http://amtaryaanam.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
Updated: 28 min 16 sec ago

బాబ్లీ రాజకీయాల్లో పిడకల వేట

Tue, 07/27/2010 - 02:54
ఎప్పుడూ పదవుల కోసం, అధికారం కోసం రాజకీయాలు నడిపే మన నేతలు మొదటిసారి ప్రజల కోసం రాజకీయాలు నడపటం ముదావహం. ఈ సంతోషానికి మరో కారణం కూడా ఉంది. ప్రజల కోసం ఉద్యమించినప్పుడు, మన ప్రజాస్వామ్య పరిరక్షకులే ఒళ్ళు హూనమయ్యేలా కుళ్ళబొడుస్తారనే ఓ నగ్న సత్యాన్ని అనుభవంతో గ్రహించారు మన తెలుగుదేశం నేతలు. అరకొర వసతుల మధ్య, మరాఠీ లాఠీ దెబ్బలతో దినదిన గండంగా అయిదురోజులు వెళ్ళబుచ్చామని చంద్రబాబు కన్నీళ్ళ పర్యంతం అయ్యారు. 
ఒక్కసారి లాఠీ ఝలిపించేటప్పటికే, వాతలు తేలిన వీపు చూపిస్తు ఒక నేత, స్పృహ తప్పిన మరో మహిళా నేత, కన్నీళ్ళు తుడుచుకుంటూ వాళ్ళ నాయకుడు.... ప్రజా ఉద్యమంలో లోతుపాతులు చవిచూడటం మంచి పరిణామమే కదా!
అధికారంలో ఉన్నప్పుడు, స్త్రీలని, విద్యార్ధులని, బడుగు రైతులనీ లేకుండా అనేకానేక ఉద్యమాలను ఆయనే ఎలా అణచివేసారో కూడా ఆ అయిదు రోజుల్లో ఒక్కసారైనా ఆయనకు గుర్తుకొచ్చి ఉంటుందనే ఆశిస్తాను. అరకొర ఏంటి, అసలు వసతులే లేని ఆంధ్ర లాకప్పుల్లో ఎంతమంది మగ్గిపోతున్నారో కూడా ఆయనకు ఓ అంచనా వచ్చి ఉంటుందనే ఆశిస్తాను.
ప్రజా ఉద్యమాల లోటుపాట్లు బానే అర్ధం చేసుకున్న కాంగ్రెసీయులకు, ఎలాగూ తమ పీఠాల కింద పదవీ పీఠాలు కాపాడుకోటానికే తీరిక లేదు కాబట్టి, ఇలాంటి రాజకీయ ఉద్యమాలు నడిపే తీరిక మాత్రం ఇంకెక్కడిది? కాబట్టి కాంగ్రెస్ నేతలు బతికి బట్ట కట్టేసినట్లే.
చంద్రబాబు రాజకీయ పాచిక ఈ తెలంగాణా ఉప ఎన్నికల్లో పారిందో, వచ్చే ఎన్నికలకు తెలుగు తమ్ముళ్ళు తమ వీపులు రెడీ చేసుకోవాల్సిందే. కర్ణాటక, తమిళ్నాడు పోలీసు లాఠీలకు కూడా త్వరలోనే బోల్డు పని దొరకబోతుంది.
ఆవకాయలో కూడా....
Categories: Left

సోంపేట స్ఫూర్తి

Fri, 07/16/2010 - 05:22

మనం ఎన్నుకున్న ప్రభుత్వపు విధానాలు మనకు నచ్చనప్పుడు, వ్యతిరేకత ఎలా ప్రకటించాలి? అందులోనూ, మన కనీస అవసరాలకు, అవకాశాలకు ప్రభుత్వమే గండి కొడుతున్నప్పుడు ఏం చేయాలి?
కలెక్టరుకో, మరో అధికారికో వినతి పత్రాలు సమర్పిస్తాం. అవి బుట్టదాఖలౌతుంటే, కోర్టులో కేసులు వేస్తాం. కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరిగే ఓపిక లేకపోతే, మూకుమ్మడిగా ఆందోళన చేస్తాం. దాదాపు 30 గ్రామాల ప్రజలు చేసిందదే. పర్యవసానం, పాశవికంగా ప్రభుత్వం చేసిన బలప్రయోగానికి సోంపేటలో కొందరి దుర్మరణం.
తమ సిద్ధాంతాలను వ్యతిరేకించే ప్రభుత్వ అధికారులను, పోలీసులను కాల్చి చంపే నక్సలైట్లకు, తమ విధానాలను వ్యతిరేకించే ప్రజలను పోలీసు కాల్పులతో చంపేసే ప్రభుత్వానికి తేడా ఏమిటి? నక్సలైట్లనైతే సంఘవిద్రోహులుగా ప్రకటిస్తాం. మరి ప్రభుత్వాన్నేం చేయాలి? విచిత్రమేమిటంటే, ప్రభుత్వ విధానాలను విమర్శించిన వారినందరినీ నక్సలైట్లుగా ముద్రవేసి, ప్రగతి నిరోధక శక్తులుగా ప్రచారం చేస్తుంది ఈ ప్రభుత్వం.
గ్రామ స్వరాజ్యం సాధ్యపడినప్పుడే, దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని బోధించిన మహాత్ముని వారసులు, గ్రామ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తెగబడటంలోని ఔచిత్యం ఏ ప్రజాస్వామిక విధాన స్ఫూర్తి?
కొన్నాళ్ళ క్రితమే, పర్యావరణ అనుమతులు అందించిన కేంద్ర పర్యావరణ శాఖ, ఈరోజు ఆ అనుమతులను వెనక్కు తీసుకున్నదని వార్తలు. అసలు, తప్పుడు సమాచారంతో పర్యావరణ అనుమతులు అధికారులు ఎలా సంపాదించారు? ఆయా అధికారులను ప్రభావితం చేసిన అంశాలేమిటి? ఇవేవీ ఇప్పుడు చర్చకు రావు. ప్రస్తుతానికి, ప్రజల గద్దింపులను సర్దిచేప్పే ప్రయత్నాలలో ఇదో భాగం మాత్రమే.
పార్టీల కతీతంగా ఆయా గ్రామాల ప్రజలు సోంపేటలో చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. ప్రభుత్వాలని, తద్వారా దేశాన్ని ప్రభావితం చేయగల మధ్యతరగతి ప్రజలలో భావ చైతన్యం పెరగాలి. మునుపెవ్వరో ఏదో బ్లాగులో కామెంటు చేసినట్లు, రోజుకు 24 గంటల కరెంటుతో, 24 గంటల కేబుల్ టీవీ ప్రసారాలతో, రోజుకోసారి మునిసిపాలిటీ వారిచ్చే మంచినీటితో సంతృప్తి చెందే స్థాయి నుంచి దాటి, అభివృద్ధి పేరుతో ప్రభుత్వం మన కళ్ళకు కడుతున్న గంతలు తీసి నిజాలు నిర్ధారించుకునే స్థాయిలో విప్లవాత్మకమైన చైతన్య స్ఫూర్తి మనలో కలగాలి.
ఆ స్ఫూర్తే, మరిన్ని సోంపేటలు పునరావృతం కాకుండా ఆపగలుగుతుంది. ఆ స్ఫూర్తే అంతరాల భేషజాలు లేని ప్రజా ఐక్యతకు పునాదౌతుంది.
Categories: Left

అధ్యాయం- 1 పల్నాటి వీరభారతం

Sun, 07/04/2010 - 12:03
తెలి వులిపిరి తెరల మధ్య తెల్లవారీ ఆరకముందే, పక్షులన్నీ గూళ్ళనుంచి బైటికి వొచ్చీ రాకముందే - తేనెటీగలు పూవుల మీద ముసిరీ ముసరకముందే, "జిట్టగామాలపాడు" ఉత్తరాన వున్న బీళ్ళలో ఆరవల్లి రామిరెడ్డి అరక దున్నుతున్నాడు.

సూర్యుడు మబ్బుల మీద షికారుకు బైల్దేరినవేళ రామిరెడ్డి "చుట్ట" అంటించుకోవటానికి నిలబడ్డాడు. చేను నానుకుని, నాలుగ్గజాల దూరంలో, గట్టు మీద పెద్ద పాముపుట్ట ఉంది. రామిరెడ్డికి సుప్రభాతపు వెలుగు పర్చుకుంటున్నప్పుడు "కేర్ ... కేర్ .." మనే ఏడుపు వినిపించింది.

అతను ఛటక్కున ఆగిపోయాడు.

అరక దున్నే దాపలిగిత్త "అంబా" అన్నది.

రామిరెడ్డి చుట్టుపక్కల కలయజూసాడు.

పచ్చటి వెలుగు వ్యాపించుకుంటున్న పల్లెల మీద పడి మెరుస్తున్న నీరెండ.

మళ్ళా "కేర్ ... కేర్ .."మన్న రోదన.
మిగతా ఆవకాయ.కామ్ లో... 
Categories: Left

పల్నాటి వీరభారతం-ముందుమాటలు

Sun, 06/27/2010 - 05:43
ప్రచురణ కర్తల మాటల్లో రచయిత పరిచయం:

రచన ఒక వరంగా, వాక్య నిర్మాణం ఒక అద్బుత శిల్పంగా భావించే అరుదైన రచయితల్లో చిట్టిబాబు ఒకరు. పేరులోనే పెన్నిధి వున్న కథకుల్లో వీరిని చేర్చాలి. Author Chitti Babu మాటల్ని ఎక్కడ పొందికగా, మధురనిష్యందంగా ఉపయోగించాలో, ఎక్కడ పాఠకుల్ని తమ "గ్రిప్ "లోకి తెచ్చుకోవాలో తెలిసిన రచయితల్లో ఒకర్నిగా ఈయనను చెప్పాలి.
మిగతా ఆవకాయ.కామ్ లో... 
Categories: Left

'ఈనాడు'లో నా అనుభవాలు

Wed, 06/02/2010 - 03:14

"ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు" చదువుతుంటే, నేను తిరుపతి ఈనాడులో పనిచేసిన రోజులు గుర్తుకువచ్చేవి. 88 చివర్లో తిరుపతి ఈనాడులో పి.ఎల్.ఎం.ఓ.గా (కంపోజింగ్ సెక్షన్) చేరాను. పదోతరగతి సెలవల నుంచి, గుమాస్తాగిరికి ఉపయోగపడుతుందనుకునే మధ్యతరగతి మనస్తత్వంలో భాగంగా, ఇంగ్లీషు, తెలుగు, హింది టైపు రైటింగు, షార్ట్ హాండు నేర్చుకోవటం మొదలేసా. డిగ్రీ అయిపొయిందే తడవుగా ఈనాడులో ఉద్యోగం రావటంతో మరేమీ ఆలోచించకుండా జాయిన్ ఐపోయాను. నిజానికి, కాలక్రమంలో ఓ జర్నలిస్టుగా స్థిరపడదామనే ఆలోచన కూడా ఈనాడులో చేరటానికి మరో ముఖ్య కారణం. రెండు సార్లు ఈనాడులో సబ్ ఎడిటర్ ఉద్యోగానికి గాను, వ్రాత పరీక్షలకు కూడా హాజరయ్యాను. అదృష్టం కొద్దీ పాస్ కాలేదు :)
నేను పని చేసిన దాదాపు ఏడెనిమిది నెలల్లో, ఈనాడులో నాకు నచ్చిన ఓ మంచి విషయం ఏదైనా ఉన్నదంటే, అది జీతం. బెత్తెడు జీతమే (స్టైఫండ్) అయినా ఠంచనుగా నెలాఖరుకల్లా వచ్చేది. ఆ రోజుల్లో, మా రూం మేట్లుగా ఉన్న ఆంధ్రజ్యోతి, ఉదయం పత్రికల ఉద్యోగులు మాత్రం నానా బాధలు పడేవారు జీతం సమయానికి రాక. బచావత్ ట్రిబ్యునల్ సిఫార్సుల ఆధారంగా జీతాలు ఇవ్వాళ పెరుగుతాయి, రేపు పెరుగుతాయి అనుకుంటూనే, దాదాపు ఓ అయిదేళ్ళు గడిచిపోయాక గానీ, ఈనాడులో జీతాలు పెరగలేదని చెప్పేవారు, ఆ తర్వాత నా జర్నలిస్టు స్నేహితులు.
జర్నలిస్టులు ఎలా పీడింపబడేవారో నాకైతే తెలియదు కానీ, మమ్మల్ని మాత్రం సబ్ ఎడిటర్లు పీల్చి పిప్పి చేసేవారు. అలానే, సీనియర్లు కూడా చెండుకు తినేవారు. కొత్తగా వచ్చామని మాకు డే షిఫ్టు ఉండేది, కంప్యూటర్ లో తెలుగు టైపు చేయటం నేర్చుకోటానికి వీలుగా. ఎందుకంటే, డే షిఫ్టులో ఎక్కువ పని కూడా ఉండేది కాదు, కాబట్టి ఆ సమయంలో మాకు మా షిఫ్టు ఇన్ ఛార్జి టైపు చేయటం, అలానే, ప్రకటనలు చేయటం నేర్పేవాడు. కానీ, చేరిన కొత్తలో ఓ రెండు వారాలు మినహా, మళ్ళీ ఏనాడు ఆ షిఫ్టులో పని చేయలేదు. సీనియర్లు అడ్జస్టుమెంట్లని వేధించేవారు. కుదరదంటే వాళ్ళ చాకిరి కూడా మా మీద రుద్దేవారు. మా షిఫ్టు ఇన్ ఛార్జి మాత్రం చాలా మంచివాడు. నాకు వ్యక్తిగతంగా కూడా సహాయం చేసేవాడు. అతని పేరు తాతబ్బాయి. తిరుపతికి కొత్త కావటంతో, మాకు అద్దె గది వెతుక్కోటంలో, వీక్లీ ఆఫ్ రోజు ఇంటికి పిలిచి మంచి భోజనం పెట్టటం చేసేవాడు. అలానే, ఓవర్ టైం చేయించి, కంపెన్సేటరీ సెలవలు కూడా ఇచ్చేవాడు. రెండో షిఫ్టు ఇన్ ఛార్జి (భీమారావు) అంటే అప్పట్లో ఎందుకో టెర్రర్ గా ఉండేది. మనిషి మాట తీరే కఠినంగా ఉంటుంది కానీ, మంచివాడే అని ఆ తర్వాత తెలిసింది.
ఇక ఈ సబ్ ఎడిటర్లు... ఈనాడులో సబ్ ఎడిటర్ అనేప్పటికి ఏవో కొమ్ములు మొలిచినట్లు, కంపోజింగ్ సెక్షనులో ఉన్న మేమేదో పనికిమాలినవాళ్ళమైనట్లు చూసేవారు. వారు వ్రాసి ఇచ్చే వార్తలు, నిజం చెప్పాలంటే నవ్వొచ్చేది. ఏదో వ్రాసుకుపోవటమే కానీ, స్పార్క్ ఏకోశానా కనిపించేవిధంగా ఉండేవి కాదు. స్థానిక వార్తలకు ప్రాధాన్యం ఇచ్చే ఉద్దేశ్యంతో మొదలైన జిల్లా ఎడిషనుల వల్ల, వార్తలలో పస తగ్గిపోయిందేమో అనిపించేది. మడకశిరలో మడత మంచాల పంపిణీ,.. అనంతపురంలో ఆత్మహత్య... కుళాయి తగాదాలో కన్నుమూత... ఇలా సాగేవి వార్తల శీర్షికలు. ఇక వీళ్ళ చేతివ్రాత చూస్తే కళ్ళు బైర్లు కమ్మేవి. ఎవరో ఒకరిద్దరు తప్ప, మరెవరి చేతివ్రాత అర్ధమయ్యేది కాదు. నమ్మండి, నమ్మకపోండి... నేను, రమణ బాబు అనే మరోతను కలిసి నాలుగు జిల్లా ఎడిషన్లు పూర్తిగా కంపోజ్ చేసేవాళ్ళం, పోటీ పడి మరీ. ఇక మమ్మల్ని రెచ్చగొడుతూ, సీనియర్లు వాళ్ళ పని కూడా మాకు పురమాయించేవాళ్ళు.
వ్యక్తిగతంగా, నేను నైట్ షిఫ్టు కోరుకునేవాడిని. ఎందుకంటే, ఆ సమయంలో సబ్ ఎడిటర్లతో కూర్చొని నేను కూడా వార్తలు వ్రాసే అవకాశం దొరికేది. అప్పట్లో విశ్వప్రసాద్ గారు చిత్తూరు డెస్కు ఇన్ ఛార్జిగా ఉండేవారు. వాళ్ళ డెస్కుకు పని తగ్గుతుందనేమో తెలియదు కానీ, ఆయన చాలా ప్రోత్సహించేవారు. అప్పటి ఓ విషయం నాకింకా గుర్తే. గాలి ముద్దుకృష్ణమ నాయుడు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి, కొన్నిపనులు ఎందుకు చేయలేకపోతున్నది (దాదాపుగా ఇదే అర్ధంలో) వివరణ ఇచ్చారు. రిపోర్టరు ఇచ్చిన ఆ వార్తకు "ముద్దు" మాటలు "గాలి"కే అనే శీర్షిక పెట్టి ఆ వార్తను ఎడిట్ చేసా. విశ్వప్రసాదుగారు నవ్వి, ఆ శీర్షిక తీసి, ఇంకోటి పెట్టారు.
మమ్మల్ని వేధించిన వాళ్ళలో మరో ముఖ్య వ్యక్తి అక్కడి పర్సనల్ మేనేజర్. పేరు సరిగా గుర్తులేదు... రాజేంద్రబాబు అనుకుంటా. కంప్యూటర్ సెక్షనులో ఏ.సి. ఉండేది. దాదాపు ఎనిమిది గంటలు కూర్చోవాలంటే ఇబ్బందిపడేవళ్ళం. మధ్యలో ఓ పది నిముషాలు బ్రేక్ తీసుకొని బయట జేబులో చేతులు పెట్టుకు నుంచుంటే... "ఏరా, జేబులో చేతులు పెట్టి XXXX పిసుక్కుంటున్నారు... ఇలాగైతే ప్రొబేషన్ పెంచేస్తా..." అని అరిచేవాడు. సగం ఈయన కూడా కారణమే, నేను ఈనాడు వదిలేసి వెళ్ళిపోటానికి. ఇక ఆ మేనేజరు... గోవిందరావో, గోపాలరావో ఉత్సవవిగ్రహంలా మాత్రమే ఉండేవాడు. అసలు ఆయన చేసే పనేంటో మాకు అర్ధం అయ్యేది కాదు. అంతా రాజేంద్రబాబు హవానే నడిచేది.
ఇంత చెప్పీ, రెడ్డెమ్మ మెస్ గురించి చెప్పకపోతే ఎలా? చాలా చౌకగా భోజనం పెట్టేది. ఈనాడు ఆఫీసు నుంచి, రైల్వే లైను దాకా నడుచుకుంటూ వచ్చి లైనుకు అవతల ఉన్న రెడ్డెమ్మ మెస్ లో భోజనం చేసేవాళ్ళం. కానీ, నాలాంటి వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే, శాఖాహారం, మాంసాహారం రెండు వండేది. అంతా ఒకేచోట కూర్చొని తినాల్సి వచ్చేది. తాగుబోతు భర్తని, ఆకతాయి మొదటి భార్య పిల్లవాడిని భరిస్తూ, ఎలా పని చేయాల్సి వస్తున్నదో నసుగుతూ వడ్డించేది.
ఇక, తెల్లవారుఝామున మూడు గంటలకు బయలుదేరి, లారీలు ఆపుకుంటూ తిరుపతి చేరేవాడిని. వదిలేసే ముందు రేణిగుంటకు మకాం మార్చాను. కంపోజింగ్ సెక్షనులో అప్పటి నా మిత్రులు వాసుదేవ రావు, లక్ష్మణ రావు, రమణ బాబు, దుర్గా ప్రసాద్, మురళీమోహన రావు, నాయుడు, కృష్ణమూర్తి.... ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో!

ఆవకాయలో కూడా....
Categories: Left

మత బీజాలు నాటుతున్న మిషనరీ స్కూళ్ళు

Fri, 05/21/2010 - 06:52
కుహానా లౌకికవాదులకు మరింత మేత దొరికింది మహారాష్ట్రలో. మైనారిటీల మీద ఎక్కడలేని వివక్ష చూపుతున్నారని మరోసారి పత్రికల పతాకశీర్షికలకెక్కి గగ్గోలు చేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే, ముంబాయిలోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలకు (దాదాపు నూటయాభై క్రైస్తవ మిషనరీ స్కూళ్ళకు కూడా) శివసేన - భా.జ.పా. ఏలుబడిలో ఉన్న బి.ఎం.సి. (బృహన్ ముంబాయ్ మునిసిపల్ కార్పొరేషన్) ఆయా పాఠశాలలలో భారతీయత ప్రతిబింబించే విధంగా చర్యలు చేపట్టమని చెప్పింది.

ఇది తమ స్కూళ్ళ నిర్వహణలో తల దూర్చడంగాను, మైనారిటీ స్కూళ్ళని వేధించే చర్యలుగాని అభివర్ణిస్తూ క్రైస్తవ మిషనరీలు హడావుడీ చేస్తున్నాయి. మిగతా స్కూళ్ళకు లేని ఇబ్బంది, ఈ మిషనరీ స్కూళ్ళకి ఎందుకనేది మనకు అర్ధం కాదు. బి.ఎం.సి. తీసుకోమని చెప్పిన చర్యలలో, ఆడ పిల్లలు ధరించే బొట్టు, గాజుల మీద ఆయా స్కూళ్ళు విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలనేది ముఖ్యమైనది. అదేవిధంగా, వినాయక చవితి, దీపావళి పండుగలకు సరిపడే విధంగా సెలవలు ఇవ్వాలని, బి.ఎం.సి. తో సాగించే ఉత్తర ప్రత్యుత్తరాలు మరాఠీలో ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.

నిజమైన లౌకికవాదులకి, పై ఆదేశాలలో ఒక్కటి కూడా తప్పుగా కనిపించకూడదు. మరి ఈ కుహానా లౌకికవాదులకి ఇవన్నీ తప్పుగానే ఎందుకు తోస్తున్నాయో! బురఖాలు ధరించి ముస్లీం యువతులు కళాశాలలకు వెళ్ళే స్వేచ్ఛ ఉంది కానీ, బొట్టు గాజులు తొడుక్కునే స్వేచ్ఛ హిందు బాలికలకు లేకపోవటం ఏమిటని ఎవరూ ప్రశ్నించరే!

ఒక్క మహారాష్ట్ర అనే కాదు, దాదాపు దేశంలోని ప్రతి క్రైస్తవ మిషనరీ పాఠశాల ఆడపిల్లలు బొట్టు, గాజులు ధరించటాన్ని నిషేధించింది. అది, హిందువుల హక్కులను కాలరాయటం కాదా? దీన్ని ప్రశ్నించినవాళ్ళను మతవాదులుగా మసిపూయటం ఎంత దారుణం!

ఈ వార్త చదవగానే, నా చిన్ననాటి సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది. నేను గుంటూరు హిందు హైస్కూల్లో చదువుకునేటప్పుడు ఓసారి గుంటూరులోని స్టాల్స్ గరల్స్ హైస్కూలు నుంచి కొందరు మా స్కూలుకు వచ్చి, బైబిల్ పుస్తకాలు పంచుకోటానికి మా హెడ్ మాస్టర్ అనుమతి కోరారు. ఆయన దానికి ఒప్పుకొని, ఒక కండిషన్ పెట్టారు. అదేమిటంటే, వాళ్ళ స్కూల్లో భగవద్గీత పంచుకునేందుకు అనుమతి ఇస్తే, ఇక్కడ బైబిల్ పంచుకునేందుకు తనకేమీ అభ్యంతరంలేదని. పల్లెత్తు మాట మాట్లాడకుండా వచ్చినదోవనే వెళ్ళిపోయారు.

పసి మనసుల్లో ఇలా మత బీజాలను నాటాలని ప్రయత్నించే క్రైస్తవ మిషనరీ పాఠశాలలను, మదర్సాలను ప్రభుత్వం వెంటనే జప్తు చేయాలి.
Categories: Left

అంబేద్కర్ ఆలోచనలు - మరో దృక్ఫధం

Thu, 05/20/2010 - 03:34
రిజర్వేషన్లతో దేశాన్ని భ్రష్టు పట్టించాడని అంబేద్కర్ ను ఆడిపోసుకోవటంలో అర్ధం ఎలాగైతే లేదో, అణగారిన ప్రజల కోసం, వారి అభ్యుదయం కోసం ఆయనొక్కడే కృషి చేసాడని చెప్పుకోవటం కూడా అంతే అర్ధ రహితం. ఈ రిజర్వేషన్లను అభిశంసించ దలచినా, అభినందించ దలచినా వాటికి నిజమైన అర్హుడు అప్పటి రాజ్యాంగ సభ అధ్యక్షుడు  డా. బాబు రాజేంద్ర ప్రసాద్.

మితిమీరిన అభిమానంతో, అంబేద్కర్ ను అందరూ ఆరాధించేలా చేయాలనే తాపత్రయంతో, అసలు విషయాలు మరుగున పడవేసే ప్రయత్నాలు చాలానే జరిగాయి. ఈ నేపధ్యంలో, కొన్నాళ్ళ క్రితం నా మిత్రుడు వెంకటరత్నం "అంబేద్కర్ ఆలోచనలపై" వ్రాసిన వ్యాసాల పరంపర ఆవకాయలో....
అంబేద్కర్ ఆలోచనలు - మరో దృక్ఫధం - 01
అంబేద్కర్ ఆలోచనలు - మరో దృక్ఫధం - 02
అంబేద్కర్ ఆలోచనలు - మరో దృక్ఫధం - 03
Categories: Left

Talks and Articles by Sri C. Subba Rao

Sun, 05/16/2010 - 23:25
Book Release Report by Dr. Vaidehi Sasidhar :

On April 2nd 2010 at 6 pm, my father, Sri.C.Subba Rao’s book, “Talks and Articles” was launched at the tastefully decorated Mini Conference Hall in the famous Ravindra Bharathi complex in Hyderabad. Prof.C.Subba Rao, former Chairman of the Council of Higher Education ,the Govt.of Andhra Pradesh, presided over the function. Prof I.V.Chalapathi Rao, former Registrar of the Central Institute of English and Foreign Languages and also Chief Editor of Triveni at present, was the distinguished Chief Guest, who launched the Book. Prof.S.S.Prabhakar Rao, former JNTU professor was the Guest of Honour. I had the privilege and good fortune of sharing the stage with these stalwarts as one of the speakers and as another Guest of Honour (I had written the Foreword for my father’s book). Of course, my father was on the stage immaculately dressed as usual on such formal occasions.
The meeting commenced with an invocation to Lord Ganesha rendered melodiously in the classical style bringing out all the devotional aura of the Sloka by my brother-in-law Sri.Chaitanya.Then came the launching of the book by Prof I.V.Chalapathi Rao.
See Full Write-Up in Avakaaya.com
Categories: Left

నావి కాలేని నీవి - నానీలు మరో సమాలోచనం

Fri, 05/07/2010 - 06:28
గతంలో "నానీ"ల పై నేను వ్రాసిన వ్యాసం.

ఎన్ని గజాలు వ్రాసావన్నది కాదు ముఖ్యంఎన్ని నిజాలు చెప్పావన్నది ముఖ్యంనిన్నటి మహాకావ్యం పద్దెనిమిది పర్వాలైతేనేటి మహాకావ్యం పద్దెనిమిది పేజీలు.
ఏ సందర్భంలో ఆరుద్రగారు వ్రాసారో కానీ, నానీల పేరుతో ఈమధ్యకాలంలో విశృంఖలంగా వస్తున్న కవితలనబడే సాహిత్యాన్ని చూసినప్పుడల్లా గుర్తొచ్చే పంక్తులవి.
పద్దెనిమిది పేజీలేమో కానీ, పది లైనులు కూడా వ్రాయలేని ప్రబుద్ధులందరూ ఒక ఇమేజరీతో ఒక ప్రకటనతో నాలుగులైనులు గిలికేసి,  దాన్నే కవిత్వంగా సరిపుచ్చే ధోరణి ప్రబలిపోతున్నది.
అసలు హైకులు, మినీకవితలు వంటి ప్రక్రియలు ప్రత్యేకించి ఉండగా ఈ నానీలని తవ్వి తలకెత్తుకోవలసిన విశేషం ఏమైఉంటుందనేది ఈ విమర్శనాత్మక వ్యాసపు ప్రధానోద్దేశ్యం.
ఈ వ్యాసానికి ఉపకరించిన పుస్తకం నానీల ఏడవ వార్షికోత్సవం సందర్భంగా నానీల నాన్నగారి (ఈ వ్యాసంలో 'నా.నా. గారూ - ఎన్. గోపి గారు) తొలివారసుడుగా (ఈ వ్యాసంలో నా.వా.గారు) ఎస్. ఆర్.భల్లం గారు సంపుటీకరించిన వ్యాసాల, సమీక్షల,  జనవాక్యాల సమ్మేళనం 'నానీల సమాలోచనం'  అనే పుస్తకం.
"హైకూలు రాసే కవులు కూడా ఈ నానీని పోటీ కవితా ప్రక్రియగా భావించక, సహృదయతతో అక్కున చేర్చుకొన్నారు" అంటూ నా.వా.గారు వ్రాసిన సంపాదక వాక్యంలోనే నానీ ప్రక్రియకు దోహదంచేసిన కారణాలు అన్యాపదేశంగా ప్రకటీకృతమౌతున్నాయి.
"నానీల కవితా పరివ్యాప్తి" అనే వ్యాసంలో, నా.వా.గారు "హైకు రచన వేరు. నానీ నిర్మాణం వేరు! నానీ నిర్మాణానికి సామాజిక వాస్తవికత గొప్ప ఉత్ప్రేరకం" అంటారు.
అసలు "హైకు" అనేది అనుభవాన్ని అనుభవంగా ప్రకటించే కవితా ప్రక్రియ. అందులోనూ ముఖ్యంగా మార్మికత సంతరించుకున్న తాత్వికత హైకు ప్రక్రియకు జవజీవం. కానీ, ఈ రెంటికి మించి "సామాజికత" నానీలలో ముఖ్యమైన అంశం అని నా.వా.గారి ఉవాచ.
మూడు లైనుల్లో,  17 అక్షారాలలో చెప్పలేని సామాజిక వాస్తవాన్ని, నాలుగు లైనుల్లోను, 25 అక్షరాల నియతితో ఎలా చెప్పగలరని ఈయన ఉద్దేశం? ఇంత చెప్పిన ఈ పెద్దమనిషి తమకు తాము విధించుకున్న నియతిని ఖచ్చితంగా పాటించారా అంటే అదీలేదు. ఈ ఉదాహరణలు చూడండి.
వాడేంటిఇన్ని చక్కర్లు కొడుతున్నారుఅవునువాడిది ఆషాఢభూతి అంశ (26 అక్షరాలు)
రైతుకీధాన్యానికి బంధం తెగిపోయిందిమిల్లులో నలిగేవిబతుకులు కూడా (27 అక్షరాలు)
మొదటి నానీలో ఏ సామాజికత దీన్ని కవిత్వం చేస్తున్నదో!! అలాగే, రెండో నానీ వార్తాపత్రికలో శీర్షికలా మాత్రమే నాకనిపిస్తున్నది కానీ, కవిత్వమైతే కనిపించటంలేదు.
ఏతావాతా తేలేదేమిటంటే, "సామాజికతను" క్లుప్తంగా కవిత్వంలో చొప్పించటానికి వీరికి ఓ నాలుగుకాళ్ళ వాహనం కావల్సివచ్చింది. దానికీ పాతిక అక్షరాల మెలికతో ఒక తోక.
ఈ పుస్తకంలోనే, డా. తలతోటి పృధ్వీరాజ్ గారు "నానీలు" అనే వ్యాసంలో యశశ్రీ రంగనాయకిగారు చెప్పినట్లుగా ఉటంకించిన వాక్యం చూడండి. "...యోగి వేమన పద్యాలు గన్ షాట్ లు అయితే, ఆ వేమన్న వాదం వినిపించిన గోపిగారి నానీలు పెన్ షాట్ లు".
అసలు విషయాన్ని చాలా చక్కగా వివరించారు ఆ ఒక్క వాక్యంతో. ఈటెల్లాంటి ఆటవెలది పద్యాలతో వేమన స్పృశించని ఏ సామాజిక కోణాన్ని ఈ "నానీ ప్రక్రియ" స్పృశిస్తున్నదో!
ఆ మాటకొస్తే, "ఓ కూనలమ్మా" అనే మకుటాన్ని మినహాయిస్తే, ఆరుద్ర గారు మూడు లైనుల్లో "నానీ"ల కన్నా అద్భుతంగా కూనలమ్మ పదాలు వినిపించారు మరి. నిన్నగాక మొన్న జనార్ధన మహర్షి వ్రాసిన "వెన్నముద్దలు" దాదాపు ఈ కోవలోవే. వీళ్ళెవరూ పనిగట్టుకొని, అవో ప్రత్యేక కవితా రీతిగా దరువులు వేసుకోలేదే!
"ఒక ఉద్వేగభరితమైన నిరంతర సంవేద మూలం" నానీల ఆవిర్భావానికి కారణంగా నా.నా.గారి వివరణ. హైకూలైనా, మినీకవితలైనా, ఆఖరికి విశ్వంభరలాంటి కావ్యాలైనా, ఒకానొక ఉద్వేగం నుంచి జనించినవే. ఆ విషయంలో చిన్నకవులు వ్రాసినా, చితక కవులు వ్రాసినా ఆయా రాతలలో "ఉద్వేగానికి" మినహాయింపు ఉండదు. కాబట్టి, ఆయన నానీల ఆవిర్భావానికి ఇచ్చిన ఈ వివరణ తేలికగా కొట్టిపారేయదగ్గదే.
అసలు హైకు అంటే ఏమిటి?
మూడు పాదాలు ఉంటాయి.ఒకటి మూడు పాదాలలో అయిదేసి అక్షారాలుంటాయి.రెండవ పాదంలో ఏడు అక్షరాలుంటాయి.మొత్తానికి మూడు లైనులతో, పదిహేడు అక్షరాలతో జపనీస్ భాషలో జెన్ బౌద్ధం స్ఫూర్తితో వచ్చిన ప్రక్రియ హైకు.
మన తెలుగు భాషలో ఈ ప్రక్రియలో వ్రాయటంలోని సావకాశం తక్కువే. నాలుగు పాదాలలో అక్షర నియమాన్ని ఉల్లంఘిస్తూ వచ్చిన హైకులు విదేశీ భాషలలోనూ ఉన్నాయి.  కాని అర్ధంకాని విషయం ఏమిటంటే, నాలుగు పాదాలు, 25 అక్షరాల వెసులుబాటు కల్పించుకొని, తానేదో కొత్త ప్రక్రియ కనిపెట్టానన్న ఢమరుకపు మోతలెందుకో ఈ నా.నా. గారికి, వారి వారసులకి!!
రెంటికీ చెడ్డ రేవడిలా, అటు హైకులకి ఎక్కువ, ఇటు మినీ కవితలకి తక్కువగా అసంబద్ధంగా నానీ కవిత్వం ఉన్నదనేది నిష్ఠూరమైనా నిజం. చాలా వరకు నానీలు ఉపదేశాలకో, ప్రకటనలకో పరిమితమైపోయాయి.
పిల్లి గుడ్డిదైతే, ఎలుకేదో చేసిందని, తెలుగు సాహితీ విమర్శకులు నానీల విషయంలో మిన్నకుండిపోవటం వల్లనే, ఇప్పుడు నానోల పేరుతో నాలుగు పదాల చిల్లర కొట్టు కవిత్వం విశ్వవ్యాప్తం చేసే ధోరణి మొదలయ్యింది.
ఏదేమైనా, నా.నా.గారు, వారి వారసులు నానీ కవిత్వం విషయంలో, తవ్వి తలకెత్తుకోదగ్గ కొత్త కవితా విశేషమేమీ కనిపెట్టకుండానే డప్పు వాయించుకోవటం విపరీతం!!
నా అభిప్రాయంలో :
ఛందోబంధాలు వద్దు అనుకున్నప్పుడు, దాదాపు అటువంటివే అయిన సరళీకరించబడిన బంధాలు మాత్రం దేనికి? హైకులని చూసి వాత పెట్టుకున్న బంధాలే అవి అని స్పష్టంగా తెలుస్తున్నది.
మకుటం వదిలేస్తే, మూడు పాదాల్లో వేమన వ్రాసిన పద్యాలకు కూడా నానీలు నకలే.
హైకూలనే మరో వాక్యంతో విస్తరింపచేసి, అందులో సామాజికతే ముఖ్యమని మభ్యపెట్టిన పసలేని ప్రయోగమే నానీలు.
నిజానికి, నాలుకు లైనులు కూడా సరిగ్గ వ్రాయలేని ప్రబుద్ధులను కవులుగా చలామణి చేసి, ఆధునిక కవిత్వాన్ని నాలుగు లైనులకు దిగజార్చటంలో నానీల బాధ్యత చాలా వరకు ఉంది.
 ఆవకాయలో కూడా...
Categories: Left

కవిత్వంలో శైలి

Wed, 04/14/2010 - 06:14
కవిత్వంలో శైలి పై అలోక్ వాస్తవ్ గారి వ్యాసం ఆవకాయ.కామ్ లో....
"కలౌ దుష్టజనాకీర్ణే" అని "అజ్ఞాన వ్యాకులే లోకే" అని చాలామంది తిట్టిపోస్తుంటారు. మామూలు ప్రపంచం మాటెట్లున్నా ప్రస్తుతం తెలుగునేల్లో ముఖ్యంగా సాహిత్యసీమలో ఈ తిట్లు అక్షర సత్యాలు.

చాలా బ్లాగుల్లో యితరుల రాతల్ని తిట్టిపోసుకొంటూ attacking is the best defense అన్నట్టు తమతమ రాతల్ని కాపాడుకొనే వో విచిత్ర వ్యవహారం ప్రబలిపోయింది. యే ఎడిటరూ అవసరంలేదని, మా బాగోగులు మాకే బాగా తెల్సుననే గదా బ్లాగు ప్రచురణల్ని జేసుకొనేది! పొగిడేస్తే పరమ ఆప్తులు. కొంచెం అటుయిటూ గాక గోడ మీది పిల్లి వ్యాఖ్యలు జేస్తే వాళ్ళు అతిథులు. చెడమడా తిట్టేస్తే సాహిత్య ద్రోహులు. యిల్లా వొహరి రాతల్ని మరొహరు "విమర్శించటం" యే లోకనీతో? ఆయా "విమర్శల్ని" ఖండిస్తూ పేజీల కొద్దీ తిట్లకు లంకించుకోడం యే సత్సాంప్రదాయమో? రాసిన రాతల్లోనే పసలేనప్పుడు వాటిపై వొచ్చే విమర్శలు తిట్లకి యెక్కువ - బూతులకి తక్కువనే జెప్పాలి.

సరే. యీ భేషజాలు పక్కనెట్టి మళ్ళీ కవిత్వం విషయాన్ని జూసినప్పుడు, మొన్న చెప్పుకొన్న కొన్ని సంగతులతోబాటు ఇంకొన్ని జేర్చాలని అనిపించింది.
మిగతా ఆవకాయ.కామ్ లో... 

పాఠకులకు ఓ గమనిక : ఈ వ్యాస రచయితను నేను కాదు. ఆవకాయ.కామ్ లో ప్రచురింపబడిన ఈ వ్యాసాన్ని అందరికీ అందుబాటులో తీసుకువద్దామని ఇక్కడ లింకు ఇవ్వటం జరిగింది.
Categories: Left

దుశ్శబ్దపు జాడీల్లో

Sun, 04/11/2010 - 04:30
జాడీలోని ఆవకాయ లాలాజలోత్పత్తికి తొలిమెట్టైతే దుశ్శబ్దపు జాడీల్లోని బూజు భావాలు తిరకాసు కవిత్వానికి ఆఖరి మెట్లుగా మారతాయని జాలం జగ్గేశ పండితుడు రాసిన "నవవర్ణశాల"లో వుంది. ఇదో తిర్యక్ సృష్టిపరిణామక్రమమని, కోతి మనిషిగా మారినట్టుగానే శబ్దం నిశ్శబ్దం కాబోయి దుశ్శబ్దమైందని కూడా జగ్గేశ పండితుడు చెప్పాడు.
మీకు అక్షరాలు వచ్చునా? వాటిల్తో వాక్యాలు రాయడమూ వచ్చునా? "రా! కూర్చో!" అని కాక "కూర్చోడానికి రా!" అని డొంకతిరుగుడుగా చెప్పడం వచ్చునా? అలా కాస్త ముందు కెళ్ళి "కూర్చోడానికి రా! నాలుకపై మైసూర్ పాకులా!" అని చెప్పగలరా"? అక్కడితో ఆగక "కూర్చోడానికి రా! నాలుకపై మైసూర్ పాకులా! నగ్నంగా, నైపుణ్యంగా, వంకరగా, వాలుగా, చేవ్రాలుగా" అని సుత్తికొట్టడం కూడా చేతనౌనా? ఇంకేం మీరు కూడా కవిత్వం రాసేయొచ్చు. గుర్రం కదం తొక్కాలంటే గుగ్గిళ్ళు జోరుగా దట్టించాలి. మీ కలం కదం తొక్కాలంటే బోలెడు పదాల్ని దట్టించాలి.


దళిత కవిత్వం ఉంది. స్త్రీవాద కవిత్వం ఉంది. అభ్యుదయ, విప్లవ కవిత్వాలు కలియుగారంభం నుండీ ఉన్నాయి. ఉన్నవి చాలుననుకొంటే అజీర్ణమని మన తెలుంగుల బాధ. మన ఆకలికి ఈ నాలుగైదు రకాల అరకాసు కవిత్వాలు చాలవుగా! అందుకనే కొత్తవి కనిపెట్టుకొన్నాం. నానీలు వచ్చాయి. కంశ్రీలు వచ్చాయి. నానోలూ వచ్చాయి. ఏకాక్షరాలూ ఊడిపడ్డాయి. వీటికి తోడు నంజుడు కోసమని కధన కవిత్వం, వ్యాస కవిత్వం వంటివి కూడా వచ్చాయి.
మిగతా ఆవకాయలో ...

పాఠకులకు ఓ గమనిక : ఈ వ్యాస రచయితను నేను కాదు. ఆవకాయ.కామ్ లో ప్రచురింపబడిన ఈ వ్యాసాన్ని అందరికీ అందుబాటులో తీసుకువద్దామని ఇక్కడ లింకు ఇవ్వటం జరిగింది.
Categories: Left

మహిళా సాధికారత - ఉమ్మడి పౌర చట్టం

Thu, 04/08/2010 - 10:18

శీర్షిక చదివితే, పరస్పర సంబంధం ఏమాత్రమూ లేని రెండు అంశాలుగా అనిపిస్తాయి మహిళా సాధికారత - ఉమ్మడి పౌరసత్వం అనే విషయాలు. ఈ నేపథ్యంలో, ఆయేషా సిద్దిఖీ కేసు ఓ సారి పరిశీలించినప్పుడు మహిళా సాధికారత అనేది, ఉమ్మడి పౌర చట్టంతో ఎలా సాధ్యమనేది కూడా మంచి చర్చకు దారితీస్తుంది.
-మరో వివాహానికి ముందుగా, తనకు విడాకులు ఇవ్వాలని ఆయేషా కోరింది.-అసలు పెళ్ళే కాలేదు పొమ్మన్నాడు షోయబ్ మలిక్.-జరిగిన పెళ్ళికి సాక్ష్యంగా, అతను సంతకం చేసిన వివాహ పత్రాలు బయట పెట్టింది ఆయేషా.-అది తన సంతకమే అని ఒప్పుకున్నా, ఫోనులో జరిగిన వివాహం చెల్లదని తేల్చి చెప్పాడు షోయబ్.-దీన్నిబట్టి, ఫోనులో చేసుకున్న పెళ్ళి చెల్లదని తెలిసే షోయబ్ పెళ్ళి చేసుకున్నట్లు అర్ధమౌతుంది.-అంటే, స్త్రీని ఓ విలాస వస్తువుగా మాత్రమే భావించే అతని మనస్తత్వం బట్టబయలయ్యింది.-తప్పనిసరి పరిస్థితుల్లో, పెళ్ళి పిమ్మట జరిగిన మరికొన్ని సంఘటనలకు సాక్ష్యంగా ఫోరెన్సిక్ విభాగానికి ఆధారాలు అందజేసింది ఆయేషా.-ఇక, రాజీపడక తప్పని పరిస్థితుల్లో విడాకుల మీద సంతకం చేసాడు షోయబ్.-నెలకు అయిదువేల చొప్పున, మూడు నెలలకు పదిహేనువేల భరణాన్ని కూడా ఇచ్చాడు.
చూడబోతే, ఆయేషా సంపన్న కుటుంబానికి చెందిన మహిళగా తెలుస్తోంది. అదే పరిస్థితుల్లో, ఓ సాధారణ ముస్లీం మహిళను, ఈ దేశ ముస్లీం పౌరుడుని ఊహించుకోండి. మూడు నెలల భరణం ఇచ్చేస్తే, ఆ మహిళకు జీవితాంతం వరకు సరిపోతుందా? ఇవన్నీ, ముస్లీం పర్సనల్ లా బోర్డుకు సంబంధించిన విషయాలని కొట్టిపారేయకూడదు.
ఆ మాటకొస్తే, హిందు వివాహ చట్టంలో కూడా మహిళల హక్కులను పరిరక్షించే పరిస్థితులు ఏమాత్రమూ లేవు. ఏవో కొన్ని కేసులు తప్పించి, అన్ని మతాలలోని మహిళలకు దాదాపు ఇదే దుస్థితి.
మనది లౌకిక ప్రజాస్వామ్య దేశం. అంటే, అన్ని మతాలను, మత భావనలను గౌరవించాలనే కాదు. మత ప్రమేయంలేని రాజ్యంగా తీర్చిదిద్దాలని. ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించే ప్రజాస్వామ్యంలో, అర్ధంపర్ధంలేని మతానికో చట్టం దేనికి?
ఆయేషాకు సంబంధించిన ఈ వ్యవహారంలో మరో కోణం కూడా ఉంది. వివాహానికి ప్రత్యామ్నాయంగా "కలసి" జీవించొచ్చని తీర్పులిచ్చే న్యాయస్థానాలు, "కలసి జీవించే వ్యవహారాల్లో" ఆయేషాలాంటి కేసులు ఎదుర్కొనే సాధారణ మహిళలకు ఏ రకమైన తోడ్పాటు అందించగలవో ఊహించటం కష్టతరమేమీ కాదు.
సమాజంలో మహిళలకు అవసరమైన సామాన్య భద్రత కల్పించలేని ప్రభుత్వాలు, చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషనులు అమలుపరచినా ఉపయోగం ఏముంది? ఉమ్మడి పౌరచట్టంపై సత్వరమే మంచి చర్చకు తెరదీయాల్సిన అవసరమే కాదు, ఒక ముసాయిదాను కూడా చేసి, అమలు పరచినప్పుడే, లౌకిక ప్రజాస్వామ్య దేశంగానే కాకుండా, మహిళలకు అవసరమైన చట్టపరమైన రక్షణ దొరుకుతుంది.
తొలి ప్రచురణ "ఆవకాయ"లో...
Categories: Left