కూడలి
జల్లెడ
హారం
ఈ మధ్యన టీవీ ఏసియా లో బాగ్బాన్ అనే సినిమా చూసాను. నేను ఈ సినిమా మొట్టమొదటినుండీ చూడలేకపోయినా సగం నుండి చూడటానికి వీలైయ్యింది.
ముందుగా బాగ్బాన్ అంటే అర్ధం ఏమైఉంటుందీ అనుకుని, గూగుల్లో గెలికా, వెంటనే “తోటమాలి” అని వచ్చింది. ఆ పేరు ఈ సినిమా కధకి వందశాతం సరిగ్గా సరిపోయింది. తండ్రి అనే తోటమాలి సంసారం అనే తోటని, పిల్లలు అనే మొక్కల్ని, ఎంత అపురూపంగా పాదులు తీసి, నీళ్లు పోసి, పురుగుపుట్రా నుండి కాపాడుతూ, రెక్కలు ముక్కలు చేసుకుని కాయకష్టం చేసుకుంటు, చిగుళ్లేస్తే ఆనందపడుతూ, పూలుపూస్తే కేరింతలుకొడుతూ అహర్నిశలూ తపిస్తాడు. ఈ సినిమా అలాంటి ఓ తోటమాలి కధ.
అడ్డాలనాటి పిల్లలే కాని గడ్డాలనాటి పిల్లలు కాదు ఓ సామెత. ఒక తండ్రి కొడుక్కి మొట్టమొదటి అడుగు వెయ్యటానికి అండగా నిలిస్తే, ఆ కొడుకు ఆ తండ్రికి చివరి అడుగు వెయ్యటంలో అండగా ఎందుకు నిలవలేకపోతున్నాడు? ఈ సినిమా కధ అదే. ఎన్నో తెలుగు సినిమాలు ఇలాంటివి ఉన్నాయ్, కాని, అమితాభ్ మళ్లీ ఈ సినిమాలో, “అమితాభ్ ఒక్కడే” అనిపించుకున్నాడు. నాకు ఆ పాత్రలో ఆయన మా నాన్నలానే అనిపించాడు, మీకూ మీనాన్నలానే అనిపిస్తాడు. అంత సహజంగా జీవించాడు, ఎందుకంటే అతనూ ఓ తండ్రేగా.
సరే, ఈ సినిమాలో పాత్రలు పాత్రధారులు
అమితాభ్, హేమామాలిని, శరత్ సక్సేనా, పరేశ్ రావల్, మరియూ బృందం
విడుదల – అక్టోబర్ 2003
దర్శకత్వం – రవి ఛోప్ర
కధ – బి ఆర్ ఛోప్ర
ఈ కధని బి.ఆర్. ఛోప్రా ఎప్పుడో రాసిపెట్టుకున్నారుట. ఆయన దిలీప్ కుమార్ మరియూ రాఖీలనిపెట్టి తీద్దాం అనుకున్నారుట.
కధలోకొస్తే -
రాజ్ మల్హోత్ర (అమితాభ్), పూజ (హేమామాలిని) దంపతులకు నలుగురు పిల్లలు. రాజ్ ICICI బ్యాంక్లో పనిచేస్తూ సంతుష్టంగా బతికేస్తూ ఓరోజున పదవీ విరమణ చేసి, పెళ్లాం పిల్లతో గడపొచ్చు అని ఆశిస్తాడు. రాజ్ పూజాల వైవాహిక బంధం 40 ఏళ్లైనా వాళ్ల ప్రేమ ఇంకా వికసిస్తూనే ఉంటుంది. ఐతే, మరి పదవీ విరమణ అయ్యాక, పెద్దరికం వల్లా, ఇక పిల్లలదెగ్గరకి చేరుకుందాం ఆసరా కోసం అనుకుంటారు రాజ్ మరియూ పూజ. కానీ వీళ్ల బాధ్యతల్ని తాము తీస్కోటానికి ఆ పిల్లలు పెద్దగా ఇష్టపడరు, దానికో ప్రత్యేక కారణం రాజ్ దెగ్గర ఆస్తులు కూడా లేకపోవటం. మొత్తానికి ఆ నలుగురు పిల్లలు ఒక పరిష్కారం కనిపెడతారు. అది, రాజ్ పెద్ద కొడుకు దగ్గర, పూజ రెండో కొడుకు దగ్గర ఉండాలి అని. ఆరూనెలల తర్వాత, రాజ్ మూడోవాడి దగ్గర, పూజ నాలుగోవాడి దగ్గరకీ మారాలి అని. రాజ్ కి ఈ ఆలోచన నచ్చదు, పూజ ని తనని అలా విడదీయ్యటం అతనికి మింగుడుపడదు. కాని తప్పని పరీస్తితుల్లో రాజ్ మరియూ పూజ విడిపోయి పిల్లలదగ్గరకి చేరుకుంటారు. ఇక వాళ్ల కష్టాలు మొదలౌతాయి. ఇక్కడ కష్టాలకన్నా అభిమానాలు హర్ట్ అవుతుంటాయి. ఇటు తండ్రికి రావాల్సిన గౌరవం అటు తల్లికి ఇవ్వ్లాల్సిన గౌరవం ఉండదు. పిల్లల మాటలు చాలా కటువుగా, వీళ్లు తమ కొడుకులపై పెట్టుకున్న నమ్మకాల్ని చీల్చి చెండాడుతూ ఉంటాయి. ఉదాహరణాకి, రాజ్ పొద్దున్నే బ్రేక్ఫాష్ట్ చెయ్యటనికి భోజనబల్ల దెగ్గరకి వస్తాడు, ఓ కుర్చీలో కూర్చుంటాడు, వెంటనే కోడలు, మామయ్య, అది మీకొడుకు కూర్చునే కుర్చి, మీరు అటు కూర్చోండి అని చెప్తాడు. ఈ లోపల రాజ్ కి అదే అపార్ట్మెంటుల్లో ఉంటున్న పరేశ్ రావల్ పరిచయం అవుతాడు. ఇతనికి ఓ కాఫీషాప్ ఉంటుంది. పరేశ్ రావల్, రాజ్ తో మీ కధని కాయితానికెక్కించండి అని ప్రోత్సహిస్తే, రాజ్, అది రాస్తుంటాడు, ఒక చిన్న టైప్ రైటర్ సహాయంతో. ఓరోజు నిద్ర పట్టక టైప్చేస్తూ ఉంటాడూ టిక్కు టిక్కు అని. ఆ శబ్దానికి కోడలుగారికి నిద్ర పట్టక మొగుడ్నిలేపి పంపిస్తుంది ఆపమని చెప్పు మీ నాన్నకి అని. వాడు వచ్చి, ఏంటి ఈ గోలా అంటాడు. నిద్ర పట్టడమ్లేదు అందుకని అంటే ఈ వయ్యసులో నిద్ర పట్టదు, అది మామూలే, ఐతే, మేముకూడా నిద్రపోకూడదా అంటాడు. ఓరోజు అర్ధరాత్రి కొడుకు పనిచేస్కుంటుంటే రాజ్ అడుగుతాడు, ఏంజేస్తున్నావ్ అని, ప్రెజెంటేషన్ తయ్యారు చేస్తున్నా అంటాడు కొడుకు. నేను సహాయం చేయనా అంటే కొడుకు తండ్రిని ఎగతాళిగా మాట్లాడుతూ, మేము మీలా కాదు, మా ఆలోచనల్తో యింతవాళ్లమయ్యాం, మీ వయ్యస్సొచ్చినా ఇబ్బందిలేకుండా, మీలా ఇంకొకళ్ల దెగ్గర దేబిరించకుండా కూడబెట్టుకుంటున్నాం అంటాడు. ఇలాంటివి పూజ కి కూడ జరుగుతూ ఉంటయి. ఇలా ఆరునెలలు గడచిపోతాయి. మరి బాధ్యతలు షిఫ్ట్ అయ్యే రోజు వస్తుంది. కింది కొడుకులు ఇద్దరూ అస్సలు సుముఖంగా ఉండరు వీళ్ల బాధ్యతల్ని తీస్కోటానికి. ఇంతలో రాజ్ తన కధని, పేరు బాగ్బన్, పూర్తి చేసి, పరేష్ రావల్ కి ఇచ్చేసి వెళ్లి పోతాడు. పూజ కి ఫోన్ చేసి నువ్వు వచ్చే రైలు, నేనొచ్చే రైలు కలిసే చోట మనం ఒకచోట కలుద్దాం అంటాడు. తను సరే అని ఆ స్టేషన్లో దిగుతుంది. రాజ్ పూజ కలుస్తారు. ఆ వూరు వాళ్లు వాళ్ల జీవితాన్ని మొదలుపెట్టిన ఊరే. మొత్తానికి అక్కడ రాజ్ యొక్క పెంపుడుకొడుకు, సల్మాన్ కలుస్తాడు. సల్మాన్ ఇంటికి వీళ్లు వెల్తే అక్కడ భగవంతుడితో పాతు వీళ్లని కూడా పెట్టి పూజిస్తున్నట్టు తెల్సుకుంటారు రాజ్ మరియూ పూజ.
ఇంతలో పరేష్ రావల్ మరియూ అతని భార్య ఈ కధని చూసి చెలించిపొయి, ఇతన్ని కలుద్దాం, అనుకునేలోపు, కొంతమంది సలహామేరకు బాగ్బన్ అనే కధని అచ్చువేస్తారు, ఆ కధకి ఉత్తమ కధ అవార్డ్ వస్తుంది. ఆ కధ పబ్లిషర్ టోకెన్ అడ్వాన్స్ కింద ఒక 10 లక్షల చెక్కు ఇస్తే, దాన్ని రాజ్ కి అందిద్దాం అని పరేష్ రావల్ రాజ్ దెగ్గరకి వెళ్తాడు.
ఆ పబ్లిషర్ రాజ్ కి సన్మానం ఏర్పాటు చేస్తాడు. దీని సంగతి తెల్సుకుని రాజ్ కొడుకులు “రాజ్ దెగ్గర డబ్బు మళ్లీ వచ్చింది” కాబట్టి, వెళ్లి కాళ్ల మీద పడి క్షమించేయమని అడుగుదాం, తల్లితండ్రులు క్షమిచి తీరుతారు అని ఆ సన్మాన కార్యక్రమానికి వెళ్తారు.
ఇక ఈ సినిమాకి హైలైట్ మొదలు – అది – ఆ వేదికనుద్దేశించి రాజ్ ఇచ్చిన ప్రసంగం.
పై ప్రసంగానికి తెలుగీకరణ -
“చూడండి..నేను రచయిత ని కాదు…రచయితలయితే ఆలోచనల సముద్రాలలో మునిగి ఎన్నో మంచి ముత్యాలు వెలికి తీస్తారు. నేనేదో జీవితం నాకు చూపించినవే కథ గా రాశాను. ‘బాఘ్బన్’ (తోట మాలి) నా కథో ఇంకెవరి కథో కాదు. ఈ కథ గడనిచిపోయిననిన్నటికి రాబోయే రేపటికి మధ్యనున్న నిశ్శబ్దాన్నిగురించి రాసింది. ఇది ఒక తరానికి మరొక తరానికి మధ్య కూలిపోయిన ఎన్నో వారధుల కథ. తమపై కూర్చున్న పిల్లలకి జీవితం అనే వేడుకని చూపించి ఇప్పుడు అలసిపోయి కుంగిపోయిన భుజాల కథ ఇది. తమ పిల్లలకి తప్పటడుగులు వేయడం నేర్పించి..ఇప్పుడు ఊతం లేక వణుకుతున్న చేతుల కథ….ఒకప్పుడు జోల పాటలు పాడి..ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా మాటలు లేక అదురుతున్న పెదవుల కథ కూడా. కాలం మారిపోయింది..జీవితం మారిపోయింది..మా వయసు వాళ్ళకి గుర్తే[మాత్రమే] ఉంటుంది..బంధాలు అనుబంధాలు అంటూ ఎలా వెంపర్లాడేవాళ్ళమో….తండ్రి ముఖంలో పరమ శివుడ్ని చూసేవాళ్ళం..తల్లి పాదాల వద్ద స్వర్గం కనిపించేది…కాని ఇపుడు జనాలు ఇంగితం కలవాళ్ళు. ఈ తరం తెలివి, లోకజ్ఞానం కలిగినది. వీళ్ళకి ప్రతి బంధం పైకి వెళ్ళడానికి ఒక మెట్టు లాంటిదే. ఆ మెట్టు అవసరంలేదు అనిపించినపుడు ..ఇంట్లో విరిగిపోయిన కుర్చీలాగా, అరిగిపోయిన గిన్నెలాగా, చినిగిన పాత బట్టల్లా నిన్నటి వార్తా పత్రికలా ఏమూలనో పారవేస్తారు. కాని జీవితం మెట్లలా పైకి వెళ్ళదు..జీవితం చెట్టులా పెరుగుతుంది. తల్లిదండ్రులు పైకి వెళ్ళే నిచ్చెనలో మొదటి మెట్టు కాదు. తల్లిదండ్రులు, జీవితం అనే చెట్టుకి తల్లి వేరు లాంటివాళ్ళు. చెట్టు ఎంత పెద్దదైన ఎంత పచ్చగా పుష్పించినా..తల్లి వేరు కొట్టేస్తే అది పచ్చ గా మనలేదు. అందుకే ఈ రోజు నేను సాదరంగా సవినయంగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఏ పిల్లల సంతోషం కోసం ఒక తండ్రి తను కష్టపడి సంపాదించిన ప్రతి పైసా నవ్వుతూ ఖర్చు చేస్తాడో..ఆ పిల్లలు ఆ తండ్రి కళ్ళు మసక బారినప్పుడు ఆ కళ్ళకి కాస్త వెలుగు నివ్వడానికి ఆలోచిస్తారెందుకు? తన జీవితంలో మొదటి అడుగు వేయడం నేర్పిన తండ్రి జీవితం చివరి దశలో ఆ కొడుకు ఆసరాగా నిలబడలేడెందుకని? జీవితం అంతా తమ సంతోషాలను పిల్లలకోసం త్యాగం చేసే తల్లిదండ్రులకి ఏ నేరం చేసారని కన్నీళ్ళు ఒంటరితనం శిక్షగా విధిస్తున్నారు? మాకు ప్రేమని పంచలేని వాళ్ళు మా ప్రేమను తీసుకునే అధికారం ఎవరిచ్చారు? ఈ పిల్లలు ఎం అనుకుంటున్నారు? ప్రేమ అనే బంధంతో భగవంతుడు కలిపిన తల్లిదండ్రులను రెండు భాగాలుగా విడదీసి ఎవరికీ వారుగా బాధ పడేలా చేస్తారా? ఈ రోజు కోసమేనా ఒక మనిషి పిల్లలను పెంచేది? పిల్లలు మర్చిపోయిన విషయం ఒకటి ఉంది. ఈ రోజు మాకు జరిగింది రేపు వాళ్ళకి జరగవచ్చు. ఈ రోజు మేము ముసలి వాళ్ళం ఐతే వాళ్ళు ఒక రోజు ముసలి వాళ్ళు అవుతారు. ఈ రోజు మేం అడిగే ప్రశ్నలు రేపు వాళ్ళు అడుగుతారు. ఇక మా గురించి మీరు ఆలోచించకండి. ఎందుకంటే ఎంమాట్లాడలేని, నడవలేని అర్థం చేసుకోలేని పిల్లలను పెంచి పెద్ద చేసినవాళ్ళం..మమ్మల్ని మేము పోషించుకోలేమా? మాకు ఎవరి అండ అవసరం లేదు. నేను అదృష్టవంతుడిని. ఎందుకంటే జీవితం నాకొక అద్భుతమైన తోడూ నిచ్చింది. తనతో నడుస్తూ ఉంటె దారి తేలిగ్గా అనిపించేది. తనతో నడుస్తూ ఉంటె జీవితం లో ఎంత చిక్కు సమస్య అయినా ఇట్టే విడి పోయేది. ఆ తొడు..నా భార్య. అందరు ప్రేమిస్తారు. కాని ఈ విషయం చెప్పవలసినన్ని సార్లు చెప్పరు. ఆ తప్పు నేను చేయదలచుకోలేదు. “పూజా, నువ్వంటే నాకు అంతు లేని ప్రేమ..అంతు లేని ప్రేమ..thank you for being there”. “నీవు ఉంటే మనం ఉంటాం. మనం ఉంటే అన్ని ఉంటాయి..లేకపోతె ఏది ఉండదు….ఏది ఉండదు..”..నేను చెప్పవలసినది ఇంతే.”
[గమనిక: ఈ అమితాభ్ ప్రసంగాన్ని రాసింది జావేద్ అక్తర్. అక్తర్ ఈ సినిమాకి రచయిత కాదు, కానీ కేవలం ఈ ప్రసంగం రాసిచ్చారాయన.]
ప్రసంగం అయ్యాక, రాజ్ పూజ ని తీస్కుని వెళ్లిపోతుంటె, కొడుకులు క్షమించమని అడుగుతారు, రాజ్ “నేను క్షమించను” అనేసి ముందుకి వెళ్లగానే, వాళ్లు తల్లిని వేడుకుంటారు. ఆ తల్లి, “ఒక తల్లిగా మిమ్మల్ని క్షమించినా, ఒక భార్యగా నేను క్షమించలేను” అంటుంది.
ఈ కధ మనలో చాలా మందికి దెగ్గరగా ఉంటుంది. కావాలని తల్లితండ్రుల్ని మనం విసిగించక పోయినా, కొన్ని కొన్ని సార్లు మనం వాళ్లకి ఇవ్వాల్సిన విలువని ఇవ్వము. అది క్షమించ రాని నేరం. కాబట్టి మనల్ని కని పెంచి, విద్యా బుధుల్ని నేర్పి, విజ్ఞానాన్ని ఇచ్చి, మనం ఈ రోజున ఇలా నిలబడేలా కష్టపడిన మన తోటమాలుల్ని మనం మన పూల పరిమళాలతో, కమ్మని ప్రేమా వాత్స్ల్యపు వాసనల్తో వాళ్లుపడిన కష్టాలనుండి సేదదీరుద్దాం.
దీంట్లో నాకు నచ్చిన పాట : నేను ఇక్కడ నువ్వు అక్కడ జీవితం ఎక్కడ – मै यहा तू वहा जिंदगी है कहा –
Get this widget
|
Track details
|
eSnips Social DNA
పాదింది : అమితాభ్ మరియూ అల్కా యాగ్నిక్
సంగీతం : ఆదేష్ శ్రీవాత్సవ్
రచన : షహీద్ ఫియాజ్
[అమితాభ్ ప్రసంగాన్ని తెలుగీకరించిన కృష్ణ గారికి ధన్యవాదాలు]
పాశ్చాత్య తత్త్వశాస్త్రం మీద, తత్త్వవేత్తల మీద ఇప్పటిదాకా వచ్చిన అన్ని డాక్యుమెంటరీలలోను, అత్యుత్తమమైనది – బీబీసీ వారి “Human, All too Human” అన్న పేరుగల డాక్యుమెంటరి!
20 వ శతాబ్దపు పాశ్చాత్య తత్త్వ శాస్త్రం పై అత్యంత ప్రభావాన్ని చూపిన Friedrich Nietzsche, Jean Paul Sartre మరియు Martin Heidegger లు కేంద్రం గా ఈ డాక్యుమెంటరీ నడుస్తుంది. ఆయా వ్యక్తుల జీవిత విశేషాలనూ, వారి స్వభావాలనూ, సిద్ధాంతాలనూ విశ్లేషిస్తూ సాగుతాయి వీడియోలు.
ఈ వీడియోలు గూగుల్ వీడియో లలో లభ్యమవుతున్నాయి. పాశ్చాత్య తత్త్వశాస్త్రానికి పూర్తిగా క్రొత్తవారైనా ఇవి తప్పక చూడవలసిన వీడియోలు!
Jean Paul Sartre పై డాక్యుమెంటరీ:
Martin Heidegger పై డాక్యుమెంటరీ:
Friedrich Nietzsche పై డాక్యుమెంటరీ:
ఈ టపాలో సోది ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ప్రాసెస్, ఇంకా ప్రాసెస్ గ్రూపుల గురించి ముందు టపాలో అయిదు ప్రాసెస్ గ్రూపుల గురించి చర్చించాం కదా? ఇప్పుడు వాటి వివరాల్లోకి దూకేద్దాం.
మీ బావిలోంచి పేద్ద తొట్టె లోకి నీళ్ళు తోడాలని ఒక ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి – ఏం చేస్తారు?
1. ముందుగా ప్రారంభిస్తారు – అంటే “అంతా ఒకే, పని మొదలెడదాం” అని డిసైడయిపోతారన్నమాట –
వీటిట్లో దశలేముంటాయి, ఎన్నుంటాయి అని కూడ చూసుకుంటారు – ఇది ఇనీసిఏషన్
2. తరవాత చేసేది – అసలేపని చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఈ నీళ్ళుతోడే పని వెనక ముఖ్యోద్దేశమేమిటి? ఇలాంటివన్నీ అలోచించి ఒక ప్రణాళిక సిధ్ధం చేసుకుంటారు – అది ప్లేనింగ్
3. “అలోచించీ చించీ చించీ చించింది చాలు గానీ పనిమొదలెట్టవో” అని పక్కవాడు అరిచినవెంటనే హడావిడిగా, మనుషుల్ని, కావలసిన వస్తువుల్ని ఒక చోట చేర్చి పని మొదల్య్యేలా చేస్తారు. (మొదలయిన పనిని కొనసాగేలా చేస్తారు కూడా) – ఇది ఎక్సిక్యూషన్
4. ఇప్పుడుంది అసలు కధ – జరుగుతున్న పనిని నిశితంగా గమనిస్తూ, ఎవడైన పని చెయ్యకుండా నిద్రపోతున, కబుర్లు చెప్తున్నా, ఒక వేళ అనుకున్నట్టు కాకుండ వేరేలా పని జరుగుతున్నా, నిమిషానికో బకెట్టు తోడాల్సింది, గంటకోబకెట్టు తోడుతున్నా, చేదకి కన్నం పడి నీళ్ళు కారుతున్నా .. వెంటనే కల్గించుకుని పని సజావుగా జరిగేలా చూస్తారు కదా? అదే మానీటరింగ్ & కంట్రోలింగ్ అన్నమాట
5. పనంతా జరిగిపోయాక “పనైపోయింది నాయనలారా! ఇక దయ చేయుడి. ద్వారము తెరచియేయున్నది. బయటకి నడవని వాడిని వెళ్ళగొట్టమని చెప్పబడియున్నది” అని వాళ్ళకి వీడ్కోలు చెబుతూ పని జరిగిపోయింది అని ప్రకటీస్తారుగా? (అంతా అయిపోయాక వచ్చి “నేను నిద్రపోయా” అంటూ డబ్బులో, ప్రెసిడెంట్ పదవో కొట్టుకుపోయే శరత్ లాంటివాళ్ళనైనా అపాలి కదా?) – అది క్లోసింగ్ అన్నమాట.
ఇది కూలంకషంగా అర్ధమయితే రేపే పీ.యం.పీ పరీక్షకి కూర్చోండి. జోక్ చెయ్యట్లేదు, నిజంగానే.
ఇక ఈ ప్రాసెస్ గ్రూపుల గురించి మరికాస్త సోది: (ప్రస్తుతానికి క్లుప్తంగానే, వచ్చేపోస్టు నుండీ వీటి వివరాల్లోకి)
ముందుగా ఇనీసియేటింగ్ గ్రూపు: ముందుగా అనుకున్నట్టు దీనిలో జరిగేది దశలని నిర్ణయించడం, దశలకు అధికార ముద్ర తేవడం, ప్రాజెక్టుకు గానీ, ప్రాజెక్టు దశకు గానీ రిబ్బను కట్ చెయ్యడం.
ఇందులో ముఖ్యంగా రెండు ప్రక్రియలుంటాయి – ప్రాజెక్‌ట్ చార్టర్ (ప్రాజెక్టు అధికారిక పత్రం) ని సృష్టించడం, ప్రాజెక్ట్ ఉద్దేశ్యాలని క్లుప్తంగా తెలియపరచడం ( ప్రిలిమినరీ స్కోప్ స్టెట్‌మెంట్ ని సృష్టించడం)
ప్రాజెక్ట్ చార్టర్ లో ముఖ్యంగా ఉండే అంశాలు:
* ప్రాజెక్టు పేరు, ప్రాయోజకుల పేర్లు, లీడర్ పేరు, వివరాలు
* ప్రాజెక్టు వివరణ, ముఖ్యోద్దేశాలు, పరిమితులు
* ప్రారంభించే, ముగించే తేదీలు
* టీం వివరాలు
* ప్రాజెక్టు నుండి వెలువడే డెలివెరబుల్స్ వివరాలు
* ఇతర వివరాలు
దీనిని సృష్టించే కంపేనీని బట్టీ దీన్లో అంశాలు కొద్దిగా మారతాయి
ఇక రెండోది ప్రిలిమినరీ స్కోప్ స్టెట్మెంట్ – దీనిలో ప్రాజెక్టు సఫలీకృతమై ముగింపు దశకు రావాలంటే చేపట్టవలసిన కార్యాల గురించి క్లుప్తంగా ఉంటుంది.
మన రెండవ ప్రాసెస్ గ్రూపు ప్లేనింగ్. వివిధ ప్రాజెక్టు దశలలో, ప్రక్రియలలో ప్రణాళికలని సృష్టించేది.
దీన్లో అంతర్భాగమైన ప్రక్రియలు:
- ప్రాజెక్ట్ ప్రణాళిక తయారు చెయ్యడం
- స్కోపును ప్లేన్ చెయ్యడం ( స్కోప్ మేనేజ్మెంట్ ప్లేన్ ని తయారుచెయ్యడం)
- ప్రాజెక్ట్ స్కోపుని వివరించడం. ఈ ప్రక్రియ నుండి వెల్వడెవి – స్కోప్ స్టేట్మెంట్, మార్పుల, సవరణ అభ్యర్ధనల వివరాలు, స్కోప్ మేనేజ్మెంట్ ప్లేణ్ సవరణలు
- వర్క్ బ్రేక్ డౌన్ క్రమము: పని విభజన లేదా ఒక పెద్ద పనిని చిన్న చిన్న పనులుగా విభజించే పధ్ధతి. దీనినుండి వెలువడేవి స్కోప్ స్టెట్‌మెంట్ సవరణలు, వర్క్ బ్రేక్‌డౌన్ స్ట్రక్చర్, నిఘంటువు, ప్రాజెక్ట్ బేస్లైన్ (ప్రాతిపదిక) , సవరణ అభ్యర్ధనల వివరాలు, స్కోప్ మేనేజ్మెంట్ ప్లేన్ సవరణలు.
- ప్రక్రియల నిర్వచనం. ప్రక్రియల పట్టిక, వివరాలు, మధ్యంతర లక్ష్యాల వివరాలు, సవరణ అబ్యర్ధనల వివరాలు వెలువడతాయి
- ప్రక్రియల క్రమబధ్ధీకరణ (ఏక్టివిటీ సీక్వెన్సింగ్ – తెలుగీకరణ ఎక్కువైందా? ఎడ్జస్టయిపోండి). వెలువడేవి: ప్రాజెక్ట్ స్కెజూలు, ప్రక్రియల పట్టిక, వివరాలు, సవరణ అభ్యర్ధనల వివరాలు
- ప్రక్రియల వనరుల అంచనా ( ఏక్టీవిటీ రిసోర్స్ ఎస్టిమేషం) – వెలువడేవి ఏక్టీవిటీ అవసరాలు, ఏక్టీవిటీ ఏట్రిబ్యూట్లు, రీసోర్స్ బ్రేక్డౌన్ స్ట్రక్చర్, రీసొర్స్ కేలండర్, సవరణా అభ్యర్ధనలు
- పరిక్రియాసమయపుటంచనా (ఏక్టివిటీ డ్యూరేషన్ ఎస్టిమేటింగ్) – వెలివడేవి ఏఖ్టీవిటీ డ్యూరేషన్ ఎస్టీమేట్లు, ఏక్టీవిటీ ఏట్రిబ్యూట్లు
- స్కెజూల్ సృష్టి దీనినుండీ, ప్రాజెక్ట్ స్కెజూలు, మాడల్ డేట, ప్రామాణికాలు, వనరుల రికైర్‌మెంట్లూ, మరియు ఏక్టివిటీ ఏట్రిబ్యూట్లకి, ప్రొజెక్ట్ ఖెలండర్ కుం, ప్రాజెక్ట్ మేనేజ్మేంట్ ప్రణాలిక కు సవరణాలు, చివరగా, సవరణ అబ్యర్ధనలు
- ఖర్చు అంచనా ( కాస్ట్ ఎస్టిమేటింగ్) – ఖర్చు అంచనాలు, అవసరమైన సమాచారం, ఖర్చు ప్రణాలికా సవరణలు, సవరణ అభ్యర్ధనలు)
- ఖర్చు బడ్జెటింగ్ (కాస్ట్ బడ్జెటింగ్) – ఖర్చు ప్రామాణికాలు, ఫండింగ్ అవసరాలు, ఖర్చు ప్రణాలికకు సవరణలు, సవరణ అబ్యర్ధనలు
- నాణ్యతా ప్రణాలిక (క్వాలిటీ ప్లేనింగ్) – క్వాలీటీ మేనేజ్మెంట్ ప్లేన్, మెట్రిక్కులు, ప్రణాళికలు, చెక్ లిస్టులు, ప్రమాణికాలు, ప్రాజెక్ట్ మేనేఝ్మెంట్ ప్లేన్ సవరణలు
- మానవ వనరుల ప్రణాలిక (హ్యూమన్ రీసోర్స్ ప్లేనింగ్) – ఉద్యోగుల బాధ్యతలు, వ్యవస్థ నిర్వచనం, సంబంధిత ప్రణాళికలు
- కమ్యూనికేషన్ల ప్రణాలిక ( కమ్యూనికేషన్ ప్లేనింగ్) – కమ్యూనికేషన్ మేనేజ్మెంట్ ప్లేన్
- రిస్క్ మేనేజ్మెంట్ ప్లేనింగ్ – రిస్క్ ప్రణాలిక – రిస్క్ గుర్తింపు (రిస్క్ ఐడెంటిఫికేషన్) – రిస్క్ పట్టిక
- నాణ్యతాపరమైన రిస్క్ పరిశీలన ( క్వాలిటేటివ్ రిస్క్ ఏనాలసిస్) – రిస్క్ పట్టిక సవరణలు
- సంఖ్యాపరమైన రిస్క్ పరిశీలన ( క్వాంటిటేటివ్ రిస్క్ ఏనాలసిస్) – రిస్క్ పట్టిక సవరణలు
- రిస్క్ రెస్పాన్స్ ప్లేనింగ్ – రిస్క్ పట్టిక, ప్రాజెక్ట్ ప్లేణ్ సవరణలు, రిస్క్ సంబంధిత ఒప్పందాలు – కొనుగోలు ప్రణాళిక (పర్చేస్ అంద్ ఏక్విసిషన్ ప్లేన్)
- కొనుగోలు ప్రణాలికలు, ఒప్పందాలు, నిర్ణయాలు, సవరణలు
- ప్లేన్ కాంట్రాక్టింగ్ – కొనుగోలు డాక్యుమెంట్లు, ఈవేల్యుఏషన్ ప్రతిపాదికలు , స్టేట్మెంట్ ఆఫ్ వర్క్
ఇవండీ ప్లేనింగ్ గ్రూపులో ఉన్న ప్రక్రియలు – బుర్ర వాచిపోయిందా? కాస్త బ్రేక్ తీసుకుని రండి, నేనిక్కడే ఉంటా )
ఇక తరవాతది ఎక్సిక్యూషన్ గ్రూపు – ఇందులో ఏం ఉన్నాయో చూద్దాం
- ప్రాజెక్టు దిశానిర్దేశం ( ప్రాజెక్ట్ ఎక్సిక్యూషన్ డీరెక్షన్, మెనేజ్మెంట్) – దీనినుండి వెలువడేవి – సవరణ అబ్యర్ధనలు, ప్రివెంటివ్, కరెక్టివ్ చర్యలు, అమలు పరచిన సవర్ఫణలు, అమలు పరచిన సవర్ణలు మొదలగునవి)
- క్వాలిటీ ఎస్సూరెన్స్ – సవరణ అబ్యర్ధనలు, ప్రివెంటివ్ కరెక్టివ్ చర్యలు, సమ్ష్థాగత ప్రక్రియలు, ప్రాజెక్ట్ ప్లేణ్ సవరణలు మొదలగునవి)
- ప్రాజెక్ట్ టీం వనరుల సమకూర్పు (ప్రాజెక్ట్ టీం ఎక్విసిషన్)- వనరుల లభ్యత, వినియోగానికి సంబంధించిన సమాచారమంతా ప్రాజెక్ట్ టీము నిర్మాణం (ప్రాజెక్ట్ టీం డివలప్మెంట్) – టీము పని తీరు
- సమాచార పంపిణీ ( ఇన్‌ఫర్మేషన్ డీస్ట్రిబ్యూషన్) – సంస్థాగత ప్రక్రియలు, సవరణ అభ్యర్ధనలు
- అమ్మకం దారుల జవాబు అబ్యర్ధన (రిక్వెస్ట్ సెల్లర్ రెస్పాన్స్) – అమ్మకం దారుల పట్టీ, సమాచారం, జాబులూ, జవాబులు
- అమ్మకం దారుల ఎంపిక (సెలక్ట్ సెల్లర్స్) – కాంట్రాక్టు సమాచారం, అమ్మకందారుల సమాచారం, ప్రణాళికా సవరణలు, సవరణ అబ్యర్ధనలు
ఇక మానీటరింగ్ & కంట్రోలింగ్ ప్రాసెస్ గ్రూపు
- ప్రాజెక్ట్ నియంత్రణ (ప్రాజెక్ట్ మానీటరింగ్ & కంట్రోల్) – కరెక్టివ్, ప్రివెంటివ్ చర్యలు, ఫోర్కాస్టులు, సవరణ అబ్యర్ధనలు మొదలగునవి
- మార్పు నియంత్రణ ఇంటిగ్రేటెడ్ చేంజ్ కంట్రోల్) – సవరణలు, సవరణ పట్టి, స్కోప్ సమాచారం, దోషాల పట్టీ, దోష నిర్మూలన పట్టీ మొదలగునవి
- స్కోప్ వెరిఫికేషన్ – సవరణ, కరెక్టివ్ చర్య ప్రతిపాదనలు, డెలివెరబుల్
- స్కోప్ నియంత్రణ (స్కోప్ కంట్రోల్) – స్కోప్ సమాచారం, ప్రామాణికాలు, సవరణలు మొదలగునవి
- స్కెజూల్ నియంత్రణ – స్కెజూల్ డేటా, ప్రమాణికాలు, తదితర సంబంధిత సమాచారం ప్రణాళిక
- ఖర్చు నియంత్రణ ( కాస్ట్ కంట్రోల్) – ఖర్చు అంచనాలు, ప్రమాణికలు, తదితర సంబంధిత సమాచారం
- నాణ్యత నియంత్రణ ( క్వాలిటీ కంట్రోల్) – నాణ్యత గణకాలు, దోషాలు, ప్రివెంటివ్, కరెక్టివ్ చర్యలు మొదలగునవి
- టీం నిర్వహణ ( ప్రాజెక్ట్ టీం మేనేజ్మెంట్) – సవరణ అబ్యర్ధనలు, ప్రాజెక్ట్ ప్లేన్ సమాచారం, చర్యలు మొదలగునవి
- పనితనపు నిర్వహణ ( పెర్ఫోర్మెన్స్ రిపోర్టింగ్) – రిపోర్టులు, ఫొర్కేస్టులు, చర్యలు మొదలగునవి
- స్టేక్ హోల్డర్ మేనెజ్మెంట్ – ప్రణాలిక సవరణలు, చర్యలు, వివాదాలు, పరిష్కారాలు మొదలగునవి
- రిస్క్ నియంత్రణ ( రిస్క్ మానిటరింగ్ & కంట్రోల్) – రిస్క్ సంబంధిత సవరణలు, చర్యలు
- కాంట్రేక్ట్ నిర్వహణ ( కాంట్రేక్ట్ ఎడ్మినిస్ట్రేషన్)- కాంట్రేక్ట్ సమాచారం
ఇక చివరగా క్లోసింగ్ గ్రూపు
- ప్రాజెక్ట్ ముగింపు ( క్లోస్ ప్రాజెక్ట్) – ముగింపు ప్రక్రియ, ప్రాజెక్ట్ ఫలితం
- కాంట్రాక్ట్ ముగింపు ( క్లోస్ కాంట్రక్ట్) – వెలువడేవి ముగిసిన ఒప్పందం, సంస్థాగత ప్రక్రియలు
ఈ ప్రాసెస్ గ్రూపులన్నీ ముందు టపాలలో చెప్పుకున్న ప్రాజెక్ట్ మేనేజ్మేంట్ ముఖ్య నాలెడ్జ్ విభాగాలకు అనుసంధానం చెయ్యబడి ఉంటాయి.
ఆ విభాగాల పేర్లు మళ్ళీ చూద్దామా?
* ప్రాజెక్ట్ ఇంటిగ్రేషన్ మేనేజ్‌మెంట్
* స్కోప్ మేనేజ్‌మెంట్
* టైం మేనేజ్‌మెంట్
* కాస్ట్ మేనేజ్‌మెంట్
* క్వాలిటీ మేనేజ్‌మెంట్
* హ్యూమన్ రీసొఋస్ మేనేజ్‌మెంట్
* కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్
* రిస్క్ మేనేజ్‌మెంట్
* ప్రొక్యూర్మెంట్ మేనేజ్‌మెంట్
రాబొయే దాదాపు డజను టపాల్లో మనం తెలుసుకోబోయేది పైన చెప్పిన తొమ్మిదింటిగురించే! ఆ ప్రాసెస్ గ్రూపులకు, ఈ ముఖ్య విభాగాలకు గల సంబంధం ఈ క్రింది పట్టికలో చూడండి – వివరాలు రాబోయే టపాలలో
ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ లోతుల్లోకి దూకేముందు కాసేపు ప్రాజెక్టుల దశల గురించీ, వాటిని నిర్వహించే సంస్థల ‘ స్ట్రక్చర్ ‘ గురించీ ముచ్చటించడమే ఈ టపా ముఖ్యోద్దేశం. ముందుగా ప్రాజెక్టుల గురించి మరి కాస్త సోది. ప్రాజెక్టు అనేది ఆరంభం, ముగింపు నిర్వచింపబడ్డ తాత్కాలిక ప్రక్రియ అని, ఈ ప్రాజెక్టులని నిర్వహించడం అంత సులభమేమీ కాదనీ చెప్పుకున్నాం కదా? ఈ నిర్వహణ ఒకొక్క సంస్థ ఒకోలా చేసేవి ( ఇప్పటీకీ చేస్తున్నాయి కూడా). దీనివల్ల పాత కాలం లో ఒక వావీ వరసా లేకుండా ఎవరిష్టమొచ్చినట్టూ వారు నిర్వహించుకునేవారు. ఇళా లాభంలేదు, ఈ నిర్వహణకి కొన్ని ప్రమాణాలూ, సూత్రాలు ఉండాలి అని కొంతమంది కలిసి, ఒక సంస్థ గా ఏర్పడి, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ప్రక్రియని కాస్తంత క్రమబధ్ధీకరించారు. ఆ సంస్థ పేరే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ లేదా పీ.ఎం.ఐ. ( http://www.pmi.org )
ప్రాజెక్ట్ నిర్వహణకు సంబంధించిన సూత్రాలని ప్రజలకి చేరవెయ్యడానికి వీరెంచుకున్న మార్గం – ఒక పుస్తక రూపం – ఆ పుస్తకమే (ఎ గయిడ్ టు ద) ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ బుక్ ఆఫ్ నాలెడ్జ్ లేదా పింబాక్. ఈ టపాలోనూ, మిగతా టపాలలోను ప్రస్తావించే విషయాలు చాలా మటుకు పింబాక్ లోనుండి గ్రహించినవే (ఏజైల్,స్క్రం విషయాలు తప్ప) ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అనుభవజ్ఞులైన ప్రాజెక్టు మేనేజర్లకి ఈ సూత్రాలలో పరీక్షలు కూడా నిర్వహిస్తుంది. పరీక్షలో ఉత్తీర్ణులయిన వారు పీ.యం.పీ లుగా పిలవబడతారు. (ఈ సంస్థే ప్రోగ్రేం మేనేజ్మెంట్ లో పీజీయంపీ పరీక్ష కూడ నిర్వహిస్తుంది – దాని గురించి వేరే చర్చిద్దాం)
సరే, ఇక ప్రాజెక్టు దశల గురించి: ఏ ప్రాజెక్టయినా దశల వారీగానే సాగుతుంది అని వేరే చెప్పక్కరలేదు – బావిలోనుండి బకెట్టులోకి నీళ్ళు తోడడం అయినా, లేక అంగారకుడిమీదకి మనిషిని పంపడమయినా! ఈ దశలు “ఆరంభం”, “మధ్య” “ముగింపు” లు గా విభజింపబడి ఉంటాయి. వీటిట్లోకి ఒదిగే ప్రాసెస్ సముహాలు అయిదు (గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం: ఈ ప్రాసెస్ గ్రూపులు ప్రాజెక్ట్ దశలూ ఒకటి కాదు. ప్రతీ దశలోను ఇవి ఇమడతాయి – చాలా మంది ఇక్కడ పప్పులో కాలేస్తారు)
* ప్రారంభం (ఇనీసియేషన్)
* ప్రణాళిక (ప్లేనింగ్)
* అమలు (ఎక్సిక్యూటింగ్)
* గమనిక, స్వాధీనత (మానీటరింగ్ & కంట్రోల్)
* ముగింపు (క్లోసింగ్)
ఇనీసియేటింగ్ ప్రాసెస్ సమూహం ప్రాజెక్టుకు, ప్రాజెక్టు దశలకు అధికారికమైన బధ్ధత కల్పిస్తుంది. ప్లేనింగ్ గ్రూపు, ప్రాజెక్టుకు అవసరమైన ప్రణాలికలను సిధ్ధం చేస్తుంది. ఎక్సిక్యూటింగ్ గ్రూపు మనుషులని, యంత్రాలని, ఇతర వనరులని సమన్వయపరచి ప్రణాళికలు అమలు పరుస్తుంది. ఇక మానీటరింగ్ & కంట్రోల్ గ్రూపు, ప్రాజెక్టును నిరంతరంగా వీక్షిస్తూ, ప్రతీ క్షణం స్వాధీనంలో ఉండేలా చేస్తే, క్లోసింగ్ గ్రూపు ప్రాజెక్టును ముగించడానికి దోహదం చేస్తుంది. వీటి వివరాలు వచ్చే టపాలో చూద్దాం.
ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియలే ఇంత సంక్లిష్టంగా ఉంటే మరి వీటిని నిర్వహించే టీములు ఎలా ఉండాలి? పింబాక్ నిర్వచనం ప్రకారం ఏ టీమయినా దిగువన ఇవ్వబడిన ఆరు రకాలలో ఒక రకానికి చెంది ఉంటుంది.
1. ఫంక్షనల్
2. ప్రాజెక్టైస్డ్
3. వీక్ మేట్రిక్స్
4. బేలన్స్డ్ మేట్రిక్స్
5. స్ట్రాంగ్ మేట్రిక్స్
6. కాంపోసిట్
ఫంక్షనల్ రకంలో (సీయీఓ) తరవాత ఫంక్షనల్ మేనేజరే పెద్ద. ఒకొక్క మేనేజర్ కిందా స్టేఫ్ ఉంటుంది – అంటే మన ప్రభుత్వ శాఖలలా, కాలేజీలలో డీపార్ట్మెంటుల్లా అన్నమాట. ప్రతీ శాఖకీ ఒక అధికారి (ఫంకషనల్ మేనేజర్), ఆ అధికారి క్రింద మిగతావారూ ఉంటారు.
ఈ ఫంక్షనల్ రకానికి వ్యతిరేకం ప్రాజెక్టైస్డ్ క్రమం. దీనిలో స్టేఫ్ కి ప్రత్యేకమైన విభాగం ఉండదు. సంస్థ మొత్తం వివిధ ప్రాజెక్టులుగా విడిపోయి ఉంటుంది. ప్రతీ ప్రాజెక్టుకి ఒక అధినేత/నేత్రి (ప్రాజెక్ట్ మేనేజర్) ఉంటారు. ఆ ప్రాజెక్టులో అన్ని రంగాలకీ చెందిన వారు ఉంటారు. అంటే మన ప్రభుత్వ కేబినెట్ మంత్రివర్గం లానో, లేక ఏదో విచారణ కమీటిలానో (వివిధ శాఖలకి చెందిన మంత్రులు ఒకే గ్రూపులో ఉండడం), లేక కాలేజీ కల్చరల్ ఫెస్టివల్ కమిటీలానో (వివిధ శాఖలకి చెందిన అధ్యాపకులు ఒకే గ్రూపులో ఉండడం) అన్నమాట. అన్నట్టు నేర విచారణ, కల్చరల్ ఫెస్టివలు తాత్కాలికమైనవే – అంటే ప్రాజెక్టులే కదా!
చాలా వ్యవస్థలు అటు ఫంక్షనల్ ఇటు ప్రాజెక్టైస్డ్ కాని వ్యవస్థలే. మరి ఇవి ఎలా ఉంటాయి? వీటినే మేట్రిక్స్ వ్యవస్థలంటారు. ఒక ఫంక్షనల్ వ్యవస్థలో పలువురు మేనేజర్ల కింద ఉన్న స్టేఫ్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నరనుకోంది – దానిని వీక్ మేట్రిక్స్ వ్యవస్థ అంటాం. అంటే ఇందులో ప్రత్యేకంగా ప్రాజెక్ట్ మేనేజర్ ఉండరన్నమాట.
ఆ స్తేఫ్ లోనే ఒకరిని ప్రాజెక్టు మేనేజర్ గా గుర్తిస్తే ఆ వ్యవస్థని బేలెన్స్డ్ మేట్రిక్స్ వ్యవస్థ అంటాం.
అలా కాకుండా, ఫంక్షనల్ మేనేజర్లతో సంబంధంలేకుండా కెవలం ప్రాజెక్టు మేనేజర్లతో ఒక గుంపు ఉండి, ఆ గుంపులోంచి ఒక ప్రాజెక్టు మేనేజరిని, మిగతా ఫంక్షనల్ గుంపులోంచి ప్రాజెక్ట్ వర్కర్లనీ తీసుకునీ ఏర్పడె వ్యవస్థని స్ట్రాంగ్ మేట్రిక్స్ వ్యవస్థ అంటాం.
ఆ వ్యవస్థలొనే కొంతభాగం వీక్ మేట్రిక్స్ గా, మరి కొంత భాగం స్ట్రాంగ్ మేట్రిక్స్ గా ఉంటే దానిని కాంపోసిట్ వ్యవస్థ అంటాం.
అయితే ఈమధ్యకాలంలో ఆజైల్, స్క్రం లాంటి కొత్త పధ్ధతుల, ఫ్రేంవర్కుల అభివృధ్ధితో ప్రాజెక్టు టీములలో చాలా మార్పులు చోటూ చేస్తుకున్నాయ్ – ముఖ్యంగా టీం వ్యవస్థలో. వాటిగురించి పింబాక్ లో ఏ విధమైన ప్రస్త్రావనా ఉండదు. సధారణంగా స్క్రం టీములలో ప్రాజెక్ట్ మేనేజర్లకి బదులు ప్రాడక్ట్ ఓనర్లు, స్క్రం మాస్టర్లు ఉంటారు. “టిం సాధికారత” అనే ధ్యేయంతో తయారయ్యే ఈ వ్యవస్థలో మేనేజర్లకన్నా టీముదే పైచేయిగా ఉంటుంది. ఇక్కడ మేనేజర్ లేక స్క్రం మాస్టర్ చేసే పని, టీముకి సహాయ సహకారాల్నందించడమే. దీనీనే సర్వెంట్ లీడర్షిప్ అని కూడా అంటారు. (దీని గురించి వేరే టపాలోనో, లేక నా స్క్రం బ్లాగులోనో వివరంగా వ్రాస్తా. ప్రస్తుతం నాకు తిండి పెడుతోంది ఇదే)
ఇవండీ, ఈ టపా కబుర్లు. వచ్చే టపాలో మళ్ళీ కలుద్దాం. కెలవ్… సారీ సారీ సెలవ్ .. ఏమిటో ప్రమాదవనం భాష అలవాటయిపోయింది!
ముందరి టపా కోసం ఇక్కడ క్లిక్కండి