చదువులు, ఉద్యోగం కోసం ఉన్నవాళ్లని వదులుకుని విదేశాల్లో ఉన్న కొందరు మిత్రులతో మాట్లాడిన తర్వాత కలిగిన బాధ.. మాకేంటి సంతోషంగా ఉన్నాం అనుకున్నా అందరి మనసుల్లో ఏదో తెలియని దిగులు, ఒంటరితనం..
ఆ వ్యక్తిని చూడగానే పెదవులపై చిరునవ్వు
కళ్లల్లో, మనసులో కనిపించే సంతోషం
బావున్నారా అని మనసారా పలకరింపు
కరచాలనం, ఆలింగనంతో గట్టిపడే అనుబంధం
ఇది ఆనాటి మాటా? ఈనాటి మాటా?
లేక కలల్లో, కళ్లలో దాగిన అందమైన ఊహా?
మనుష్యులు దూరమైనా, సాంకేతికంగా దగ్గరయ్యామని
అందరూ మురిసిపోతున్న ఈ జీవితం ఒక e జీవితం..
వేలమైళ్ల దూరాన ఉన్నా
కనురెప్పపాటులో వినిపిస్తున్న సెల్ ఫోన్లు
వెబ్ కెమెరాద్వారా చూపిస్తున్న కంప్యూటర్లు
మాటలను, రూపాలను సునాయాసంగా
చేరవేస్తున్నా ఏదో తెలియని లోటు, దిగులు
మాటలను మోసుకెళ్లే మొబైల్
మనసును చేరవేసే మెయిల్
ఒక్క మౌస్ క్లిక్కుతో ప్రపంచాన్ని
మన ముంగిట జేర్చే ఇంటర్నెట్
స్నేహితులతో బలాదూర్‌గా తిరిగిన స్మృతులు
అక్క, తమ్ముడు, చెల్లి కూర్చుని చెప్పుకున్న కబుర్లు
పిల్లల అల్లరి కేరింతలు, పెద్దల ఆజమాయిషీలు
వీటన్నింటిని అచ్చంగా అలాగే మోసుకెళ్లగలదా?
తమని తాము ఆధునికంగా మార్చుకున్నామని
తమ చుట్టూ ఒక అదృశ్య వలయాన్ని ఏర్పరచుకుని
చిరునవ్వులను, ఆప్యాయతాలింగనాలను, పరామర్షలను
సన్నిహితులతో ముచ్చట్లు, పోట్లాటలు , కలయికలు
అన్నీ మరచి.. అందరూ ఉన్నారనుకుని ఏకాకిగా మారుతున్నారా??