున్నావా?
18 సంఖ్య విశేషమైనది.ఇది రవి శనుల కలయికతో రాహువుకు నిర్ణీతమైనది.శత్రువు మీద విజయానికి ఈ సంఖ్యను ప్రయోగించాలి.మహాభారతయుధ్ధం 18 దినములది.గుప్తంగా, రహస్యంగా చేయవలసిన పనులకు రాహువు ప్రభావం ఉంటుంది.కనిపించనివి తెలుసుకోవాలన్నా ఈ సంఖ్యకు సంబంధించిన వస్తువులు,మనుషులు…ఇలా పరిశోధన ప్రారంభమవుతుంది.ఊహించనివి జరుగుతున్నప్పుడు కూడా గ్రహస్థితిలో రాహువు పరిస్థితిని గమనిస్తారు…
శ్లో: కచ్చిద్ వ్యపాస్తానహితాన్ ప్రతియాతాంశ్చ సర్వదా
దుర్బలాననవఙ్ఞాయ వర్తసే రిపుసూదన
ఏ శత్రువులనైతే నీవు రాజ్యం నుండి పంపించేసావో వారు తిరిగివచ్చినపుడు వారిని దుర్బలులనుకుని ఉపేక్షించవు కదా?
~~~***~~~
శుభం భూయాత్!
To be continued…
ఎకనమిక్ టైంస్ లో భూదేవ్ దాస్ అనే ఆయన మంచి ప్రశ్న అడిగారు.మన దేశంలో మందులే కాదు,కాస్మెటిక్స్ లాంటివి అన్నిటికీ ఎక్స్ పైరీ డేటు రెండు సంవత్సరాలే ఉంటుంది!
ఇదెలా కుదురుతుంది అని ప్రస్నించారు.ఆలోచించాలి…
క్రింది లింకు చూడగలరు:
http://qna.indiatimes.com/index.php?ref=permalinkquestion&question_id=411092
మన దేశంలోని వంద కోట్ల మంది ఏమి చేస్తున్నారో జర చూద్దాం!
9 కోట్లు రిటైరై ఉన్నారు.
30 కోట్లు రాష్ట్ర ప్రభుతాలలో, 17 కోట్లు కేంద్రప్రభుత్వం లో కూర్చున్నారు. (వీరేమీ చేయరని అంటున్నారు…)
1 కోటి మంది ఐ.టి లో పని చేస్తున్నారు (వీరు మన దేశానికి ఏమీ చేయరు)
25 కోట్లు స్కూళ్లలో, కాలేజీలలో ఉన్నారు.
1 కోటి మంది అయిదు సంవత్సరాల లోపు ఉన్నారు.
15 కోట్లు నిరుద్యోగులు.
1.2 కోట్లు ఎప్పుడైనా ఆస్పత్రిలో ఉంటారు.
7999998 మంది ఏదో ఒక జైలులో ఉంటారు.
మిగిలింది… ఇద్దరమే!
సౌజన్యం: స్వామినాథ్ అనే ఆయన చాలా మందికి పంపిన మెయిల్!
~~~***~~~
అజబున్ నెషా దెవాన్. ఈ నేపాలీ వనిత సౌదీ అరేబియా నుండి వెన్నెముక విరగకొట్టుకుని తిరిగి వచ్చింది. ఈమెను అక్కడి ఇంటి యజమాని (మహిళ) రెండవ ఫ్లోర్ నుండి తోసేసింది. ఉద్యోగం కోసం అక్కడికి వెళ్లిన ఈమె విపరీతమైన మానసిక వేదనతో తిరిగి వచ్చింది.
నేపాలీ వుమెన్ మైగ్రెంట్ వర్కర్స్ మీద జరిగే దాడులు చాలా దారుణంగా ఉన్నాయి. విదేశీయులు చాలా మంది ఇలా వేదనకు గురి అవటం మనం వింటాం. భారతీయులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సౌదీ వారు భారతీయులైన పని వాళ్లను ‘డర్టీ ఇండియన్ ‘ అని పిలవటం సర్వ సామాన్యం…
ముఖ్యంగా నేపాలీ మహిళలు గల్ఫ్ లో పడుతున్న శారీరిక హింస సామాన్యమైనది కాదు. ప్రాణాలు తీసేస్తామనే బెదిరింపులు కూడా ఎక్కువే.
లక్షకు పైగా వీరు లెబనన్, సౌదీ, యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్, కటార్,బహ్రెయిన్,ఒమాన్ వంటి దేశాలలో ఉన్నారు. అయినా ప్రతి రోజూ 800 కుటుంబాలు (నేపాల్ నుంచి) గల్ఫ్ కు వలస వెళుతున్నారని అంచనా.
అన్ని సమస్యలూ డబ్బు దగ్గరే! నేపాల్ జి.డి.పి లో అయిదులో ఒక వంతు ఈ విదేశీ రెమిటెన్స్ నుంచి వస్తోంది! వ్యవసాయ రంగం 32 శాతం ఉండగా దాని తరువాత ఆర్థిక వ్యవస్థ ఈ విదేశీ నౌకరీల మీద ఆధారపడి ఉండటం శోచనీయం. నేపాల్ ప్రభుత్వం సత్వరమే అంతర్జాతీయంగా ఒక విధానాన్ని తెచ్చే ప్రయత్నం చేయాలి. మన దేశం కూడా జత కావాలి. పడ్డ వాళ్లు చెడ్డ వారు కారు. మానవ హక్కుల గురించి నేపాల్ మావోయిస్టులు ఏమి చేస్తున్నారో కనుక్కోవచ్చా?
పనికోసం వచ్చిన మైగ్రెంట్ మహిళలకు భౌగోళికంగా కొన్ని హక్కులున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఆయా దేశాలతో కొన్ని ఒప్పందాలు చేసుకోవటం మొదటి పని. ఇలా ప్రవర్తించిన వారిని ఆ దేశ చట్టం ప్రకారమే కాకుండా ఈ దేశంలోని చట్టం ప్రకారం కూడా కఠినాతి కఠినంగా శిక్షించే ప్రక్రియను ప్రారంభించాలి.
కాయక్ష్టానికి దిగిన వారు ఏ పరిస్థితిలో అలాంటి నిర్ణయం తీసుకున్నారోనని యోచించి గౌరవించి మసలుకోవటం మానవత్వం లోని మొదటి పాఠం. ఇది ఒక దేశానికి కాదు. సమస్త మానవాళికి వర్తిస్తుంది.
~~~***~~~
‘ A riot is at the bottom, the language of the unheard’~Martin Luther King
కొన్ని తరాలు గడిచాయి.ఋతువులు దొరలిపోయాయి…
ప్రతి సంవత్సరం వర్షాలకోసం అలమటిస్తాం.అవి కురుస్తున్నప్పుడు నీటి స్టోరేజ్ సరైన చోట్ల సరిగ్గా ఉన్నదా లేదా అని ముక్కు మీద వేలేసుకుంటాం.
ఈ ఐ.ఎ.ఎస్ దొరబాబులూ,ఈ కాంట్రాక్టర్లు, ఈ ఇంజనియర్లు ప్రతి ఏటా ఇంతేనా?
పంజాబ్, హరియాణా, చండీగఢ్ ప్రాంతాలలో మళ్లీ పాత కథే! అతివృష్టి వలన నష్టపోతున్నారు జనం.సాగు నీటి ప్రాజెక్టులు ఏమవుతున్నాయి? అంత దూరం అక్కరలేదు.గత సెప్టెంబర్ లో మహబూబ్ నగర్, కర్నూల్ ప్రాంతాలలో ఏమయిందో చూసాం. వరద రిసర్వాయర్లు ఏర్పాటు ఎందుకు చేయలేదు అని ప్రధాని ఆయన టూరులో అడిగారు. నేనూ అడుగుతున్నాను, ఏడాది అవుతోంది.రిసర్వాయర్లలోని సిల్టు విషయంలో ఈ అధికారులు ఈ సంవత్సరం లో ఏమి చేసారు? అడిగే వారు లేరు!…
ప్రకృతికి కోపం.స్వాతంత్ర్యానికి వంద సంవత్సరాలయినా ఈ వ్యవస్థ ఇంతే! ఈ అధికారులు ఇంతే!
అ…అమ్మా కంటే ఆ…ఆకలి అనే పదాన్నిముందు నేర్చుకున్న దేశం.ఆకలిని మించిన నిజం లేదు.అదే సత్యం! ఈ ఏడాదికి చూద్దాం మరో అవకాశాన్ని ఇద్దాం అనుకుంటూ గరళాన్ని దిగమింగి స్థాణువులుగా బ్రతికేస్తున్న శివులం! అందచందాలా దేశం, ఎంతో సుందర దేశం.రంగు రంగులా భారతదేశం,చిరుగు చెంగులా భారతి వేషం…సుందరమైన త్రివర్ణపతాకానికి సుందరంగా సెల్యూట్ కొడుతున్నాం!
సత్య శివ సుందరం…ఈ భాష అర్థం కాదు.ప్రకృతిలో ఏ వైపరీత్యమూ లేదు.
యుగాలు గడిచినా దేశం వైపు ఒక చూపు కూడా చూడలేని ఈ వ్యవస్థను కడుపులో దాచుకునేందుకు నిండా గుడ్డ కప్పి ఈ ప్రకృతి ముంచేస్తోందా? తన క్రోధాగ్నిని మల మలా మాడే ఎండలో మాట్లాడకుండా చూపిస్తోందా?
మన మధ్య ఈ భాషలు వద్దు! అది పంజాబవనీ,కశ్మీరవనీ,నా రాష్ట్రమవనీ, అది ఆంధ్ర అవనీ, తెలంగాణ కానీ…నేను స్పందించను. మామూలు మనిషికోసం ప్రకంపిస్తాను.ఈ ప్రచండాగ్ని నన్ను కాల్చి బూడిద చేయనీ, నేను పన్నీరులా పైకి లేస్తాను!
ఈ జలప్రళయం నన్ను ముమ్మాటికీ ముంచేయనీ…నేను బడబాగ్నిలా ప్రజ్వలిస్తాను! నిజమే చెబుతాను…
ఏమిటో…ఈ భాష అర్థం కాదెందుకో!
~~~***~~~
శ్లో:రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయా: పతయే నమ:
శ్లో: చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం
ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం
శ్లో:కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
శ్లో: కచ్చిద్ బలస్య భక్తం చ వేతనం చ యథోచితం
సంప్రాప్తకాలం దాతవ్యం దదాసి న విలంబసే
సైనికులకివ్వవలసిన వేతనాలు సరైన సమయానికి ఇస్తున్నావా? ఆలస్యం చేయటంలేదు కదా?
శ్లో: కాలాతిక్రమణే హ్యేవ భక్తవేతనయోర్భృతా:
భర్తురప్యతికుప్యంతి సోనర్థ: సుమహాన్ కృత:
ఆలస్యం చేసినప్పుడు సైనికులు స్వామి పట్ల కుపితులు కాగలరు.దానివలన అనర్థాలు జరుగగలవు!
శ్లో: కచ్చిత్ సర్వే నురక్తాస్త్వాం కులపుత్రా:ప్రధానత:
కచ్చిత్ ప్రాణాంస్తవార్థేషు సంత్యజంతి సమాహితా:
ఉత్తములైన మంత్రులు,ప్రధానమైన అధికారులు నీతో ప్రేమతోనున్నారా? వారందరూ ఒక్కటిగా నీకోసం ప్రాణాలను ఇవ్వటానికి సిధ్ధంగా ఉంటారా?
మంగళం మహత్!
(సశేషం)
~~~***~~~
బాంకులో జనం సోఫాలలో కూర్చునున్నారు.
ఒక కుర్రాడు తండ్రిని అడుగుతున్నాడు,’ డాడీ…మనం గొప్పవాళ్లమా, బీదవాళ్లమా?’
ఆయన ఏమీ మాట్లాడలేదు. అటూ ఇటూ చూసాడు. ఎందుకో నా వైపు కూడా చూసాడు. బాగుండదని నేను కాష్ కౌంటర్ వైపు చూసాను!
‘డాడీ…’
‘ఊ…’
‘చెప్పు డాడీ…’
‘ మనం బీదోళ్లం రా.’
‘ఎలా డాడీ?’
‘ఇక్కడికొచ్చే ప్రతి వోడూ బీదోడే! అసలు ఎక్కడైనా లైనులో ఉండాల్సి వస్తే వాడు బీదోడే రా!’
~~~***~~~
పేదరికం రంగులు మారుస్తూనే ఉంది.ప్రభుత్వం కూడా రంగులు మార్చింది.
కేవలం కేలరీల మీద ఒక అంచనా కట్టి 27 కోట్లే పేదరికంతో ఉన్నారన్నది. ఇప్పుడు అలా కాదు, ఒక కుటుంబంలో రోజుకు ఎన్ని సార్లు భోజనం చేస్తున్నారు అనే దాని బట్టి, పోషక విలువలను బట్టి 37 కోట్ల మందిదారిద్ర్యంతో బాధ పడుతున్నారని ప్రభుత్వం వారు సెలవిచ్చారు. ..ఇది ఆహార ఉత్పత్తులలో 18 నుండి 20 శాతం ఇంఫ్లేషన్ ఉండటం వలన అని వివరం ఇచ్చారు.
మల్టి డైమెన్షనల్ పావర్టీ ఇండెక్ష్ ప్రకారం మన దేశంలో 42 కోట్ల మంది దారిద్ర్యం లో ఉన్నారు. ఈ పధ్ధతి ఐక్య రాజ్య సంస్థ వారి యు.ఎన్.డి.పి వారు అవలంబిస్తున్నారు. ఇందులో కొన్ని ‘లేకపోవటం ‘ అంచనా లోకి తీసుకుంటారు. (డెప్రివేషన్స్) -చదువు, ఆరోగ్య సదుపాయం, సర్వీసులు, ఆస్తులు వగైరాలు. ఈ అంచనాలో బీహార్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలను కొన్ని కలుపుకుంటే ఆఫ్రికాఖండంలో అతి దారుణమైన దారిద్ర్యంలో ఉన్న కొన్న్ని దేశాలకంటే ఎక్కువ దారిద్ర్యం కనిపిస్తోంది-ఆ దేశాలను కలుపుకుంటే 41 కోట్లే!
మనం దిక్కుమాలిన లెక్కలకు అలవాటు పడిపోయామా? గతంలో వి.పి. సింగ్ మహాశయుడు దారిద్ర్య రేఖను కొద్దిగా క్రిందకు పట్టుకుని ఇదిగో వీరందరూ పైకి వచ్చేసారు, అన్నాడు!
దారిద్ర్యం యొక్క డైమెన్షన్స్ మారుతూ ఉన్నప్పుడు విధానాలూ మారాలా లేదా? ఫిన్లాండులో బ్రాడ్ బాండ్ ఒక న్యాయపరమైన హక్కు ఈ రోజు (ఈ విషయంలో ఇది మొదటి దేశం). సరైన జీవితం కాదు. కనీసం మా దారిద్ర్యం పట్ల సరైన అంచనా అయినా మా న్యాయపరమైన హక్కు కాదా?
~~~***~~~
ఒమర్ కద్ర్. ఇతను క్యూబాలోని గూత్నామా బేలోని జైలులోనున్న అతి చిన్న వయస్కుడు.అఫ్ఘాన్ లో ఒక డాక్టర్ మీద గ్రెనేడ్ వేసినప్పుడు ఇతని వయసు పదిహేను సంవత్సరాలు. వివాదం చిత్రమైనది.ఒక ‘బాల్య సైనికుడు ‘ కాబట్టి ఇతని మీద విచారణ చేయవచ్చా లేదా? (ఇది ఇంకా నడుస్తోంది)…
కద్ర్ పది ఏండ్ల వయసు ఉన్నప్పుడు ఇతని తండ్రి అఫ్ఘానిస్తాన్ లోకి, ఒసామా సహచర్యంలోకీ ప్రవేశించాడు. ఇతని తల్లి, సోదరి సెప్టెంబర్ 11 చర్య సబబేనని వ్యాఖ్యానించారు.ఇతనికి ఒక సోదరుడున్నాడు.అతను తనని తాను (అఫ్ఘాన్ లో దొరికిపోయాక) సి.ఐ.ఏ కు ఒక ఆయుధంగా మారానని చెబుతున్నాడు…
అంతర్జాతీయ న్యాయవాదుల అభ్ప్రాయంలో ‘ఇండోక్ట్రినేటెడ్ ‘పిల్లలను పునర్వ్యవస్థీకరించాలి కానీ ప్రాసిక్యూషన్ ద్వారా విచారణ చేయకూడదు.
యూ.ఎన్.ఓ ప్రత్యేక అధికారి అయిన రాధికా కుమారస్వామి ప్రకారం యు.ఎన్.ఓ విధానాల లో వార్ క్రైంస్ లో ఉన్న పిల్లలను ప్రాసిక్యూట్ చేయకూడదు…
మీరేమంటారు?
(ఈ ఫొటో ‘శ్రీసరదాలు ‘ వర్గం కాకుండా ‘శ్రీవిధానాలు ‘ వర్గం లో పోస్ట్ చేయబడింది-గమనించగలరు)
~~~***~~~
శ్లో:రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయా: పతయే నమ:
శ్లో: చరితం రఘునాథస్య శతకోటిప్రవిస్తరం
ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం
శ్లో:కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
శ్లో: కచ్చినోగ్రేణ దండేన భృశముద్వేజితా: ప్రజా:
రాష్ట్రే తవావజానంతి మంత్రిణ: కైకయీసుత
నీ రాజ్యంలోని ప్రజలు కఠోరదండనము చేత ఉద్విగ్నులయి నీ మంత్రులను తిరస్కరించుటలేదు కదా?
శ్లో: కచ్చి త్వాం నావజానంతి యాజకా: పతితం యథా
ఉగ్రప్రతిగ్రహీతారం కామయానమివ స్త్రియ:
పతితులైన యజమానుని పవిత్రులైన యాజకులు, కామచారులైన పురుషులను స్త్రీలు ఎలా అయితే తిరస్కరిస్తారో, అధికంగా శుల్కాన్ని తీసుకున్నదుకు నిన్ను ప్రజలు తిరస్కరించటం లేదు కదా?
శ్లో: ఉపాయకుశలం వైద్యం భృత్యసందూషణే రతం
శూరమైశ్వర్యకామం చ యో హంతి న స హన్యతే
భృత్యులను భిన్నం చేయటంలో నిరతుడైన శూరుడు రాజ్యాన్ని ఎత్తుకుపోయే కార్యక్రమంక్లో ఉంటాడు.అటువంటి వారి చేతిలో రాజు హతుడవుతాడు.
శ్లో: కచ్చిద్ ధృష్టశ్చ శూరశ్చ ధృతిమాన్ మతిమాంఛుచి:
కులీనశ్చానురక్తశ్చ దక్ష: సేనాపతి: కృత:
సదా సంతుష్టుడుగా నుండు శూరవీరుడు,ధైర్యవంతుడు,బుధ్ధిమంతుడు,పవిత్రుడు,కులీనుడు,అనురక్తి కలవాడు, రణకర్మదక్షుడు ఔఇన వాడిని సేనాపతిని చేసావు కదా?
శుభం భూయాత్!
(తిరిగి రేపు)
2006 లో విడుదలయిన హిందీ చిత్రం ఇది.సాఫ్ట్ డ్రింక్సులలో పెస్టిసైడ్లు కలుపుతున్నారన్న వార్తలు ప్రబలంగా వచ్చి వాటి వ్యాపారం మీద హడావుడి చేసిన రోజులు.ఈ రోజుకీ వాటిలో ఉందో లేదో నిర్ధారణగా ఎవరూ చెప్పరు.రోజులు అలా గడిచిపోతూ ఉంటాయి.వ్యాపారం, రాజకీయం…అన్నీ అలా చరైవేతి, చరైవేతి…
వ్యాపార సంస్థల పోటీల మధ్య కొన్ని పాత్రలను చక్కగా చిత్రీకరించారు దర్శకుడు.నరనరాలకీ వ్యాపార ధోరణి పాకేసిన కుటుంబాలివి.కార్పొరేట్ పేరుతో చేసేదంతా నీచమైన వ్యాపారం. కబడ్డీ ఆట లాగా ఎప్పుడు ఎవరిని కాలు పట్టి లాగేద్దామా లేక ఎవరిని బలవంతంగా గంజేద్దామా ఇంతే ఈ ప్రపంచం.తోడుగా రాజకీయ నాయకులు చక్కని మసాలా జల్లి మరింత రసవత్తరంగా ఈ ఆట ఆడిస్తూ ఉంటారు.
సెహ్ గల్ సంస్థ అధినాయకుడు వినయ్ సెహ్ గల్ (రజత్ కపూర్).మార్వాహ్ సంస్థకు రాజు ధర్మేశ్ (రాజ్ బబ్బర్). మహరాష్ట్ర ప్రభుత్వం పి.ఎస్.యు లను కార్పొరేట్ కు అమ్మేసే టెండర్ పిలుస్తుంది. మంత్రిగారు గులాబ్ రావ్ ఇంగ్లె (వినయ్ ఆప్తె) ఇద్దరినీ నమ్మించి చివరికి ధర్మేశ్ దగ్గర ఎక్కువ సంఖ్యలో కోట్లు,ఒక సినీ అమ్మయితో ఒక రాత్రి సంపాదించి టెండర్ అతనికి ఇచ్చేస్తాడు.ధర్మేశ్ అక్కడ మింట్ బేస్ తో కూల్ డ్రింకు ఫాక్టరీ తలపెట్టి ముందుగా కేవలం మినరల్ వాటర్ తయారు చేస్తామని చెబుతాడు.
ఈ లోపల వినయ్ ఒక ఫారిన్ సంస్థతో టై అ అవుతాడు.పబ్లిక్ ఇస్స్యూ ఇచ్చే ముందు ఈ సమస్య ఎదురవుతుంది.వినయ్ దగ్గర పని చేసే నిశి (బిపాషా బసు) ధర్మేశ్ దగ్గర పని చేస్తూ తనని కోరుకున్న పర్వేజ్ (సందీప్ మెహతా) ను బురిడీ కొట్టించి ఆ పానీయాల ప్రాజెక్ట్ తాలూకు వివరాలను సేకరిస్తుంది. దాని ఆధారంగా వినయ్ తన బావమరిది రితేశ్ (కే కే మెనన్) ఆధ్వర్యంలో నలభై రోజులలో జస్ట్ చిల్ అనే కూల్ డ్రింకు ప్రాజెక్టు సిధ్ధం చేయిస్తాడు. లైసెన్స్ లేకపోయినా , ఆ నీళ్లల్లో పెస్టిసైడ్లు ఉన్నయని తెలిసినా ముందుకు వెళ్లిపోతాడు.ఈ దెబ్బను తట్టుకోవటానికి ధర్మేశ్ వినయ్ కంపనీలోని వ్యక్తిని దగ్గరకు చేరదీసి (అతనికి రితేశ్ బదులు సి.ఇ.ఒ రావాల్సి ఉన్నది) స్వంత వ్యాపారానికి డబ్బు ఇప్పించి పెస్టిసైడ్ వ్యవహారం గురించి తెలుసుకుని మీడియా, రాజకీయ రంగం…అన్ని చోట్లా నానా హంగామా చేసి వినయ్ ను బజారుకీడుస్తాడు.
ఆ వ్యవహారాన్నంతా తనే చేసినట్లు అఫిడవిట్ మీద సంతకాలు చేసి వినయ్ బదులు నిశి జైలుకు వెళుతుంది.రితేశ్ కు తెలియకుండా ధర్మేశ్,వినయ్ ల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి, రాష్ట్ర మంత్రి సమక్షంలో ఒప్పందం కుదిరి తిరిగి ఇద్దరి వ్యాపారాలు బాగు చేసుకోవటం జరుగుతుంది.దీనికి విదేశీ కంపనీ వాడి గొడవ కూడా ప్రోద్బలం అవుతుంది.రితేశ్ అలిగి 48 గంటలలోపు నిశి ని బయటకు తేకపోతే మీడియా ముందు కూర్చుని మాట్లాడతానంటాడు.అతనికి ఆ అవకాశం రాదు. పై అంతస్తు నుండి మందులో ఉన్నప్పుడు పడిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతారు కానీ ఎవరో కాలింగ్ బెల్ కొట్టినట్లు మనకి కనిపిస్తుంది…
నిశి బెయిల్ మీద విడుదలయి కేసు పోరాడుతున్నట్లు చూపించి చిత్రాన్ని ముగిస్తాడు దర్శకుడు.
బిపాషా , కే కే మెనన్ పాత్రపోషణలు బాగున్నాయి.సందీప్ మెహతా కూడా బాగా చేసాడు.ఈ చిత్రానికి దర్శకుడు మధుర్ భండార్ కర్.ఈయన అజయ్ మోంగా,మనోజ్ త్యాగీలతో కలసి చిత్రానికి స్క్రిప్ట్ రచించినట్లు తెలుస్తోంది.
~~~***~~~
కథ ఉత్కంఠఓ సాగినా కళాత్మకత లేకపోవటం వలన పేపర్లలో చదివింది తెరకెక్కించారు అంతే కదా? అనిపిసుంది. దర్శకుడు ఏంబియన్స్ విషయంలో మంచి కృషి చేసాడు.కాకపోతే ఈ పానీయాన్ని సరైన గ్లాసులో నింపలేదు.ఉదాహరణకి సయి పరాంజపే గారు ‘కథా ‘ అని క చిత్రం తీసారు. కుందేలు, తాబేలు కథకు నసీరుద్దిన్, ఫరూక్ షేఖ్ జీవం పోస్తారు.సంఘటనలూ జరగాలి,తోడుగా ఒక ప్రక్రియ తీగెలా సాగాలి. ఇది ట్రీట్ మెంట్ వ్యవహారానికి చెందినది.తెర మీద కథ నడపటం కూడా కవిత్వమే!
ఈ దర్శకుడు మోడ్లెస్కి అనే ఆవిడ 1988లో నరేటివ్ స్ట్రక్చర్ గురించి చర్చిస్తూ పేరలల్ రివర్సల్ గురించి చేసిన వ్యాఖ్యలను చూడాలి.ప్రారంభంలో చూపించిన ఒక దృశ్యం మరో విధంగా ఆఖరి దృశ్యంగా మారుతుంది. ముఖ్యంగా ఒక పోటీ, ఒక ఆట చూపిస్తున్నప్పుడు ఇది కథనానికి ప్రాణపోషణ చేస్తుంది.
గోవింద్ నిహలాని ‘అర్థసత్య ‘ లో ఒక చిన్న కవితను వాడుకున్నాడు. (ఇది కథా రచయిత సూరజ్ అనే కథలో వ్రాసినదే).ఎక్ పలడే మే…అంటూ సాగి మిగిలింది ఏమిటి? అర్థసత్య? అని ఓం పురి ప్రశ్నిస్తాడు.
‘ఒక్కడు ‘ అనే తెలుగు చిత్రంలో ఈ పంథాను చాలా బాగా వాడుకున్నారు దర్శకుడు గుణశేఖర్. ప్రారంభంలో ఒకవృత్తంలో కొందరు నిలబడతారు.కెమెరా దృశ్యం పరిధిని పెంచుతుంది.వారిని చుట్టు ముట్టిన మరి కొంత మంది కనిపిస్తారు.అలా కథ సాగిపోతుంది.ఆట (కబడ్డీ) చివరి స్థాయిలోకి చిత్రం చేరుకుంటుంది. కొద్దిగా ముందు ప్రకాశ్ రాజ్ ని, అతని మనుషులని ఇదే వృత్తంలో ట్రాప్ చేసినట్లు చూపిస్తాడు.
హిచ్ కాక్ చిత్రాలలో కూడా ఈ ప్రక్రియను వాడటం మనం చూస్తాం. అది గుండెలకు హత్తుకుంటుంది.మనం సేవించే ఏ పదార్థమైన కొంత ఆ గ్లాసు మీద ఆధారపడి ఉంటుంది మరి!
~~~***~~~
పెద్దాయన తప్పదన్నట్లు పార్కులోకి ప్రవేశిస్తాడు.ఆయన వెనుక భార్య అప్పుడప్పుడు అలా చేయిని పట్టుకున్నట్లు పట్టుకుని లోపలికి వస్తుంది. బిల్ గేట్సో లేక ఒబామా లాగానో మొత్తం పార్కంతా సింహావలోకనం చేస్తాడాయన.మెల్లగా ఇద్దరూ ఒక్కో చెట్టూ చూసుకుంటూ నడుస్తారు. ప్రతి చెట్టు దగ్గర ఏదో వెతుక్కుంటున్నట్లు చూస్తారు. ఏమి పారేసుకున్నారో తెలియదు.రోజూ ఇంతే! దొరుకుతుందనే ఆశ మటుకు పోలేదు!ఒక రోజు కొద్దిగా వెంట నడిచాను.
‘ఏమి పోయిందండీ?’,అడిగాను.
ఆవిడ వెనక్కి తిరిగి కొద్దిగా భయంగా చూసింది.పెదాల మీద చూపుడు వేలు పెట్టి మాట్లాడవద్దని సైగ చేసింది.అక్కడే ఆగిపోయాను…
~~~***~~~
ఈ రోజు ఎందుకో ఆవిడ ఒంటరిగా కూర్చుని ఉంది.ఆవిడను దాటుకుంటూ ముందుకు వెళ్లి ఆగిపోయాను.వెనక్కి తిరిగాను. ఆవిడకి ఏదో అర్థమయి చిరునవ్వు నవ్వింది.
‘సార్ రాలేదా?’అడిగాను.
‘కొద్దిగా నీరసంగా ఉంది.’
దగ్గరగా వచ్చి కూర్చున్నాను.
‘అదేదో దొరికిందా?’
ఆవిడ పైకి చూసి నవ్వింది.
‘ఏంటది?’
‘రోజూ వెతుకుతారు కదా?’
‘పోగొట్టుకున్నది ఏమీ లేదు.ఆయన అలా అనుకుని అటూ ఇటూ చూస్తూ ఉంటారు…’
‘మీరు?’
‘వెతుకుతున్నట్లు నటిస్తూ ఉంటాను!’
‘ఛా…’
పార్కులో జనం పెరిగారు. ఆ బెంచీల ప్రక్కగా ఏవో కబుర్లు చెప్పుకుంటూ వెళ్లిపోతున్నారు.ఒకమ్మాయి నిన్ను వదిలేది లేదన్నట్లు జతగాడి చేయిని రెండు పట్టుకుని ముందుకు నడుస్తోంది.ప్రస్తుతానికి ధైర్యం బాగానే ఉందని చెబుతున్నట్లు అబ్బాయి హుందాగా నడుస్తున్నాడు.మా ఇద్దరినీ ఓరకంట చూసి అలా సాగిపోయారు.
‘ఎందుకండీ?’
‘మా వారు చాలా కష్టపడి పైకొచ్చారు…’,ఆవిడ చెప్పింది,’…ఒక పెద్ద ఆఫీసరు బంగళాలో వీళ్ల కుటుంబం పనికి ఉండేది.ఆఫీసరు గారు వీళ్లని చాలా బాగా చూసుకున్నారు.వాళ్ల అబ్బాయినీ, ఈయననూ కలసి చదివించారు.ఈయన ప్రతి రోజూ ఆయన పేరు ఏదో విధంగానైనా చెబుతూనే ఉంటారు.ఇద్దరూ బాగానే చదువుకున్నారు.అతనూ విదేశాలు వెళ్లాడు,ఈయనా చాలా దేశాలు తిరిగారు.’
‘ఆఫీసరు గారి అబ్బాయి కలవటం మానేసాడా?’
‘అదేమీ లేదు. వాళ్ల కుటుంబం మా ఇంటికి వస్తూ ఉంటుంది.వాళ్లు అమెరికాలో స్థిరపడ్డారు. మేము ఇక్కడుంటున్నాము.’
‘పిల్లలి?’
‘ఎవరి దారిన వారు విదేశాలలో ఉన్నారు.’
‘మరి ఏమి వెతుకుతున్నారు?’
ఆవిడ మరల నవ్వింది.
‘ఏదైనా పోగొట్టుకుంటే కదా? వెతికాలి?’
లేచి నిలబడ్డాను.నా బాధ ఆవిడకు అర్థమయినట్లుంది.ఆవిడా లేచింది.
‘రండి. నడుస్తూ మాట్లాడదాం…’
‘మామూలుగా నడుద్దామా? వెతుకుదామా?’
పెద్దగా నవ్వు రాలేదు. తల ఒక్కటీ ఆడించి ముందుకు నడిచింది.
‘మీరు కారణం వెతుకుతున్నారు.చెబుతాను.బాగా అలసిపోయినప్పుడు నిద్ర పోయారనుకోండి…గతంలో గడచినవి బాగా ఇబ్బంది పెట్టినవి అలా మరల జరిగినట్లు కలలో కనిపిస్తాయి. అవునా?’
‘నిజమే! సమయానికి హాల్ టికట్ రాకపోవటం ఇప్పటికీ నాకు కనిపిస్తూ ఉంటుంది.’
‘వయసు దాటిపోయినప్పుడు అలసటలో కూడా అనుభవాలు అలాగే వెనకి వస్తాయి.అవి చాలా నిజంగా, మరల జరుగుతున్నట్లు కనిపిస్తాయి…’
‘కరెక్ట్.’
‘ఒక పార్కులో ఈయన చేత ఆఫీసరు గారి అబ్బాయిని ఆడించే వారట.అదుగో చూడండి.ఆ పిల్లలందరిదీ ఆడే వయసే.ఆడించటం ఏమిటి?’
‘అర్థమయింది.’
‘కొత్త బంతి ఎక్కడో పోయింది ఓ సాయంత్రం. ఆ అబ్బాయి ఏడుస్తూ రాత్రంతా ఏమీ తినలేదు.’
‘ఈయనను ఏమైనా అన్నారా?’
‘లేదు.ఈయన తండ్రిని పిలచి ఒక వేళ చిన్న తనంలో అబ్బాయి ఎక్కడైనా దాస్తే తెచ్చివమన్నారు. కొంత బంతి కూడా పిల్లవాడు వద్దంటున్నారన్నారు!’
‘మరి?’
‘ఈయన అర్థరాత్రి అని కూడా లేకుండా పార్కంతా వెతికారట!దొరకలేదు!అలా చేసినందుకు దెబ్బలు కూడా తిన్నారు!ఆ గోల అక్కడితో అయిపోయింది.కానీ ఎక్కడైనా పెద్దింటి పిల్లలను వేరే పిల్లలు ఆడించటం చూస్తే తట్టుకోలేకపోయేవారు.ఈ మధ్య ఇలా వచ్చి వెతుక్కోందే ఆయనకు నిద్ర పట్టదు.అంతకంటే ఏమీ లేదు.’
అవతలి గేటు దాకా వెళ్లి ఇద్దరం వెనక్కి వచ్చాం.పూలు,పూలమొక్కలు,పిల్లలు,పెద్దలు అందరితో పార్కు రంగుల కలలా ఉంది.చీకటి పడుతోంది.ఆవిడ వెళ్లిపోయింది.నేనూ ఇంటికి వెళ్లే లోపు ఎక్కడో ఓ ముల్లు గుచ్చుకున్నట్లయింది…
~~~***~~~