కొంతకాలం క్రితం నా యూట్యూబ్ ఛానల్లో ఒక ప్రకటన చేసాను. రోమాంటిక్ విషయాలే కాకుండా రాజకీయాలూ, హాస్యం, రచనలూ, ఆరోగ్యం వగైరాల గురించి కూడా వీడియోలు రూపొందిస్తా అని చెప్పాను. అప్పుడొక కామెంటర్ ఇలా అన్నారు "అవన్నీ రెగ్యులర్ మీడియాలో వచ్చే విషయాలే. ఇంటర్నెట్టులో వున్న అడ్వంటేజ్ ఏమిటంటే పెద్దగా పరిమితులు లేకపోవడం. దానిని అడ్వంటేజీగా తీసుకొని రెగ్యులర్ మీడియా ఇవ్వని, ఇవ్వలేని విషయాలను మీరు అందించండి". ఆ సూచన నాకు బాగా నచ్చింది.
తెలుగు బ్లాగోస్ఫియరులో ఎంతో మంది ఆడ బ్లాగర్లు వున్నారు. కానీ ఏం లాభం అందరూ వ్రాసేవీ మామూలు మీడియాలో వచ్చేవాటికన్నా పెద్దగా వైవిధ్యంగా వుండటం లేదు. సాధారణ మీడియాలో చెప్పని, చెప్పలేని, చెప్పకూడని విషయాలను ఎంతమంది స్త్రీలు ఈ బ్లాగ్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు? ఏ లేడీ బ్లాగరుని చూసినా పోనీ కొద్దిగా కేడీ అనుకున్న బ్లాగర్లని చూసినా ఏమున్నది గర్వకారణం? స్త్రీ బ్లాగు జాతి చరిత్ర మొత్తం గొబ్బెమ్మలు, ముగ్గుల పారాయణత్వం! ఏ బ్లాగర్ ని చూసినా పాతివ్రత్యమే, హైపోక్రసీనే. భూమిక లాంటి స్త్రీజైన్లూ, కల్పనా రెంటాల లాంటి కొద్ది మంది 'అయిదో గోడ' లాంటి తమ కథలు, నవలల్లో మాత్రం కాస్త ధైర్యంగా వ్రాస్తున్నారు. అయితే ఇక్కడ ఆంశం కథలూ, కవితలూ, నవలలూ కాదు. స్వంత అనుభవాలూ, అనుభూతులూ, ఆలోచనలూనూ.
ఎవరిని చూసినా చిన్నప్పుడు తొక్కుడు బిళ్ళ ఆట ఎట్లా ఆడేవారం, గొబ్బెమ్మలకు ముస్తాబు ఎలా చేసేవారం, పేడ మరియు దానివల్ల ఉపయోగాలు, టమాటా - కోడిగుడ్డు కూరలో ముందు కోడిగుడ్డు వెయ్యాలా లేక టమాటా వెయ్యాలా (హి హీ, ఇది నా సందేహం లెండి - పనిలో పనిగా ఎవరయినా జవాబు ఇవ్వకూడదూ. అది తెలియక మొన్న ఆదివారం ఆ కూర చెడగొట్టుకున్నాను), మా ఆయన ఎంత పొడుగు మల్లెపూలు తెచ్చి ఇచ్చారు, మా ఆయన బంగారం, పెళ్ళి చూపుల్లో ఎన్ని సార్లు ముసుముసి నవ్వులు నవ్వానూ, కోడిగుడ్డుకి ఎన్ని ఈకలుంటాయి లాంటి సాధారణ విషయాలే తప్ప అంతకు మించి దాటి రారే!
మా ఆయన నిన్న ఎన్ని హింసలు పెట్టాడు, ఎవడు తమకి లైన్ వేసాడు, ఎవడు తమని ముందుగా రేప్ చేసాడు, ఏ హీరో అంటే క్రశ్శు, తాము ఎదుర్కొన్న లైంగిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సామాజిక సమస్యలు, ప్రేమలో భంగపాట్లు, ఎంతమందిని తాము ప్రేమ పేరుతో మోసం చేసిందీ లేదా తమని ఎంతమంది మోసం చేసిందీ, తాము చూసిన అన్యాయాలు మొదలయినవి ఏవన్నా వ్రాస్తారేమో అంటే ఎవ్వరూ వ్రాయరే.
ఇప్పుడు వున్నవాళ్లనే కాదు, రేపు మా దగ్గరి వారు ఎవరయినా బ్లాగులు ఓపెన్ చేసినా అంతే పరిస్థితి. అందరూ పరిపూర్ణ మహిళలు. ఎవరిలోనూ లోపాలుండవు. తల్లితండ్రులు వీరిని చక్కగా పెంచుతారు, కన్యగా భర్తకి అంకితం అవుతారు. వీరికి ఇతర ప్రేమలూ, రేపులూ వుండవు. చక్కటి పిల్లలని కంటారు. రోజూ వచ్చేప్పుడు మొగుడు మూరెడు మల్లెపూలు తీసుకొని వచ్చి మెడకాయ మీద వున్న జడకాయ మీద తరుముతాడు. వీరికి అందరూ చక్కని మిత్రులే వుంటారు. మగ మేల్ మిత్రులు వుండటం చాలా తక్కువ.
నేను ప్రస్థావించిన విషయాలు మనసు విప్పి వ్రాయాలంటే బాగా ధైర్యం వుండాలి. ఎందుకంటే అజ్ఞాతల నుండీ వెటకారాలు, చాదస్తుల నుండీ ఫత్వాలూ రావచ్చు. అప్పుడు తోటి ఆడ బ్లాగర్లే 'ఛీ ఇది చెడ్డది - ఇది పవిత్రమయిన ఆడ బ్లాగులోకంలో చెడ పుట్టింది' (మగ బ్లాగులోకాన్ని నాలాంటి వారెప్పుడో బలాత్కారం చేసిపెట్టారు కాబట్టి హంత సతీవ్రతం ఇప్పుడు లేదు) అని తమ తమ గుంపులల్లొ చేరి కాకుల్లా పొడిచినా పొడుస్తారు. వారికి తోడుగా చొంగలు కార్చుకునే మగ కాకులు చేరి ఇంకా పొడుచుకు తింటాయి. ఇది గ్యారంటీ.
నిజమే - ఇబ్బందులు వుంటాయి. ఇబ్బందులు వుంటాయనే కదా అందరూ బ్లాగుల్లో నాటకాలాడేది? మనమూ నాటకాలాడొద్దంటే గట్స్ కావాలి. మొండి తెగువ కావాలి. ఎవరేమనుకున్నా ఎదిరించి నిలబడగలిగే స్థైర్యం కావాలి. వాటినే లీడర్షిప్ లక్షణలు అంటారు. కామెంట్లకో, అవహేళనలకో భయపడి నలుగురితో పాటు నారాయణా, పది మందితో పాటుగా ప్రమాదవనంలో గోవిందా అనుకుంటే మీ గొప్పతనం ఏంటీ? అలాంటి అమ్మలక్కలు బోలెడంతమంది వున్నారు. ఇలా అయితే మీరు మీ బ్లాగుల్లో వైవిధ్యం చూపించేదెప్పుడూ, ఎన్నడూ?
ఇప్పుడు వస్తున్నటువంటి ఎక్కువభాగం పోచుకోలు కబుర్లు చదవడానికి, వినడానికీ మనకందరికీ పత్రికలు, పుస్తకాలు, టివి ఛానళ్ళూ వున్నాయి. వాటికోసం బ్లాగుల్లోకే, నెట్టులోకే రానవసరం లేదు. నెట్టులోనయినా స్వేచ్చ వుంది కాబట్టి ఎవరయినా కాస్తో కూస్తో ధైర్యం చేసి హిపోక్రాటిక్ ముసుగులను అవతలపడేసి సామాజిక, ఆర్ధిక, శారీరక, మానసిక, లైంగిక విషయాలను వాస్తవ దృక్పధంతో చర్చిస్తారేమో అంటే అంత దృశ్యం నేడు లేదే! మనస్సు పొరల్లో భూస్థాపితం చేసిన చేదు నిజాలనూ, ఎవ్వరికీ చెప్పలేని మధురానుభూతులనూ, సాధారణ జనం ఖంగు తినే భయంకరమయిన అనుభవాలనూ, నిష్టూరంగా వుండే నిజాలనూ వెలికి తీసి ఎవరయినా బ్లాగుల్లో పరుస్తారేమో అంటే అంత సీన్ లేదే. మరి మగవారు అలా వ్రాయట్లేదా అంటే వారు కూడా వ్రాస్తున్నారు - నేను కూడా వ్రాస్తుంటాను. అయితే మగాళ్ళలో నాలాంటి వారు కొంతమంది బ్లాగులు వ్రాయడంలో వున్న స్వేఛ్ఛని కొంతవరకయినా ఉపయోగించుకుంటున్నారు. అలాంటి వారు స్త్రీలల్లో కాగడా ఊప్స్ ఆ పేరు వద్దులెండి - ఎదవ గొడవ - దివిటీ పెట్టి వెతికినా కానరావడం లేదు.
(ఇంకా వుంది)