కూడలి
జల్లెడ
హారం
మీ దగ్గర ఎనిమిది గోళీలున్నాయి. వాటిలో ఒక్క గోళీ తప్ప మిగిలనవన్నీ సమానమైన పరిమాణం, బరువు, ఆకృతి కలిగి ఉన్నాయి. ఆ ఒక్క గోళీ మాత్రం కేవలం బరువులో తేడా ఉంది. అంటే చూడటానికి అన్నీ ఒకటేగా కనిపిస్తున్నా అది మిగతా గోళీలతో పోలిస్తే తక్కువ బరువైనా ఉండచ్చు, ఎక్కువ బరువైనా ఉండచ్చు.
మీ దగ్గర ఓ సున్నితపు త్రాసు కూడా ఉంది.
సమస్య ఏమిటంటే…ఈ త్రాసు ఉపయోగించి కనిష్టంగా ఎన్ని సార్లు తూకం వేయడం* ద్వారా తేడాగా ఉన్న గోళీని కనుక్కోవచ్చు?
*ఇక్కడ ఒకసారి తూకం వేయడం అంటే ఒక పళ్ళెంలో కొన్ని గోళీలు, మరో పళ్ళెంలో కొన్ని గోళీలు వేసి సమానంగా ఉందా లేదా అని చూడటం.
—సమాధానం–
ముందుగా 8 గోళీలను 3,3,2 సంఖ్యల్లో మూడు భాగాలుగా విభజిద్దాం.
మొదటి తూకం:
చెరో మూడింటినీ ఒకే పళ్ళెంలో వేసి తూకం వేశాం. ఇందులో రెండు రకాల సాధ్యతలున్నాయి.
ఆరు గోళీల్లో లోపం లేదు.
లోపనున్న గోళీ మిగిలిన రెండు గోళీల్లో ఉన్నట్లు లెక్క.ఉదాహరణకు వాటిని A,B అనుకుందాం. A,B లలో ఒక్కదాన్ని తీసుకుని ఆరు గోళీల్లో (లోపం లేనివి)ఒకదానితో తూకం వేయాలి.
ఉదాహరణకు A ని తీసుకున్నామనుకుందాం.
ఈ తూకం సమానంగా తూగితే B లోపం ఉంది. లేకపోతే A లో లోపం ఉంది.
పక్కన పెట్టిన రెండు గోళీల్లో ఏ లోపం లేదు. ఈ ఆరింటిలో ఒక్కదాన్లో లోపమున్నట్లు లెక్క. వీటిని A,B,C,D,E,F అనుకుందాం.
A,B,C ఒక పళ్ళెంలో, D,E,F ఒక పళ్ళెంలో ఉన్నాయనుకుందాం.
A,B,C ఉన్న పళ్ళెం పైకి వెళ్ళిందనుకుందాం.
దానికి ఈ క్రింది కారణాలు ఉండచ్చు.
A,B,C లలో ఒకటి తక్కువ బరువుండవచ్చు.లేదా D,E,F లలో ఒకటి ఎక్కువ బరువుండొచ్చు.
ఇప్పుడు A,D ఒక పళ్ళెంలో, B,E మరో పళ్ళెంలో ఉంచి తూకం వేద్దాం.పైన పేర్కొన్న కారణాల ఆధారంగా
A తక్కువ బరువుంటే AD పైకి వెళుతుంది
B తక్కువ బరువుంటే AD క్రిందకు వెళుతుంది
C తక్కువ బరువుంటే సమతూకం అవుతుంది
D ఎక్కువ బరువుంటే AD క్రిందకు వెళుతుంది
E ఎక్కువ బరువుంటే AD పైకి వెళుతుంది
Fఎక్కువ బరువుంటే సమతూకం అవుతుంది
సాధ్యత 2.1: త్రాసు సమ తూకం అయిందంటే C తక్కువ బరువైనా కావచ్చు, F ఎక్కువ బరువైనా కావచ్చు. దీన్ని మరో తూకం వేయడం ద్వారా సులభంగా కనుక్కోవచ్చు(సాధ్యత 1 లో చేసిన విధంగా).
సాధ్యత 2.2: AD కిందకు వెళితే B తక్కువ బరువైనా కావచ్చు, D ఎక్కువ బరువైనా కావచ్చు. దీన్ని కూడా మరో తూకం వేయడం ద్వారా సులభంగా కనుక్కోవచ్చు.
సాధ్యత 2.3: AD పైకి వెళితే A తక్కువ బరువైనా కావచ్చు, E ఎక్కువ బరువైనా కావచ్చు. దీన్ని కూడా మరో తూకం వేయడం ద్వారా సులభంగా కనుక్కోవచ్చు.
కాబట్టి కనిష్టంగా మూడు సార్లు తూకం వేయడం ద్వారా లోపం ఉన్న గోళీని, అది తేలికైందా, బరువైందా అన్న విషయం కూడా తెలుసు కోవచ్చు.
దేనిమీదైనా బాగా ఆశ పెట్టుకున్నపుడు అది నెరవేరకపోతే చిన్నప్పుడు మా అమ్మమ్మ ఈ సామెతను విరివిగా వాడేది. గత రెండేళ్ళుగా నేను ఎదురుచూస్తున్న కోరిక ఫలించకపోవడంతో ఇప్పుడు ఈ సామెత గుర్తుకు వచ్చింది.
ఈ సామెత నేపథ్యం ఏమిటంటే, కుక్క ఒకసారి ఆకలితో అన్నం తింటున్నపుడు ఆశగా ఎదురు చూస్తూ తోకాడిస్తూ వచ్చిందంట. ”యేహే తినేటప్పుడు నీ గోలేంటే” అని పక్కనే ఉన్న గుండ్రాయెత్తి దానిమీదకి విసిరేశారంట. అదీ సామెత.
“పెరుగుదల” కోసం కళ్ళు కాయలు కాసి కాసి, పండిపోయి, కుళ్ళిపోయి విత్తనాలు నేలరాలిపోయాయి. ఆ విత్తనాలు అదే నేలలో నాటాలా? లేక వేరే భూమిలో నాటాలా అని తెగ సతమతమైపోతున్నా. సరిగ్గా ఇదే సమయంలో పక్కవాడి పొలంలో పైరు బాగా పండితే మనిషిలోని సహజ ఈర్ష్య స్వభావం వెర్రి తలలు వేస్తుంది. అదిగో అప్పుడే కావాలి సంయమనం. ఆ ఈర్ష్యను ఉక్కుపాదంతో అణిచేయాలి, లేకపోతే అణిగేదాకా ఆగాలి. ఒక పంట వేసిన వెంటనే రెండో పంట వేసేస్తే భూమిలో సారం ఉండదు కదా. అందుకనే ప్రస్తుతానికి నేలను సిద్ధం చేసే పనిలో పడ్డా…
ఏవీయస్ గారి బ్లాగులో పైరసీపై మంచి పాయింట్లు లేవనెత్తారు. అక్కడ చర్చను చూసిన తర్వాత నా అభిప్రాయాలు కూడా రాయాలనిపించింది. ఇదే వ్యాఖ్య అక్కడ కూడా పోస్ట్ చేశాను.
పైరసీని కళాకారులు,కళను అభిమానించే వారు ఎవరైనా ప్రోత్సహించడం మంచిది కాదు.కళనే నమ్ముకుని బతుకున్నవారికి అది ఆత్మహత్యా సదృశం కూడా. ఇక్కడ ఏవీయస్ గారు అదే విజ్ఞప్తి చేశారు. మంచిది.
కాకపోతే ఆ టపాలో గోడల మీద వాల్ పోస్టర్లు అంటిస్తున్న వాళ్ళ గురించి, సైకిల్ స్టాండ్లను నమ్ముకుని బతికే వాళ్ళ గురించి, పల్లీలు-సోడాలు అమ్ముకునే వాళ్ళ గురించి ప్రస్తావించారు. వాళ్ళను గురించి నాకు తోచిన విషయాలు కొన్ని…
ఒక వేళ అందరూ పైరసీ సీడీలు చూడ్డం మానేసి, థియేటర్లకు వెళ్ళే సినిమాలు చూస్తున్నారనీ తద్వారా సినీపరిశ్రమ మంచి లాభదాయకంగా నడుస్తున్నదనీ అనుకుందాం. అప్పుడు పైన చెప్పిన వాళ్ళకి ఒరిగేదేమైనా ఉందా?
వాల్ పోస్టర్లు అంటించే వారికి జీతం పెంచుతారా?
సినిమాను నమ్ముకున్న అనేక మంది కళాకారులకు నిర్మాతల, హీరోల లాభంలో వాటా పంచుతారా?
వాళ్ళ సమస్యలు వాళ్ళవే. వాళ్ళ బతుకులు వాళ్ళవే. పేద బతుకులు పేదవే.
సూటిగా చెప్పాలంటే ముందుగా కథానాయకులకు, నటులకు, దర్శకులకు చెల్లించే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తగ్గించి ఆ మిగులు సినిమాకు పనిచేసే ప్రతి చిన్న పనివాడికి ఇస్తే వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపిన వారవుతారు. పైరసీ కన్నా ముందుగా పరిష్కరించాల్సినదీ ఈ సమస్యను. దానికన్నా సులభంగా పరిష్కరింపబడేది కూడా ఇదే అని నా అభిప్రాయం.
తులసి
తథాగత్ అవతార్ తులసి… చాలా కాలం క్రితం మాధ్యమాల్లో ప్రముఖంగా వినిపించిన పేరు. పన్నెండేళ్ళకే ఎమ్మెస్సీ పూర్తి చేసి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాడు. 2003 లో టైమ్ మ్యాగజీన్ అతనికి ఆసియాలోని గిఫ్టెడ్ యంగ్‌స్టర్స్ లో ఒకడిగా స్థానం కల్పించింది. సైన్స్ మేగజీన్ సూపర్‌టీన్ గా కీర్తించింది. ఇంకా ది టైమ్స్, దేశీవాళీ పత్రికలైన ఔట్‌లుక్, ది వీక్ మొదలైన అన్ని ప్రముఖ పత్రికలూ ఇతన్ని గురించి ప్రస్తావించాయి.
ఇప్పుడు అతని వయసు 22 ఏళ్ళు. కొద్ది రోజుల్లో ఐఐటీ ముంబై, భౌతిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరబోతున్నాడు. బీహార్ రాజధాని పాట్నాలో జన్మించిన ఈ బాలమేధావి తొమ్మిదేళ్ళకే ఉన్నత పాఠశాల చదువునూ, పదేళ్ళకే బీయస్సీ డిగ్రీని, పన్నెండేళ్ళకే ఎమ్మెస్సీని పూర్తి చేసేశాడు.
తరువాత 21 ఏళ్ళకు బెంగుళూరు లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ లో పీహెచ్‌డీ పట్టా సంపాదించాడు. పీహెచ్‌డీ పూర్తయిన తరువాత ఐఐటీ ముంబై తో పాటు కెనడాలోని ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయమైన వాటర్లూ విశ్వవిద్యాలయం, భోపాల్ లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో అవకాశం లభించినా అతను ఐఐటీ ముంబై నే ఎంచుకున్నాడు.
భవిష్యత్తులో డాక్టర్ తులసి మరిన్ని పరిశోధనలు చేసి భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేద్దాం.
రిసార్ట్స్
ఈ వారాంతం మా టీమ్ తో కలిసి బాపట్ల సమీపంలో ఉన్న సూర్యలంక బీచ్ కు వెళ్ళాం. అక్కడ ఆంధ్రప్రదేశ్ టూరిజం వారి హరిత రిసార్ట్స్ లో రూమ్ బుక్ చేసుకున్నాం. శని ఆదివారాలు కాబట్టి జనం బాగానే ఉన్నారు.
బీచ్ చాలా విశాలంగా ఉండి జలకాలాడ్డానికి అనుకూలంగా ఉంది. 250 మీటర్ల లోతు దాకా వెళ్ళినా అలలు నడుం లోతు దాకా కూడా రాలేదు. అసలు బయటకు రావాలని అనిపించలేదు. అలలపై తేలియాడినట్లుంది అనే కవితాత్మక భావనని ప్రత్యక్షంగా అనుభవించాను నేనైతే…
కాకపోతే ఇటీవల సంభవించిన లైలా తుఫానుకు కొంచెం కళ తప్పినట్లు కనిపించింది. ఎటొచ్చీ ప్రభుత్వ సంస్థ అనే పేరు నిలబెట్టుకోవాలి కాబట్టి అక్కడి ఉద్యోగులు నిర్వహణ లో తమ అలసత్వ ప్రదర్శనతో మమ్మల్ని అలరించారు. ఏసీ గదులు బుక్ చేసుకున్నా వాటిలో శుభ్రత లేదు. ఆ ఏసీలు సరిగా పనిచేయలేదు. ఇక మామూలు గదులు ఎలా ఉంటాయో?
మొత్తమ్మీద రెండు రోజులు మరో బోరింగ్ వీకెండ్ కాకుండా సరదాగా గడిచిపోయింది…
నిన్న సౌమ్య గారు గూగుల్ బజ్ లో పంపించిన ఆశాజనమైన నూతన సంస్థల జాబితాను చదువుతున్నాను. సాధారణంగా ఇవి ఏ ఐఐటీ/ఐఐఎం గ్రాడ్యుయేట్ల ద్వారానో స్థాపించబడి ఉంటాయి. వీళ్ళకు ఎప్పుడూ నగర జీవులు లేదా పట్టణాల మీదనే గురి, గ్రామీణ ప్రాంతాల గురించి పట్టించుకోరనే అభిప్రాయం ఉండేది నాకు. కానీ ఈ జాబితాలో ఉన్న ROPE (రూరల్ ఆపర్చ్యునిటీస్ ప్రొడక్షన్ ఎంటర్‌ప్రైజ్) అనే సంస్థ గురించి చదివినపుడు మాత్రం చాలా ఆనందమేసింది.
తమిళనాడులో ప్రారంభమైన ఈ సంస్థ గ్రామీణ ముడిసరుకుల నుంచి,గ్రామీణ ప్రజల చేతివృత్తుల నైపుణ్యాలను ఉపయోగించి ఉత్పత్తులను తయారు చేస్తారు. అంటే హస్తకళా నైపుణ్యంతో తయారు చేసే గృహాలంకరణ వస్తువులు, తివాసీలు, సంచీలు, చేనేత వస్త్రాలు మొదలైన వస్తువులు ఉత్పత్తి చేస్తారట. ఇలా తయారైన ఉత్పత్తులు వాల్‌మార్ట్ లాంటి అంతర్జాతీయ స్టోర్ లకు కూడా సరఫరా చేస్తున్నారట.
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ప్రియులంతా సహజమైన ఉత్పత్తులు కోరుతుండటంతో ఈ వస్తువులకు డిమాండ్ బాగానే ఉంటుందట. 2007 లో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటి వరకు 500 మంది గ్రామీణ కళాకారులకి ఉపాధి కల్పించిందట. ఇంకా రాబోయే ఐదేళ్లలో 2000 మందికి ఉపాధి కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది.
ఇంకా అమెరికా నుంచి తిరిగొచ్చి బీహార్ లోని ఓ మారుమూల ప్రాంతంలో వరి పొట్టు నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేసే ఓ కంపెనీ స్థాపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెలుగు నింపిన గ్యానేష్ పాండే, రిక్షా వాళ్ళ జీవితాలను బాగు పరచడానికి వారి రిక్షాల మీద ప్రకటనల ద్వారా ఆదాయాన్ని చేకూర్చిపెట్టే ఇంకో బిజినెస్ గ్రాడ్యుయేట్ ఇలాంటి వారిని చూస్తే చాలా సంతోషంగా ఉంది.
భారతదేశం సర్వతోముఖాభివృద్ధికి ఇలాంటి కంపెనీలు కావాలి.
అతను ఓ అనాథ. ఓ బడి పక్కన అడుక్కుంటూ ఉంటాడు. ఊరూ తెలీదు, పేరూ తెలీదు. ఒంటి మీద మాసిపోయి, చిరిగిపోయిన బట్టలు, కలుపు మొక్కల్లా ఎదిగిపోయిన జుట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే చూస్తునే అడుగు దూరం నుంచే తప్పుకుని వెళ్లే రూపం.
అలాంటప్పుడే ఓ పాప అతన్ని చూసి జాలిపడింది. అతన్ని తమ ఇంటికి తీసుకెళ్ళేదాకా ఒప్పుకోలేదు. ప్రాణంగా ప్రేమించే కూతురు అడిగిన కోరిక కాదనలేకపోయాడా తండ్రి. అలాగే అతన్ని ఇంటికి తీసుకెళ్ళి తమ ఇంట్లో పెట్టుకున్నారు.
కృతజ్ఞతతో నిండిపోయిన అతని మనసు పాడుకున్న పాటే ఇది. ఆకాశమంత సినిమా లోది. వేటూరి పద విన్యాసాలకో మచ్చుతునక. విద్యాసాగర్ మస్తిష్కంలో పురుడు పోసుకున్న భావగీతిక.
ఒకానొక ఊరిలో.. ఒకే ఒక అయ్య…
ఒకే ఒక అయ్యకు తోడు ఒకే ఒక అమ్మ…
ఒకే ఒక అమ్మ బిడ్డ ఒకే ఒక అమ్ము…
అది చూపుతోనే మాటలాడే కరుణ ఉన్న కన్ను..
చ: బంధాలే లేక కొందరు పిచ్చి వాళ్ళు అవుతారు. బంధాలే ఉండి అయ్య పిచ్చి ఎక్కిపోతాడు…
కాలేస్తే కందునని దోసిట్లో పెంచారు
ఎండకన్ను సోకకుండా గుండెల్లో దాచారు
పసిపాపే పసిపాపే ఉసురూ.. ప్రాణానికే ప్రాణాలనే ఇస్తారూ ఎదురూ…
చ: పురుగునే చూస్తే కొందరు పరుగు అందుకుంటారు
భూకంపమే వస్తున్నా అక్క పూమాలనే అల్లునుగా
పుట్టినది ఒక బిడ్డ… పుణ్యానికి ఒక బిడ్డ
ఇరుపాపల అల్లరికి మా అక్కే జోలాలిగా
ఈ అక్క మా ఇంటికి మిన్నా
మాయక్క మనసు ముందు హిమాలయం చిన్నా…
చ: పుడుతూనే తల్లులు కొందరు పుణ్యం కొని తెస్తారు..
మా పుణ్యం కొద్దీ మాకే వరాలనే ఇస్తారు..
వరమై మా యమ్మ మా కోసం రావమ్మా
చీమ జోలికెళ్ళదురా సింగంరా ఈ యమ్మ
మరలా ఓ జన్మంటే అడిగేస్తా ఓ వరమే
ఈ మాలక్ష్మికో ఆ మాతల్లికో పసిపాపనవుతా…
ఇండి పాప్ సంగీతంలో నిష్ణాతుడైన కైలాష్ ఖేర్ గొంతులో భావాలు బాగానే పలికినా అక్కడక్కడా వినిపించే ఉచ్ఛారణా దోషాలు తీయటి పాయసంలో మెంతిగింజల్లా తగులుతాయి. కానీ వింటుంటే తప్పక స్పందింపజేసే పాట.
శ్రీ రామకృష్ణులు
ఒక అడవిలో ఒక సాధువు ఉన్నాడు. ఆయన ఆశ్రమంలో చాలామంది శిష్యులుండేవారు. ఒక రోజు ఆయన వారికి ,
“భగవంతుడు అన్ని జీవరాశులలో ఉన్నాడు. అందువల్ల ఆ జీవరాశులలో ఉన్న భగవంతుడికి నమస్కరించాలి” అని బోధించాడు.
ఒక రోజు అగ్నిహోత్రానికి సమిధలు సేకరించడానికి ఓ శిష్యుడు అడవికి వెళ్ళాడు. అకస్మాత్తుగా అతడికి,
“అడ్డం తొలుగు! ప్రక్కకు తప్పుకో! మదపుటేనుగు వస్తున్నది!” అనే కేక వినపడింది. ఆ కేక విని అందరూ పారిపోతున్నారు. కానీ ఆ శిష్యుడు మాత్రం “ఈ ఏనుగు కూడా భగవంతుడి యొక్క వేరొక రూపమే కదా! నేను ఇక్కడి నుండి ఎందుకు పారిపోవాలి?” అనుకున్నాడు.
అక్కడే నిలబడి తలవంచి ఏనుగుకు నమస్కరిస్తూ కీర్తించడం మొదలుపెట్టాడు.
మావటి వాడు “పారిపో! పారిపో!” అంటూ గట్టిగా అరుస్తున్నాడు. అయినా ఆ శిష్యుడు ఇసుమంతైనా చలించలేదు.
ఆ ఏనుగు సరాసరి ఆ శిష్యుడి దగ్గరకు వచ్చి తొండంతో చుట్టి ఓ పక్కకు విసిరేసింది. అతనికి దెబ్బలు తగిలి స్పృహ తప్పి పడిపోయాడు. గురువు గారికి ఈ సంగతి తెలిసి కొందరు శిష్యులను అక్కడికి వెంటబెట్టుకుని వచ్చి ఆశ్రమానికి చేరవేశారు. చికిత్స చేసిన కొంతసేపటికి ఆ శిష్యుడికి తెలివి వచ్చింది.
శిష్యుల్లో ఒకరు “ఏమయ్యా! ఏనుగు వస్తుందని తెలిసినా ఎందుకు పక్కకు తొలగలేదు?” అని ప్రశ్నించాడు. దానికి అతడు, “మన గురువు గారే చెప్పారు కదా అన్ని జీవుల్లో భగవంతుడున్నాడని చెప్పింది. అందుకే ఏనుగు రూపంలో దేవుడే కదా వస్తున్నాడని భావించి పక్కకు తప్పుకోలేదు” అన్నాడు.
వెంటనే గురువు గారు అందుకుని “నిజమే నాయనా, ఏనుగు-దేవుడు రావడం యథార్థమే. కానీ మావటి-దేవుడు పారిపొమ్మన్నాడు కదా! అన్ని జీవులు దేవుని రూపాలే అయినప్పుడు ఆ మావటి వాని మాటలు ఎందుకు పెడచెవిన పెట్టావు?” అన్నాడు.
యువకుడైన వివేకానందునికి “ప్రాపంచికులతో ఎలా మెలగాలి?” అనే విషయాన్ని వివరిస్తూ రామకృష్ణుల వారు ఈ కథను చెప్పారు. దీని వెనుక ఉన్న అర్థం మనం సన్మార్గులతో ఎక్కువగా సాంగత్యం చేసి, వారి మాటలకు ఎక్కువగా విలువనివ్వాలనే.
రామకృష్ణ పరమహంస కథామృతం లో నాకు బాగా నచ్చిన కథ ఇది. ఎందుకంటే జీవితంలో ఏదైనా క్లిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినపుడు ఈ విధంగా ఆలోచిస్తే సరైన పరిష్కారం లభిస్తుందని నా భావన.
ఈ ఆదివారం ఓ రెండు ప్యాంట్లు కొనుక్కుందామని బంజారాహిల్స్ లో ఉన్న బ్రాండ్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. అలా చూస్తుండగా ఇండిగో నేషన్ వారిది “రెండు కొంటే రెండు ఉచితం” అనే ఆఫర్ కంటపడింది. ఎలా ఉన్నాయో చూద్దామని దగ్గరికెళితే బానే ఉన్నాయి. సరే అని అక్కడే ఉన్న సేల్స్ బాయ్ సహకారంతో ఓ నాలుగు ప్యాంట్లు ఎంచుకుని డబ్బులు కట్టడం కోసం వరుసలో నిల్చున్నాను.
కాసేపటి తర్వాత నాకు ప్యాంట్లు ఎంపిక చేసిచ్చిన అబ్బాయి మెల్లగా నా దగ్గరికి వచ్చి,
“సార్ ఒక్క అయిదు నిమిషాలు ఆగండి. అప్పుడు ఓ గంట పాటు రెండు కొంటే మూడు ఉచితం ఆఫర్ ఉంది” అని సమాచారం నా చెవిలో వేశాడు.
అలా ఐదో ప్యాంటు తీసుకోవడానికి వెళ్లానో లేదో అప్పుడే ప్రకటన వినిపిస్తోంది
“రండి బాబూ రండి ఇండిగో నేషన్. రెండు కొంటే మూడు ఉచితం. ఆఫర్ ఒక గంట సేపు మాత్రమే” అని (వాడు ఇంగ్లీషులోనే చెప్పాడు. దానికి ఇది నా సొంత కవిత్వమన్న మాట )
నాకు భలే కుశాలనిపించింది. సేల్స్ బాయ్స్ లో ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని. పాపం ఆ అబ్బాయికి సరిగా జీతం ఇవ్వడం లేదో ఏమో ఇలా కసి దీర్చుకుంటున్నాడు.
సినిమా పోస్టరు
ఇటీవల కాలంలో నేను చూసిన సినిమాల్లో బాగా నచ్చిన వాటిలో ఇది ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూదులపై నాజీ ఆకృత్యాలను చూపించే ఎన్నో సినిమాలు వచ్చాయి. నేను ఇలాంటి సినిమాలు టీవీలో వచ్చినప్పుడల్లా వాటిల్లోని హింస భరించలేక వెంటనే చానెల్ మార్చేసేవాణ్ణి. కానీ ఈ సినిమా కొద్దిగా చూడగానే కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ఒక్కసారి చూడటం ప్రారంభించిన తర్వాత సినిమా ఆద్యంతం చూపు మరల్చనివ్వలేదు. అంత బాగా తీశారీ సినిమాని. సంభాషణలు కూడా చాలా సరళంగా ఉండటంతో కథంతా సులభంగా అర్థం అయింది. సినిమా అంతా బ్రూనో అనే ఎనిమిదేళ్ళ పిల్లవాడి చుట్టూ తిరుగుతుంటుంది.
బ్రూనో తండ్రి రాల్ఫ్ నాజీ సైన్యంలో పని చేస్తూ ఉంటాడు. బెర్లిన్ లో ఉండగా అతనికి కమాండెంట్ గా పదోన్నతి లభించడంతో ఓ మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఉండే నాజీ కాన్సెంట్రేషన్ క్యాంప్ కు మారాల్సి వస్తుంది. ఉన్నట్టుండి మిత్రులందర్నీ వదిలేసి వచ్చేయడంతో బ్రూనోకు కొత్త ప్రదేశంలో ఏమీ తోచదు. ఒంటరిగా ఇంటి చుట్టూ ఉన్న సెలయేళ్ళు, కొత్త ప్రాంతాలు అన్వేషిస్తూ కాలం గడుపుతుంటాడు. అలా చూస్తూ ఉండగా వారి ఇంటి వెనుక ఉన్న పెరట్లో చాలా దూరంగా ఉన్న కంచె ఒకటి కనిపిస్తుంది. అక్కడ సైనికులెవరూ కాపలా ఉండరు. అక్కడ అతనికి దాదాపు తన వయసులో ఉన్న ష్మూయెల్ అనే అబ్బాయి పరిచయమౌతాడు.
అప్పట్నుంచీ బ్రూనో తరచు అక్కడికి వచ్చి కంచె ఇవతల్నుంచే అతన్ని కలుసుకుంటూ ఉంటాడు. వచ్చేటపుడు ష్మూయెల్ కోసం ఇంటి నుంచి తినుబండారాలు తీసుకొని వస్తుంటాడు. అతనితో కలిసి ఆటలాడుతూ ఉంటాడు. మొదట్లో ఆ కంచె కావల ఉన్న స్థలం వ్యవసాయ క్షేత్రమేమోనని భావిస్తాడు బ్రూనో. కానీ ష్మూయెల్ వాళ్ళు యూదులు కాబట్టి తననూ, తన కుటుంబాన్ని అక్కడ బంధించారనీ, తమ చేత బలవంతంగా ఆ చారల పైజమా దుస్తులను ధరింపజేశారనీ తెలియజేస్తాడు. ఇంతకు ముందు దాకా ఇలాంటి నాజీల గురించి ఏమీ తెలియని బ్రూనో ఆశ్చర్యపోతాడు.
బ్రూనో, అతని అక్క గ్రెటెల్ కు చదువు చెప్పడం కోసం హెర్ లిస్ట్ అనే ఉపాధ్యాయుణ్ణి నియమిస్తారు. అతను చరిత్ర పేరుతో నాజీ జాతీయ వాదాన్ని నూరి పోస్తుంటాడు. అతను యూదుల గురించి చెప్పే నిజాలకూ బయట కనిపించే పరిస్థితులకు పొంతన కుదరక పోవడంతో అది బ్రూనోకు నచ్చదు. వాళ్ళ స్వంత ఇంట్లోనే యూదు సేవకుడిపై జరిగే దౌర్జన్యాలను కళ్లారా చూస్తాడు. ఆ సేవకుడు చనిపోవడంతో ష్మూయెల్ ను వాళ్ళ ఇంటిలో పనికి నియమిస్తారు. ఆకలితో మాడిపోతూ అక్కడ గ్లాసులు కడుగుతున్న అతణ్ణి చూసి బ్రూనో కరిగిపోయి బ్రెడ్ ముక్కలు ఇస్తాడు. సరిగ్గా అదే సమయానికి తండ్రి కింద పనిచేసే క్రూరుడైన సైనికుడు కోట్లర్ దాన్ని చూసి ఆగ్రహించి అతణ్ణి బ్రెడ్ దొంగిలిస్తున్నావా? అని అడుగుతాడు. దానికి ష్మూయెల్ బ్రూనో తనకు స్నేహితుడనీ ఆ కేక్ అతనే ఇచ్చాడని నిజం చెబుతాడు. అది నిజమా? కాదా? అని కోట్లర్ బ్రూనోను ప్రశ్నిస్తాడు. బ్రూనో అతనికి భయపడి అతనెవరో తనకు తెలియదని అబద్ధ మాడతాడు.
తర్వాత బ్రూనోకు కొద్ది రోజుల పాటు ష్మూయెల్ క్రమం తప్పకుండా కలుసుకునే కంచె దగ్గర కనిపించడు. కొద్ది రోజులకు ష్మూయెల్ ముఖమ్మీద బలమైన దెబ్బలతో కంచె పక్కనే తలవంచుకుని కూర్చుని కనిపిస్తాడు. అతణ్ణి చూడగానే బ్రూనోకు ప్రాణం లేచి వస్తుంది. తాను తప్పు చేశాననీ, ఆ రోజు అతనికి భయపడి అబద్ధం చెప్పాననీ తనను క్షమించమని ష్మూయెల్ ను కోరతాడు. అందుకు అతను కూడా తిరిగి స్నేహ హస్తం అందిస్తాడు.
ఒక రోజు కోట్లర్ ఇంట్లో అప్పుడప్పుడూ వచ్చే దుర్వాసనను గురించి ఏదో మాట్లాతుండగా బ్రూనో తల్లి ఎల్సాకు అసలు నిజం తెలుస్తుంది. తన భర్త నేతృత్వం వహిస్తున్నది లేబర్ క్యాంప్ కు కాదనీ, యూదులను క్రమంగా నాశనం చేయడానికి చేసే నరమేధానికనీ! అప్పట్నుంచీ భార్యా భర్తల మధ్య దాన్ని గురించే గొడవలు చెలరేగుతుంటాయి. కొన్ని రోజులకు ఇద్దరూ కలిసి తమ ఇద్దరు పిల్లలను అక్కడ ఉంచడం మంచిది కాదనీ, హేడెల్ బర్గ్ లో ఉంటున్న వాళ్ళ అత్తయ్య ఇంటికి తరలించాలని భావిస్తారు.
కానీ వాళ్ళు బయలు దేరడానికి ఒక రోజు ముందుగా ష్మూయెల్ తన తండ్రి కనబడ్డం లేదని బ్రూనోకు తెలియజేస్తాడు. తాను అక్కడ సాహసం చేయడానికి అదే ఆఖరి అవకాశంగా భావించిన బ్రూనో తర్వాతి ఉదయమే కంచె కింద ఒక గొయ్యి తవ్వి అవతలి వైపుకు చేరుకుంటాడు. అక్కడే ష్మూయెల్ తెచ్చిన ఖైదీ బట్టలను వేసుకుని అక్కడి నుంచి ఖైదీల క్యాంపు వేపు బయల్దేరతారు.
ఆ క్యాంపును చేరుకోగానే అక్కడ జరిగే ఘోరాలను, అమానుష కాండనీ కళ్లారా తిలకిస్తాడు బ్రూనో. కొన్నాళ్ళ క్రితం తన తండ్రి, పై అధికారులకు చూపించిన ఓ వీడియోలో ఈ ఖైదీలు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నట్లుగా చూపించింది నిజం కాదని తెలుస్తుంది. ఇద్దరూ కలిసి ష్మూయెల్ తండ్రి కోసం వెతకడం ప్రారంభిస్తారు. ఆ వెతుకులాటలో ఇరువురూ గ్యాస్ చాంబర్ వైపు వెళుతున్న ఖైదీల మధ్యలో ఇరుక్కుపోతారు. మరో పక్క అతని తల్లి, అక్క అతని కోసం వెతుకుతూ వస్తుంటారు. ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె భర్తకు తెలియజేస్తుంది. అతను సైనికుల సహాయంతో వెతుకుతూ ఉంటాడు.
ఖైదీల మధ్యలో చిక్కుపడి గ్యాస్ చాంబర్స్ కు చేరుకున్న బ్రూనో, ష్మూయెల్ కు షవర్ కోసం బట్టలు తీయవలసిందిగా ఆదేశాలు అందుతాయి. అందరూ షవర్ కోసమే అని అనుకుంటారు. కానీ నాజీ సైనికులు ఆ చాంబర్ ను మూసి వేసి విష వాయువును ఉత్పత్తి చేసేందుకు పౌడర్ ను పోసి ద్వారం మూసేస్తారు. రాల్ఫ్ పరిగెత్తుతూ అక్కడికి వచ్చేసరికే జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది.
అవి నేను ఎన్ ఐ టీ వరంగల్ లో ఉన్నత చదువు (ఎంటెక్) వెలగబెడతున్న రోజులు…
ఓ రోజు మధ్యాహ్నం కాళ్ళు మెస్సు వైపు కదలనని మొరాయిస్తున్నా ఆకలి వాటిని భారంగా ఈడ్చుకెళుతోంది. అక్కడ శాకాహారులకు ఐదో నంబర్ మెస్సు ప్రత్యేకం. “అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఒక్క మెతుకు వదిలి పెట్టినా పాపమే” అని చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ చెప్పిన మాటలు నా మెదడులో సుడులు తిరుగుతున్నా తప్పని సరి పరిస్థితుల్లో ఎన్నో సార్లు తిండి వదిలేశాను ఆ మెస్సులో…
ఆ రోజు మెస్సులో జిలేబీ స్పెషల్. అన్నం తినడం పూర్తి చేసిన తర్వాత చవిచెడిపోయిన నోరు తీపి చేసుకుందామని జిలేబీ చివరి దాకా అట్టే ఉంచాను. నెమ్మదిగా మెస్ బయటకు వచ్చి విశ్రాంతి కోసం అక్కడే వేసి ఉన్న ఓ బెంచీ మీద కూర్చుని ప్రశాంతంగా జిలేబీ తినడానికి ఉపక్రమించాను.
రెండు ముక్కలు నోట్లోకి వెళ్ళాయో లేదో ఎక్కడ నుంచి వచ్చిందో ఓ కుక్క నా పక్కనే కూర్చుని ఆశగా జిలేబీ వంకే చూస్తోంది. దాని మీద కొంచెం జాలిపడి మిగతా భాగం దాని ముందు పడేశాను.
అది నెమ్మదిగా దాని దగ్గరకు వచ్చి వాసన చూసి “దీన్ని కుక్కలు కూడా తినవు” అన్న సామెతను నిజం చేస్తూ వెనక్కి చూడకుండా తిరిగి వెళ్ళిపోయింది. నాకైతే అక్కడ మొదలైన నవ్వు తిరిగి ల్యాబ్ కు వెళ్ళేదాకా ఆగనే లేదు…
నైవేలి విహంగ వీక్షణం
గత శనివారం ఓ వ్యక్తిగత పని మీద తమిళనాడులోని నైవేలి వెళ్ళాల్సి వచ్చింది. చెన్నై నుంచి దక్షిణంగా సుమారు 200 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడ లిగ్నైట్ విస్తారంగా దొరుకుతుంది. లిగ్నైట్ అంటే పూర్తి స్థాయి బొగ్గుగా మారకుముందు రూపమన్న మాట. ఇందులో బొగ్గు కన్నా తేమ స్థాయి ఎక్కువగా ఉంటుంది. తమిళనాడులో ఉత్పత్తి అయ్యే థర్మల్ విద్యుత్ లో సగభాగం (సుమారు 2500 మెగావాట్లు) ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుందట.
1935 లో జంబులింగ మొదలియార్ అనే ఆసామి తన పొలంలో బోర్ వేస్తుండగా నల్లటి రాళ్ళు బయట పడ్డాయి. దాన్ని పరీక్ష కోసం పంపించగా ఆ ప్రాంతం యొక్క భూగర్భంలో విస్తారమైన లిగ్నైట్ నిల్వలు ఉన్నట్లు తెలియవచ్చింది. 1956 లో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అనే పేరుతో భారత ప్రభుత్వం ఓ సంస్థను ఏర్పాటు చేసి అక్కడ పనులు ప్రారంభించింది. 1962 నుంచి అక్కడ మైనింగ్ ప్రారంభమైంది.
నటరాజ స్వామి
ఇక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం ప్రభుత్వం సకల సౌకర్యాలతో చక్కటి టౌన్ షిప్ నిర్మించి ఇచ్చింది. సుమారు 55 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తారమైన వృక్షసంపదతో ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి ఉంటుంది. ఉష్ణోగ్రత కూడా తమిళనాడు మిగతా ప్రాంతాలతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. బొగ్గును వెలికితేసే కార్యక్రమంలో భాగంగా కుప్పలుగా పోసిన ఫ్లై యాష్, మట్టి పెద్ద పర్వతాల్లాగా కనిపిస్తాయి. అవి పర్యావరణానికి అంతగా మంచిది కాదనడంతో ఇటీవలే వాటి మీద చెట్లను పెంచడం ప్రారంభిస్తున్నారు.
ఆవరణలో నాలుగు దేవాలయాలు, రెండు చర్చిలు, మసీదు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో అతిపెద్దదైన, పన్నెండు అడుగుల ఎత్తైన పంచలోహ నటరాజ స్వామి విగ్రహం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇంకా నేను చూడాలనుకున్న చిదంబరం, తంజావూరు కూడా ఇక్కడకు దగ్గరే. ఇంకెప్పుడైనా వెళ్ళినపుడు చూడాలి.
స్వామీ వివేకానంద
స్వామి వివేకానంద ఎంత గొప్ప వక్త అయినా అప్పుడప్పుడూ ఆయన ఉపన్యాసం మధ్యలో ఆయన్ను ఎగతాళి చేసేవాళ్ళూ ఉండే వాళ్ళు. అలాంటి వాళ్ళకు ఆయన సరైన రీతిలో జవాబిచ్చేవాడు. అలాంటి సంఘటనలు కొన్ని…
గోల్కొండ కోటను ఎవరైనా సందర్శించాలని ఉంటే అక్కడ తప్పక చూడవలసింది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు నిర్వహించే సౌండ్ అండ్ లైట్ షో. అందులో గోల్కొండ చరిత్రను ఒక నాటక రూపకంలో వివరిస్తారు. కథను అమితాబ్ బచ్చన్ తన ధీరగంభీరమైన స్వరంతో వినిపిస్తాడు. మధ్యలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు పాత్రలు, సంభాషణల రూపంలో ఉంటాయి. ఒక్కో సన్నివేశానికి సంభందించిన సంభాషణలు కోటలో ఎక్కడ జరుగుతాయో అక్కడ లైట్లు వెలుగుతాయి. సంభాషణలు అక్కడి నుంచే వినిపిస్తున్నట్లుండి ఆ సన్నివేశం మన కళ్ళెదురుగా జరుగుతున్నట్లుగా ఉంటుంది.
ముఖ్యంగా రామదాసు ఘట్టం వచ్చినపుడు ఆయన్ను దాచి ఉంచినట్లుగా భావిస్తున్న చెరసాల నుంచి భావగర్భిత మైన బాలమురళీకృష్ణ గాత్రంలో “ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైనా పలుకవే రామచంద్రా…” అనే పాట వినగానే నిజంగానే అక్కడ రామదాసు ఉన్నట్లు, పాట పాడినట్లు అనిపించి ఒళ్ళంతా ఒక్కసారిగా జలదరించినట్లయింది నాకు. ఇంకా కులీ కుతుబ్ షా, భాగ్ మతీ దేవి ల మధ్య జరిగే ప్రేమ ఘట్టాలు, ఔరంగజేబు దండయాత్ర సమయంలో కోటను రక్షించడానికి రాజ కుటుంబం పడే తాపత్రయం చాలా అద్భుతంగా అనిపిస్తాయి. ఈ నాటకాన్ని వింటే ఎప్పుడో చిన్నప్పుడు విన్న రేడియో నాటకాలు గుర్తుకు వచ్చాయి. ఒక్కసారిగా నవాబుల కాలంలోకి వెళ్ళి తిరిగి వచ్చినట్లయింది.
పైన నేను చెప్పిన విశేషాలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తే సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రదర్శనను మాత్రం తప్పక చూడండి.
ఓ పట్నం నుంచి ఒకతను వేటాడదామని అడవి చివర్లో ఉన్న గ్రామానికి వెళ్ళాడు. గ్రామం దగ్గరికి వెళ్ళగానే ఓ కుందేలు పారిపోతూ కనిపించింది. గురిపెట్టి కాల్చాడు అంతే… అది ఎగిరి పక్కనే ఉన్న పొలంలో పడింది.
పక్కనే ఉన్న ఆ పొలం యజమాని
“నా పొలంలో పడింది కాబట్టి అది నాదే” అన్నాడు.
“కాదు నేను కాల్చాను కాబట్టి నాదే” అన్నాడు.
అలా కొద్ది సేపు ఇద్దరూ వాదులాడుకున్నాక పొలం యజమానికి ఓ ఆలోచన వచ్చి పట్నం అతనితో ఇలా అన్నాడు.
“ముందుగా నేను నిన్ను డొక్కలో ఒక్కసారి తంతాను. తర్వాత నువ్వు కూడా నన్ను అదేలాగా తన్ను. ఇద్దర్లో ఎవరు తక్కువగా అరుస్తారో ఆ కుందేలు వాళ్ళకి చెందుతున్నమాట.”
ఈ పందేనికి అతను ఒప్పుకున్నారు.
ముందుగా రైతు అతన్ని ఈడ్చి డొక్కలో ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక పట్నం అతను విల విల్లాడిపోతూ కాసేపు నేల మీద పడిపోయాడు. కొంచెం సమయం తర్వాత ఎలాగోలా తేరుకుని
“ఇప్పుడు నా వంతు అన్నాడు” బాధను బలవంతంగా ఆపుకుంటూ.
రైతు నెమ్మదిగా “ఒక్క చిన్న కుందేలు కోసం ఇంత గొడవ అవసరమా చెప్పు? ఆ కుందేలేదో నువ్వే తీసుకో” అన్నాడు.
మిత్రుల సమాగమం
అమరావతి శిల్పం
గత శుక్రవారం మా స్నేహితుడు కొండారెడ్డి పెళ్ళి. వినుకొండకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాస్కర్ నగర్ అనే చిన్న పల్లెటూర్లో వాళ్ళ స్వంత ఇంట్లోనే పెళ్ళి. మా ఎంటెక్ క్లాస్ మేట్స్ రవికుమార్, మురళి, వేణు, ప్రతాప్, ప్రభాకర్, జూనియర్ ప్రవీణ్ వచ్చారు. ఇక సందడే సందడి. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కలుసుకున్నప్పుడు ఎన్నెన్నో కబుర్లు. భలే సరదాగా గడిచిపోయింది. ముహూర్తం రాత్రి 2 గంటలకు కావడంతో అప్పటి దాకా మేలుకుని ఊరంతా తిరుగుతూనే గడిపాం.
శనివారం రోజు మధ్యాహ్నం దాకా ఓ కునుకు తీసి అమరావతి చూడడానికి బయలు దేరాం. వినుకొండ నుండి అమరావతి చేరేసరికి సాయంత్రం నాలుగైంది. అమరావతి లో భోజనం అద్భుతంగా ఉంది. హైదరాబాద్ లో ఉప్పు చప్పని కూరలు తిని మొహం మొత్తేసిన చాలా రోజుల తర్వాత తృప్తిగా తిన్నట్టనిపించింది. తర్వాత మ్యూజియం చూడ్డానికి వెళ్ళేసరికి సమయం నాలుగన్నరైంది. ఓ అర్ధగంటలో అన్నీ మ్యూజియం మూసేస్తామన్నారు. కానీ లోపల గంట సేపటి దాకా గడిపాం.
లోపల శిల్పాలు సుమారు 2000 ఏళ్ళ కాలం నాటివి. వాటిని చెక్కడానికి వాడిన రాయి ఇప్పటిదాకా నేనెక్కడా చూడలేదు. బౌద్ధ సాంప్రదాయంలోని అనేక చిహ్నాలైన త్రిపీఠకాలు, బుద్ధుడి జీవిత విశేషాలు మొదలైనవాటిని శిల్పాల్లాగా మలచి ఉన్నారు. చిన్నప్పుడు తరగతి పుస్తకాల్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చూసి,చదివిన అపురూప శిల్పాలను కళ్ళారా చూసినప్పుడు కలిగిన ఆ అనుభూతే వేరు.
తర్వాత పక్కనే ఉన్న మహా స్థూపాన్ని చూడ్డానికి వెళ్ళాం. దీన్ని కట్టడానికి వాడిన ఇటుకలు చాలా పెద్దవి, బలమైనవి కూడా. చాలా వరకు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. చుట్టూ పేర్చి ఉన్న శిలలపై అక్కడకక్కడా శాసనాలు చెక్కించి ఉన్నారు. ముందుగా కొంచెం అమరావతి గురించి రీసెర్చి చేసుకుని వెళ్ళాను కాబట్టి నేనే అక్కడక్కడా మా వాళ్ళకి గైడునయ్యాను . తర్వాత కృష్ణానదీ ఒడ్డునే ఉన్న అమరేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాం. ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటి.ఇక్కడ శివలింగం మామూలు విగ్రహాలకన్నా చాలా పెద్దదిగా ఉంటుంది. కొండవీడు కోట కూడా చూద్దామనుకున్నాం కానీ సమయం చాల్లేదు. మళ్ళీ ఎపుడైనా వెళ్ళినప్పుడు చూడాలి.
నేను ఇటీవల చూసిన మంచి సినిమా, నన్ను బాగా ప్రభావితం చేసిన సినిమా వేదం. నిజానికి నేను పదిరోజుల క్రితమే చూసినా రాయడానికి ఇన్ని రోజులకు కుదిరింది. ఈ సినిమా గురించి నాకు తోచిన నాలుగు మాటలు…
Spoiler Alert: ఒక వేళ మీరు ముందుగా కథ తెలుసుకోకుండా సినిమా చూడదలుచుకుంటే కింది భాగం చదవద్దు.
ఈ సినిమా నిజానికి ఒక కథ మీద ఆధారపడి తీసింది కాదు. ఐదు కథలు సమాంతరంగా నడుస్తూ ఒక చోట కలుస్తాయి. నాడు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను తనదైన శైలిలో తెరకెక్కించాడు క్రిష్. సినిమాలో నాకు అక్కడక్కడా కొన్ని సన్నివేశాలున్నాయి అద్భుతంగా అనిపించాయి. ఉదాహరణకు కిడ్నీ అమ్మేసి సంపాదించుకున్న డబ్బుల్ని రాములు దగ్గర్నుంచి అల్లు అర్జున్ లాక్కునే సీన్, వెంటనే వచ్చే సీన్ లో హీరోయిన్ ‘న్యూ ఇయర్ పార్టీకి పాసెస్ తీసుకున్నావా?’ అని అడిగితే చేతులో డబ్బులుంచుకుని ‘నా దగ్గర డబ్బుల్లేవనడం’ అనే సన్నివేశం నాకు చాలా బాగా నచ్చిన సన్నివేశాలు.
వేశ్య పాత్రలో నటించిన అనుష్క నటన కూడా నాకు బాగా నచ్చింది. ఇప్పటి దాకా వచ్చిన సినిమాల్లో వేశ్య పాత్రలను ఆటవస్తువులుగా చూపిస్తే ఇందులో క్రిష్ వాళ్ళను ఓ సమాజంలో భాగంగా చూపిస్తూ వాళ్ళ మానసిక స్థితిని, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలను జెన్యూన్ గా చెప్పే ప్రయత్నం చేయడం అభినందనీయం.
కానీ సినిమా సుఖాంతం కాకపోతే తెలుగు ప్రేక్షకులు సరిగా ఆదరించరని చాలా సినిమాలు నిరూపించాయి. అయితే ఈ సినిమా ద్వారా దర్శకుడు ప్రేక్షకుల ధోరణిని మార్చే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు.నాకు ముగింపు ఏ మాత్రం అసంతృప్తిని కలిగించలేదు. నాకే కాదు థియేటర్లోని మిగతా ప్రేక్షకులు కూడా అలాగే ఫీలయినట్లు అనిపించింది. ఎందుకంటే అల్లు అర్జున్ చివర్లో చనిపోతూ సినిమాలో తన ఊతపదమైన ‘దీనమ్మ జీవితం’ అనగానే ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున నవ్వులు విరబూశాయి. దీంతో దర్శకుడి కృషి ఫలించినట్లే అని చెప్పవచ్చు.
ఒకేసారి అన్ని కథలు కలగాపులగంగా నడుస్తుంటే సగటు ప్రేక్షకుడికి కొంచెం కన్ఫ్యూషన్ కలిగించక మానదు. కానీ ఈ రకం సినిమాలు ప్రయోగాత్మకంగా భావించాలి. మొత్తం మీద చాలా కాలం తర్వాత ఓ మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది. మిమ్మల్నీ నిరాశపరచదని భావిస్తున్నాను.
ఇక్క్యూ అనే జెన్ గురువు చిన్నప్పటి నుంచే చాలా తెలివైన వాడు. అతను విద్యాభ్యాసం చేసే సమయంలో గురువు దగ్గర ఒక విలువైన టీకప్పు ఉండేది. అది చాలా పురాతనమైనది, విలువైనది. అది ఒకసారి పొరపాటున ఇక్క్యూ చేతిలోంచి జారిపడి పగిలిపోయింది. అతను ఆందోళనలో పడిపోయాడు. గురువు సమీపిస్తున్నాడనగా ఆ ముక్కలను తీసుకుని వెనక దాచుకుని
గురువును ఇలా అడిగాడు “మనుషులు ఎందుకు చనిపోవాలి?”
“అది చాలా సహజం. పుట్టిన ప్రతిదీ ఒక నిర్ణీత సమయం తరువాత మరణించక తప్పదు” అన్నాడా గురువు.
అప్పుడు అతను వెనుక దాచిపెట్టిన ముక్కలను చూపిస్తూ “మీ టీకప్పుకు కూడా ఆ నిర్ణీత సమయం దాటిపోయింది” అన్నాడు.
గురువు నవ్వుతూ అతని భుజం తట్టాడు.
ఈ వారాంతం శ్రీకాళహస్తి కెళ్ళినపుడు తెలుసుకున్న విశేషాలు కొన్ని మీతో పంచుకోవాలనే ఈ టపా.
ఎక్కడ చూసినా కర పత్రాలు, వాటి నిండా ర్యాంకులు, మార్కులు. ఈ సారి పట్టణంలో కొత్తగా నాలుగు కార్పొరేట్ పాఠశాలలు ప్రారంభమౌతున్నాయట.
నేను ఇంటర్ చదివేటపుడు మాకు మ్యాథమేటిక్స్ బోధిస్తూ ఉండి, ప్రస్తుతం ఓ కార్పొరేట్ కళాశాలలో పనిచేసే మా పూర్వ అధ్యాపకులు నాకో ఆసక్తికరమైన సంఘటన తెలియజేశారు.
నెల్లూరు కు సమీపంలో ఉన్న నరసింహ స్వామి కొండ ప్రాంతం. అక్కడ ఓ కార్పొరేట్ కళాశాలకు చెందిన ఐఐటీ కోచింగ్ సెంటర్ ఉంది.
ఓ ఉదయం అక్కడికి ఓ తండ్రి తన కొడుకుని చేర్చాలని వెంటబెట్టుకొచ్చాడు. అక్కడున్న ప్రిన్సిపాల్ తో మాట్లాడుతున్నాడు.
“సార్, మా అబ్బాయికి పదో తరగతిలో 536 మార్కులొచ్చాయి. ఐఐటీ కోచింగ్ లో చేరుద్దామని, మీ దగ్గరైతే బాగా చెబుతారని విని తీసుకొచ్చాను సార్.”
“దాందేముంది? అలాగే చేర్చండి. ఫీజు సంవత్సరానికి 60,000. అది కట్టేసి అడ్మిషన్ తీసుకోండి” అన్నాడు చాలా మామూలుగా.
“అంత కట్టలేను సార్. 30,000 అయితే కట్టగలను. కానీ మా అబ్బాయి లెక్కలు బాగా చేస్తాడు సార్. అందరూ మీ దగ్గరికి పొమ్మని సలహా ఇచ్చినారు. అందుకనే వచ్చాం. ఎలాగోలా సర్దుకోండి సార్ ” ప్రాధేయపడ్డాడు ఆ తండ్రి.
అయినా ప్రిన్సిపల్ మనస్సు కరగలేదు. “మేమేం చెయ్యలేమయ్యా. ఫీజు అంతా కట్టేపనైతే చేర్చండి. లేకపోతే వేరే కాలేజీలో చేర్చుకోండి” అన్నాడు కరుగ్గా.
అయినా సరే ఆ తండ్రి తన పట్టు విడవలేదు. “ఎలాగోలా సర్దుకోండి సార్. మా అబ్బాయి నిజంగా లెక్కలు బాగా చేస్తాడు సర్ ” అడుక్కుంటూనే ఉన్నాడు.
కాసేపటి తర్వాత “సరేనయ్యా! నువ్వింతగా అడుక్కుంటున్నావు కాబట్టి మీ అబ్బాయికి మేమో పరీక్ష పెడతాం. అందులో గనక మంచి మార్కులు వస్తే మీరు చెప్పిన ఫీజు కట్టించుకుని చేర్చుకుంటాం” అన్నాడు.
ఆ తండ్రి మొహం ఆనందంతో వెలిగిపోయింది. “అలాగే సార్. మా అబ్బాయి రాస్తాడు” అన్నాడు సంతోషంగా…
ఆ అబ్బాయి మాత్రం ఏ భావం లేకుండా అమాయకంగా ఉన్నాడు.
వెంటనే ఆ అబ్బాయికి 120 మార్కులకు ఓ పేపరిచ్చి ఓ గంటసేపు రాయమన్నారు. ఆ అబ్బాయి పెద్దగా కష్టపడకుండానే పూర్తి చేసేశాడు. పేపర్ దిద్దితే 116 మార్కులు వచ్చాయి.
కాలేజీ వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ అబ్బాయిని ఓ గంట సేపు విశ్రాంతి తీసుకోమని మళ్ళీ రెండో సారి పరీక్ష పెట్టారు. ఈ సారి అబ్బాయికి 112 మార్కులొచ్చాయి.
అయినా సరే వాళ్ళు సంతృప్తి చెందలేదు. ఆ అబ్బాయికి అలా కొద్ది విరామంతో అయిదు సార్లు టెస్టులు పెట్టారు. ఆ అయిదు పరీక్షల్లో ఆ అబ్బాయి సగటు 115 మార్కులు.
ఇక లాభం లేదనుకుని ఆ ప్రిన్సిపాల్ తమ బాస్ కు ఫోన్ చేశాడు.
“ఏంటయ్యా! అంత మంచి స్టూడెంట్ విషయం లో ఇంత దూరంలో ఆలోచిస్తారా. ఫీజు కట్టేను కట్టకపొయ్యేను. ముందుగా ఆ అబ్బాయికి అడ్మిషన్ ఇచ్చి లాగెయ్యండి” అని ఫోన్ లోనే చీవాట్లు పెట్టాడా బాస్.
అదీ సంగతి. కార్పొరేట్ కళాశాలలకు పేరు తెచ్చేది ఇలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులే…